కేజ్రీవాల్ క్రేజీ డెసిషన్.. నెటిజన్ల సెటైర్లు

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓ ఆచరణ సాధ్యంకాని నిర్ణయం తీసుకొని ఇప్పుడు అందరిచేత విమర్శలు పొందుతున్నారు. ఢిల్లీలో వాయుకాలుష్యం బాగా పెరిగిపోయిందని.. గ్యాస్ ఛాంబర్లో ఉన్నట్లు బతుకుతున్నామని.. ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించకుండా ఏంచేస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో హడావుడిగా కేజ్రీవాల్ మీటింగ్ పెట్టి.. ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయంతో ఢిల్లీ ప్రజలందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అదేంటంటే.. దిల్లీలో ఇకపై ఒక రోజు సరిసంఖ్య ఉన్న వాహనాలే తిరగాలట. ఇంకో రోజు బేసి సంఖ్య వాహనాలే రోడ్డు మీదికి రావాలట. దీంతో కాలుష్యాన్ని తగ్గించవచ్చంట. ఇక అంతే కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయంతో నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్ల వేయడం మొదలుపెట్టారు. ఇక ప్రతి ఇంట్లోనూ రెండు కార్లు రెండు బైకులు పెట్టుకోవాలని.. ఒకదాన్ని బేసి సంఖ్యతో ఇంకోదాన్ని సరిసంఖ్యతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఒకరంటే..కార్లు బైకుల కంపెనీల సేల్స్ పెంచడానికి కేజ్రీవాల్ పన్నిన కుట్ర ఇదని ఒంకొకరు... అర్రే నా కారుది ప్రైమ్ నంబరే మరి నేనేం చేయాలని ఇంకొకరు అలా కామెంట్లు విసురుతున్నారు. మొత్తానికి కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం పాటించడమేమో కాని.. జోకులు పేల్చుకోవడానికి మాత్రం పనికొచ్చింది. మరి కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తారో.. లేక వెనక్కి తీసుకుంటారో చూడాలి.

దానం పార్టీ మారనిది అందుకేనా..?

తెలంగాణ కాంగ్రెస్ నేత దానం నాగేందర్ పార్టీ మార్పుపై  అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. దానం కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ చేరుతాడని వార్తలు జోరుగానే సాగాయి. కానీ తాను మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని దానం నిన్న తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు అందరి సందేహం ఒక్కటే.. నిన్న తను ప్రకటన చేయడానికి ముందు అంటే గురువారం రాత్రి దానం కొంత మంది టీఆర్ఎస్ నేతలతో మంతనాలు జరిపారు. అది ఎవరో కాదు, మంత్రి హరీశ్ రావు, కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయిన సీనియర్ నేత డీఎస్, జగదీశ్వర్ రెడ్డి.. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డిలు. ఈ సమావేశంతో దానం టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అవడం ఖాయమని అనుకున్నారు. ఇక నిన్న ఉదయం దానం తన ముఖ్య అనుచరులతో కూడా సమావేశమయ్యేసరికి ఇక టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడానికి ముహూర్తం ఖరారు చేయడమే అని అభిప్రాయపడ్డారు అందరూ. కానీ సమావేశం అనంతరం దానం ట్విస్ట్ ఇస్తూ తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని అన్నారు. ఇక్కడి వరకూ బానే ఉన్నా అసలు టీఆర్ఎస్ నేతలు, దానం ఏం మాట్లాడుకున్నారు.. అని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ నేతలతో భేటీ అయిన దానం కొన్ని షరతులు పెట్టగా వాటికి టీఆర్ఎస్ సానుకూలంగా స్పందించకపోవడంతో పార్టీ మార్పుకు అవాంతరం ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. అందుకే మళ్లీ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు అంటూ వ్యాఖ్యానిస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉండగా టీఆర్ఎస్ మాత్రం దానం విషయంలో సీరియస్ గా ఉన్నారని.. దానం మాత్రం పార్టీ మారడం ఖాయమని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొంత సమయం ఆగాల్సిందే.

గంగిరెడ్డి భార్య పిటిషన్ పై హైకోర్టు ఆగ్రహం

  గంగిరెడ్డి..పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఎర్రచందనం స్మగిలింగ్ మొదలుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై హత్యా ప్రయత్నం వరకు అనేక తీవ్ర నేరాలలో ప్రధాన నిందితుడు. చాలా రోజులుగా పోలీసులను తప్పించుకొని విదేశాలలో తిరుగుతున్న అతనిని కొన్ని రోజుల క్రితమే అరెస్ట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకు వచ్చెరు. పోలీసులు అతనిని కోర్టులో హాజరుపరచగా కోర్టు అతనికి రిమాండ్ విధించింది. ప్రస్తుతం అతను కడప జైల్లో ఉన్నాడు. చేయకూడని నేరాలన్నీ చేసిన అతనిని చట్ట ప్రకారం శిక్షించడానికే పోలీసులు జైల్లో నిర్బంధించారు.   గంగిరెడ్డి భార్య కొల్లం మాళవిక తన భర్తకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుండి ప్రాణహాని ఉందని, కనుక తన భర్తని తెలంగాణాలో ఏదయినా జైలుకి మార్చాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అది రాజ్యాంగ విరుద్దమని ప్రకటించ వలసిందిగా హైకోర్టును అభ్యర్ధించారు. ఆయన వలన తన భర్తకు ప్రాణహాని ఉందని భావిస్తున్నానని కనుక తన భర్తకు జైల్లో ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేయాలని ఆమె తన పిటిషన్ లో కోరారు.   ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై ఆమె ఇటువంటి తీవ్ర ఆరోపణలు చేసినందుకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు తన పిటిషన్ లో ప్రతివాదుల పేర్ల నుండి చంద్రబాబు నాయుడు పేరు తొలగించాలని, ఆ తరువాతే పిటిషన్ నెంబరు కేటాయించాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. హైకోర్టు సూచించిన మార్పులు చేసిన తరువాత సోమవారం ఈ పిటిషన్ని విచారణకు స్వీకరించే అవకాశం ఉంది.

మళ్ళీ మరో వడ్డింపుకి సిద్దమయిన రైల్వే శాఖ

  గత ఏడాదిన్నరగా రైల్వే శాఖ ఏదో ఒక విధంగా ప్రజల వద్ద నుండి డబ్బులు పిండుకొంటూనే ఉంది. ఒకసారి ప్లాట్ ఫారం టికెట్ ధరలు పెంచుతుంది. మరొకసారి ఆన్ లైన్ టికెట్లను రద్దు చార్జీలను పెంచుతుంది. లేకుంటే తత్కాల్ చార్జీలు పెంచుతుంది. తత్కాల్ అంటేనే అప్పటికికప్పుడు అత్యవసరంగా కొనుకొనే విధానం. మళ్ళీ దానిలో ప్రీమియం తత్కాల్, రైల్వే టికెట్ల వేలం పాటలు అంటూ రకరలుగా ప్రజలను దోచుకోంటోంది. రైల్వే శాఖ ఇలాగ చట్టబద్దంగా ప్రయాణికులను దోచుకొంటుంటే, దొంగలు పట్టపగలే రైళ్ళలో ఎక్కి దోపిడీలు చేస్తున్నారు. ఇప్పుడు రైల్వే శాఖ మళ్ళీ వడ్డనకి సిద్దమయింది. ఇంతవరకు 5-12సం.ల వయసు గల పిల్లలకు ప్రయాణ చార్జీలలో ఇస్తున్న రాయితీని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్, 2016 నుండి ఈ నిర్ణయం అమలు లోకి వస్తుందని రైల్వే శాఖ ప్రకటించింది.

దావూద్ పై అమెరికా కన్ను..?

అండర్ వరల్డ్ డాన్.. ముంబై వరుస పేలుళ్ల కారకుడు దావుద్ ఇబ్రహీంను పట్టుకోవడానికి భారత్ ప్రభుత్వం చాలా తీవ్రతరంగా కృషిచేస్తుంది. కానీ పాక్ సహకారం సరిగ్గా లేకపోవడంతో దావూద్ ను ఇండియాకి రప్పించలేకపోతుంది మన ప్రభుత్వం. కానీ ఇప్పుడు దావుద్ ను పట్టుకోవడానికి మార్గం సులువైనట్టు తెలుస్తోంది. అదెలా అంటే.. అగ్రరాజ్యాలపై ఐసిస్ కన్నేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అగ్రరాజ్యాలు ఐసిస్ అంతు తేల్చే పనిలో పడింది. అయితే ఐసిస్ కు దావూద్ సహాయం అందుతోందన్న అనుమానంతో ఇప్పుడు దావుద్ పై నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. ఐతే గతంలో పాక్ తో ఉన్న సత్సంబంధాలు కారణంగా అగ్రరాజ్యాలు ఐసిస్ ను చూసి చూడనట్టు వదిలేశాయి. కానీ తమపైనే దాడి చేసేసరికి కోపంతో ఉన్న అగ్రరాజ్యాలు ఇప్పుడు ఐసిస్ పై.. దానికి సహరిస్తున్నారన్న కారణంగా దావుద్ పై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దావూద్ ముఖ్య అనుచరుడు.. ఆయన ఆర్థిక వ్యవహారాల సలహాదారు అల్తాఫ్ ఖనానీని అమెరికా అరెస్టు చేసింది. ఖనాని అరెస్ట్ చేసినందుకుగాను అమెరికా దావూద్ ను టార్గెట్ చేసిందని అనుకుంటున్నారు. దీంతో మన దేశ ప్రభుత్వం ఎప్పటినుండో ఎదురుచూస్తున్న దావుద్ త్వరలోనే కలుగు నుండి బయటకు రావడం ఖాయమని తెలుస్తోంది.

"మోస్ట్ ఇన్ఫిరేషనల్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్" గా కేటీఆర్..

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కు అరుదైన అవార్డు దక్కింది. ప్రముఖ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ "రిట్జ్" ప్రముఖ సీఎన్ఎన్ఐబిఎన్ ఛానల్ రెండు సంయుక్తంగా నిర్వహిస్తున్న "ఆడి రిట్జ్ ఐకాన అవార్డ్ 2015" కింద "మోస్ట్ ఇన్ఫిరేషనల్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్" అవార్డ్  కేటీఆర్ కు దక్కింది. ఐటీ మంత్రిగా కేటీఆర్ ఎన్నో వినూత్న పథకాలు ప్రజలకు చేరవేయడానికి కృషి చేస్తున్న నేపథ్యంలో ఈ అవార్డ్ దక్కింది. ఈ నెల 13న బెంగుళూరులో తాజ్ వెస్టండ్ హోటల్లో జరిగే ఈకార్యక్రమంలో కేటీఆర్ కు అవార్డు అందజేయనున్నారు. కేటీఆర్ తో పాటు మరికొంత మంది.. వివిధ విభాగాల్లో అవార్డులు అందజేయనున్నారు. వారిలో సినీ నటుడు రాం చరణ్ కూడా ఉన్నారు. సినీ రంగానికి చెంది టాలీవుడ్ నుండి రాం చరణ్, బాలీవుడ్ నుండి విద్యాబాలన్, వ్యాపార రంగంలో గ్రంథి మల్లిఖార్జునరావు, ఫ్యాషన్ రంగానికి గౌరంగ్ షాకి.. సాంకేతిక రంగంలో నందన నిలేకనిలకు అవార్డులు దక్కాయి.

అందుకు దానం చేయలేదు.. జుకెర్ బర్గ్

విమర్శించే వాళ్లు మంచి పని చేసినా.. చెడు చేసినా విమర్శిస్తునే ఉంటారు. అలాంటి పరిస్థితే ఇప్పుడు ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకెర్ బర్గ్ కు ఎదురైంది. జుకెర్ బర్గ్, అతని సతీమణికి ప్రిసిల్లా చాన్ కు పాప పుట్టిన సందర్భంగా తనకున్న షేర్లలో 99 శాతం షేర్లను అంటే దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలను స్వచ్ఛంద సంస్థలకి ఇస్తున్నట్టు ప్రకటించాడు. అయితే జుకెర్ బర్గ్ చేసిన ఈ పనికి అందరూ అతనిపై ప్రశంసలు కురిపించారు. అయితే కొంతమంది మాత్రం పన్నుల నుంచి మినహాయింపులు పొందేందుకు జుకెర్ బర్గ్ ఈ మార్గాన్ని ఎంచుకున్నారని విమర్శిస్తున్నారు. దీనిక జుకెర్ బర్గ్ స్పందించి.. తాము ఎలాంటి పన్ను మినహాయింపు పొందబోమని.. తమ షేర్లను అమ్మినపుడు ఇతరుల మాదిరిగా పన్నులు చెల్లిస్తామని జుకర్బర్గ్ తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. మొత్తానికి మంచి పనిచేసినా కూడా విమర్శలు తప్పవని మరోసారి రుజువైంది.

పార్టీ మార్పుపై దానం ట్విస్ట్.. పార్టీ మారే ప్రసక్తే లేదు..

దానం నాగేందర్ పార్టీ మార్పుపై ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఎదురవుతున్నాయి. ఆయన సన్నిహితుడు ఎంఎస్ ప్రభాకర్ టీఆర్ఎస్ లోకి మారే సరికి ఆయన పార్టీ మార్పు వార్తలపై ఇంకా ఆసక్తి రేగింది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ ముఖ్య అనుచరులతో భేటీ అయ్యేసరికి ఇంకా అనుమానాలు వ్యక్తమయ్యాయి. తను టీఆర్ఎస్ పార్టీలోకి మారడం పక్కా అని అనుకున్నారు అందరూ. ఇక మరో కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ అయితే దానంను కలిసి భేటీ అయారు. అయితే భేటీలో ఏమైందో ఏమో తెలియదు కానీ దానం నాగేందర్ మాత్రం తాను కాంగ్రెస్ పార్టీని మారే ప్రసక్తే లేదని అందరికీ షాకిచ్చాడు. అంతేకాదు నేను పార్టీ మారుతున్నట్టు దుష్ర్పచారం జరుగుతుంది.. డివిజన్ల వారిగా పార్టీ బలోపేతం కోసం సమావేశాలు నిర్వహిస్తున్నా అంతే అని చెప్పారు. ఇలాంటి ప్రచారాన్ని కార్యకర్తలు నమ్మెద్దని కూడా సూచించారు. అంతేకాదు షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. దానం కాంగ్రెస్ పార్టీ మారుతున్నాడంటూ అతనిపై కుట్ర జరుగుతుందని.. దానం కరడుకట్టిన కాంగ్రెస్ వాది అని.. అతను కాంగ్రెస్ పార్టీని వీడడని అన్నారు. మొత్తానికి దానం పార్టీ మార్పుపై హై డ్రామా జరుగుతున్నట్టు కనిపిస్తుంది.

కేసీఆర్, కవితలకు వ్యతిరేకంగా మావోయిస్టుల పోస్టర్లు

తెలంగాణ ప్రభుత్వం బూటకపు ఎన్ కౌంటర్లు చేయిస్తుందంటూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా కేసీఆర్, కూతురు కవితల మీద పోస్టర్లు వేయించి కలకలం సృష్టించారు. కేసీఆర్, కవితలు బూటకపు ఎన్ కౌంటర్లు చేయిస్తున్నారంటూ వారికి వ్యతిరేకంగా వరంగల్ జిల్లా బచ్చన్నపేటలో పోస్టర్లు వేశారు. ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ప్రజల ఆశలను కేసీఆర్ అడియాశలు చేశారని... ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించలేదని వారు ఆరోపించారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అంతేకాదు కవితకు భద్రత కూడా పెంచాలని అనుకుంటున్నారట. మొత్తానికి మావోయిస్టులు కేసీఆర్ మీద బానే దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది.

ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు?

వెంకయ్యనాయుడు రాజ్యసభ పదవికాలం వచ్చే ఏడాది జూన్ నాటికి ముగుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆతరువాత వెంకయ్య ఏం చేస్తారు అన్నది అందరి సందేహం. అయితే బీజేపీ నియమాల ప్రకారం ఒక వ్యక్తి మూడుసార్లు రాజ్యసభ సభ్యత్వం పొందిన తరువాత.. ఆవ్యక్తికి ఇక ఆ పదవి నుండి పోటీ చేసే అవకాశం లేదు. దీంతో వెంకయ్యకు రాజ్యసభనుండి పోటీ చేసే అవకాశం లేదు. పార్టీ  నియామాలను పాటించడంలో బీజేపీకి మంచి గుర్తింపు ఉంది. అయితే వెంకయ్య నాయుడి లాంటి నాయకుడికి మాత్రం దానికి మినహాంపు ఉండే అవకాశం ఉంటుందేమో అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు వెంకయ్యనాయుడు కోసం తమ నియామాన్ని పక్కన పెడుతుందన్న నమ్మకం చాలామందిలో కనిపించడం లేదన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. అలా అయితే వెంకయ్య లోక్ సభ నుండి పోటీ చేయాల్సి ఉంటుంది. కానీ వెంకయ్య మాత్రం దానికి సముఖత చూపడం లేదు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఉపరాష్ట్రపతిగా వెంకయ్యను ఎన్నికల్లో నిలపాలని మోడీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. తన గడువు ముగిసిన తరువాత ఓ ఆరు నెలలు వెంకయ్యను మంత్రిగా కొనసాగించి.. ఆతరువాత 2017 లో జరగబోయే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్యను నిలిపి ఆ పదవిని కట్టబెట్టాలని చూస్తున్నారంట. మొత్తానికి వెంకయ్యను మాత్రం మోడీ వదులుకునే స్థితిలో లేరు. ఆయనను లోక్ సభ లేదా.. రాజ్యసభ సభ్యుడిగా లేదా.. అదికాని పక్షంలో ఉపరాష్ట్రపతిగా చేయాలని మోడీ చూస్తున్నారు. మరి వెంకయ్యకు ఏపదవి వరించబోతుందా చూడాలి.

చెన్నై వర్షంపై దేవుడు, సెలబ్రిటీల మీద వర్మ కామెంట్లు..

వివాదాస్పద వ్యాఖ్యల బ్రాండ్ అంబాసిడర్ రాంగోపాల్ వర్మ ఇప్పుడు చెన్నె వర్షాల మీద కూడా తన దైన శైలిలో విమర్శలు చేశారు. గత వందేళ్లలో ఎప్పుడూ చూడని విధంగా చెన్నెని వర్షపాతం కమ్ముకుంది. వరద నీటితో చెన్నై మొత్తం మునిగిపోయింది. దీంతో కష్టాల్లో ఉన్న చెన్నె వాసులకు ఎవరికి తోచిన విధంగా వారు ఏదో ఒక రకంగా సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు. అలాంటి వారిపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు దేవుడి పై కూడా విమర్శలు చేశాడు. చెన్నైలో వర్షాలు కురిసేది దేవుడి వల్లే అని.. అలాంటి దేవుడిని విమర్శిచాలి అంతే కాని.. ప్రార్ధించకూడదు అని అన్నాడు. అంతేకాదు చెన్నై ప్రజలను చూసి చాలా బాధపడుతున్నాను.. అదేవిధంగా దేవుడి మీద కోపంగా కూడా ఉన్నాను అని ట్వీటాడు. అంతేకాదు చెన్నె వాసులకు సెలబ్రిటీలు విరాళాలు ఇవ్వగా దానిని ఉద్దేశించి.. కోట్లు కోట్లు కూడబెట్టిన సూపర్ స్టార్లు.. లక్షలు దానం చేసి బిచ్చమేశారని.. అంతకంటే వారు ఇవ్వకపోయినా బాగుండేదని అన్నారు. వారు ఇచ్చిన డబ్బుతో చెన్నైవాసులకు ఏం చేయాలో అర్ధంకావడం లేదని విమర్శించాడు.. ఇక దానం చేసే విషయంలో పనిలో పనిగా తన గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు రాంగోపాల్ వర్మ.. నేనెప్పుడూ ఒక్క రూపాయి కూడా దానం చేయలేదు. నేను చాలా స్వార్థపరుడిని అని సెలబ్రిటీలలా క్వింటాళ్ల కొద్దీ ప్రార్థనలు, టన్నులకొద్దీ ప్రేమ కురిపించలేను అని అన్నారు.

చెన్నై.. మళ్లీ కుండపోత తప్పదు..

గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నై వరద నీటితో నిండిపోయింది. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని.. సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాలనుండి కూడా సహాయక చర్యలు అందిస్తున్నారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతంలో త్రివిధ దళాలు సహాయచర్యలు ముమ్మరం చేశాయి. చెన్నైలో ఉన్న 7 నదుల్లో 27 జలాశయాల్లో వరద ఉదృతి తీవ్రంగా పెరిగిపోయింది. చెన్నై సహా 13 జిలాల్లో వరద బీభత్సానికి 269 మంది చనిపోయారు. ఇదిలా ఉండగా చెన్నైలో మళ్లీ కుండపోత తప్పదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. దీంతో ప్రజలు ఇంకా ఆందోళనలు చెందుతున్నారు. కాగా భారీ వర్షాలతో అతలాకుతలమైన చెన్నైని ప్రధాన మంత్రి మోడీ పరిశీలించి.. తక్షణ సాయం కింద రూ 1000 కోట్లు సాయం అందిస్తామని తెలిపారు.

ముఖ్య అనుచరులతో దానం భేటీ..

కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ టీఆర్ఎస్ లోకి చేరడంతో తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. అయితే ప్రభాకర్ చేరిక పక్కన పెడితే ఇప్పుడు అందరి దృష్టి మాత్రం దానం నాగేందర్ పైన పడింది. దానంకు సన్నిహితుడిగా పేరు పొందిన ప్రభాకర్ టీఆర్ఎస్ లోకి చేరడంతో ఇప్పుడు దానం కూడా టీఆర్ఎస్ గూటికి చేరుతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దానం తన ముఖ్య అనుచరులతో కలిసి తన నివాసంలో భేటీ అయ్యారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడతారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తన పార్టీ మార్పుపై.. భవిష్యత్ కార్యాచరణపై దానం చర్చించనున్నట్టు తెలుస్తోంది. మరి ఈ భేటిలో దానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

టీఆర్ఎస్ లోకి సాయన్న.. కేసీఆర్ పై చంద్రబాబు రియాక్షన్ ఏంటి?

రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా ఉండేవారో అందరికి తెలిసిన విషయమే. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుదేమో అన్న పరిస్థితి ఉండేది. ఏదో ఒక వివాదం గురించి ఇద్దరూ ఎప్పుడూ ఆరోపించుకోవడమే సరిపోయేది. వీరి మధ్యలో గవర్నర్ కూడా కొంత కాలం నలిగిపోయారు. అయితే ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమం పుణ్యమా అని వారిద్దరి మధ్య ఉన్నవిబేధాలు చాలా వరకూ తగ్గాయి. ఇద్దరూ ఒకరినొకరు విమర్శించుకోవడం తగ్గిపోయింది. అందుకు వరంగల్ ఉపఎన్నికల ప్రచారంలో కేసీఆర్ అన్ని పార్టీలను తన మాటలతో ఏకిపారేశారు కానీ చంద్రబాబుపై ఒక్క విమర్శకూడా చేయకపోవడం నిదర్శనం. ఇక చంద్రబాబు కూడా కేసీఆర్ గురించి ఎక్కడా విమర్శించేలా మాట్లాడటం లేదు. అయితే ఇప్పుడు జరిగిన తాజా పరిణామాలు చూస్తుంటే ఇద్దరు సీఎంలు ఇంతకుముందు ఉన్నట్టే ఉంటారా.. లేక పాత ధోరణిలోకే వస్తారా అన్న అనుమానాలు వస్తున్నాయి. తెలంగాణలో స్థానిక, గ్రేటర్ ఎన్నికలు షురూ అయిన వేళ టీఆర్ఎస్ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. అప్పుడే కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, టీడీపీ ఎమ్మెల్యే సాయన్నను తమ పార్టీలోకి చేర్చుకుంది. దీంతో ఇప్పుడు చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారు అని అందరి సందేహం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఇద్దరు సీఎంల మధ్య స్నేహ బంధం ఏర్పడుతుంది. మరి ఇలాంటి తరుణంలో ఎప్పటి నుండో టీడీపీని అంటిపెట్టుకున్న సాయన్నను తన పార్టీలోకి చేర్చుకున్న కేసీఆర్ పట్ల చంద్రబాబు ఇప్పుడు ఎలా ఉంటారో అని రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు. సాయన్న చేరికతో ఇద్దరిమధ్య మళ్లీ విబేధాలు తలెత్తుతాయేమో అని అనుకుంటున్నారు. లేకపోతే అవేమి పట్టించుకోకుండా ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉంటారేమో అని అనుకునే వారు కూడా ఉన్నారు. మరి అందరి సందేహాలు తీరాలంటే ఈ విషయంపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

టీఆర్ఎస్ లోకి రాజాసింగ్..?

తెలంగాణలో బీజేపీలో ఉన్న విబేధాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. గోషమహల్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్, ఆపార్టీ ఆధ్యక్షుడు కిషన్ రెడ్డిపై విమర్శలు చేయడం.. కిషన్ రెడ్డిని బీజేపీ అధ్యక్షపదవి నుండి తొలగించాలి అని ఆరోపిండం.. కిషన్ రెడ్డి వల్లే పార్టీ ఎదగడంలేదు అని అనడంతో.. ఈ విబేధాలు మరోసారి బయటపడ్డాయి. అయితే ఇప్పుడు రాజాసింగ్ చేసిన ఆరోపణలు గురించి బీజేపీ పెద్దలు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అదేంటంటే..టీఆర్‌ఎస్ నేతలతో సంప్రదింపులు జరిగిన తర్వాతే.. కిష‌న్‌పై ఆయ‌న బహిరంగ విమర్శలకు దిగారని ఓ అంచనాకొచ్చారు. ఎందుకంటే గ్రేటర్, స్థానిక ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించి.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, టీడీపీ ఎమ్మెల్యే సాయన్నను తన పార్టీలోకి చేరేవిధంగా చేసింది. అయితే వీరిద్దరు చేరడానికి ఒక రెండు రోజుల ముందే రాజాసింగ్ కిషన్ రెడ్డిపై పడ్డారని.. అంటే వారితో మంతనాలు జరిపిన తరువాతే కిషన్ రెడ్డిని బహిరంగంగా విమర్శించారని పార్టీ నేతలు అనుకుంటున్నారు. దీంతో రాజాసింగ్ టీఆర్ఎస్ పార్టీలోకి వెళతారనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు? బరిలో పురుంధరేశ్వరీ?

ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ప్రస్తుతం విశాఖ ఎంపీ హరిబాబు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ స్థానంలో మరో నేత రానున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నఎంపీ హరిబాబు తనకున్న పని ఒత్తిడి కారణంగా ఆ స్థానంలో మరెవరినైనా నియమించాలని బీజేపీ పెద్దలను కోరినట్టు తెలుస్తోంది. దీంతో ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి ఈ నెల రెండోవారంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ అధ్యక్ష పదవి నియామకంలో ముఖ్యంగా మూడు పేర్లు వినిపిస్తున్నాయి. అవి కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి, రాష్ట్ర మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ తోపాటు ఎమ్మెల్సీ వీర్రాజు.. ఈ ముగ్గురిలో పురంధేశ్వరి, లక్ష్మినారాయణ మాత్రం ఎన్నికల టైంలోనే బీజేపీలో చేరారు.. కానీ వీర్రాజు మాత్రం అలా కాదు పార్టీకి నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్నాడు.. అందులోనూ ఎక్కువ మంది సోము వీర్రాజు పేరునే వినిపిస్తున్నారు. దీంతో ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి పగ్గాలు సోము వీర్రాజు చేతికి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.  మరి ఎవరి చేతికి అధ్యక్ష పదవి పగ్గాలు అందుతాయో చూడాలి.  

నేను 5 లక్షలు డిమాండ్ చేయలేదు: సానియా మీర్జా

  మధ్యప్రదేశ్ ప్రభుత్వం భోపాల్ లో నిర్వహించదలచిన ఒక క్రీడా కార్యక్రమం ప్రారంభోత్సవానికి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను ముఖ్య అతిధిగా పాల్గొనాలని ఆహ్వానించగా ఆమె రూ. 5 లక్షలు ఫీజు, తన మేకప్ స్టాఫ్ కి రోజుకి రూ.75, 000, తనతో వచ్చే తన సిబ్బందికి అదనంగా మరికొంత సొమ్ము చెల్లించాలని కోరారు. అలాగే ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి తనకు చార్టెడ్ విమానం ఏర్పాటు చేయాలని కోరారు. ఆమె గొంతెమ్మ కోరికలను విని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆమెకు దణ్ణం పెట్టేసి ఆమెకు బదులు మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీ చంద్ ని ఆహ్వానించారు. ఆయన ఎటువంటి షరతులు విధించకుండా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. సానియా మీర్జా రాకపోవడంతో నవంబర్ 28న జరుగవలసిన తమ క్రీడా కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం డిశంబర్ 1కి వాయిదా వేసుకోవలసి వచ్చింది.   దీని గురించి సానియా మీర్జాను విమర్శిస్తూ మీడియాలో వార్తలు వచ్చేయి. వాటిపై ఆమె మేనేజర్ స్పందిస్తూ, సానియా మీర్జా మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని రూ. 5 లక్షలు అడిగినట్లు వచ్చిన వార్తలలో నిజం లేదు. ఆమె డబ్బు కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్నిఎటువంటి డిమాండ్స్ చేయలేదు. కానీ ఆ కార్యక్రమం జరిగిన మరునాడు అంటే నవంబర్ 29వ తేదీన ఆమె గోవాలో ఒక కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంది. భోపాల్ లో తన కార్యక్రమం పూర్తయిన తరువాత సాధారణ విమానంలో గోవా వెళ్ళినట్లయితే ఆ కార్యక్రమానికి ఆమె అందుకోలేరు. అందుకే ప్రత్యేక విమానం ఏర్పాటు చేయమని కోరాము. కానీ ఆమె గొంతెమ్మ కోరికలు కోరినట్లు మీడియాలో వార్తలు రావడం మాకు చాలా బాధ కలిగించింది,” అని అన్నారు.