కూకట్ పల్లి ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయండి.. టీ టీడీపీ

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఈ నెల 30 లోపు నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ని కలిసి సమావేశామయ్యారు. పార్టీ ఫిరాయించిన వాళ్లపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరామని తెదేపా నేతలు తెలిపారు. అలాగే ఇటీవలే టీడీపీ నుండి తెరాస లోకి చేరిన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావుపై కూడా అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరినట్టు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీ ఎమ్మెల్యేలను అవమానపరుస్తున్నారని స్పీకర్ కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

కేసీఆర్ కు పదవీగండమే.. ఉండవల్లి

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరి పై మండిపడ్డారు. కేసీఆర్ కు ఎప్పుడూ ఆంధ్రా వాళ్లను తిట్టడం తప్ప ఇంకేం పని లేదని విమర్శించారు. ఓటు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నిజమని రుజువైతే కేసీఆర్ కు పదవీగండం తప్పదని, రేవంత్ రెడ్డి కేసుకు ఏపీకి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని.. అలా చేయడం వల్ల సీమాంధ్ర ప్రజలకు భద్రత ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని.. శాశ్వతంగా ఉమ్మడి రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. అసలు రాష్ట్ర విభజన న్యాయబద్దంగా జరగలేదని.. పార్లమెంట్ లో బిల్లు చట్ట ప్రకారం పాస్ కాలేదని.. దీనిపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తానని అన్నారు.

రేవంత్ కు బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి.. సిద్దార్ధ లూధ్రా

ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడైన రేవంత్ రెడ్డి బెయిల్ గురించి ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చల్లో మొదలయ్యాయి. సాక్ష్యాలు తారుమారు చేస్తారని.. సాక్ష్యులను బెదిరిస్తారని చెప్పి ఏసీబీ కోర్టు రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో తాను హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్ పిటిషన్ పై వాదనలు జరిపిన హైకోర్టును విచారణను ఈ రోజుకు వాయిదా వేసింది. ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై వాదోపవాదాలు జరిగాయి. రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది సిద్దార్ధ లూద్రా ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డి నుండి వాంగ్మూలాన్ని తీసుకున్నారని.. వాంగ్మూలాన్ని తీసుకున్న తరువాత జైలులో ఉంచాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు. మరోవైపు స్టీఫెన్ సన్ కు ఇచ్చిన.. ఇంకా ఇవ్వాలనుకున్న డబ్బులు ఎక్కడ నుండి వచ్చాయో తెలుసుకోవాల్సి ఉందని ఏసీబీ తరపు న్యాయవాది ఏజీ రామకృష్ణారెడ్డి వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా?లేదా ? అని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. అయితే రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది సిద్దార్ధ లూధ్రా ఆశాభావం వ్యక్తం చేశారు.   మరోవైపు రేవంత్ రెడ్డి కూడా కస్టడీలో నాలుగు రోజుల విచారణలో అంతా చెప్పేశానని.. చెప్పడానికి ఇంకా నా దగ్గర ఏం లేదని ఆరోపిస్తున్నారు. కానీ ఏసీబీ అధికారులు, తెలంగాణ ప్రభుత్వం కలిసి రేవంత్ రెడ్డికి కావాలనే బెయిల్ రాకుండా చేస్తున్నారని రాజకీయవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఎందుకంటే నిందితుడిని కస్టడీలో విచారించిన తరువాత అతనికి కోర్టు బెయిల్ మంజూరు చేయవచ్చు కానీ ఏసీబీ అధికారులు మాత్రం రేవంత్ కు బెయిల్ ఇవ్వకుండా నిరాకరించింది. రేవంత్ రెడ్డి ఈ కేసులో నిందితులుగా ఉన్న ఉదయ్ సింహా, సెబాస్టియన్ లు కూడా బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఒరిజినల్ నివేదిక ఇచ్చేది లేదు... ఏసీబీ కోర్టు

రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు అరెస్ట్ సమయంలో తీసిన ఆడియో, వీడియో టేపులను ఫోరెన్సిక్ ల్యాబ్ టెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన నివేదికను కూడా ఏసీబీ కోర్టుకు అందజేసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు అందజేసిన నాలుగు నివేదికలను ఏసీబీ కోర్టు శుక్రవారం పరిశీలించింది. అయితే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అదికారులు ఇచ్చిన నివేదికలను ఏసీబీ అధికారులు తమకు కావాలని కోర్టును కోరగా కోర్టు వారి అభ్యర్ధనను తిరస్కరించింది. ఒరిజినల్ నివేదిక ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. నివేదికకు సంబంధించిన కాపీలు కావాలంటే కోర్టులో మెమో దాఖలు చేసుకోవాలని ఏసీబీ అధికారులకు సూచించింది. దీంతో ఏసీబీ అధికారులు కోర్టులో మెమో దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు.

రాజ్‌నాథ్‌ సింగ్ తో ముగిసిన భేటీ..

రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సెక్షన్ 8 అమలు విషయంపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఉదయం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ అయ్యారు. సుమారు గంటన్నరపాటు వీరిద్దరి సమావేశం జరిగింది. అయితే మొదట హోంశాఖ కార్యదర్శి గోయల్ తో భేటీ అయి.. తర్వాత జాయింట్ సెక్రటరీ అలోక్ కుమారు తో భేటీ అయ్యారు. అనంతరం ముగ్గుర కలిసి రాజ్‌నాథ్‌ సింగ్ తో సమావేశమయ్యారు. తరువాత మళ్లీ గవర్నర్ ఒక్కరే రాజ్‌నాథ్‌ సింగ్ తో భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశంలో నోటుకు ఓటు కేసు గురించి, సెక్షన్ 8 అమలు గురించి సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలుపై కేంద్రం ఖచ్చితంగా ఉన్నట్టు.. గతంలో కేంద్రం పంపిన గైడ్ లైన్స్ ను యధాతథంగా జరిగించాల్సిందేనని గవర్నర్ కు స్పష్టం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

సెక్షన్ 8 అమలుకు ఆదేశాలివ్వండి

ఇప్పటికే ఓటుకు నోటు కేసులో సెక్షన్ 8 అమలుపై పలు రకాల వివాదాలు జరుగుతున్నాయి. ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం సెక్షన్ 8 అమలును వ్యతిరేకిస్తుండగా.. ఏపీ ప్రభుత్వం సెక్షన్ 8 అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. అయితే సెక్షన్ 8 అమలు చేయాలా? వద్దా అనే విషయం పై ఈరోజు ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. సీమాంధ్ర గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కె.వి.కృష్ణయ్య హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రాష్ట్రవిభజన చేసేపుడు కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాలను తీసుకోలేదని.. తీసుకోకుండానే ఒత్తిళ్ల కారణంగా అన్యాయంగా రాష్ట్రాన్ని విడదీశారని పేర్కొన్నారు. అంతేకాక ఆయన దాఖలు చేసిన పిల్ లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెండు రాష్ట్రాల హోంశాక ముఖ్య కార్యదర్శకులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

కేసీఆర్ ను బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు

ఓటుకు నోటు కేసులో అత్యంత కీలక సాక్షి అయిన స్టీఫెన్ సన్ సీఎం కేసీఆర్ ను ఫాంహౌస్ లో కలవడం పై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై తెదేపా నేతలు స్టీపెన్ సన్ పై మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ ముందు కూడా ఇలాగే రహస్యంగా మంతనాలు జరిపి రేవంత్ రెడ్డిని ఇరికించారని.. ఇప్పుడు కేసు కీలకదశలో ఉన్నప్పుడు కేసీఆర్ ను కలవాల్సిన అవసరం ఏముందని.. అసలు అలా ఎలా కలుస్తారని ప్రశ్నించారు. ఈ కేసులో కేసీఆర్ ఎలా చెబితే స్టీఫెన్ సన్ అలా నడుచుకుంటున్నాడని.. ఎలా తప్పుడు వాంగ్మూలం చెప్పాలో కేసీఆర్ పాఠాలు చెప్పుతున్నాడని మండిపడుతున్నారు. స్టీఫెన్ సన్ కేసీఆర్ ను కలవడానికి వెళ్లొచ్చు కానీ మత్తయ్య అత్తగారింటికి వెళ్తే తప్పా అని ప్రశ్నిస్తున్నారు.   అయితే రేవంత్ రెడ్డి కేసులో తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసి చాలా పెద్ద తప్పు చేసిందని.. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు కూడా మావద్ద ఆధారాలున్నాయని.. ఈ విషయంలో కేసీఆర్ ను బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని తెదేపా నేతలు అంటున్నారు. జగన్ తో కలిసి కుట్రలు పన్ని తెదేపాను దెబ్బతీయాలని చూశారు కానీ దీనివల్ల కేసీఆరే ఇరుక్కుపోయాడని విమర్శించారు. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు కాకుండా చూడటానికి తెలంగాణ ప్రభుత్వం చూస్తోందని.. కానీ నగరంలో సెక్షన్ 8 అమలు తప్పకుండా జరగాలని.. అలా అయితేనే హైదరాబద్ లో ఉంటున్న సీమాంధ్రులకు న్యాయం జరుగుతుందని అన్నారు.

ఆడియో, వీడియో టేపులు మాకివ్వండి.. ఈసీ

రేవంత్ రెడ్డి ఓటుకు నోటు అరెస్ట్ వ్యవహారంపై కేంద్రం ఎన్నికల సంఘం కోర్టులో మెమో దాఖలు చేసింది. రేవంత్ రెడ్డి అరెస్ట్ సమయంలో తీసిన ఆడియో వీడియో రికార్డింగులను, రేవంత్ రెడ్డికి సంబంధించిన సమాచారమంతా తమకు ఇవ్వాలని ఎన్నికల సంఘం తెలంగాణ ఏసీబీ అధికారులను కోరింది. అయితే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ కోర్టుకి అందజేశామని ఏసీబీ అధికారులు చెప్పడంతో కోర్టులో మెమో దాఖలు చేసింది. అయితే ఈ విషయంపై కొద్దిరోజుల క్రితమే ఎన్నికల సంఘం కోర్టులో మెమో దాఖలు చేయగా కోర్టు దానిని అనుమతించకపోవడంతో మళ్లీ మెమో దాఖలు చేయాల్సి వచ్చిందని ఎన్నికల సంఘం తెలిపింది.   అసలు ఎన్నికల నేపథ్యంలో స్టింగ్ ఆపరేషన్ చేసేపుడు ఎన్నికల సంఘానికి తప్పకుండా తెలయజేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్‌ అనుమతి మేరకు అధికారులు కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ ఓటుకు నోటు కేసు విషయంలో ఏసీబీ అధికారులు మాత్రం అవేమి పట్టించుకోకుండా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు.

ఇందిరాసాగర్ ప్రాజెక్టు పేరు మార్చిన ప్రభుత్వం

  సుమారు రెండు దశాబ్దాలుగా ఇందిరాసాగర్ (పోలవరం ప్రాజెక్టు) నిర్మాణం కొనసాగుతూనే ఉంది. వేల కోట్లు నిధులు దానిపై ఖర్చు చేసారు. కానీ నేటి వరకు అది పూర్తి కాలేదు. రాష్ర్ట విభజన సందర్భంలో దానిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి దానిని పూర్తి చేసే బాధ్యత కేంద్రమే స్వీకరించింది. కేంద్ర జలవనరుల శాఖామంత్రి ఉమా భారతి ఆ ప్రాజెక్టుని వచ్చే అరేడేళ్ళలో తప్పకుండా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. వీలయితే ఇంకా ముందుగానే దానిని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.   ఆ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేకపోయినా దాని చుట్టూ ఏదో ఒక సరికొత్త వివాదం అల్లుకొంటోంది. మోడీ ప్రభుత్వం అధికారం చేప్పట్టగానే మొట్టమొదట ఆ ప్రాజెక్టు క్రింద ముంపుకి గురయ్యే తెలంగాణాలో ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలను ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేసినప్పుడు తెలంగాణా వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఇదివరకు వైయస్స్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టుకి ఇందిరా సాగర్ బహుళార్ధ సాధక నీటిపారుదల ప్రాజెక్టు అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం దానిలో ఇందిర(గాంధీ) పేరుని తొలగించి పోలవరం సాగునీటి ప్రాజెక్టుగా మార్చుతూ నిన్న ఒక జి.ఓ. విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ నేతలు దానిని తీవ్రంగా ఖండిస్తున్నారు.

సెక్షన్: 8పై కేంద్రం నేడు నిర్ణయం తీసుకొనే అవకాశం?

  ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ పరిధిలో గవర్నర్ కి విశేషాదికారాలు కల్పించే రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్: 8ని అమలు చేయాలా...వద్దా? అనే అంశంపై కేంద్రం ఈరోజు కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. గవర్నర్ నరసింహన్ ఈరోజు ఉదయం 11గంటలకి కేంద్ర హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ తో సమావేశమవుతారు. అనంతరం ఆయన ప్రధాని మోడీతో కూడా ఇదే విషయం చర్చించడానికి సమావేశమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.   ఈ అంశంపై కేంద్రం నుండి రెండు విభిన్నమయిన సంకేతాలు రావడంతో దీనిపై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోందనే సంగతి తెలియకుండా జాగ్రత్త పడినట్లుంది. పరిస్థితులను బట్టి అవసరమయితే సెక్షన్: 8ని అమలుచేయవచ్చని కేంద్ర హోంశాఖ గవర్నర్ కి సలహా ఇచ్చినట్లు ముందు వార్తలు వచ్చేయి. కానీ కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ ఇరువురూ కూడా అంతరాష్ట్ర వివాదాలలో కేంద్రం తనంతట తానుగా జోక్యం చేసుకోదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో హోంశాఖ తమను సంప్రదించలేదని, తాము హోంశాఖకు ఎటువంటి సలహాలు, ఆదేశాలు ఇవ్వలేదని కేంద్ర న్యాయశాఖామంత్రి సదానంద గౌడ మీడియాకు తెలిపారు. కనుక సెక్షన్: 8 అమలుకు కేంద్రం అనుమతిస్తుందో లేదో అనే సంగతి ఈరోజు తెలిసి అవకాశం ఉంది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానిపై మరొకటి నమోదు చేసుకొన్న ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులపై కేంద్రం వైఖరిపై కూడా నేడు స్పష్థత వచ్చే అవకాశం ఉంది.

నేడు రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ

  ఓటుకి నోటు కేసులో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహల బెయిల్ పిటిషన్ కేసు ఈరోజు హైకోర్టు విచారణకు చేపడుతుంది. మొన్న వారి బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు, ఎసిబి న్యాయవాదులు ఈకేసులో తమకు ఒక కీలకమయిన సమాచారం లభించిందని కనుక దానిని సమర్పించేందుకు సోమవారం వరకు సమయం కావాలని అంతవరకు రేవంత్ రెడ్డి తదితరులకి బెయిల్ మంజూరు చేయవద్దని వాదించారు. కానీ హైకోర్టు వారికి ఈరోజు వరకే గడువు ఈయడంతో వారు చెప్పినట్లుగా ఆ కీలకమయిన ఆధారాలు ఈరోజు కోర్టుకి సమర్పించవలసి ఉంటుంది. అప్పుడే వారు రేవంత్ రెడ్డి తదితరుల జ్యూడిషియల్ కస్టడీ పొడిగించమని కోరగలుగుతారు. ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక ఎసిబి కోర్టుకి అందింది. దాని కాపీ కోసం ఎసిబి అధికారులు ఎసిబి కోర్టులో మెమో దాఖలు చేసి ఉన్నారు కనుక ఒకవేళ అది చేతికి అందినట్లయితే దానినే వారు హైకోర్టు కి సమర్పించి రేవంత్ రెడ్డి జ్యుడిషియల్ కస్టడీ పోదించమని కోరుతారేమో?

ఒబామా ప్రసంగాన్ని అడ్డుకున్న ట్రాన్స్ జెండర్

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రసంగాన్ని ఓ ట్రాన్స్ జెండర్ మహిళ అడ్డుకుంది. ఒబామా వైట్ హౌస్ లో ఎల్ జీబీటీకు సంబంధించిన ప్రసంగం చేస్తుండగా ట్రాన్స్ జెండర్ మహిళ అడ్డుకొని గట్టిగా నినాదాలు చేసింది. ట్రాన్స్ జెండర్ లకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు గురించి గట్టిగా ప్రశ్నించారు. ఒబామా వారించినప్పటికీ ఆమె అలాగే ఆయన ప్రసంగాన్ని పలుమార్లు అడ్డుకోవడంతో ఒబామా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా ప్రవర్తించడం మర్యాదపూర్వకం కాదని ఒబామా హెచ్చరించినా ఆమె అలానే ప్రవర్తిస్తుండడంతో భదత్ర సిబ్బందితో చెప్పి ఆమెను బయటికి పంపించేశారు.

మరో వివాదంలో ఆప్.. బెదిరింపు కేసులో ఆప్ నేత

ఆప్ ప్రభుత్వం ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటుంది. ఇప్పటికే ఈ పార్టీ నేతలు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆప్ పార్టీ అధినేత కేజ్రీవాల్ చిక్కుల్లో పడుతున్నారు. ఇప్పటికే నకిలీ సర్టిఫికేట్లతో మోసం చేసినందుకు గాను ఆపార్టీ న్యాయశాఖ మాజీ మంత్రి జితేంద్రసింగ్ తోమర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అది జరిగిన వెంటనే మరో ఆప్ నేత మీద అతని భార్య గృహహింస చట్టం కింద కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పార్టీకి చెందిన మరో నేత విశ్వాస్, అయన భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. నోయిడాలోని ఒక వ్యక్తిని విశ్వాస్ అతని భార్య బెదిరించారని ఫిర్యాదు అందడంతో వారిపై కేసు నమోదయింది. ఈ ఆరోపణపై విశ్వాస్ స్పందించి తాను కానీ తన భార్య కానీ ఎవరిని బెదిరించలేదని.. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమని అన్నారు.

ప్రస్తుతానికి సెక్షన్ 8 అవసరం లేదు.. కిషన్ రెడ్డి

ఇప్పటికే ఓటుకు నోటు కేసు గురించి ఒక్కో నేత ఒక్కో రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటుకు నోటు కేసు విషయంలో తమకు సంబంధం లేదని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ లో సెక్షన్‌-8 అవసరంలేదని.. సెక్షన్ 8 అమలు చేయడం వల్ల రెండు రాష్ట్రాల ప్రజల మధ్య వివాదాలు తలెత్తే ప్రమాదం ఉందని అన్నారు. ఇది టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య సమస్య అని దీనిని ప్రాంతీయ సమస్యగా మార్చొద్దని రెండు రాష్ర్టాల ప్రభుత్వాలను కోరుకుంటున్నానని అన్నారు.

ఏపీ విద్యార్ధులను ఎక్కించుకోం.. టీఎస్ ఆర్టీసీ

తెలుగు రాష్ట్రాల మధ్య అప్పుడప్పుడు ఏదో చిన్న వివాదాలు ఉన్నా ఇప్పుడు ఈ నోటుకు ఓటు కేసు ద్వారా అవి మరింత ఎక్కువయ్యాయన్నది మాత్రం నిజమనిపిస్తోంది. ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి వివాదాలు తలెత్తుతున్నాయి. అసలే ఒకవైపు కేసు వల్ల వాదోపవాదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు పై ఇరు ప్రభుత్వాలు కొట్టుకుచస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న టెయిల్ పాండ్ వివాదం. మాదంటే మాదని ఇరు ప్రభుత్వాలు వితండవాదాలు చేసుకున్నాయి. టెయిల్ పాండ్ మా అంతర్బాగంలో ఉంది కాబట్టి మాకు చెందుతుందని ఒక ప్రభుత్వం అంటే.. దాని నిర్మాణ వ్యయానికి అయిన ఖర్చు మా ప్రభుత్వ ఖాతాలో వేశారు కాబట్టి మాదని మరోక ప్రభుత్వం వాదిస్తోంది. ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు మరో వివాదం షెడ్యూల్ 10పై రగడ మొదలైంది. ఈ నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో ఆర్టీసీ రచ్చ ఆరంభమైంది. టీఎస్ఆర్టీసీలో ఏపీఎస్ బస్సు పాస్ లు చెల్లవని.. కొందరు ఆర్టీసీ సిబ్బంది ఏపీ విద్యార్ధులను బస్సులో ఎక్కించుకునేందుకు నిరాకరించారు. దీంతో కృష్ణా జిల్లా నందిగామ రామిరెడ్డిపల్లె వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగి తెలంగాణ బస్సులను అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు రంగలోకి దిగాల్సివచ్చింది. ఆంధ్రా నుండి తెలంగాణ వెళ్లే బస్సుల్లో విద్యార్ధులను ఎక్కించుకన్నప్పుడు.. తెలంగాణ నుండి ఆంధ్రా వెళ్లే బస్సుల్లో ఎందుకు ఎక్కించుకోరని.. ఎక్కించుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. అటు తెలంగాణలోనూ.. ఇటు ఆంధ్రాలోనూ రెండు వైపులా పాస్ లు చెల్లేలా చర్యలు తీసుకోవాలని పట్టుబట్టడంతో ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు టీఎస్ అర్టీసీ అధికారులతో సమావేశమయ్యారు. మొత్తానికి రోజు రోజుకి రెండు రాష్ట్రాల మధ్య దూరం పెరుగుతుందనడానికి ఈ వివాదాలే నిదర్మనమని తెలుస్తోంది.

తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తారా? అచ్చెన్నాయుడు

హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని శాంతి భద్రతలను గవర్నర్ చేతికి అప్పగించాలని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అలా కాని పక్షంలో హైదరాబాద్ ను యూటీ చేయాలని తాము డిమాండ్ చేస్తామని చెప్పారు. సెక్షన్ 8 అమలు చేస్తే దీక్షలు చేస్తామని అంటున్నారు.. అలా దీక్షలు వల్ల చట్టాలు మారిపోతే లక్షలమందితో నిరాహార దీక్ష చేస్తామని ఎద్దేవ చేశారు. ఒకవేళ సెక్షన్ 8 కనుక లేకపోతే విభజన చట్టం తీసేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలిపేస్తారా అని సవాల్ విసిరారు. హైదరాబాద్ కేసీఆర్ సొత్తు కాదని.. హైదరాబాద్ పై వారికి ఎంత హక్కు ఉందో.. మాకు కూడా అంతే హక్కు ఉందని.. పదేళ్ల తరువాత కాదు కదా పది నిమిషాల ముందు కూడా హైదరాబాద్ ను విడిచి వెళ్లమని స్పష్టం చేశారు.

గవర్నర్ కు ఢిల్లీ నుండి పిలుపు

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఓటుకు నోటు కేసు నేపథ్యంలో మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ కేసు వ్యవహారంపై ఢిల్లీ నుండి పిలుపు రాగా ఈరోజు సాయంత్రం అత్యవసరంగా ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం ఉదయం హోంశాఖ అధికారులతో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. రోజు రోజుకి ఓటుకు నోటు కేసు వ్యవహారంపై వివాదాలు పెరుగుతుండటం, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ విషయం.. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలుపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన నివేదికి గవర్నర్ కేంద్రానికి సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ ఢిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. గవర్నర్ ఢిల్లీ పర్యటన తరువాత ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో ఇప్పుడు అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.

ఏడాది క్రితమే సెక్షన్ 8 పై చంద్రబాబు లేఖ

నోటుకు ఓటు కేసు ఎన్నో మలుపులు తిరిగి ఆఖరికి సెక్షన్ 8 అమలు వరకూ వచ్చింది. ఇదే విషయం పై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వాదోపవాదాలు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం సెక్షన్ 8 అమలుకు ససేమిరా వద్దంటే, ఏపీ ప్రభుత్వం సెక్షన్ 8 అమలు అవ్వాల్సిందే అని పట్టుబడుతోంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సెక్షన్ 8 అమలు గురించి గవర్నర్ ఎప్పుడో కేంద్రాన్ని సంప్రదించి తన బాధ్యతలు గురించి అడుగగా కేంద్రం కూడా కొన్ని ప్రత్యేక భాద్యతలను గవర్నర్ కు అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ సెక్షన్ 8 అమలుపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా రాష్ట్ర విభజన తరువాత.. సరిగ్గా ఏడాది క్రితం హైదరాబాద్ లో ఉంటున్న సీమాంధ్రుల భద్రత నిమిత్తం సెక్షన్ 8 అమలు చేయాలని ప్రధాని మోదీకి లేఖ కూడా రాసినట్టు రాజకీయ విశ్లేషకుల వెల్లడి.   అయితే ఈ లేఖపై అప్పట్లో కేంద్రం కూడా స్పందించి హైదరాబాద్ లో ఉన్న భద్రతా వ్యవస్థపై కొన్ని ప్రత్యేకమైన భాద్యతలను గవర్నర్ కు అప్పగించింది. శాంతి భద్రతలకు సంబంధించిన ఏ నివేదిక అయిన పోలీసు అధికారులు గవర్నర్ కు అప్పగించాలని.. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే దానిపై నివేదిక కోరే, విచారణకు ఆదేశించే హక్కు, చర్య తీసుకొనే అధికారం గవర్నర్‌కు ఉంటాయని.. బాధితుల హక్కుల రక్షణ కోసం ఆయన అవసరమైన ఆదేశాలు కూడా జారీ చేయవచ్చు’’ అని కేంద్రం ఆ లేఖలో స్పష్టం చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం కేంద్రం తీసుకున్న నిర్ణయానికి స్పందించి గవర్నర్ కు విస్తృత అధికారాలు ఇవ్వాలనడం సరికాదని... ఒకవేళ గవర్నర్‌ తన అధికారాలను వినియోగించుకోవాల్సి వచ్చినా, తెలంగాణ కేబినెట్‌ సలహా మేరకే నడచుకోవాలి కేంద్రానికి లేఖ రాశారు. దీంతో అదే సమయంలో ‘‘గవర్నర్‌ విధులు, భాధ్యతలు, అధికారాలు (ఫంక్షనాలిటీస్‌)’’ మీద సవివరమైన నోట్‌ ఒకటి తయారు చేసి, గవర్నర్‌ వ్యక్తిగత అవగాహన కోసం రాజ్‌భవన్‌కు పంపినట్టు తెలుస్తోంది.   కేంద్రం పంపిన నోట్ ఆధారంగానే నోటుకు ఓటు కేసు వ్యవహారంపై గవర్నర్ నరసింహన్ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ అభిప్రాయం కోరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాల మధ్య ఈ కేసు వల్ల వివాదాలు పెద్ద ఎత్తున తలెత్తుతున్నాయని.. ఈ గొడవల వల్ల నగరంలో శాంతి భద్రతలు చెడిపోయే అవకాశం ఉందని.. సెక్షన్‌ -8 ప్రకారం ఈ కేసు దర్యాప్తును నేను నేరుగా (తెలంగాణ ప్రభుత్వంతో సంబంధం లేకుండా) పర్యవేక్షించవచ్చా? అందుకోసం నోటిఫికేషన్‌ ఇవ్వవచ్చా? అని ఏజీని కోరినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో ఏజీ కూడా గవర్నర్‌ తన విచక్షణ మేరకు నోటిషికేషన్‌ జారీ చేయవచ్చని పేర్కొన్నట్టు తెలుస్తోంది.   కాకపోతే ఎప్పుడో సెక్షన్ 8 పై గవర్నర్ కు అధికారాలు ఇచ్చినా అప్పుడు అంత ఆందోళనకరమైన సమస్యలేవీ లేవు కాబట్టి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ఈ నోటుకు ఓటు కేసు ఉదంతం బయటకు వచ్చిన తరువాత ఇప్పుడు సెక్షన్ 8 అవసరం ఏర్పడింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ సెక్షన్ 8 అమలు అనేది కొత్తగా ఇప్పుడే తెరపైకి వచ్చినట్టు రాద్ధాంతం చేస్తుంది. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేస్తే తమకు ఎక్కడ నష్టం కలుగుతుందో అని తెలంగాణ ప్రభుత్వం సెక్షన్ 8 అమలు కాకుండా చూడటానికి తెగ ప్రయత్నిస్తుంది.