జగన్మోహన్ రెడ్డితో కేసీఆర్ కూతురు భేటీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత భేటీ అయ్యింది, లోటస్ పాండ్ లోని జగన్ నివాసానికి వెళ్లిన నిజామాబాద్ ఎంపీ కవిత... జగన్ తోపాటు ఆయన సతీమణి భారతితో కూడా సమావేశమైనట్లు తెలుస్తోంది. అయితే మీడియాకి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఈ భేటీపై పలు ఊహాగానాలు చెలరేగినా, బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానించడానికే భారతిని కలిసినట్లు తెలుస్తోంది, ప్రస్తుతం సాక్షి మీడియా గ్రూప్ బాధ్యతలు చూస్తున్న భారతిని మర్యాదపూర్వకంగానే ఆహ్వానించామని, త్వరలో అన్ని టీవీ ఛానల్స్ ను కలిసి బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనాలని కోరనున్నట్లు చెబుతున్నారు

అమెరికాలో ఉన్మాది కాల్పులు, 9మంది మృతి

  అమెరికాలో గురువారం ఉదయం ఒరెగాన్ వద్ద గల వుంపక్ కమ్యూనిటీ కాలేజీ విద్యార్ధులపై ఒక ఉన్మాది కాల్పులు జరపడంతో 9 మంది మరణించగా 7 మంది విద్యార్ధులు గాయపడ్డారు. తాజా సమాచారం ప్రకారం అతను విద్యార్ధుల మతం గురించి అడిగి తెలుసుకొన్న తరువాత వారిని కాల్చి చంపాడు. తక్షణమే అక్కడికి చేరుకొన్న పోలీసులు కాల్పులకు తెగబడ్డ వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా అతను వారిపై కూడా కాల్పులు జరిపాడు. కానీ పోలీసులు అతనిని చాకచక్యంగా బంధించగలిగారు. అతనిని చిరిస్ హార్పర్ మెర్సెర్ (26) గా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన అమెరికా కాలమాన ప్రకారం గురువారం ఉదయం 10.30 గంటలకు జరిగింది. అతను వించిస్టర్ ఒరెగాన్ లో ఒక అపార్ట్ మెంటులో తన తల్లితో కలిసి ఉంటున్నట్లు పోలీసులు గుర్తించి అతని ఇంటిని కూడా శోదా చేశారు. అతను ఇంటర్ నెట్ లో ‘మై స్పేస్’ అనే బ్లాగ్ నడిపిస్తున్నట్లు గుర్తించారు. అందులో అతని ఫోటోలు, అతని గ్రూప్ మెంబర్ల వివరాలు, ఆ బ్లాగ్ ద్వారా అతను వ్యాపింపజేస్తున్న మత సంబంధిత భావజాలం పోలీసులు అధ్యయనం చేస్తున్నారు.

బీహార్ లో బీజేపీ బీసీ ప్రయోగం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడటంతో బీజేపీ కొత్త ఎత్తువేసింది, రిజర్వేషన్లపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలతో కొంచెం ఇబ్బంది పడుతున్న బీజేపీకి బూస్టింగ్ ఇచ్చేలా కేంద్ర నాయకత్వం కీలక ప్రకటన చేసింది, బీహార్ లో ఎన్డీఏ అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామంటూ కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ప్రకటించారు. రిజర్వేషన్లపై మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను ఆధారం చేసుకుని ప్రత్యర్ధి పార్టీలైన జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ లు ప్రజల్లోకి వెళ్తుండటంతో జాగ్రత్తపడిన బీజేపీ ఈ విధాన ప్రకటన చేయాల్సి వచ్చింది, దాంతో నితీష్, లాలూ ప్రచారాన్ని బీజేపీ వ్యూహాత్మకంగా తిప్పికొట్టినట్టయింది. అన్ని సర్వేల్లోనూ ముందున్న బీజేపీకి ఈ బీసీ మంత్రం ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి

ఆంబోతులా... ఎంత మాటన్నావ్ నారాయణా!

సీపీఐ నారాయణ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, ప్రధాని నరేంద్రమోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ లపై విరుచుకుపడ్డ నారాయణ.... ఆ ముగ్గురినీ ఏకంగా ఆంబోతులతో పోల్చినట్లు వార్తలు వస్తున్నాయి, దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.... మోడీ, బాబు, కేసీఆర్ లు కొత్త పెళ్లికొడుకుల్లా విహారయాత్రలు చేస్తున్నారని విమర్శించారు, అన్నదాతలు ఆక్రందనను పట్టించుకోకుండా ఆంబోతుల్లా తిరుగుతున్నారని నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి వ్యాఖ్యలతో గతంలో చిక్కులు కొనితెచ్చుకున్న సీపీఐ నారాయణ... తాజా కామెంట్స్ తో ఎలాంటి ఇబ్బందుల్లో పడతారో చూడాలి

భోగాపురం సముద్రం ఒడ్డుకి చేరిన చిన్నారి అదితి మృతదేహం

  వారం రోజుల క్రితం విశాఖనగరంలో ప్రమాదవశాత్తు ఒక కాలువలో పడికొట్టుకుపోయిన ఆరేళ్ళ చిన్నారి అదితి, గురువారం మధ్యాహ్నం విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బపాలెం వద్ద గల సముద్ర తీరానికి శవమై కొట్టుకు వచ్చింది. ఆమె తండ్రి సత్య శ్రీనివాసరావు పాప ఒంటిపై ఉన్న దుస్తులను బట్టి ఆమె తన కూతురేనని దృవీకరించారు. గత వారం రోజులుగా పాప పడిపోయిన చోట నుండి సముద్రం వరకు గల కాలువలను, చివరికి సముద్రంలో కూడా హెలికాఫ్టర్ ద్వారా గాలించినప్పటికీ ఆమె ఆచూకి దొరకకపోవడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. కానీ చివరికి ఆ చిన్నారి అదితి పక్క జిల్లాలో సముద్రం ఒడ్డున శవం అయి తేలింది. ఇంతవరకు ఆశగా ఎదురుచూసిన పాప తల్లితండ్రుల ఆ చిన్నారిని ఆ స్థితిలో చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పాప శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం కోసం విశాఖకు తరలించారు.

ఏపీకి జగన్ అతిథా?

  రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదట హైదరాబాద్ లోనే ఉండి పాలనా కార్యక్రమాలు నిర్వహించినా ఆతరువాత అది సాధ్యం కాదని భావించి వారంలో మూడు రోజులు అక్కడ మూడు రోజులు విజయవాడలో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆతరువాత అది కూడా కాదని ఇప్పుడు మొత్తంగా అక్కడే ఉండి పాలనా విధానాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఫోకస్ ప్రతిపక్ష నేత అయిన జగన్ మీద పడింది. ప్రతిపక్షనేత ఏపీకి అతిధిగా మారారని విమర్శలు తలెత్తున్నాయి. ప్రతిపక్షనేత జగన్ హైదరాబాద్ ను విడిచిపెట్టడానికి అస్సలు ఇష్టపడటం లేదని.. ఎప్పుడో ఒకసారి ఏపీకి వస్తున్నారని గుసగుసలాడుకుంటున్నారు. అంతేకాదు పార్టీ నేతలు ఏపీకి వెళదాం అని సూచించినా కూడా ఇప్పుడే వెళ్లి ఏం చేస్తాం అని కూడా అంటున్నారట. మరోవైపు చంద్రబాబు తనయుడు లోకేశ్ కూడా విజయవాడలో ఉండటంతో జగన్ కు రాబోయే కాలంలో ఇదే మైనస్ పాయింట్ అవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారట. మరి ఇప్పుడైనా జగన్ ఏపీ మకాం వేయడానికి ఇష్టపడతారో లేదో చూడాలి.

రాజకీయాల్లోకి రాను... కోదండరాం క్లారిటీ

తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పదవి విరమణ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తన పొలిటికల్ ఎంట్రీపై ఒక క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో చాలా ముఖ్య భూమిక పోషించిన కోదండరాం.. ఆతరువాత మళ్లీ తన వృత్తినే కొనసాగించారు కాని ఎలాంటి పదవి ఆశించలేదు. అప్పుడప్పుడు ప్రజాసమస్యలపై అధికారపార్టీని ప్రశ్నించేవారు అంతే. అయితే కోదండరాంని రాజకీయాల్లోకి తీసుకురావడానికి పలు రాజకీయపార్టీలు చాలా రకాలుగా ప్రయత్నించాయి. దీనిపై అప్పట్లో కోదండరాం కొత్తపార్టీ పెడుతున్నారని.. అధికార పార్టీ పని ఇక అయిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి. కోదండరాం కూడా ఈవిషయంలో చర్చలు జరుగుతున్నాయని చెప్పారే కాని అప్పుడు క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈరోజు పదవీవిరమణ చేసిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ తనకు పదవుల మీద వ్యామోహం లేదని.. తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని.. రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు. మీడియా వాళ్లు ఎన్నిసార్లు ఈ ప్రశ్న అడిగినా తన సమాధానం ఇదేనని చెప్పారు. మొత్తానికి కోదండరాం పొలిటికల్ ఎంట్రీ లేనట్టు అర్ధమయిపోయింది. ఇన్నీరోజులు కోదండం ఎంట్రీతో అధికార పార్టీకి గట్టిపోటీ ఇస్తారు అనుకుంటే ఇప్పుడు అలాంటిది ఏం లేదని చెప్పడంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోటీ లేనట్టే. ఒకరకంగా ఇది టీఆర్ఎస్ కు హ్యాపీ న్యూసే.

కేటీఆర్ పై అక్బరుద్దీన్ ఫైర్.. అక్బరుద్దీన్ అసలు ప్లాన్ అదా?

  తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రైతు ఆత్మహత్యాలపై జరిగిన సమావేశంలో తెలంగాణ ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అక్బరుద్దీన్ ఒవైసీ అధికార పార్టీ దుమ్ము దులిపేశారు. మద్యలో కలుగజేసుకున్న కేటీఆర్ కు కూడా ఘాటుగానే సమధానం చెప్పి కేటీఆర్ ను సైతం ఏం మాట్లాడనీయకుండా చేశారు. అయితే తాను రైతుల ఆత్మహత్యలపై అంతలా రియాక్ట్ అవడానికి వేరే కారణం ఉందని వార్తలు వచ్చాయి. తాను కూడా చావు దాకా వెళ్లానని..ఆ బాధ నాకు తెలుసని అక్బరుద్దీన్ చెప్పినట్టు తెలిసింది. అయితే దానికి మరో కారణం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అసలు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చూసిన సంగతి అందరికి తెలిసిందే. దీనిలో భాగంగానే వారితో మంతనాలు కూడా జరిపింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల అనంతరం ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తున్న తరుణంలో టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. అయితే అక్బరుద్దీన్ అంతలా విరుచుకుపడటానికి కారణం లేకపోలేదు. అసలే ప్రస్తుతం అధికార ప్రభుత్వం పరిస్థితి అంతంత మాత్రం ఉంది. రాష్ట్రం ఏర్పడినప్పుడు కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకం  ఇప్పుడు ప్రజల్లో లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అనవసరంగా టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని పార్టీని కష్టాల్లో పడేయటం కంటే పొత్తు పెట్టుకోకుండా ఉండటమే మంచిదని ఆలోచించిన అక్బరుద్దీన్ ఈరకంగా అసెంబ్లీ సాక్షిగా అధికార పార్టీ పై ఉన్న వ్యతిరేకతను చూపించారని రాజకీయ వర్గాల వెల్లడి.  అందుకే రైతు ఆత్మహత్యల సమావేశంలో కేటీఆర్ ను టార్గెట్ చేశారని అనుకుంటున్నారు.

దసరా మాదిరి అమరావతి శంకుస్థాపన.. ప్రత్తిపాటి

  ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని దసరా రోజు అంటే అక్టోబర్ 22న నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ  శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఈ శంకుస్థాపనపై వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ దసరా రోజు జరిగే అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి లక్షమందిని ఆహ్వానిస్తున్నామని.. ప్రధాని నరేంద్ర మోడీతోపా టు సింగపూర్, జపాన్ ప్రధానులు కూడా విచ్చేస్తున్నారని.. ప్రధాని మోడీ చేతుల మీదుగా రాజధాని భూమిపూజ జరుగుతుందన్నారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి పదివేల గ్రామాల నుండి రైతులను ఆహ్వానిస్తున్నామని.. దసరా పండుగకి నవరాత్రులు ఉన్న మాదిరిగా ఈ నెల 13నుంచి 22వ తేది వరకు ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

వాళ్లకు క్షమాపణ చెప్పాల్సిందే.. హరీష్ రావు

తెలంగాణ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ నేత ప్రభాకర్ రావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాలలో భాగంగా ప్రభాకర్ రావు పోలీసు వ్యవస్థపై విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ బాలేదని.. పేకాటలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. దీంతో ప్రభాకర్ రావు చేసిన వ్యాఖ్యలను హరీశ్ రావు తీవ్రంగా ఖండిస్తూ ప్రభాకర్ రావు పోలీసులను అవమానపరుస్తూ వ్యాఖ్యానించారని అన్నారు. అంతేకాదు పేకాట క్లబ్ లు నడిపింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. క్లబ్‌లను మూయించిన ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్ మాత్రమే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పోలీసు వ్యవస్థను కించపరిచే మాటలు మాట్లాడి వారి మనోభావాలు దెబ్బతీస్తున్నారని.. ఇలాంటి అవాంఛిత వ్యాఖ్యలు చేసిన ప్రభాకర్ రావు పోలీసులకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని డిమాండ్ చేశారు. ప్రాణాలకు తెగించి పోలీసులు మీకు భద్రత కల్పిస్తుంటే వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.

చంద్రబాబు బాగా ఆలోచించి ఇచ్చినట్టున్నారు

టీడీపీ అధినేత చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా ఆలోచించి నేతలకు పదవులు కట్టిపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం చంద్రబాబు రాష్ట్ర, జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులను ప్రకటించిన నేపథ్యంలో పలువురుకి పదవులు ఇవ్వడంపై చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే నారా లోకేశ్ కు జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యలు ఇచ్చారు. ఇక తెలంగాణ సంగతికి వచ్చేసరికి ఎన్నో అనుమానాలు.. ఎన్నో ట్విస్ట్ ల నేపథ్యంలోఈసారి కూడా పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు ఎల్. రమణకే అప్పగించారు. దీని వెనుక కారణం లేకపోలేదు. ఎల్ రమణ బిసి వర్గానికి చెందిన నేత.. టీడీపీకి బిసిలలో మంచి పట్టు ఉంది.. కనుక ఈ వర్గాన్ని దూరం చేసుకోవద్దనే కారణంతో మళ్లీ పార్టీ పగ్గాలు ఎల్. రమణకే చెందాయి. మరోవైపు ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిండెంట్ ఇవ్వడంపై కూడా  పలు కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా కేసీఆర్ ను ఎదుర్కోవడం మొదటిది. దీనివల్ల అతి తక్కువ కాలంలోనే రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వరించింది. ఇంకా ఎర్రబెల్లి.. ముందు అధ్యక్ష పదవి కోసం చూసినా అది మాత్రం రాలేదు.. ఎప్పిటిలాగే పోలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. బిసి నేత దేవేందర్ గౌడ్‌ను కూడా పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారుయ. అంతేకాదు గత సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ కు మంచి పోటీ ఇచ్చిన ఒంటేరు రైతు విభాగం అధ్యక్షునిగా.. శోభారాణిని తెలుగు మహిళా అధ్యక్షురాలిగా తీసుకున్నారు. మొత్తానికి చంద్రబాబు సభ్యల ఎన్నికల విషయంలో చాలా లోటుపాట్లు ఆలోచించి పదవులు కట్టబెట్టినట్టే కనిపిస్తుంది.

రోడ్లు ఊడుస్తూ బీజేపీ నేతల నిరసన

  తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈరోజు తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ రోజు సభ ప్రారంభంకాగానే అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీలు విరుచుకుపడ్డాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు తమ డిమాండ్లతో ఆందోళనకు దిగారు. కానీ స్పీకర్ మాత్రం వాటిని తిరస్కరించి ప్రశ్నోత్తరాలకు సమయాన్ని కేటాయించారు. దీంతో ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఒకపక్క ఆందోళన జరుగుతున్నా టీఆర్ఎస్ సభ్యురాలు కొండా సురేఖ అంగన్ వాడీ సమస్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావును ప్రశ్నలు వేయగా ఆయన సమాధానమిచ్చారు. అయినా కానీ ప్రతిపక్షాలు ఆందోళన విరమింపకపోవడంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా మరోవైపు బీజేపీ నేతలు అసెంబ్లీ ముందు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జీహెచ్ఎంసీలో తొలగించిన పారిశుధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని.. జీతాలు పెంచాలని జీహెచ్ఎంసీ కార్మికుల బట్టలు ధరించి చీపుర్లతో రోడ్లు ఊడ్చారు.

ముందు భోజనానికి వెళదాం పదండి.. జానాతో కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి మధ్య జరిగిన సంభాషణ నవ్వులు పూయించింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో రైతు ఆత్మహత్యలపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించిన అనంతరం జానారెడ్డి మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలపై అధికార పార్టీకి కొన్ని సూచనలు.. సలహాలు ఇవ్వాల్సి ఉందని.. అయితే దీనికి కొంచెం సమయం ఎక్కువ పడుతుంది.. ఇప్పుడు కొంచెం.. భోజనం తరువాత కొన్ని చెపుతానని అన్నారు. దానికి కేసీఆర్ దానిని అవును భోజనం చేస్తేనే బాగా మాట్లాడుకుంటాం.. బాగా చర్చించుకుంటాం అని అన్నారు. దీనికి వెంటనే జానారెడ్డి భోజనం తర్వాత మీరు సభలో ఉంటారా అని ప్రశ్నించగా దానికి కేసీఆర్ తప్పకుండా ఉంటాను ముందు భోజనానికి వెళదాం పదండి అని అందరిని నవ్వించారు. సాధారణంగా అసెంబ్లీలో ప్రతిపక్షాలు అధికార పక్షాలు కలిసి ఒకరి మీద ఒకరు మాటల యుద్ధాలు చేసుకుంటారు.. కలిసి చర్చించుకోవడం.. సలహాలు సూచనలు తీసుకోవడం అరుదు.. ఈ రోజుల్లో అది చాలా కష్టం. కాని జానారెడ్డి.. కేసీఆర్ సంయమనం చూస్తే ఎప్పుడూ ఇదే తీరు అవలంబిస్తే.. ఒకరికి ఒకరు మర్యాద ఇచ్చుకుంటూ చర్చించుకుంటే ప్రజలు సమస్యలు తీరడం పెద్ద కష్టమేమి కాదనిపిస్తుంది.

కేసీఆర్ కు చిరాకు తెప్పించిన మంత్రి..నీ పని నువ్వు చూసుకో

  తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రైతు ఆత్మహత్యలపై.. వరంగల్ ఎన్ కౌంటర్ పై..ఇంకా పలు అంశాలపై చర్చ జరుగుతూ ప్రతిపక్షాల వాదనలు.. అధికార పక్షాల వాదనలతో అట్టడుకుతోంది. అయితే సాధారణంగా నేతలు ప్రత్యర్ధులపై కామెంట్లు..కౌంటర్లు ఇస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఓ మంత్రిగారు అత్యుత్సాహం చూపి తన రాజకీయ అభ్యర్ధిపైనే కామెడీగా మాట్లాడేసరికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో చెప్పించుకోవాల్సి వచ్చింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ మధుసూధనాచారి వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటన చదవటం మొదలు పెట్టారు. స్పీకర్ మధుసూదనాచారి ఆయన్ను కూర్చోమని చెప్పినా వ్యవసాయ మంత్రి మాత్రం తన ప్రకటన చదువుకుంటూ వెళుతున్నారు. అయితే ఆ సమయంలో మంత్రి జగదీశ్ కల్పించుకొని కాస్త గట్టిగా ఓ అన్నా కూకో అన్నా అంటూ గట్టిగా వ్యాఖ్యనించారు. అయితే జగదీశ్ చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ అసహనం వ్యక్తం చేస్తూ నీకేం పని.. నీ పని నువ్వు చూసుకో అంటూ హెచ్చరించారు. మొత్తానికి ప్రత్యర్ధుల మీద దూకుడు చూపించే జగదీశ్ రెడ్డి పార్టీ అభ్యర్దులపై కూడా చూపిస్తే ఎలా ఉంటుందో మంత్రిగారికి తెలిసొచ్చుంటుంది.

పాలసముద్రంలో బెల్ కి శంకుస్థాపన

  రాష్ట్రంలో అత్యంత వెనుక బడిన జిల్లా అనంతపురం. ఎన్ని ప్రభుత్వాలు మారినా దాని పరిస్థితిలో మారలేదు. కానీ రాష్ట్ర విభజన పుణ్యమాని ఇప్పుడు ఆ జిల్లాలో చాల వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పటికే అక్కడ సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. జిల్లాలో గోరంట్ల మండలంలో పాలసముద్రం వద్ద భారత్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) అనే జాతీయ సంస్థ ఏర్పాటు కాబోతోంది. దానికి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ శంఖుస్థాపన చేసారు.   చాలా భారీ వ్యయంతో నిర్మించబోతున్న బెల్ సంస్థలో రక్షణ రంగానికి చెందిన భారీ యంత్రాలు, రాడార్లు మొదలుకొని చిన్నచిన్న యంత్ర పరికారాలు వరకు తయారవుతాయి. ఈ సంస్థ ఎక్కడ ఏర్పాటు చేస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాలలోనే దాని అనుబంధ పరిశ్రమలు చిన్నవి, పెద్దవి వందల సంఖ్యలో ఏర్పాటు అవుతాయి. వాటి వలన ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేలమందికి ఉపాధి లభిస్తుంది. కరువు పీడిత అనంతపురం జిల్లాలో వ్యవసాయాన్ని నమ్ముకోవడం కంటే పరిశ్రమలను నమ్ముకోవడమే మంచిది. కనుకనే అక్కడ పరిశ్రమలు స్థాపించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ చాలా శ్రద్ద, ఆసక్తి చూపిస్తున్నాయి. కనుక మున్ముందు జిల్లాకి మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశాలున్నాయి.

పవన్ కంటే మహేశ్ కు ఎక్కువుండటం నచ్చలేదు... వర్మ కామెంట్స్

  ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాంగోపాల్ వర్మ ఈసారి మరో రకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. హీరో మీదనో లేక హీరోయిన్ మీదనో వ్యాఖ్యలు చేసే వర్మ ఈసారి ఫ్యాన్స్ ను టార్గెట్ చేశాడు. ఒక హీరో ఫ్యాన్స్ కాదు ఏకంగా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ను పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ హీరోలు ఎవరోకాదు ఒకరు పవన్ కళ్యాణ్ ఇంకో హీరో మహేశ్ బాబు. ట్విట్టర్ మహేశ్ బాబుకు 15 లక్షల మంది ఫాలోవర్స్ ఉండగా పవన్ కళ్యాణ్ కు మాత్రం కేవలం ఆరు లక్షల మంది ఫాలోవర్స్ మాత్రమే ఉండటం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. అంతటితో ఆగాడా అంటే లేదు..పవన్ కళ్యాణ్ ఫాన్య్ ఏమన్నా నిరక్ష్యారాసులా.. వాళ్లకు ట్విట్టర్ వాడకం తెలీదా అంటు.. పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ లేకుండా మహేశ్ బాబుకు అంత మంది ఫాలోవర్స్ ఉన్నందుకు ఫీల్ అవుతున్నాఅని అన్నాడు. అంతేకాదు తమ అభిమాన నటుడిని ఫాలోఅవుతున్నందుకు మహేశ్ బాబు ఫ్యాన్స్ ను గౌరవిస్తున్నానని.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను గౌరవించడం లేదని వ్యాఖ్యానించాడు. మరి వర్మ ట్వీట్లని ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సీరియస్ గా తీసుకుంటారా లేక వర్మ ఎప్పుడూ ఏదో ఒక రకంగా కామెంట్లు చేస్తుంటాడు కాబట్టి లైట్ తీసుకుంటారా అని చూడాలి.