నా పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుడి పరిస్థితి..చంద్రబాబు
posted on Jun 18, 2015 @ 5:28PM
తెలంగాణ ప్రభుత్వం మరోసారి తన కపట బుద్ధిని బయటపెట్టింది. ఏపీ ప్రభుత్వంపైనా చంద్రబాబు పైనా తమ అక్కసును ఎన్ని రకాలుగా బయట పెట్టాలో అన్ని రకాలుగా బయటపెడుతోంది. ఇప్పటికే ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపైన ఎన్ని రకాలుగా కుట్రలు చేయాలో.. ఎలా ఆయన్ని ఈ ఉచ్చులోకి లాగాలో తెగ ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగానే తన కొత్త ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వకుండా జీహెచ్ఎంసీ మీనమేషాలు లెక్కపెడుతోంది. నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న నెలరోజుల లోపు జీహెచ్ఎంసీ అనుమతి ఇవ్వాలి.. ఈ ప్రకారం చంద్రబాబు ఎప్పుడో నెలన్నర ముందు దరఖాస్తు చేసినా అనుమతి ఇవ్వకుండా పెండింగ్ లో ఉంచింది. ఇదేంటి అని అడిగితే సచివాలయంలో ఏపీ సర్కార్ ఉపయోగిస్తున్న భవనాలకు ఆస్తి పన్ను కడితేనే ఇంటి నిర్మాణానికి అనుమతి ఇస్తామని జీహెచ్ ఎంసీ కుంటి సాకులు చెపుతోంది. అసలు భవనాల ఆస్తి పన్నుకు, ఇంటి పన్నుకు సంబంధం ఏంటో తెలంగాణ సర్కార్ కు ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిదనిపిస్తుంది.
దీనిపై చంద్రబాబు స్పందించి ఒక రాష్ట్రానికి సీఎం అయిన నా పరిస్థితే ఇలా ఉంటే ఇంక ఒక సామాన్యుడి పరిస్థితి ఎంటని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ఈ పరిస్థితి లేకుండా ఉండాలంటే హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రజలపై తెలంగాణ ప్రభుత్వం తమ పెత్తనాన్ని సాగిస్తుందని ఇదే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నిజానికి ఒక సీఎం పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.