ఆర్ధిక నేరస్తుడికి రాష్ట్రపతి అపాయింట్ మెంట్ సబబేనా?

 

 

 

 

 

 

 

ఈరోజు న్యాయ ప్రాధికార సంస్థ చాలా ప్రాముఖ్యత గల తీర్పు వెలువరించింది. ఈ ఏడాది మే31న ఈడీ అధికారులు జగన్మోహన్ రెడ్డికి చెందిన రూ. 35 కోట్లు స్వాదీనం చేసుకోవడం న్యాయబద్దమయినదేనని ప్రకటించింది. ఏకే దండమూడి, మాధవ్ రామచంద్రన్, టీఆర్ కన్నన్‌లను జగన్మోహన్ రెడ్డి చేత తన సంస్థలలో బలవంతంగా పెట్టుబడులు పెట్టించినందున, ఈడీ ఆవిధంగా వచ్చిన సొమ్మును స్వాదీనం చేసుకోవడం న్యాయబద్దమేనని తీర్పు వెలువరించింది.

 

ఈవిధంగా ఎవరో వ్యక్తులో, జగన్ రాజకీయ ప్రత్యర్దులో లేక వ్యాపారంలో పోటీదారులో చెప్పి ఉంటే వాటిని పట్టించుకొనవసరం లేదు. కానీ భారత ప్రభుత్వంలో కీలకమయిన ఒక సంస్థ అయిన న్యాయ ప్రాధికార సంస్థ దీనిని నిర్దారిస్తూ తీర్పు చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్ధిక నేరస్తుడని స్పష్టమయింది. మరి అటువంటి ఆర్ధిక నేరస్తుడికి రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం?

 

జగన్ ఒక పార్టీ అధ్యక్షుడయి ఉండవచ్చును. లేదా యంపీ అయి ఉండవచ్చును. కానీ అంత మాత్రాన్న ఆయన నేరచరిత్రను విస్మరించలేము. మరి అటువంటి వ్యక్తి ఈ రోజు భారతదేశానికి సర్వోనతమయిన పదవిని అలంకరించిన రాష్ట్రపతినే కలిసేందుకు అవకాశం ఇవ్వడం సమంజసమా? అని ఆలోచించాలి.

 

వైకాపా అభ్యర్ధన మన్నించడం తప్పనిసరయితే జగన్మోహన్ రెడ్డికి బదులు ఆయన పార్టీలో ఈ నేరాలతో ఎటువంటి సంబంధమూ లేని వేరెవరయినా వ్యక్తులకు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఇచ్చి ఉంటే భావ్యంగా ఉండేది.