వంగవీటి పయనం ఎటు!

  కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ ఇప్పుడు పార్టీ మారే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి లేని కారణంగా తాను కూడా కాంగ్రెస్ ను వీడి వైకాపాలోకి చేరడానికి ప్రయత్నిస్తున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే వచ్చిన చిక్కేంటంటే ఇప్పుడు దేవినేని నెహ్రూ వైకాపాలోకి చేరడం వల్ల ఆపార్టీలో ఉన్న వంగవీటి రాధా కుటుంబం పరిస్థితి ఎంటని రాజకీయవర్గాలు చెవులుకొరుక్కుంటున్నాయి. ఎందుకంటే దేవినేని నెహ్రూ, వంగవీటి కుటుంబానికి పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే అంత శత్రుత్వం ఉంది. అయితే ఇప్పుడు దేవినేని నెహ్రూ వైకాపాలో చేరితే వంగవీటి కుటుంబం ఎటువైపు పయనిస్తుందా అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. రెండు కత్తులు ఒక ఒరలో ఉండవన్నట్టు దేవినేని నెహ్రూ వైకాపాలో చేరితే వంగవీటి కుటుంబం మాత్రం వైకాపాను వీడటం కచ్చితమని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. అయితే ఈ విషయంలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది చూడాల్సిన విషయం. ఎందుకంటే గతంలో కూడా బొత్స సత్యనారాయణ వైకాపాలోని చేరడం ఎంతమాత్రం ఇష్టంలేని సుజయ్ సోదరులు కూడా అప్పట్లో పార్టీని వీడతారు అనే వార్తలు బాగా ప్రచారం చేశాయి. కానీ అలాంటిది జరగలేదు.. సుజయ్ కృష్ణా రంగారావు కూడా పార్టీనీ వీడే ప్రసక్తే లేదని.. వైకాపాలోనే ఉంటామని స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. కానీ అప్పటి పరిస్థితి వేరు.. ఇప్పుటి పరిస్థితి వేరు.     ఎందుకంటే దేవినేని నెహ్రూ కుటుంబానికి.. వంగవీటి రాధా కుంటుబానికి మధ్య ఉన్న శత్రుత్వం అలాంటిది. ఈ నేపథ్యంలోనే జగన్ మోహన్ రెడ్డి తాతను చంపిన కుటుంబంతో కలిసి జగన్ కూర్చోగలడా.. అలాగే నేను కూడా వీళ్లతో కలిసి ఎలా కూర్చోగలను అని అన్నట్టు తెలుస్తోంది. అందుకే జగన్ విజయవాడ పర్యటనకి కూడా రాధా డుమ్మాకొట్టే ప్రయత్నం చేస్తున్నారని అనుకుంటున్నారు. మరోవైపు జగన్, విజయ్ సాయిరెడ్డి, వై సుబ్బారెడ్డిలు కలిసి వంగవీటి కుటుంబానికి నచ్చేజెప్పడానికి ప్రయత్నించగా రాధా మాత్రం వారికి టచ్ లోకి రాలేదు. దీంతో జగన్ కొడాలి నానికి రంగంలోకి దించి ఆయన చేత నచ్చజెప్పే ప్రయత్నం చేయించినా ఆ ప్రయత్నంలో నాని కూడా విఫలమయినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ విషయంలో మాత్రం రాధా చాలా పట్టుదలగా ఉన్నారని.. ఒకవేళ దేవినేని నెహ్రూ కనుక వైకాపా లోకి వస్తే వంగవీటి రాధా బీజేపీలోకి కాని.. టీడీపీ లోకి చేరే అవకాశాలు ఉన్నట్టు రాజకీయ వర్గాలు చెవులుకొరుక్కుంటున్నాయి. చూడాలి ఇంతకీ వంగవీటి పయనం ఎటు సాగుతుందో..

పురందేశ్వరికి జాతీయ స్థాయికి ప్రమోషన్

  ఆంద్రప్రదేశ్ బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి గత ఎన్నికలలో ఊహించని విధంగా ఓడిపోయిన తరువాత ఆమె రాజకీయ జీవితంలో కొంచెం స్తబ్దత ఏర్పడింది. అయినప్పటికీ ఆమె నిరాశ చెందకుండా రాష్ట్రంలో బీజేపీని బలపరిచేందుకు తన ప్రయత్నాలు తను చేసుకుపోతున్నారు. ఆమె సేవలను, ప్రతిభను, చిత్తశుద్దిని గుర్తించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆమెని రాష్ట్ర స్థాయి నుండి జాతీయస్థాయికి ప్రమోషన్ చేశారు. ఆమెను జాతీయ మహిళా మోర్చా ఇన్-ఛార్జ్ గా నియమించారు. దానితో బాటు ఆమెకు అదనంగా కర్ణాటక రాష్ట్ర మహిళా మోర్చా బాధ్యతలను కూడా అప్పజెప్పారు.   అదే విధంగా మురళీధర్ రావుకి కూడా జాతీయ స్థాయికి పదోన్నతి కల్పించారు. ఆయనను జాతీయ యువ మోర్చా ఇన్-ఛార్జ్ గా నియమించారు. దానితో బాటు అదనంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల యువమోర్చా బాధ్యతలు కూడా ఆయనకి అప్పగించారు. బీజేపీ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ గా సిద్దార్థ్ నాద్ సింగ్ ని, తెలంగాణా రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ గా క్రిష్ణదాసుని నియమించారు.

వైకాపా ఎమ్మెల్యే భూమా అరెస్ట్

వైకాపా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భూమా నాగిరెడ్డి పోలీసు అధికారులను దూషించారని అతనిపై 353, 506 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదయ్యాయి. వివరాల ప్రకారం స్థానిక సంస్థల కోటాకింద కర్నూలు జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు వేసేందుకు భూమా అఖిలప్రియ పోలింగ్ కేంద్రానికి వెళ్లగా అక్కడ పోలీసుల ఆమెతో దురుసుగా ప్రవర్తించారని.. ఈ విషయం తెలుసుకున్న భూమా నాగిరెడ్డి అక్కడకి వచ్చి పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసు అధికారులు అతనిని అదుపులోకి తీసుకొని వాహనంలో నంద్యాల మూడో పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. భూమా అరెస్ట్ తో అతని ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఆప్ పార్టీకి నకిలీ సర్టిఫికేట్ల తంటాలు

ఆప్ పార్టీ రోజు రోజుకి చాలా ఫెమస్ అయిపోతుంది. అది అదరగొట్టే పరిపాలన చేసి కాదు.. రోజుకో ఆరోపణలు ఎదుర్కొంటూ. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుపోతూనే కేజ్రీవాల్ ను చిక్కుల్లో పడేస్తుంది. ఈ పార్టీలో ఇప్పుడు నకిలీ సర్టిఫికెట్ల వివాదాలు ఎక్కువైపోయాయి. మొన్నటి వరకూ నకిలీ సర్టిఫికేట్లతో మాజీ న్యాయశాఖ మంత్రి జితేందర్ తోమర్ సింగ్ పార్టీని, ప్రజలను మోసం ఆఖరికి పదవిని వీడాల్సి వచ్చింది. ఇప్పుడు మరో ఆప్ నేత భావనా గౌర్ అనే మహిళ నకిలీ సర్టిఫికేట్ల ఆరోపణలో చిక్కుకున్నారు. సుమరేంద్రనాథ్ వర్మ అనే ఆర్ టీఐ కార్యాకర్త బావనా గౌర్ నకిలి సర్టిఫికెట్లు సమర్పించారని.. 2013లో సమర్పించిన అఫిడవిట్ లో, 2015లో సమర్పించిన అఫిడవిట్ లో తేడాలున్నాయని కోర్టులో పిటిషన్ వేశారు. 2013లో తాను ఇంటర్ వరకే చదివానని అఫిడవిట్లు సమర్పించగా... 2015 లో మాత్రం బీఏ చదివానని అఫిడవిట్లు సమర్పించారని కేవలం 14 నెలల వ్యవధిలో బీఏ, బీఈడీ పూర్తి చెయ్యడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. దీనిని బట్టి ఆమె సర్టిఫికేట్లలో ఏదో తేడా ఉందని తెలుస్తోందని.. ఆమె తప్పుడు సర్టిఫికేట్లు సమర్పించారని అర్ధమవుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తానికి ఆప్ పార్టీలో నుండి రోజుకో నేత నకిలీ సర్టిఫికేట్ల వివాదంతో బయటపడుతున్నారు. ఇంకా ఎంతమంది బయటపడతారో చూడాలి..

చనిపోయిన తాత శవం పక్కన సెల్ఫీ

సెల్ఫీల పిచ్చి ముదిరిందంటే ఏమో అనుకున్నాం కానీ అది నిజమేనని అప్పుడప్పుడు కొన్ని చూస్తుంటే అర్ధమవుతుంటుంది. సెల్ఫీల గోల ఎక్కువైన తరువాత ఎంతోమంది ప్రాణాలు కూడా బలిగొన్నాయి. ఎదో కొత్తగా ట్రై చేసి సెల్ఫీ దిగాలని ఎంతో మంది తమ ప్రాణాలనే కోల్పోయారు. ఎప్పుడు ఫోటో దిగాలి.. ఏ సందర్భంలో దిగాలి అనే కనీస విజ్ఞతను కూడా కోల్పోతున్నారు. సౌది అరేబియాకు చెందిన ఓ యువకుడు ఏకంగా తన తాత శవం పక్కన సెల్ఫీ దిగి పోస్ట్ చేసి అందరూ షాక్ అయ్యేలా చేశాడు. అక్కడితో ఆగకుండా విచిత్రమైన హావభావాలతో ఫోటోలు దిగి పైగా 'గుడ్ బై గ్రాండ్ ఫాదర్' అంటూ రాసి మరీ పోస్ట్ చేశాడు. యువకుడు చేసిన ఈ పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలా బాధ్యతారహితంగా చేసిన యువకుడిని శిక్షించాలని.. ఇది నైతిక విలువలను ఉల్లంఘించడమేనని సౌద్ అల్ హర్బీ అనే న్యాయవాది అన్నారు.

మత్తయ్య కాల్ డాటాతో దేశ భద్రత ముడిపడుందా!

  ఓటుకి నోటు కేసులో నాల్గవ నిందితుడిగా ఉన్న మత్తయ్య కాల్ రికార్డ్స్ డాటా సమర్పించామని విజయవాడ 3వ మెట్రోపోలిటన్ కోర్టు కోరినప్పుడు అది దేశభద్రతకు భంగం కలిగించే అంశమని కనుక కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకొన్నాకనే కోర్టుకి ఆ వివరాలు అందించగలమని చెప్పినట్లు సమాచారం. కానీ రేవంత్ రెడ్డిపై ఎసిబి అధికారులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి అరెస్ట్ చేసిన మరుక్షణంలోనే ఎసిబి చేతిలో మాత్రమే ఉండవలసిన ఆడియో వీడియో టేపులు మొట్ట మొదట టీ-న్యూస్ ఛానల్లో ఆ తరువాత సాక్షితో సహా అన్ని ఛానల్స్ లో ప్రసారం అయిపోయాయి. అందుకు ఎసిబి ఏమి సమాధానం చెపుతుందో మున్ముందు విచారణలో తేలవలసి ఉంది. అదే విధంగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా మంత్రులందరి ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. మరి దానికి టెలీఫోన్ సంస్థలు ఏమి సమాధానం చెపుతాయో చూడాల్సి ఉంది.   అత్యంత రహస్యంగా ఉంచాల్సిన వివరాలను మీడియాకి బహిరగతం చేసినప్పుడు కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు గానీ దేశ భధ్రతకు ఎటువంటి భంగం కలగనప్పుడు, ఒక కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి వచ్చిన ఫోన్ కాల్స్ డాటాని కేవలం కోర్టుకి అందజేస్తే ఏవిధంగా దేశ భద్రతకు భంగం కలుగుతుందని టెలీఫోన్ కంపెనీలు భావిస్తున్నాయో తెలియదు. కానీ కోర్టు అడిగినా ఇవ్వలేమని కేంద్రం అనుమతి లేనిదే తెగేసిచెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ మొబైల్ సంస్థల మాటలు విన్న ప్రజలు మాత్రం మత్తయ్యకి వచ్చే ఫోన్ కాల్స్ తో దేశ భద్రత ముడిపడి ఉంటే అతను చాలా గొప్పవాడయ్యే ఉండాలి...అని అనుకోవలసి వస్తోంది.  

టీ. ఏసీబీకి సుప్రీం దిమ్మతిరిగే సమాధానం

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వకుండా.. బెయిల్ రాకుండా చాలా కష్టపడ్డారు పాపం తెలంగాణ ఏసీబీ అధికారులు. కానీ హైకోర్టు మాత్రం ఏసీబీ చెప్పిన కుంటి సాకులను తోసిపుచ్చి రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసి ఏసీబీ అధికారులకు మొట్టికాయ వేసింది. అంతటితో ఊరుకున్నారా ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ లో దాఖలు చేసింది. అంతేకాదు రేవంత్ రెడ్డి జైలు నుండి విడుదలైనపుడు చేసిన ప్రసంగాన్ని కూడా సుప్రీంకోర్టుకు అందించి ఇంకేముంది రేవంత్ బెయిల్ రద్దు చేయోచ్చు అనుకున్నారు. అయితే సుప్రీంకోర్టు కూడా ఏసీబీ వేసిన రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపి వారిక దిమ్మతిరిగి పోయే సమాధానం ఇచ్చింది. ఇప్పటికే తెలంగాణ ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని నెల రోజుల పాటు జైలులోనే ఉంచి.. నాలుగు రోజులు కస్టడీలో విచారణ జరిపారు. మళ్లీ అతడిని కస్టడీకి తీసుకొని ఏం చేస్తారు అని ప్రశ్నించింది. రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని తాము సమర్ధిస్తున్నామని.. రేవంత్ కు బెయిల్ మంజూరు చేయడంపై హైకోర్టు సహేతుకమైన కారణాలే పేర్కొందని ధర్మాసనం తెలిపింది. కనుకు రేవంత్ రెడ్డిని ఇంకా జైలులోనే ఉంచాల్సిన అవసరం లేదని.. ఒకవేళ రేవంత్ బెయిల్ నిబంధనలను కనుక ఉల్లంఘిస్తే అప్పుడు తమ తలుపు తట్టవచ్చని తెలంగాణ ఏసీబీ అధికారులకు సుప్రీం సూచించింది.

సుప్రీంకోర్టులో ఎసిబికి ఎదురు దెబ్బ

  ఎసిబికి అనే కంటే తెలంగాణా ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎసిబి వేసిన పిటిషన్ని ఈరోజు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు కొట్టివేసింది. రేవంత్ రెడ్డి, సెబాస్టియన్ మరియు ఉదయ్ సింహాలు ముగ్గురూ నెల రోజుల పాటు కస్టడీలో ఉంచుకొని వారిని నాలుగు రోజులు ఏకధాటిగా ప్రశ్నించి సమాధానాలు రాబట్టిన తరువాత వారిపై సెక్షన్: 164 క్రింద కేసు కూడా నమోదు చేసారని, ఇంకా వారిని జైల్లోనే ఉంచాలని ఎందుకు అనుకొంటున్నారని? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.యల్.దత్తు ఎసిబి తరపున వాదించిన ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ ని ఎదురు ప్రశ్నించారు. హైకోర్టు తీర్పులో అనేక లోపాలున్నాయని ఆయన చేసిన వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. ఎసిబి వేసిన పిటిషన్ని కొట్టివేసింది. రేవంత్ రెడ్డి మిగిలిన ఇద్దరికీ హైకోర్టు బెయిలు మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టు గట్టిగా సమర్ధించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో ఎసిబి కంటే తెరాస ప్రభుత్వానికే ఎదురు దెబ్బ తగిలినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తగాదాలొద్దు.. ప్రణబ్

తెలుగు రాష్ట్రాలు అభివృద్ది చెందాలని.. రెండు రాష్ట్రాల మధ్య వున్న తగాదాలు రాష్ట్రా అభివృద్దికి అవరోధమవుతాయని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్టీ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు రాసిన ఉనికి పుస్తకావిష్కరణలో పాల్గొన్న ఆయన ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పరిస్థితి గురించి పైవిధంగా అన్నారు. ఇష్టమున్నా.. లేకపోయినా పొరుగురాష్ట్రాలతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని.. దేశాభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ అంటే ఒక్క ఏపీకి.. తెలంగాణ కు మాత్రమే ఇష్టంకాదు.. దేశ ప్రజలందరికీ హైదరాబాద్ అంటే ఇష్టమని.. అన్ని సంస్కృతుల సమ్మేళనం హైదరాబాద్ అని అన్నారు. తనకు విద్యాసాగర్ రావు ఎంపీగా ఉన్నప్పటి నుండి తెలుసని.. తాను రాసిన ఉనికి పుస్తకం భావితరాలకు స్ఫూర్తి కావాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి, బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక తాను రాష్ట్రపతి ప్రణబ్ వద్దకు వెళ్లానని.. అంతకుముందే తాను ఓసారి కలిసినప్పుడు అంత తొందరపాటు వద్దని, కొంత ఆవేశం తగ్గించుకోమని సూచించారన్నారు. విద్యాసాగర్ రావు విలక్షణమైన రాజకీయ నాయకుడు.. ఉద్యమ కాలంలో ఆయనతో కలిసి పని చేసే అవకాశం కలిగిందని గుర్తు చేసుకున్నారు.

డిఎస్ ఉంటే ఎంత పోతే ఎంత.. కాంగ్రెస్ లీడర్స్

డి. శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ని వీడి టీఆర్ఎస్ లో చేరడంపై పలువురు కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. డిఎస్ పార్టీని వీడటం వల్ల పార్టీకి వచ్చే నష్టమేమి లేదని విమర్శించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి తోడు ఉండకుండా.. కష్టకాలంలో పార్టీలో పనిచేయాలనే ఆలోచన లేని డిఎస్ పార్టీలో ఉంటే ఎంత లేకపోతే ఎంత అని ఎద్దేవ చేశారు. అయినా పార్టీనే డిఎస్ ను మోసింది కానీ డిఎస్ ఎప్పుడూ పార్టీని మోయలేదని.. 30 ఏళ్లు పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి.. ఇప్పుడు పార్టీ వీడడం సరికాదని అన్నారు. పార్టీ కోసం కార్యకర్తలు కష్టపడితే పలితాన్ని డిఎస్ అనుభవించారని.. కాంగ్రెస్ పార్టీ డిఎస్ కు చాలా చేసిందని అన్నారు. అయినా బీసీలకు అన్యాయం జరుగుతుందని అంటున్నారు.. ఆయన స్థానంలో ఎమ్మెల్సీ ఇచ్చింది కూడా బీసీ అభ్యర్ధికేనని అది డిఎస్ గుర్తుంచుకోవాలని అన్నారు.

ఎంపీలకు జీతాల పెంపు అవసరమా!

ఒక సామాన్య మానవుడు తనకు వచ్చే జీత భత్యాలు మీద ఆధారపడి బ్రతకడం ఎంతో కష్టమో అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తోంది. కానీ కోట్లుకు కోట్లు సంపాదించే రాజకీయ నాయకులు కూడా తమ జీత భత్యాలు పెంచమని అడగటం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలు పెంచమని, మాజీ ఎంపీల పెన్షన్ లను పెంచమని పార్లమెంటరీ సంఘం సిఫార్సు చేసింది. అయితే ఒక పార్లమెంట్ సభ్యుడి జీత భత్యాలు ఎంత.. అతనికి ఇంకా పెంచాల్సిన అవసరం ఉందా అనే విషయం పై ఒక లుక్కేద్దాం.     * ఒక పార్లమెంట్ సభ్యుడి జీతం.. 1,20,000 * నెలకు రాజ్యాంగ వ్యయం.. 10,000 * ఆఫీస్ నిర్మాణానికి అయ్యే ఖర్చు.. 14, 000 * ప్రయాణఖర్చులు (Rs. 8 కి.మీ).. 48,000 * పార్లమెంట్ మీటింగ్స్ (రోజుకి).. 500 * రైలు ప్రయాణం ఫస్ట్ క్లాస్ ఏసీ.. ఉచితం * సంవత్సరానికి 40 సార్లు ఉచిత విమాన ప్రయాణం * ఒకవేళ ఢిల్లీలోని ఎంపీ హోటల్ బస చేయాల్సి వస్తే రెంట్ ఉచితం * 50,000 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ (ఇంటికి) * 1,70,000 ఫ్రీ ఫోన్ కాల్స్ * మొత్తానికి సంవత్సరానికి ఒక ఎంపీకి ప్రభుత్వం చేసే ఖర్చు.. 33,08,000 * 5 సంవత్సరాల పదవికాలంలో అయ్యే ఖర్చు.. 1,60,00,000 అంటే ఒక ఎంపీకి 5 సంవత్సరాలో 1,60,00,000 ఖర్చు అయితే.. మొత్తం 534 ఎంపీలకు ఒక సంవత్సరం కాలంలో అయ్యే ఖర్చు 8,54,40,00,000 అంటే సుమారు 855 కోట్లన్నమాట. అదీ చాలదన్నట్టు పార్లమెంట్ సభ్యులకు అందించే భోజన సదుపాయాలు చూస్తే కళ్లు తిరిగి పడిపోవాల్సిందే. కనీసం బయట పేదవాడికి కూడా అంత చీప్ గా ఎక్కడా దొరకవేమో.. పేద వాడికి కనీస సౌకర్యాలు కూడా అందుబాటులోకి తీసుకురావడం చేతకాని రాజకీయనేతలు మాత్రం పార్లమెంట్ సభ్యులకు మాత్రం అంత చౌక ధరలకే తిండి పెట్టడం ఎంత మాత్రం కరెక్టో ఆలోచించుకుంటే మంచిది. ఆ లిస్టు కూడా ఒకసారి చూద్దాం. మళ్లీ క్యాంటీన్ లో అందించే భోజనం సరిగా లేదంటూ తమ ఆరోగ్యం చెడిపోతుందంటూ ఫిర్యాదులు కూడా చేశారంట మన ఎంపీలు. ఎంతైనా ఫ్రీగా వచ్చే ఫుడ్డు కదా పాపం మన ఎంపీలకు సరిగా అరగలేదేమో అందుకే ఆరోగ్యం చెడిపోయివుంటుంది. దీనిని బట్టి ఒక ఎంపీకి ఇంకా జీత భత్యాలు పెంచడం అవసరమా? వారికి పెట్టే ఖర్చులో కనీసం కొంతైనా పేదలకు ఖర్చు చేస్తే మన దేశం ఎప్పుడో బాగుపడిఉండేది.

అధికారమనే అహంకారంతో రాజకీయ నేతలు

  అధికారం ఉంటే ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనుకుంటున్నారు కొంతమంది నేతలు కానీ దానికి పర్యవసానంగా లేని పోని చిక్కుల్లో పడుతున్నారు. గత వారం రోజులలోనే ఇలాంటి ఘటనలు రెండు మూడు చూశాం. మొన్నటికి మొన్న కేంద్రమంత్రి రిజిజూ కోసం విమానాన్ని గంటసేపు నిలిపివేయడమే కాకుండా అతను ఎక్కడానికి ఖాళీ లేకపోతే అప్పటికే దానిలో కూర్చొని ఉన్న ఒక ఐఎఫ్ఎస్ అధికారి కుటుంబసభ్యలు ముగ్గురిని విమానం నుంచి దించేశారు. అయితే ఈ వ్యవహారం గురించి మాత్రం రిజిజూ తనకేం సంబంధంలేదని, ప్రయాణికులను దింపిన విషయం తెలియదని చెప్పి తప్పించుకున్నారు.     మరో ఉదంతం డీఎంకే నేత స్టాలిన్ ది.. ఈయన చైన్నై లో కొత్తగా ప్రారంభించిన మెట్రోరైలు ప్రారంభంలో పాల్గొన్నారు. అనంతరం మెట్రో రైల్లో ప్రయాణిస్తుండగా తన పక్కన ఉన్న ఒక ప్రయాణికడిని పక్కకి జరగమంటూ చెంప మీద ఒకటి కొట్టారు. ఈ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేసింది. దీంతో తేరుకున్న మన నేత తాను కావాలని కొట్టలేదని.. మహిళ ప్రయాణికురాలికి ఇబ్బంది కలిగిస్తున్నాడని అందుకే కొట్టానని చెప్పారు.     ఇది జమ్మూ కాశ్మీర్ ఆరోగ్య శాఖ మంత్రి చౌదరీ లాల్ సింగ్ గారి ఉందంతం.. ఈయన కూడా ఓ లేడి డాక్టర్ గారి కాలర్ సరిచేసి వార్తల్లోకి ఎక్కారు. దీంతో అక్కడి నెటిజన్లు మంత్రి చేసిన పనికి మండిపడి ఒక మహిళ అనుమతి లేకుండా తనను తాకడం పెద్ద నేరమంటూ మంత్రిగారిని తిట్టిపోస్తున్నారు.     ఇప్పుడు ఏకంగా ఒక మహిళను కౌగిలించుకొని తన పదవికే రాజీనామా చేయాల్సిన పరిస్థితి తెచ్చుకున్న మంత్రిగారి ఉదంతం.. నేపాల్ మంత్రి హరిప్రసాద్ పరాజులి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తూ వస్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం నేపాల్‌లో వరినాట్ల వేడుకలను వ్యవసాయశాఖ నిర్వహించడం ఆనవాయితీ. ఎప్పటి లాగే ఈ సంవత్సరం కూడా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన మంత్రిగారు అంతటితో ఆగకుండా అక్కడికి వచ్చిన ఓ మహిళను కౌగిలించుకొని సంచలనం సృష్టించారు. ఇంకేముంది మంత్రిగారు చేసిన ఈ నిర్వాకానికి ముందు ఎలా ఉన్నా ఒక్కసారి పదవి వచ్చిన తరువాత వారి దర్పాన్ని చూపించడానికి ప్రయత్నించి చివరికి పదవిపోయేలా చేసుకుంటారు. సామాజిక మాధ్యమాల్లో తివ్రమైన విమర్శలు వచ్చాయి. ఆఖరికి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.  

ఎసిబి కోర్టు చేతిలో ఫోరెన్సిక్ తుది నివేదిక

  ఓటుకి నోటు కేసులో ఎసిబి అధికారులు ఫోరెన్సిక్ సంస్థకు అందించిన ఆడియో వీడియో టేపులపై తుది నివేదికను ఆ సంస్థ అధికారులు నిన్న సాయంత్రం ఎసిబి కోర్టుకి సమర్పించారు. కనుక ఆ నివేదికను కోరుతూ ఎసిబి అధికారులు ఈరోజు కోర్టులో ఒక మెమో దాఖలు చేయనున్నారు. అది చేతికి అందిన తరువాత ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. కానీ తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తను ఈ కేసులో విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరయ్యేందుకు సిద్దమని ఎసిబి అధికారుఅలకు లేఖ వ్రాసినా వారు ఇంతవరకు స్పందించకపోవడం గమనిస్తే, వారు తదుపరి చర్యలు చేప్పట్టడానికి తొందరపడక పోవచ్చునని స్పష్టమవుతోంది. ఏమయినప్పటికీ ఇప్పుడు ఈ కేసు చాలా కీలక దశకు చేరుకోన్నట్లే భావించవచ్చును.

జగన్ కు మరో సాకు దొరికింది

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు ఇంకో సాకు దొరికింది. ఎప్పుడు తెదేపాను విమర్శిద్దామా అని చూసే జగన్ కు మొన్నటి వరకూ నోటుకు ఓటు కేసు గురించి తెగ హంగామా చేసి.. కేసీఆర్ కు మద్దతు పలకడంతో ఆంధ్రా నుండి వ్యతిరేకత రావడంతో అక్కడ తన ఉనికి తగ్గిపోతుందని భయపడి కొంచెం హడావిడి తగ్గించారు. తరువాత ఢిల్లీ ప్రయాణాలు, టూర్ లకు వెళ్లి తిరిగి వచ్చిన జగన్ ఏలా తెదేపా ను విమర్శించాలా అని బాగా ఆలోచించినట్టున్నారు. అందుకే ఇప్పుడు సడెన్ గా ధవళేశ్వరం లో జరిగిన ప్రమాదం గురించి మాట్లాడుతున్నారు. ధవళేశ్వరం ప్రమాదం జరిగిన కుంటుంబాలను పరామర్శించడానికి ఇప్పటి వరకూ చంద్రబాబు రాలేదని విమర్శించారు. అయినా ఏదో ఒక కారణంగా టీడీపీ ని విమర్శించాలని చూడటమే తప్ప అదే సహాయం జగన్ కూడా చేయోచ్చు కదా. బాధితుల కుంటుంబాలను తను పరామర్శించ వచ్చు కదా అని తెదేపా నేతలు అనుకుంటున్నారు.

అనాథలకు ఆపన్న హస్తం అందించిన లోకేశ్

తెదేపా పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త, పార్టీ యువనేత నారా లోకేశ్ ఇద్దరు అనాథ పిల్లలకు ఆపన్న హస్తం అందించారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పేరేపల్లె గ్రామానికి చెందిన శిరష, మణి అనే పిల్లలకు ఉచిత విద్య అందించడానికి ముందుకొచ్చారు. శిరష, మణిల తల్లిదండ్రుల మరణించడంతో వారు అనాథలయ్యారు. అయితే వారి తల్లిదండ్రులు తెలుగుదేశం పార్టీకోసం ఎంతో పాటుపడ్డారని ఓ కార్యకర్త లోకేశ్ కు మెయిల్ పంపడంతో వెంటనే స్పందించిన లోకేశ్ అనాథ పిల్లలు గురించి వారి తరపు బంధువులు గురించి వివరాలు తెలుసుకొని ఎన్టీఆర్ భవన్ కు పిలిపించారు. శిరిషకు ఎన్టీఆర్ మహిళా జూనియర్ కాలేజ్ లో, మణికి ఎన్టీఆర్ మోడల్ స్కూల్ లో ఉచిత విద్య అందించేలా పత్రాలు అందజేశారు.

డిఎస్ వల్ల ఒరిగేదమన్నా ఉందా

  పాపం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు మరీ దారుణంగా తయారైంది. రాష్ట్రాన్ని విడదీసి పాపం కట్టుకున్న ఒక్క కారణంగా దానికి శిక్ష అనుభవిస్తోంది. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి అసలు లేదు.. అసలు అధికారంలోకి వస్తుందో రాదో కూడా తెలియదు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే ఉంది అంతే. అప్పుడప్పుడు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నప్పుడు మాత్రమే అది కూడా గుర్తొస్తుంది. అందుకే పార్టీలోని నాయకులు చిన్నచిన్నగా పార్టీ మార్చే పనిలో పడ్డారు. ఇప్పటికే చాలామంది పార్టీ ఫిరాయించారు. ఆ జంపింగ్ లిస్టులో కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ కూడా చేరిపోయాడు. ఇప్పుడు డిఎస్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గులాబి రంగు పూసుకోనున్నారు. కాంగ్రెస్ లో అనేక పదవులు అనుభవించిన పీసీసీ బొత్స సత్యనారాయణ ఈ మధ్యనే వైకాపా తీర్ధం పుచ్చుకున్నారు. వాళ్లు మారారు నేను మారలేనా అని అనుకున్నారేమో డిఎస్ కూడా పార్టీ ఫిరాయించేశారు. పైగా తాను పదవులు కోసం కాదు పార్టీ మారింది.. బంగారు తెలంగాణ కోసం అని..మాటలు చెప్పడం. అంటే సంవత్సరం నుండి గుర్తుకురాని బంగారు తెలంగాణ ఇప్పుడు ఇంత సడెన్ గా ఎందుకు గుర్తొచ్చిందో డిఎస్ కి అని రాజకీయవర్గాలు అనుకుంటున్నాయి. పైగా ఇంకా గులాబీ నీళ్లు తాగకముందే అప్పుడే కేసీఆర్ ను పొగడటం మొదలుపెట్టేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా.. కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అప్పుడే భజన చేసేస్తున్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ తనకు అన్ని రకాలుగా తోడుండి 9 సార్లు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినా 3 సార్లు మాత్రమే గెలిచారు డిఎస్. కాంగ్రెస్ పార్టీ అంత సపోర్టు ఇచ్చినా నెగ్గుకురాలేని డిఎస్ ఇప్పుడు పార్టీ మారి టీఆర్ఎస్ లో చేరడం వల్ల టీఆర్ఎస్ కు ఎమన్నా ఉపయోగం ఉందా అంటే ఏమో అది కూడా లేదు. ఎందుకంటే తెలంగాణ లో టీఆర్ఎస్ కు ఇప్పటివరకైతే ఎలాంటి ఢోకా లేదు.. ఇప్పుడు డిఎస్ చేరడం వల్ల ఆపార్టీకి కొత్తగా ఒరిగేది కూడా ఏంలేదు. ఏదేమైనా పార్టీలో ఉన్నత పదవులు అనుభవించిన డీఎస్ కేవలం ఎమ్మెల్సీ పదవి దక్కలేదనే పార్టీ మారడం ఎంత మాత్రం సబబు కాదని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.

ఏసీబీకి సహకరిస్తా.. సండ్ర

నోటుకు ఓటు కేసుకు సంబంధించి విచారణలో పాల్గొనాలని తెలంగాణ ఏసీబీ అధికారులు సండ్ర వెంకట వీరయ్య నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తనకు ఆరోగ్యం బాలేదని పదిరోజులు గడువు కావాలని తరువాత విచారణలో పాల్గొంటానని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తనకు ఇచ్చిన గడువు ముగియడంతో సండ్ర ఏసీబీ అధికారులకు లేఖ రాశారు. తాను డిశ్చార్జయ్యానని.. ఇక నుండి ఖమ్మంలోని తన ఇంట్లోనే ఉంటానని.. ఎప్పుడు రమ్మన్నా విచారణకు వస్తానని లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ఏసీబీకి లేఖ రాసిన తరువాత తనను ఎవరూ కలవలేదని కూడా సండ్ర తెలిపారు. సండ్ర తోపాటు మరో టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డికి కూడా ఏసీబీ నోటీసులు జారీ చేయగా.. వేం అప్పుడే విచారణలో పాల్గొన్న సంగతి తెలిసిందే.