టీ కాంగ్రెస్ నేతలు దానంకు చెక్ పెడుతున్నారా?

దానం నాగేందర్ పార్టీ మార్పుపై హై డ్రామానే జరిగిందని చెప్పాలి. తాను పార్టీ మారట్లేదు అని చెపుతూనే.. చీకటిలో టీఆర్ఎస్ నేతలతో మంతనాలు జరపడం.. ఆఖరికి తను ఆశించింది రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తి లేదు అని చెప్పడం.. ఇవన్నీ దానం ఎత్తుగడలను చూపించాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు దానం కు చెక్ పెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీమంత్రి ముఖేష్ గౌడ్ ను రంగంలోకి దించనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు రెండు రోజుల క్రితమే ముఖేష్ గౌడ్ తో మాట్లాడారంట. అయితే ముఖేష్ కు నగర కాంగ్రెస్ కమిటీ బాధ్యతలు అప్పగిస్తారా? లేక పీసీసీలో మరేవైనా బాధ్యతలు అప్పగిస్తారా అన్న విషయంపై చర్చలు జరుగుతున్నాయి. కాగా ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2014 ఎన్నికల్లో ప్రస్తుతం గోషమహల్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ పై పోటీ చేసి ఓడిపోయారు. దాంతో ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. పార్టీ కార్యక్రమాల్లో దేనిలో పాల్గొనకుండా దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు దానం ఎఫెక్ట్ తో కాంగ్రెస్ ముఖేష్ గౌడ్ ను తెరపైకి తెచ్చింది. దీంతో మళ్లీ ముఖేష్ గౌడ్ పార్టీలో క్రియాశీలకం కానున్నారు. ఒకవేళ ముఖేష్ గౌడ్ కు నగర కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తే... దానం నాగేందర్ కు ఏఐసీసీ లేదా పీసీసీ కీలక బాధ్యతలు అప్పగించే అంశంపైనా చర్చించినట్లు సమాచారం. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ముందే మేల్కొని.. దానం ఎప్పుడైనా పార్టీకి ఝలక్ ఇవ్వొచ్చని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి కాంగ్రెస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి..

పార్టీ ఫిరాయింపులపై సుప్రీం.. రెండు నెలలు ఆగండి..

పార్టీ ఫిరాయింపులపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈసందర్బంగా 14 నెలలవుతున్న పార్టీ ఫిరాయించిన వాళ్లపై ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. పార్టీ ఫిరాయింటిన వాళ్లపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని చెప్పి రెండు నెలలు పైన అయిపోతుంది.. కానీ ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషన్ తరుపు న్యాయవాది సుప్రీంకు తమ వాదనలు వినిపించారు. దీంతో సుప్రీం.. ఇది స్పీకర్ పరిధిలో ఉన్నందు వల్ల ఎలాంటి చర్యలు తీసుకోలేమని.. తమ పరిధిలో లేనందువల్ల విచారించలేమని తెలిపింది. అంతేకాదు రెండు నెలల లోపు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే తాము పరిశీలిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ రెండు నెలల తరువాత తలసాని పరిస్థితి ఏంటని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సుప్రీం కోర్టు రెండు నెలలు గడువు ఇచ్చిన నేపథ్యంలో.. ఈ రెండు నెలల్లో స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే సుప్రీం యాక్షన్ తీసుకుంటుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇప్పటికైనా స్పీకర్ గారు మేల్కొని ఎదో ఒక చర్య తీసుకుంటారో లేదో చూడాలి.

విజయవాడ కల్తీ మందు.. అవును మత్తు కోసం కలిపాం..!

విజయవాడ, కృష్ణలంకలో కల్తీ మందు కేసులో కీలక సమాచారం అందినట్టు తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న మల్లాది విష్ణు సోదురుడు.. మల్లాది శ్రీనివాస్ కీలక సమాచారం అందించినట్టు తెలుస్తోంది. మత్తు కోసం తెల్లటి పదార్థాన్ని మందులో కలిపి క్యాషియర్ వెంకటేశ్వరరావు విక్రయించాడని శ్రీనివాస్ పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసుల క్యాషియర్ ను ప్రశ్నించగా.. మందులో స్పరిట్ కలిపామని అంగీకరించాడు. అయితే ఈకేసులో నిందితుడిగా ఉన్న మల్లాది విష్ణు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. కాగా తొమ్మిది బ్రాండ్లకు సంబంధించి ఎక్సైజ్ అధికారులు శాంపిళ్లు తీసుకోగా.. దానిని సంబంధించి చేసిన పరీక్షల్లో ఈ తొమ్మిది బ్రాండ్లలో ఎలాంటి కల్తీ జరగలేదని.. స్వర్ణా బార్ లోన్ కల్తీ జరిగిందని నిర్ధారించారు. అంతేకాదు మత్తు కోసం చాలా పవర్ ఉన్న మందును వాడినట్టు అధికారులు తెలుపుతున్నారు. కాగా స్వర్ణబార్ లో కల్తీ మందు తాగి 6 గురు చనిపోగా పలువురు ఆస్వస్థకు గురైన సంగతి తెలిసిందే.

ఆర్టీవోలపై నితిన్ ఫైర్.. బందిపోటులను మించిపోయారు..

రవాణాశాఖాధికారులను బందిపోటులతో పోలుస్తూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ దేశం మొత్తం మీద ఉన్న శాఖలన్నింటిలో అత్యంత అవినీతి జరిగేది రవాణా శాఖలోనే అని.. ఆర్టీవో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన రవాణాశాఖాధికారులు బందిపోటులను మించిపోయారని మండిపడ్డారు. అంతేకాదు దేశంలో డ్రైవింగ్ లైసెన్సు లు రావడం చాలా తేలికైపోయిందని.. మోటరు వాహనాల నూతన చట్టం ద్వారా రవాణా శాఖలో నూతన సంస్కరణలు తీసుకురావచ్చు కానీ.. ఆర్టీవో అధికారులు ఆచట్టం అమలు కాకుండా ఉండేందుకు మంత్రిత్వ శాఖపై ఒత్తిడి తీసుకువస్తున్నారని అన్నారు. ప్రస్తుతం నితిన్.. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ, నౌకాయాన మంత్రిగా ఉన్నారు.

టీఆర్ఎస్ ఖాతాలో 3 ఎమ్మెల్సీ స్థానాలు

తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్ఠానాలకు గాను పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. వీటిలో అప్పుడే మూడు ఎమ్మెల్సీ  స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. దీనిలో నిన్న టీఆర్ఎస్ పార్టీ ఒకటి బోణి కొట్టింది. వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి గాను కొండా మురళీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈరోజు రెండు స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది.  ఆదిలాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా పురాణం సతీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి పోటీ చేసిన టీడీపీ అభ్యర్ధి నారాయణరెడ్డి, స్వతంత్ర అభ్యర్ధి రియాజ్ తప్పుకోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతేకాదు నారాయణరెడ్డి టీడీపీ నుండి టీఆర్ఎస్ లో చేరినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు మెదక్ ఎమ్మెల్సీ స్థానం కూడా టీఆర్ఎస్ ఖాతాలో చేరింది. మెదక్ ఎమ్మెల్సీ స్థానానికి భూపాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ప్రణబ్ కు మోడీ విషెస్.. ప్రణబ్ వెలకట్టలేని సంపద..

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు 81వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రజా జీవితంలో ఉన్న ప్రణబ్ ముఖర్జీ ఆయురారోగ్యాలతో ఉండాలని.. ఆయన మన దేశానికి వెలకట్టలేని సంపద అని.. వివేకం.. మేధస్సు సమపాళ్లు కలిగిన వ్యక్తి అని కొనియాడారు. అంతేకాదు.. ప్రణబ్ గౌరవప్రదమైన నాయకుడని, ఆయన దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని.. ఈ సందర్భంగా 'ప్రెసిడెంటల్ రీట్రేట్స్' పుస్తకాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు.

నారా లోకేశ్ చెప్పిన దొంగబ్బాయి జగనా..?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు.. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఇప్పుడు విమర్శలు చేయడంలో జోరు పెంచారు. ఒకప్పుడు అంతగా మాట్లాడని లోకేశ్ ఇప్పుడు మాత్రం ప్రతిపక్షనేత అయిన జగన్ పై మాత్రం వ్యంగ్యాస్త్రాలు చేస్తూ జోరు పెంచాడు. చిత్తూరు జిల్లా గంగాధ‌ర నెల్లూరులో జ‌రిగిన జ‌న చైతన్యయాత్ర‌లో పాల్గొన్న లోకేశ్ మాట్లాడుతూ దొంగబ్బాయి.. దొంగబ్బాయి అంటూ జగన్ పేరు చెప్పకుండానే జగన్ పై అవాకులు.. చవాకులు పేల్చారు. `మ‌న దుర‌దృష్టం కొద్దీ మాయ‌మాట‌లు చెప్పే దొంగ‌బ్బాయి ఇక్క‌డ ఉన్నాడు. అత‌డితో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.. అతను చెప్పే మాట‌లు న‌మ్మొద్దు` అని ప్ర‌జ‌ల‌కు లోకేష్ సూచించారు. అంతేకాదు పట్టిసీమ ప్రాజెక్టు గురించి కూడా తప్పుడు సమాచారం చేస్తున్నారని జగన్ పై మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు.. గోదావ‌రి జ‌లాల‌న్నింటినీ రాయ‌ల‌సీమ‌కు త‌ర‌లిస్తున్నార‌ని అక్క‌డి ప్ర‌జ‌ల‌కు చెప్పాడు.. మ‌ళ్లీ రాయ‌ల‌సీమకు వ‌చ్చి ప‌ట్టిసీమ నుంచి ఒక్క‌చుక్క కూడా మ‌న‌కు రాద‌ని చెప్పాడు.. ఇవి మాయ‌మాట‌లు కాదా? ` అని ప్ర‌జ‌ల‌ను ప్ర‌శ్నించారు. అంతటితో ఆగకుండా ` మీ నాన్న ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఎవ‌రైనా రాయ‌ల‌సీమలో పెట్టుబ‌డులుపెట్టేందుకు ముందుకు వ‌చ్చారా? ఒక్క ప్రాజెక్టు అయినా రాయ‌ల‌సీమకు వ‌చ్చిందా?` అని జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించారు. మొత్తానికి లోకేశ్ చిన్న చిన్నగా బలమైన నాయకుడిగా ఎదుగుతున్నట్టు కనిపిస్తుంది.

మరోసారి హరీశ్ రావుకు హ్యాండ్ ఇచ్చిన కేసీఆర్..!

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ లో కేసీఆర్ దే మొదటి స్థానం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే కేసీఆర్ తరువాత స్థానం ఎవరిది.. కొడుకు కేటీఆర్ దా.. లేక మేనల్లుడు హరీశ్ రావుదా.. అంటే చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఒకప్పుడు కేసీఆర్ తరువాత అంతటి బలం ఉన్న నాయకుడు హరీశ్ రావే.. కేసీఆర్ తరువాత స్థానం హరీశ్ రావుదే అని చాలామందే అనుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది.. కేసీఆర్ కూడా హరీశ్ రావుకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను చిన్నచిన్నగా తగ్గిస్తూ.. కొడుకు కేటీఆర్ ను పైకి తీసుకురావాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. మొన్న జరిగిన వరంగల్ ఉపఎన్నికలో హరీశ్ వర్గానికి చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్ కి టికెట్ ఇవ్వకుండా  పసునూరి దయాకర్ కి ఇచ్చారు. ఇప్పుడు కూడా మరోసారి రుజువు చేశారు కేసీఆర్.. తాజాగా తెలంగాణలో జరగబోయే 12 ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ హరీశ్ అనుచరులకు హ్యాండ్ ఇచ్చిన కేసీఆర్… కేటీఆర్ వర్గానికి చెందిన శంభీపూర్ రాజుకు వ్యక్తికి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు. దీంతో కేసీఆర్ హరీశ్ రావును తొక్కేస్తున్నట్టు స్పష్టంగా అర్ధమవుతోందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

కళ్లు తెరిచిన బీజేపీ.. టీడీపీ ని ఏమనొద్దు..!

బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన బీజీపీ నాయకులకు ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అవుతున్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు అంతా తామే అన్నట్టు వ్యవహరించే నేతలు ఇప్పుడు కాస్త నెమ్మదించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే చెప్పనక్కర్లేదు.. బీజేపీ.. టీడీపీ మిత్రపక్షంగా ఉన్నా.. బీజేపీ నేతలే ఎక్కువ పెత్తనం చూపించేవారు. అంతేకాదు టీడీపీ నాయకులపై కూడా ఆలోచించకుండా విమర్శల బాణాలు వదిలేవారు. గతంలో ఈ విషయంలో రెండు పార్టీల మధ్య విబేధాలు కూడా వచ్చాయి. అయితే చంద్రబాబు కలుగజేసుకొని నచ్చజెప్పడంతో టీడీపీ తమ్ముళ్లు కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు పరిస్థితి కొంచెం మారింది. ఇప్పుడు మిత్రుల వల్ల ప్రయోజనం ఎంత ఉంటుందన్న విషయాన్ని ఇప్పుడిప్పుడే బీజేపీ నేతలకు అర్థమవుతుందట. అంతేకాదు ఇందుకు సంబంధించి నేతలకు.. బీజేపీ పెద్దలు కొన్ని సూచనలు కూడా చేశారట. ఏపీ అధికారపక్షంతో జాగ్రత్తగా ఉండాలని.. అనవసరమైన వ్యాఖ్యలు.. విమర్శలు అస్సలు చేయొద్దంటూ..బాబుతో ఏదైనా సమస్యలు ఉంటే తమకు చెప్పాలే కానీ.. ఎవరూ సొంతంగా వ్యాఖ్యలు చేయొద్దంటూ సూచించారట. మొత్తానికి చాలా కాలం తరువాత బీజేపీ నేతలకు కళ్లు తెరుచుకున్నట్టు ఉంది. అందుకే నిన్న మొన్నటి వరకూ టీడీపీ నేతలపై విరుచుకుపడిన బీజీపే నేతలు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు.

రాహుల్ జైలుకు వెళ్లడానికైనా సిద్దంగా ఉన్నారా..?

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కొడుకు రాహుల్ గాంధీ ఇద్దరూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరవ్వాలని సోనియాను, రాహుల్ ను కోర్టు ఆదేశించగా వారు మాత్రం హాజరుకాలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు ఈ నెల 19 వ తేదీన ఎలాగైనా కోర్టుకు హాజరు కావాల్సిందే అని ఆదేశించింది.  అయితే ఈ కేసుకు సంబంధించి రాహుల్ ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే 19వ తేదీన కోర్టుకు హాజరైనప్పుడు రాహుల్ జైలుకు వెళ్లడానికైనా సిద్దంగా ఉన్నారంట.. బెయిల్ కూడా తీసుకోరంట. అంతేకాదు.. ఈ నిర్ణయానికి సోనియా కూడా ఓకే చెప్పారంట.  తాము ఎలాంటి నేరం చేయనందున తమపై సానుభూతి వెళ్లి విరుస్తుందని ప్రధాని మోడీ తన ప్రత్యర్థులపై కక్ష ఎలా తీర్చుకుంటున్నారనే విషయం కూడా ప్రజలకు అర్థమవుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయట. అయితే ఈకేసులో కోర్టుకు హాజరవుతున్న సోనియా.. 86 ఏళ్ల మోతీలాల్ వోరా సహా మిగిలినవారు కూడా బెయిల్ దరఖాస్తు చేసుకుంటారు ఒక్క రాహుల్ తప్ప. మొత్తానికి రాహుల్ సానుభూతి కోసం బానే ట్రై చేస్తున్నట్టు కనిపిస్తోంది.

టీడీపీలోకి గాదె వెంకటరెడ్డి.. ?

ఏపీ టీడీపీలోకి వలసల పర్వం నడుస్తోంది. ఇప్పటికే చాలామంది నేతలు అధికార పార్టీలోకి చేరడానికి సముఖత చూపిస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితమే ఆనం బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలోకి చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకే చెందిన మరో సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి కూడా టీడీపీలోకి చేరేందుకు సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు గతంలో రాష్ట్రం ప్ర‌స్తుతం చాలా క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉంద‌ని ఇలాంటి ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు అయితేనే ఏపీ అభివృద్ధి చెందుతుంద‌ని.. పట్టిసీమ వల్ల పోలవరానికి ఎలాంటి నష్టం లేదని కూడా గాదె చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. అయితే అప్పుడే గాదె టీడీపీ గూటికి చేరుతారని వార్తలు వచ్చాయి.. కానీ అందుకు సరైన సమయం రాలేదు. మరోవైపు చంద్రబాబు కూడా గాదె టీడీపీ ఎంట్రీకి సానుకూలంగా ఉన్నా.. ప్రస్తుతం ఆయన బిజీ వల్ల గాదె ఎంట్రీకి బ్రేక్ పడింది. కానీ ఇప్పుడు మళ్లీ గాదె టాపిక్ చంద్రబాబు దగ్గరకు వచ్చింది. ప్రకాశం జిల్లాకు చెందిన నేతలు గాదె గురించి మరోసారి చంద్రబాబు దగ్గర ప్రస్తావించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రెండు జిల్లాల్లో రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ట్టున్న నేత కావ‌డం గాదె ఎంట్రీకి చంద్రబాబు ఓకె చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలందరూ ఒక్కొక్కరిగా వేరే పార్టీల్లోకి వెళుతుంటే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ తరుపున ఆపార్టీలో ఎంతమంది ఉంటారో..

ఏపీ ఆర్ధిక మంత్రిగా ఆనం?.. మరి నారాయణ?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాబినెట్ ను మార్చాలని ఎప్పుటినుండో ఆలోచనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న మంత్రి వర్గం నుండి కొంత మంది మంత్రులను తప్పించి ఆస్థానంలో కొత్తవారిని నియమించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అయితే ఉన్న వారిలో నుండి ఎవరి తప్పించాలని చంద్రబాబు పార్టీ వర్గాలతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఆర్ధిక మంత్రి యమనల రామకృష్ణుడిని తప్పించి.. ఆస్థానంలో కొత్తగా పార్టీలో చేరిన ఆనం రాం నారాయణరెడ్డిని నియమించాలని చూస్తున్నారట. అంతేకాదు నారాయణను కూడా మంత్రి వర్గం నుండి తప్పించాలని చంద్రబాబు చూస్తున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాజకీయాలలో అంతగా అనుభవం లేని నారాయణను తప్పించి ఆయనకు రాజధానికి నిర్మాణం బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారంట. ప్రస్తుతం.. రాజధాని అమరావతి సీడ్ క్యాపిటల్ కు సంబంధించిన బాధ్యతలు నారాయణనే చూసుకుంటారు.. కనుక మంత్రి నుండి తప్పించి క్యాపీటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ(సీఆర్డీఎ) పూర్తి స్థాయి చైర్మన్ గా బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. మరోవైపు నారాయణను మంత్రివర్గం నుంచి తొలగించడం అంత ఈజీ కాదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.. 

సల్మాన్ నిర్ధోషి.. మరి తాగింది కారా?.. ట్వీట్లు

దాదాపు 13 ఏళ్ల పాటు సాగిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కేసుపై ఈ రోజు తుది తీర్పు వెలువడింది. సల్మాన్ ను దోషిగా నిర్దేశించలేమని.. సాక్ష్యాలు సేకరించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని హైకోర్టు తెలిపింది. కాగా 2002 లో హిట్ అండ్ రన్ కేసులో ఒకరి మృతికి కారణమయ్యారని సల్మాన్ ఖాన్ పై అభియోగాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే సల్మాన్ ఖాన్ నిర్ధోషి అని కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులు.. అభిమానులు అందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ట్విట్టర్ ద్వారా కూడా తమ అభినందనలు తెలుపుతున్నారు. ఇదంతా ఒకటైతే.. మరోవైపు సల్మాన్ ఖాన్ నిర్ధోషి అని కోర్టు తీర్పు ఇవ్వడంపై పలువురు విమర్శలు కూడా చేస్తున్నారు. కోర్టు ఇచ్చిన తీర్పును బట్టి తాగింది సల్మాన్ ఖాన్ కాదు.. తాగింది కారన్నమాట అని ఒకరంటే.. ఈరోజు చాలా బాధాకరమైన రోజు అని మరొకరు కామెంట్లు విసురుతున్నారు.

పోలవరంపై ఉమాభారతి.. రెండు రాష్ట్రాలు మాట్లాడుకుంటేనే మంచిది..

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు ను వ్యతిరేకిస్తూ ఒడిశా ఎంపీలు పార్లమెంట్ దగ్గర నిరససలు చేసిన సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు వల్ల ఒడిశాకు తీవ్ర నష్టం కలుగుతుందని ఒడిశా ఎంపీలు ఆరోపించారు. దీనిపై ఉమాభారతి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా చేసిన అభ్యంతరాలను ఏపీ దృష్టిలో పెట్టుకోవాలని.. రెండు రాష్ట్రాలు కలిసి మాట్లాడుకుంటేనే మంచిదని.. ముందే సమస్యలు పరిష్కారించుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని సూచించారు. పోలవరం గిరిజనుల జీవితాలతో ముడిపడిఉన్న సున్నితమైన అంశమని.. కాబట్టి ఇరు రాష్ట్రాల సీఎంలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే మంచిదిని అన్నారు. రెండు రాష్ట్రాలకు కేంద్రం తప్పకుండా సహకరిస్తుందని అన్నారు.

ఎమ్మెల్సీ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికైన కొండా మురళీ.. టీఆర్ఎస్ బోణీ..

వరంగల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక స్థానానికి గాను కొండా మురళీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి నామినేషన్లు వేసిన ఐదుగురు అభ్యర్ధులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో కొండా మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ కేసీఆర్ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను అని అన్నారు. కాగా జిల్లాలో మొత్తం 859 మంది స్థానిక సంస్థల ప్రతినిధులకు ఓట్లు ఉన్నాయి. వీరిలో పార్టీల వారీగా బలాబలాలు చూస్తే తెరాసకు 509 కాంగ్రెస్ కు 215 టీడీపీ కూటమికి 201 ఇతరులకు 30 ఓట్లు ఉన్నాయి. ప్రతిపక్షాల ఓట్లన్ని కలిపినా కూడా అధికార పార్టీకి తిరుగులేని మెజార్టీ ఉంది. ఆ రకంగా చూసినా కూడా టీఆర్ఎస్ పార్టీకే స్థానం దక్కే అవకాశం ఉంది. మొత్తానికి తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు గాను పోటీ జరుగుతుండగా ఎలాంటి ఎన్నికలు లేకుండా అప్పుడే టీఆర్ఎస్ బోణి కొట్టడం ఆపార్టీకి శుభపరిణామమే.