బోరుబావిలో పడిన బాలుడి మృతి

  మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం గ్రామంలో శనివారం నాడు బోరుబావిలో పడిన మూడేళ్ళ బాలుడు రాకేష్ మరణించాడు. శనివారం ఉదయం ఏడు గంటల సమయంలో తోటి చిన్నారులతో ఆడుకుంటున్న రాకేష్ ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయాడు. బాలుడిని రక్షించడానికి అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బోరుబావిలో తలకిందులుగా 32 అడుగుల లోతులో బాలుడు వున్న విషయాన్ని గుర్తించిన అధికారులు ప్రొక్లెయినర్లతో బోరుబావికి సమాంతరంగా తవ్వడం ప్రారంభించారు. అయితేపెద్దపెద్ద బండలు అడ్డు పడటంతో తవ్వకం చాలా ఆలస్యమైంది. బాగా శ్రమించి తవ్వకాలు జరిపి బాలుడిని బయటకి తీయగా అప్పటికే బాలుడు మరణించాడు.

కొడుకులకు రాజకీయ పాఠాలు నేర్పుతున్న లాలూ

బీహార్ ఎన్నికల్లో మహాకూటమి గెలుపొందడంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసింది. జేడీయూ నేత నితీష్ కుమార్ తో జట్టుకట్టి మహాకూటమిని విజయతీరానికి చేర్చడంలో చాలా కృషిచేశారు. అంతేకాదు ఈ విజయంలో భాగంగా తన కొడుకులని రాజకీయ ఆరంగేట్రం చేయించి.. రాజకీయ ఎంట్రీ ఇచ్చిన ఆరంభంలోనే మంత్రుల పదవులు వచ్చేలా చేశారు. అంతేకాదు ఇప్పుడు కొడుకులిద్దరికీ రాజకీయ పాఠాలు నేర్పించడంలో లాలూ పూర్తి సమయం కేటాయించే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. లాలూ ఇద్దరు కొడుకుల్లో పెద్ద కుమారుడు ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగా.. చిన్న కుమారుడు ఉప ముఖ్యమంత్రిగా మరో రెండు శాఖలను నిర్వహిస్తున్నాడు. దీంతో ఇప్పుడు లాలూ వీరిద్దరిని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. లాలూనే కాదు కొడుకులు కూడా తండ్రి దగ్గర పాఠాలు నేర్చుకోవడానికి తెగ ఇంట్రస్ట్ చూపిస్తున్నారట. అందుకే మంత్రులుగా.. ప్రభుత్వం వారికి కట్టబెట్టే బంగ్లాలను సైతం కాదని లాలూ ఇంటి దగ్గరే ఉండి రాజకీయ ఓనమాలు నేర్చుకుంటున్నారు. దీనిలో భాగంగా ఇక లాలూ కూడా అధికారులను సైతం తనదైన శైలిలో మార్పులు చేయిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో తన హయాంలో నమ్మకస్తులుగా పనిచేసిన ఐఏఎస్ అధికారులను మళ్లీ ఇప్పుడు తీసుకుంటున్నారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరుణ్ కుమార్ ని బదిలీ చేయించి తమకు అనుకూలంగా ఉండే సుధీర్ కుమార్ ను ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. ఆరోగ్యశాఖను నిర్వహిస్తున్న తేజ్ ప్రతాప్ కు పాలనలో ఇబ్బందులు తలెత్తకుండా ఆర్.కె మహాజన్ ను ఆ శాఖకు బదిలీ చేయించుకున్నారు. మొత్తానికి లాలూ తన కొడుకుల రాజకీయ భవిష్యత్ గురించి మంచి శ్రద్ధ తీసుకుంటున్నట్టే కనిపిస్తుంది. మరి లాలూ రాజకీయాల్లో నెగ్గినట్టు ఇద్దరు కొడుకులు రాణిస్తారో లేదో చూడాలి.

నా దగ్గర రాజకీయాలు వద్దు.. ఎమ్మెల్యే పై బాలకృష్ణ ఫైర్

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన నియోజక వర్గం అభివృద్ధిలో చాలా కష్టపడుతున్న సంగతి తెలిసిందే. అందుకే నియోజకవర్గం అభివృద్ధి చేసిన జాబితాలో స్థానం కూడా సంపాదించుకున్నారు. అయితే బాలకృష్ణకు ఉన్న కోపం గురించి కూడా తెలిసిందే. ముఖం మీదే తిట్టిపడేస్తారు. అలా ఇప్పుడు ఓ సంబంధిత ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చి హాట్ టాపిక్ అయ్యారు. హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ తన నియోజవకర్గంలో తాగునీటి కోసం కల్యాణదుర్గం నియోజకవర్గం గుండా పైప్‌లైన్‌ ద్వారా నీటిని తీసుకు వెళ్తున్నారు. అయితే ఈ వాటర్ పైప్ లైన్లకు కొందరు చిల్లులు పెడుతున్నారని.. దానికి దీని వెనుక ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి హస్తం ఉందంటూ బాలకృష్ణకు కొంతమంది ఫిర్యాదులు చేశారంట. అంతే దీనికి బాలకృష్ణ రెచ్చిపోయి.. “ఇలాంటి రాజకీయాలు నా దగ్గర వద్దు అంటూ ఇప్పటికి రెండు మూడు సందర్భాల్లో హనుమంతరాయచౌదరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో హనుమంత చౌదరి కూడా స్పందించి ఈ చర్యలకు నాకు ఎలాంటి సంబంధం లేదని తనని అనవసరంగా నిందించవద్దని వివరణ ఇచ్చారంట.  

ఆనం బ్రదర్స్ టీడీపీ ఎంట్రీ.. మంత్రి గారు నో హ్యాపీ

ఆనం బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలోకి చేరడానికి అన్ని రకాలుగా రంగం సింద్దం చేసుకున్నట్టు కనిపిస్తుంది. వీరి రాకకు టీటీపీ అధినేత చంద్రబాబు సైతం ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే ఇతర పార్టీలో ఉన్న నేతలు తమ పార్టీలోకి వస్తున్నప్పడు ఆ పార్టీలో ఉన్న కొంత మంది నేతలకు అసంతృప్తిగా ఉండటం సహజం. ఇప్పుడు కూడా ఆనం బ్రదర్స్ టీడీపీ లోకి రావడం చంద్రబాబు సన్నిహితుడైన నారాయణకు ఏమాత్రం ఇష్టంలేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నిజానికి రాజకీయాల్లో ఆనం బ్రదర్స్ కి ఉన్న పట్టు వేరు. వీరిద్దరూ రాజకీయాల్లో పండిపోయారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ నారయణ పరిస్థితి వేరు. రాజకీయాల్లో అంత అనుభవం లేదనే చెప్పొచ్చు. అందుకే ఆనం బ్రదర్స్ ఎక్కడ పార్టీలోకి వస్తే తన ప్రభావం ఎక్కడ తగ్గిపోతుందో ఆని భయపడుతున్నారని అనుకుంటున్నారు. అంతేకాదు చంద్రబాబు కూడా జిల్లాలో వైసీపీకి హవా తగ్గించాలంటే దానికి ఆనం బ్రదర్స్ లాంటి ఉద్దండులే కరెక్ట్ అని.. అందుకే నారాయణ అభ్యంతరాలను సైతం పక్కనపెట్టి వారి ఎంట్రీకి స్వాగతం పలుకుతున్నట్టు తెలుస్తోంది. మరి ఆనం బ్రదర్స్ ను నారాయణ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

ఓడిపోయినందుకు హ్యాపీగా వివేక్..

వరంగల్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతితెలిసిందే. టీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఈ ఎన్నికలను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని.. ఎన్నికలో ఓడిపోయినందుకు కనీసం బయటకి కూడా రాకుండా.. ఎలాంటి మీడియా సమావేశాల్లో కూడా పాల్గొనకుండా ఇంట్లోనే ఉంటున్నారు. అయితే వరంగల్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సర్వే సత్యనారాయణ ఓడిపోయినందుకు ఒక్కరు మాత్రం చాలా హ్యాపీగా ఫీలవుతున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అది ఎవరో కాదు పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్.. అసలు వరంగల్ ఉపఎన్నికలో వివేక్ పోటీచేయాల్సి ఉంది.. కానీ మొదట వివేక్ పోటీ చేయడానికి నిరాకరించారు. ఆతరువాత కేంద్రం ఎలాగూ బుజ్జగించి ఆయన ఒప్పుకునే సరికి.. సరిగ్గా అదే సమయంలో సర్వే నారాయణ అడ్డుపుల్ల వేశారు. టీఆర్ఎస్ లోకి వెళదామనుకుంటున్న వివేక్ కు ఎలా టికెట్ ఇస్తారని కేంద్రాన్ని ప్రశ్నించడంతో కేంద్రం కూడా వివేక్ కు కాకుండా.. రాజయ్యకు టికెట్ కన్ఫామ్ చేసింది. ఆ తరువాత రాజయ్య కుటుంబంలో జరిగిన ఉందంతం అందరికి తెలసిందే. రాజయ్య కోడలు సారిక చనిపోవడం.. ఆతరువాత రాజయ్యను పోలీసులు అరెస్ట్ చేయడం.. రాజయ్యను పార్టీ నుండి సస్పెండ్ చేసి ఆ టికెట్ ను సర్వేకు  ఇవ్వడం జరిగాయి. అయితే పోటీలో దిగిన సర్వే కూడా ఓడిపోయారు. దీంతో పోటీలో తను లేకుండా ఉన్నందుకు.. అంతేకాదు తన టికెట్ కు అడ్డుపడినా సర్వే ఓడిపోవడంతో వివేక్ ఫుల్ కుష్ లో ఉన్నారంట. అంతేకాదు దీనికి సంబంధించి వివేక ఫ్యామిలీ ఓ పార్టీకూడా చేసుకున్నారంట. మొత్తానికి సొంత పార్టీ సభ్యుడు ఓడిపోయినా వివేక్ చాలా సంతోషంగా ఉన్నారంటే.. సర్వే మీద బానే కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది.

జయలలితకు స్టాలిన్ సలహా..

రాజకీయాల్లో అన్ని రాష్ట్రాల్లో రాజకీయాలకంటే తమిళనాడు రాజకీయాలు కాస్త తేడాగా ఉంటాయి. చాలా భయంకరమైన పాలిటిక్స్ జరుగాతాయి ఇక్కడ. ఇక అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పచ్చగడ్డివేస్తేనే భగ్గుమనే పరిస్థితి. మరి అలాంటి నేపథ్యంలో ఒకరిమీద ఒకరు ఏ రకంగా విమర్శల బాణాలు సంధించుకుంటారో తెలియంది కాదు. అలాంటి వాతావరణం ఉన్న క్రమంలో జయలలితకు.. ఆమె ప్రత్యర్థి పార్టీ డీఎంకే అభ్యర్ధి అది కూడా స్టాలిన్ నుంచి ఓ సలహా రావడంతో అది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అదేంటంటే.. బీహార్ ఎన్నికల్లో మహాకూటమి గెలుపొంది నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన గతంలో ఇచ్చిన హామిని గుర్తుంచుకొని దానికి ఇప్పుడు శ్రీకారం చుడుతూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుండి బీహార్లో పూర్తిగా మధ్యపానం నిషేదం చేస్తామని హామి ఇచ్చారు. ఇప్పుడు నితీశ్ తీసుకున్న నిర్ణయం లాగే తమిళనాడులో కూడా మధ్యపానం పై నిషేధం విధించాలని.. మధ్యపానం వల్ల తమిళనాడులో ఉన్న ఎన్నో కుటుంబాలు పాడైపోయాయి.. ప్రజల కోసం పనిచేయడం అంటే నితీశ్ లాంటి నిర్ణయం తీసుకోవడమే అని.. ఇది తన డిమాండ్ కాదని.. ప్రజల డిమాండ్ గా తీసుకోవాలని జయలలితకు సూచించారట. మరి స్టాలిన్ ఇచ్చిన సలహాకు జయలలిత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

అమీర్ అసహనం రచ్చ..శివసేన చీఫ్ ను కొడితే 2లక్షలు

అమీర్ ఖాన్ అసహనం పై చేసిన వ్యాఖ్యలకు దేశ వ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అందరూ విమర్శిస్తున్న నేపథ్యంలో.. ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే శివసేన కూడా స్పందించి అమీర్ ఖాన్ ను విమర్శించింది. అయితే అందరూ నోటితో విమర్శిస్తుంటే.. శివసేన మాత్రం దానికి భిన్నంగా అమీర్ ఖాన్ ను చెంపదెబ్బ కొడితే  లక్షరూపాయలు ఇస్తామని.. అతనిని దేశ భక్తుడిగా కీర్తిస్తామని ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు శివసేన ఇచ్చిన ఆఫర్ కు రివర్స్ లో తమిళనాడుకు చెందిన తవ్ హీద్ జమాత్ సంస్థ ఇంకో ఆఫర్ ఇచ్చింది. అదేంటంటే.. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ను చెంపదెబ్బ కొట్టినోళ్లకు రూ.2లక్షలు ఇస్తామని ఆ సంస్థ సహాయ కార్యదర్శి తవ్ బీక్ ప్రకటించారు. శివసేన చేస్తున్న ప్రకటనలకు తాము బెదిరిపోమని.. ధైర్యంగా ఎదుర్కొంటామని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తానికి అమీర్ ఖాన్ ఏ పరిస్థితిలో ఉండి ఆ వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ దీనిని అడ్డంపెట్టుకొని కొంతమంది ఇంకా రాద్దాంతం చేస్తున్నారనడానికి ఈ ఘటనలే నిదర్శనం.

సారికది ఆత్మహత్యే.. మహిళా సంఘాల ఆందోళన

సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవలు అతి దారుణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా రాజయ్యను, అతని భార్య మాధవి, కొడుకు అనిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు సేకరించిన ఆధారాలు, పోస్టుమార్టం నివేదిక పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు సారికది హత్య కాదు ఆత్మహత్యే అని తెలిపారు. అయితే ఇప్పుడు దీనిపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసును పక్కదారిని పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఫోరెన్సిక్ నివేదికకు వ్యతిరేకంగా మహిశా సంఘాలు ఆందోళన చేపట్టి.. రాజయ్యను, అతని కుటుంబసభ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 

నేడు హైదరాబాద్ వెళుతున్న చంద్రబాబు నాయుడు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు నెలలు తరువాత మళ్ళీ నేడు హైదరాబాద్ లో కాలుపెట్టబోతున్నారు. ఇక నుండి వారానికి రెండు రోజులు హైదరాబాద్ లో ఉంటానని ఆయనే స్వయంగా ప్రకటించారు. జనవరిలో జరుగబోయే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు పార్టీని సంసిద్దం చేయడానికే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వెళ్లి రావాలనుకొంటున్నట్లు సమాచారం. ఇవ్వాళ్ళ ఆయన సచివాలయానికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇవ్వాళ సాయంత్రం లేదా రేపు ఉదయం జంటనగరాలలో పార్టీ నేతలతో ఆయన సమావేశం అవుతారని సమాచారం. డిశంబర్ నెలలో పార్టీ నేతలతో ఒక విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి, జి.హెచ్.ఎం.సి. ఎన్నికలను ఎదుర్కోవడానికి వారికి దిశా నిర్దేశం చేస్తారని కుతుబుల్లా పూర్ తెదేపా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద గౌడ్ తెలిపారు.

వైసీపీ పై సోమిరెడ్డి జోస్యం.. అలా అయితేనే మనుగడ..

వైసీపీ పార్టీ అధినేత జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి జగన్ పై విమర్శల బాణాలు వదిలారు. నెల్లూరు జిల్లాలో జగన్ చేసిన పర్యటన ప్రజలను రెచ్చగొట్టేలా ఉందని అన్నారు. అంతేకాదు వైసీపీ పార్టీ గురించి జోస్యం కూడా చెప్పారు. వరంగల్ ఉపఎన్నికలో వైసీపీ ఘోర పరాభవం పొందిన నేపథ్యంలో ఏపీలో కూడా వైసీపీ పరిస్థితి అదే అంటూ విమర్శించారు. దేశంలో కొత్తగా పుట్టిన ప్రాంతీయ పార్టీలు తాము ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో గెలిచి అధికారం సాధిస్తేనే మనుగడ సాధించాయని... అలా గెలవలేని పార్టీలన్నీ గంగలో కలిసిపోయాయని ఎద్దేవ చేశారు. మరి వైసీపీ గురించి సోమిరెడ్డి చెప్పిన జోస్యం నిజమవుతుందో లేదో వచ్చే ఎన్నికల బట్టి తెలుస్తుంది.

అందుకే పార్టీ చేరిక.. పదవులు ఆశించి కాదు.. ఆనం బ్రదర్స్

తమ పార్టీ నుండి వేరే పార్టీలోకి మారే ప్రతి నాయకుడు .. తాము ప్రజలకు సేవ చేయాలనే పార్టీ మారుతున్నామని.. పదవులు ఆశించిన కాదని చెప్పే మాటలు ఇవే. ఇప్పుడు ఆనం బ్రదర్స్ కూడా అందరూ చెప్పే రొటీన్ డైలాగ్సే కొట్టి బోర్ కొట్టించారు. ఈ సోదరులు కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలోకి మారుతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఆనం రాంనారాయణరెడ్డి తమ నియోజక వర్గానికి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కూడా జరిపారు. తమ పార్టీ చేరికను రెండు రోజుల్లో ప్రకటిస్తామని కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తాము ప్రజాసేవ చేయకుండా ఉండలేక పోతున్నామని, అందుకే టీడీపీలోకి చేరబోతున్నామని.. అంతేకానీ, పదవీ వ్యామోహంతో కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరడం లేదని వారు చెపుతున్నారు. అంతేకాదు పదవుల కోసం రాజకీయాలు చేయకూడదని, బిడ్డల భవిష్యత్ కోసం రాజకీయాలు చేయాలని ఆనం సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబుకు అండగా నిలవాలన్నదే తమ అభిమతమన్నారు. మరి పదవులు ఆశించకపోతే.. కాంగ్రెస్ లో ఉండైనా ప్రజాసేవ చేయోచ్చని ఆనం బ్రదర్స్ కి తెలియదా.

రాజ్యాంగంపై మోడీ..నేను ఇవ్వడంలేదు.. సభ్యుడిగానే మాట్లాడుతున్నా.. మోడీ

  పార్లమెంట్ శీతాకాల సమావేశంలో భాగంగా ఈ రోజు కూడా రాజ్యాంగపై చర్చ కొనసాగుతుంది. మహనీయులకు నావంతు నివాళి అర్పిస్తున్నానని.. రాజ్యాంగంపై అభిప్రాయాలు తెలియజేసిన సభ్యులందరికి ధన్యవాదాలు తెలుపుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ కూజా రాజ్యాంగం పై మాట్లాడుతున్నారు. పార్లమెంట్ చరిత్రలోనే రాజ్యాంగంపై చర్చ ఒక ముసాయిదా అవుతుందని.. నేను చర్చకు జవాబు ఇవ్వడంలేదు..ఒక సామాన్య సభ్యుడిగానే మాట్లాడుతున్నానని వ్యాఖ్యానించారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో నవంబర్ 26 కు ఎంతో విశిష్టత ఉందని.. ప్రతి ఏడాది రాజ్యాంగం దినోత్సవంలో ఎలాంటి మార్పు చేయాలో ఆలోచిద్దామని సూచించారు. భిన్నత్వంగల భారత్ ను కలిపి ఉంచే శక్తి రాజ్యాంగానికి ఉంది.. రాజ్యాంగంపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం మొదలైంది.. రాజ్యాంగంపై విద్యాసంస్థల్లో చర్చలు జరపాలి..రాజ్యాంగంపై ఆన్ లైన్ పోటీలు ఎందుకు పెట్టకూడదు? అని ప్రశ్నించారు. ప్రతి ప్రధాని దేశాన్ని అభివృద్ధిచేయడంలో తమ వంతు పాత్ర పోషించారు.. అన్ని ప్రభుత్వాల సహకారంతోనే దేశం అభివృద్ది సాధ్యమైందని.. కొన్ని ప్రభుత్వాలు ఆక్షాంక్షలకు తగ్గట్టు పనిచేయలేకపోవచ్చు అని మోడీ  అన్నారు. ఈ దేశాన్ని నిర్మించింది రాజులు, మహారాజులు కాదు.. దేశంలో ఉన్న విభిన్న వర్గాలు దేశాన్ని నిర్మించారు.. ప్రతి ఒక్క పౌరుడికి భాగస్వామ్యం ఉంది అని మోడీ పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి ప్రసంగానికి ఫిదా అయిపోయిన కేంద్రమంత్రి

టీ టీడీపీ రేవంత్ రెడ్డి తన వాగ్ధాటికే ఫైర్ బ్రాండ్ అని పేరు సంపాదించుకున్నాడు. ప్రత్యర్ధులకు ధీటుగా సమాధానం చెప్పి.. వారిని అంతే ధీటుగా విమర్శించగల నైపుణ్యం ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి. అందుకే అందరినీ ఏకిపారేసే కేసీఆర్ సైతం కాస్తో, కూస్తో రేవంత్ రెడ్డికి భయపడతారనే చెప్పుకోవచ్చు. ఆయన చేసే ప్రసంగానికి ప్రజలు సైతం చాలా ముగ్ధులైపోతారు. ఇప్పుడు ఏకంగా ఆయన చేసిన ప్రసంగానికి ఓ కేంద్రమంత్రే ముగ్ధుడైపోయాడు. వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో టీడీపీ-బీజేపీ మిత్రపక్షం కాబట్టి ఆ అభ్యర్ధి తరపున ప్రచారంలో రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. సాధారణంగా రేవంత్ రెడ్డి ప్రసంగానికి ప్రజలు ఫిదా అయిపోయి.. ఈలలు, చప్పట్లతో హడావుడి చేయడం కామన్. అయితే ఈ ప్రచారంలో కూడా అదే జరిగింది. ఇదిలా ఉండగా ఈ ప్రచారానికి బీజేపీ కేంద్రమంత్రి హన్సరాజ్ గంగరామ్‌ కూడా హాజరయ్యారు. ఈయన రేవంత్ రెడ్డి ప్రసంగానికి వచ్చిన రెస్పాన్స్ చూసి ఒక్కసారిగా షాకయిపోయారంట. అంతేకాదు ప్రసంగం అయిపోయిన తరువాత రేవంత్ రెడ్డి దగ్గరకి వెళ్లి "వెల్‌డ‌న్" అంటూ అభినందనులు కూడా తెలిపారట. అక్కడితో ఆగకుండా తాను రేవంత్ రెడ్డికి ఓ ఆఫర్ కూడా ఇచ్చారంట. మీలాంటి వాళ్లు బీజేపీలో ఉండాలని.. పార్టీలో చేరండి.. పార్టీలో చేరితే కనుక బీజేపీ తరపున మీరే అంటూ పెద్ద ఆఫర్‌ను ముందుంచారట. కానీ రేవంత్ రెడ్డి అంతే సునితంగా దానిని తిరస్కరించి.. తను పార్టీ మారే ప్రసక్తే లేదు అని చెప్పారంట. మొత్తానికి రేవంత్ రెడ్డి తన ప్రసంగంతో సామాన్య ప్రజలనే కాదు.. కేంద్రమంత్రులను కూడా ఆకర్షిస్తున్నాడు. 

ప్లేస్ చెప్తే పేల్చేస్తాం.. ఒబామాతో పుతిన్

ఫ్రాన్స్ల్ లో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం అంతా ఇంతా కాదు. దీనివల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి తమ విషయంలో జోక్యం చేసుకున్నందుకే ఈ దాడులు జరిపామని సిరియా దేశం కూడా తేల్చిచెప్పింది. అయితే ఈ విషయంలో టర్కీలో జరిగిన జి20 సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ అమెరికా అధ్యక్షుడు ఒబామాని సహాయం అడిగినట్టు తెలుస్తోంది. సిరియాలో ఉన్న ఐసిస్ ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేసే క్రమంలో చేస్తున్న యుధ్ధానికి పూర్తిగా సహకరించాలని.. దీనిలో భాగంగానే తమ అంతరిక్షంలో ఉన్న అత్యాదునిక శాటిలైట్ల ద్వారా ఉగ్రవాదుల స్థావరాలను, కదలికలను గుర్తించి చెబితే నిమిషాల్లో అక్కడికి వెళ్లి బాంబుల వర్షం కురిపించి వారిని ధ్వంసం చేస్తామని చెప్పారు. కాగా ఇటీవల సిరియా దేశం తమ దేశ యుద్ద విమానాన్ని కూల్చేంసినందుకు రష్యా తీవ్ర ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసింది. మరి వారికి ఒబామా వారికి సహకరిస్తారో లేదో.