డిఎస్ వల్ల ఒరిగేదమన్నా ఉందా

  పాపం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు మరీ దారుణంగా తయారైంది. రాష్ట్రాన్ని విడదీసి పాపం కట్టుకున్న ఒక్క కారణంగా దానికి శిక్ష అనుభవిస్తోంది. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి అసలు లేదు.. అసలు అధికారంలోకి వస్తుందో రాదో కూడా తెలియదు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే ఉంది అంతే. అప్పుడప్పుడు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నప్పుడు మాత్రమే అది కూడా గుర్తొస్తుంది. అందుకే పార్టీలోని నాయకులు చిన్నచిన్నగా పార్టీ మార్చే పనిలో పడ్డారు. ఇప్పటికే చాలామంది పార్టీ ఫిరాయించారు. ఆ జంపింగ్ లిస్టులో కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ కూడా చేరిపోయాడు. ఇప్పుడు డిఎస్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గులాబి రంగు పూసుకోనున్నారు. కాంగ్రెస్ లో అనేక పదవులు అనుభవించిన పీసీసీ బొత్స సత్యనారాయణ ఈ మధ్యనే వైకాపా తీర్ధం పుచ్చుకున్నారు. వాళ్లు మారారు నేను మారలేనా అని అనుకున్నారేమో డిఎస్ కూడా పార్టీ ఫిరాయించేశారు. పైగా తాను పదవులు కోసం కాదు పార్టీ మారింది.. బంగారు తెలంగాణ కోసం అని..మాటలు చెప్పడం. అంటే సంవత్సరం నుండి గుర్తుకురాని బంగారు తెలంగాణ ఇప్పుడు ఇంత సడెన్ గా ఎందుకు గుర్తొచ్చిందో డిఎస్ కి అని రాజకీయవర్గాలు అనుకుంటున్నాయి. పైగా ఇంకా గులాబీ నీళ్లు తాగకముందే అప్పుడే కేసీఆర్ ను పొగడటం మొదలుపెట్టేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా.. కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అప్పుడే భజన చేసేస్తున్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ తనకు అన్ని రకాలుగా తోడుండి 9 సార్లు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినా 3 సార్లు మాత్రమే గెలిచారు డిఎస్. కాంగ్రెస్ పార్టీ అంత సపోర్టు ఇచ్చినా నెగ్గుకురాలేని డిఎస్ ఇప్పుడు పార్టీ మారి టీఆర్ఎస్ లో చేరడం వల్ల టీఆర్ఎస్ కు ఎమన్నా ఉపయోగం ఉందా అంటే ఏమో అది కూడా లేదు. ఎందుకంటే తెలంగాణ లో టీఆర్ఎస్ కు ఇప్పటివరకైతే ఎలాంటి ఢోకా లేదు.. ఇప్పుడు డిఎస్ చేరడం వల్ల ఆపార్టీకి కొత్తగా ఒరిగేది కూడా ఏంలేదు. ఏదేమైనా పార్టీలో ఉన్నత పదవులు అనుభవించిన డీఎస్ కేవలం ఎమ్మెల్సీ పదవి దక్కలేదనే పార్టీ మారడం ఎంత మాత్రం సబబు కాదని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.

ఏసీబీకి సహకరిస్తా.. సండ్ర

నోటుకు ఓటు కేసుకు సంబంధించి విచారణలో పాల్గొనాలని తెలంగాణ ఏసీబీ అధికారులు సండ్ర వెంకట వీరయ్య నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తనకు ఆరోగ్యం బాలేదని పదిరోజులు గడువు కావాలని తరువాత విచారణలో పాల్గొంటానని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తనకు ఇచ్చిన గడువు ముగియడంతో సండ్ర ఏసీబీ అధికారులకు లేఖ రాశారు. తాను డిశ్చార్జయ్యానని.. ఇక నుండి ఖమ్మంలోని తన ఇంట్లోనే ఉంటానని.. ఎప్పుడు రమ్మన్నా విచారణకు వస్తానని లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ఏసీబీకి లేఖ రాసిన తరువాత తనను ఎవరూ కలవలేదని కూడా సండ్ర తెలిపారు. సండ్ర తోపాటు మరో టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డికి కూడా ఏసీబీ నోటీసులు జారీ చేయగా.. వేం అప్పుడే విచారణలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ లోనే నెగ్గుకు రాలేనివాడు తెరాసలో నెగ్గగలడా?

  మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఇంతకాలం తనకు ఎంతో గౌరవం, సమాజంలో ప్రత్యేక గుర్తింపునిచ్చిన కాంగ్రెస్ కండువాను పక్కన పడేసి తెరాస కండువా కప్పుకోవడానికి సిద్దమయిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకి తొమ్మిదిసార్లు ఎన్నికలలో పోటీకి అవకాశం ఇస్తే కేవలం మూడు సార్లే గెలిచారని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. గత పదేళ్లుగా కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నప్పుడే ఆయనకు పార్టీ అన్ని అవకాశాలు కల్పించినా ఆయన వాటిని వినియోగించుకొని తన సత్తా నిరూపించుకోలేక చతికిలపడ్డారు. అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీ తనకు తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదని అందుకే పార్టీని వీడుతున్నానని చెప్పడం హాస్యాస్పదం.   అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని తన సత్తాని నిరూపించుకోలేకపోయిన డి.శ్రీనివాస్ తెరాసలో చేరినెగ్గుకు రాగలరా? ఆయన చేరికతో తెరాస ఏమయినా బలపడుతుందా? అంటే రాజకీయ దురందరుడయిన కేసీఆర్ అటువంటి వెర్రి భ్రమలో ఉంటారని అనుకోలేము. డి.శ్రీనివాస్ వంటి సీనియర్ నేతలకు మంచి పదవులు ఆఫర్ చేసి ఏదోవిధంగా తెరాసలోకి ఆకర్షించగలిగితే అది చూసి కాంగ్రెస్, తెదేపా పార్టీలలో సీనియర్, జూనియర్ నేతలు కూడా తెరాసలో చేరేందుకు సిద్దపడతారని కేసీఆర్ భావిస్తుండవచ్చును. ఆ విధంగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలను బలహీనపరచాలనేది ఆయన వ్యూహం కావచ్చును. కానీ పార్టీలోకి కొత్తగా వచ్చిన అటువంటి వ్యక్తి కోసం పార్టీని నమ్ముకొన్న వారిని పక్కనబెట్టి ఆయనకు రాజ్యసభ సీటో లేక ఎమ్మెల్సీ సీటో కట్టబెడితే పార్టీలో అసంతృప్తి మొదలవదా? మొదలయితే ఆ సమస్యని ఏవిధంగా ఎదుర్కోవాలి? అనే ప్రశ్నలకు వలసలను ప్రోత్సహిస్తున్న తెరాస అధ్యక్షుడు కేసేఆరే సమాధానం కనుగొనవలసి ఉంటుంది.

కేసీఆర్ ను తిట్లతో ఏకిపారేసిన రేవంత్

ఓటుకు నోటు కేసులో బెయిల్ మీద విడుదలైన రేవంత్ రెడ్డి కేసీఆర్ పై ఫుల్లు ఫైర్ మీద ఉన్నట్టు నిన్న ఆయన ప్రసంగం వింటేనే తెలుస్తోంది. ఆయన చేసిన ప్రసంగంలో సీఎం కేసీఆర్ తోపాటు కేటీఆర్ ను, హరీశ్ రావు, పార్టీ నేతలందర్ని కలిపి తిట్లతో ఏకిపారేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేసి తన కుటుంబానికే పదవులు కట్టబెట్టి కుటుంబ పరిపాలన చేస్తున్న కేసీఆర్ ను ప్రశ్నించినందుకే ఈ కేసులో ఇరికించారని అన్నారు. "ఈ కేసులో నన్ను ఇరికించడం వల్ల ఇప్పుడున్న దానికంటే ఎక్కువ పేరొచ్చిందని.. కానీ కేసీఆర్ కు నేను బయటకు రావడం వల్ల జ్వరం వచ్చిందని" రేవంత్ ఎద్దేవ చేశారు. ఇకనుండి కేసీఆర్ ను గద్దె దించడం కోసమే పనిచేస్తానని.. కేసీఆర్ కు రాజకీయ జీవితం లేకుండా చేస్తానని అన్నారు. కేసీఆర్ కనుక తెలంగాణ ముద్దుబిడ్డ అయితే.. కేసీఆర్ లో ప్రవహించేది తెలంగాణ రక్తం అయితే ఇతర పార్టీలో నుంచి తమ పార్టీలోకి చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ పోటీ చేయించమని.. వాళ్లు కనుక గెలిస్తే తన ముక్కును నేలకు రాసుకుంటానని మీసం మెలేస్తూ.. తొడ గొడుతూ మరీ సవాళ్లు మీద సవాళ్లు విసిరారు. కేసీఆర్ నే కాదు మేనల్లుడు హరీశ్ రావును పై కూడా తిట్ల వర్షం కురిపించారు. హరీశ్ రావుకు మెదడు మోకాళ్లలో ఉందని.. మామ చేసిన బ్రోకర్ దందాలు ఆయనకు తెలియవా? అని ప్రశ్నించారు.   తెలంగాణలో తెదేపాని దెబ్బతీయాలని ఈ రకంగా కుట్రలు చేశారని.. తెలంగాణలో టీడీపీ జెండాని టచ్ చేసే మగాడే లేడని ఉండే రండి చూసుకుందాం అని సవాల్ విసిరారు. తెలంగాణ టీడీపీలో పవర్ ఫుల్ లీడర్ రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపన్ని ఈకేసులో ఇరికించారు. ఇప్పుడు బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి ఊరికే ఉంటాడా.. అసలే ఎంతోకొంత రేవంత్ రెడ్డి అంటే అటు కేసీఆర్ కైనా ఇటు మిగతా నాయకులకైన కొంచెం భయమనే చెప్పుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీ గట్టిగా మాట్లాడే వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి కాబట్టి. మొత్తానికి దెబ్బ తిన్న పులిలా ఉన్న రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నేతలపై తన దెబ్బని చూపే వరకూ నిద్రపోయేలా లేరనిపిస్తుంది.

పుష్కరాలకు రండి.. సెల్ఫీలు పెట్టండి.. చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్ లో గోదావరి నిత్యహారతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి పుష్కరాలు తెలుగు ప్రజలకు చాలా ముఖ్యమైనవని, ఇది గోదావరి ప్రాంతానికి మాత్రమే చెందినవి కావని.. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికి చెందినవని అన్నారు. ఇకనుండి ప్రతిరోజు గోదావరి హారతిని నిర్వహిస్తామని అన్నారు. ఇంకా గోదావరి పుష్కరాలు 13 రోజుల్లో ప్రారంభమవుతాయని.. కుంభమేళా కన్నా గొప్పగా గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని అన్నారు. అంతేకాదు గోదావరి పుష్కరాలు కుటుంబ సభ్యులతో వచ్చి పుణ్యస్నానాలు చేసి సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో ఉంచాలని, దీనికోసం ఒక వేదికను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. పుష్కరాలకు వచ్చిన వాళ్లు కూడా చెత్తాచెదారం ఎలా పడితే అలా పడేయకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెత్తకుండీలలో వేయాలని సూచించారు.

నేటి నుండి విశాఖ, తూ.గో.జిల్లాలలో జగన్ ఓదార్పు యాత్ర

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేటి నుండి మూడు రోజుల పాటు విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలలో ఓదార్పు యాత్ర చేస్తారు. కానీ ఈయాత్ర తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చడానికి కాదు. వివిధ ప్రమాదాలలో మరణించిన వారి కుటుంబాలను ఓదార్చుతారు.   ఆయన ఈరోజు ఉదయం 11.30 గంటలకి విశాఖకు వస్తారు. అక్కడి నుండి అచ్యుతాపురం వెళ్తారు. అక్కడ ధవళేశ్వరం బ్యారేజి వద్ద ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు. ఈ మూడు రోజులలో ఓదార్పు యాత్రలో తూర్పు గోదావరి జిల్లాలో పెరుమల్లాపురం, హుకుంపేట గ్రామాలలో చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతయిన మత్స్యకారుల కుటుంబాలను, ఆ తరువాత కొత్తపట్నం, రామన్నపాలెం, పరాడపేట, ఉప్పలంక, పగడాలపేట గ్రామాలలో మత్య్సకార కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం రంపచోడవరంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన 9మందికి చెందిన కుటుంబాలను పరామర్శిస్తారు. జూలై 4న గోపాలపురం నియోజకవర్గంలోని దేవరాపల్లి పొగాకు రైతులతో సమావేశమవుతారు.అదే రోజు సాయంత్రం తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతారు.

నేటి నుండి గోదావరి నిత్య హారతి

  కాశీ పుణ్యక్షేత్రంలో రోజూ సాయంత్రం జరిగే గంగా (నది) హారతిని చూసి తరించేందుకు దేశంలో నలుమూలల నుండి ప్రజలు తరలి వస్తుంటారు. ఆ ప్రేరణతోనే ఆంధ్రులకు పరమ పవిత్రమయిన గోదావరి నదికి నిత్య హారతి కార్యక్రమాన్ని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈరోజు సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పు గోదావారి జిల్లా రాజమండ్రిలో పుష్కర్ ఘాట్ వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపముఖ్యమంత్రి చిన్న రాజప్ప, మంత్రులు దేవేనేని ఉమామహేశ్వర రావు, పి. సుజాత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.వై. ఆర్. కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, రాజమండ్రి యం.పి. మురళీ మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

లేడి డాక్టర్ కాలర్ సరిచేసిన మంత్రి

బీజేపీ నేత, జమ్మూ కాశ్మీర్ ఆరోగ్య శాఖ మంత్రి చౌదరీ లాల్ సింగ్ ఓ మహిళా వైద్యురాలి కాలర్ సరిచేసి వార్తల్లో కెక్కారు. ఆయన వైద్యురాలి కాలర్ సరి చేసిన ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. వివరాల ప్రకారం.. అమరనాథ్ యాత్ర ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా మంత్రి చౌదరీ లాల్ సింగ్ లఖన్‌పూర్ ప్రభుత్వాసుప్రతిని సందర్శించారు. అయితే అక్కడ ఉన్న ఓ మహిళా వైద్యురాలు కాలర్ సరిగా పెట్టుకోలేదు. దీన్ని గమనించిన మంత్రి 'బైటియా నువ్వు కాలర్ సరిగా పెట్టుకోలేదు' అంటూ తన చేత్తో కాలర్ ను స్వయంగా సరిచేశారు. ఇదంతా గమనించిన మరో మహిళా డాక్టర్ మళ్లీ తన కాలర్ ఎక్కడ సరిచేస్తారు అని అనుకుందో ఏమో తనంతట తానే కాలర్‌ను సరి చేసుకుంది. అయితే ఇప్పుడు మంత్రి గారు చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక మహిళ అనుమతి లేకుండా తనను తాకడం పెద్ద నేరమంటూ మంత్రిగారిని తిట్టిపోస్తున్నారు.

ఎవరూ పార్టీ వీడట్లేదు.. ఉత్తమ్

ఒకవైపు తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టికి రాజీనామా చేశారని.. త్వరలో టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకుంటున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కానీ అలాంటిది ఏం లేదని.. కాంగ్రెస్ పార్టీని ఎవరూ వీడటం లేదని.. డీఎస్ లాంటి సీనియర్ నేతలు కాంగ్రెస్‌ను వీడరని అని బుధవారం మీడియాతో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. అయితే డీఎస్ కూడా సీఎం కేసీఆర్ ను కలిశారు.. కానీ తాను కూడా కేసీఆర్ కు ఆరోగ్యం బాలేదని అందుకే కలిశానని చెప్పారు కానీ పార్టీ మార్పు పై క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలవల్ల ఇప్పుడు అందరూ సందిగ్ధంలో పడ్డారు.

5 గంటల తరువాత రేవంత్ విడుదుల

ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి బెయిల్‌ ఆర్డర్‌ కు లైన్ క్లియర్ అయింది. హైకోర్టు రేవంత్ కు నిన్ననే బెయిల్ మంజూరు చేసిన తీర్పు ప్రతిలో సాంకేతిక లోపం కారణంగా రేవంత్ ఇంకా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. అయితే కోర్టు ఇప్పుడు ఆ సందిగ్ధతను తొలగించింది. నిన్న తీర్పు ప్రతిలో బెయిల్‌ పేపర్స్‌ను ఏసీబీ పోలీస్‌ స్టేషన్‌లో సమర్పించాలని రాసి ఉంది. అయితే దానిపై రేవంత్‌ తరఫు న్యాయవాదులు బెయిల్‌ పేపర్స్‌ను ఏసీబీ కోర్టులో సమర్పించే విధంగా ఆర్డర్స్‌ సవరించాలని బుధవారం పిటిషన్‌ వేశారు. దీంతో న్యాయమూర్తి బెయిల్‌ ఆర్డర్‌లో మార్పులు చేశారు. న్యాయమూర్తి సవరించిన బెయిల్ ఆర్డర్ కాపీని రేవంత్‌ తరఫు న్యాయవాదులు తీసుకొని దానిని ఏసీబీ కోర్టులో సమర్పించారు. అనంతరం ఏసీబీ కోర్టు నుంచి రిలీవ్‌ ఆర్డర్స్‌ తీసుకుని చర్లపల్లి జైలుకు వెళ్లనున్నారు. మొత్తానికి ఐదు గంటల తర్వాతే రేవంత్‌ రెడ్డి జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా.. సండ్ర

నోటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు తెదేపా నేతలు వేం నరేందర్ రెడ్డికి, సండ్ర వెంకట వీరయ్యలకు కూడా విచారణలో పాల్గొనాలని నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసింది. అయితే అప్పుడు వేం నరేంద్ర రెడ్డి మాత్రమే ఏసీబీ విచారణలో పాల్గొన్నారు. సండ్ర తనకు గుండె సంబంధిత సమస్య ఉందని పదిరోజుల తరువాత విచారణలో పాల్గొంటానని ఏసీబీకి లేఖ రాశారు. కానీ ఆ పదిరోజుల గడువు ఎప్పుడో ముగిసింది. ఈ నేపథ్యంలో సండ్ర ఎక్కడ ఉన్నాడని పలు ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు సండ్ర ఏసీబీకి మరో లేఖ రాశారు. తాను ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యానని.. ఎప్పుడు విచారణకు రమ్మంటే అప్పుడు రావడానికి సిద్దంగా ఉన్నానని లేఖలో పేర్కొన్నారు.

కేసీఆర్ కు ఏం జ్వరం వచ్చిందో.. జూపుడి

టీడీపీ నేత జూపూడి ప్రభాకరరావు తెలంగాణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కావాలనే జ్వరం అని చెప్పి కేసీఆర్ రాష్ట్రపతితో సమావేశాన్ని తిరస్కరించారని.. ఇద్దరు సీఎంలతో రాష్ట్రపతి సమావేశమైతే కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయని భావించామని.. కానీ తెలంగాణ ప్రభుత్వం దానికి సహకరించలేదని ఎద్దేవ చేశారు. కేసీఆర్‌కు ఏ జ్వరం రాలేదని విమర్శించారు. చంద్రబాబు కేసీఆర్ లా కాదని.. చంద్రబాబుకు దూర దృష్టి ఎక్కువని చిన్న చిన్న సమస్యలు ఉంటే మాట్లాడుకుంటే పరిష్కారమవుతాయని చెప్పారని జూపుడి అన్నారు. కానీ తెలంగాణ వైఖరి చూస్తే రెడ్డగొట్టే విధానాలే కనిపిస్తున్నాయని అన్నారు. మనం సమాఖ్య వ్యవస్థలో ఉన్నామని, సీఎం కేసీఆర్‌ తన భాషను మార్చుకోవాలని జూపూడి కోరారు.

కాంగ్రెస్ నాయకుల పార్టీల జంప్

రాష్ట్రం విడిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఆనవాలు కూడా సరిగా కనపడకుండా పోయింది. అటు తెలంగాణలోనూ ఏదో ఉంది అంటే ఉంది అనే పరిస్థితి వచ్చింది. ఇక ఆంధ్రాలో అయితే చెప్పనవసరంలేదు.. మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే అది దేవుడికే తెలియాలి. అందుకే పార్టీ లో ఉన్న నాయకులు కూడా చిన్నచిన్నగా వేరే పార్టీల గూటికి చేరుకుంటున్నారు. ఈ పార్టీలో ఉండి ఒట్టిగా ఖాళీగా ఉండటం కంటే వేరే పార్టీలోకి చేరితే కనీసం ఏదో ఒక పదవి ఇవ్వకపోతారా అని ఆ రూట్ లో వెళుతున్నట్టున్నారు. మొన్నటికి మొన్న పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. అసలు ఎప్పుడో వెళ్లాల్సింది కానీ కొన్ని బేరసారాలు కుదరక లేట్ అయింది. కానీ మొత్తానికి పార్టీ వీడారు.   ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాను కూడా పార్టీని వీడి టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకుంటున్నట్టు రాజకీయవర్గాలు అనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వెళ్లి కేసీఆర్ ను కలిసి సమావేశమయినట్టు తెలుస్తోంది. అసలు ఎప్పటినుంచో తనకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని కాంగ్రెస్ పై డీ.ఎస్ అసంతృప్తితో ఉన్నారు. దానికి తోడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా డీఎస్ కు నిరాశే ఎదురైంది. ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నించినా ఆ అవకాశం వేరే వాళ్లకు ఇవ్వడంతో మనస్తాపానికి గురై పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే డిఎస్ ను పార్టీలోనే ఉంచేందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు బాగానే కష్టపడ్డారు కానీ అసలే కాంగ్రెస్ పార్టీ మీద ఫుల్లు ఫైర్ మీద ఉన్న డిఎస్ మాత్రం పార్టీ మారాలనే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 6 న గులాబీ గూటికి చేరనున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ కు చెందిన మరో నేత కూడా డిఎస్ బాటలోనే టీఆర్ఎస్ లో చేరనున్నారట. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో తమకు భవిష్యత్ ఉండదని ముందే తెలుసుకుంటున్నారేమో నేతలు పాపం ఒక్కోక్కరుగా పార్టీ నుండి బయటకు వచ్చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్ ఎంటో కాలమే నిర్ణయించాలి..

కేసీఆర్ ని అందుకోసం కలవలేదు: డి.శ్రీనివాస్

  సమైక్యాంధ్ర ప్రదేశ్ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఈరోజు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆయన చాంబర్ లో కలిసిరావడంతో ఆయన పార్టీ మారుతారన్న వార్తలకు బలం చేకూరింది. కానీ తను అందుకోసం కేసీఆర్ ని కలవలేదని ఆయనకు జ్వరంగా ఉందని తెలిసి పరామర్శించడానికే వెళ్లానని సంజాయిషీ ఇచ్చుకొన్నారు. కానీ తమ ప్రత్యర్ధ పార్టీ అధ్యక్షుడికి జ్వరం వస్తే ఇతర పార్టీల నేతలెవరూ వెళ్లి పరామర్శించరని అందరికీ తెలుసు. కనుక ఇక ఆయన తెరాసలో చేరడం దాదాపు ఖరారు చేసినట్లే భావించవచ్చును. ఆయన ఈనెల 6వ తేదీన తెరాస అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరుతారని తాజా సమాచారం.

తమిళనాడుకు.. ఏపీకి ఉమ్మడి రాజధాని ఉందా? ప్రత్తిపాటి

తమిళనాడు పోలీసుల్ని ఏపీలో అనుమతిస్తారా? అని ఒక రిటైర్డ్ జడ్జి చేసిన వ్యాఖ్యలపై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి పత్రిపాటి పుల్లారావు మండిపడ్డారు. రెండు రాష్ట్రాల రాజధాని అయిన హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు అవసరమా? లేదా? అనే విషయం ఆయనకు తెలియదా? న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తికి ఈమాత్రం తెలియదా? అని ప్రశ్నించారు. తమిళనాడు పోలీసుల్ని ఏపీలో అనుమతిస్తారా అని అడుగుతున్నారు.. తమిళనాడు, ఏపీ కి ఉమ్మడి రాజధాని లేదని.. ఒకవేళ ఉంటే అనుమతిస్తామని అన్నారు. ఏపీకీ, తెలంగాణకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టి తెలంగాణ తో పాటు ఏపీకి కూడా సమాన హక్కులు ఉంటాయని.. అందుకే హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని కోరుతున్నామని అన్నారు. ఈ విషయంపై గవర్నర్ వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.