సర్వేలను చూసి ఉలికిపడుతున్న కాంగ్రెస్

 

బీజేపీ నరేంద్ర మోడీని తన ప్రధాన అభ్యర్ధిగా ప్రకటించిక మునుపు, సరయిన నాయకత్వం లేక చాల బలహీనంగా ఉన్నఆ పార్టీని రానున్నఎన్నికలలో తాము అవలీలగా ఓడించవచ్చని కాంగ్రెస్ నేతలందరూ భావించారు. కానీ మోడీ రాకతో వారి అంచనాలు తలక్రిందులయ్యాయి. అయితే తొలుత అద్వానీ వంటివారు ఆయనను తీవ్రంగా వ్యతిరేఖించడంతో కాంగ్రెస్ మళ్ళీ కుదుటపడింది. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలువలేదు. అద్వానీతో సహా ఇప్పుడు బీజేపీలో అందరిలో కూడా మోడీ సారద్యంలో వచ్చేఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించడం తధ్యమనే దృడ నమ్మకం ఏర్పడింది.

 

మోడీ దేశమంతతా పర్యటిస్తూ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. మోడీ ప్రభావం కేవలం గుజరాత్ మరియు ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాలకే మొదట పరిమితమయినప్పటికీ, ఆయన రాన్రాను తన పరిధిని విస్తరించుకొంటూ సాగిపోతుండటంతో, అది మీడియాను కూడా బాగా ఆకర్షించింది. ఇంకా సాధారణ ఎన్నికలకి ఆరు నెలల సమయం ఉన్నపటికీ ప్రతీ నెలా ఏదో ఒక మీడియా సంస్థ సర్వే చెప్పటడం, మోడీకి అనుకూలత పెరుగుతోందని ప్రకటిస్తోంది.

 

ఈ సారి ఎన్నికలలో ఎలాగయినా గెలిచి రాహుల్ గాంధీని ప్రధాని మంత్రిగా పట్టాభిషేకం చేసి తను రాజకీయాల నుండి తప్పుకొందామని భావిస్తున్న సోనియాగాంధీకి, రానున్న ఎన్నికలలో గెలవడం కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం. అయితే సర్వే రిపోర్టులన్నీ మోడీ భజన చేస్తుండటంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో, కేంద్ర ఎన్నికల కమీషన్ “ఈ సర్వేలను నిషేదిస్తే ఎలా ఉంటుందని?” అడుగుతూ అన్ని పార్టీలకు లేఖలు వ్రాసింది. ఊహించినట్లుగానే ఒక్క కాంగ్రెస్ తప్ప మిగిలిన అన్ని పార్టీలు ఈ ప్రతిపాదనను వ్యతిరేఖించాయి. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ సర్వేలను నిషేదించడం మేలనే అభిప్రాయం వ్యక్తం చేసింది.

 

“ఎటువంటి శాస్త్రీయత లేని ఇటువంటి సర్వేలు నివేదికలు ప్రజలను తప్పు ద్రోవ పట్టించేందుకే తప్ప ఇంక దేనికి ఉపయోగపడవని” కాంగ్రెస్ ప్రతినిధి రషీద్ అల్వీ అన్నారు.

 

అందుకు బీజేపీ కూడా ఊహించిన విధంగానే స్పందించింది. ఆ పార్టీ అధికార ప్రతినిది ముక్తార్ అబ్బాస్ మాట్లాడుతూ “కాంగ్రెస్ పార్టీ తన ఓటమిని ముందే అంగీకరించినట్లు కనబడుతోంది. ఒకప్పుడు ఇవే సర్వే నివేదికలు తనకు అనుకూలంగా ఉన్నపుడు కాంగ్రెస్ వాటిలో తప్పు కనబడలేదు. కానీ ఇప్పుడు వ్యతిరేఖంగా వస్తుండటంతో అది అశాస్త్రీయంగా కనబడటం విశేషం. మోడీ ప్రభంజనంతో కాంగ్రెస్ కు భయం పట్టుకొంది. అందుకే సర్వేలు కూడా చూసేందుకు జంకుతోంది,” అని అన్నారు.