వైసీపీ... కేవలం రెడ్డి పార్టీ మాత్రమేనట

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.... రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి లింగారెడ్డి ఆరోపించారు, వైసీపీ... రెడ్డి కమ్యూనిటీకి మాత్రమే ప్రాతినిథ్యం వహిస్తుంటే, టీడీపీ అన్ని సామాజిక వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తోందని అన్నారు. తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నామని, ఇటీవల ప్రకటించిన టీడీపీ కమిటీలను చూస్తే అది తెలుస్తుందన్నారు, ఏపీ, తెలంగాణ టీడీపీ అధ్యక్షులుగా బీసీలను పార్టీ నియమించిందని గుర్తుచేసిన లింగారెడ్డి... వైసీపీలో మాత్రం రెడ్డి కమ్యూనిటీకి తప్ప మిగతా సామాజిక వర్గాలకు అసలు విలువే లేదని ఆరోపించారు, వైసీపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే... టీడీపీ పబ్లిక్ అన్ లిమిటెడ్ కంపెనీ అంటూ లింగారెడ్డి కొత్త అర్థం చెప్పుకొచ్చారు.

ముగ్గురు టీడీపీ నేతలను కిడ్నాప్ చేసిన మావోలు

ముగ్గురు టీడీపీ నేతలు కిడ్నాప్ కు గురైనట్టు తెలుస్తోంది. విశాఖపట్నం జిల్లాలో మావోయిస్టులు ముగ్గురు టీడీపీ నేతలు జీకేవీధి టీడీపీ మండల అధ్యక్షుడు మండలి బాలయ్య, పార్టీ సీనియర్‌ నేత వండలం బాలయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు ముక్కల మహేష్‌లను కిడ్నాప్ చేశారు. నిన్న సాయంత్రం వీరి ముగ్గురిని మావోలు ఎత్తికెళ్లినట్టు తెలుస్తోంది. బాక్సైట్‌ తవ్వకాలను విరమించుకోవాలని లేకపోతే టీడీపీ నేతలను ముగ్గురిని ప్రజాకోర్టులో శిక్షిస్తామని ప్రత్యేక జోనల్‌ కమిటీ ఏవోబీ బార్డర్‌ హెచ్చరించింది. దీంతో తమ జీవితాలు ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉన్నాయని తమను రక్షించాలని మీడియాకు లేఖ రాశారు.

సీమాంధ్ర పాలకులే కారణమంటున్న కేసీఆర్

తెలంగాణలో వ్యవసాయరంగం దెబ్బతినడానికి, రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి సమైక్య పాలనలో జరిగిన అన్యాయమేనని టీ సీఎం కేసీఆర్ అన్నారు, సీమాంధ్రుల పాలనలో తెలంగాణ నీటిపారుదల రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, అందుకే తామిప్పుడు సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతిస్తూ డెవలప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు, వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా కష్టపడుతోందన్న ఆయన, దానికి అవసరమైన అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు, అయితే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు వ్యవసాయాధికారులు సహకరించాలని, అప్పుడే ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుతుందని అన్నారు. వ్యవసాయాధికారులు మరింత క్రియాశీలకంగా పనిచేయాలన్న కేసీఆర్.... ఏ సమయంలో ఏ పంట వేస్తే లాభసాటిగా ఉంటుందో రైతులకు తెలియజేయాల్సిన అవసరముందని, అలాగే మైక్రో ఇరిగేషన్ ను కూడా ప్రోత్సహించాలని సూచించారు

అక్బరుద్దీన్ ఓవైసీపై మరోసారి అలాంటి కేసు

ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీపై మరో కేసు నమోదైంది, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేస్తున్న మజ్లిస్... ముస్లిం ప్రాబల్యమున్న నియోజకవర్గాల్లో తన అభ్యర్ధులను బరిలోకి దింపింది,  మహారాష్ట్ర అసెంబ్లీ, ఔరంగాబాద్ మేయర్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో బీహార్ పై కన్నేసిన ఓవైసీ సోదరులు... విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు, అయితే వివాదాస్పద ప్రసంగాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే అక్బరుద్దీన్ ఓవైసీ మరోసారి అలాంటి వివాదంలో చిక్కుకున్నారు, బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీపై అక్బరుద్దీన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ హైదరాబాద్ కిషన్ గంజ్ పోలీస్ స్టేషన్లో బీజేపీ కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు

టీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల సస్పెన్షన్.. ఇదంతా డ్రామాలో భాగం

సోమవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ విపక్ష నేతలైన 32 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. రైతు రుణమాపీలపై.. రైతు ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు మాట్లాడుతూ.. రైతులు తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయారని.. రైతులకు ఒక్కసారే రుణమాఫీ చేయాలని.. తద్వారా వారికి ఊరట కలుగుతుందని డిమాండ్ చేశారు. అంతేకాదు అధికార పార్టీ ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుంది.. మరి రైతులకు ఒక్కసారే రుణమాఫీ చేస్తే వచ్చే నష్టమేంటని  ఆందోళనకు దిగడంతో 32 మంది విపక్ష నేతలను (బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు) సస్పెండ్ చేశారు. అయితే శాసనసభ నుండి టీడీపీ నేతలను సస్పెండ్ చేయడంపై చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ నేతలు ప్రజలకోసం పోరాడుతున్నారు.. అందుకే సస్పెండ్ చేశారు.. ఇదంతా డ్రామాలో ఓ భాగం అని అన్నారు. ఇదిలా ఉండగా ఈరోజు అసెంబల్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అంగన్ వాడీ సమస్యలపై చర్చలు మొదలయ్యాయి.

ఏపీ, తెలంగాణపై కేంద్రానికి గవర్నర్ రిపోర్ట్!

ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ నర్సింహన్ ...వరుస భేటీలతో బిజీబిజీగా గడుపుతున్నారు, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమైన నర్సింహన్... తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిస్థితిపై రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది, మరికొందరు కేంద్ర మంత్రులను కూడా కలవనున్న గవర్నర్...తన దగ్గరున్న సమాచారాన్ని అందజేయనున్నారు. తెలంగాణ మంత్రి తలసాని వ్యవహారం రాజ్ నాథ్ తో భేటీ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది, తలసాని పార్టీ ఫిరాయింపుపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయన్న నర్సింహన్....దానిపై నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం తన పరిధిలో లేదన్నారు, పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ మాత్రమే నిర్ణయం తీసుకోవాలన్నారు, తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయన్న గవర్నర్.... ఏపీ రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానిస్తే వెళ్తానని తెలిపారు.

సెటిలర్లపై ఒక్క దాడైనా జరిగిందా? కేటీఆర్ సవాల్

హైదరాబాద్ లో సీమాంధ్రుల ఓట్లు తొలగిస్తున్నామంటూ విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ ఐటీశాఖా మంత్రి కేటీఆర్ అన్నారు, తెలంగాణ వస్తే సీమాంధ్రులను గెంటేస్తామంటూ గతంలో ఇలానే ప్రచారం చేశారని, ఇప్పటివరకూ ఒక్క సంఘటన అయినా అలాంటి జరిగిందా అంటూ ప్రశ్నించారు, ఓట్లు తొలగింపుపై ప్రతిపక్షాల ఆరోపణలు అర్ధరహితమన్న కేటీఆర్... గతంలో కంటే హైదరాబాద్ లో ఓట్లు పెరిగాయన్న సంగతి తెలుసుకోవాలన్నారు, హైదరాబాద్ లోని సీమాంధ్రులకు ఎలాంటి హానీ జరగదన్న సీఎం కేసీఆర్ తన హామీని నిలబెట్టుకున్నారని, ఏడాదిన్నర పాలనలో సెటిలర్లపై ఒక్క దాడి కూడా జరగలేదన్నారు. దేశంలో ఎక్కడి నుంచి వచ్చినవారైనా ప్రశాంతంగా బతికే వాతావరణం హైదరాబాద్లో ఉందన్నారు.

చంద్రబాబు, కేసీఆర్.. ఇద్దరి ఫొటోలు తొలగించారు

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల గొడవలు ఇక్కడ చాలవన్నట్టు ఢిల్లీలో కూడా మొదలుపెట్టారు. ఢిల్లీలోని ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి గురజాడ సమావేశ మందిరం ఉమ్మడిగా కొనసాగుతుంది. అయితే ఈ మందిరంలో రెండు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ ల  ఫొటోలను మందిరం అధికారులు పెట్టారు. అయితే నిన్న చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు.. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ జర్నలిస్టు అసోసియేషన్ (ఢిల్లీ శాఖ)ను ప్రారంభించడానికి గురజాడ సమావేశ మందిరానికి వెళ్లారు. అయితే ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరవడానికి ముందు ఇద్దరు సీఎంల ఫొటోలలో కేసీఆర్ ఫొటో తీసేసి చంద్రబాబు  ఫొటో ఉంచారు. అంతే దీనిని గమనించిన తెలంగాణ జర్నలిస్ట్ వెంటనే దీనిని తెలంగాణ భవన్ అసిస్టెంట్ కమిషనర్ రామ్మెహన్ కు తెలుపగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురజాడ సమావేశ మందిరానికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సిబ్బందిని నిలదీశారు. ఉంటే ఇద్దరు సీఎంల ఫొటోలు ఉండాలి లేకపోతే ఇద్దరివి తీసేయాలి.. అంతేకాని కేసీఆర్ ది తీసేసి చంద్రబాబుది ఉంచడం ఏంటని మండిపడ్డారు. దీంతో చంద్రబాబు ఫొటోని కూడా తీసేశారు. అయితే చంద్రబాబు కార్యక్రమానికి వచ్చి వెళ్లిన తరువాత కూడా ఫొటోలు పెట్టకపోవడం గమనార్హం. .

మోడీని ఆహ్వానించిన చంద్రబాబు.. తప్పకుండా వస్తా

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాగరమాల కార్యక్రమం నిమిత్తం ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈసందర్బంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. దీనికి మోడీ సాకుకూలంగా స్పందించి తాను శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానని.. మధ్యాహ్నం 12.35 నుంచి 12.45లోపు వస్తాయని చెప్పారని.. అనంతరం తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటానని చెప్పారని చంద్రబాబు తెలిపారు. అంతేకాక రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీలు.. ఇతర నిధుల మంజూరు తదితర విషయాలపై చర్చించినట్టు తెలిపారు. కాగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని దసరా రోజు ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 12.45 నిమిషాలకు ఖరారు చేసిస సంగతి తెలిసిందే. కార్యక్రమాని ప్రధాని నరేంద్రమోడీతో పాటు సింగపూర్, జపాన్ ప్రధానులు కూడా పాల్గొననున్నారు.

రఘువీరా కారుపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి

చిత్తూరు జిల్లా కుప్పంలో ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు, కుప్పంలో ఎయిర్ పోర్ట్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న స్థానికులకు అండగా అక్కడికి వెళ్లిన రఘువీరాను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు... కాన్వాయ్ పై చెప్పులు, రాళ్లు విసిరారు. దాంతో తెలుగుదేశం, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది, ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా, కొద్దిసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది, మరోవైపు కుప్పంలో కాంగ్రెస్ తలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అభ్యంతరం తెలిపారు, టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ నేపథ్యంలో సభకు అనుమతి నిరాకరించిన పోలీసులు... పెద్దఎత్తున మోహరించారు

కారెక్కుతారంటూ దానంపై మళ్లీ వార్తలు

దానం నాగేందర్ త్వరలో కారెక్కుతారంటూ మళ్లీ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి, దానంతోపాటు అతని సన్నిహితుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ కూడా గులాబీ కండువా కప్పుకుంటారని టాక్ వినిపిస్తోంది, గతంలో కూడా అనేకసార్లు ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు దానం ఖండించినా, ఈసారి మాత్రం పక్కా అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక ఒకరోజు అటూఇటుగా ఈ కార్యక్రమం ఉంటుందని గులాబీ నేతలు లీకులిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లో పలువురు నేతలను పార్టీలోకి లాగాలనుకుంటున్న అధికార పార్టీ... దానంతో ఎప్పట్నుంచో మంతనాలు జరుపుతోంది, కానీ డీల్ కుదరక పెండింగ్ లో పడ్డ ఈ వ్యవహారం...ఈసారి కారెక్కేయడం ఖాయమంటున్నారు.  

కేసీఆర్ పై జానారెడ్డికి కోపమొచ్చింది

మీరు సీనియర్... మీ సలహాలు తీసుకుంటామంటూ పొగుడుతూ సీఎం కేసీఆర్ ఐస్ చేస్తుంటే... కూల్ గా సెలైంటయిపోయే ప్రతిపక్ష నేత జానారెడ్డికి ఈసారి కోపమొచ్చింది, రైతు ఆత్మహత్యలపై చర్చకు పట్టుబడ్డిన విపక్ష ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంపై ఊగిపోయిన జానారెడ్డి... సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది మీరు కాదా అంటూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు, సమస్యలు పట్టించుకోమంటే నిబంధనలు గుర్తుచేస్తారా... అవి మాకు తెలియదా... అంటూ ఫైరయ్యారు, విపక్ష ఎమ్మెల్యేల సస్పెన్షన్ అప్రజాస్వామికమన్న జానా... అధికార పార్టీ నిరంకుశ విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, అందుకే అన్నదాతలకు భరోసా ఇవ్వలేకపోతుందని ఆరోపించారు, సభను స్తంభింపజేయడం తమ ఉద్దేశం కాదన్న జానా... అన్నదాతల ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేయాలన్నదే లక్ష్యమన్నారు, అయితే ప్రభుత్వం తమ గొంతు నొక్కాలని ప్రయత్నిస్తోందని, సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ కి త్వరలో ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయమన్నారు.

రేవంత్ రెడ్డి రంగంలోకి దిగాడు

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావుపై టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు, తెలంగాణ అసెంబ్లీ మామా అల్లుళ్లకు ఆటవిడుపు కేంద్రంగా మారిందని, అందుకే సభలో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని రేవంత్ ఆరోపించారు, 32మంది విపక్ష ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దారుణమన్న రేవంత్ రెడ్డి... ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై పోరాడుతూనే ఉంటామన్నారు, తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న 1400మంది రైతులకు 6లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలన్న రేవంత్, మిగిలిన రుణమాఫీని ఒకే విడతలో చేయాలని డిమాండ్ చేశారు, ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న కేసీఆర్... రైతుల రుణాలు మాఫీ చేసేందుకు మాత్రం డబ్బుల్లేవా అంటూ ప్రశ్నించారు, ఆంధ్రా కాంట్రాక్టర్ల కోసం 40వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారు కానీ...రైతులకు సాయం చేయడానికి డబ్బు ఎందుకు లేదని నిలదీశారు. రైతులకు న్యాయం జరిగేవరకూ ముఖ్యమంత్రిని మంత్రులను నిలదీస్తూనే ఉంటామని, జిల్లాల్లో వారి పర్యటనలను అడ్డుకుంటామని రేవంత్ హెచ్చరించారు.

సస్పెన్షనే... అధికార పార్టీ ఆయుధం

రైతు ఆత్మహత్యలపై విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెడతాయని ముందే ఊహించిన అధికార పార్టీ... సస్పెన్షన్ ను ఆయుధంగా వాడుకోవాలని ముందే డిసైడైంది, రెండ్రోజులపాటు అసెంబ్లీ కూల్ గా జరిగినా, మూడోరోజు విపక్షాలు విశ్వరూపం చూపించడంతో, ముందుగా అనుకున్నట్లుగా కేసీఆర్ సర్కార్  సస్పెన్షన్ అస్త్రాన్ని బయటికి తీసింది, అన్నదాతల ఆత్మహత్యలపైనే చర్చించాలని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ సభ్యులంతా పట్టుబట్టడంతోపాటు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగడంతో ఏకంగా 32మంది ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేసేశారు. దాంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది, కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో అసెంబ్లీని హోరెత్తించారు. టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ కూడా జత కలవడంతో అధికారపక్షం డిఫెన్స్ లో పడింది.

తెలంగాణ అసెంబ్లీలో లొల్లి మొదలైంది

అనుకున్నట్లుగానే తెలంగాణ అసెంబ్లీలో లొల్లి మొదలైంది, రైతు ఆత్మహత్యలపై రెండ్రోజులపాటు చర్చించినప్పటికీ, తిరిగి అదే అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది, విపక్షాల వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించడంతో మొదలైన లొల్లి... 32మంది ఎమ్మెల్యేల సస్సెన్షన్ వరకూ వెళ్లింది, దాంతో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి రచ్చరచ్చ చేశారు, అయితే విపక్షాల తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు, సభను జరగనివ్వబోమనే రీతిలో విపక్షాలు ప్రవర్తించడం సరికాదని, బీఏసీ నిర్ణయాల మేరకు సభను నిర్వహిస్తున్నామన్నారు, రైతుల సమస్యలపై రెండ్రోజులపాటు చర్చించాం, ప్రభుత్వం ఏంచేయగలుతుందో చెప్పాం, కానీ సాధ్యంకాని వాటిని విపక్షాలు అమలు చేయమంటే ఎలా కుదురుతుందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్ణయం నచ్చకపోతే నిరసన తెలిపాలే గానీ, ఇలా సభను అడ్డుకోవడం సరికాదని విపక్షాలకు కేసీఆర్ సూచించారు.

టీ-అసెంబ్లీలో గందరగోళం, 32మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్

తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం ఏర్పడింది, రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని, అన్నదాతల ఆత్మహత్యలను ఆపేందుకు చర్యలు చేపట్టాలంటూ విపక్షాలన్నీ శాసనసభలో ఆందోళనకు దిగాయి, ప్రభుత్వం అందుకు సానుకూలంగా స్పందించకపోవడంతో విపక్ష సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు, దాంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది, సభ సజావుగా జరిగేందుకు అటు ప్రభుత్వం, ఇటు స్పీకర్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో 32మంది ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. ప్రతిపక్ష నేత జానారెడ్డి, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మినహా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైసీపీ, సీపీఐ, సీపీఎంకి చెందిన 32మంది ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు.