రాజీవ్ గాంధీ హంతకులను వదిలిపెట్టకూడదు.. సుప్రీం

  రాజీవ్ గాంధీ హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. గతంలో రాజీవ్ గాంధీ హత్య కేసులు నిందితులుగా ఉన్న ఏడుగురికి మరణశిక్ష పడిన సంగతి తెలిసిందే. అయితే తమిళనాడు ప్రభుత్వం.. మరణశిక్ష పడిన మురుగన్, శంతన్, అరివు అనే ముగ్గురు దోషులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాదు వారితో పాటు  నళిని, రాబర్ట్ పియూస్, జయకుమార్, రవిచంద్రన్‌లను కూడా విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. కానీ దానికి కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒప్పుకోలేదు. దీంతో ఈ విషయం సుప్రీంకోర్టుకు వచ్చింది. అయితే దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. రాజీవ్ గాంధీ హత్య కేసులో ఉన్న నిందుతులకు శిక్ష తగ్గించే అధికారం తమిళనాడు ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. రాజీవ్ గాంధీ హంతకులను వదిలిపెట్టకూడదని ఆదేశించింది. అంతేకాదు ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొన్ని సూచనలు కూడా చేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా దోషులను వదలిపెట్టే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని.. శిక్షల విషయంలో ఉపశమనం కలిగించే అధికారం గానీ హక్కు గానీ రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని చెప్పింది.

తెలంగాణ తెలుగు యూనివర్శిటీ పేరు మార్పు..

రాష్ట్రం విడిపోయిన అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏపీకి సంబంధించిన పేర్లన్నింటినీ మార్చేసింది. ఇప్పుడు తాజాగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చడానికి సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయా విశ్వవిద్యాలయానికి ఫ్రోపెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంగా మార్చగా..  ఇప్పుడు పొట్టి శ్రీరాములు పేరు మార్చి దానికి సామాజిక చరిత్రకారుడైన సురవరం ప్రతారపెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరుపుతుందని.. ఈవిషయంపై ఏదో ఒక నిర్ణయం త్వరలో తీసుకుంటామని టీ సర్కార్ వెల్లడించింది. అంతేకాదు ఈ యూనివర్శిటీ పేరు మార్పుపై కేసీఆర్ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది.

బీఫ్ ఫెస్టివల్ కు పోటీగా పందికూర ఫెస్టివల్..

ఓయూలో బీఫ్ ఫెస్టివల్ వివాదం ముదురుతోంది. ఈనెల 10 వ తేదీన ఎలాగైనా బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని బీఫ్ ఫెస్టివల్ నిర్వహకలు తేల్చిచెబుతున్నారు. మూడుసార్లు బీఫ్ ఫెస్టివల్ నిర్వహించినా మాట్లాడనివారు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు బీఫ్ ఫెస్టివల్ ను ఉద్దేశించి మరో దాద్రి ఘటన అవుతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు.. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు అతనిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా బీఫ్ ఫెస్టివల్ కు ఫోటీగా పందికూర ఫెస్టివల్ నిర్వహించాలని ఓయూ జేఏసీ నిర్ణయించుకుంది. ఈనెల 8న పందికూర ఫెస్టివల్ నిర్వహించి తీరుతామని.. ఉద్రేకాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు బీఫ్ ఫెస్టివల్ వద్దని ఓయూ జేఏసీ అభిప్రాయపడింది.

జుకెర్ బర్గ్ సంచలనమైన నిర్ణయం.. 99 శాతం షేర్లు దానం

ఫేస్ బుక్ స్థాపకుడు జుకెర్ బర్గ్ ఓ సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే తన కంపెనీకి చెందిన 99 శాతం షేర్లను స్వచ్చంధ సంస్థలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకన్నాడు. జుకెర్ బర్గ్ ఇంత సడెన్ గా.. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారనుకుంటున్నారా..? ఎందుకంటే.. జుకెర్ బర్గ్.. ఆయన సతీమణి ప్రిసిల్లా చాన్ లకు వారం క్రితమే పాప (మాక్స్) పుట్టింది. దీంతో వారు తమ షేర్లలో 99 శాతం స్వచ్ఛంద సంస్థలకి ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు  మాక్స్ రావడంతో తమ జీవితంలో కొత్త వెలుగులు ప్రారంభమయ్యాయని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కాగా ప్రస్తుతం ఆ షేర్ల విలువ 45 అమెరికన్ బిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో వాటి విలువ దాదాపు రూ. 3 లక్షలు అన్నమాట. మొత్తానికి జుకెర్ బర్గ్ చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ మొత్తాన్ని స్వచ్ఛంద సేవ కోసం ఇచ్చి రికార్డు సాధించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలు. చంద్రబాబు లోకేశ్ కు ఎంట్రీ ఇస్తారా..?

జీహెచ్ఎంసీ ఎన్నికలు జనవరి నెలాఖరు కల్లా నిర్వహిస్తామని తెలంగాణ అధికార ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో  ఎన్నికల్లో చేపట్టాల్సిన వ్యూహాల గురించి పార్టీలన్నీ ఇప్పటినుండే కసరత్తులు మొదలయ్యాయి. తెలంగాణలో అధికారపార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే వరంగల్ ఉపఎన్నికల్లో గెలిచి.. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో కూడా గెలవాలని తెగ ప్రయత్నాలు చేస్తుంది. ఇక టీడీపీ నుండి అయితే చంద్రబాబే ఏకంగా విజయవాడ నుండి వచ్చి మరీ హైదరాబాద్ లో రెండు రోజులు ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే చంద్రబాబు సంగతేమో కాని ఇప్పుడు అందరి దృష్టి మాత్రం లోకేశ్ మీద పడింది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఎలాగు పార్టీ గెలుపు కోసం ప్రయత్నిస్తారు.. కానీ లోకేశ్ ఎంతవరకూ గెలుపుకోసం కృషి చేస్తారు..ఎన్నికల్లో ఆయన పాత్ర ఎంతమేరకు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. అంతేకాదు ఎలాగూ సీఎం ఏపీలో పరిపాలన బాధ్యతల్లో బిజీగా ఉంటారు కాబట్టి.. గ్రేటర్ ఎన్నకల బాధ్యత లోకేశ్ కు అప్పగిస్తే బావుంటుందని చెబుతున్నారట. కానీ చంద్రబాబు మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ఎంతైనా టీడీపీకి కొంచెం ఆదరణ తక్కువ. ఇలాంటి నేపథ్యంలో బాద్యతలు లోకేశ్ కు అప్పగిస్తే.. ఎన్నికల్లో వచ్చే ఫలితాల సామర్ధ్యం లోకేశ్ పై పడుతుందని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే ఈ ఎన్నికలకు లోకేశ్ ను దూరంగా ఉంచాలని భావిస్తున్నారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ పడినవెంటనే లోకేశ్ కూడా చంద్రబాబుతో ఎన్నికల ప్రచారంలో దిగుతారని నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి ఎంతవరకూ లోకేశ్ ఎంట్రీ ఉంటుందో చూడాలి.

జయలలితకు మోడీ ఫోన్.. వర్షం గురించి ఆరా..

  తమిళనాడు భారీ వర్షాలతో నీటి సంద్రమైపోయింది. ఇంకా నాలుగు రోజులు వర్ష ప్రభావం ఉంటుందని.. రోజుకు 20 సెం.మీ వర్షం కురుస్తుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో చెన్నై వాసులు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల గురించి అడిగి తెలుసుకన్నారు. అంతేకాదు కేంద్రం తరఫున అవసరమైన సాయాన్ని అందజేసేందుకు సిద్ధమని మోదీ తెలిపారు. మరోవైపు తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు విమాన, రైలు సర్వీసులు రద్దయ్యాయి. సుమారు లక్షా 70 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

తెలంగాణ బీజేపీలో ముసలం..

ఇప్పటి వరకూ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ, టీడీపీ మధ్యే అంతర్గత విభేధాలు ఉన్నాయని అనుకున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్న నేతల మధ్యే విభేదాలు ఉన్నట్టు మాత్రం స్పష్టంగా అర్ధమవుతోంది. దీనికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై కత్తి దుయ్యటమే నిదర్శం. గోషమహల్ నియోజకవర్గంగా బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ గత కొద్దికాలంగా పార్టీతో అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. అయితే ఇంత సడెన్ గా ఏమయిందో ఏమో ఉన్నట్టుంది కిషన్ రెడ్డిపై పడ్డారు. కిషన్ రెడ్డి వల్లే తెలంగాణ పార్టీ అభివృద్ధి చెందటం లేదని.. ఆయనను తెలంగాణ అధ్యక్ష పదవి నుండి తీసేయాలని.. దీనిలో భాగంగానే ఆయన భాజపా అధినేత అమిత్ షా కు లేఖ రాశారు. ఏకపక్ష నిర్ణయాలతో పార్టీని ఎదగకుండా చేస్తున్నారని.. తన వర్గం మీద ఉన్న కనీస శ్రద్ద పార్టీ మీద పెట్టి ఉంటే చాలా బాగుండేదని అన్నారు. దీంతో బీజేపీ వర్గంలో ముసలం ఏర్పడిందని రాజకీయవిశ్లేషకులు అనుకుంటున్నారు. అంతేకాదు ఈసారి కూడా తెలంగాణలో బీజేపీకి పార్టీ పగ్గాలు కిషన్ రెడ్డి చేతికి ఇస్తే రాజాసింగ్ పార్టీలో ఉండే అవకాశం కూడా లేదు అని అంటున్నారు. కానీ బీజేపీ పెద్దలు మాత్రం రాజాసింగ్ ను వదలుకునే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే హిందూ అతి వాదిగా పేరు తెచ్చుకున్న రాజాసింగ్.. ఓల్డుసిటిలో ఎంఐఎం పార్టీని ఎదుర్కోగల పార్టీ నేతగా ఎదిగారు దీంతో బీజేపీ నేతలు అంత తేలికగా రాజాసింగ్ ను వదలుకోరు అని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి..

టీడీపీలో చేరిన ఆనం బ్రదర్స్..

ఆనం బ్రదర్స్ టీడీపీలో చేరిపోయారు. చంద్రబాబు టీడీపీ కండువా కప్పి ఆనం బ్రదర్స్ ని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆనం రాం నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం అత్యంత దయనీయ పరిస్థితిలో ఉందని.. రాజధాని లేని రాష్ట్రంగా మనం మిగిలిపోయామని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆయన కాంగ్రెస్ పార్టీ తీరుపై మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ అధిష్టానానికి ఎన్ని సార్లు చెప్పినా మామాట వినలేదు..కాంగ్రెస్ లో మా అభిప్రాయాలకు విలువ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ 18 నెలల్లో పునరాలోచన చేసుకోలేదు.. చేసిన తప్పు పట్ల క్షమించమని ప్రజలకు చెప్పే పరిణతి కాంగ్రెస్ సాధించలేకపోయిందని అన్నారు. కార్యకర్తలే మమ్మల్ని టీడీపీలో చేరమన్నారని.. విజయవాడ బహిరంగ సభలో నెల్లూరు కార్యకర్తలను టీడీపీలో చేర్చుతామని స్ఫష్టం చేశారు. పదవులు ఆశించి టీడీపీలో చేరడం లేదు.. రేపటి తరానికి న్యాయం చేయాలన్న లక్ష్యంతో టీడీపీలో చేరుతున్నామని రాం నారాయణరెడ్డి తెలిపారు.

చెన్నైకి శాపంగా మారిన వానలు

  చెన్నై నగరాన్ని మళ్ళీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు 25 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయిందంటే వానలు ఏస్థాయిలో కురుస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చును. చెన్నై నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. అనేక ప్రాంతాలలో బస్సులు, రైళ్ళు రద్దయ్యాయి. జాతీయ విపత్తుల సహాయ కేంద్రానికి చెందిన 8 బృందాలు తుఫాను ప్రాంతాలలో సహాయ, పునరావాస చర్యలలో పాల్గొంటున్నాయి. ఆర్మీకి చెందిన రెండు దళాలు చెన్నైలోని తాంబరం మరియు ఉరపాక్కం ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో మాట్లాడి అవసరమయిన సహాయ సహకారాలు అందించడానికి కేంద్రప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు.   నటుడు సిద్దార్ధ ఇంటిలోకి కూడా నీళ్ళు వచ్చేయడంతో అతను కూడా వేరే ఇంట్లోకి మారిపోయాడు. అతను తన స్నేహితుడు బాలాజీతో కలిసి నేటి నుండి సహాయ చర్యలలో పాల్గొనబోతున్నారు. బాధితులను తరలించేందుకు ప్రజలు తమ వాహనాలను తీసుకొని రావలసిందిగా ఆయన విజ్ఞప్తి చేసాడు. అలాగే భాదితులకు నగరవాసులు తమ ఇళ్ళలో ఆశ్రయం కల్పించాలని పిలుపునిచ్చారు. దానికి ప్రజల నుండి మంచి స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. ఉన్నత వర్గాల ప్రజలు కూడా బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకు వస్తున్నట్లు సమాచారం.

భీప్ ఫెస్టివల్.. ఓయు స్టూడెంట్స్ వర్సెస్ ఎమ్మెల్యే రాజా సింగ్

గోషమహల్ నియోజకవర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ డిసెంబరు 10న ఉస్మానియా క్యాంపస్ లో నిర్వహించే బీఫ్ ఫెష్టివల్ ను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ఓయూ విద్యార్ధులు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న బీఫ్ ఫెస్టివల్ ను రాజా సింగ్ ఎలా అడ్డుకుంటారని.. అంతేకాదు దేశంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులకు నిరసనగా తాము బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని చెప్పారు. అంతేకాదు యూనివర్శిటిలో ఉన్న ప్రశాంతమైన వాతావరణం చెడగొట్టేందుకే రాజాసింగ్ ప్రయత్నిస్తున్నారంటూ మండిపడుతున్నారు. అంతేకాదు రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై ఓయూ విద్యార్ధులు పోలీసులకి ఫిర్యాదు కూడా చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఫెస్టివల్ ఎలాగైన నిర్వహిస్తామని ఓయూ విద్యార్ధులు.. ఫెస్టివల్ ను అడ్డుకుంటామని రాజాసింగ్ సవాళ్లు విసరడంతో ఇప్పుడు ఉస్మానియా క్యాంపస్ మరో వివాదంతో వేడెక్కబోతున్నట్టు తెలుస్తోంది.

జీహెచ్ఎంసీ ఎన్నికలు.. వైసీపీతో టీఆర్ఎస్ పొత్తు..?

తెలంగాణ అధికార పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికలను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అప్పుడే పార్టీలు ఎవరి వ్యూహాల్లో వారు ఉన్నారు. ఇక టీఆర్ఎస్ అయితే ఇప్పటికే హైదరాబాద్లో తాము చేపట్టిన పథకాలతో భారీ ఫ్లేక్సీలు ఏర్పాటు చేశారు కూడా. అయితే ఈ గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్ర‌భావం చాలా త‌క్కువే అని చెప్పొచ్చు. దానికి తోడు టీఆర్ఎస్ పై వస్తున్న ఆరోపణలు ఒకవైపు.. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ను కూడా మార్చివేశారు. కానీ గ్రేటర్ లో టీడీపీ, బీజేపీ, ఓల్డ్ సిటీలో ఎంఐఎం పార్టీలు కాస్త బలంగానే ఉన్నాయి. ఇక వైసీపీ పరిస్థితి కూడా పర్వాలేదు. అయితే టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏదో పైకి గెలుపు తమదే అని చెబుతున్నా ఆపార్టీకి అంత సీన్ లేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కానీ టీఆర్ఎస్ కు కూడా తమ పరిస్థితి తెలిసి ఎంఐఎం, వైకాపాతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మరి వైకాపా.. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటుందో లేదో చూడాలి. ఒకవేళ వైకాపా తో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే వైకాపా పార్టీ తన బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పొత్తు పెట్టుకోకపోతే వైకాపా ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో చూడాలి. మొత్తానికి ఏది తెలియాలన్నా ఎన్నికల వరకూ ఆగాల్సిందే.

ఒక్కసారే 45 మంది కాంగ్రెస్ అభ్యర్థులపై సస్పెండ్ వేటు..

బీహర్ ఎన్నికల్లో మహాకూటమిగా ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేసి ఊహించని మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఈఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎందుకంటే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లిచ్చిన కొంతమంది కాంగ్రెస్ నేతలు రెబల్స్ గా పోటీ చేశారు. పార్టీ పెద్దలు ఎంతగా బుజ్జగించినా వినకుండా పలుచోట్ల రెబెల్స్ ఓట్లను చీల్చి కాంగ్రెస్ అధికారిక అభ్యర్థుల గెలుపును అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రెబల్స్ గా బరిలో దిగిన కాంగ్రెస్ నేతలపై ఇప్పుడు వేటు వేసింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 45 మంది తిరుగుబాటు నేతలను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండు చేస్తూ తీసుకున్న నిర్ణయం తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే జగన్నాథ్ ప్రసాద్ రాయ్ నేతృత్వంలో సమావేశమైన పార్టీ డిసిప్లినరీ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అమీర్ కు షారుక్ మద్దతు.. తప్పుగా చిత్రీకరించారు..!

అమీర్ ఖాన్ దేశ అసహనంపై వ్యాఖ్యలు చేసి ఊహించని విధంగా విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అమీర్ వ్యాఖ్యలపై ఎవరికి తోచిన రీతిలో వారు స్పందింస్తున్నారు. అయితే అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు బాలీవుడ్ లోనే కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా.. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అమీర్ కు మద్దతు పలికారు. అసహనంపై ఆయన ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారు అంటూ మద్దతు పలికారు. దేశభక్తి అనేది మనసులో ఉంచుకోవాల్సిన భావన అని.. దేశానికి మంచి జరగాలని ఆలోచించడం.. దేశానికి మంచి చేయడం తప్ప.. దేశభక్తిని ఏ మార్గం ద్వారా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఏ విషయంపైన అయినా తనకు మాట్లాడే హక్కు ఉందని షారుక్ వెల్లడించారు.

మోడీపై లాలు కొడుకు విమర్శ.. బట్టలు ఉతుక్కోవడానికి వచ్చారు

ప్రధాని నరేంద్రమోడీపై విదేశీ పర్యటన నేపథ్యంలో విమర్శలు చేస్తుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే.  విదేశీ పర్యటనల ద్వారా మోడీ భారత్ కీర్తి ప్రతిష్ఠల్ని పెద్ద ఎత్తున పెంచుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులకు సంబంధించి ఫ్రాన్స్ లో జరుగుతున్న అంతర్జాతీయ సమావేశానికి హాజరైన ప్రధాని మోడీ.. వాతావరణ మార్పుల విషయంలో అభివృద్ధి చెందిన దేశాల పాప ఫలితమే అన్న వాదనను వారికి వినిపించి ఈ రోజు ఢిల్లీకి చేరుకున్నారు. అయితే మోడీ పర్యటనను ఉద్దేశించి.. ఇప్పుడే రాజకీయాల్లో ఆరంగేట్రం చేసిన లాలు పుత్రరత్నాలు విమర్శించారు. బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ మోడీ పర్యటనను ఉద్దేశించి మాట్లాడుతూ.. విదేశీ పర్యటనలు చేసే మోడీ తన బట్టలను ఉతుకున్నేందుకు ఢిల్లీ వచ్చారని విమర్శించారు. ఏది ఏమైనా నిన్నకాక మొన్న రాజకీయాల్లోకి వచ్చి.. ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయానుభవం ఉన్నంత వయస్సు కూడా లేని వారు ఆయన విదేశీ పర్యటనపై కామెంట్లు చేయడం విచిత్రంగా ఉంది.

ఆరెస్సెస్‌ నేతలపై ఆజం ఖాన్ సంచలన వ్యాఖ్యలు.. ఆ నేతలంతా స్వలింగ సంపర్కులు

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఉత్తర ప్రదేశ్ మంత్రి ఆజం ఖాన్ తర్వాతే ఎవరైనా.. అప్పుడు దేశంలో బీఫ్ గురించి అలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ నేతలంతా స్వలింగ సంపర్కులని అందువల్లే వారు పెళ్లి పెటాకులు చేసుకోకుండా కాలం వెళ్లదీస్తున్నారంటూ మండిపడ్డారు. దీంతో అజంఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. ఆరెస్సెస్‌ నేతలతో పాటు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నేతలు అజంఖాన్ చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్నారు. అజంఖాన్ కు పిచ్చిపట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని.. అతనికి మతిస్థిమితంలేదు.. తక్షణం పిచ్చాసుపత్రిలో చేర్పించి తగిన వైద్యం చేయించాలని అంతేకాకుండా, తక్షణం ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.  

ఆ వ్యాఖ్యలు రాజ్‌నాథ్ సింగ్‌ చేయలేదు.. ఔట్‌లుక్‌ సారీ

కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ఔట్‌లుక్‌లో చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ సమావేశాల్లో రగడ జరిగింది. 800 ఏళ్ల తర్వాత హిందూ వ్యక్తి ప్రధాని అయ్యారని రాజ్‌నాథ్ సింగ్‌ ఔట్‌లుక్‌లో వ్యాఖ్యానించారని.. సీపీఎం మహ్మద్ సలీం పార్లమెంట్ లో ప్రస్తావించగా.. రాజ్‌నాథ్ సింగ్‌ అనవసరంగా తనపై ఆరోపణలు చేయవద్దని.. అలాంటి వ్యాఖ్యలు నేను చేయలేదని.. తనకు సలీం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో రాజ్‌నాథ్ సింగ్‌, మహ్మద్ సలీం ల మధ్య వివాదం తలెత్తింది. అయితే జరగాల్సిన రచ్చ అంత జరిగిన తరువాత ఔట్‌లుక్‌ ఇప్పుడు స్పందించి ఆ వ్యాఖ్యలు రాజ్‌నాథ్ చేసినట్లుగా పొరపాటుగా ప్రచురించితమయ్యాయని.. నిజానికి అవి దివంగత విశ్వహిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్ చేశారని తెలిపింది. పొరపాటున అశోక్ సింఘాల్ పేరుకు బదులు రాజ్‌నాథ్ సింగ్‌ పేరు పడిందని..తాము చేసిన పొరపాటుకు క్షమించాలని.. అనవసరంగా మావల్ల పార్లమెంట్ లో రగడ జరిగిందని.. దానికి సారీ చెబుతున్నామని ట్వీట్టర్లో పేర్కొంది.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు.. టీడీపీతో పొత్తుకు కాంగ్రెస్

ఇప్పటికే వరంగల్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పుడు తెలంగాణలో జరగబోయే స్టానిక సంస్థల కోటా ఎన్నికల్లో మాత్రం ఎలాగైనా సీటు సంపాదింటుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్ దూకుడికి.. తాము ఒంటరిగా పోరాటం చేస్తే మళ్లీ ఓడిపోతామని భావించి ఈసారి టీడీపీతో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నారు నేతలు. అయితే టీ కాంగ్రెస్ నేతల ప్రతిపాదనకు కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకోకపోవచ్చని సంకేతాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. స్థానికంగా అవసరాలను బట్టి టీడీపీ మద్దతు తీసుకోవాలని టి కాంగ్రెస్ ముఖ్యనేతలు భావిస్తున్నారట. అంతేకాదు టీడీపీ సహకారం తీసుకోకుండా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం లేదని… కాబట్టి ఎలాగైనా టీడీపీతో ఇచ్చే పుచ్చుకునే ధోరణితోనే నడవాలని టి కాంగ్రెస్ దాదాపుగానే ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మరి రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే టీడీపీకి ఇవ్వాల్సిన సీట్లు గురించి కూడా కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారట. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మాత్రం టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి టీడీపీ కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు అంగీకరిస్తుందో లేదో చూడాలి.

పార్టీ ఎందుకు మారాంరా దేవుడా.. నిన్న బొత్స.. నేడు డీఎస్

కాంగ్రస్ ను వీడి వేరే పార్టీలోకి మారిన నేతలకు ఇప్పుడిప్పుడే నిజాలు తెలుస్తున్నట్టుంది. రాష్ట్రం విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీకి రెండు రాష్ట్రాల్లో సరైన ఉనికి లేకపోవడంతో.. ఆపార్టీలో ఉంటే సరైన రాజకీయ భవిష్యత్తు ఉండదని ఆలోచించుకొని చాలామంది సీనియర్ నేతలు కాంగ్రెస్ ను వీడి పలు పార్టీల కండువాలు కప్పుకున్నారు. కానీ ఆపార్టీలోకి చేరినప్పుడు బానే ఉన్న ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అసలు ఎందుకు పార్టీ మారామా అని ఆలోచించుకునే సంగ్ధిగ్దంలో పడినట్టు తెలుస్తోంది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన బొత్స సత్యనారాయణ కూడా అనవసరంగా వైకాపాలో చేరి ఇరుక్కుపోయానే అని తన సన్నిహితుల దగ్గర అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. పార్టీలో చేరిన కొత్తలో అంతా తానై హడావుడి చేసిన బొత్సకు ఆ తరువాత నిదానంగా జగన్ వ్యూహాలు అర్ధమయినట్టున్నాయి. కోస్తాలో తన పెత్తనం చూపించాలని అనుకున్న బొత్సకు జగన్ అంత ఛాన్స్ ఇవ్వడం లేదట. తన తరువాత ఏ ఒక్క లీడ‌ర్నీ ఆ.. స్థాయిలోకి రానివ్వ‌డంలేద‌ట దీంతో ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అన్న పంథాలో.. బొత్స ఏదో అనుకుంటే ఆఖరికి ఇలా జరిగింది. దీంతో అనవసరంగా పార్టీ మారానే అని బాధపడిపోతున్నారట. ఇప్పుడు మరో కాంగ్రెస్ సీనియర్ నేత కూడా సేమ్ ఇలానే ఫీలవుతున్నారట. అది ఎవరో కాదు.. ఉమ్మడి రాష్ట్రానికి రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్. ఈయన కూడా పార్టీ మారి టీఆర్ఎస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ కూడా సీనియర్ నేత అయిన డీఎస్ ను చాలా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి ఓ కేబినెట్ ర్యాంకుతో కూడిన పదవిని కూడా ఇచ్చారు. దీంతో డీఎస్ కూడా చాలా కుష్ అయ్యారు. కానీ కేసీఆర్ అసలు అంతరార్ధం మాత్రం వేరని డీఎస్ కు చాలా లేట్ గా అర్ధమయి ఇప్పుడు ఫీల్ అవుతున్నారట. తన కూతురు కవితకు నిజామాబాద్ లో సరైన ప్రతిపక్షం లేకుండా చేసేందుకే కేసీఆర్… తనను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారని… ఆ విషయం అర్ధంకాక తాను అనవసరంగా టీఆర్ఎస్ లోకి వచ్చానని సన్నిహితుల దగ్గర వాపోతున్నారట డీఎస్. అంతేకాదు తను ఎప్పటినుండో కలగంటున్న రాజ్యసభ సీటు గురించి కూడా డీఎస్ టెన్షన్ పడుతున్నారట. ఎందుకంటే తనకు కనుక ఎమ్మెల్సీ గా పోటీ చేసే అవకాశం ఇస్తే తన రాజ్యసభ సీటు ఆశలు ఆవిరైనట్టే అని మదనపడుతున్నారట. మొత్తానికి నేతలకు తమ పార్టీనుండి వేరే పార్టీలోకి వస్తే పరిస్థితి ఎంటని ఇప్పుడిప్పుడే అర్ధమవుతున్నట్టుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి మరో ఇద్దురు రాజకీయ ఉద్దండులు ఆనం బ్రదర్స్ టీడీపీలోకి చేరుతున్నారు. మరి వారికైనా గౌరవప్రధమైన పదవులు దక్కుతాయా.. లేదా? వారు కూడా ఎందుకు పార్టీ మారాంరా దేవుడా అనే పరిస్థితి వస్తుందా?.. ఇవన్నీ తెలియాలంటే కొంత సమయం ఆగాల్సిందే.