నేడు రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ

  ఓటుకి నోటు కేసులో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహల బెయిల్ పిటిషన్ కేసు ఈరోజు హైకోర్టు విచారణకు చేపడుతుంది. మొన్న వారి బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు, ఎసిబి న్యాయవాదులు ఈకేసులో తమకు ఒక కీలకమయిన సమాచారం లభించిందని కనుక దానిని సమర్పించేందుకు సోమవారం వరకు సమయం కావాలని అంతవరకు రేవంత్ రెడ్డి తదితరులకి బెయిల్ మంజూరు చేయవద్దని వాదించారు. కానీ హైకోర్టు వారికి ఈరోజు వరకే గడువు ఈయడంతో వారు చెప్పినట్లుగా ఆ కీలకమయిన ఆధారాలు ఈరోజు కోర్టుకి సమర్పించవలసి ఉంటుంది. అప్పుడే వారు రేవంత్ రెడ్డి తదితరుల జ్యూడిషియల్ కస్టడీ పొడిగించమని కోరగలుగుతారు. ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక ఎసిబి కోర్టుకి అందింది. దాని కాపీ కోసం ఎసిబి అధికారులు ఎసిబి కోర్టులో మెమో దాఖలు చేసి ఉన్నారు కనుక ఒకవేళ అది చేతికి అందినట్లయితే దానినే వారు హైకోర్టు కి సమర్పించి రేవంత్ రెడ్డి జ్యుడిషియల్ కస్టడీ పోదించమని కోరుతారేమో?

ఒబామా ప్రసంగాన్ని అడ్డుకున్న ట్రాన్స్ జెండర్

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రసంగాన్ని ఓ ట్రాన్స్ జెండర్ మహిళ అడ్డుకుంది. ఒబామా వైట్ హౌస్ లో ఎల్ జీబీటీకు సంబంధించిన ప్రసంగం చేస్తుండగా ట్రాన్స్ జెండర్ మహిళ అడ్డుకొని గట్టిగా నినాదాలు చేసింది. ట్రాన్స్ జెండర్ లకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు గురించి గట్టిగా ప్రశ్నించారు. ఒబామా వారించినప్పటికీ ఆమె అలాగే ఆయన ప్రసంగాన్ని పలుమార్లు అడ్డుకోవడంతో ఒబామా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా ప్రవర్తించడం మర్యాదపూర్వకం కాదని ఒబామా హెచ్చరించినా ఆమె అలానే ప్రవర్తిస్తుండడంతో భదత్ర సిబ్బందితో చెప్పి ఆమెను బయటికి పంపించేశారు.

మరో వివాదంలో ఆప్.. బెదిరింపు కేసులో ఆప్ నేత

ఆప్ ప్రభుత్వం ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటుంది. ఇప్పటికే ఈ పార్టీ నేతలు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆప్ పార్టీ అధినేత కేజ్రీవాల్ చిక్కుల్లో పడుతున్నారు. ఇప్పటికే నకిలీ సర్టిఫికేట్లతో మోసం చేసినందుకు గాను ఆపార్టీ న్యాయశాఖ మాజీ మంత్రి జితేంద్రసింగ్ తోమర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అది జరిగిన వెంటనే మరో ఆప్ నేత మీద అతని భార్య గృహహింస చట్టం కింద కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పార్టీకి చెందిన మరో నేత విశ్వాస్, అయన భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. నోయిడాలోని ఒక వ్యక్తిని విశ్వాస్ అతని భార్య బెదిరించారని ఫిర్యాదు అందడంతో వారిపై కేసు నమోదయింది. ఈ ఆరోపణపై విశ్వాస్ స్పందించి తాను కానీ తన భార్య కానీ ఎవరిని బెదిరించలేదని.. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమని అన్నారు.

ప్రస్తుతానికి సెక్షన్ 8 అవసరం లేదు.. కిషన్ రెడ్డి

ఇప్పటికే ఓటుకు నోటు కేసు గురించి ఒక్కో నేత ఒక్కో రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటుకు నోటు కేసు విషయంలో తమకు సంబంధం లేదని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ లో సెక్షన్‌-8 అవసరంలేదని.. సెక్షన్ 8 అమలు చేయడం వల్ల రెండు రాష్ట్రాల ప్రజల మధ్య వివాదాలు తలెత్తే ప్రమాదం ఉందని అన్నారు. ఇది టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య సమస్య అని దీనిని ప్రాంతీయ సమస్యగా మార్చొద్దని రెండు రాష్ర్టాల ప్రభుత్వాలను కోరుకుంటున్నానని అన్నారు.

ఏపీ విద్యార్ధులను ఎక్కించుకోం.. టీఎస్ ఆర్టీసీ

తెలుగు రాష్ట్రాల మధ్య అప్పుడప్పుడు ఏదో చిన్న వివాదాలు ఉన్నా ఇప్పుడు ఈ నోటుకు ఓటు కేసు ద్వారా అవి మరింత ఎక్కువయ్యాయన్నది మాత్రం నిజమనిపిస్తోంది. ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి వివాదాలు తలెత్తుతున్నాయి. అసలే ఒకవైపు కేసు వల్ల వాదోపవాదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు పై ఇరు ప్రభుత్వాలు కొట్టుకుచస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న టెయిల్ పాండ్ వివాదం. మాదంటే మాదని ఇరు ప్రభుత్వాలు వితండవాదాలు చేసుకున్నాయి. టెయిల్ పాండ్ మా అంతర్బాగంలో ఉంది కాబట్టి మాకు చెందుతుందని ఒక ప్రభుత్వం అంటే.. దాని నిర్మాణ వ్యయానికి అయిన ఖర్చు మా ప్రభుత్వ ఖాతాలో వేశారు కాబట్టి మాదని మరోక ప్రభుత్వం వాదిస్తోంది. ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు మరో వివాదం షెడ్యూల్ 10పై రగడ మొదలైంది. ఈ నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో ఆర్టీసీ రచ్చ ఆరంభమైంది. టీఎస్ఆర్టీసీలో ఏపీఎస్ బస్సు పాస్ లు చెల్లవని.. కొందరు ఆర్టీసీ సిబ్బంది ఏపీ విద్యార్ధులను బస్సులో ఎక్కించుకునేందుకు నిరాకరించారు. దీంతో కృష్ణా జిల్లా నందిగామ రామిరెడ్డిపల్లె వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగి తెలంగాణ బస్సులను అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు రంగలోకి దిగాల్సివచ్చింది. ఆంధ్రా నుండి తెలంగాణ వెళ్లే బస్సుల్లో విద్యార్ధులను ఎక్కించుకన్నప్పుడు.. తెలంగాణ నుండి ఆంధ్రా వెళ్లే బస్సుల్లో ఎందుకు ఎక్కించుకోరని.. ఎక్కించుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. అటు తెలంగాణలోనూ.. ఇటు ఆంధ్రాలోనూ రెండు వైపులా పాస్ లు చెల్లేలా చర్యలు తీసుకోవాలని పట్టుబట్టడంతో ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు టీఎస్ అర్టీసీ అధికారులతో సమావేశమయ్యారు. మొత్తానికి రోజు రోజుకి రెండు రాష్ట్రాల మధ్య దూరం పెరుగుతుందనడానికి ఈ వివాదాలే నిదర్మనమని తెలుస్తోంది.

తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తారా? అచ్చెన్నాయుడు

హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని శాంతి భద్రతలను గవర్నర్ చేతికి అప్పగించాలని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అలా కాని పక్షంలో హైదరాబాద్ ను యూటీ చేయాలని తాము డిమాండ్ చేస్తామని చెప్పారు. సెక్షన్ 8 అమలు చేస్తే దీక్షలు చేస్తామని అంటున్నారు.. అలా దీక్షలు వల్ల చట్టాలు మారిపోతే లక్షలమందితో నిరాహార దీక్ష చేస్తామని ఎద్దేవ చేశారు. ఒకవేళ సెక్షన్ 8 కనుక లేకపోతే విభజన చట్టం తీసేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలిపేస్తారా అని సవాల్ విసిరారు. హైదరాబాద్ కేసీఆర్ సొత్తు కాదని.. హైదరాబాద్ పై వారికి ఎంత హక్కు ఉందో.. మాకు కూడా అంతే హక్కు ఉందని.. పదేళ్ల తరువాత కాదు కదా పది నిమిషాల ముందు కూడా హైదరాబాద్ ను విడిచి వెళ్లమని స్పష్టం చేశారు.

గవర్నర్ కు ఢిల్లీ నుండి పిలుపు

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఓటుకు నోటు కేసు నేపథ్యంలో మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ కేసు వ్యవహారంపై ఢిల్లీ నుండి పిలుపు రాగా ఈరోజు సాయంత్రం అత్యవసరంగా ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం ఉదయం హోంశాఖ అధికారులతో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. రోజు రోజుకి ఓటుకు నోటు కేసు వ్యవహారంపై వివాదాలు పెరుగుతుండటం, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ విషయం.. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలుపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన నివేదికి గవర్నర్ కేంద్రానికి సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ ఢిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. గవర్నర్ ఢిల్లీ పర్యటన తరువాత ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో ఇప్పుడు అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.

ఏడాది క్రితమే సెక్షన్ 8 పై చంద్రబాబు లేఖ

నోటుకు ఓటు కేసు ఎన్నో మలుపులు తిరిగి ఆఖరికి సెక్షన్ 8 అమలు వరకూ వచ్చింది. ఇదే విషయం పై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వాదోపవాదాలు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం సెక్షన్ 8 అమలుకు ససేమిరా వద్దంటే, ఏపీ ప్రభుత్వం సెక్షన్ 8 అమలు అవ్వాల్సిందే అని పట్టుబడుతోంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సెక్షన్ 8 అమలు గురించి గవర్నర్ ఎప్పుడో కేంద్రాన్ని సంప్రదించి తన బాధ్యతలు గురించి అడుగగా కేంద్రం కూడా కొన్ని ప్రత్యేక భాద్యతలను గవర్నర్ కు అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ సెక్షన్ 8 అమలుపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా రాష్ట్ర విభజన తరువాత.. సరిగ్గా ఏడాది క్రితం హైదరాబాద్ లో ఉంటున్న సీమాంధ్రుల భద్రత నిమిత్తం సెక్షన్ 8 అమలు చేయాలని ప్రధాని మోదీకి లేఖ కూడా రాసినట్టు రాజకీయ విశ్లేషకుల వెల్లడి.   అయితే ఈ లేఖపై అప్పట్లో కేంద్రం కూడా స్పందించి హైదరాబాద్ లో ఉన్న భద్రతా వ్యవస్థపై కొన్ని ప్రత్యేకమైన భాద్యతలను గవర్నర్ కు అప్పగించింది. శాంతి భద్రతలకు సంబంధించిన ఏ నివేదిక అయిన పోలీసు అధికారులు గవర్నర్ కు అప్పగించాలని.. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే దానిపై నివేదిక కోరే, విచారణకు ఆదేశించే హక్కు, చర్య తీసుకొనే అధికారం గవర్నర్‌కు ఉంటాయని.. బాధితుల హక్కుల రక్షణ కోసం ఆయన అవసరమైన ఆదేశాలు కూడా జారీ చేయవచ్చు’’ అని కేంద్రం ఆ లేఖలో స్పష్టం చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం కేంద్రం తీసుకున్న నిర్ణయానికి స్పందించి గవర్నర్ కు విస్తృత అధికారాలు ఇవ్వాలనడం సరికాదని... ఒకవేళ గవర్నర్‌ తన అధికారాలను వినియోగించుకోవాల్సి వచ్చినా, తెలంగాణ కేబినెట్‌ సలహా మేరకే నడచుకోవాలి కేంద్రానికి లేఖ రాశారు. దీంతో అదే సమయంలో ‘‘గవర్నర్‌ విధులు, భాధ్యతలు, అధికారాలు (ఫంక్షనాలిటీస్‌)’’ మీద సవివరమైన నోట్‌ ఒకటి తయారు చేసి, గవర్నర్‌ వ్యక్తిగత అవగాహన కోసం రాజ్‌భవన్‌కు పంపినట్టు తెలుస్తోంది.   కేంద్రం పంపిన నోట్ ఆధారంగానే నోటుకు ఓటు కేసు వ్యవహారంపై గవర్నర్ నరసింహన్ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ అభిప్రాయం కోరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాల మధ్య ఈ కేసు వల్ల వివాదాలు పెద్ద ఎత్తున తలెత్తుతున్నాయని.. ఈ గొడవల వల్ల నగరంలో శాంతి భద్రతలు చెడిపోయే అవకాశం ఉందని.. సెక్షన్‌ -8 ప్రకారం ఈ కేసు దర్యాప్తును నేను నేరుగా (తెలంగాణ ప్రభుత్వంతో సంబంధం లేకుండా) పర్యవేక్షించవచ్చా? అందుకోసం నోటిఫికేషన్‌ ఇవ్వవచ్చా? అని ఏజీని కోరినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో ఏజీ కూడా గవర్నర్‌ తన విచక్షణ మేరకు నోటిషికేషన్‌ జారీ చేయవచ్చని పేర్కొన్నట్టు తెలుస్తోంది.   కాకపోతే ఎప్పుడో సెక్షన్ 8 పై గవర్నర్ కు అధికారాలు ఇచ్చినా అప్పుడు అంత ఆందోళనకరమైన సమస్యలేవీ లేవు కాబట్టి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ఈ నోటుకు ఓటు కేసు ఉదంతం బయటకు వచ్చిన తరువాత ఇప్పుడు సెక్షన్ 8 అవసరం ఏర్పడింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ సెక్షన్ 8 అమలు అనేది కొత్తగా ఇప్పుడే తెరపైకి వచ్చినట్టు రాద్ధాంతం చేస్తుంది. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేస్తే తమకు ఎక్కడ నష్టం కలుగుతుందో అని తెలంగాణ ప్రభుత్వం సెక్షన్ 8 అమలు కాకుండా చూడటానికి తెగ ప్రయత్నిస్తుంది.

కేసీఆర్ తో స్టీఫన్ సన్ సీక్రెట్ సమావేశం

రేవంత్ రెడ్డి అరెస్ట్ అవడానికి ముఖ్య భూమిక పోషించిన తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ సీఎం కేసీఆర్ తో ఏకాంతంగా సమావేశమయ్యారు. అది కూడా కేసీఆర్ మెదక్ జిల్ల్లా జగదేవ్ పూర్ సమీపంలోని తన ఫామ్ హౌజ్ లో ఉండగా స్టీఫెన్ సన్ అక్కడికి వెళ్లి మరీ సీఎంను కలవడం ఇప్పుడు చర్చాంశనీయమైంది. ఓటుకు నోటు కేసులో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకమైన వ్యక్తి అయిన స్టీఫెన్ సన్ కేసీఆర్ ను కలవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ను స్టీఫెన్ సన్ ఎందుకు కలిశారు? కలిసినా ఎవరూ లేకుండా ఒంటరిగా ఎందుకు కలిశారు? వీరిద్దరూ కలిసి ఏం చర్చించుకున్నారు? అని రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

గ్రాండ్ సితార హోటల్లో కుట్రకు అంకురార్పణ?

  తెదేపాను అప్రదిష్టపాలు చేసి తెలంగాణాలో లేకుండా చేసేందుకు, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెరాస నేతలతో చేతులు కలిపి కుట్రలు పన్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. ఎసిబి అధికారులు రేవంత్ రెడ్డిని ఓటుకి నోటుకి కేసులో అరెస్ట్ చేయడానికి సరిగ్గా 10రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి తెరాస మంత్రి హరీష్ రావు, నామినేటడ్ ఎం.యల్యే ఎల్వీస్ స్టీఫెన్ సన్ తో సమావేశమయ్యారని రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కానీ ఎందుచేతో ఆయన పూర్తి వివరాలను బహిర్గతపరచలేదు. కానీ టీడీపీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ నిన్న మరో ఆస్కతికరమయిన రహస్యాన్ని బయటపెట్టారు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మే 21వ తేదీన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లో ఉన్న గ్రాండ్‌ సితార హోటల్లో కొందరు నేతలతో సమావేశమయ్యారని తెలిపారు. ఆయన ఎవరెవరితో సమావేశమయ్యారు? అసలు ఎందుకు సమావేశమయ్యారు? అని ఆమె ప్రశ్నించారు. ఈ కుట్రలలో జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని చెప్పడానికి అదే నిదర్శనమని ఆమె ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి తన బెయిల్ గురించి మాట్లాడుతారు కానీ సెక్షన్: 8 గురించి నోరు మెదపరు,” అని ఆమె విమర్శించారు.

పుల్లెల శ్రీరామచంద్రుడు అస్తమయం

  ప్రముఖ రచయిత పుల్లెల శ్రీరామచంద్రుడు బుధవారం నాడు కన్నుమూశారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. బంజారాహిల్స్‌లోని తన స్వగృహంలో ఆయన అస్తమించారు. పుల్లెల శ్రీరామచంద్రుడు తెలుగు, సంస్కృత భాషలలో రెండు వందలకు పైగా రచనలు చేశారు. వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించారు. 2011 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. పుల్లెల శ్రీరామచంద్రుడు తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం మండలం, ఇందుపల్లి గ్రామంలో జన్మించారు. మహామహోపాధ్యాయగా కీర్తించబడిన పుల్లెల శ్రీరామచంద్రుడు వివిధ సాహిత్య ప్రక్రియలలో గత 5 దశాబ్దాలుగా అవిరళకృషి చేశారు. సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు భాషలనుండి తెలుగు భాషలోనికి 80కు పైగా అనువాదాలు చేశారు. 120 వరకు గ్రంథాలు ప్రచురించారు. ఇతిహాసం, వ్యాకరణం, అలంకారం, ప్రాచీన చరిత్ర, వేదాంత గ్రంథాలే కాక వాల్మీకి రామాయణానికి తెలుగులో ప్రతిపదార్థవ్యాఖ్యలు చేశారు. అనేక సంస్కృత రచనలు తెలుగువారికి తేట తెలుుగులో అందుబాటులోనికి తెచ్చారు. పుల్లెల రామచంద్రుడు అలంకారశాస్త్రంలో ముఖ్యంగా కావ్యాలంకారం, కావ్యదర్శం, కావ్యప్రకాశం, ధ్వన్యాలోకం, కావ్యమీమాంస, వక్రోక్తిజీవితం మొదలైన సంస్కృతసాహిత్య ప్రక్రియలలో విశేషకృషి చేశారు. శంకరాచార్యుని బ్రహ్మసూత్ర, గీతాభాష్యాలను అనువదించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ సంస్కృత భాషా శాఖ ఆచార్యులుగా పలువురు శిష్య ప్రశిష్యులను తీర్చిదిద్దారు. పుల్లెల శ్రీరామచంద్రుడు అందుకొన్న పురస్కారాలలో కొన్ని.... తెలుగుభాషా పురస్కారం. (2011 - సి.పి.బ్రౌన్‌ అకాడమీ) శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కారం. (1997 - గుప్త ఫౌండేషన్‌, ఏలూరు)

ఇప్పుడు ఆనాయకుడి పరిస్థితి ఎంటో!!

మనం ఒకటి తలిస్తే దేవుడొకటి తలుస్తాడు అన్నట్టు.. ఏదో చేద్దామనుకుంటే ఏదో అయింది. ఇప్పుడు ఒక యువ నాయకుడి పరిస్థితి అలానే ఉంది. గద్దెనెక్కాలన్న ఆశ.. ఆ ఆశ ఎన్ని రాజకీయ కుట్రలు చేయడానికైనా వెనుకాడనీయదు అనడానికి ఈ నోటుకు ఓటు కేసే ఒక నిదర్శనం. ఎలాగైనా తెదేపా పార్టీని దెబ్బగొట్టాలి అన్న పంతంతో ఒక యువ నాయకుడు.. అతని తండ్రికి ఎంతో ఇష్టుడైన ఒక పోలీసు అధికారి కలిసి ఆడిన గేమ్ లో చివరికి అటు తిరిగి.. ఇటు తిరిగి ఆ వలలో కేసీఆర్ పడ్డారు. గత సంవత్సరకాలం నుండే వాళ్లిద్దరు కలిసి ఈ డ్రామాను స్టార్ట్ చేసిన దానిలో తెలియక కేసీఆర్ కూడా ఇరుకున్నట్టు తెలుస్తోంది. చివరికి అది ఇద్దరు సీఎంల మధ్య రగడగా మారింది. కేసీఆర్ కూడా చంద్రబాబును ఇరికించాలని చూసినా అసలు తీగ లాగితే డొంక కదిలింది అన్నట్లు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా బయటకు వచ్చింది. దీంతో ఆఖరికి తాము తీసిన గోతిలో తామే పడ్డట్టు అయింది.   మరోవైపు ఈ కుట్రవల్ల హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు తెరపైకి వచ్చింది. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం సెక్షన్ 8 అమలుచేయడానికి పూర్తి వ్యతిరేకం.. ఒకవేళ సెక్షన్ 8 అమలు చేస్తే కేంద్రంతో పోరాడటానికైనా సిద్దమని కేసీఆర్ తేల్చిచెప్పారు. మరోవైపు హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాల్సిందే అని ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం చొరవతో హైదరాబాద్ లో బాధ్యతలన్నీ గవర్నర్ కు అప్పగించారు. అయితే సెక్షన్ 8 వల్ల ఒక రకంగా కేసీఆర్ కు కొంత నష్టమే అని విశ్వసనీయవర్గాల వినికిడి. కాగా ఈ సెక్షన్ 8 అమలు వల్ల జీజేపీ కి రెండు రకాలుగా ఉపయోగాలు ఉన్నాయని రాజకీయవర్గాలు అనుకుంటున్నాయి. ఎందుకుంటే హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయడం వల్ల అటు మిత్రపక్షమైన టీడీపీతో ఎటువంటి బేధాలు ఉండవు. మరోవైపు కేసీఆర్ ఎంఐఏం పార్టీతో పొత్తుతో కార్పోరేషన్ ఎలక్షన్స్ లో బరిలో దిగనున్నట్టు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ స్పీడ్ కు బ్రేక్ వేయాలంటే ఇదే ఛాన్స్. ఈ సెక్షన్ 8 అమలు వల్ల పోలీస్ వ్యవస్థ మొత్తం గవర్నర్ చేతిలో ఉంటుంది. గవర్నర్ కూడా కేంద్రం చర్యలను అతిక్రమించి చేయరు కాబట్టి భద్రత వ్యవస్థ తమ చేతిలో ఉన్నట్టే. దీంతో కేంద్రానికి సెక్షన్ 8 వల్ల లాభమే తప్ప నష్టంలేదని స్పష్టమవుతోంది. మొత్తానికి ఒక చెడుసావాసం వల్ల కేసీఆర్ కు చెడు తప్ప మంచి జరగలేదని తెలుస్తోంది.   ఇదిలా ఉండగా ఈ కేసు వ్యవహారంలో ఏదో ఒకటి జరిగి ఇద్దరు సీఎంల మధ్య సంధి కుదిరి కేసు సద్ధుమణిగితే ఇప్పుడు ఆ యువనాయకుడు పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎలాగూ ఇటు తెలంగాణలో ఆపార్టీ అధికారంలోకి రావడం అనేది అసాధ్యం.. అటు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే తనపై మండిపడుతున్న ప్రజలలో మళ్లీ తన ఉనికిని తీసుకురావాలంటే కష్టతరమైనదే. దీంతో అటు ఆంధ్రాకి.. ఇటు తెలంగాణకి కూడా కాకుండా పోయే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కనుక రెండు పడవలు మీద కాలు పెడితే మునిగి పోవడం ఖాయం అని ఆయువ నాయకుడు ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

వాళ్ల ఉసురు కేసీఆర్ కు తగులుతుంది... మోత్కుపల్లి

తెలంగాణ తెదేపా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సీఎం కేసీఆర్ పై విమర్శల బాణాలు సంధించారు. హైదరాబాద్ కేసీఆర్ సొత్తు కాదని.. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను పార్లమెంట్ నియమించిందని ఈ విషయంలో రాద్ధాంతం అనవసరం అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఒక్కడి వల్ల రాలేదని.. ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణను సాధించారని.. వాళ్లందరి ఉసురు ఇప్పుడు కేసీఆర్ కు తగులుతుందని ఎద్దేవ చేశారు. ప్రతిసారీ తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకోవాలని కేసీఆర్ చూస్తున్నారని.. ఆ సెంటిమెంట్ తోనే ఏదైనా చెయ్యోచ్చు అనుకుంటున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ ను ఏడిపించిందెవరు?

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏడుపు తన్నుకుంటూ వచ్చిందట.. కానీ ఏవరైనా చూస్తారేమో అని ఆపుకున్నారట.. ఈ విషయం ఎవరో కాదు కేసీఆరే స్వయంగా చెప్పారు. అంతలా కేసీఆర్ ని ఏడిపించిందెవరు అనుకుంటున్నారా.. వివరాల ప్రకారం... కేసీఆర్ గజ్వేల్ లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారట. అయితే అక్కడ ఓ ఇద్దరు అమ్మాయిలు కేసీఆర్ దగ్గరకొచ్చి ‘సార్... మేము పదో తరగతి చదువుకుంటున్నాం. తర్వాత ఏమి చేయాలో తెలియడం లేదు. మేము అనాథలం. మాకు ఎవరూ లేరు సార్..’ అన్నారట.. అంతే ఆ మాటలకి కేసీఆర్ కు ఏడుపొచ్చిందంట కానీ కంట్రోల్ చేసుకున్నారట. దీంతో కేసీఆర్ పదో తరగతి తర్వాత అనాథ పిల్లలకు ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు తెరవాలని అధికారులకు సూచించారు. దీనిలో భాగంగానే మొదటి రెసిడెన్షియల్ స్కూల్ ను యాదగిరిగుట్టలో ప్రారంభించాలని, ఈ స్కూల్ శంకుస్థాపనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చెప్పారు.

రేవంత్ బెయిల్ విచారణ వాయిదా..

తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ కేసుపై వాదనలు వినిపించడానికి ఇంకా కొంత సమయం కావాలని.. మావద్ద కేసుకు సంబంధించి కీలకమైన ఆధారాలు ఉన్నాయని దీనిపై అదనపు కౌంటర్ దాఖలు చేయాలని.. దానికి కొంత గడువుకావాలని ఏసీబీ కోరింది. దీంతో కోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన ఆడియో వీడియో టేపులు ఇప్పటికే టెస్టు కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వాటికి సంబంధించిన నివేదిక కూడా ఈ రోజే రానుంది. మరోవైపు ఈ కేసులో నాలుగో నిందితుడైన జెరుసలేం మత్తయ్య అరెస్ట్ పై స్టే కూడా ఈ రోజే ముగియనుంది. రేవంత్ రెడ్డితో పాటు ఈ కేసులో నిందితులైన సెబాస్టియన్, ఉదయ్ సింహాలు కూడా బెయిల్ కోసం హోకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

రాజీనామా చేయలేదింకా: నల్లపురెడ్డి

  నెల్లూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వర్గానికి పార్టీలో మేకపాటి వర్గానికి మధ్య జరుగుతున్న అంతర్యుద్దం ప్రసన్న కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో పరాకాష్టకు చేరినట్లు స్పష్టమవుతోంది. ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నప్పటికీ పార్టీ కార్యక్రమాలకు గత కొంత కాలంగా దూరంగా మసులుతున్నారు. ఆ కారణంగా ఆయన ప్రమేయం లేకుండానే జిల్లాలో ముఖ్యంగా నెల్లూరు పట్టణంలో మేకపాటి వర్గం ఆద్వర్యంలో పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకు మరింత ఆగ్రహించిన ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు తన అధ్యక్ష పదవికి రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపారు.   కానీ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ వార్తలను ఖండించారు. జిల్లా నేతలతో తనకు ఎటువంటి విభేదాలు లేవని, కేవలం తన నియోజక వర్గంపైనే దృష్టి పెట్టాలనే ఉద్దేశ్యంతోనే అధ్యక్ష బాధ్యతల నుండి తప్పు కోవాలనుకొంటున్నానని, కానీ ఇంతవరకు తను రాజీనామా చేయలేదని తెలిపారు. పార్టీని వీడుతానని వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. తను వైకాపాను, జగన్మోహన్ రెడ్డిని ఎన్నడూ విడిచిపెట్టనని రాజకీయాలలో ఉన్నంత కాలం వైకాపాలోనే కొనసాగుతానని చెప్పారు. నిజానికి జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రతీ పార్టీలో చాలా మంది పోటీ పడుతుంటారు. జిల్లా రాజకీయాలను శాశించగల అటువంటి కీలకపదవిని ఏదో బలమయిన కారణం ఉంటే తప్ప ఎవరూ వదులుకోరు. కనుక జిల్లా అధ్యక్ష పదవిని వదులుకోవడానికి ఆయన చెపుతున్న కారణాలు సహేతుకంగా లేవని స్పష్టం అవుతోంది.