ఆరు నెలల్లో నిర్ణయం తీసుకుంటే మంచిది

  రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న హైకోర్టు విభజనపై ఇరు రాష్ట్రాల మధ్య వాదనలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వెంటనే హైకోర్టును విభజించాలని ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడ హైకోర్టు విభజన సాధ్యం కాదని.. ఏపీ ప్రభుత్వం అక్కడ హైకోర్టును నిర్మించుకున్న తరువాత విభజన కుదురుతుందని న్యాయస్థానం టీ సర్కారుకు సూచించింది. ఏపీ హైకోర్టు బాధ్యతను కేంద్రంపై పెడుతూ.. దానికి కావలసని అనువైన స్థలాన్ని.. నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని కూడా కేంద్రం భరించాలని సూచించింది. కానీ న్యాయస్థానం అయితే చెప్పింది కానీ కేంద్రం మాత్రం ఇప్పటివరకూ స్పందించలేదు. ఇప్పుడు ఈ విషయంపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టు ఎక్కడ ఉండాలో ఆరు నెలల్లోపు ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదని.. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పరస్పరం సంప్రదించుకోవాలని తెలిపింది. ఏపీలో హైకోర్టు ఎక్కడ నిర్మించుకోవాలి.. దానికి అనువైన ప్రదేశం ఎక్కడో చూసి హైకోర్టు న్యాయమూర్తికి తెలపాలని.. న్యాయమూర్తి ఏపీ మంత్రులతో కలిసి చర్చించి ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.

ఏపీకి నో స్పెషల్ స్టేటస్! నోరెత్తని ఏపీ ఎంపీలు

ఎప్పటినుండో ఆశగా ఎదురుచూస్తున్న ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్ర ఒక్కసారిగా నీళ్లు చల్లినంత పనిచేసింది. ప్రత్యేక హోదాపై చర్చలు జరుగుతున్నాయి.. 60 శాతం చర్చలు పూర్తయయ్యాయి.. ఆలోచిస్తున్నాం అని ఎన్నో మాటలు చెప్పిన కేంద్రం ఇప్పుడు ఉన్నట్టుండి బాంబు పేల్చినంత పనిచేసింది. కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ దేశంలోని ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని.. గతంలో బీహార్ కు కూడా స్పేషల్ స్టేటస్ ఇవ్వలేదని లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపిన సంగతి తెలిసిందే. అంటే దీనిని బట్టి ఏపీకి కూడా ప్రత్యేక హోదా రానట్టే అర్ధమవుతోందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంటే ఇంద్రజిత్ ప్రత్యక్షంగా చెప్పకపోయినా పరోక్షంగా మాత్రం చెప్పినట్టే భావిస్తున్నారు. లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ సభ్యుడు బీబీ పాటిల్‌, బీజేపీ సభ్యుడు విష్ణుదయాళ్‌ రామ్‌ ప్రత్యేక హోదాపై అడిగిన ప్రశ్నలపై ఇంద్రజిత్‌ సమాధానం చెపుతూ గతంలో ప్రత్యేక హోదా వివిధ రాష్ట్రాలకు అమలయ్యేదని, కాని ఇప్పుడు దానికి బదులు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా పెంచాలన్న 14వ ఆర్థిక సంఘం ప్రతిపాదనల్ని కేంద్రం యథాతథంగా ఆమోదించి అమలు చేస్తోందని చెప్పారు. దీనివల్ల ఏరాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలేదని తెలిపారు. ఇప్పటికే ఈ వార్తతో షాక్ లో ఉన్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఏలాగూ ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం లేదు కాబట్టి ఇక కాలయాపన చేయకుండా కనీసం స్పెషస్ ప్యాకేజీ అయినా దక్కించుకుందామని అనుకుంటున్నారట. లేకపోతే ప్రత్యేక హోదా విషయంలో జరిగినట్టే ప్రత్యేక ప్యాకేజీలో కూడా జరిగి దానిని కూడా కోల్పోయే పరిస్థితి వస్తుందని అనుకుంటున్నారట. అసలు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీ ప్రభుత్వానికి  ప్రత్యేక హోదా ఇస్తామని అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.. ఈ విషయంలో అప్పటి  విపక్ష నేత వెంకయ్యనాయుడే పట్టుబట్టారు. దీంతో నవ్యాంధ్రకు పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామంటూ మన్మోహన్‌సింగ్‌ ప్రకటించారు.. కేబినెట్‌లో తీర్మానమూ చేశారు. కానీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏపీ ప్రత్యేక హోదాపై ఇలా మాట్లాడటం గమనార్హం.    మరోవైపు కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పుతున్న మన ఏపీ ఎంపీలు మాత్రం నోరుకదపకపోవడం విచిత్రం. వాస్తవానికి ప్రశ్నోత్తరాల సమయంలో ఎవరైనా దాని అనుబంధం ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంటుంది. కానీ మన ఏపీ ఎంపీలు మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు కూర్చుండిపోయారు. ప్రత్యేక హోదా ప్రశ్నపై చర్చ జరుగుతుండగా టీడీపీ లోక్‌సభాపక్ష నాయకుడు తోట నరసింహం, బీజేపీ ఎంపీలు కంభంపాటి హరిబాబు, గోకరాజు గంగరాజు, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి సభలోనే ఉన్నారు కానీ ఒక్కరు కూడా కేంద్రాన్ని ప్రశ్నించలేదు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజు ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేసిన ఎంపీలు ఇప్పుడు వారి నోటికి తాళం ఎందుకు పడిందో.. మరో వైపు ఈ ప్రత్యేక హోదాపై జగన్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని చెపుతున్నారు. పార్లమెంట్ లోనే అడగటం చేతకాని నాయకులు ఇప్పుడు ధర్నా చేసి మాత్రం ఏ చేస్తారో చూద్దాం.

దిగివచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు

  అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు తగ్గుతుండటంతో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా తగ్గు ముఖం పడుతున్నాయి. నిన్న అర్ధరాత్రి నుండి పెట్రోల్ పై లీటరుకి రూ.2.43, డీజిల్ పై లీటరుకి రూ. 3.60 ధరలు తగ్గాయి. సబ్సీడీయేతర గ్యాస్ సిలిండర్ ధర రూ. 23.50 తగ్గింది. కానీ, గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యంత కనిష్ట స్థాయికి దిగివచ్చాయి. ఫిబ్రవరి 4న డీజిల్ ధర లీటరుకి రూ.46.01, ఫిబ్రవరి 15న పెట్రోల్ ధర లీటరుకి రూ.57.31కి దిగివచ్చింది. కానీ మళ్ళీ మే 15నాటికి పెట్రోల్ ధర రూ.66.29కి డీజిల్ ధర రూ.52.28కి పెరిగిపోయింది. మళ్ళీ నిన్న అర్ధరాత్రి పెట్రోల్ ధర రూ.64.47, డీజిల్ ధర రూ.46.12కి దిగివచ్చాయి. అంటే డీజిల్ ధర మళ్ళీ ఫిబ్రవరి ధరల స్థాయికి దిగివచ్చినట్లయింది. కానీ పెట్రోల్ ధర మాత్రం ఇంకా ఎక్కువగానే ఉంది.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనట్టేనా!

  ఆంధ్రరాష్టానికి ప్రత్యేక హోదా కల్పించడంపై ఎన్నో రోజుల నుండి చర్చలు జరుగుతున్నాయి. దీనిమీద ఒక పక్క ఏపీ ఎంపీలు కూడా పార్లమెంట్ లో ఆందోళనలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం బాంబు పేల్చింది. కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ ను ప్రత్యేక హోదా గురించి అడుగగా ఆయన చెప్పిన దాని బట్టి చూస్తే ఏపీకి ప్రత్యేక హోదా విషయం అనుమానంగానే ఉన్నట్టు తెలుస్తోంది. బీహార్‌కు స్పెషల్ ప్యాకేజీ మాత్రమే ఇచ్చామని.. ప్రత్యేక హోదా ఇవ్వలేదని.. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. అంటే ఆయన ఏపీకీ ప్రత్యేక హోదా లేదని ప్రత్యక్షంగా చెప్పనప్పటికీ పరోక్షంగా మాత్రం ఏపీకీ ప్రత్యేక హోదా వర్తించదని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, ఏ రాష్ట్రానికి అని చెప్పినప్పటికీ ఏపీకీ హామీ ఇచ్చినందు వల్ల దీనిపై వివరణ ఇవ్వాల్సి ఉంది.

చేతులెత్తేసిన కేంద్రం

  ఏపీ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఉద్యోగుల బదిలీపై వాదనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 1200 మంది ఏపీ ఉద్యోగులను బదిలీ కింద రిలీవ్ చేసింది. దానికి సంబంధించి ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తుంది. మళ్లీ ఇప్పుడు ఆరుగురిని బదిలీ చేసింది. దీంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంపై మండిపడుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకొని వ్యవహరిస్తుందని నిప్పులు చెరుగుతున్నారు.   ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై ఈరోజు కేంద్ర హోంశాఖ కార్యదర్శితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎస్‌లు సమావేశమయ్యారు. ఇద్దరు సీఎస్‌లు హోంశాఖ కార్యదర్శికి తమ సమస్యలను విన్నవించారు. అయితే ఈ విషయంపై కేంద్ర హోంశాఖ కూడా చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. ఈ ఉద్యోగుల బదిలీ వ్యవహారం ఇప్పటికే కోర్టులో ఉన్నందున కోర్టులోనే తేల్చుకోవాలని.. ఇందులో తాము జోక్యం చేసుకోలేమని హోంశాఖ కార్యదర్శి ఇద్దరు సీఎస్ లకు సూచించినట్టు తెలుస్తోంది. దీంతో ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం లేకుండానే ముగిసింది.   టీ విద్యుత్ ఉద్యోగుల ఆందోళన మరోవైపు రిలీవ్ చేసిన ఏపీ ఉద్యోగులను తెలంగాణలోకి రానివ్వద్దని.. వారి స్థానికత ఆధారంగా ఏపీలోనే ఉంచాలని తెలంగాణ ఉద్యోగులు కేపీటీఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. ఒకవేళ వారు తెలంగాణకు వస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఏపీలో 13 టూరిస్ట్ ప్రదేశాలు

  ఏపీ రాజధాని నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటినుండే కసరత్తు చేసే పనిలో పడింది. రాజధాని అమరావతిని ఎలా నిర్మించాలి.. ఏంఏం ప్రత్యేకంగా నిర్మించాలి అనే విషయంపై చర్చలు జరుపుతున్నారు. ఇప్పుటికే రాజధానిలో 45, 50 అంతస్తులు కలిగిన ట్విన్ టవర్స్ నిర్మించాలని... అంతేకాక ఓ 10 అతి పెద్ద బిల్డింగులు కట్టాలని ఆదిశగా ప్రయత్నాలు జరుపుతున్నారు. దీనితో పాటు అమరావతి ఓ పెద్ద టూరిస్ట్ ప్రదేశంగా మార్చే యోచనలో ఉన్నారు. దీనిలో భాగంగానే చంద్రబాబు మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చంద్రబాబుతో పాటు ముఖ్యమైన అధికారులు స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ కుటుంబరావు, ఏ.కే. పరిడా, సతీష్ చంద్ర, నీరబ్ కుమార్ ప్రసాద్, సాయి ప్రసాద్, అనురాధ పాల్గొన్నారు.   అయితే ఈ సమావేశం అనంతరం అధికారులు మాట్లాడుతూ ఏపీ రాజదానిలోని 13 ప్రాంతాలను టూరిస్ట్ ప్రదేశాలుగా మార్చాలని చంద్రబాబు నిర్ణయించినట్టు చెప్పారు. అంతేకాదు ప్రపంచ దేశాల నుండి బౌద్దులు బీహార్లోని బుద్దగయకు వస్తుంటారు.. అలాంటి తరహాలోనే అమరావతిలోని విశాలమైన ఆశ్రమాన్నినిర్మించాలని ఏపీ ప్రభుత్వం యోచన చేస్తున్నట్టు తెలిపారు. కాకినాడలోని కోనసీమను కూడా మంచి ఐలాండ్ తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు. అంతేకాక టూరింగా స్పాట్లో అక్కడక్కడ వాహనాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే చంద్రబాబు నెలరోజుల్లో తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేయాలని.. హైదరాబాద్ లో ఉన్న శాఖలలోని కొన్ని శాఖలను ఇక్కడకు మార్చాలని భావిస్తున్నారు. అంతేకాక 2018 కల్లా మొదటి దశ రాజధానిని పూర్తి చేయాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు కుదిరితే ఓ అద్భుతమైన రాజధానిని చంద్రబాబు ఏపీకి అందిస్తారని అనిపిస్తుంది.

ఎట్టకేలకు విజయవాడ కోర్టుకు కాల్ డేటా

  అనేక వాదనలు ముగిసిన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు కాల్ డేటాను విజయవాడ కోర్టుకు అందించింది. సర్వీసు ప్రొవైడర్లు కాల్ డేటా వివరాలను సీల్డ్ కవర్ లో పెట్టి విజయవాడ కోర్టుకు అందజేశారు. అయితే సీల్డ్ కవర్ లో ఏమున్నాయో తెలిపేలా నోట్ ఫైల్ ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదులు ప్రొవైడర్లను కోరగా.. సర్వీసు ప్రొవైడర్ల తరపు న్యాయవాదులు దానిని తిరస్కరించి సుప్రీంకోర్టు ఆదేశించినట్టుగా సీల్డ్ కవర్ లోనే ఇస్తామని స్పష్టం చేశారు. కాగా కాల్ డేటా వివరాలను ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన మేరకు ప్రత్యేక మెసెంజర్ ద్వారా కాల్ డేటా వివరాలను హైదరాబాద్ లోని హైకోర్టు రిజిస్ట్రార్ కు ఇవ్వాల్సి ఉంది.

తలసాని రాజీడ్రామా పై స్పందించిన స్పీకర్

  తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీడ్రామాకు తెరపడినట్టు తెలుస్తోంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచి ఆ తరువాత టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి మంత్రిగా కొనసాగుతున్న విషయంపై రాజకీయ వర్గాలు మండిపడ్డాయి. ఒక పార్టీలో పదవి పొంది రాజీనామా చేయకుండా మరో పార్టీలోకి మారి మంత్రిగా కొనసాగడం చట్ట విరుద్ధమని టీడీపీ నేతలు దుమ్మెత్తిపోశారు. అయితే కాంగ్రెస్ నేత గండ్ర వెంకట రమణారెడ్డి సమాచార హక్కు చట్టం కింద అసెంబ్లీ సచివాలయానికి దరఖాస్తు చేయగా వాళ్లు రాజీనామా లేఖ రాలేదని చెప్పడంతో నిజం బయట పడింది. దీంతో ఒక్కసారిగా నేతలందరూ తలసానిపై విరుచుకుపడ్డారు. ఇన్నీ రోజులు రాజీనామా చేశానని తలసాని డ్రామాలాడారని తిట్టిపోశారు. అయితే తలసాని మాత్రం 2014 డిసెంబర్ 16న తాను రాజీనామా చేశానని.. రాజీనామా లేఖను జేబులో పెట్టుకొని తిరుగుతున్నానని చెప్పి మరీ ఎన్నో ప్రగల్భాలు పలికారు.   మరోవైపు తలసాని రాజీనామా చేస్తే స్పీకర్ ఇంతవరకూ ఎందుకు ఆమోదించలేదని పలు రాజకీయ నేతలు ప్రశ్నించారు. అంటే దీనిలో స్పీకర్ కు కూడా సంబంధం ఉందా అని పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా ఇప్పుడు తలసాని రాజీనామా పై స్పీకర్ మధుసూధనాచారి స్పందించినట్టు తెలుస్తోంది. తలసాని రాజీనామాపై మాట్లాడేందుకు కాంగ్రెస్ నేతలు మధుసూధనాచారిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన తలసాని రాజీనామాపై అనుకూలంగా స్పందినట్టు కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.

ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదుల చేతిలో నలుగురు భారతీయులు?

  ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులు లిబియాలో పనిచేస్తున్న నలుగురు భారతీయులను కిడ్నాప్ చేసినట్లు తాజా సమాచారం. వారిలో ఒకరు తెలంగాణా రాష్ట్రానికి చెందిన గోపీకృష్ణ అని సమాచారం. మిగిలిన ముగ్గురూ కర్ణాటక రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదుల చెర నుండి చాలా అరుదుగా ఎవరో ప్రాణాలతో బయటపడగలరు. కనుక ఇది చాలా ఆందోళన కలిగించే విషయమే. ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులు చెలరేగిపోతున్న లిబియా తదితర ప్రాంతాలలో పనిచేస్తున్న భారతీయులలో నర్సులు, కార్మికులు ముఖ్యంగా నిరుపేద కూలీలు ఎక్కువగా పనిచేస్తున్నారు. కేంద్రప్రభుత్వం ఇప్పుడు ఉగ్రవాదుల చేతిలో బందీలుగా చిక్కినవారిని ఏదోవిధంగా విడిపించుకొనే ప్రయత్నాలు చేయవచ్చును. కానీ మళ్ళీ వాళ్ళు వేరేవాళ్ళని కిడ్నాప్ చేయరనే నమ్మకం ఏమీ లేదు. కనుక ఇప్పటికయినా కేంద్రప్రభుత్వం మేల్కొని వారందరినీ వెనక్కి రప్పించకపోతే మున్ముందు ఇంకా అనేకమంది అమాయకులయిన భారతీయులు ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది.

ఏపీకి ఇవ్వండి.. అలాగే మాకు ఇవ్వండి

    ఓటుకు నోటు కేసు వ్యవహారంలో బయటపడిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై కోర్టులో వాదనలు జరుగుతున్న నేపథ్యంలో మరో కీలకమైన మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో కాల్ డేటా ఇవ్వాలని సుప్రీంకోర్టు సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించగా సర్వీసు ప్రొవైడర్లు మళ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కాల్‌డేటా అంశంలో తదుపరి అన్ని రకాల చర్యలను నిలిపివేస్తూ(స్టే ఆల్‌ ఫరదర్‌ ప్రొసీడింగ్స్‌) మధ్యంతర స్టే జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి తక్షణమే కాల్ డేటా ఇవ్వాలని ఆదేశించిన మేరకు సర్వీసు ప్రొవైడర్లు వెంటనే కాల్ డేటాను సీల్డ్‌కవర్‌లో ఉంచి ఇవ్వాలని.. అలాగే ఈ సీల్డు కవర్లను మెసెంజర్‌ ద్వారా తమకు కూడా ఇవ్వాలని సూచించింది.

టీ సర్కార్ ఒంటెద్దుపోకడ ఆపాలి

  ఆంధ్రా తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల బదిలీపై వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం స్ధానికత ఆధారంగా ఆంధ్రా మూలాలున్న ఉద్యోగులను బదిలీ చేస్తానంటుంటే.. మరో వైపు ఏపీ ప్రభుత్వం మాత్రం దీనికి అంగీకరించట్లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనని.. నిబంధనల ప్రకారమే జన్మస్థలం ఆధారంగా స్థానికతను నిర్ధారించి, ఏపీ మూలాలున్న విద్యుత్‌ ఉద్యోగులను గుర్తించి అక్కడికి బదిలీ చేశామని తెలిపింది కేంద్రానికి స్పష్టం చేసింది. ఉద్యోగుల బదిలీ విషయంపై కమలనాథన్‌ కమిటీ ఏర్పాటు చేశామని ఏపీ ప్రభుత్వం చెప్పినా తెలంగాణ ప్రభుత్వం అవేమి పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కార్పొరేషన్లకు కమలనాథన్‌ కమిటీ నిబంధనలు వర్తించవని చెపుతుంది.   మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఏపీ స్ధానికత ఆధారంగా ఆరుగురు జూనియర్‌ ప్లాంట్‌ అటెండెంట్లను ఏపీ విద్యుదుత్పత్తి సంస్థకు తాజాగా బదిలీ చేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసిన పనికి ఏపీ ప్రభుత్వం మండి పడుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని.. ఉద్యోగుల బదిలీలపై కోర్టులో కేసులున్నప్పటికీ ఇలా వ్యవహరిచండం సబబుకాదని అభ్యంతరం వ్యక్తం చేసింది. కమల్ ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ విభజన చట్టాన్ని ఉల్లంఘించిందని కేంద్ర హోంశాఖ దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకువెళ్లనున్నది. తెలంగాణ ప్రభుత్వం ఒంటెద్దుపోకడ మానితే చాలా బాగుంటుందని అంటున్నారు.   ఇదిలా ఉండగా విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై ఈ నెల 24న హోంకార్యదర్శి ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాసి అభిప్రాయాలను తెలపాలని కోరారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీలో హోం కార్యదర్శి నేతృత్వంలో ఇరు రాష్ర్టాల సీఎస్‌లు, ఇంధన శాఖల కార్యదర్శులు, ఇరు రాష్ర్టాల విద్యుత్‌ సంస్థల సీఎండిలతో సమావేశం జరగనుంది. అయితే రాష్ట్రవిభజన జరిగిన తరువాత తొలగించిన ఉద్యోగులందరిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. అయినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ ఆదేశాలను ఖాతరు చేయకుండా తమకు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడంపై మండిపడుతున్నారు. ఇప్పటికే చాలా విషయాల్లో మొట్టికాయలు తిన్న తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో కూడా మొట్టికాయలు తింటే కాని వూరుకునేలాలేదు.

చంద్రబాబు దృష్టి దానిపైనేనా

  ఏపీ రాజధాని నిర్మాణం ఇది ఇప్పుడు సీఎం చంద్రబాబునాయుడికి చాలా ముఖ్యమైన ఘట్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏపీ ప్రజలందరి ఆశ రాజధానిపైనే ఉంది. మరి అలాంటి రాజధానిని నిర్మించి.. ప్రజలలో తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకొవాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పనో అర్ధమైన విషయమే. అంటే ఇప్పటికిప్పుడు ఏపీ రాజధాని నిర్మాణం అంటే అది అసాధ్యమైనదే కానీ.. దీనిని దశల వారీగా దానిని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే 2018 వరకూ మొదటి దశ పూర్తి చేయాలని.. రెండోదశను 2035 వరకూ పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఇందుకు తగ్గట్టుగానే సింగపూర్ బృందం ప్లానింగ్ చేసింది.   మరోవైపు ఈ ఏపీ రాజధాని అమరావతి మొదటి దశ 2018 వరకూ పూర్తి చేయాలి అనుకోవడంలో కూడా ఒక కారణం ఉందని అనుకుంటున్నారు రాజకీయ వర్గాలు. 2019 లో జరగబోయే ఎన్నికలను దష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఈనిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన ఏపీ మంత్రులతో భేటీ కూడా ఏర్పాటుచేసి ఎలాగైనా 2018 లోపు ఏపీ రాజధానిలో కొంత వరకైనా నిర్మాణం జరగాలని సూచించారట. ఈ మొదటి దశలో కనీసం 45, 50 అంతస్తులు కలిగిన రెండు ఆకాశ హర్మ్యాలు.. మంత్రులకు గాను.. వారి విధులు నిర్వహించడానికి కావల్సిన కార్యలయాలకుగాను.. ప్రభుత్వ కార్యలయాలకు సంబంధించి భవంతులను నిర్మించాలని భావిస్తున్నారట. ఇప్పటికే నెలరోజుల్లో తాత్కాలిక రాజధాని నిర్మించి.. హైదరాబాద్ లో ఉన్న కొన్నిశాఖలను విజయవాడకు తరలించే ప్రయత్నంలో ఉన్నారు. మొత్తానికి చంద్రబాబు ఏపీ రాజధాని నిర్మాణానికి గట్టి పట్టుదలతోనే ఉన్నట్టు తెలుస్తోంది. నిజంగానే ఆయన అనుకున్నట్టు 2018 వరకూ తను అనుకున్నట్టు రాజధానిని నిర్మించినట్టుయితే రాబోయే ఎన్నికల్లో తనే మళ్లీ అధికారంలోకి రావచ్చు అని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.

పరకాలతో పాట్లు

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న పరకాల ప్రభాకర్ పై ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం గుర్రుగా ఉందన్న వార్తలు వస్తున్నాయి. అసలు అన్ని విషయాల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని.. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే చంద్రబాబుకు పరకాల వల్ల ఇబ్బందులు వచ్చాయనడంలో సందేహం లేదు. సీఎం సలహాదురుడిగా ఉన్న పరకాలను ఈమధ్యజరిగిన సభత్య నమోదు కార్యక్రమంలో సభ్యుడిగా ఉండమంటేనే ఉంటలేదు... అలాంటిది అతనికి సీఎం ఎంతో గొప్పగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిపించే గోదావరి మహాపుష్కరాలకు ఛైర్మన్ గా నియమించారు. అయితే పరకాల మాత్రం ఈ విషయంలో కూడా విఫలమైనట్టు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వలో ఉన్న అన్ని శాఖలు, మంత్రులు, అధికారులు వీళ్లను మర్చిపోయినట్టున్నారు పరకాల. అందుకే ఎవరితో ఎటువంటి సంప్రదింపులు లేకుండా తన ఇష్టంవచ్చినట్టు నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి.   అంతేకాక ఎవరిని సంప్రదించకుండా అన్నీ గాలికొదిలేసి ఈ కార్యక్రమానికి అవ్వాల్సిన ఖర్చుగురించి రూపాయికి నాలుగు రూపాయిలు వేసి చూపించారట. పాపం చంద్రబాబు జపాన్ నుండి తిరిగివచ్చి ఆ లిస్ట్ చూసి జుట్టుపీక్కుని ఆఖరికి అన్నిటినుండి 70% వరకూ కట్ చేసి అన్ని ఖర్చులు తగ్గించారట. అక్కడితో ఆగారా.. అన్ని న్యూస్ కెమేరాల మాదిరిగానే నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ కెమేరా కూడా షూటింగ్ చేసుకుందని.. అందుకోసమే కొంచం ఆలస్యమైందని నోరుజారారు. మరోవైపు ఎవరి అనుమతులు లేకుండా తనకు ఇష్టమైన ఛానల్ కు పెద్ద మొత్తంలో డబ్బులు కట్టపెట్టారనే వార్తలు కూడా కట్టపెట్టారనే వార్తలు కూడా వినిపించాయి. దీంతో అటు చంద్రబాబుని.. పార్టీని ఇబ్బందులకు గురిచేశారు. అయితే ఇప్పుడు అందరికి అర్ధమవ్వని విషయం ఏంటంటే ఇన్ని జరిగినా పరకాల రాజీనామా చేస్తారని అనుకున్నారు కానీ తాను మాత్రం రాజీనామా చేయలేదు సరికదా అప్పటినుండి మొహం మాడ్చుకుని కూర్చున్నారు. కానీ అదే పరకాల తనకు తానుగా రాజీనామా చేస్తే పరిస్ధితి వేరేలా ఉండేదని అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు చంద్రబాబు ఇంత జరిగినా పరకాల మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెవులు కొరుక్కుంటున్నారు. ఇవన్నీ చాలదన్నట్టు పరకాల వ్యతిరేక వర్గం ఇప్పటికే పరకాలది ఐరన్ లెగ్ అని ప్రచారం చేస్తున్నారు. మరి దీనికి కాలమే సమాధానం చెప్పాలి.

పాపం అనుష్కశర్మ

  బ్యూటీ విత్ బ్రెయిన్ అంటుటారు.. కానీ బ్యూటీ వితవుట్ బ్రెయిన్ అనేలా చేసింది బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మ. ఆమె చేసిన మిస్టేక్ ఎంటో తెలిస్తే మీరు కూడా బ్యూటీ వితవుట్ బ్రెయిన్ అని ఒప్పుకుంటారు. ఇంతకీ సంగతేంటంటే భారతదేశం గర్వించదగ్గ మనిషి, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గుండెపోటుతో చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో యావత్ భారతదేశం ఒక్కసారిగా దిగ్ర్భాంతికి గురైంది. ఆయన మరణానికి రాజకీయ నాయకుల దగ్గరనుండి అటు బాలీవుడ్ సెలబ్రిటీలు.. టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా తమ సంతాపాన్ని తెలిపారు. అయితే అందరూ ట్విట్టర్ ద్వారా తమ సంతాపాన్ని తెలిపారు కదా మనం కూడా ఒక ట్వీటేద్దాం అనుకుందేమే అనుష్కశర్మ.. అంతే కలాం జీకి ట్వీట్టర్ ద్వారా సంతాపాన్ని తెలిపింది. అయితే అక్కడే అనుష్కశర్మ తప్పులో కాలేసింది. ఈ ముద్దుగుమ్మ ఏపీజే అబ్దుల్ కలాం అని రాయకుండా ఏబీజే కలాం ఆజాద్ అని రాసి ట్వీట్ చేసింది. అయితే తప్పుతెలుసుకొని రెండో సారి మరో ట్వీట్ చేసింది. ఈసారైనా భామ కరెక్ట్ చేసిందంటే అదీ లేదు మళ్లీ అందులో కూడా ‘ఏపీజే కలాం ఆజాద్’ అని తప్పుగా రాసి ఆఖరికి మూడోసారి కరెక్ట్ గా రాయగలిగింది. దీంతో ఒక్కసారిగా నెటిజన్లకు చిరెత్తుకొచ్చి విమర్శలు విసిరారు. పాపం అనుష్కశర్మ బ్యూటీ మీద పెట్టే శ్రద్ద కొంచం జనరల్ నాలెడ్జి మీద పెడితే బావుండు.

ఫోన్‌ ట్యాపింగ్‌ చేసే హక్కు తెలంగాణకు ఉంది..

  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాల్ డేటా ఇవ్వాలని సుప్రీంకోర్టు కూడా సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏపీ కోర్టు తెలంగాణ ప్రభుత్వం కాల్ డేటా ప్రతులు ఇవ్వాలనడం న్యాయసమ్మతం కాదని.. ఈ విషయంలో విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఫోన్‌ ట్యాపింగ్‌ చేసే హక్కు తెలంగాణకు ఉందని.. టీడీపీ నేతల ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు టీసర్కారు అంగీకరించింది. అయితే ఓటుకు నోటు కేసు వ్యవహారం బయటకు వచ్చిన తరువాతే ఫోన్ ట్యాపింగే చేశామని రాంజెఠ్మలానీ తెలిపారు. కాగా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు హైకోర్టు దీనిపై తీర్పు వెలువరించనుంది.

ముగిసిన కలాం అంత్యక్రియలు

  మాజీ రాష్ట్రపతి, ప్రముఖ భారత క్షిపణ శాస్త్రవేత్త, భారత మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని ఢిల్లీ నుండి రామేశ్వరానికి నిన్ననే తరలించారు. ఈరోజు రామేశ్వరం రైల్వేస్టేషన్‌ దగ్గర సైనిక లాంఛనాలతో కలాం అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. మస్లిం మత పెద్దలు ఆయన పార్థివదేహం వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి మత సంప్రదాయాల ప్రకారం పార్ధివదేహాన్ని ఖననం చేశారు. ఈ కార్యక్రమానికి  ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, మంత్రులు, కేంద్రమంత్రులు పారికర్‌, వెంకయ్యనాయుడు, సీఎంలు చంద్రబాబు, ఉమెన్‌చాంది, సిద్దరామయ్య, తమిళనాడు మంత్రి పన్నీర్‌సెల్వం, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆజాద్‌, టీడీపీ ఎంపీ సీఎంరమేష్‌, శాస్త్రవేత్తలు, కోలీవుడ్‌ ప్రముఖులు తదితరులు హాజరయ్యారు. అంతేకాదు కలాం అంత్యక్రియలకు ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరయి అశ్రునయనాలోత కన్నీటి వీడ్కోలు పలికారు.

ఆ హక్కు మాకే ఉంది... చంద్రబాబు

  హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందడానికి కారణం తెలుగుదేశం పార్టీయే కారణమని.. హైదరాబాద్ గురించి మాట్లాడే హక్కు తెలుగుదేశం పార్టీకే ఉందని..ఇతర పార్టీలు వేటికీ మాట్లాడే హక్కు లేదని అన్నారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మించింది తామేనని.. తమ వల్లే ఐటీ రంగంలో హైదరాబాద్ ముందుందని చెప్పారు. అంతేకాదు హైదరాబాదులో రాత్రిపూట రోడ్లు ఊడ్చే విధానాన్ని తానే ప్రవేశ పెట్టానని.. ప్రజలు లేచి రోడ్ల పైకి వచ్చేసరికి శుభ్రంగా ఉండేవని తెలిపారు. టీడీపీ హయాంలోనే అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో ప్రాజెక్టులు అన్నీ రూపుదిద్దుకున్నాయి అన్నారు.   అంతేకాదు గతంలో చంద్రబాబు హైదరాబాద్ లో ఉదయాన్నే లేపే అలవాటు ఎన్టీఆరే అలవాటు చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే కేసీఆర్ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను విమర్శించారు. అయితే కేసీఆర్ చేసిన విమర్శలకు సమాధానం చెబుతూ తాను అన్నదాంట్లో తప్పేముందని, ఎన్టీఆర్ తెల్లవారుజామున మూడు గంటలకు లేచేవారని, ఆయనను కలుసుకోవడానికి మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఉదయం ఐదు గంటలకే రావాల్సి వచ్చేదని.. అప్పట్లో కేసిఆర్ కూడా అదే సమయానికి వచ్చేవారని అది ఎన్టీఆర్‌తోనే మొదలైందని ఘాటుగా చెప్పారు. ఇప్పుడు ఆన తన దినచర్యను ఎప్పుడు మొదలు పెడుతున్నారో, ఆ పార్టీ వారికే తెలుసునని ఎద్దేవ చేశారు.