మున్సిపల్ జీతాలు పెంచలేం.. చేతులెత్తేసిన టీ సర్కార్

  మున్సిపల్ కార్మికులు తమ వేతనాలు పెంచమని వారం రోజులకుపైగా సమ్మె చేసిన సంగతి తెలిసిందే. అయితే కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెను మొదట తెలంగాణ ప్రభుత్వం అంటీ అంటనట్టుగానే ఉంది. తరువాత వారి సమ్మెకు ప్రతిపక్షపార్టీలు మద్ధతు తెలిపి.. బంగారు తెలంగాణ చేస్తానని నగరాన్ని చెత్తగా మార్చారని.. మున్సిపల్ శాఖ కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్నా కాని సమస్య పరిష్కారం కాకపోవడం ఆశ్చర్యంగా ఉందంటూ.. వెంటనే వాళ్ల సమస్యలు తీర్చాలంటూ పార్టీలు ధర్నా చేయడంతో దిగివచ్చిన తెలంగాణ ప్రభుత్వం వారి వేతనాలు పెంచేందుకు అంగీకరించింది. దాంతో కార్మిక సంఘాలు కూడా సమ్మెను విరమించాయి. ఇక్కడ వరకూ బానే ఉంది. కానీ ఇప్పుడు జీహెచ్‌ ఎంసీ మినహా ఇతర కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలలో ఇప్పటికిప్పుడు వేతనాలను పెంచలేమని చేతులేత్తేసినట్టు తెలుస్తోంది.   అయితే మున్సిపాలిటీ కార్మికులు వేతనాలపై దృష్టిసారించిన తెలంగాణ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను సంప్రదించింది. దీనికి సంబంధించి ఈ కమిటీ మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు చెందిన మేయర్లు, చైర్‌పర్సన్లు, కమిషనర్లు, ఉద్యోగులతో చర్చలు జరిపి వేతనాలను పెంచాలని మునిసిపాలిటీల్లో పనిచేసే కార్మికులు కోరుతున్నారని తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వానికి ఓ నివేదికను పంపించింది. వాస్తవానికి మునిసిపాలిటీలే ఆ ఉద్యోగుల వేతనాలను చెల్లిస్తున్నాయి. కానీ ఇప్పుడున్న ఆర్ధిక పరిస్థితి వల్ల అది సాధ్య కాదని.. ‘‘ప్రస్తుతం ఉన్న ఆదాయం మునిసిపాలిటీలను నిర్వహించడానికే చాలడం లేదని తెలిపారు. దీంతో సీఎం కేసీఆర్ ఇప్పుడు వేతనాల పెంపుపై ఏం చేయాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అసలే తెలంగాణ ఖజానా కూడా ఖాళీ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్రమంతటా మున్సిపల్ కార్మికులు సమ్మె నిర్వహించినప్పటికీ అది ఒక్క జీహెచ్ఎంసీ మాత్రమే పరిమితం చేసే యోచన చేసింది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు దానికి కూడా వేతనాల పెంపు కష్టమే. మరి కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.

త్వరలో గవర్నర్ రాజీనామా చేయనున్నారా?

  ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య నెలకొన్న యుద్ద వాతావరణం క్రమంగా చల్లబడుతున్న ఈ సమయంలో గవర్నర్ నరసింహన్ బాంబు లాంటి మాటొకటి పేల్చి కలకలం సృష్టించారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ఇండో గ్లోబల్ ఫార్మా సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, “త్వరలోనే నేను కూడా సాధారణ పౌరుడుగా మారాతున్నాను,” అని అన్నారు. రెండు రాష్ట్రాలకి ప్రధమ పౌరుడుగా ఉన్న ఆయన సామాన్య పౌరుడు అవడం అంటే తన పదవి నుండి తప్పుకోవడమే.   కానీ ఇప్పుడు ఆయనని దిగిపొమ్మని కేంద్ర ప్రభుత్వం కానీ, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కానీ పట్టుబట్టడం లేదు. మొదట తెదేపా మంత్రులు, నేతలు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించినా ఆ తరువాత అచ్చెం నాయుడు వంటి వారు ఆయన మనసు నొప్పించినందుకు క్షమాపణలు కూడా చెప్పారు. ఆయనకీ ఇబ్బంది కలిగించే సెక్షన్: 8 గురించి కూడా ఇప్పుడు ఎవరూ గట్టిగా ఒత్తిడి చేయడం లేదు. క్రమంగా రెండు రాష్ట్రాల మధ్య పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకొంటున్నాయి. ఇటువంటి సమయంలో ఆయన తన పదవి నుండి తప్పుకోవాలని ఎందుకు భావిస్తున్నారో తెలియదు. బహుశః ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న సమస్యలు, వివాదాలు పరిష్కరించడం సాధ్యం కాదనే అభిప్రాయంతోనే ఆయన గౌరవప్రదంగా తప్పుకోవాలనుకొంటున్నారేమో? కానీ ఈరోజు ఒక ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ ఇదే అంశం మీద నిర్వహించిన ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఒక బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గవర్నర్ ని రాజీనామా చేయమని ఎటువంటి ఒత్తిడి చేయలేదని, అసలు తమ ప్రభుత్వానికి అటువంటి ఆలోచనే లేదని స్పష్టం చేసారు.

నేడు అనంతపురంలో రాహుల్ పాదయాత్ర

  కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు అనంతపురం జిల్లాలో ఓబులదేవర చెరువు నుండి కొండకమర్ల గ్రామం వరకు సుమారు 10 కి.మీ పాదయాత్ర చేస్తారు. ఆయన ఉదయం డిల్లీ నుండి బెంగుళూరు విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడి నుండి నేరుగా జిల్లాలో ఓబులదేవర చెరువు గ్రామంలో ఇందిరా గాంధీ వేదిక వద్దకి చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తన పాదయాత్రను ఆరంభిస్తారు. దారిలో మామిళకుంటుపల్లి, దేబురాపల్లి గ్రామాలలో ఆర్ధిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాలని, మహిళా స్వయం సహాయక సంఘాలను, చేనేత కార్మికులను, విద్యార్ధులను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకొంటారు. దారిలో కొండకమర్ల గ్రామం వద్ద బహిరంగ సభ నిర్వహించి తన పాదయాత్రను ముగించి మళ్ళీ సాయంత్రం బెంగళూరు నుండి డిల్లీకి విమానంలో వెళ్ళిపోతారు.   ఈసారి ఆయన పాదయాత్రకి కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఆయన ఓబులదేవర చెరువు గ్రామంలో అంబేద్కర్ విగ్రహంతో బాటు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి తన పాదయాత్ర ఆరంభిస్తారు. రాష్ట్ర విభజన వలన ఆంద్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందనే కారణంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలకు రాష్ట్ర విభజన వలన రాష్ట్రానికి మంచే జరిగిందని ఆయన నచ్చజెప్పబోతున్నట్లు సమాచారం.   ఈ కార్యక్రమంలో రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డితో బాటు సార్వత్రిక ఎన్నికలలో పార్టీ ఓడిపోయినా తరువాత నుండి ఇంతవరకు ప్రజలకు మొహాలు చూపించని ఆనం రామనారాయణ రెడ్డి, పళ్ళం రాజు, కిల్లి క్రుపారాణి, కెవిపి రామచంద్రరావు, తన 150వ సినిమా నిర్మాణంపైనే దృష్టిపెట్టిన చిరంజీవి, ఏఐ.సి.సి. ప్రధాన కార్యదర్శి కొప్పలరాజు తదితరులు కూడా పాల్గొంటారు.   ఇదివరకు రాహుల్ గాంధీ తెలంగాణాలో పాదయాత్ర చేసినప్పుడు కేవలం ఆ రాష్ట్ర నేతలే ఆయన వెంట వచ్చేరు. కానీ ఈసారి ఆయనతో బాటు అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్, రాహుల్ గాంధీ వ్యక్తిగత కార్యదర్శి, ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల పీసీసీ కార్యవర్గ సభ్యులు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.

పార్లమెంట్ లో కాంగ్రెస్ రచ్చ.. మాట్లాడలేకపోతున్నాం.. టీడీపీ ఎంపీలు

  పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీనేతల తీరును టీడీపీ ఎంపీలు తప్పుబట్టారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ ను దద్దరిల్లేలా చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రుల ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అవకాశం రావట్లేదు. దీనితో కాంగ్రెస్ నేతల వైఖరిపై టీడీపీ ఎంపీలు మండిపడుతున్నారు. పార్లమెంట్ లో కాంగ్రెస్ తీరుపై కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌ను స్తంభింపజేయడం వలన ఏపీ సమస్యలు ప్రస్తావించలేకపోతున్నామని.. సభలో కాంగ్రెస్‌ వైఖరితో ఏపీకి తీరని నష్టం కలుగుతోందని ఎంపీలు వ్యాఖ్యానించారు. సభ సజావుగా సాగితే, ఏపీకి ప్రత్యేక హోదా, నిధులపై చర్చించవచ్చని వారు అన్నారు. ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పార్లమెంట్ లో వ్యవహరించాల్సిన తీరును ప్రతిపక్షాలు నేర్చుకోవాలన్నారు.

ప్రజలే బుద్ధి చెబుతారు.. పత్తిపాటి

  ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న వైఎస్ పై విమర్శలు చేశారు. దొంగ యాత్రలతో ప్రజలను మోసం చేయాలనుకుంటే కుదరదని.. ప్రజలే వారికి బుద్ధి చెబుతారని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే సూచనలు ఇస్తే తాము స్వీకరిస్తామని, కానీ అభివృద్ధికి అడ్డుపడిడాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని ఆయన అన్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక.. ఏం చేయాలో తెలీక ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారని.. తమ తెలుగుదేశం పార్టీని విమర్శించే హక్కు కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఒకటిగా ఉన్నరాష్ట్రాన్ని రెండుగా చీల్చిన కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం ఎవరూ నమ్మె స్థితిలో లేరని ఎద్దేవ చేశారు. పట్టిసీమ ప్రాజెక్టుపై జగన్ అనవసరంగా రాద్దాంతం చేస్తుందని.. పట్టిసీమ ప్రాజెక్టు వస్తే తమకు పార్టీకి పుట్టగతులు ఉండవనే భయంతో దానిని వ్యతిరేకిస్తున్నారని అన్నారు.

ప్రత్యేక హోదాపై సుజనా ట్విస్ట్.. పవన్ కళ్యాణ్ నోరు మూయించేందుకే

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదాపై చర్చలు జరుగుతున్నాయని.. ఏపీకి ప్రత్యేక హోదాపై పోరాడతామని కేంద్రమంత్రి సుజనా చౌదరి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సుజనా చౌదరి మరో ట్విస్ట్ ఇచ్చారు. లోకసభ జరిగితేనే కదా, మనం ప్రత్యేక హోదా, నిధుల గురించి కేంద్రాన్ని అడగడానికి వీలుంటుందని చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కానీ ప్రారంభమైన రోజునుండే కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనలు చేపట్టడం మొదలుపెట్టారు. సభను సక్రమంగా జరగకుండా పదేపదే అడ్డుకుంటున్నారు. ఈనేపథ్యంలో ఏపీ ప్రత్యేక హోదా గురించి చర్చించడం కష్టమైన పనే కాని కేంద్రంతో పోరాడైనా సరే ప్రత్యేక హోదాకి నిధులు తీసుకొస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి ఏపీకి నష్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు కూడా పార్లమెంట్లో తన వైఖరి వల్ల ఏపీకి నష్టం చేకూరుతుందని అన్నారు.   మరోవైపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని టిడిపి ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని మహాత్ముడి విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ఏపీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు చేసే ధర్నాలన్నీ కంటితుడుపు చర్యలు అన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ల నోర్లు మూయించేందుకే ప్రత్యేక హోదా కోసం ధర్నా అని వ్యాఖ్యానించారు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయనుకోవడం లేదన్నారు. మొత్తానికి ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ మాటలు మన ఎంపీల మీద పనిచేసినట్టున్నాయ్.

గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలున్నాయి

  సెక్షన్ 8పై తెలంగాణ రాష్ట్రం.. ఆంధ్రరాష్ట్రం దెబ్బలాడుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి గాను గవర్నర్ ను ఇరు రాష్ట్రాల సీఎంల వల్ల ఇబ్బందులు పడ్డారు. అయితే ఇప్పుడు హైదరాబాద్‌లో పౌరుల భద్రతని దృష్టిలో ఉంచుకొని విభజన చట్టంలో గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు కల్పించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నలకు మంత్రి కిరణ్‌ రిజిజు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇరు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ లో భద్రత వ్యవస్థకు సంబంధించిన ప్రత్యేక బాధ్యతలను గవర్నర్ కు అప్పగించామని తెలిపారు.

అంత సీన్ లేదు... కాల్ డేటా ఇవ్వాల్సిందే

  ఫోన్ ట్యాపింగ్ పై తెలంగాణ ప్రభుత్వానికి.. ఆంధ్రాప్రభుత్వానికి మధ్య వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అటు ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులకు, ఇటు సర్వీసు ప్రొవైడర్ల తరపు న్యాయవాదులకు మధ్య వాదనలు జరిగాయి. అయితే సర్వీసు ప్రొవైడర్లు మాత్రం తెలంగాణ ప్రభుత్వం కాల్ డేటా ఇవ్వద్దని చెప్పిందని.. ఇస్తే ప్రాసిక్యూషన్ చేస్తామని హెచ్చరించిందని తెలియజేశారు. అంతేకాదు కేంద్రం కూడా దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వాల్సిన పని లేదని చెప్పిందని తెలిపారు. అయితే దీనికి కోర్టు అలాంటివి ఇక్కడ చెల్లవు.. పాలనా విధానం వేరు.. చట్టాలు వేరు.. కాల్ డేటా ఇవ్వాల్సిందే అని తేల్చిచెప్పింది. కానీ సర్వీసు ప్రొవైడర్లు అంతటితో ఆగారా అంటే లేదు.. కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పాపం అక్కడ కూడా వాళ్లకి మొట్టికాయ పడింది.   ఈరోజు సర్వీసు ప్రొవైడర్లు వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఏపీ సిట్ అధికారుల అడిగిన ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కాల్‌డేటాను వారం రోజుల్లోగా ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలను జారీచేసింది. అయితే సర్వీసు ప్రొవైడర్లు తరపు న్యాయవాది మాట్లాడుతూ కాల్ డేటా ఇస్తే తెలంగాణ ప్రభుత్వ ప్రాసిక్యూషన్ చేస్తానని హెచ్చరించిందని చెప్పడంతో దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేస్తూ సుప్రీం జ్యుడిషియల్‌ ఆర్డర్‌ ఉన్నప్పుడు దాని ముందు ఏ ఆర్డ్‌ర్స్‌ పనిచేయవని.. ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని సూచించింది. ఈ నేపథ్యంలో కాల్ డేటా ఇవ్వడానికి తమకు కొంత సమయం కావాలని సర్వీస్‌ప్రొవైడర్ల కోర్టును కోరడంతో వారం రోజుల పాటు గడువును ఇచ్చింది. దీనిలో భాగంగానే సుప్రీంకోర్టు విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టుకు కొన్నిసూచనలు చేసింది. కాల్‌డేటా ఇచ్చాక సీల్డ్‌ కవర్‌ను మూడు వారాల వరకు తెరచి చూడకూడదని, కాల్‌డేటాను స్వీకరించిన అనంతరం విచారణను నెలరోజుల పాటు వాయిదా వేయాలని విజయవాడ కోర్టును ఆదేశించింది.

ఏపీ రాజధానిలో ట్విన్ టవర్స్

  ఏపీ నూతన రాజధానిపై ఇప్పుడు భారీ అంచనాలు మొదలయ్యాయి. ప్రపంచ దేశాలను తలదన్నే రీతిలో ఈ రాజధాని నిర్మాణం ఉంటుందని ఇప్పటికే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీనికి సంబధించి సింగపూర్ ప్రభుత్వం కూడా అదేవిధంగా ప్రణాళికను ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే కృష్ణానది తీరాన ఆకాశహార్మ్యాలు నిర్మించనున్నారు. ఈ భవనాల నిర్మాణాన్ని చేపట్టే బాధ్యత కూడా సింగపూర్ డెవలపర్స్ తీసుకోవడానికి ముందుకొస్తున్నట్టు తెలుస్తోంది. కృష్ణానది తీరాన సుమారు 17 చదరపు కిలోమీటర్లు వరకు.. సుమారు 70-80 అంతస్థులు ఉండేలా ఈ బహుళ అంతస్థులను నిర్మించాలని అనుకుంటున్నారు. అంతేకాక కృష్ణానది తీరాన 125 అడుగులు ఉండే ద్యాన బుధ్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇంకా రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు అసెంబ్లీ, సచివాలయం, కోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు రాజధాని నడిబొడ్డున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2050 నాటికి అమరావతిలో కోటి మంది నివాసం ఉండే అవకాశం ఉందని.. దీనికి అనుగుణంగానే భవన నిర్మాణాలు జరపాలని ఏపీ సర్కార్‌ అంచనా వేస్తోంది.   మరో వైపు నూతన రాజధానికి పక్కా వాస్తు కుదిరిందని.. అన్ని నిర్మాణాలకు అనువైన స్థలంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంకా రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి జపాన్, సింగపూర్ దేశాలు కూడా ముందుకొస్తున్నాయి. ఇంకా ఈరాజధాని నిర్మాణానికి దసరా నాడు శంకుస్థాపన చేయాలని నిర్ణయించుకున్నట్టు ఏపీ ప్రభుత్వ స్పష్టం చేసింది. అది జరిగిన వెంటనే రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతాయని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి.

టీడీపీ మంత్రుల ఇంగ్లీష్ కష్టాలు..

  సరిగా మాట్లాడటం రాని వాళ్లు కూడా రాజకీయ నాయకులు అయిపోతున్నారు. పొట్టకోస్తే అక్షరం ముక్క రానివాళ్లు మంత్రులు, ఎంపీలు అయిపోతున్నారు. అలా సరైన అవగాహన లేకుండా ఆంగ్ల మీడియాతో మాట్లాడి పరువు తీశారు మన టీడీపీ ప్రబుద్ధులు. అసలే ఉన్న తలనొప్పులతో సరిపోక చంద్రబాబుకు ఈ నేతల ఆంగ్ల తంటాలు మరో తలనొప్పయ్యాయి. గోదావరి మహా పుష్కరాల సందర్భంగా మొదటి రోజు జరిగిన తొక్కిలాటలో చాలామంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి దీనికి కారణం చంద్రబాబే అంటూ ఊదరగొట్టారు ప్రతిపక్షనేతలు. ఈ నేపథ్యంలోనే ఆంగ్ల మీడియా కూడా దీనిమీద చర్చ జరిపింది. ప్రముఖ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి ఈ చర్చకు సారధ్యం వహించారు. అసలు జర్నలిస్ట్ అంటే అర్ణబ్ గోస్వామిలా ఉండాలి అని.. ప్రశ్నలతో నేతలకు చెమటలు పట్టిస్తాడు అని అంటుంటారు అందరూ. అలాంటి అతని దగ్గర మన నేతలు ఎలా ఉండాలి కాని గోదావరి పుష్కరాల గురించి అడిగిన ప్రశ్నలకు మన నేతలు సమాధానం చెప్పలేక చెమటలు కక్కారు.   ఈ చర్చలో టీడీపీ తరుపున రాష్ట్ర మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పాల్గొన్నారు. కానీ ముగ్గురిలో ఒక్కరు కూడా మీడియా ప్రతినిధులకు సరైన సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. తొక్కిసలాటకు భద్రత ఏర్పాట్లలోని లోపాలే కారణమని చెప్పి ఒప్పించలేక విఫలమయ్యారు. దీంతో వచ్చిరాని ఇంగ్లీష్ తో నేతలు జాతీయ స్థాయిలో పరువు తీశారని.. మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలను తిప్పికొట్టలేకపోయారని చంద్రబాబుఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అంతేకాక ఇక నుండి ఆంగ్ల మీడియాతో మాట్లాడే భాద్యతను గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న గల్లా జయదేవ్ కు అప్పగించారట. మొత్తానికి మన నేతలు చేసిన ఘనకార్యం వల్ల పార్టీ పరువుపోయేలా చేశారు. ఇప్పుడైనా మేల్కొని కనీసం వాదనలు వినిపించగలిగేంత ఇంగ్లీష్ నేర్చుకుంటే మంచిదని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.

ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు పుష్కరాలలో కుట్రలు?

  ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మహా పుష్కరాలను చాలా ప్రతిష్టాత్మకంగా భావించి చాలా భారీగా ఏర్పాట్లు చేసింది. కానీ ప్రతిపక్షాలు మాత్రం దానిని అంగీకరించేందుకు సిద్దంగా లేవు. అవి ఎంతసేపూ పుష్కరాల మొదటి రోజు జరిగిన దుర్ఘటన గురించి, చిన్న చిన్న సమస్యల గురించి మాత్రమే పనిగట్టుకొని చెడు ప్రచారం చేస్తున్నాయి. కానీ పుష్కర స్నానాలు చేసి వస్తున్న భక్తులందరూ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై చాలా సంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. అంచనాలకు మించి నిత్యం లక్షలాది మంది భక్తులు పుష్కరస్నానాలకు తరలివస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం తడబడకుండా గత తొమ్మిది రోజులుగా దిగ్విజయంగా పుష్కరాలను నిర్వహిస్తోంది. కానీ నిన్న సాయంత్రం రాజమండ్రి పుష్కర్ ఘాట్ సమీపంలో గోకవరం బస్ స్టాండ్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంతో ప్రభుత్వం అప్రమత్తమయింది.   ఇది పొరపాటున జరిగిన ప్రమాదమా? లేక దీని వెనుక ఏదయినా కుట్ర ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే మొదటి రోజున జరిగిన దుర్ఘటన జరిగినప్పుడు కరెంటు వైర్లు తెగిపడ్డాయని ఎవరో పుకార్లు లేవదీయడం వలననే త్రొక్కిసలాట జరిగి 27మంది చనిపోయినట్లు అధికార పార్టీకి చెందిన కొందరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. కనుక రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు ఎవరయినా ఉద్దేశ్యపూర్వకంగానే ఇటువంటి కుట్రలు పన్నుతున్నారా? లేక ఈ దుర్ఘటనలు, ప్రమాదాలు యాదృచ్చికంగా జరిగినవేనా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఈ కోణం నుండి కూడా ఈ రెండు దుర్ఘటనలపై దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ కుట్రలు జరిగి ఉండి ఉంటే అది నీచ రాజకీయాలకు పరాకాష్టగా చెప్పుకోవచ్చును. ఈ రెండు దుర్ఘటనలను దృష్టిలో ఉంచుకొని మిగిలిన ఈ రెండు రోజులు పోలీసులు, అధికారులు, పుష్కర నిర్వాహకులు, ప్రజలు అందరూ కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు.

బీజేపీకి ఆయుధాలు అందించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి

  పార్లమెంటు సమావేశాల తొలిరోజు నుండే కాంగ్రెస్, బీజేపీల యుద్ధం ప్రారంభం అయిపోయింది. లలిత్ మోడీ వ్యవహారంలో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెలను, వ్యాపం కుంభకోణం లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ల రాజీనామాలకు పట్టుబడుతున్న కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది.   కాంగ్రెస్ పాలిత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హరీష్ రావత్ వ్యక్తిగత కార్యదర్శి మహమ్మద్ షాహీద్ మద్యం షాపుల లైసెన్సులు మంజూరు చేసేందుకు లంచాల కోసం కొందరు వ్యక్తులతో చేసిన బేరసారాలను ఒక మీడియా సంస్థ స్టింగ్ ఆపరేషన్ ద్వారా చిత్రీకరించింది. ఈ సంగతి తెలుసుకొన్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ తన కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేసారు. కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఆ వీడియో క్లిప్పింగ్ బీజేపీ చేతికి చిక్కింది. బీజేపీ దానినే అస్త్రంగా మలుచుకొని కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడి చేసింది.   తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై చర్చించదానికి తాము సిద్దంగా ఉన్నామని, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా తన ముఖ్యమంత్రి హరీష్ రావత్ అవినీతి భాగోతంపై చర్చకు సిద్దపడాలని సవాల్ విసిరింది. మళ్ళీ లోక్ సభ రేపు సమావేశమయినప్పుడు ఇరు పక్షాలు మరిన్ని అస్త్రశస్త్రాలతో వచ్చే అవకాశం ఉంటుంది కనుక రేపటి నుండి పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాల మధ్య మరింత తీవ్ర వాగ్వాదాలు జరగవచ్చును.

పుష్కర్ ఘాట్ వద్ద అగ్నిప్రమాదం, ప్రాణ నష్టం లేదు

  రాజమండ్రి పుష్కరఘాట్ కి అతిసమీపంలో గోకవరం బస్టాండ్ వద్ద గల ఒక హోటల్లో గ్యాస్ సిలిండర్ నుండి గ్యాస్ లీకవడంతో పేలిపోయి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయలయినట్లు సమాచారం. కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సమీపంలో ఉన్న మూడు పోలీసు వాహనాలు, ఒక ఆటో, కొన్ని షాపులు ఈ ప్రమాదంలో దగ్ధమయ్యాయి. కానీ ఈ విషయం తెలుసుకొన్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెస్తున్నారు. అక్కడే ఉన్న పోలీసులు తీవ్ర భయాందోళనతో ఉన్న ప్రజలను ఒక పద్దతిలో చాలా వేగంగా అక్కడి నుండి దూరంగా తరలించడంతో ఎటువంటి త్రొక్కిసలాట జరగకుండా నివారించగలిగారు. పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న ఇతర వాహనాలను, ప్రజలను తక్షణమే దూరంగా తరలించి, ఎవరూ లోపలకి రాకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో పరిస్థితి పూర్తి అదుపులో ఉంది. అగ్నిమాపక సిబ్బంది కూడా చాలా అప్రమత్తంగా ఉండటంతో మంటలు చుట్టుపక్కలకు విస్తరించక ముందే అదుపుచేయగలిగారు.   ఈ ప్రమాద సంగతి తెలుసుకొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకొని అధికారులకు తగిన సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఆయనతో బాటు కొంతమంది మంత్రులు, ఉన్నతాధికారులు, పుష్కర నిర్వాహకులు అందరూ అక్కడికి చేరుకొని క్షణాలలోనే పరిస్థితిని చక్కదిద్దగలిగారు. ఈ ప్రమాదం గురించి ఎటువంటి పుకార్లను నమ్మవద్దని ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేసారు.

దసరా నాడు అమరావతికి శంకుస్థాపన.. పల్లె

  రాజమండ్రిలో ఈరోజు ఏపీ మంత్రివర్గసమావేశం జరిగింది. సమావేశం అనంతరం ఏపీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి మాట్లాడుతూ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. దాసరా నాడు అమరావతి నిర్మాణానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని..దీనికోసం ప్రధాని మోదీ కొన్ని సూచనలు చేశారని తెలిపారు. ఈనెల 26న మహాపుష్కర వనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు.. ఇందులో భాగంగా 50 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేస్తామని, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు అని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు 80 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తామని ప్రకటించారు.

ధైర్యం ఉంటే నా చరిత్ర బయటపెట్టు.. షబ్బీర్ అలీ

  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ పై మండిపడ్డారు. ఆలుగడ్డ శీను కంటే తాను సీనియర్‌ను అని, ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే తన చరిత్రను బయటపెట్టాలని తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు సవాల్ చేశారు. రాజీనామా చేశానని తలసాని నాటకాలు ఆడుతున్నారని.. ఆయన నిజంగానే రాజీనామా చేస్తే ఇంతవరకూ రాజీనామా ఎందుకు ఆమోదం పొందలేదని ప్రశ్నించారు. తలసాని దొంగమాటలను ఎట్టి పరిస్థితుల్లోను నమ్మేది లేదని ఎద్దేవ చేశారు. రాజీనామా విషయం చెప్పమంటే బ్లాక్ మెయిల్ చేసే మాటలు మాట్లాడుతూ, అసలు విషయాన్ని పక్క దారి పట్టిస్తున్నారన్నారు. తలసాని భయపెడితే భయపడేవాళ్లు ఇక్కడ ఎవరూ లేరని అన్నారు.

అమరావతికి డబ్బు ఎలా వస్తుంది!

  ఏపీ ప్రభుత్వం ఏపీ సీడ్ క్యాపిటల్ కు సంబంధించిన ఫొటోలు విడుదుల చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫొటోలతో ఒక్కసారిగా అమరావతిపై అంచనాలు అమాంత పెరిగిపోయాయి. ఈ సీడ్ క్యాపిటల్ కు సంబంధించి ప్రణాళికను ఏపీ సీఎం చంద్రబాబుకు సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ అందజేశారు. అంతేకాక అమరావతికి నిర్మాణానికి వాస్తు100 శాతం బావుందని.. ప్రపంచ దేశాలను తలదన్నేల ఏపీ రాజధాని ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అంతా బానే ఉంది కాని ఇప్పుడు ఈ రాజధాని నిర్మాణానికి కావాలసిన డబ్బు ఎక్కడినుండి వస్తుంది.. ఎవరిస్తారు అనే సందేహాలు మొదలయ్యాయి. ఒక రాష్ట్రానికి కావలసిన రాజధానిని ఉన్నపలంగా నిర్మించాలంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. అసలే రాష్ట్ర విభజన జరిగి ఆర్ధిక లోటుతో ఉన్న ఏపీకి ఎలాగొలా అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. ఇందుకుగాను తాము అప్పులుచేసి మరీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని.. 5 వేల కోట్లతో అప్పుల్లో ఉన్నామని.. ఆర్ధిక సహాయం చేయాలని కేంద్రానికి లేఖలు కూడా రాసింది ఏపీ ప్రభుత్వం. మరి అలాంటి పరిస్థితిలో ఇప్పుడు రాజధాని నిర్మాణమంటే మామూలు విషయం కాదు. .. దానికి లక్షల కోట్లు కావాలి.. ఎంతో మ్యాన్ పవర్ కావాల్సి వస్తుంది. మరి మ్యాన్ పవర్ అయితే ఉంది కానీ డబ్బులే లేవు. మరి ఆ డబ్బు ఎక్కడినుండి వస్తుంది.   దానికోసం ఏపీ ప్రభుత్వం సింగపూర్, జపాన్ దేశాల నుండి పెట్టుబడిదారులను మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానకి ఇప్పటికే చంద్రబాబు వాళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ పెట్టుబడులకు వాటాగా ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఆర్ధిక లోటు కారణంగా రాజధాని ప్రాంతంలో ఉన్న భూములను చూపించనుంది. ఈ భూముల విలువను లెక్కించి దానిని ఏపీ వాటాగా నిర్ణయిస్తారు. ఇంకా ఏపీ ప్రభుత్వం త్వరలో ఒక కంపెనీని ఏర్పాటు చేసి సింగపూర్‌, జపాన్‌ ప్రభుత్వాలు భాగస్వాములుగా చేస్తారు. సింగపూర్‌, జపాన్‌లలో ఒక దేశానికి 50 శాతం ఉంటుందని చెబుతున్నారు.. ఏపీకి 25 శాతం వాటా ఉంటుందనే అంచనా ఉంది. అయితే ఏపి రాజధాని అమరావతిలో జపాన్ పెట్టుబడులు పెడుతున్న చోట జరిగే కొనుగోళ్లలో 65 శాతం మెటీరియల్ ను జపాన్‌ కంపెనీల నుంచి కొనుగోలు చేయాలని కండీషన్ పెట్టింది. మిగిలిన 35 శాతం కొనుగోళ్లను స్థానికంగా చేసుకోవచ్చని సూచించంది.

పవన్ కళ్యాణ్ ప్రశ్నలు పనిచేశాయా!

  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలకు అన్యాయం చేస్తే ఊరుకోను ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా అని ప్రెస్ మీట్ పెట్టి నిజంగానే అందరిపై ప్రశ్నల వర్షం కురిపించారు. పనిలో పనిగా ఏపీ ప్రత్యేక హోదా గురించి కూడా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ ఎంపీలపై ప్రశ్నల బాణాలు సంధించారు. అక్కడితో ఆగకుండా ట్విట్టర్‌లో కూడా టిడిపి ఎంపీల పైన పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. దీనివల్ల పవన్ కళ్యాణ్ కి, టీడీపీ కి మధ్య విబేధాలు కూడా వస్తాయనుకున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేసిన ప్రశ్నలు నేతలపై పనిచేశాయా అంటే ఒక రకంగా పనిచేశాయనే అనిపిస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా ఏపీ సిఎం నారా చంద్రబాబు పై ఈ ప్రశ్నలు మరింత ప్రభావం చూపాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం జరిగిన సమావేశంలో చంద్రబాబు ఏపీకి రావాల్సిన అంశాలపై పట్టుబట్టాలని ఎంపీలకు, పార్టీ కేంద్రమంత్రులకు సూచించారట.   మరోవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలలో ఏపీ తరపు ఎంపీలు ప్రత్యేక హోదా కోరుతూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. పార్లమెంట్ కి వెళ్లగానే ఏం చేస్తారో తెలియదు.. వాళ్లకేమవుతుందో తెలియదు అన్న మాటలు గుర్తుపెట్టుకున్నట్టున్నారు. అలా సమావేశాలు ప్రారంభమయ్యాయో లేదో వెంటనే ఏపీ ప్రత్యేక హోదా అంశం తీసుకొచ్చారు. మరి చంద్రబాబు ఆదేశాల మేరకు పార్లమెంటు సమావేశాల్లో ప్ర్తత్యేక హోదా కోసం టిడిపి ఎంపీలు ఎంత వరకు పోరాడుతారనే విషయమై చూడాల్సి ఉంది. అలాగే, కాంగ్రెస్ పార్టీకి ఏపీ నుండి ఎంపీలు లేకపోయినప్పటికీ అధిష్టానాన్ని ఒప్పించి బిజెపిని నిలదీయాల్సి ఉంటుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ ప్రశ్నలు మన నేతల మీద బానే పనిచేశాని తెలుస్తోంది.

సుప్రీంను ఆశ్రయించిన సర్వీసు ప్రొవైడర్లు

  ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విజయవాడ కోర్టులో వాదనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ వాదనలో సర్వీసు ప్రొవైడర్లు పలు వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఎలాంటి కాల్ డేటా ఇవ్వద్దని.. మెమో ఫైల్ చేసిందని, డేటా ఇస్తే ప్రాసిక్యూట్ చేస్తామని హెచ్చరించిందని చెప్పారు. అంతేకాక ఇదే విషయంపై ఎటూ తేల్చుకోలేని సర్వీసు ప్రొవైడర్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించడం జరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం స్పందించి ఫోన్ ట్యాపింగ్ చేసిన సమాచారం నిఘా సంస్థల దగ్గర ఉంటుంది కానీ సర్వీసు ప్రొవైడర్ల దగ్గర ఉండదని.. కాబట్టి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని వారికి లేఖ రాసింది. ఇదే విషయాన్ని సర్వీసు ప్రొవైడర్లు కోర్టుకు తెలిపారు. కానీ కోర్టు దానిని తీవ్రంగా ఖండించి.. పాలనా వ్యవహారాలు వేరు, కోర్టులు వేరని.. కాల్ డేటా ఇచ్చి తీరాల్సిందే అని తేల్చి చెప్పింది.   అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సర్వీసు ప్రొవైడర్లు విజయవాడ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు. దీనిలో భాగంగానే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ నెల 24వ తేదీలోగా కాల్ డేటా ఇవ్వాలని సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించడంతో ఆ గడువు సమీపిస్తుంది కాబట్టి సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది.

రాహుల్ గాంధీ డ్రగ్స్ తో పట్టుబడ్డాడు.. సుబ్రహ్మణ్య స్వామి

  లలిత్ మోదీ వ్యవహారంపై భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. లలిత్ మోదీ విదేశీ వ్యవహారంతో సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేకి సంబంధం ఉన్న నేపథ్యంలో ఇద్దరి పై చర్యలు తీసుకోవాలని వివాదం చేస్తుంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ లలిత్ మోడీ వివాదంలో విమర్శలు చేస్తున్ననేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి స్పందించి వారికి ఘాటుగా సమాధానమిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని విమర్శించే ముందు కాంగ్రెస్ పార్టీ మొదట తమ గురించి చూసుకోవాలని విమర్శించారు. అంతేకాక గతంలో రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో డ్రగ్స్ తో ఉండగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బిఐ) అధికారులు పట్టుకున్నారని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు. అప్పుడు సోనియాగాంధీ అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్న అటల్ బిహారీ వాజ్ పేయ్ ను వేడుకోవడంతో ఆయన కల్పించుకొని నాటి అమెరికా అధ్యక్షులు జార్జ్ బుష్‌కు స్వయంగా ఫోన్ చేసి రాహుల్ ను విడిపించారని షాకింగ్ ఆరోపణ చేశారు.   అందుకే కాంగ్రెస్ పార్టీ తమ పార్టీని, పార్టీలో ఉన్న నేతలని విమర్శించే ముందు తమ గురించి ఆలోచించుకోవాలని సూచించారు. అంతేకాక వసుంధరా రాజేకు ఎవరు మద్దతూ అవసరం లేదని.. ఆమె ధైర్యంగా ఈ వివాదం నుండి బయటపడగలదని అన్నారు. కాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కూడా ఈ విషయంపై రచ్చ జరుగుతుంది.