నేటి నుండి విశాఖ, తూ.గో.జిల్లాలలో జగన్ ఓదార్పు యాత్ర

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేటి నుండి మూడు రోజుల పాటు విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలలో ఓదార్పు యాత్ర చేస్తారు. కానీ ఈయాత్ర తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చడానికి కాదు. వివిధ ప్రమాదాలలో మరణించిన వారి కుటుంబాలను ఓదార్చుతారు.   ఆయన ఈరోజు ఉదయం 11.30 గంటలకి విశాఖకు వస్తారు. అక్కడి నుండి అచ్యుతాపురం వెళ్తారు. అక్కడ ధవళేశ్వరం బ్యారేజి వద్ద ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు. ఈ మూడు రోజులలో ఓదార్పు యాత్రలో తూర్పు గోదావరి జిల్లాలో పెరుమల్లాపురం, హుకుంపేట గ్రామాలలో చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతయిన మత్స్యకారుల కుటుంబాలను, ఆ తరువాత కొత్తపట్నం, రామన్నపాలెం, పరాడపేట, ఉప్పలంక, పగడాలపేట గ్రామాలలో మత్య్సకార కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం రంపచోడవరంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన 9మందికి చెందిన కుటుంబాలను పరామర్శిస్తారు. జూలై 4న గోపాలపురం నియోజకవర్గంలోని దేవరాపల్లి పొగాకు రైతులతో సమావేశమవుతారు.అదే రోజు సాయంత్రం తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతారు.

నేటి నుండి గోదావరి నిత్య హారతి

  కాశీ పుణ్యక్షేత్రంలో రోజూ సాయంత్రం జరిగే గంగా (నది) హారతిని చూసి తరించేందుకు దేశంలో నలుమూలల నుండి ప్రజలు తరలి వస్తుంటారు. ఆ ప్రేరణతోనే ఆంధ్రులకు పరమ పవిత్రమయిన గోదావరి నదికి నిత్య హారతి కార్యక్రమాన్ని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈరోజు సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పు గోదావారి జిల్లా రాజమండ్రిలో పుష్కర్ ఘాట్ వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపముఖ్యమంత్రి చిన్న రాజప్ప, మంత్రులు దేవేనేని ఉమామహేశ్వర రావు, పి. సుజాత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.వై. ఆర్. కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, రాజమండ్రి యం.పి. మురళీ మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

లేడి డాక్టర్ కాలర్ సరిచేసిన మంత్రి

బీజేపీ నేత, జమ్మూ కాశ్మీర్ ఆరోగ్య శాఖ మంత్రి చౌదరీ లాల్ సింగ్ ఓ మహిళా వైద్యురాలి కాలర్ సరిచేసి వార్తల్లో కెక్కారు. ఆయన వైద్యురాలి కాలర్ సరి చేసిన ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. వివరాల ప్రకారం.. అమరనాథ్ యాత్ర ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా మంత్రి చౌదరీ లాల్ సింగ్ లఖన్‌పూర్ ప్రభుత్వాసుప్రతిని సందర్శించారు. అయితే అక్కడ ఉన్న ఓ మహిళా వైద్యురాలు కాలర్ సరిగా పెట్టుకోలేదు. దీన్ని గమనించిన మంత్రి 'బైటియా నువ్వు కాలర్ సరిగా పెట్టుకోలేదు' అంటూ తన చేత్తో కాలర్ ను స్వయంగా సరిచేశారు. ఇదంతా గమనించిన మరో మహిళా డాక్టర్ మళ్లీ తన కాలర్ ఎక్కడ సరిచేస్తారు అని అనుకుందో ఏమో తనంతట తానే కాలర్‌ను సరి చేసుకుంది. అయితే ఇప్పుడు మంత్రి గారు చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక మహిళ అనుమతి లేకుండా తనను తాకడం పెద్ద నేరమంటూ మంత్రిగారిని తిట్టిపోస్తున్నారు.

ఎవరూ పార్టీ వీడట్లేదు.. ఉత్తమ్

ఒకవైపు తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టికి రాజీనామా చేశారని.. త్వరలో టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకుంటున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కానీ అలాంటిది ఏం లేదని.. కాంగ్రెస్ పార్టీని ఎవరూ వీడటం లేదని.. డీఎస్ లాంటి సీనియర్ నేతలు కాంగ్రెస్‌ను వీడరని అని బుధవారం మీడియాతో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. అయితే డీఎస్ కూడా సీఎం కేసీఆర్ ను కలిశారు.. కానీ తాను కూడా కేసీఆర్ కు ఆరోగ్యం బాలేదని అందుకే కలిశానని చెప్పారు కానీ పార్టీ మార్పు పై క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలవల్ల ఇప్పుడు అందరూ సందిగ్ధంలో పడ్డారు.

5 గంటల తరువాత రేవంత్ విడుదుల

ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి బెయిల్‌ ఆర్డర్‌ కు లైన్ క్లియర్ అయింది. హైకోర్టు రేవంత్ కు నిన్ననే బెయిల్ మంజూరు చేసిన తీర్పు ప్రతిలో సాంకేతిక లోపం కారణంగా రేవంత్ ఇంకా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. అయితే కోర్టు ఇప్పుడు ఆ సందిగ్ధతను తొలగించింది. నిన్న తీర్పు ప్రతిలో బెయిల్‌ పేపర్స్‌ను ఏసీబీ పోలీస్‌ స్టేషన్‌లో సమర్పించాలని రాసి ఉంది. అయితే దానిపై రేవంత్‌ తరఫు న్యాయవాదులు బెయిల్‌ పేపర్స్‌ను ఏసీబీ కోర్టులో సమర్పించే విధంగా ఆర్డర్స్‌ సవరించాలని బుధవారం పిటిషన్‌ వేశారు. దీంతో న్యాయమూర్తి బెయిల్‌ ఆర్డర్‌లో మార్పులు చేశారు. న్యాయమూర్తి సవరించిన బెయిల్ ఆర్డర్ కాపీని రేవంత్‌ తరఫు న్యాయవాదులు తీసుకొని దానిని ఏసీబీ కోర్టులో సమర్పించారు. అనంతరం ఏసీబీ కోర్టు నుంచి రిలీవ్‌ ఆర్డర్స్‌ తీసుకుని చర్లపల్లి జైలుకు వెళ్లనున్నారు. మొత్తానికి ఐదు గంటల తర్వాతే రేవంత్‌ రెడ్డి జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా.. సండ్ర

నోటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు తెదేపా నేతలు వేం నరేందర్ రెడ్డికి, సండ్ర వెంకట వీరయ్యలకు కూడా విచారణలో పాల్గొనాలని నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసింది. అయితే అప్పుడు వేం నరేంద్ర రెడ్డి మాత్రమే ఏసీబీ విచారణలో పాల్గొన్నారు. సండ్ర తనకు గుండె సంబంధిత సమస్య ఉందని పదిరోజుల తరువాత విచారణలో పాల్గొంటానని ఏసీబీకి లేఖ రాశారు. కానీ ఆ పదిరోజుల గడువు ఎప్పుడో ముగిసింది. ఈ నేపథ్యంలో సండ్ర ఎక్కడ ఉన్నాడని పలు ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు సండ్ర ఏసీబీకి మరో లేఖ రాశారు. తాను ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యానని.. ఎప్పుడు విచారణకు రమ్మంటే అప్పుడు రావడానికి సిద్దంగా ఉన్నానని లేఖలో పేర్కొన్నారు.

కేసీఆర్ కు ఏం జ్వరం వచ్చిందో.. జూపుడి

టీడీపీ నేత జూపూడి ప్రభాకరరావు తెలంగాణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కావాలనే జ్వరం అని చెప్పి కేసీఆర్ రాష్ట్రపతితో సమావేశాన్ని తిరస్కరించారని.. ఇద్దరు సీఎంలతో రాష్ట్రపతి సమావేశమైతే కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయని భావించామని.. కానీ తెలంగాణ ప్రభుత్వం దానికి సహకరించలేదని ఎద్దేవ చేశారు. కేసీఆర్‌కు ఏ జ్వరం రాలేదని విమర్శించారు. చంద్రబాబు కేసీఆర్ లా కాదని.. చంద్రబాబుకు దూర దృష్టి ఎక్కువని చిన్న చిన్న సమస్యలు ఉంటే మాట్లాడుకుంటే పరిష్కారమవుతాయని చెప్పారని జూపుడి అన్నారు. కానీ తెలంగాణ వైఖరి చూస్తే రెడ్డగొట్టే విధానాలే కనిపిస్తున్నాయని అన్నారు. మనం సమాఖ్య వ్యవస్థలో ఉన్నామని, సీఎం కేసీఆర్‌ తన భాషను మార్చుకోవాలని జూపూడి కోరారు.

కాంగ్రెస్ నాయకుల పార్టీల జంప్

రాష్ట్రం విడిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఆనవాలు కూడా సరిగా కనపడకుండా పోయింది. అటు తెలంగాణలోనూ ఏదో ఉంది అంటే ఉంది అనే పరిస్థితి వచ్చింది. ఇక ఆంధ్రాలో అయితే చెప్పనవసరంలేదు.. మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే అది దేవుడికే తెలియాలి. అందుకే పార్టీ లో ఉన్న నాయకులు కూడా చిన్నచిన్నగా వేరే పార్టీల గూటికి చేరుకుంటున్నారు. ఈ పార్టీలో ఉండి ఒట్టిగా ఖాళీగా ఉండటం కంటే వేరే పార్టీలోకి చేరితే కనీసం ఏదో ఒక పదవి ఇవ్వకపోతారా అని ఆ రూట్ లో వెళుతున్నట్టున్నారు. మొన్నటికి మొన్న పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. అసలు ఎప్పుడో వెళ్లాల్సింది కానీ కొన్ని బేరసారాలు కుదరక లేట్ అయింది. కానీ మొత్తానికి పార్టీ వీడారు.   ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాను కూడా పార్టీని వీడి టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకుంటున్నట్టు రాజకీయవర్గాలు అనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వెళ్లి కేసీఆర్ ను కలిసి సమావేశమయినట్టు తెలుస్తోంది. అసలు ఎప్పటినుంచో తనకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని కాంగ్రెస్ పై డీ.ఎస్ అసంతృప్తితో ఉన్నారు. దానికి తోడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా డీఎస్ కు నిరాశే ఎదురైంది. ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నించినా ఆ అవకాశం వేరే వాళ్లకు ఇవ్వడంతో మనస్తాపానికి గురై పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే డిఎస్ ను పార్టీలోనే ఉంచేందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు బాగానే కష్టపడ్డారు కానీ అసలే కాంగ్రెస్ పార్టీ మీద ఫుల్లు ఫైర్ మీద ఉన్న డిఎస్ మాత్రం పార్టీ మారాలనే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 6 న గులాబీ గూటికి చేరనున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ కు చెందిన మరో నేత కూడా డిఎస్ బాటలోనే టీఆర్ఎస్ లో చేరనున్నారట. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో తమకు భవిష్యత్ ఉండదని ముందే తెలుసుకుంటున్నారేమో నేతలు పాపం ఒక్కోక్కరుగా పార్టీ నుండి బయటకు వచ్చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్ ఎంటో కాలమే నిర్ణయించాలి..

కేసీఆర్ ని అందుకోసం కలవలేదు: డి.శ్రీనివాస్

  సమైక్యాంధ్ర ప్రదేశ్ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఈరోజు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆయన చాంబర్ లో కలిసిరావడంతో ఆయన పార్టీ మారుతారన్న వార్తలకు బలం చేకూరింది. కానీ తను అందుకోసం కేసీఆర్ ని కలవలేదని ఆయనకు జ్వరంగా ఉందని తెలిసి పరామర్శించడానికే వెళ్లానని సంజాయిషీ ఇచ్చుకొన్నారు. కానీ తమ ప్రత్యర్ధ పార్టీ అధ్యక్షుడికి జ్వరం వస్తే ఇతర పార్టీల నేతలెవరూ వెళ్లి పరామర్శించరని అందరికీ తెలుసు. కనుక ఇక ఆయన తెరాసలో చేరడం దాదాపు ఖరారు చేసినట్లే భావించవచ్చును. ఆయన ఈనెల 6వ తేదీన తెరాస అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరుతారని తాజా సమాచారం.

తమిళనాడుకు.. ఏపీకి ఉమ్మడి రాజధాని ఉందా? ప్రత్తిపాటి

తమిళనాడు పోలీసుల్ని ఏపీలో అనుమతిస్తారా? అని ఒక రిటైర్డ్ జడ్జి చేసిన వ్యాఖ్యలపై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి పత్రిపాటి పుల్లారావు మండిపడ్డారు. రెండు రాష్ట్రాల రాజధాని అయిన హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు అవసరమా? లేదా? అనే విషయం ఆయనకు తెలియదా? న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తికి ఈమాత్రం తెలియదా? అని ప్రశ్నించారు. తమిళనాడు పోలీసుల్ని ఏపీలో అనుమతిస్తారా అని అడుగుతున్నారు.. తమిళనాడు, ఏపీ కి ఉమ్మడి రాజధాని లేదని.. ఒకవేళ ఉంటే అనుమతిస్తామని అన్నారు. ఏపీకీ, తెలంగాణకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టి తెలంగాణ తో పాటు ఏపీకి కూడా సమాన హక్కులు ఉంటాయని.. అందుకే హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని కోరుతున్నామని అన్నారు. ఈ విషయంపై గవర్నర్ వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.

బెయిల్ దొరికినా విడుదలకు జాప్యం

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి హైకోర్టు నిన్నబైయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్ కి బెయిల్ దొరికినా జైలు నుండి విడుదలవడానికి మాత్రం జాప్యం జరుగుతుంది. నిజానికి నిన్న రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చిన తరువాత వెంటనే జైలు నుండి విడుదలవుతారని అటు కుటుంబసభ్యులు, ఇటు అభిమానులు, తెదేపా పార్టీ శ్రేణులు ఎదురుచూశారు కానీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులలో లోపం ఉండటం వల్ల నిన్న కూడా రేవంత్ రెడ్డి జైలులోనే ఉండాల్సివచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిలో రేవంత్ రెడ్డి వ్యక్తిగత పూచీకత్తుని ఎసిబి కోర్టుకి ఇవ్వాలని వ్రాయవలసి ఉండగా, ఎసిబికి ఇవ్వాలని ఉండటంతో కోర్టు దానిని తిరస్కరించింది. ఈ కారణంగా రేవంత్ రెడ్డి నిన్న కూడా జైలులోనే ఉండాల్సి వచ్చింది. మరోవైపు ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి విడుదలకు జాప్యం అవుతుందనే అనుమానాలు తలెత్తున్నాయి. ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో పూచికత్తు సమర్పించడం లో సమస్య వస్తుందా?వారు అంగీకరించకపోతే, ఒకవేళ అంగీకరించినా, ఆలస్యం చేస్తే రేవంత్ విడుదల జాప్యం అవుతుందన్న అనుమానం ఉంది. దీంతో రేవంత్ ఈ రోజు సాయంత్రానికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి తనకు బెయిల్ వచ్చిన తరువాత జైలులో ఉన్నప్పుడు తాను ఉపయోగించిన వస్తువులన్నింటిని తోటి ఖైదీలకు ఇచ్చేశారంట. కానీ మంగళవారం రాత్రి కూడా అక్కడే ఉండాల్సి రావడంతో వాటిని తీసుకున్నవారు మళ్లీ తెచ్చిచ్చినట్లు సమాచారం.

తెదేపా యం.పిపై ముఖ్యమంత్రి ఆగ్రహం

  భారత సైనికులపై అమలాపురం తెదేపా యం.పి. రవీంద్ర బాబు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మాజీ సైనికోద్యోగులు ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుతూ ఆందోళన చేప్పట్టారు. వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పిర్యాదు చేయడంతో ఆయన కూడా యం.పి.పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా సంజాయిషీ నోటీసు కూడా జారీ చేయించినట్లు సమాచారం. భారత ఆర్మీలో చేరితే మద్యం, మాంసం, ఉచిత ప్రయాణాలు వంటి సౌకర్యాలు లభిస్తాయనే ఉద్దేశ్యంతోనే యువకులు ఆర్మీలో చేరుతున్నారని రవీంద్ర బాబు వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు నాయుడు మాజీ సైనికులతో మాట్లాడుతూ భారతదేశాన్ని కాపాడేందుకు ప్రాణాలొడ్డి కాపలా కాస్తున్న సైనికులంటే తమ పార్టీకి చాలా గౌరవమని అన్నారు.

కేసీఆర్ కి అప్పుడే జ్వరం వచ్చేసిందా? లోకేష్ ప్రశ్న

  తెదేపా యువనేత నారా లోకేష్ మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పై చాలా ఘాటయిన వ్యాఖ్యలు చేసారు. “ఏదయినా తెగే వరకు లాగకూడదు. కానీ ఒకవేళ మాకు నోటీసులు ఇవ్వాలని తెలంగాణా ప్రభుత్వం అంతగా ఉబాలాటపడుతుంటే మేమూ కాదనము. మాకు నోటీసులు ఇస్తే మా నెత్తిన పాలు పోసినట్లే భావిస్తాము. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మెడకి ఉచ్చు బిగుసుకొంటుంటే దానితో సంబంధం ఉన్న ఉన్నతాధికారులను తెలంగాణా ప్రభుత్వం ఒకరొకరిగా మార్చేస్తోంది లేదా దీర్ఘ కాలిక శలవు మీద పంపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ తో తమకు సంబంధం లేదనుకొంటే తెలంగాణా హోంశాఖ కార్యదర్శిని ఇంత అకస్మాత్తుగా మార్చడం ఎందుకు? రేవంత్ రెడ్డి కేసును చూస్తున్న ఇంటెలిజన్స్‌ చీఫ్‌ అకస్మాత్తుగా దీర్ఘాకాలిక సెలవుపై ఎందుకు వెళ్లారు?” అని లోకేష్ ప్రశ్నించారు.   “చంద్రబాబు నాయుడుకి ఎదురు పడలేకనే కేసీఆర్ జ్వరం సాకుతో గవర్నర్ ఇచ్చిన విందుకు మొకం చాటేశారు. ఇన్ని రోజులు బాగానే ఉన్న కేసీఆర్ కి అకస్మాత్తుగా జ్వరం వచ్చేసింది,” అని లోకేష్ ఎద్దేవా చేసారు.   “తెలంగాణా రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమల స్థాపించేందుకు నూతన పారిశ్రామిక విధానం ప్రవేశపెట్టామని గొప్పలు చెప్పుకొంటున్న తెలంగాణా ప్రభుత్వం ఎప్పటి నుండో తెలంగాణాలో ఉండి వేల కోట్ల టర్నోవర్ చేస్తున్న హెరిటేజ్ సంస్థని తెలంగాణా నుండి వెళ్ళగొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే కేసీఆర్‌ వైఖరిని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు,” అని లోకేష్ విమర్శించారు.

గవర్నర్ విందుకి కేసీఆర్ డుమ్మా?

  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్ధం గవర్నర్ నరసింహన్ మంగళవారం సాయంత్రం రాజ్ భవన్ లో విందు ఏర్పాటు చేసారు. దానికి ఆంద్ర, తెలంగాణా ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు, ఇరు రాష్ట్రాల శాసనసభాపతులను, ఉన్నతాధికారులను ఆహ్వానించారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు ఈ విదుకు హాజరయ్యారు. కానీ తెలంగాణా ముఖ్యమంత్రి జ్వరంతో బాధపడుతున్నందున ఈ విందుకు హాజరు కాలేకపోయారు. ఈ విందులో రాష్ట్రపతి మరియు గవర్నర్ సమక్షంలో ముఖ్యమంత్రులిరువురూ ఎదురుపడినప్పుడు ఏవిధంగా వ్యవహరిస్తారో చూద్దామని ఆశపడిన వాళ్ళందరూ చాలా నిరాశ చెందారు.

అరుకు యంపీ కొత్తపల్లి గీతపై సీబీఐ కేసు

  విశాఖ జిల్లా అరుకు యంపీ కొత్తపల్లి గీతపై సీబీఐ ఈరోజు చార్జ్ షీట్ దాఖలు చేసింది. తప్పుడు ధ్రువ పత్రాలతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి రూ. 42 కోట్ల రూపాయాలు అక్రమంగా తీసుకొన్నారని బ్యాంక్ అధికారులు చేసిన పిర్యాదు మేరకు సీబీఐ దర్యాప్తు చేసి ఆమెపై ఐపీసీ 120, 420, 458,421, 13(2), రెడ్ విత్ 1(సి) సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఆమెతో బాటు ఆమెకు సహకరించిన బ్యాంక్ అధికారులపైన, విశ్వేశావరా ఇన్ఫ్రా అనే సంస్థ మీద కూడా సీబీఐ కేసులు నమోదు చేసిందీ రోజు. ఆమెను ఈ కేసు విషయంలో ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు ఆమెకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.   ఆమె వైకాపా టికెట్ మీద అరుకు నుండి లోక్ సభకు పోటీ చేసి గెలిచారు. కానీ ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాల కారణంగా ఆమె పార్టీకి దూరమయ్యారు. ఆమె తెదేపాలో చేరాలనుకొన్నారు. కానీ దాని వలన ప్రతిపక్ష పార్టీల నుండి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందనే ఆలోచనతో ఆమెను ఇంతవరకు పార్టీలో చేర్చుకోలేదు. కానీ ఆమె తెదేపాతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు.

రేవంత్ రెడ్డి బెయిలుకి సాంకేతిక అవరోధం

  ఈరోజు (మంగళవారం) హైకోర్టు రేవంత్ రెడ్డి తదితరులకు బెయిలు మంజూరు చేసినప్పటికీ కోర్టు తీర్పుని టైపింగ్ చేయడంలో దొర్లిన చిన్న పొరపాటు వలన ఈరోజు జైలు నుండి విడుదల కాలేకపోయారు. తీర్పు ప్రతిలో రేవంత్ రెడ్డి వ్యక్తిగత పూచీకత్తుని ఎసిబి కోర్టుకి ఇవ్వాలని వ్రాయవలసి ఉండగా, ఎసిబికి ఇవ్వాలని టైప్ చేయడంతో ఎసిబి కోర్టు దానిని తిరస్కరించింది. కనుక రేవంత్ రెడ్డి లాయర్లు రేపు హైకోర్టులో మరొక మేమో సమర్పించి సవరణ కోరుతారు. సవరించిన తీర్పు ప్రతిని ఎసిబి కోర్టుకి సమర్పించిన తరువాత, రేవంత్ రెడ్డి తదితరులను జైలు నుండి విడుదల చేయమని ఎసిబి కోర్టు ఉత్తర్వులు ఇస్తుంది. అది జైలు అధికారులకు చేరిన తరువాత వారిని జైలు నుండి విడుదల చేస్తారు. బహుశః రేపు మధ్యహ్నంలోగా ఈ ప్రక్రియలన్నీ పూర్తయితే మధ్యాహ్నం 1-2 గంటలలోగా రేవంత్ రెడ్డి, సెబాస్టియన్ మరియు ఉదయ్ సింహాలను జైలు నుండి విడుదల కావచ్చును. ఈరోజు ఆయన జైలు నుండి విడుదల అవుతున్నారని ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు కొందరు సన్నిహిత బంధువులు చర్లపల్లి జైలు వద్దకి భారీ సంఖ్యలో తరలి వచ్చారు. కానీ ఆయన రేపు విడుదలవుతారని తెలిసి తీవ్ర నిరాశతో వెనుతిరిగారు.