విజయవాడ మూడు హత్యలు.. నిందితుల అరెస్ట్

  విజయవాడ సమీపంలోని పెద అవుటపల్లిలో జాతీయ రహదారిపై ముగ్గురిని దారుణంగా కాల్చి చంపిన కేసులో విజయవాడ పోలీసులు ఢిల్లీ పోలీసుల సహాయంతో హంతక ముఠాలోని ఏడుగురు సభ్యులను అరెస్ట్‌ చేశారు. వీరిలో నలుగురు షూటర్లు కాగా, ముగ్గురు కీలక నిందితులు. మరో షూటర్‌ పరారీలో ఉన్నాడు. వీరందర్నీ బుధవారం విజయవాడలో మీడియా ఎదుటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. వీరిని మంగళవారం ఢిల్లీలోని కర్‌కర్‌డుమా కోర్టులో హాజరుపరచగా, ఐదు రోజుల రిమాండ్‌ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. అరెస్టయిన ఏడుగురిలో ప్రతాప్‌ సింగ్‌ (35), ధరమ్‌వీర్‌ (32), నితిన్‌ (27), నీరజ్‌ (22) షూటర్లు కాగా మంజీత్‌ సింగ్‌ (35), సతీశ్‌కుమార్‌ అలియాస్‌ బావా (27), పంకజ్‌ అలియాస్‌ ప్రకాశ్‌ (22) వున్నారు.

దూసుకొస్తున్న హుదూద్ తుఫాను

  అండమాన్ పరిసరాల్లోని సముద్రంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు అధికారులు ‘హుదూద్’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం లాంగ్ ఐలండ్ సమీపంతో వున్న తుఫాను కొద్ది గంటల్లో నికోబార్ తీరాన్ని దాటే అవకాశం వుంది. ఈ తుఫాను పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి, 24 గంటల్లో పెను తుఫానుగా మారే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈనెల 12వ తేదీన విశాఖపట్నం - ఒరిస్సాలోని గోపాల్‌పూర్ మధ్యలో ఈ తుఫాను తీరం దాటనుంది. తుఫాను ప్రభావం  కారణంగా అండమాన్ పరిసరాల్లో సముద్రం అల్లకల్లోలంగా వుంది. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈనెల 11వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీరంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం వుంది. 11వ తేదీ నుంచి తుఫాను ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని అధికారులు చెబుతున్నారు.

ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

  గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని శివయ్య స్థూపం సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నాడు ఆవిష్కరించారు. వినుకొండ పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు అంతకుముందు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బడి పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఆ తర్వాత నరసరావుపేట రోడ్డులోని ఎన్ఎస్‌పి కాలనీలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింది నీటి శుద్ధి ప్లాంటును ప్రారంభించారు.

అనిల్ అంబానీ.. స్వచ్ఛ భారత్ చీపురు...

  ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ పిలుపు మేరకు రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనీల్ అంబానీ చీపురు పట్టారు. బుధవారం ఉదయం ముంబాయిలోని చర్చ్ గేట్ స్టేషన్ బయట చీపురు పట్టి శుభ్రం చేశారు. ఆ తర్వాత అనీల్ అంబానీ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని పలువురు సెలెబ్రెటీలకు సవాల్ విసిరారు. మేరీ కోమ్, అమితాబ్, సానియా మీర్జా, శోభా డే, జర్నలిస్ట్ శేఖర్ గుప్తా, పాటల రచయిత ప్రషన్ జోషి, హృతిక్ రోషన్, హీరో నాగార్జునలతో పాటు రన్నర్స్ క్లబ్ ఆఫ్ ఇండియాకి అనిల్ అంబానీ స్వచ్ఛ్ భారత్ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా అనీల్ అంబానీ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్రమోడీ పిలుపు ఇచ్చిన స్వచ్ఛ భారత్ అభియాన్ ఉద్యమం విజయవంతం కావడానికి అంకితభావంతో పనిచేస్తానని అన్నారు. అనీల్ అంబానీని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం మంచి ప్రయత్నమని ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

నోటీసులను ఎదుర్కొంటా.. రేవంత్

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువైన మైహోం రామేశ్వర్ రావుకి హైదరాబాద్‌లో భూములు కేటాయించడం మీ తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం నాయకుడు, శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తన పార్టీ సహచరుడు ఎర్రబెల్లి దయాకరరావు వ్యతిరేకిస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి విమర్శలను ఆపలేదు. ఈ నేపథ్యంలో రేవంత్ ‌రెడ్డికి మైహోం అధిపతి జూపల్లి రామేశ్వరరావు  నోటీసులు పంపారు. రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణల వల్ల తనకు పరువునష్టం వాటిల్లిందని, రేవంత్ రెడ్డి తనకు 90 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని జూపల్లి రామేశ్వర్ రావు లీగల్ నోటీసులు పంపించారు. జూపల్లి రామేశ్వర్ రావు తనకు పంపించిన లీగల్ నోటీసుల మీద రేవంత్ స్పందిస్తూ, జూపల్లి రామేశ్వర్ రావు మీద తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి వున్నానని అన్నారు. తాను కేసులకు భయపడేవాడిని కాదన్నారు. తాను చేసిన ఆరోపణల విషయంలో తనమీద ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చన్నారు.

కల్పకంలో జవాన్ కాల్పులు.. ముగ్గురి మృతి

  తమిళనాడులోని కల్పకం అణు విద్యుత్ కేంద్రంలో జవాన్ల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు జవాన్లు మరణించారు. తోటి జవాను జరిపిన కాల్పుల్లో ఈ ముగ్గురు జవాన్లు మరణించారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అణు విద్యుత్ కేంద్రం ప్రాంగణంలోని సీఐఎన్ఎఫ్ కార్యాలయం వద్ద తన తోటి జవాన్ల మీద సీఐఎస్ఎఫ్ జవాను కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మరణించిన వారిని అడిషనల్ సబ్ ఇన్‌స్పెక్టర్ గణేశన్, హెడ్ కానిస్టేబుళ్ళు సుబ్బరాజ్, మోహన్‌సింగ్‌గా గుర్తించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి కూడా విషమంగా వుంది. విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన జవాన్ విజయ్ ప్రతాప్‌సింగ్‌ని కల్పకం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జవాన్ల మధ్య ఘర్షణకు దారి తీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరుగుతోంది.

చంద్రగ్రహణం... దేవాలయాల మూత...

  బుధవారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రారంభమయ్యే గ్రహణం సాయంత్రం 6.05 గంటల వరకు కొనసాగుతుంది. గ్రహణం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలన్నీ మూసివేశారు. ఒక్క శ్రీకాళహస్తీశ్వరాలయం మాత్రం తెరిచే వుంచారు. ఈ దేవాలయంలో ఈరోజంతా ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ చంద్రగ్రహణం ఆసియా, అమెరికా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది. చంద్రోదయం సమయంలో భారత దేశంలోని పశ్చిమ ప్రాంతం వారికి మినహా మిగిలిన అన్ని ప్రాంతాల వారికి చంద్ర  గ్రహణాన్ని చూడగలితే అవకాశం ఉంది. అయితే, గ్రహణం వీడే సమయంలో మాత్రం మన దేశంలోని పలు ప్రాంతాల వారు చూసే అవకాశం వుంటుంది.

పాక్ సైనికుల కాల్పులు.. మహిళ మృతి

  భారత - పాకిస్థాన్ సరిహద్దుల్లో పాకిస్థాన్ సైనికులు కాల్పులు జరుపుతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ దాన్ని ఉల్లంఘిస్తూ పాక్ సైనికులకు కాల్పులకు తెగబడుతున్నారు. సాంబ, కొత్వా జిల్లాలతో పాటు కానాచాక్, ఆర్నియా, పర్గావల్ ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులకు దిగింది. బీఎస్ఎఫ్ శిబిరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ సైనికులు జరుపుతున్న కాల్పుల్లో ఇరవై మంది గాయపడ్డారు. వీరిలో భారత జవాన్లతోపాటు పదిహేను మంది సామాన్య పౌరులు కూడా వున్నారు. గాయపడిన వారిలో ఒక మహిళ మరణించినట్టు తెలుస్తోంది. పాక్ సైనికుల కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. పాక్ దాడులను భారత్ జవాన్లు తిప్పికొడుతున్నారు.

ప్రీతీ జింటా దేశభక్తి చూశారూ...

  బాలీవుడ్ హీరోయిన్ ప్రీతీ జింటా దేశభక్తి బయటపడింది. తనలో దేశభక్తి ఏ స్థాయిలో వుందో తెలిపే సంఘటన గురించి ప్రీతీ జింటానే ట్విట్టర్లో పోస్ట్ చేసింది. హృతిక్ రోషన్ నటించిన ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమా చూడ్డానికి ప్రీతి ముంబైలోని ఓ థియేటర్‌కి వెళ్ళిందట. సినిమా మొదలయ్యే ముందు జనగణమన గీతం వస్తూ వుండగా థియేటర్లోని అందరూ లేచి నిల్చున్నారట. అయితే ఒక యువకుడు మాత్రం లేచి నిల్చోలేదట. దాంతో ప్రీతీ జింటాకి విపరీతమైన కోపం వచ్చేసిందట. ఆ యువకుడి దగ్గరకి వెళ్ళి అతనిని సీట్లోంచి లేపి అతన్ని అర్జెంటుగా థియేటర్ నుంచి బయటకి తోసేసిందట. ఈ సంఘటన వెనుక ప్రీతీ జింటా దేశభక్తి సంగతేమోగానీ, ప్రీతీ జింటా ఓవర్ యాక్షనే ఎక్కువ కనిపిస్తోందని విమర్శకులు అంటున్నారు.

తెలంగాణ పౌరులకు తెలంగాణ గుర్తింపు కార్డులు

  తెలంగాణ రాష్ట్ర పౌరులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం నాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు వున్న రేషన్ కార్డులు ఇక పనికిరావని, తన ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా కొత్త గుర్తింపు కార్డులు ఇస్తామని ప్రకటించింది. తాము ఇచ్చిన సదరు గుర్తింపు కార్డుల ఆధారంగానే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే కొత్తగా ఆదాయ, కుల, స్థానిక ధ్రువపత్రాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కొత్త ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.

మహారాష్ట్రని విడదీయలేరు.. మోడీ

  తాను ప్రధాని పీఠం మీద ఉన్నంతవరకు మహారాష్ట్రను ఎవ్వరూ విడదీయలేరని మోడీ అన్నారు. ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వున్నారు. మంగళవారం నాడు మహారాష్ట్రలోని సింధ్‌ఖేడాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు గత పదేళ్ల నుంచి ఉల్లిపాయలు, పత్తి పంటల ఉత్పత్తులపై ఎన్నో అబద్ధాలు ప్రచారం చేశారని, వారు ఇపుడు మహారాష్ట్ర నుంచి ముంబాయిని వేరు చేస్తారంటూ దుష్ప్రచారాన్ని చేస్తున్నారని నరేంద్రమోడీ విమర్శించారు. తాను ముంబాయిని మహారాష్ట్ర నుంచి వేరు చేస్తానని కాంగ్రెస్ చేస్తున్నది కేవలం దుష్ప్రచారం మాత్రమేనని నరేంద్ర మోడీ అన్నారు. తాను ఉండగా ఇండియాలోని ఏ ఒక్కరూ కూడా ఇలాంటి పని చేయలేరని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అసలు ఇలాంటి కుట్ర చేస్తున్నది కాంగ్రెసేనని ఆయన అన్నారు.

జపాన్ శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి

  రెండు రోజుల క్రితం వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ముగ్గురు భౌతిక శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతిని ప్రకటించారు. జపాన్‌కి చెందిన భౌతిక శాస్త్రవేత్తలు ఇసాము అకసాకి, హిరోషి అమానో, జపాన్‌లోనే పుట్టిపెరిగి అమెరికాలో స్థిరపడిన ఘజి నకమురాలు 2014 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాలు అందుకుంటారు. ఈ విషయాన్ని ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. తక్కువ విద్యుత్‌తోనే ఎక్కువ వెలుగునిచ్చే ఎల్ ఇ డి లైట్‌ని కనుగొన్నందుకు వీరిని ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతికి ఎంపిక చేశారు.