కలాంకు అంత లేదు.. అబ్దుల్‌ ఖదీర్‌ ఖాన్‌

  సంచలన వ్యాఖ్యలు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈరోజు ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన భౌతికకాయాన్ని నిన్ననే ఢిల్లీ నుండి రామేశ్వరానికి తరలించారు. అక్కడ ఆయన మృతదేహాన్నిసందర్శనార్ధం ఉంచి ఈ రోజు అంత్యక్రియలు చేయనున్నారు. ఇప్పటికే శాస్త్రవేత్తగానే కాకుండా ప్రజల రాష్ట్రపతిగా ఖ్యాతి గడించిన కలాంను కడసారి చూసేందుకు ఆయన నివాసం వద్ద ప్రజలు బారులు తీరారు. కాగా రాష్ట్రపతి అంత్య క్రియలలో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుండి బయలుదేరారు.. మరికాసేపట్లో రామేశ్వరం చేరుకోనున్నారు.   ఇదిలా ఉండగా కలాం చనిపోయినందుకు ఒక్క భారతదేశంమే కాదు ప్రపంచమంతా ఆయనను.. ఆయన చేసిన సేవలను కొనియాడుతుంటే ఒక వ్యక్తి మాత్రం కలాం ‘ఓ సాధారణ శాస్త్రవేత్త’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అతను ఎవరంటే పాకిస్థాన్‌ అణుశాస్త్రవేత్త అబ్దుల్‌ ఖదీర్‌ ఖాన్‌. ఈయన బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘అత్యున్నతస్థాయిలో ఉన్నా కలాం సాధారణ జీవితం గడిపారు కానీ ఆయన ఓ సాధారణ శాస్త్రవేత్త మాత్రమే’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షిపణి రంగంలో భారత్‌ విజయాలన్నీ రష్యా సహకారంతో సాధించినవే తప్ప అందులో కలాం ప్రతిభ ఏమీ లేదని కొట్టిపారేశారు.

యాకుబ్ చివరి కోరిక

  ఈరోజు ఉదయం ముంబై వరుస బాంబు పేలుళ్ల నేరస్తుడు యాకుబ్ మమెన్ ను ఉరితీసిన సంగతి తెలిసిందే. అయితే ఉరితీసే ముందు దోషి చివరి కోరిక తీర్చడం ఆనవాయితీ ఉన్న నేపథ్యంలో జైలు అధికారులు కూడా యాకుబ్ చివరి కోరికలను తీర్చినట్టు సమాచారం. యాకుబ్ చివరి కోరిక ఏంటో తెలుసా.. "నా కూతురిని ఒకసారి కలవాలి". ఇది యాకుబ్ చివరి కోరిక. దీంతో జైలు అధికారులు తన కోరిక నిమిత్తం అందుకు అంగీకరించి తన కూతురు కుటుంబసభ్యులతో మాట్లాడటానికి అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది.   ఇదిలా ఉండగా ‘నాకు తెలుసు నేను మరణించబోతున్నాను. ఏదైనా అద్భుతం జరిగితే కానీ, నేను బతకలేను' అని బుధవారం ఉదయం యాకుబ్ అన్నట్టు ఓ హోంగార్డు తెలిపాడు. అంతేకాదు తన ఉరిశిక్ష ఖరారుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో యాకుబ్ బుధవారం చాలా ఆందోళనగా ఉన్నాడని, సుప్రీంకోర్టులో ఏం జరుగుతోందని పదే పదే తనను అడిగాడని ఆ హోంగార్డు తెలిపారు. బుధవారం ఉదయం పూట అల్పాహారం తీసుకున్న యాకుబ్ మెమన్.. మధ్యాహ్నం భోజనం మాత్రం చేయలేదని ఆ కానిస్టేబుల్ చెప్పారు.

యాకుబ్‌ ఉరితాడు అక్కడనుండి వచ్చిందే..

  1993 ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకుబ్‌ మెమెన్‌ను ఈరోజు ఉదయం 7 గంటలకు ఉరి తీశారు. అయితే యాకుబ్‌ మెమెన్‌ ఉరితాడును బిహార్‌లోని బక్సర్‌ కేంద్ర కారాగారం నుండి తెప్పించారు. అంతేకాదు దేశంలో ఏ జైలులో ఉరిశిక్ష అమలు చేయాలన్నా ఉరితాడు ఇక్కడినుండి రావాల్సిందే. గతంలో పాక్‌ ఉగ్రవాది కసబ్‌ను 2012లో పుణెలోని యరవాడ జైల్లో.. పార్లమెంటుపై దాడి కేసు దోషి అఫ్జల్‌గురును 2013లో తీహార్‌ జైల్లో ఉరితీయడానికి వాడిన తాళ్లను బక్సర్‌ సెంట్రల్‌ జైలు నుంచే తెప్పించారు. కాగా అతడి మృతదేహానికి మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో పోస్టు మార్టం నిర్వహించి అతడి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేయడానికి నాగ్ పూర్ నుండి ముంబైకు తరలిస్తున్నారు. అయితే తొలుత యాకుబ్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేయాలా లేక జైలులోనే ఖననం చేయాలా అని అధికారులు డైలమాలో పడ్డా ఆఖరికి తన కుటుంబసభ్యులకే అందజేయాలని నిర్ణయించుకున్నారు. కాగా ముంబైలోని ముస్లీం శవవాటికలో మెమెన్ అంత్యక్రియలు జరుగనున్న నేపథ్యంలో మెరైన్ లైన్ ముస్లీం శవవాటిక వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

యాకుబ్ మీమన్ కి ఉరి అమలు

  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యాకుబ్ మీమన్ రెండవసారి పెట్టుకొన్న క్షమాబిక్ష పిటిషన్ని కూడా తిరస్కరించడంతో అతనిని ఈరోజు ఉదయం 7గంటలకి నాగపూర్ సెంట్రల్ జైల్లో ఉరి తీశారు. సుప్రీంకోర్టు చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా నిన్న అర్ధరాత్రి తరువాత మళ్ళీ యాకుబ్ కేసును విచారణకు చేప్పట్టింది.   యాకుబ్ ఉరి శిక్షను నిలిపి వేయాలని కోరుతూ అతని తరపున లాయర్ ప్రశాంత్ భూషణ్, రాజు రామచంద్రన్‌ తదితరులు మళ్ళీ నిన్న అర్ధరాత్రి తరువాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.యల్. దత్తు ఇంటి తలుపులు తట్టడంతో ఆయన మళ్ళీ ఈ కేసును నిన్న విచారించి తీర్పు చెప్పిన త్రిసభ్య ధర్మాసనాన్ని వారి అభ్యర్ధనను పరిశీలించి తీర్పు చెప్పమని కోరడంతో ఈరోజు తెల్లవారు జామున 3-4.30 గంటల వరకు దీనిపై సుప్రీం త్రిసభ్య బెంచి పునర్విచారణ చేప్పట్టింది.   యాకుబ్ ని ఉరి తీసే ముందు కనీసం ఏడు రోజుల ముందు ‘డెత్ వారెంట్’ అందించాలని కానీ ఆవిధంగా చేయనందున అతని హక్కుల ఉల్లంఘన జరిగిందని కనుక అతని ఉరి శిక్షను నిలిపివేయాలని అతని న్యాయవాదులు వాదించారు. కానీ అతనికి టాడా కోర్టు ఉరి శిక్ష విధించినప్పుడే డెత్ వారెంట్ జారీ చేసిందని కనుక మళ్ళీ కొత్తగా మరోమారు డెత్ వారెంట్ జారీ చేయవలసిన అవసరం లేదని భారత అడ్వకేట్ జనరల్ ముకుల్ రోహాత్గీ వాదించారు. ఏదో విధంగా యాకుబ్ ఉరి శిక్షను వాయిదా వేయించాలనే ఉద్దేశ్యంతోనే అతని న్యాయవాదులు ఈవిధంగా పదేపదే పిటిషన్లు వేస్తూ మైండ్ గేమ్స్ ఆడుతున్నారని, వాటిని సుప్రీం ధర్మాసనం అనుమతించరాదని, యాకుబ్ కి ఉరి శిక్షని నిలిపివేయరాదని ఆయన వాదించారు. తెల్లవారు జామున సుమారు 4.30 గంటల వరకు ఇరుపక్షాల వాదనలు విన్న త్రిసభ్య బెంచి యాకుబ్ మీమన్ కేసు విషయంలో ఎక్కడా తప్పు జరుగలేదని అతనికి ఉరి శిక్ష వేయడం సమంజసమేనని తీర్పు చెప్పింది.   అప్పటికే యాకుబ్ మీమన్ ఉరి శిక్ష అమలుకు నాగపూర్ జైలు అధికారులు ఏర్పాట్లు మొదలు పెట్టారు. పద్ధతి ప్రకారం చివరి సారిగా నిన్న రాత్రి అతని కుటుంబ సభ్యులతో అతనిని మాట్లాడనిచ్చారు. అతనికి ఇష్టమయిన కిచిడిని ఇచ్చారు. అతను దానిని కొద్దిగా మాత్రమే తిన్నాడు. అవతల సుప్రీం ధర్మాసనంలో అతని ఉరిశిక్షపై వాదోపవాదాలు జరుగుతుంటే మరోవైపు జైలు అధికారులు అతనిని ఉరి శిక్షకు సన్నధం చేస్తున్నారు. సుప్రీం ధర్మాసనం అతని ఉరి శిక్షను ఖరారు చేసినట్లు దృవీకరించుకొన్న తరువాతనే అతనిని డిజిపి, మేజిస్ట్రేట్ సమక్షంలో ఈరోజు ఉదయం 7గంటలకు ఉరి తీశారు. అనంతరం అతని శవానికి పోస్ట్ మార్టం నిర్వహించి అతని కుటుంబ సభ్యులకు అందజేస్తారు.   ఇదివరకు ఎన్నడూ లేనంతగా యాకుబ్ ఊరిపై దేశంలో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి, భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అతనిని ఉరి తీసినందుకు ఉగ్రవాదులు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉంది కనుక ఇంటలిజెన్స్ విభాగం దేశ వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా మహారాష్ట్ర అంతటా ప్రధానంగా నాగపూర్, ముంబైలలో పోలీసులను మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేయడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు తగ్గట్లుగానే భద్రతని మరింత కట్టుదిట్టం చేసింది.

యాకుబ్ మీమన్ కి ఉరి ఖరారు

  1993 ముంబై వరుస బాంబు ప్రేలుళ్ళ కేసులో దోషిగా నిర్దారించబడిన యాకుబ్ మీమన్ పిటిషన్ని ముగ్గురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ఆయన తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి న్యాయవ్యవస్థ అన్ని అవకాశాలను కల్పించిందని కానీ అతను కేసులో దోషి అని పూర్తి సాక్ష్యాధారాలతో సహా నిరూపించబడిన తరువాతనే అతనికి మరణ శిక్ష విధించడమయిందని అతనికి ఆ శిక్ష విధించడం సమంజసమేనని పేర్కొన్న ధర్మాసనం యాకుబ్ మీమన్ పెట్టుకొన్న పిటిషన్ని తిరస్కరించింది.   ఈరోజు రాష్ట్రపతికి పెట్టుకొన్న క్షమాభిక్ష పిటిషన్నిఆయన హోం శాఖ అభిప్రాయంకు పంపించారు. అంటే ఆయన దానిని తిరస్కరించినట్లే భావించవచ్చును. అదే విషయం తెలియజేస్తూ హోంశాఖ ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. మహారాష్ట్ర గవర్నర్ కూడా యాకుబ్ మీమన్ క్షమాభిక్ష పిటిషన్ని తిరస్కరించారని ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ తెలియజేసారు. ఇక యాకుబ్ మీమన్ కి ఉరి ఖాయం అయినట్లే. రేపు ఉదయం సరిగ్గా 7గంటలకు అతనిని నాగపూర్ సెంట్రల్ జైల్లో ఉరి తీస్తారు. అనంతరం తదనంతర లాంచనాలన్నీ పూర్తి చేసి అతని శరీరాన్ని అతని కుటుంబ సభ్యులకు అందజేస్తారు. రేపే అతని పుట్టిన రోజు, మరణించే రోజు కావడం విశేషం.

అబ్దుల్ కలాం లాస్ట్ ట్వీట్

  మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం షిల్లాంగ్ ఐఐఎం సమావేశంలో ప్రసంగిస్తూనే కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి యావత్ భారతదేశం దిగ్ర్భాంతికి గురైంది. ఎంతో మందికి ఆదర్శవంతంగా నిలిచిన అబ్దుల్ కలాం మరణించడంతో దేశం ఒక్కసారిగా మూగబోయింది. కలాం మృతికి ఎంతోమంది సంతాపం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ నరసింహన్ ఇరు రాష్ట్రాల సీఎంలు తమ విచారాన్ని వ్యక్తం చేశారు. ఆయన మరణం కేవలం భారత్‌కే కాకుండా యావత్ ప్రపంచానికే తీరని లోటన్నారు. అనేక మంది ట్వీట్లతో తమ సంతాపాన్ని తెలిపారు. కానీ అబ్దుల్ కలాం చేసిన చివరి ట్వీట్ ఎంటో తెలుసా..   అబ్దుల్ కలాం చివరి ట్వీట్.. 'నివాసయోగ్యమైన గ్రహం భూమి' అనే అంశంపై మాట్లాడేందుకు షిల్లాంగ్ ఐఐఎం వెళ్తున్నానని, శ్రీజన్ పాల్ సింగ్, శర్మ కూడా వస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు.   కాగా కలాం మరణంతో ఆయన జన్నస్థలమైన రామేశ్వరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రామేశ్వరంలోనే ఉంటున్న కలాం అన్నయ్య ముత్తుమీరా లెబ్బాయ్ మరైకర్ తమ్ముడి మరణ వార్త విని కన్నీరుమున్నీరు అయ్యారు. తన తమ్ముడ్ని చూపించాలని బోరున ఏడ్చారు.

ఫోన్ ట్యాపింగ్ ట్విస్ట్..

  ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇప్పుటికే ఈవిషయంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒక పక్క ఫోన్ ట్యాపింగ్ విషయంలో కాల్ డేటా ఇవ్వడానికి నిరాకరించి.. కాల్ డేటా ఇస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రాసిక్యూషన్ చేస్తానని హెచ్చరించిందని.. కాల్ డేటా ఇవ్వద్దన్నదని.. కేంద్రం కూడా సమాచారం ఇవ్వాల్సిన పని లేదని చెప్పిందని ఏవేవో కబుర్లు చెప్పింది. కాని విజయవాడ కోర్టు మాత్రం పాలన వేరు.. చట్టాలు వేరని కాల్ డేటా ఇవ్వాల్సిందేనని.. సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించింది. అయితే సర్వీసు ప్రొవైడర్లు అక్కడితో ఆగారా అంటే లేదు విజయవాడ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాని అక్కడ కూడా వాళ్లకు చుక్కెదురై కాల్ డేటా ఇవ్వాల్సిందేనని సర్వీసు ప్రొవైడర్లును ఆదేశించింది. దీంతో సర్వీసు ప్రొవైడర్లు కాల్ డేటా ఇచ్చేందుకు గడువు కోరింది.   ఇక్కడి వరకు బానే ఉన్నా ఇప్పుడు మళ్లీ తెలంగాణ ప్రభుత్వం కాల్ డేటా ఇవ్వడానికి తిరకాసుపెడుతోంది. తెలంగాణ ప్రభుత్వం కాల్ డేటా ప్రతులు ఇవ్వాలనడం న్యాయసమ్మతం కాదని.. ఈ విషయంలో విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం. తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఆపరేటర్ల నుంచి కావాల్సిన సమాచారాన్ని పొందే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. దర్యాఫ్తు సంస్థలు వివరాలు కోరినప్పుడు అందజేయాలని, అలా అందజేసిన సమాచారాన్ని తమ వద్ద ఉంచుకోరాదన్నారు. ఇందులో ప్రతివాదులుగా కేంద్ర హోంశాఖ, టెలికాం మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఏపీ సిట్, బిఎస్ఎన్ఎల్, ఎయిర్ టెల్, ఐడియా, రిలయన్స్ తదితరులను పేర్కొన్నారు. అయితే అసలు ఫోన్ ట్యాపింగ్ చేయనపుడు కాల్ డేటా ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నిజంగా ఫోన్లు ట్యాపింగ్ చేయనపుడు కాల్ డేటా ఇవ్వడానికి ఎందుకు నాటకాలు ఆడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

సెక్షన్‌ 8 ద్వారా ప్రత్యేక బాధ్యత గవర్నర్ ది

  రాష్ట్రం విడిపోయిన తరువాత ఇరు రాష్ట్రాలు ఎన్నో విషయాల్లో పరస్పరం వాగ్వాదాలు చేసుకున్నాయి.. ఇంకా చేసుకుంటూనే ఉన్నాయి. అయితే ఎప్పుడూ సెక్షన్ 8పై అంతగా దృష్టి పెట్టలేదు. కాని ఎప్పుడైతే ఓటుకు నోటు కేసు వ్యవహారం వెలుగుచూసిందే అప్పుడే ఈ సెక్షన్ 8 అంశం తెరపైకి వచ్చింది. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్రం సెక్షన్ 8 అమలు అవసరం లేదంటే.. మరోవైపు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ లో సీమాంధ్ర ప్రజలకు భద్రత ఉండాలంటే సెక్షన్ 8అమలు చేయాల్సిందే అంటూ ఇరు రాష్ట్రాలు మొండిగానే వ్యవహరించాయి. ఈ సెక్షన్ 8 అమలుపై పాపం గవర్నర్ ను కూడా నేతలు బాగానే విమర్శించారు. దీంతో ఒకానొక సందర్భంలో ఆయన రాజీనామా కూడా చేస్తారు అన్న వార్తలు కూడా వినిపించాయి.   ఇదిలా ఉండగా టీడీపీ లోకసభసభ్యుడు అవంతి శ్రీనివాస్‌ ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని సెక్షన్లను, ప్రత్యేకంగా సెక్షన్‌ 8ని అమలు చేయాలని కేంద్రం ఏమైనా గైడ్‌లైన్స్‌ విడుదల చేసిందా? అని ప్రశ్నించగా దీనికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్‌ పరాతిభాయి సమాధానం ఇస్తూ.. సెక్షన్‌ 8 అమలుకు మార్గదర్శకాలు ఇవ్వాలన్న నిబంధన చట్టంలో లేదన్నారు. కాగా.. హైదరాబాద్ లో భద్రతా వ్యవస్ధ గురించి భారతీయ జనతా పార్టీ ఎంపి హరిబాబు కూడా కేంద్రానికి లేఖ రాశారు. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతల్ని కాపాడేందుకు ప్రత్యేక అధికారాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే కేంద్రం తీసుకున్న చర్యలేంటి? అంటూ ప్రశ్నిస్తూ లేఖ రాశారు. దీనికి కూడా హరిభాయ్‌ చౌధరి హైదరాబాద్ లో ఉండే ప్రజల ప్రాణాలు, స్వేచ్ఛ, ఆస్తుల భద్రతకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ అయిన నరసింహన్ కు విభజన చట్టం సెక్షన్‌ 8 ద్వారా ప్రత్యేక బాధ్యత కట్టబెట్టినట్లు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

నెలరోజుల్లో తాత్కాలిక రాజధాని..

  రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఆంధ్ర రాష్ట్ర పరిపాలనా ఇక్కడ నుండే చూడటం కొంచం కష్టంగా మారింది. ఏపీలోనే ఉండి పరిపాలనా బాధ్యతలు చూసుకుందామా అంటే అక్కడ సరైన సౌకర్యాలు లేవు. కనీసం సీఎం క్యాంపు కార్యాలయంలో ఇంకా పనులు మొత్తం పూర్తి కాలేదు. పోని అక్కడి నుండి ఇక్కడికి ఇప్పుడికిప్పుడు రావడం అంటే అది కష్టమైన పని. ఈ నేపథ్యంలో ఏపీ రాజదాని అమరావతికి సమీపంలో గుంటూరు. విజయవాడ నగరాల్లో తాత్కాలికంగా ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలోనే మూడు రోజులు ఉందామని ప్రజలకు పాలనను మరింత దగ్గర చేద్దామని చంద్రబాబు అధికారులను సూచించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏ శాఖలు, ఏ విభాగాలు ముందుగా తరలించాలో చర్చజరిపినట్టు తెలుస్తోంది. దీనికోసం చంద్రబాబు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసి దానికి పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి, గృహనిర్మాణ శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి హేమా మునివెంకటప్ప, రహదారులు, భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. వీరే ముందుగా ఏ శాఖలు తరలించాలి.. ఈ శాఖలకు అనువైన ప్రదేశాలను పరిశీలించనున్నారు.   అయితే దాదాపు 25 శాఖలను హైదరాబాద్ నుండి ఏపీకి తరలించాలని భావిస్తున్నారు. వీటిలో కూడా అన్ని ఒక్కసారి కాకుండా ముందు కొన్ని శాఖలను తరువాత కొన్నిశాఖలను తరలించాలని... ముందుగా ఏఏ శాఖలైతే ప్రజలకు దగ్గర సంబంధం ఉంటుందో ఆ శాఖలను తరలించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా శాఖలలో పనిచేసే ఉద్యోగులు కూడా వెళ్లాల్సి ఉంటుంది.. అయితే ఎంతమంది ఉద్యోగులు వెళ్లాలి? వారి కుటుంబాలకు నివాసం కల్పించేందుకు ఎన్ని చదరపు అడుగులు కావాలన్నది ప్రాథమికంగా అంచనా వేశారు. మొత్తంగా 20,053మంది ఉద్యోగులు అక్కడికి తరలాల్సి ఉంటుంది. అదేవిధంగా వారి నివాసాలకు 1.73కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణం కావాలి. మొత్తంగా 2.18కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణం అవసరం కానుంది. తాత్కాలిక రాజధానికి నెల రోజుల్లోగా నిర్ణయించిన శాఖలు, ఉద్యోగులు తరలిపోనున్నారు.

కలాం మరణంపై వర్మ ట్వీట్స్.. అలా చేయడం థ్రిల్లింగ్ గా ఉంది

  భారతదేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి.. దేశానికి ఎనలేని కృషిం చేసిన ఉన్నత మనిషి అబ్దుల్ కలాం మరణంతో యావత్ భారతదేశంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కలాం మృతికి రాజకీయ నేతల దగ్గరనుండి ప్రతి ఒక్కరూ తమ సంతాపాన్ని తెలిపారు. అలాగే ఎప్పుడూ వివాదాస్పద విమర్శుల చేసే రాంగోపాల్ వర్మ కూడా తనదైన శైలిలో కలాంకు సంతాపం తెలిపారు. ట్విట్టర్ జనాలు, సెలబ్రెటీలందరూ కలాం కు కలాం జీ రిప్ అని ట్వీట్ చేయకుండా ఆయన గురించి ఇంత కేరింగ్ గా మాట్లాడటం చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తోంది అని ట్వీట్ చేశారు. ఎప్పుడైనా ఒక మనిషి చనిపోయినపుడే వారి విలువ గుర్తిస్తారని.. కానీ జనాలు ఎవరైనా చనిపోయినపుడే వారి విలువ గుర్తిస్తారని అంతేకాదు చనిపోయిన వ్యక్తికి కూడా తనను ఎంత ప్రేమిస్తున్నారో చనిపోయిన తరువాతే తెలుస్తుందని ట్వీటారు. కలాం మరణం తనను చాలా బాధించిందని.. ఆయన మరణాన్ని ఇండియా ఎలా తట్టుకుని ముందుకు వెళ్తుందో తెలియట్లేదని వర్మ ట్వీట్ చేసారు. అబ్దుల్ కలాం లాంటి ఉన్నతమైన వ్యక్తికి.. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తికి మరణం లేదని.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయుడి గుండెల్లో ఆయన ఎప్పటికీ బతికే ఉంటారు'' అని రాంగోపాల్ వర్న ట్విట్టర్ ద్వారా తెలిపారు.

రేపు 11 గంటలకు కలాం అంత్యక్రియలు

  మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భౌతికకాయాన్ని ఢిల్లీ నుండి మధురైకి తరలించారు. పాలెం ఎయిర్ పోర్టు నుండి ప్రత్యేక విమానంలో కలాం పార్ధీవ దేహాన్ని తరలించారు. ఈ విమానంలో కలాం దేహంతో పాటు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్ పారికర్ కూడా వెళ్లారు. అక్కడ మధురైలోకి కలాం మధురైలో కలాం పార్థివదేహానికి తమిళనాడు గవర్నర్‌ రోశయ్య నివాళులర్పించగా అనంతరం అక్కడి నుండి రామేశ్వరానికి తీసుకెళతారు. అనంతరం మజీదుకు తీసుకెళ్లి ప్రార్ధనలు చేయించి అక్కడ ఈ రోజు రాత్రి 7 గంటల వరకు ప్రజల సందర్శనార్ధం ఉండి రేపు ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు చేయనున్నారు. కలాం అంత్యక్రియలకు ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు హాజరవుతారు.

కలాం భౌతిక కాయం మదురైకి తరలింపు

  మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భౌతికకాయాన్ని ఈరోజు ఉదయం డిల్లీ నుండి ప్రత్యేక విమానంలో తమిళనాడులో పాలం విమానాశ్రయానికి తరలించారు. రక్షణమంత్రి మనోహర్ పారికర్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి యం.వెంకయ్య నాయుడు స్వయంగా ఆయన భౌతికకాయాన్ని తమిళనాడు తీసుకువెళ్ళారు. వారితోబాటు రక్షణశాఖకు చెందిన కొందరు ఉన్నతాధికారులు కూడా వెళ్ళినట్లు సమాచారం. అక్కడి నుండి ఎయిర్ ఫోర్స్ కి చెందిన విమానంలో మదురైకి తరలిస్తారు. మదురై నుండి హెలికాఫ్టర్ ద్వారా ఆయన భౌతిక కాయాన్ని రామేశ్వరం తరలించి అక్కడ ఆయన కుటుంబ సభ్యులకు అప్పజెప్పుతారు. ఈరోజు సాయంత్రం ఏడు గంటల వరకు ఆయన భౌతిక కాయాన్ని ఒక స్థానిక పాఠశాలలో ప్రజల సందర్శనార్ధం ఉంచుతారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులు తమ మతాచారాల ప్రకారం ఆయన అంత్యక్రియల కార్యక్రమాలు చేస్తారు. రేపు ఉదయం సుమారు 10.30గంటలకు ఆయనను ఖననం చేస్తారు.

కలాం ఎందుకు పెళ్లి చేసుకోలేదు

  భారత దేశపు ప్రముఖ క్షిపిణి శాస్త్రవేత్త అబ్దుల్ కలాం అక్టోబరు 15, 1931న తమిళనాడులోని రామనాథపురం జిల్లా, రామేశ్వరంలో జన్మించారు. నిరు పేదు కుటుంబలో పుట్టిన ఆయన తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో బౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నై లోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందారు. 1960లో డీఆర్‌డీవోలో తన కెరీర్‌కు కలాం శ్రీకారం చుట్టారు. తరువాత ఇస్రోకు బదిలీ అయ్యి ఏరోస్పేస్ ఇంజనీర్ పనిచేసి సేవలందిచారు. ఒక్క సాంకేతిక రంగంలోనే కాదు అటు రాజకీయ రంగంలోకి కూడా తన పాత్రను పోషించారు. తన ఉద్యోగ జీవితంలో రెండు రోజులు మాత్రమే సెలవు పెట్టారంటే కలాం ఎంత గొప్ప వ్యక్తో అర్ధం చేసుకోవచ్చు. తన జీవితంలో ఎంతో అరుదైన అవార్డులు పొందారు. కాని ఇప్పటి వరకూ కలాం ఎందుకు పెళ్లి చేసుకోలేదని చాలా సందేహాలు వచ్చివుంటాయి. ఇదే విషయంపై ఒకసారి మీరేందుకు పెళ్లి చేసుకోలేదని ఒక వ్యక్తి అడినప్పుడు ‘ఎందుకో జరగలేదంతే’ అని సమాధానం ఇచ్చారట. నా కుటుంబంలో ‘‘అయిదుగురు అన్నదమ్ములు, ఒక సోదరి ఉన్నారు నేను ఒక్కడిని పెళ్లి చేసుకోకపోతే నష్టమేంటి? వీరిలో చాలా మందికి నేను అండగా ఉన్నాను అంటూ సమాధానమిచ్చారట.

నేను చనిపోతే సెలవు ఇవ్వద్దు.. కలాం

  తాను మృతి చెందినప్పుడు పాఠశాలలకు సెలవు ఇవ్వద్దని.. ఆరోజు ఒక గంట ఎక్కువ పనిచేయాలని కలాం చెప్పారని ఏపీ సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఇవాళ గంటపాటు పాఠశాలలు అదనంగా పని చేయనున్నాయి. ఈ మేరకు అబ్దుల్ కలాం మృతి నేపథ్యంలో ఒక గంట ఎక్కవ సేపు పాఠశాలలు పని చేయాలని.. ఆగంటలో అబ్దుల్ కలాం జీవిత చరిత్ర పైన విద్యార్థులకు బోధన చేయాలని విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఆదేశాలు జారీ చేశారు. ఒక్క పాఠశాలలే కాదు ప్రభుత్వ కార్యాలయాలు కూడా గంటపాటు అదనంగా పనిచేయాలని సూచించారు. మరోవైపు అబ్దుల్ కలాం మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా కలాం దేసానికి విశిష్ట సేవలు అందించారని.. ఆత్మీయ వ్యక్తిని కోల్పోవడం బాధాకరంగా ఉందని కలాంతో తన అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

కలాం జన్మదినాన్ని విద్యార్ధుల దినోత్సవంగా మార్చిన ఐకాస

  భారత మిసైల్ మ్యాన్.. భారత క్షిపణి శాస్త్రవేత్త అబ్దుల్ కలాం నిన్న సాయంత్రం షిల్లాంగ్‌ ఐఐఎంలో ప్రసంగిసిస్తూ కుప్పకూలిపోయారు. అనంతరం కలాంను ఆస్పత్రికి తరలించిన కాసేపటికే తుదిశ్వాస విడిచారు. దీంతో భారత ప్రజలు ఒక్కసారిగా బాధలో మునిగిపోయారు. తన జీవిత కాలంలో ఎన్నో అవార్డులు సొంత చేసుకున్నారు అబ్దుల్ కలాం. ఇప్పుడు ఆయన జన్మదినాన్ని విద్యార్ధుల దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. కాగా అబ్దుల్‌కలాం పార్థివదేహం మంగళవారం ఢిల్లీలోని పాలెం విమానాశ్రయానికి చేరుకుంది. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, కేంద్ర రక్షణమంత్రి మనోహర్‌ పారికర్‌, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ నజీబ్‌జంగ్‌ తదితరులు నివాళులర్పించారు. మరికాసేపట్లో కలాం భౌతికకాయాన్ని ఆయన నివాసానికి తరలించనున్నారు.

టీడీపీ నేతల ఇంగ్లీష్ వింగ్లీష్

    గోదావరి మహా పుష్కరాల మొదటి రోజునే తొక్కిసలాట జరిగి చాలా మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిని టీడీపీ ప్రతిపక్ష నేతలు చాలా అస్ర్తంగా తీసుకొని విమర్శల బాణాలు వదిలారు. పెద్ద రాద్ధాంతమే చేశారు. దీనిపై నేషన్ మీడియా ఛానల్ కూడా సుదీర్ఘ చర్చ కూడా నిర్వహించింది. అయితే ఈ చర్చలో మాత్రం మన టీడీపీ నేతలకు ఇంగ్లీష్ రాక చమటలు కూడా పట్టాయి. తొక్కిసలాటకు జరిగిన కారణాలు గురించి ఇంగ్లీష్లో గట్టిగా సమాధానం కూడా చెప్పలేకపోయారు. దేశ వ్యాప్తంగా పరువు తీసిపెట్టారు. మరి మన పండిత టీడీపీ నేతలు ఎలా మాట్లాడారో ఈ కింద వీడియో ద్వారా మీరే చూడండి.  

అబ్దుల్ కలాం రాష్ట్రపతి.. చంద్రబాబు ముఖ్యపాత్ర

  భారతదేశపు ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త అబ్దుల్ కలాం అనారోగ్యం కారణంగా మృతి చెందారు. భారత మిస్సైల్ మాన్ పిలవబడే కలాం దేశానికి ఎనలేని కృషి చేశారు. కలలకు అర్ధం చెప్పి.. కలలు కనండి.. నిజం చేసుకోండి అంటూ పిల్లలకు, యువతలో స్ఫూర్తినింపారు అబ్దుల్ కలాం. తన జీవితంలో ఎవరూ పొందలేని అరుదైన అవార్డులు ఎన్నేన్నో పొందారు. అబ్దుల్ కలాం సాంకేతిక రంగంలోనే కాదు అటు రాజకీయ రంగంలో కూడా రాష్ట్రపతిగా తన పాత్రకు న్యాయం చేశారు. ఒక రకంగా అబ్దుల్ కలాం రాష్ట్రపతి అవడానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబే ముఖ్యభూమిక పోషించారని చెప్పవచ్చు. అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎన్డీయే కన్వీనర్‌గా ఉన్నారు. ఆసమయంలో వాజపేయి భారత ప్రధానిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే అప్పుడు వాజపేయి భారత రాష్ట్రపతిగా మైనార్టీ వర్గానికి చెందిన ప్రముఖుడిని నియమించాలని తీర్మానించారు. దీనిలో భాగంగానే ముగ్గురు మైనార్టీ నేతల పేర్లను తీసి ఎన్డీయే కన్వీనర్ హోదాలో ఉన్న చంద్రబాబును సంప్రదించినప్పుడు చంద్రబాబు అబ్దుల్ కలాం పేరును సూచించారట. ఈ నేపథ్యంలో అబ్దుల్ కలాంను కూడా నో చెప్పవద్దని బాబు ఒప్పించారట.