నోటుకు ఓటు కేసు రంగంలోకి హోంశాఖ కార్యదర్శి?
posted on Jun 18, 2015 @ 12:02PM
ఇరు రాష్ట్రాల రాజకీయాలు ప్రస్తుతం చాలా వేడెక్కి ఉన్నాయి. దీనంతటికి కారణం రేవంత్ రెడ్డి కేసు అని ప్రత్యేకించి ఎవరూ చెప్పనవసరం లేదు. రేవంత్ రెడ్డి అరెస్ట్ అయిన దగ్గర నుండి ఈ కేసుకు సంబంధించి రోజుకో వార్త వింటూనే ఉన్నాం. అయితే ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికి వరకూ ఎక్కువ చొరవ తీసుకోకపోవడం ఆశ్చర్యంగానే ఉంది. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు తమ ఫోన్లు ట్యాపింగ్ జరిగాయంటూ.. రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసినప్పటికీ కేంద్రం మాత్రం ఈ కేసులో అంత చొరవ తీసుకోలేదు. మరోవైపు జీజేపీకి, టీడీపీకి పొత్తు ఉండటంతో ఈ కేసు వ్యవహారంలో తల దూర్చలేని పరిస్థితి ఏర్పడింది.
ఇప్పుడు ఈ కేసును ఈ సమస్యను తీర్చడానికి ప్రతినిధులను రంగంలోకి దించనుంది. ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలను తెలుసుకోవడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అలోక్ కుమార్ త్వరలో హైదరాబాద్‌కు రానున్నట్టు రాజకీయ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఆయన ఇరు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతో.. గవర్నర్ తో చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు. ఇదే విషయంపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించి ఇరు రాష్ట్రాల్లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది.. ఇలాగే వదిలేస్తే ఏమవుతుందో అని.. శాంతి భద్రతల్లో ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలని గవర్నర్ కు సూచించారు.
మరోవైపు అసలు కేంద్ర ప్రభుత్వం ఈ కేసు గురించి ఇన్ని రోజులూ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండటం వల్లే పరిస్థితి ఇంత ఉద్రిక్తంగా తయారైందని వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ముందే రంగంలోకి దిగి ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించినట్టయితే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదేమో అంటున్నాయి రాజకీయవర్గాలు. కానీ ఇది ఏదో మామూలు కేసు అయితే కేంద్ర ఎప్పుడో చర్యలు తీసుకునేది.. కానీ ఈ కేసు చాలా సున్నితంగా వ్యవహరించాల్సి ఉండటంతో.. పైగా రెండు రాష్ట్రాల సీఎంలకు సంబంధించిన విషయం కావడంతో తగిన సమయం కోసం చూసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.