నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, 10మంది మృతి

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది, రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం దగ్గర ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే 10మంది ప్రాణాలు కోల్పోయారు, బస్సులో డ్రైవర్ వైపు కూర్చున్న వాళ్లంతా మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు, బస్సులో మొత్తం 33మంది ప్రయాణిస్తుండగా డ్రైవర్ తో సహా 10మంది చనిపోయారు, మరికొందరి పరిస్థితి సీరియస్ గా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందంటున్నారు. క్షతగాత్రుల్లో కొందరికి కాళ్లూచేతులు విరిగిపోవడంతో ఘటనాస్థలం భయానకంగా మారింది. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్... క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు

ప్రత్యేక హోదా...ఏపీ హక్కు... గుంటూరులో జగన్ నినాదం

ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటూ గుంటూరులో దీక్ష చేపట్టిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ప్రారంభోపన్యాసం చేశారు, ప్రత్యేక హోదాపై వరుసగా చేస్తున్న పోరాటాలకు కొనసాగింపుగానే నిరవధిక నిరాహార దీక్ష చేపట్టినట్లు తెలిపారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కన్న జగన్... స్టేటస్ వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని అన్నారు, ప్రత్యేక హోదా పదేళ్లు కావాలన్న చంద్రబాబు... ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించిన జగన్... ఒకప్పుడు ప్రత్యేక హోదా సంజీవని అన్న నోటితోనే... అదేమీ సంజీవని కాదంటూ మాట మార్చారని మండిపడ్డారు, నవ్యాంధ్రలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే ప్రత్యేక హోదా కావాలన్నారు, ఈ దీక్ష ద్వారా అయినా కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తీసుకొచ్చి... రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ సాధించాలని జగన్ సూచించారు.

అక్బరుద్దీన్ ఓవైసీపై అరెస్ట్ వారెంట్ జారీ

ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో అక్బరుద్దీన్ అరెస్ట్ కు కిషన్ గంజ్ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు, మోడీపై అనుచిత వ్యాఖ్యలతోపాటు ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారని ఓవైసీ అభియోగాలు ఎదుర్కొంటున్నారు, గతంలో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లోనూ ఇదే తరహాలో వ్యాఖ్యలు చేయడంతో జైలుకెళ్లిన అక్బర్... ఇప్పుడు మళ్లీ అదే తరహా కేసులో ఇరుక్కున్నారు, దాంతో అక్బరుద్దీన్ ను బీహార్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముందని, మళ్లీ జైలుకెళ్లడం ఖాయమని వార్తలు వస్తున్నాయి.

అమరావతికి వంద ప్రత్యేక విమానాలు

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవాన్ని పెద్ద పండుగులా చేయాలనుకుంటున్న ఏపీ ప్రభుత్వం.... తరలివచ్చే అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది, శంకస్థాపన కార్యక్రమానికి వచ్చే వీవీఐపీలను తరలించేందుకు వంద ప్రత్యేక విమానాలను వినియోగించాలనుకుంటోంది, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, హైదరాబాద్ విమానాశ్రయాల ద్వారా అతిథులను తరలించడంతోపాటు అమరావతి పరిసర ప్రాంతాల్లో 13 హెలిప్యాడ్లను కూడా రెడీ చేస్తోంది, దేశ విదేశాల నుంచి తరలివచ్చే అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం.... శంకుస్థాపన కార్యక్రమాన్ని కళ్లుచెదిరే రీతిలో చేయనుంది, ఈ కార్యక్రమం నిమిత్తం మొత్తం మూడు వేదికలను రెడీ చేస్తున్నారు, ప్రధాన వేదికపై ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, గవర్నర్ నర్సింహన్, కేంద్ర మంత్రులు, జపాన్, సింగపూర్ తోపాటు విదేశీ ప్రతినిధులు మాత్రమే కూర్చుంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి

కృష్ణాలో మాగంటి వర్సెస్ ముద్రబోయిన

కృష్ణాజిల్లా నూజివీడు టీడీపీ ఇన్ ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వర్రావుకి, ఏలూరు టీడీపీ ఎంపీ మాగంటి బాబుకి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి, ముద్రబోయిన, మాగంటి ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు, తనకు సమాచారం ఇవ్వకుండా మాగంటి బాబు... ఆయన బంధువులను, ఇతర నేతలను తీసుకుని తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని, తాను బీసీని అయినందువల్లే ఇలా చేస్తున్నారని ముద్రబోయిన ఆరోపిస్తున్నారు, అయితే ముద్రబోయిన ఆరోపణలను ఖండించిన మాగంటి... తాను నూజివీడు నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ముద్రబోయినకు ఫోన్ చేశానని, కానీ ఆయన హైదరాబాద్ లో ఉన్నానని చెప్పారని అంటున్నారు, మాగంటి వ్యాఖ్యలను ముద్రబోయిన కూడా ఖండిస్తున్నారు, తనకు అసలు ఫోనే చేయలేదని... అయినా తనంటే గిట్టని నాయకులను వెంటబెట్టుకుని తన నియోజకవర్గంలో పర్యటించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు

మంత్రి బొజ్జల భార్యపై వైసీపీ తీవ్ర ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి భార్యపై వైసీపీ లీడర్ మధుసూదనారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు, శ్రీకాళహస్తి ఆలయంపై బొజ్జల భార్య, కుటుంబ సభ్యుల పెత్తనం పెరిగిపోయిందని, బొజ్జల ఫ్యామిలీ ఆదేశాలను గుడిలో అమలు చేస్తున్నారంటూ ఆరోపించారు, శ్రీకాళహస్తి ఆలయంలోని వ్యవహారాలన్నీ బొజ్జల భార్య కనుసన్నల్లోనే సాగుతున్నాయని, ఇదేమైనా బొజ్జల ఫ్యామిలీ జాగీరా అంటూ మధుసూదనారెడ్డి ప్రశ్నించారు, గుడిలో తనిఖీలు చేస్తూ హడావిడి చేస్తున్న మంత్రి సతీమణి.... ఏ హోదాలో చేస్తున్నారో చెప్పాలన్నారు, మంత్రిగా బొజ్జలకు శ్రీకాళహస్తి ఆలయంపై సమీక్ష చేసే అధికారముందని, ఆయన భార్యకు కూడా అధికారాలుంటాయా అని ప్రశ్నించారు, ఇక్కడ జరుగుతున్న అవినీతికి కూడా మంత్రి కుటుంబం కొమ్ముకాస్తోందని వైసీపీ లీడర్ మధుసూదనారెడ్డి ఆరోపించారు

హెరిటేజ్ కోసమే కుప్పంలో ఎయిర్ పోర్ట్?

హెరిటేజ్ సంస్థ కోసమే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఎయిర్ పోర్ట్ నిర్మిస్తున్నారని  ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు, ఎయిర్ పోర్ట్ భూసేకరణకు వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో పర్యటించిన తనపై టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేయడంపై రఘువీరా మండిపడ్డారు, బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, భూములు ఇవ్వడానికి ఇష్టంలేని రైతుల నుంచి బలవంతంగా తీసుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు, కుప్పంలో ఎయిర్ పోర్ట్ నిర్మించాలనుకుంటే 200 ఎకరాలు సరిపోతాయని, దానికి గ్రామం పక్కనే ఉన్న అటవీ భూములను వాడుకోవచ్చని ప్రభుత్వానికి సూచించారు. అయితే ఎయిర్ పోర్ట్ కోసం భూములు ఇవ్వడానికి మెజార్టీ రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, బలవంతంగా భూమలు తీసుకుంటే సామూహికంగా ఆత్మహత్యలకు పాల్పడతామని రైతులు హెచ్చరిస్తున్నారు.

అదేంటీ... ఆంటీకి ఆ పదవి ఇచ్చారు?

సినీనటి నగ్మాకు కాంగ్రెస్ లో పార్టీ పదవి దక్కింది, నగ్మాను ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు, సేమ్ టు సేమ్ అలాంటి పదవినే తెలంగాణ ఎమ్మెల్సీ ఆకుల లలితకు కూడా కట్టబెట్టారు, అయితే బోల్డంత సినీ గ్లామర్ ఉన్న నగ్మాకు మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వకుండా... ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడమేంటని పార్టీ నేతలంటున్నారు, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమోదముద్రతో ఈ నియామకాలన్నీ జరిగాయి, అయితే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అపాయింటైన శోభా ఓజాతో కలిసి నగ్మా, ఆకుల లలితలు పార్టీ బలోపేతం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడతారో చూడాలి

ఓట్ల తొలగింపుపై ఆధారాలేవీ? భన్వర్ ప్రశ్న

హైదరాబాద్లో ఓట్లు తొలగిస్తున్నారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్ లాల్ స్పందించారు, ఓట్లు తొలగిస్తున్నారంటూ రాజకీయ పార్టీలు ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తున్నా ఆధారాలు మాత్రం చూపడం లేదన్నారు, అయితే ఇప్పటివరకు 6.3 లక్షల ఓట్లు తొలగించామని, మరో 19 లక్షల మందికి నోటీసులు ఇచ్చామని భన్వర్ లాల్ తెలిపారు, ఒకవేళ తొలగించిన ఓట్లలో అవకతవకలు ఉంటే... ఆధారాలతో సహా తెలియజేయాలని పార్టీలకు సూచించారు, ఎన్నికల సంఘం తొలగించిన ఓట్ల జాబితాను, అలాగే నోటీసులు ఇచ్చిన లిస్ట్ ను అన్ని రాజకీయ పార్టీలకు అప్పగించిన భన్వర్ లాల్... అభ్యంతరాలుంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలని సూచించారు.

భారత్-జర్మనీ దేశాల మధ్య ఐదు ఒప్పందాలపై సంతకాలు

  జర్మనీ ఛాన్సిలర్ ఎంజల్ మెర్కెల్ మూడు రోజుల భారత్ పర్యటనలో భాగంగా ఈరోజు బెంగుళూరులో పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఎంజల్ మెర్కెల్ సమక్షంలో ఇండో-జర్మన్ సమ్మిట్ లో ఇరుదేశాలకు చెందిన వివిధ సంస్థల మధ్య ఈరోజు ఐదు ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి.   వాటిలో మొదటగా గుజరాత్ ఇంటర్ నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ-సీమెన్స్ సంస్థల మధ్య ఒక ఒప్పందం పత్రాలపై ఆ సంస్థల ప్రతినిధులు సంతకాలు చేసారు. ఈ ఒప్పందంలో భాగంగా సీమెన్స్ సంస్థ నగరాలలో మొబైల్ సేవలకు అవసరమయిన సాంకేతిక పరిజ్ఞానం అందిస్తుంది.   రెండవ ఒప్పందం టాటా పవర్ మరియు రోడే అండ్ ష్వార్జ్ సంస్థల మధ్య జరిగింది. సాఫ్ట్ వేర్ ఆధారిత రేడియో (యస్.డి.ఆర్.) రంగంలో ఆ రెండు సంస్థలు కలిసి పనిచేస్తాయి.   మూడవ ఒప్పందం ఓ.పి.జి. పవర్ వెంచర్స్ మరియు ఐ.బి.సి. సోలార్ మధ్య సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం ఒప్పందం జరిగింది. వాటి కోసం ఆ రెండు సంస్థలు కలిసి మూడు స్పెషల్ పర్పస్ కంపెనీలను ఏర్పాటు చేసుకొంటాయి.   నాలుగవ ఒప్పందం నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ మరియు ఇంఫీనియన్ కార్పోరేషన్ మధ్య జరిగింది. ఎలక్ట్రికల్ సెమీ కండక్టర్స్ సంస్థల ఏర్పాటుకి ఇంఫీనియన్ కార్పోరేషన్ సహకరిస్తుంది.   ఐదవ ఒప్పందం హెచ్.ఎం.టి. మరియు ఫ్రావున్ హోఫర్ సమస్థల మధ్య జరిగింది. జర్మనీకి చెందిన అ సంస్థ హెచ్.ఎం.టి.కి భారీ యంత్రాలు నిర్మాణానికి సహకరిస్తుంది.

హైదరాబాద్ లో కేబుల్ ప్రసారాలు బంద్

అక్టోబర్ ఏడున హైదరాబాద్లో కేబుల్ ప్రసారాలు నిలిచిపోనున్నాయని తెలుస్తోంది, డిజిటలైజేషన్ కు వ్యతిరేకంగా కేబుల్ ఆపరేటర్లంతా ఒకరోజు బంద్ పాటించాలని నిర్ణయించడంతో కేబుల్ ప్రసారాలు రాకపోవచ్చని తెలంగాణ కేబుల్ టీవీ ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జితేందర్ ప్రకటించారు, డిజిటలైజేషన్ పేరుతో కేబుల్ ఆపరేటర్లపైనా, వినియోగదారులపైనా భారం మోపుతున్నారని, డిజిటలైజేషన్ అయితే వినియోగదారుడు అన్ని పన్నులతో కలిపి 600 రూపాయల వరకూ చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని జితేందర్ అంటున్నారు, డిజిటలైజేషన్ కు తాము వ్యతిరేకం కాకపోయినా, ఎంఎస్వోలు రేట్లు పెంచాలని తమపై ఒత్తిడి పెంచుతున్నారని, దాంతో వినియోగదారులపైనే చివరికి భారం పడనుందని చెబుతున్నారు,  అక్టోబర్ ఏడున ఉదయం 6గంటల నుంచి 24గంటలపాటు బంద్ ను పాటిస్తామని, దీనికి హైదరాబాదీలు సహకరించాలని కేబుల్ ఆపరేటర్లు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

కేసీఆర్ పై టీకాంగ్రెస్ శ్రవణ్ తీవ్ర వ్యాఖ్యలు

మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దందాలు చేస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని టీకాంగ్రెస్ చీఫ్ స్పోక్స్ పర్సన్ శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు, ఇసుక మాఫియా, గ్రానైట్ దందా, దొంగనోట్ల వ్యాపారంలో ఉన్న మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు  సంబంధాలున్నాయని ఆరోపించిన శ్రవణ్...దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా అధికార పార్టీ నేతలు పనిచేస్తున్నారని ఆరోపించారు, ఇవన్నీ తెలిసినా ముఖ్యమంత్రి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని, కేసీఆర్ నిజంగానే నిజాయితీపరుడైతే... మంత్రులు, ఎమ్మెల్యేల దందాలపై ప్రముఖ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు, టీఆర్ఎస్ నేతలు ఒకపక్క దందాలు చేస్తూ మరోవైపు సత్యహరిశ్చంద్రుడి వారసుల్లాగా మాట్లాడుతున్నారని, కేసీఆర్ ధృత‌రాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు

సెక్రటేరియట్ లో టీడీపీ ఎమ్మెల్యే వీరంగం

సెక్రటేరియట్ లో టీడీపీ ఎమ్మెల్యే వీరంగం ఏపీ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు... ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో వీరంగమాడినట్లు తెలుస్తోంది. మున్సిపల్ శాఖ కార్యదర్శి కరికల్ వలవన్ ఛాంబర్లోకి ప్రవేశించి గందరగోళం సృష్టించారని చెబుతున్నారు. నియోజకవర్గ పని నిమిత్తం మున్సిపల్ కార్యదర్శి కరికల్ ను కలవడానికి వెళ్లగా అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. కరికల్ పేషీలోకి చొరబడి సిబ్బందిపై చిందులేసిన వెలగపూడి... ఫైళ్లను విసిరేసి, నీళ్ల గ్లాసులను కిందికి విసిరికొట్టినట్లు చెబుతున్నారు, అంతేకాకుండా మున్సిపల్ కార్యదర్శిని ఇష్టమొచ్చి తిట్టి నానా రభస చేశాడని, అదే సమయంలో కరికలన్ తో సమావేశమైన విదేశీ ప్రతినిధులు... రామకృష్ణబాబు వీరంగాన్ని విస్తుపోయారట.

రైతులను దొంగలంటారా? టీడీపీని తప్పుబట్టిన బీజేపీ

విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్ట్ భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారంతా దొంగ రైతులంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు చేసిన వ్యాఖ్యలను బీజేపీ తప్పుబట్టింది, రైతులను దొంగలతో పోల్చడం సరికాదన్న బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి... అన్నదాతలను అవమానించేలా మాట్లాడొద్దని సూచించారు, కళావెంకట్రావు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్న ఆయన.... విమానాశ్రయాల కోసం అంత పెద్దఎత్తున భూములు తీసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు, చెన్నై ఎయిర్ పోర్ట్ కేవలం 1400 ఎకరాల్లోనే ఉందని, మరి దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇన్ని వేల ఎకరాలు భోగాపురంలో ఎందుకంటూ బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి ప్రశ్నించారు.

ఫ్రాన్స్ లో వెంకయ్యకు చేదు అనుభవం

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకి ఫ్రాన్స్ లో చేదు అనుభవం ఎదురైంది, బోర్డెక్ నగరంలో రౌండ్ టేబుల్ మీటింగ్ కోసం ఫ్రాన్స్ వెళ్లిన వెంకయ్యకు అక్కడి ఎయిర్ పోర్ట్ అధికారులు తీసుకున్న నిర్ణయంతో ఇబ్బందులు పడ్డారు, ఎయిర్ ఫ్రాన్స్ అధికారులు...ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెంకయ్యనాయుడు ఫ్లైట్ టికెట్ ను రద్దు చేయడంతో... 600 కిలోమీటర్లు రోడ్డుమార్గంలో ప్రయాణించవలసి వచ్చింది, పైగా ఆ సమయంలో భారీ వర్షం పడటంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందని వెంకయ్య ట్విట్టర్లో ట్వీట్ చేయడంతో సమాచారం తెలుసుకున్న ఫ్రాన్స్ మంత్రి... ఆ ఘటనపై విచారణకు ఆదేశించారు. వెంకయ్యనాయుడుకి క్షమాపణలు చెప్పిన ఫ్రాన్స్ సర్కార్.... విమాన టికెట్ ఎందుకు రద్దు చేశారో ఎంక్వైరీ చేయిస్తున్నట్లు ప్రకటించారు