నల్లధనం వివరాలు వెల్లడిస్తాం... స్విట్జర్లాండ్

  భారతదేశానికి సంబంధించిన వారు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనం వివరాలు అందించేందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం అంగీకరించింది. స్విస్ బ్యాంకుల్లో ధనం దాచిన భారతీయుల పేర్లు, వివరాలను తెలియజేయాల్సిందిగా కోరుతూ భారత ప్రభుత్వం స్విట్జర్లాండ్ను కోరిన నేపథ్యంలో స్విట్జర్లాండ్ ప్రభుత్వం అందుకు సానుకూలంగా స్పందించింది. భారతదేశంలో పన్నులు ఎగవేసి తమ బ్యాంకుల్లో సొమ్ము దాచుకున్నట్లు అనుమానిస్తున్న ఇండియన్ల మీద స్విట్జర్లాండ్ దృష్టి సారించింది. ఈ మేరకు ఓ జాబితాను సిద్ధం చేసే పనిలో వున్నట్టు స్విట్జర్లాండ్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘‘స్విస్ బ్యాంకుల్లో ఉన్న నిధులు ఎవరివో గుర్తించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగా భారతదేశానికి చెందిన వ్యక్తులు, భారతీయ సంస్థలపై దృష్టి సారించాం’’ అని స్విట్జర్లాండ్ ప్రభుత్వాధికారి ఒకరు వెల్లడించారు.

జగన్ తుఫాన్ విరాళం 50 లక్షలు

  హుదుద్ తుఫాను బాధితుల సహాయార్థం వైసీపీ అధ్యక్షుడు జగన్ 50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అలాగే వికాస తరంగిణి సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షల విరాళాన్ని అందజేసింది. 3,11,116 విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి యోగివేమన విశ్వవిద్యాలయం అందించింది. తుఫాన్‌ బాధితుల సహాయం కోసం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ రంగంలోకి దిగింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని తుఫాను బాధితుల కోసం రోజూ 10 ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్‌ ట్రస్ట్ ట్రస్టీ నారా లోకేష్‌ పర్యవేక్షణలో మరో ఐదు  రోజుల పాటు ఈ శిబిరాలు నిర్వహిస్తారు. తుఫాను బాధితులకు వైద్యసేవలు అందించేందుకు యశోద ఆస్పత్రుల వైద్య బృందం బుధవారం నాడు విశాఖపట్నం బయలుదేరింది. ఐదుగురు వైద్యులతోపాటు ఆరుగురు మెడికల్‌ టెక్నీషియన్ల బృందం ఈసీజీ, అల్ట్రా సౌండ్‌, ఆక్సిజన్‌, వెంటిలేటర్‌లు, ఇతర అత్యవసర మందులు తీసుకొని విశాఖకు వెళ్ళారు.

వేలెడంత లేరు.. వీళ్ళకి లవ్వు.. ఆత్మహత్యాయత్నం...

  బాపట్లలో నలుగురు మైనర్లు ఒకేసారి కలసి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నలుగురూ రెండు జంటలు. బాపట్లకు చెందిన ప్రత్యూష, దుర్గ అనే ఇద్దరు మైనర్ బాలికలు ఇంటర్ చదువుతున్నారు. అలాగే, గోపిరెడ్డి ఇంటర్ చదువుతుండగా, శివసత్యనారాయణ ఆవారాగా తిరుగుతూ వుంటాడు. ఈ నలుగురూ ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరన్న ఆలోచనతో నలుగురూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో నలుగురూ కలిసి విషం తాగారు. దీనిని గమనించిన స్థానికులు 108 వాహనాన్ని పిలిచి అపస్మారక స్థితిలో వున్న ఈ నలుగురినీ బాపట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ప్రత్యూష, దుర్గ పరిస్థితి చాలా విషమంగా ఉంది.

ఎగ్జిట్ పోల్: బీజేపీ హవా

  మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రధాని మోడీ వైపు ఓటర్లు మొగ్గుచూపినట్టు అనేక సర్వేలు వెల్లడించాయి. ఈ ఎన్నికల్లో పంచముఖ పోటీ నెలకొన్నప్పటికీ బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తేల్చాయి. అయితే మహారాష్ట్రలో బీజేపీ సొంతంగా అధికారంలోకి రాలేదని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే మహారాష్ట్రలో బీజేపీయే ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. అలాగే సిఓటర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మహారాష్ట్రలో బీజేపీ 129 శాసనసభ స్థానాలు, కాంగ్రెస్ 43, శివసేన 56, ఎన్సీపి 36, ఎంఎన్ఎస్ 12, ఇతరులు 12 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. హర్యానాలోని 90 స్థానాలలో బీజేపీ 37, ఐఎన్ఎల్డీ 28, కాంగ్రెస్ 15, హెచ్జేసీ 6, ఇతరులు 4 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఏబీపీ ఛానల్ ఎగ్జిట్పోల్స్ ప్రకారం మహారాష్ట్రలో బీజేపీ 127 స్థానాలు, శివసేన 77, కాంగ్రెస్ 40, ఎన్సీపీ 34, ఎంఎన్ఎస్ 5, ఇతరులు 5 స్థానాలలో గెలిచే అవకాశం ఉంది. హర్యానాలో బీజేపీ 46, ఐఎన్ఎల్డీ 29, కాంగ్రెస్ 10, హెచ్జేసీ 2, ఇతరులు 3 స్థానాలలో గెలిచే అవకాశం వుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి.

‘రేడియో అక్కయ్య’ కన్నుమూత

  రేడియో అక్కయ్యగా తెలుగు ప్రజలకు చరిపరిచితురాలైన ప్రముఖ రచయిత్రి, రేడియో వ్యాఖ్యాత తురగా జానకీరాణి బుధవారం నాడు హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆమె వయసు 78 సంవత్సరాలు. బాలానందం సంఘం తరఫున తురగా జానకీరాణి 30 సంవత్సరాలపాటు ఆకాశవాణిలో పనిచేశారు. ‘రేడియో అక్కయ్య’గా మంచి గుర్తింపు పొందారు. తురగా జానకీరాణి కన్నుమూత పట్ల పలువురు రచయితలు, కళాకారులు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. తురగా జనకీరాణి రేడియోలో పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించారు. వాటిని చిన్నారులతో ప్రదర్శింప చేశారు. ఆలిండియా రేడియోలో నేటికీ రేడియో అక్కయ్యగా అందరి మదిలో మెదిలే వ్యక్తి ఆమె. మంచి రచయిత్రిగా సంఘ సంస్కర్తగా కూడా ప్రశంసలు అందుకున్నారు. ఎందరో చిన్నారులు బాలానందంలో తమ కంఠం వినిపించడం వెనుక తురగా జానకీరాణి ఉన్నారు. ఎందరో బాలబాలికలకు పబ్లిక్ స్పీకింగ్ అంటే భయంపోయి ధైర్యంగా మాట్లాడటానికి వారిలోని సృజనాత్మకతకు బాలానందం ఒక వేదిక కావడానికి తురగా జానకీరాణి ప్రధాన కారకురాలు.

దారి తప్పిన కేసీఆర్ కాన్వాయ్

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ దారి తప్పింది. కాన్వాయ్‌లోని కార్లు ఎటు పడితే అటు వెళ్ళిపోయాయి. హుస్సేన్ సాగర్ పర్యటనకు వెళ్ళిన ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌లో గందరగోళం చోటు చేసుకుంది. తన పర్యటనలో భాగంగా కేసీఆర్ ట్యాంక్ బండ్, నెక్లేస్ రోడ్డు, జల విహార్, సుందరయ్య పార్కులను పరిశీలించారు. అనంతరం తిరిగి వెళ్తున్న సమయంలో సీఎం వాహనానికి ముందు వెళ్తున్న ఎస్కార్ట్ వాహనాలు హఠాత్తుగా ఎడమ వైపుకు తిరిగి మినిస్టర్ రోడ్డులోకి వెళ్ళిపోయాయి. సీఎం కేసీఆర్ వాహనం మాత్రం నేరుగా వెళ్ళి బుద్ధ భవన్ దగ్గర యు టర్న్ తీసుకుంది. ఎస్టార్ట్ సిబ్బంది తేరుకుని సీఎం కాన్వాయ్‌ని అనుసరించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే కేసీఆర్ వాహనం ముందుకు వెళ్ళిపోయింది. దాంతో ముఖ్యమంత్రి వాహనం ముందు వుండాల్సిన ఎస్కార్ట్ వాహనాలు ఆయన కారును అనుసరించాయి.

కన్నడం మాట్లాడకపోతే కొడతారా?

  కర్నాటకలోలోని కోతనూర్‌లో ఓ మణిపూర్ విద్యార్థి మీద కన్నడ భాష మాట్లాడలేదన్న నెపంతో కొంతమంది కన్నడిగులు సామూహిక దాడి చేసి చావబాదారు. ఈ దాడిలో మణిపురి గిరిజన తెగ విద్యార్థి సంఘం అధ్యక్షుడు టి. మైఖేల్ లామ్జాతంగ్ వోకివ్ తల, వీపు మీద గాయాలయ్యాయి. అయితే అవేమీ ఆందోళనపడాల్సిన తీవ్రమైన గాయాలు కాదని వైద్యులు అంటున్నారు. ఈ ఘటనలో మైఖేల్‌తో పాటు ఉన్న మరో ఇద్దరు కూడా స్వల్పంగా గాయపడ్డారు. కన్నడ భాషలో మాట్లాడాలని బలవంతం చేశారని, రాష్ట్రేతరులుగా కర్ణాటకలో పండించిన పంటలను తినడం నేర్చుకున్న మీరు కన్నడ భాషలో మాట్లాడ్డం కూడా నేర్చుకుని తీరాలని, ఇది చైనా కాదని, భారతదేశం అంటూ తమ మీద దాడి చేశారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో స్థానిక కన్నడ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశారు.

చొక్కా పట్టుకున్నాడని చంపేసిన ఇన్‌స్పెక్టర్

  తమిళనాడులో ఓ ఎస్.ఐ. ఒక అమాయకుడిని అన్యాయంగా చంపేశాడు. తన చొక్కా పట్టుకున్నాడని ఆగ్రహించిన ఎస్.ఐ. తుపాకితో కాల్చి చంపేశాడు. తమిళనాడులోని రామనాథపురంలో ఓ దుకాణదారు ఫిర్యాదు మేరకు సయ్యద్ మహ్మద్ అనే వ్యక్తిని ఎస్సై కాళిదాస్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించాడు. పోలీస్ స్టేషన్‌కు వెళ్ళిన మహ్మద్‌ను ఎస్సై గద్దించాడు. ఓ దశలో సర్వీస్ పిస్టల్ చూపి బెదిరించాడు. దీంతో, మహ్మద్ ఆవేశంగా ఎస్సై కాళిదాస్ చొక్కా పట్టుకున్నాడు. దాంతో విచక్షణ కోల్పోయిన ఆ ఇన్‌స్పెక్టర్ పిస్టల్‌ను మహ్మద్‌కి గురిపెట్టి నిర్దాక్షిణ్యంగా రెండు రౌండ్లు కాల్చాడు. దాంతో మహ్మద్ అక్కడిక్కడే మరణించాడు.

ప్రేమజంటపై పెద్దల దాడి..

  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్‌లో ఒక ప్రేమ జంటను పెద్దలు దాడి చేశారు. జంటలో యువకుడిని హత్య చేశారు. యువతి కొనప్రాణాలతో వుంది. భర్తల్ గ్రామానికి చెందిన యువతి రాకేష్ సింగ్ అనే వ్యక్తిని ప్రేమించింది. వీరిద్దరూ కలసి తిరగడం చూసిన ఆమె తండ్రి మఖాన్ సింగ్, సోదరులు సుఖ్ వీర్, సునీల్, సుశీల్, ఉమీద్ ఆగ్రహించారు. మొదట రాకేష్ సింగ్‌ని ఉరివేసి చంపేశారు. ఆ తర్వాత కోపం తగ్గక తమ ఇంటి ఆడపడుచుకి కూడా విషం తాగించారు. సమయానికి గ్రామస్థులు అడ్డుపడి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె ప్రస్తుతం కొన ఊపిరితో వుంది. ఆ యువతి తండ్రిని, సోదరులను పోలీసులు అరెస్టు చేశారు.

తెలంగాణలో ముగ్గురు రైతుల ఆత్మహత్య

  తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే వున్నాయి. బుధవారం నాడు ముగ్గురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నల్గొండ జిల్లా దీపకుంటలో బొబ్బిలి వెంకటరెడ్డి అనే రైతు తన పదెకరాల పత్తిపంట ఎండిపోయిందన్న మనస్తాపంతో, అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి చనిపోయాడు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో మధురయ్య విద్యుత్ కోతల వల్ల పంట ఎండిపోయిందనే బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు ఎకరాల భూమిలో వరి సాగు కోసం లక్ష రూపాయలు అప్పు చేసిన మధురయ్య ఆ అప్పును తీర్చలేనన్న ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. అలాగే నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కల్లేపల్లిలో మాలోతు రవి అనే రైతు తన మిరప చేనులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను వేసిన పత్తి, మిరప పంటలు ఎండిపోయాయన్న బాధతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు.

చాయ్‌వాలా ప్రధాని అయ్యాడు.. నేను సీఎం కాలేనా...

  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ఘాటుగా కామెంట్లు చేశాడు. ఛాయ్‌వాలా ప్రధాని అవగా లేనిది తాను సీఎం కాలేనా అంటూ ఎద్దేవా చేశాడు. ‘‘టీ కొట్టు నడిపిన వ్యక్తి ప్రధాని అయినప్పుడు, నేను ముఖ్యమంత్రిని కాలేనా?’’ అంటూ ఉద్ధవ్ ప్రశ్నించాడు. శివసేన సొంత పత్రిక సామ్నాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉద్ధవ్ మోడీపై తీవ్రంగా విమర్శలు గుప్పించాడు. పాతికేళ్ళు బీజేపీతో కలిసి పనిచేశామని, అయితే బీజేపీ వ్యవహార సరళితో ప్రస్తుత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నామని, ఈ ఎన్నికలలో శివసేన గెలుపు ఖాయమని ఉద్ధవ్ థాక్రే ధీమా వ్యక్తం చేశారు.

మాటలొద్దు... చేతలతో సాయం చేయండి...

  హదూద్ తుఫాను వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వారికి మాటలతో కాకుండా చేతలతో సాయం చేయాని నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. రోడ్డు మార్గంలో విశాఖకు వెళ్తున్న ఆయన బుధవారం మధ్యాహ్నానికి రాజమండ్రి చేరుకున్నారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘దివిసీమ ఉప్పెన తర్వాత ఇదే పెద్ద తుఫాను. నేను విశాఖ వెళ్లి బాధితులను పరామర్శించనున్నాను. బాధితులకు అవసరమైన సాయం అందిస్తాను. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వీఐపీలు ఎంత తక్కువ వస్తే అంత మంచిది. ప్రతి ఒక్కరూ మాటల్లో కాకుండా చేతల్లో సాయం చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందుచూపు వల్లే నష్టం తగ్గింది. ప్రధాని నరేంద్ర మోడీ మాట మీద నిలబడే వ్యక్తి అని అందుకే ఇటీవల ఎన్నికల్లో ఆయనకు మద్దతు ఇచ్చాను. త్వరలో కేంద్ర మంత్రులతో మాట్లాడి మరింత సాయం కోరతాను’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

లేడీ పోలీసుకు ఐక్యరాజ్య సమితి అవార్డు

  జమ్మూకాశ్మీర్‌కు చెందిన శక్తిదేవి అనేమ మహిళా పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రతిష్టాత్మక ఐక్యరాజ్యసమితి ‘అంతర్జాతీయ మహిళా శాంతి పరిరక్షకురాలు-2014’ అవార్డును పొందారు. కెనడాలోని విన్నిపెగ్‌లో ఇటీవల జరిగిన మహిళా పోలీసుల అంతర్జాతీయ సంఘం సదస్సులో జమ్మూకాశ్మీర్‌కు చెందిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ శక్తిదేవికి ఈ అవార్డును ప్రదానం చేశారు. అఫ్ఘానిస్థాన్‌లో ఐక్యరాజ్యసమితి తరఫున పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ శక్తిదేవి విధి నిర్వహణలో ఎన్నో విజయాలు సాధించారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో మహిళా కౌన్సిళ్లను ఏర్పాటు చేయడం ద్వారా మహిళలపై లైంగిక దాడులు, లింగ వివక్ష వేధింపుల బాధితులకు అందించిన విశేష సేవలకు గుర్తింపుగా శక్తిదేవికి ఈ పురస్కారాన్ని ఐక్యరాజ్యసమితి ప్రదానం చేసింది.