మాటలొద్దు... చేతలతో సాయం చేయండి...

  హదూద్ తుఫాను వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వారికి మాటలతో కాకుండా చేతలతో సాయం చేయాని నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. రోడ్డు మార్గంలో విశాఖకు వెళ్తున్న ఆయన బుధవారం మధ్యాహ్నానికి రాజమండ్రి చేరుకున్నారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘దివిసీమ ఉప్పెన తర్వాత ఇదే పెద్ద తుఫాను. నేను విశాఖ వెళ్లి బాధితులను పరామర్శించనున్నాను. బాధితులకు అవసరమైన సాయం అందిస్తాను. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వీఐపీలు ఎంత తక్కువ వస్తే అంత మంచిది. ప్రతి ఒక్కరూ మాటల్లో కాకుండా చేతల్లో సాయం చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందుచూపు వల్లే నష్టం తగ్గింది. ప్రధాని నరేంద్ర మోడీ మాట మీద నిలబడే వ్యక్తి అని అందుకే ఇటీవల ఎన్నికల్లో ఆయనకు మద్దతు ఇచ్చాను. త్వరలో కేంద్ర మంత్రులతో మాట్లాడి మరింత సాయం కోరతాను’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

లేడీ పోలీసుకు ఐక్యరాజ్య సమితి అవార్డు

  జమ్మూకాశ్మీర్‌కు చెందిన శక్తిదేవి అనేమ మహిళా పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రతిష్టాత్మక ఐక్యరాజ్యసమితి ‘అంతర్జాతీయ మహిళా శాంతి పరిరక్షకురాలు-2014’ అవార్డును పొందారు. కెనడాలోని విన్నిపెగ్‌లో ఇటీవల జరిగిన మహిళా పోలీసుల అంతర్జాతీయ సంఘం సదస్సులో జమ్మూకాశ్మీర్‌కు చెందిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ శక్తిదేవికి ఈ అవార్డును ప్రదానం చేశారు. అఫ్ఘానిస్థాన్‌లో ఐక్యరాజ్యసమితి తరఫున పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ శక్తిదేవి విధి నిర్వహణలో ఎన్నో విజయాలు సాధించారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో మహిళా కౌన్సిళ్లను ఏర్పాటు చేయడం ద్వారా మహిళలపై లైంగిక దాడులు, లింగ వివక్ష వేధింపుల బాధితులకు అందించిన విశేష సేవలకు గుర్తింపుగా శక్తిదేవికి ఈ పురస్కారాన్ని ఐక్యరాజ్యసమితి ప్రదానం చేసింది.

సెల్యూట్ సీపీ సాధిక్ సార్..

  తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పదేళ్ళ బాలుడు సాధిక్‌కి ఒక కోరిక వుండేది. అది.. హైదరాబాద్ నగరానికి పోలీస్ కమిషనర్ కావాలని. మేక్ ఎ విష్ ఫౌండేషన్ ద్వారా ఆ బాలుడి కోరికను తెలుసుకున్న హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఆ బాలుడి కోరికను నెరవేర్చారు. బుధవారం ఉదయం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా సాధిక్ పదవీ బాధ్యతలు స్వీకరించాడు. ఆ సమయంలో ఆ బాలుడి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడి కోరిక నెరవేర్చినందుకు పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డికి సాధిక్ తండ్రి కృతజ్ఞతలు తెలిపారు. సరిదిద్దలేని తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారుల కోరికలను తెలుసుకుంటూ వాటిని నెరవేర్చేందుకు తమవంతు కృషి చేస్తున్నట్టు మేక్ ఎ విష్ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. సాధిక్ బుధవారం నాడు ఒక్కరోజు సీపీగా వుంటాడు.

బోల్తా పడిన ఓల్వో బస్సు... జనం సురక్షితం

  ఓల్వో బస్సులు బోల్తా పడటం మామూలైపోయింది. బుధవారం నాడు మహబూబ్నగర్ జిల్లా దన్వాడ మండలం యేలిగండ్ల వద్ద ఓ వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు గాయపడలేదు. అదే రోడ్డు మీద వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి బస్సులోని ప్రయాణికులను రక్షించారు. ఈ వోల్వో బస్సు బళ్లారి నుంచి హైదరాబాద్ నగరానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా చేసిన అతివేగ డ్రైవింగే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి చేరుకుని వోల్వో బస్సును రోడ్డు మీద నుంచి పక్కకు తప్పించారు. ప్రయాణికులు మరో బస్సులో గమ్యస్థానాలకు వెళ్ళిపోయారు.

తుఫాను బాధితులకు ఉచితంగా నిత్యావసరాలు... బాబు..

  హుదుద్ తుఫాను బాధితులందరికీ ఉచితంగా పంపిణీ చేయడం కోసం చౌకధరల దుకాణాల్లో నిత్యావసరాలు సిద్ధంగా ఉంచినట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం నాడు చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. విశాఖలో ప్రతి పౌరుడూ ఉచితంగా నిత్యావసరాలు తీసుకోవచ్చని ఆయన చెప్పారు. ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, అరకిలో ఉప్పు, అరకిలో కారం, కందిపప్పు, లీటర్ పామాయిల్ ఉచితంగా ఇవ్వననున్నట్టు తెలిపారు. దాదాపు తొమ్మిది లక్షల కుటుంబాలకు ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. చేనేత కార్మికులు, మత్స్యకారులకు 50 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నామన్నారు. విశాఖలో కూరగాయల ధరలను నియంత్రించేందుకు రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లిపాయలు 5 రూపాయలకు, కూరగాయలు కిలో మూడు రూపాయలకు ప్రభుత్వం తరఫున పంపిణీ చేయనున్నట్టు చంద్రబాబు వివరించారు. అన్ని జిల్లాల నుంచి వందల టన్నుల కూరగాయలను తెప్పించినట్టు తెలిపారు. విశాఖ జిల్లా ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాలలో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని, ఇకనుంచి గ్రామీణ ప్రాంతాలలో సహాయక చర్యలపై దృష్టి పెడతామని చెప్పారు. విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని, అన్ని ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామని తెలిపారు. విశాఖలోని 10 మురికివాడల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, కృష్ణ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఆరు లక్షల ఆహార పొట్లాలు హెలికాప్టర్లలో తెప్పించి పంపిణీ చేశామని చంద్రబాబు చెప్పారు. తుఫాను కారణంగా పరిశ్రమలకు అపార నష్టం వాటిల్లిందని, ముందు చూపు వల్లే ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగామని, మరో రెండు రోజుల్లో కేంద్ర పరిశీలన బృందం వస్తుందని చంద్రబాబు వివరించారు.

జుట్టు పట్టుకుని కొట్టుకున్న లేడీ కానిస్టేబుళ్ళు

  గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ళు పోలీస్ స్టేషన్లోనే జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. దాంతో వీళ్ళిద్దర్నీ పోలీసు అధికారులు సస్పెండ్ చేశారు. వీరిద్దరూ కొట్టుకున్న కారణం చూస్తే మనకి నవ్వాలో ఏడవాలో అర్థంకాదు. ఒక లేడీ కానిస్టేబులమ్మ భర్తతో మరో లేడీ కానిస్టేబులమ్మ అక్రమ సంబంధం పెట్టుకుందట. తన భర్తని విడిచిపెట్టమని మరో కానిస్టేబులమ్మ ఎంత బతిమాలినా మరో కానిస్టేబులమ్మ పట్టించుకోవడం లేదట. దాంతో చాలాకాలంగా ఇద్దరూ గొడవపడుతున్నారు. మంగళవారం తమ గొడవకు గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌ని వేదికగా చేసుకుని గొడవలో భాగంగా ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని కొట్టుకున్నారు. చివరికి ఒక కానిస్టేబులమ్మ తనకు పోలీసులే న్యాయం చేయాలంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకి కూడా దిగింది. మొత్తానికి అధికారులు ఇద్దర్నీ సస్పెండ్ చేశారు.

ఛలో ఢిల్లీ అంటున్న టీ కాంగ్రెస్

  తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ బాట పట్టారు. ఖమ్మం జిల్లాలో గ్రూప్ గొడవలకు ఫుల్‌స్టాప్ పెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ చర్యలు మొదలుపెట్టింది. బుధవారం తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్తో తెలంగాణకు చెందిన సీనియర్ నేత జానారెడ్డి, పలువురు సీనియర్లతోపాటు ఖమ్మం జిల్లా నేతలు భేటీ కానున్నారు. అందుకోసం బుధవారం ఉదయం వారంతా హస్తినకు పయనమైయ్యారు. కాగా ఇప్పటికే టీపీసీసీ చీఫ్ పొన్నాల, డీఎస్ న్యూఢిల్లీ చేరుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి, జిల్లాకు చెందిన పలువురు సీనియర్ల మధ్య విభేదాలు ముదిరిపోయాయి. దాంతోపాటు గత ఆరునెలలుగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. టీ కాంగ్రెస్ నాయకుల ఢిల్లీ టూర్‌లో ఈ అంశాలతోపాటు ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం వుంది.

రోడ్డు మార్గంలో విశాఖపట్టణానికి పవన్ కళ్యాణ్

  ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన హుదూద్ తుఫాను పట్ల సినీ కథానాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించిన విషయం, బాధితుల సహాయార్థం 50 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. తాను పంపిన సందేశంలో తాను త్వరలో ఉత్తరాంధ్రకు వెళ్తానని పవన కళ్యాణ్ చెప్పారు. తాను చెప్పిన ప్రకారమే పవన్ కళ్యాణ్ ఇప్పుడు విశాఖపట్టణానికి బయల్దేరారు. రోడ్డు మార్గంలో ఆయన హైదరాబాద్‌ నుంచి విశాఖకు బయల్దేరారు. బుధవారం సాయంత్రం ఆయన విశాఖలోని తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. అలాగే గురువారం నాడు ఆయన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటిస్తారు. బుధవారం మధ్యాహ్నం పన్నెండున్నరకు పవన్ కళ్యాణ్ రాజమండ్రికి చేరుకున్నారు.

గర్ల్‌ఫ్రెండ్‌ని చంపబోయిన ప్రేమోన్మాది

  హైదరాబాద్‌ నగరంలో మరో ప్రేమోన్మాది ఉదంతం బయటపడింది. తాను ప్రేమిస్తున్న అమ్మాయి మరొకరితో చనువుగా వుండటం చూసి భరించలేని ఒక ప్రేమోన్మాది ఆమెని ఆమె పుట్టినరోజు నాడే చంపాలని ప్లాన్ చేశాడు. ఆమెను మేడమీద నుంచి కిందకి తోసేశాడు. అయితే ఆమె కింద వున్న రేకుల మీద పడటంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. హైదరాబాద్‌లోని చిలకలగూడ ప్రాంతానికి చెందిన రూప అనే యువతి సాజిద్ అనే వ్యక్తిని ప్రేమించింది. కొంతకాలంగా మరో వ్యక్తితో చనువుగా వుంటోంది. దాంతో ఆగ్రహించిన సాజిద్ ఆమెను పుట్టినరోజు నాడే చంపాలని ప్లాన్ చేశాడు. కేక్ కట్ చేయాలంటూ మేడ మీదకి తీసుకెళ్లి అక్కడి నుంచి బలవంతంగా కిందకి తోసేశాడు. అదృష్టవశాత్తు సిమెంట్ రేకులపై పడడంతో రూప బతికి బయటపడింది. రూపని మేడమీద నుంచి నెట్టేసిన తర్వాత సాజిద్ చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.

డాక్టర్ ఇంట్లో మూడు దారుణ హత్యలు

  ఒరిస్సా రాజధాని నగరం భువనేశ్వర్‌లో ఖందగిరి విహార్‌లో ఓ వైద్యుని ఇంట్లో మగ్గురు హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి ఈ మూడు హత్యలు చేశారు. ఈ సంఘటనలో ఆ ఇంటి యజమాని అయిన డాక్టర్‌ అతుల్య చంద్ర మెహర్‌తో పాటు మరో ఇద్దరు చనిపోయారు. ఈ సంఘటన మొత్తం డాక్టర్ ఇంట్లోని సీసీ కెమెరాలలో రికార్డు అయింది. డాక్టర్ ఇంట్లో ఒకరిని చంపిన తర్వాత ఆ హంతకుడు డాక్టర్ గొంతు పట్టుకుని డాక్టర్ భార్య చేత మంచినీళ్ళు తెప్పించుకుని తాగడం విచిత్రం. డాక్టర్ అతుల్య చంద్ర మెహర్‌ ఇంటి క్రింది భాగంలో పవివాళ్లు ఉండే నివాసంలో ప్రశాంత్ బెహ్రాతో పాటు అతని భార్య, కుమారుడు నివసిస్తున్నారు. ఆ ఆగంతకుడు ప్రశాంత్ బెహ్రాతో పాటు, భార్య కుమారుడిపై దాడి చేశాడు. ఈ హడావిడి విని పై అంతస్తులో డాక్టర్ అతుల్య చంద్ర మెహర్‌ క్రింద ఇంట్లో ఏదో అలజడి జరుగుతుందని గ్రహించి అక్కడకి వచ్చాడు. దాంతో హంతకుడు అతనిపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనలో డాక్టర్ అతుల్య చంద్ర మెహర్‌‌తో పాటు, సంరక్షకుడు ప్రశాంత్ బెహ్రా, అతని కుమారుడు మరణించారు.

తెలంగాణలో ఐదు సిటీల అభివృద్ధి

  తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌తోపాటు ఐదు ప్రధాన నగరాల అభివృద్ధి శరవేగంగా జరిగే అవకాశం వుందని, ఆ బాధ్యతని తాను తీసుకుంటున్నానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రంలో ఈ నగరాలు కీలకంగా మారుతాయని చెప్పారు. ఈ ఐదు నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నామని కేసీఆర్ వెల్లడించారు. ఖమ్మం, కొత్తగూడెం, నల్గొండ ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్‌, జలగం వెంకట్రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిసిన సందర్భంగా కేసీఆర్ ఈ విషయాన్ని వారికి చెప్పారు.

ఆళ్ళగడ్డలో నామినేషన్లు పడలేదు

  ఆళ్లగడ్డ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ మంగళవారం నాడు ప్రారంభమైంది. అయితే తొలిరోజు ఆళ్లగడ్డ ఎన్నిక కోసం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఆళ్లగడ్డ నుండి వైసీపీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ బరిలో వున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన శోభా నాగిరెడ్డి ఎన్నికలకు ముందే మృతి చెందారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అక్కడ ఎన్నిక యథావిధిగా నిర్వహించారు. ఆ ఎన్నికలో శోభా నాగిరెడ్డి విజయం సాధించారు. అయితే ఆమె జీవించి లేకపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. శోభా నాగిరెడ్డి కూతురు అఖిల ప్రియ పోటీ చేస్తుండటంతో తెలుగుదేశం పార్టీ బరిలో నిలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.

రఘునందన్‌కి అమెరికా కోర్టు మరణశిక్ష

  అమెరికా పెన్సిల్వేనియాలో నెలల చిన్నారి శాన్వి, సత్యవతి హత్య కేసులో నిందితుడు యండమూరి రఘునందన్‌కు పెన్సిల్వేనియా ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. రెండేళ్ళ పాటు ఈ కేసు విచారణ జరిపిన అమెరికా కోర్టు ఈ నెల 9న రఘునందన్‌‌ను దోషిగా నిర్ధారించింది. మంగళవారం నాడు అతనికి మరణశిక్ష ఖరారు చేసింది. 2012 అక్టోబర్‌ 22న పెన్సిల్వేనియాలో నెలల వయసున్న పసిపాప శాన్వి, పాప నాయనమ్మ సత్యవతి వాళ్ల ఇంట్లోనే హత్యకు గురయ్యారు. మొదట హత్య చేసింది తానే అని ఒప్పుకున్న యండమూరి  రఘునందన్‌ ఆ తర్వాత మాట మార్చాడు. ఈ రెండు హత్యలతో తనకు ఎంతమాత్రం ప్రమేయం లేదని, దొంగతనంలో మాత్రమే పాల్గొన్నానంటూ ఐదుగురు సభ్యుల ప్రత్యేక కోర్టు బెంచ్‌ ముందు వాగ్మూలం ఇచ్చాడు. ఇద్దరు అమెరికన్లు తనను బెదిరించి హత్యలకు పాల్పడ్డారని రఘునందన్‌ ఒక కట్టుకథ అల్లాడు. దాంతో ఏడుగురు సభ్యుల బెంచ్‌కు ఈ కేసు బదిలీ అయ్యింది. ఈ హత్యల కేసును మళ్ళీ మరోసారి విచారించిన న్యాయమూర్తులు యండమూరి రఘునందన్‌ వాదనతో విభేదించారు. డబ్బుకోసం రఘునే ఈ హత్యలను చేశాడని నిర్ధారించారు.

మహారాష్ట్ర, హర్యానాల్లో కొనసాగుతున్న పోలింగ్

  మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం ఏడు గంటగలకు ప్రారంభమైంది. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు, హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం ఆరు గంటల వరకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ప్రధానంగా పంచముఖ పోటీ జరుగుతోంది. 1699 మంది ఇండిపెండెంట్లతో కలిపి మొత్తం 4119 మంది అభ్యర్థులు బరిలో వున్నారు. 8.25 కోట్ల ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 90 స్థానాలున్న హర్యానా రాష్ట్ర అసెంబ్లీకి మొత్తం 1351 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 87.37 లక్షల మహిళా ఓటర్లు సహా ఒక కోటీ 63 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఫ్లిప్‌కార్ట్‌‌కి షాక్: 1000 కోట్ల జరిమానా తప్పదా?

  ఆన్ లైన్ బిజినెస్ వెబ్‌పోర్టల్ ఫ్లిప్‌కార్ట్‌ ఇటీవల బిగ్ బిలియన్ డే సేల్ ను నిర్వహించడంలోనూ, ఫెమా నిబంధనలను ఉల్లంఘించడంలోనూ విఫలమైందన్న ఆరోపణలు వచ్చాయి. వీటిపై ఫ్లిప్‌కార్ట్‌ సంస్థని ప్రశ్నించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఫ్లిప్‌కార్ట్‌పై ఈడీ 1000 కోట్ల రూపాయల జరిమానా విధించే అవకాశం వుందని తెలుస్తోంది. అయితే తాము నిబంధనలను పూర్తిగా పాటించామని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణకు పూర్తిగా సహకరిస్తామని ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ వెబ్ సైట్ సంబంధీకులు తెలిపారు.