లోక్ సభ.. బీజేపీ, కాంగ్రెస్ మాటల యుద్ధం

లోక్ సభలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో ఇరు నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. మళ్లీ నిన్నకరువుపై చర్చ సందర్భంగా జరిగిన రగడలో వీరేంద్ర సింగ్ ఫెయిర్ స్కిన్ ఉన్న వాళ్లనే.. ప్రధాని పదవిలో కూర్చునేందుకు కాంగ్రెస్ ఎంపీలు అంగీకరిస్తారని విమర్శించారు. దీంతో వీరేందర్ సింగ్ చేసిన వ్యాఖ్యాలపై ఈరోజు లోక్ సభలో కాంగ్రెస్ నేతలు ఆయనపై మండిపడ్టారు. స్పీకర్ పోడియం చుట్టు ముట్టి పేపర్లు చింపి డిప్యూటీ స్పీకర్ పై వేస్తూ.. మోడీని హిట్లర్ అంటూ.. నియంత అంటూ కామెంట్లు చేశారు. ఈ సందర్బంగా వెంకయ్య మాట్లాడుతూ మోడీని హిట్లర్ అని విమర్శించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

షరీఫ్‌, అజీజ్‌లతో సుష్మ భేటీ.. సుష్మా ఆ వ్యాఖ్యలు చేయలేదు..

విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ బృందం పాక్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారు పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తోను, ఆయన విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్‌ అజీజ్‌తోను భేటీ అయ్యారు. ఈ భేటీలో వారు  భారత్‌-పాక్‌ దేశాల మధ్య సమగ్ర ద్వైపాక్షిక చర్చలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన కూడా చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇరుదేశాల మధ్య విశ్వాస నిర్మాణ చర్యలు, శాంతి సామరస్యవాతావరణం, జమ్మూ కాశ్మీర్‌, సహా పలుఅంశాలపై చర్చించేందుకు అనుసరించాల్సిన పద్ధతులను ఖరారు చేయాల్సిందిగా ఇరు దేశాల విదేశాంగ శాఖ కార్యదర్శులను ఈ ప్రకటన కోరింది. ఇదిలా ఉండగా మోడీ పర్యటనపై పాక్ మీడియా అత్యుత్సాహం చూపినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం పాక్ పర్యటనలో ఉన్న సుష్మా స్వరాజ్.. వచ్చే ఏడాది పాక్ లో జరిగే సార్క్ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ..వస్తున్నారంటూ చెప్పినట్లుగా వార్తలు ప్రసారం చేశారు. దీంతో ఇప్పుడిది వివాదాస్పదమైంది. దీనికి స్పందించిన భారత బృందంలోని అధికారులు సుష్మా స్వరాజ్ అలాంటి వ్యాఖ్యలు ఏం చేయలేదని.. స్పష్టం చేసింది.

ఓయూ బీఫ్ ఫెస్టివల్.. కొనసాగుతున్న అరెస్ట్ ల పర్వం..

హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ఓయూ విద్యార్ధులు బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని చెప్పిన నేపథ్యంలో గోసంరక్షణ సమితి.. భజరంగదళ్ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. సుమారు  రెండువేల మంది గోసంరక్షణ కార్యకర్తలు ఓయూ ఎదుట భైటాయించారు. ఈ సందర్భంగా వారు యూనివర్శిటిలోకి ప్రవేశించాలని చూడగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. టీజీవీపీ నేత శ్రీహరి సహా 25 మంది ఏబీవీపీ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు ఓయూ ప్రొఫెసర్లను అరెస్ట్ చేశారు. కాగా ఓయూ హాస్టళ్లల్లో పోలీసులు ఇంకా సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బీఫ్ ఫెస్టివల్.. పోర్కు ఫెస్టివల్ కు మద్దతివ్వమని గోషమహన్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆందోళన చేపట్టగా ఆయనను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను షాహినాయత్ గంజ్ పీఎస్ కు తరలించారు. దీంతో రాజాసింగ్ ను వెంటనే విడిచిపెట్టాలని ఆయన కార్యకర్తలు పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు.

కల్తీమందు పై జగన్ హామీ.. బొత్స రియాక్షన్ ఏంటి?

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ వల్ల ఇప్పుడు ఆ పార్టీలోని ఒక వ్యక్తికి తలపట్టుకునే పరిస్థితి వచ్చిందట. అది ఏవరనుకుంటున్నారా..? ఇంకెవరూ బొత్స సత్యనారాయణ.. జగన్ హామీకి.. బొత్సకు సంబంధం ఏంటనుకుంటున్నారా.. అదేంటంటే.. విజయవాడ, కృష్ణలంకలో కల్తీ మందు తాగి చాలామంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన జగన్.. దొరికిందే ఛాన్స్ కదా అని ఏపీ ప్రభుత్వం పై నాలుగు విమర్శల బాణాలు వదిలి.. ఆవేశంతో తాను అధికారంలోకి వస్తే కనుక మద్యం నిషేదిస్తామని పెద్ద హామీనే ఇచ్చారు. ఇప్పుడు జగన్ ఇచ్చిన హామీతో ఆపార్టీలోని బొత్సకు చిక్కులు వచ్చిపడ్డాయి. ఎందుకంటే బొత్సకు లిక్కర్ బిజినెస్ ఉంది కాబట్టి. జగన్ తను ఇచ్చిన హామి ముందు నెరవేర్చాలంటే.. అంతకంటే ముందు బొత్స చేత తన లిక్కర్ బిజినెస్ ను మూయించాలి. అసలే బొత్సకు ఉత్తరాంధ్రలో లిక్కర్ డాన్ అనే పేరు కూడా ఉంది. ఈ విషయంపై గతంలో ఒకరు ప్రశ్న అడిగినా దానికి బొత్స ఏ మాత్రం భయపడకుండా ఏం.. మేము ఈ వ్యాపారం చేయొద్దా అని ఎదురు ప్రశ్నించాడు. మరి అలాంటి బొత్స ఇప్పుడు జగన్ ఇచ్చిన హామికి ఎలా రియాక్ట్ అవుతారో అని అందరూ చర్చించుకుంటున్నారు. మరోవైపు జగన్ ఇచ్చిన హామిపై విమర్శలు ఎదురవుతున్నాయి. ముందు తమ పార్టీలో ఉన్న నాయకులతో లిక్కర్ బిజినెస్ మూయించండి.. ఆతరువాత రాష్ట్రంలో నిషేదం చేయోచ్చు అని కౌంటర్లు ఇస్తున్నారు. మరి ఈవిషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. జగన్ ఇచ్చిన హామికి బొత్స ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఓయూలో బీఫ్ ఫెస్టివల్ రచ్చ..

ఓయూ విద్యార్ధులు ఈరోజున ఎలాగైన బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఓయూ దగ్గర తీవ్ర ఉద్రిగ్తత పరిస్థితి ఏర్పడింది. పోలీసులు అర్ధరాత్రే ఓయూ హాస్టళ్లలో సోదాలు జరిపి 16 మంది బీఫ్ ఫెస్టివల్ నిర్వహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా తాము తప్పకుండా బీఫ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామని ఫెస్టివల్  నిర్వాహకులు తేల్చి చెబుతుంటే.. ఎట్టి పరిస్థితిలో ఫెస్టివల్ జరగనివ్వమని గోసంరక్షణ సమితి చెబుతుంది. మరోవైపు బీఫ్, పోర్క్ ఫెస్టివల్ నిర్వహాణకు ఎలాంటి అనుమతి లేదని.. ఒకవేళ ఫెస్టివల్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. ఓయూ విద్యార్ధులైతే అడ్మిషన్ను రద్దు చేస్తామని ఓయూ రిజిస్టార్ తెలిపారు. ఇదిలా ఉండగా ఓయూలో బీఫ్ ఫెస్టివల్ కు హైకోర్టు కూడా అనుమతివ్వలేదు. అయినా ఓయూ స్టూడెంట్స్ ఫెస్టివల్ నిర్వహిస్తామని చెబుతున్న నేపథ్యంలో పోలీసులు భారీగా మొహరించారు. ఓయూ అన్ని రహదారులను మూసివేశారు.

నేడు చింతపల్లిలో జగన్ బహిరంగ సభ

  విశాఖ ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.ను తక్షణమే ఉపసంహరించుకోమని కోరుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖ జిల్లాలోని చింతపల్లిలో ‘విశాఖ బాక్సైట్ - గిరిజనుల హక్కు’ పేరిట ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ నిరసన సభలో పాల్గొనేందుకు ఆయన ఈరోజు హైదరాబాద్ నుండి విశాఖకు వస్తున్నారు. ఉదయం 10 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుండి నర్సీపట్నం మీదుగా రోడ్డు మార్గం ద్వారా చింతపల్లికి చేరుకొంటారు. మధ్యాహ్నం సుమారు 12గంటలకు చింతపల్లిలో సభ ప్రారంభం అవుతుంది. పార్టీ ప్రధాన కార్యదర్శులు విజయసాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు, జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఏర్పాట్లు చేస్తున్నారు.

సోనియా బర్త్ డే.. ఒకవైపు వేడుకలు.. మరోవైపు బ్లాక్ డే..

కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ 69వ పుట్టిన రోజు సందర్భంగా అందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆమె పుట్టిన రోజు సందర్భంగా " ఆమె ఆరోగ్యంగా ఉండాలని.. దేవుడు ఆమెకు దీర్ఘాయుష్షును ఇవ్వాలని" ట్విట్టర్ ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు అయితే కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహిస్తూ.. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది మాత్రం ఈరోజును బ్లాక్ డే గా పాటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలుగా విభజించాలని సోనియా గాంధీ 2013 డిసెంబర్ 9 వ తేదీనే నిర్ణయించున్నారట. దీంతో ఏపీలో కాంగ్రెస్ నేతలు మాత్రం పార్టీ వేడుకలు చేస్తుంటే మిగిలినవారు మాత్రం ఏపీ బ్లాక్ డే పాటిస్తున్నారు.

టీడీపీలోకి కొడాలి నాని..?

కృష్ణాజిల్లా.. గుడివాడ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీలోకి చేరేందుకు సిద్దమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వైకాపా ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. పార్టీ ఏదైనా ఆ నియోజకవర్గం నుండి నాని గెలవడం ఖాయం అన్నట్టు ఏర్పడింది పరిస్థితి. 2004, 2009 లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా టీడీపీ నుండి ఆయన గెలుపు సాధించారు. ఆ తరువాత 2014లో టీడీపీ నుండి వైకాపా కి జంప్ అయి ఆపార్టీ నుండి కూడా గెలుపొందాడు. అలాంటి నాని ఇప్పుడు టీడీపీ లోకి రావడానికి సిద్దమవుతున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీనికి ఆపార్టీ నేత వైఎస్ జగనే కారణమంట. ఎందుకంటే.. జ‌గ‌న్ త‌న‌కు స‌రైన ప్ర‌యారిటీ ఇవ్వ‌డం లేద‌ని ఫీలవుతున్నారంట. అంతేకాదు.. ఇటీవ‌ల గుడివాడ‌లోను, బంద‌రు పోర్టు విష‌యంలో జ‌రిగిన ఆందోళ‌న‌ల్లో పార్టీ నుంచి త‌న‌కు అంత‌గా మ‌ద్ద‌తు రాక‌పోవ‌డం.. అలాగే జిల్లా పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించే విష‌యంలో జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరు కూడా నానికి న‌చ్చ‌లేద‌ని తెలుస్తోంది. ఇవన్నీ కలిసి నాని టీడీపీ వైపు రావడానికి కారణాలు అని తెలుస్తోంది. మరోవైపు నాని అనుచరులు కూడా తనను టీడీపీలోకి రావాలని కోరుకుంటున్నారంట. అయితే నాని టీడీపీలోకి వస్తానంటే పార్టీ నేతలు హ్యాపీగానే ఉన్నా దీనికి చంద్రబాబు నుండి కూడా గ్రీన్ సిగ్నల్ రావాలి మరి.

సోనియాకు మోడీ విషెస్.. ఇందిరా గాంధీ కోడలిని.. భయపెట్టలేరు.. సోనియా

కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ ఈ రోజు 69వ పుట్టినరోజు సందర్భంగా పలువురు నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు ఆమె పుట్టిన రోజు సందర్బంగా కేక్ కట్ చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు ప్రధాని నరేంద్రమోడీ కూడా సోనియా పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆ భగవంతుడు సోనియాకు సుదీర్ఘ జీవితాన్ని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ట్వీట్ చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫోన్ చేశారు. ఇదిలా ఉండగా ఉభయసభల్లో ప్రస్తుతం నేషనల్ హెరాల్డ్ కేసు గురించి రగడ జరుగుతుంది. అయితే దీనిపై సోనియా మీడియా ముందు మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు నేను ఇందిరా గాంధీ కోడలిని.. నన్ను ఎవరూ భయపెట్టలేరంటూ మండిపడ్డారు..

జగన్ కు కౌంటర్ ఇచ్చిన సోమిరెడ్డి..

విజయవాడ, కృష్ణలంకలో కల్తీ మందు తాగి పలువురు మృతి చెందిన విషయం తెలసిందే. అయితే చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్న జగన్ ఇప్పుడు దొరికిందే ఛాన్స్ గా ఈ విషయంపై అధికార పార్టీపై విమర్శలు చేశారు. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలకు గాను టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ కు కౌంటర్ ఇచ్చారు. కల్తీ మందు గురించి జగన్ మాట్లాడుతుంటే చాలా హ్యాస్యాస్పదంగా ఉంది.. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మందు ఏరులై పారేదని విమర్శించారు. అంతేకాదు మద్యం వ్యాపారులను తన పార్టీలోనే ఉంచుకొని ఇతరులను విమర్శించడం తగదని.. తన పార్టీలో ఉన్న బొత్స సత్యనారాయణకు అయిదు జిల్లాల్లో మద్యం వ్యాపారం ఉందని.. గతంలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారని.. మరి అలాంటి ఆయనను పార్టీలోకి ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. ఇప్పటికీ బొత్సపై కేసులు నడుస్తున్నాయని అన్నారు. అసలు ఇన్ని మాట్లాడుతున్నా జగన్ దీనంతటి కారణమైన మల్లాది విష్ణువు గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మరి సోమిరెడ్డి కౌంటర్ కి వైసీపీ నేతలు ఎవరైనా స్పందిస్తారా.. లేక ఎందుకులే అని ఊరుకుంటారా?

బీఫ్ ఫెస్టివల్ కు నో చెప్పిన హైకోర్టు..

  ఈనెల 10వ తేదీన బీఫ్ ఫెస్టివల్ నిర్వహించాలని ఎప్పటినుండో ఓయూ విద్యార్దులు అనుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారంపై అనేక వివాదాలు తలెత్తాయి. ఈ బీఫ్ ఫెస్టివల్ కు పోటీగా కొంతమంది పోర్క్ ఫెస్టివల్ కూడా నిర్వహించాలనుకున్నారు. కాగా ఇప్పుడు బీఫ్ ఫెస్టివల్ నిర్వాహకులకు హైకోర్టులో చుక్కెదురైంది. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించడానికి అనుమతించవద్దని కడియం రాజు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఓయూలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించవద్దని.. ఫెస్టివల్ నిర్వహించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి.. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని తెలిపింది. సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు కూడా అమలు పరచాలని హైకోర్టు ఆదేశించింది

నేషనల్ హెరాల్డ్ కేసుపై పార్లమెంట్లో రచ్చ..

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు నేషనల్ హెరాల్డ్ కేసుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయంపై లోక్ సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే ఇలా చేస్తుందని స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసనలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ కక్షసాధిస్తుందని మండిపడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ సభ్యుల తీరుపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు ఆదేశాలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని. కరువు పై చర్చ జరగకుండా కావాలనే కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ సభ్యులు సభను తప్పుదోవ పట్టించడానికి చూస్తున్నారన్నారు. ఓటమిని భరించలేకే కాంగ్రెస్ ఇలా చేస్తుందని అన్నారు.

కల్తీ మద్యం కేసుపై సిట్..

కల్తీ మద్యం ఘటనపై ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా దర్యాప్తు చేపడుతుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇప్పుడు స్వర్ణ బార్ సీసీ పూటేజ్ ను కూడా పోలీసులు పరిశీలించడం జరిగింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం కల్తీ మద్యం కేసుపై సిట్ ఏర్పాటు చేసింది. డీఐజీ మహేశ్ చంద్ర లడ్డా ఆధ్వర్యంలో ఈ సిట్ ను ఏర్పాటు చేశారు. కాగా ఈ ఘటనపై డీజీపీ రాముడు మాట్లాడుతూ కల్తీ మద్యం దందాపై ఉక్కుపాదం మోపుతాం.. అయితే ఈ వ్యవహారంపై ఎవరిపై ఆరోపణలు చేయం.. నిజనిజాలు తేలిన తరువాతే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. విజయవాడలోని కృష్ణలంకలో కల్తీ మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

టీఆర్ఎస్ మైండ్ గేమ్.. గుణపాఠం తప్పదు.. ఉత్తమ్

టీ కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ వికృత రాజకీయాలు చేస్తోందని అన్నారు. టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఎక్కువకాలం కొనసాగదు.. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు..ఏదో ఒక సమయంలో గుణపాఠం తప్పదు అని వ్యాఖ్యనించారు. అంతేకాదు ఇతర పార్టీనేతలకు పదవులు ఆశ చూపించి.. ఆపర్ ఆకర్ష్ ద్వారా నేతలను ఆకర్షించి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు బలం లేకపోయినా ఎమ్మేల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఎద్దేవ చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో సెటిలర్స్‌కు రక్షణ కల్పించేది కేవలం కాంగ్రెస్ పార్టీయేనని..హైదరాబాద్ పరిధిలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆరోపించారు.

ఆయన చెప్పులు మోయలేదు.. నా చెప్పులు ఇచ్చాను.. రాహుల్ చెప్పుల రగడ

రాజకీయ నేతలు తమ చెప్పులనో, బూట్లనో తమ పక్కన ఉన్న అనుచరులతో మోయించి విమర్శలపాలైన దాఖలాలు చాలానే చూశాం. ఇప్పుడు ఆ లిస్ట్ లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా చేరిపోయారు. రాహుల్ గాంధీ నిన్న చెన్నైలోని వరదబాధితులను పరామర్శించడానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన చెప్పులను కాంగ్రెస్ పార్టీ నేత పట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే పట్టుకుంది ఏ చిన్ననేతనో కూడా కాదు మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఎంపీ వీ నారాయణస్వామి. అంతే ఇక రాహుల్ పై విమర్శల వర్షం కురిపించారు అందరూ. అయితే ఈ వార్తలకు స్పందించిన నారాయణ స్వామి మాత్రం.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఖండించారు. అసలు ఆయన చెప్పులు వేసుకురాలేదు.. షూ వేసుకొచ్చారు.. వరద నీటికి నడవలేని కారణంగా నా చెప్పులను తీసి ఆయనకు ఇచ్చాను.. ఎలాంటి మొహమాటం లేకుండా ఆయన వాటిని తీసుకొని వేసుకున్నారు అని తెలిపారు. అంతేకాదు.. ఆయన షూని కూడా కనీసం సెక్యూరిటీ గార్డుకు ఇవ్వలేదని.. తన చేత్తోనే పట్టుకున్నారని అన్నారు. మరి ఏ జరిగిందో రాహుల్ కు, నారాయణస్వామికే తెలియాని..

సతీసమేతంగా కేసీఆర్ చంద్రబాబుకు ఆహ్వానం..!

తెలంగాణ ముఖ్యమంత్రి ఈ నెల చివరి వారంతంలో ఆయుత చండీయాగం చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ యాగానికి గాను కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును స్వయంగా ఆహ్వానించాలని నిర్ణయించున్నారు. అయితే ఇప్పటికే రెండుమూడుసార్లు కేసీఆర్, చంద్రబాబును కలుద్దామని అనుకున్నా అది జరగలేదు. అయితే ప్రస్తుతం ఇద్దరు ముఖ్యమంత్రులు ఢిల్లీలో ఉన్నారు. కాగా  వీరివురు ఢిల్లీ నుండి రాగానే కేసీఆర్ స్వయంగా వెళ్లి చంద్రబాబును ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. అయితే కేసీఆర్ మాత్రమే కాదు.. కేసీఆర్ ఆయన సతీమణి ఇద్దరు కలిసి ప్రత్యేక హెలికాప్టర్‌లో విజయవాడకు వెళ్లి చంద్రబాబును ఆహ్వానిస్తారని అనుకుంటున్నారు.