జబ్బార్ బస్సు ప్రమాదం: కెమికల్స్ రవాణా..!

 

 

 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహబూబ్‌నగర్ బస్సు ఫైర్ ఆక్సిడెంట్ ఘటనకు సంబంధించి కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. ఈ ప్రమాదంలో 45 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదానికి సంబందించి తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. బస్సులో ప్రమాదకర రసాయనాలు తరలిస్తున్న విషయం బయటపడింది.

 

బస్సు దగ్ధం దుర్ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల బృందం సోమవారం బెంగళూరుకు వచ్చింది. ఉదయం 11 గంటలకు కలాసిపాళ్యలోని జబ్బార్ టావెల్స్ ప్రధాన కార్యాలయానికి చేరుకుని మధ్యాహ్నం 2 గంటలవరకు విస్తృత తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 



ప్రమాదం జరిగిన రోజు బస్సులో 12 మూటల వెంట్రుకలు (ఫ్యాషన్ విగ్గులు), ఆరు క్యాన్ల కెమికల్స్ ఉన్నాయని అంగీకరించినట్లుసమాచారం. అయితే బస్సులో బాణసంచా మాత్రం లేదని సిబ్బంది స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి కొద్దిపాటి గాయాలతో తప్పించుకున్న హఫీజ్ వాంగ్మూలాన్ని కూడా ఈ బృందం నమోదు చేసుకుంది.