ఏపీ విద్యార్ధులను ఎక్కించుకోం.. టీఎస్ ఆర్టీసీ
posted on Jun 25, 2015 @ 4:35PM
తెలుగు రాష్ట్రాల మధ్య అప్పుడప్పుడు ఏదో చిన్న వివాదాలు ఉన్నా ఇప్పుడు ఈ నోటుకు ఓటు కేసు ద్వారా అవి మరింత ఎక్కువయ్యాయన్నది మాత్రం నిజమనిపిస్తోంది. ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి వివాదాలు తలెత్తుతున్నాయి. అసలే ఒకవైపు కేసు వల్ల వాదోపవాదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు పై ఇరు ప్రభుత్వాలు కొట్టుకుచస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న టెయిల్ పాండ్ వివాదం. మాదంటే మాదని ఇరు ప్రభుత్వాలు వితండవాదాలు చేసుకున్నాయి. టెయిల్ పాండ్ మా అంతర్బాగంలో ఉంది కాబట్టి మాకు చెందుతుందని ఒక ప్రభుత్వం అంటే.. దాని నిర్మాణ వ్యయానికి అయిన ఖర్చు మా ప్రభుత్వ ఖాతాలో వేశారు కాబట్టి మాదని మరోక ప్రభుత్వం వాదిస్తోంది. ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు మరో వివాదం షెడ్యూల్ 10పై రగడ మొదలైంది. ఈ నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో ఆర్టీసీ రచ్చ ఆరంభమైంది. టీఎస్ఆర్టీసీలో ఏపీఎస్ బస్సు పాస్ లు చెల్లవని.. కొందరు ఆర్టీసీ సిబ్బంది ఏపీ విద్యార్ధులను బస్సులో ఎక్కించుకునేందుకు నిరాకరించారు. దీంతో కృష్ణా జిల్లా నందిగామ రామిరెడ్డిపల్లె వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగి తెలంగాణ బస్సులను అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు రంగలోకి దిగాల్సివచ్చింది. ఆంధ్రా నుండి తెలంగాణ వెళ్లే బస్సుల్లో విద్యార్ధులను ఎక్కించుకన్నప్పుడు.. తెలంగాణ నుండి ఆంధ్రా వెళ్లే బస్సుల్లో ఎందుకు ఎక్కించుకోరని.. ఎక్కించుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. అటు తెలంగాణలోనూ.. ఇటు ఆంధ్రాలోనూ రెండు వైపులా పాస్ లు చెల్లేలా చర్యలు తీసుకోవాలని పట్టుబట్టడంతో ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు టీఎస్ అర్టీసీ అధికారులతో సమావేశమయ్యారు. మొత్తానికి రోజు రోజుకి రెండు రాష్ట్రాల మధ్య దూరం పెరుగుతుందనడానికి ఈ వివాదాలే నిదర్మనమని తెలుస్తోంది.