రేపు తెదేపా తీర్ధం పుచ్చుకోనున్న ఆనం బ్రదర్స్

  మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన సోదరుడు వివేకానంద రెడ్డి బుదవారంనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపాలో చేరబోతున్నారు. వారిలో ఆనం రామనారాయణ రెడ్డి తెదేపాతోనే తన రాజకీయ జీవితం ప్రారంభించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేసారు. తరువాత కాంగ్రెస్ పార్టీలోకి మారి డా. రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాలలో మంత్రిగా పనిచేసారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ అద్వానంగా తయారవుతుండటంతో ఆ పార్టీ నుండి చాలా మంది నాయకులు వేరే పార్టీలలోకి వెళ్ళిపోయారు. ఇప్పడు ఆనం వారి వంతు వచ్చింది అంతే! కానీ వారి రాకను నెల్లూరు జిల్లా తెదేపా నేతలు నేటికీ తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కానీ జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకోవలసిన అవసరం ఉన్నందున చంద్రబాబు నాయుడు వారినిరువురినీ పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయించుకొన్నారు. రేపు ఉదయం విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో వారిరువురూ తమ అనుచరులతో కలిసి తెదేపాలో చేరబోతున్నారు.

వీరేశలింగం ఫోటో పెట్టి గురజాడకి నివాళులు అర్పించిన వైకాపా!

  తెలుగు బాషోద్యమానికి నాంది పలికిన మహాకవి గురజాడ అప్పారావు గారి శత వర్ధంతిని నిన్న భాషాభిమానులు అందరూ చాలా ఘనంగా జరుపుకొన్నారు. వైకాపా కూడా జరుపుకొంది. కాకపోతే గురజాడవారి చిత్రానికి బదులు ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులుగారి చిత్రం ప్రచురించి, గురజాడవారికి నివాళులు అర్పించింది. దానిపై స్పందించిన నారా లోకేష్, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై ట్వీట్ బాణాలు సందించారు. “వైకాపా నేతలకు కుంభకోణాలు చేసేవారిని తప్ప వేరెవరినీ గుర్తించలేరు. జగన్!ఈ చిత్రం కందుకూరి వీరేశలింగం గారిది. క్షమించండి గురజాడ గారు!” అని ట్వీట్ చేసారు.

సలీం vs రాజ్‌నాథ్: లోక్‌సభలో గందరగోళం

  లోక్‌సభలో అసహనం అంశంపై చర్చ మొదలైన వెంటనే గందరగోళ వాతావరణం నెలకొంది. సభలో చర్చను మొదలుపెట్టిన సీపీఎం ఎంపీ సలీం చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. 800 సంవత్సరాల తర్వాత ఒక హిందూవు ప్రధాని అయ్యారని రాజ్ నాద్ సింగ్ వ్యాఖ్యానించారని ఆయన చెప్పడంతో ఒక్కసారిగా బీజేపీ నేతలు మండిపడ్డారు. వెంటనే రాజ్ నాద్ సింగ్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. అయితే సలీం తనవాదనకు కట్టుబడి మాట్లాడారు.తాను అవుట్ లుక్ పత్రికలో వచ్చిన విషయాన్నే చెబుతున్నానని, ఒకవేళ రాజ్ నాద్ ఆ మాటలు అనకపోతే , ఆ విషయాన్ని అవుట్ లుక్ ఎడిటర్ తో మాట్లాడుకోవాలని సలీం సూచించారు. కాగా.. మహ్మద్ సలీం చేసిన వ్యాఖ్యలకు తాను తీవ్రంగా మనస్తాపం చెందానని, తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని రాజ్‌నాథ్ సింగ్ తన ప్రసంగంలో చెప్పారు.

తెలంగాణ హోంమంత్రి చంద్రబాబును బెదిరిస్తున్నారా?

  తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్లాన్ పైనే చంద్రబాబు మూడు నెలల తర్వాత  హైదరాబాద్ వచ్చారని, బాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే ఆయనకు ధన్యవాదాలు చెబుతామని అన్నారు. అలాగే ఓటుకు నోటు కేసు పెండింగులోనే వున్నదని, ఏమి చేయాలో తమకు తెలుసునని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు. అలాగే టిఆర్ఎస్ ప్రభుత్వం చట్టం విషయంలో జోక్యం చేసుకోదని చెప్పారు. నాయిని సడన్ ఇలాంటి ప్రకటన ఎందుకు చేశారు? గ్రేటర్ ఎన్నికల కోసం ముందుగానే బాబుని హెచ్చరిస్తున్నారా? అనే దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.

కడప జిల్లాలను వణికిస్తున్న గుంతలు

కడప జిల్లాలోని పలు గ్రామాలలో గత కొద్ది రోజులుగా భూమి కుంగి పెద్ద పెద్ద గుంతలు పడడంతో ఆ గ్రామాలలోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు. అదేంటి గుంతలు పడితే భయపడాల్సిన అవసరం ఏముంది అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు సమస్య..ఈ గుంతలు మాములు స్థాయిలో పడడటం లేదు. ఒక్కో గుంత ముప్పై నుంచి యాభై అడుగుల లోతు.. 20 నుంచి 25 అడుగుల వెడల్పు లో ఉండటం విశేషం. అయితే లేటెస్ట్ గా ఆదివారం చింతకొమ్మ దిన్నె మండలంలోని గూడవాడ్ల పల్లె.. బుగ్గలపల్లెల్లో ఇలాంటివే మూడు గోతులు ఏర్పడ్డాయి. దీంతో ఆ పల్లెలలోని జనాలు ఎందుకు ఇలా జరగుతుందో తెలియక భయపడుతున్నారు. అయితే భూమిలో సడన్ గా ఈ మార్పులు ఎందుకు వచ్చాయి? ఇంత పెద్ద ఎత్తున గోతులు పడటానికి కారణం ఏమిటి? అనేది అధికారులకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అయితే ముందుముందు ఏం జరగబోతుందోనని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు.

మరో అమ్మ దారుణం

  మరో అమ్మ దారుణానికి ఒడిగట్టింది. అత్తింటి వేధింపులు తాళలేక ఒక మహిళ ఆదివారం ఉదయం తన 11 నెలల చిన్నారితో సహా కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. కండ్రిక శివారు అల్లపల్లివారి పాలెం గ్రామానికి చెందిన యువతి వెంకట రమణ (20)కి ఏడాదిన్నర క్రితం నక్కారాజుతో వివాహం జరిగింది. ఇటవలి కాలంలో ఆమె భర్త, అత్తమామలు వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పుట్టింటికి వచ్చిన ఆమె శనివారం సాయంత్రం తన కుమార్తెతో సహా ఇంట్లోంచి బయటకి వెళ్ళిపోయింది. ఆమె కోసం వెతుకుతూ వుండగా బొబ్బర్లంక - ముక్కామల పంట కాలువలో పలివెల వంతెన సమీపం వద్ద తల్లీ కూతుళ్ళ మృతదేహాలు కనిపించాయి.

బోరుబావిలో పడిన బాలుడి మృతి

  మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం గ్రామంలో శనివారం నాడు బోరుబావిలో పడిన మూడేళ్ళ బాలుడు రాకేష్ మరణించాడు. శనివారం ఉదయం ఏడు గంటల సమయంలో తోటి చిన్నారులతో ఆడుకుంటున్న రాకేష్ ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయాడు. బాలుడిని రక్షించడానికి అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బోరుబావిలో తలకిందులుగా 32 అడుగుల లోతులో బాలుడు వున్న విషయాన్ని గుర్తించిన అధికారులు ప్రొక్లెయినర్లతో బోరుబావికి సమాంతరంగా తవ్వడం ప్రారంభించారు. అయితేపెద్దపెద్ద బండలు అడ్డు పడటంతో తవ్వకం చాలా ఆలస్యమైంది. బాగా శ్రమించి తవ్వకాలు జరిపి బాలుడిని బయటకి తీయగా అప్పటికే బాలుడు మరణించాడు.

కొడుకులకు రాజకీయ పాఠాలు నేర్పుతున్న లాలూ

బీహార్ ఎన్నికల్లో మహాకూటమి గెలుపొందడంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసింది. జేడీయూ నేత నితీష్ కుమార్ తో జట్టుకట్టి మహాకూటమిని విజయతీరానికి చేర్చడంలో చాలా కృషిచేశారు. అంతేకాదు ఈ విజయంలో భాగంగా తన కొడుకులని రాజకీయ ఆరంగేట్రం చేయించి.. రాజకీయ ఎంట్రీ ఇచ్చిన ఆరంభంలోనే మంత్రుల పదవులు వచ్చేలా చేశారు. అంతేకాదు ఇప్పుడు కొడుకులిద్దరికీ రాజకీయ పాఠాలు నేర్పించడంలో లాలూ పూర్తి సమయం కేటాయించే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. లాలూ ఇద్దరు కొడుకుల్లో పెద్ద కుమారుడు ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగా.. చిన్న కుమారుడు ఉప ముఖ్యమంత్రిగా మరో రెండు శాఖలను నిర్వహిస్తున్నాడు. దీంతో ఇప్పుడు లాలూ వీరిద్దరిని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. లాలూనే కాదు కొడుకులు కూడా తండ్రి దగ్గర పాఠాలు నేర్చుకోవడానికి తెగ ఇంట్రస్ట్ చూపిస్తున్నారట. అందుకే మంత్రులుగా.. ప్రభుత్వం వారికి కట్టబెట్టే బంగ్లాలను సైతం కాదని లాలూ ఇంటి దగ్గరే ఉండి రాజకీయ ఓనమాలు నేర్చుకుంటున్నారు. దీనిలో భాగంగా ఇక లాలూ కూడా అధికారులను సైతం తనదైన శైలిలో మార్పులు చేయిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో తన హయాంలో నమ్మకస్తులుగా పనిచేసిన ఐఏఎస్ అధికారులను మళ్లీ ఇప్పుడు తీసుకుంటున్నారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరుణ్ కుమార్ ని బదిలీ చేయించి తమకు అనుకూలంగా ఉండే సుధీర్ కుమార్ ను ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. ఆరోగ్యశాఖను నిర్వహిస్తున్న తేజ్ ప్రతాప్ కు పాలనలో ఇబ్బందులు తలెత్తకుండా ఆర్.కె మహాజన్ ను ఆ శాఖకు బదిలీ చేయించుకున్నారు. మొత్తానికి లాలూ తన కొడుకుల రాజకీయ భవిష్యత్ గురించి మంచి శ్రద్ధ తీసుకుంటున్నట్టే కనిపిస్తుంది. మరి లాలూ రాజకీయాల్లో నెగ్గినట్టు ఇద్దరు కొడుకులు రాణిస్తారో లేదో చూడాలి.

నా దగ్గర రాజకీయాలు వద్దు.. ఎమ్మెల్యే పై బాలకృష్ణ ఫైర్

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన నియోజక వర్గం అభివృద్ధిలో చాలా కష్టపడుతున్న సంగతి తెలిసిందే. అందుకే నియోజకవర్గం అభివృద్ధి చేసిన జాబితాలో స్థానం కూడా సంపాదించుకున్నారు. అయితే బాలకృష్ణకు ఉన్న కోపం గురించి కూడా తెలిసిందే. ముఖం మీదే తిట్టిపడేస్తారు. అలా ఇప్పుడు ఓ సంబంధిత ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చి హాట్ టాపిక్ అయ్యారు. హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ తన నియోజవకర్గంలో తాగునీటి కోసం కల్యాణదుర్గం నియోజకవర్గం గుండా పైప్‌లైన్‌ ద్వారా నీటిని తీసుకు వెళ్తున్నారు. అయితే ఈ వాటర్ పైప్ లైన్లకు కొందరు చిల్లులు పెడుతున్నారని.. దానికి దీని వెనుక ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి హస్తం ఉందంటూ బాలకృష్ణకు కొంతమంది ఫిర్యాదులు చేశారంట. అంతే దీనికి బాలకృష్ణ రెచ్చిపోయి.. “ఇలాంటి రాజకీయాలు నా దగ్గర వద్దు అంటూ ఇప్పటికి రెండు మూడు సందర్భాల్లో హనుమంతరాయచౌదరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో హనుమంత చౌదరి కూడా స్పందించి ఈ చర్యలకు నాకు ఎలాంటి సంబంధం లేదని తనని అనవసరంగా నిందించవద్దని వివరణ ఇచ్చారంట.  

ఆనం బ్రదర్స్ టీడీపీ ఎంట్రీ.. మంత్రి గారు నో హ్యాపీ

ఆనం బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలోకి చేరడానికి అన్ని రకాలుగా రంగం సింద్దం చేసుకున్నట్టు కనిపిస్తుంది. వీరి రాకకు టీటీపీ అధినేత చంద్రబాబు సైతం ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే ఇతర పార్టీలో ఉన్న నేతలు తమ పార్టీలోకి వస్తున్నప్పడు ఆ పార్టీలో ఉన్న కొంత మంది నేతలకు అసంతృప్తిగా ఉండటం సహజం. ఇప్పుడు కూడా ఆనం బ్రదర్స్ టీడీపీ లోకి రావడం చంద్రబాబు సన్నిహితుడైన నారాయణకు ఏమాత్రం ఇష్టంలేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నిజానికి రాజకీయాల్లో ఆనం బ్రదర్స్ కి ఉన్న పట్టు వేరు. వీరిద్దరూ రాజకీయాల్లో పండిపోయారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ నారయణ పరిస్థితి వేరు. రాజకీయాల్లో అంత అనుభవం లేదనే చెప్పొచ్చు. అందుకే ఆనం బ్రదర్స్ ఎక్కడ పార్టీలోకి వస్తే తన ప్రభావం ఎక్కడ తగ్గిపోతుందో ఆని భయపడుతున్నారని అనుకుంటున్నారు. అంతేకాదు చంద్రబాబు కూడా జిల్లాలో వైసీపీకి హవా తగ్గించాలంటే దానికి ఆనం బ్రదర్స్ లాంటి ఉద్దండులే కరెక్ట్ అని.. అందుకే నారాయణ అభ్యంతరాలను సైతం పక్కనపెట్టి వారి ఎంట్రీకి స్వాగతం పలుకుతున్నట్టు తెలుస్తోంది. మరి ఆనం బ్రదర్స్ ను నారాయణ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

ఓడిపోయినందుకు హ్యాపీగా వివేక్..

వరంగల్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతితెలిసిందే. టీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఈ ఎన్నికలను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని.. ఎన్నికలో ఓడిపోయినందుకు కనీసం బయటకి కూడా రాకుండా.. ఎలాంటి మీడియా సమావేశాల్లో కూడా పాల్గొనకుండా ఇంట్లోనే ఉంటున్నారు. అయితే వరంగల్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సర్వే సత్యనారాయణ ఓడిపోయినందుకు ఒక్కరు మాత్రం చాలా హ్యాపీగా ఫీలవుతున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అది ఎవరో కాదు పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్.. అసలు వరంగల్ ఉపఎన్నికలో వివేక్ పోటీచేయాల్సి ఉంది.. కానీ మొదట వివేక్ పోటీ చేయడానికి నిరాకరించారు. ఆతరువాత కేంద్రం ఎలాగూ బుజ్జగించి ఆయన ఒప్పుకునే సరికి.. సరిగ్గా అదే సమయంలో సర్వే నారాయణ అడ్డుపుల్ల వేశారు. టీఆర్ఎస్ లోకి వెళదామనుకుంటున్న వివేక్ కు ఎలా టికెట్ ఇస్తారని కేంద్రాన్ని ప్రశ్నించడంతో కేంద్రం కూడా వివేక్ కు కాకుండా.. రాజయ్యకు టికెట్ కన్ఫామ్ చేసింది. ఆ తరువాత రాజయ్య కుటుంబంలో జరిగిన ఉందంతం అందరికి తెలసిందే. రాజయ్య కోడలు సారిక చనిపోవడం.. ఆతరువాత రాజయ్యను పోలీసులు అరెస్ట్ చేయడం.. రాజయ్యను పార్టీ నుండి సస్పెండ్ చేసి ఆ టికెట్ ను సర్వేకు  ఇవ్వడం జరిగాయి. అయితే పోటీలో దిగిన సర్వే కూడా ఓడిపోయారు. దీంతో పోటీలో తను లేకుండా ఉన్నందుకు.. అంతేకాదు తన టికెట్ కు అడ్డుపడినా సర్వే ఓడిపోవడంతో వివేక్ ఫుల్ కుష్ లో ఉన్నారంట. అంతేకాదు దీనికి సంబంధించి వివేక ఫ్యామిలీ ఓ పార్టీకూడా చేసుకున్నారంట. మొత్తానికి సొంత పార్టీ సభ్యుడు ఓడిపోయినా వివేక్ చాలా సంతోషంగా ఉన్నారంటే.. సర్వే మీద బానే కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది.

జయలలితకు స్టాలిన్ సలహా..

రాజకీయాల్లో అన్ని రాష్ట్రాల్లో రాజకీయాలకంటే తమిళనాడు రాజకీయాలు కాస్త తేడాగా ఉంటాయి. చాలా భయంకరమైన పాలిటిక్స్ జరుగాతాయి ఇక్కడ. ఇక అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పచ్చగడ్డివేస్తేనే భగ్గుమనే పరిస్థితి. మరి అలాంటి నేపథ్యంలో ఒకరిమీద ఒకరు ఏ రకంగా విమర్శల బాణాలు సంధించుకుంటారో తెలియంది కాదు. అలాంటి వాతావరణం ఉన్న క్రమంలో జయలలితకు.. ఆమె ప్రత్యర్థి పార్టీ డీఎంకే అభ్యర్ధి అది కూడా స్టాలిన్ నుంచి ఓ సలహా రావడంతో అది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అదేంటంటే.. బీహార్ ఎన్నికల్లో మహాకూటమి గెలుపొంది నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన గతంలో ఇచ్చిన హామిని గుర్తుంచుకొని దానికి ఇప్పుడు శ్రీకారం చుడుతూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుండి బీహార్లో పూర్తిగా మధ్యపానం నిషేదం చేస్తామని హామి ఇచ్చారు. ఇప్పుడు నితీశ్ తీసుకున్న నిర్ణయం లాగే తమిళనాడులో కూడా మధ్యపానం పై నిషేధం విధించాలని.. మధ్యపానం వల్ల తమిళనాడులో ఉన్న ఎన్నో కుటుంబాలు పాడైపోయాయి.. ప్రజల కోసం పనిచేయడం అంటే నితీశ్ లాంటి నిర్ణయం తీసుకోవడమే అని.. ఇది తన డిమాండ్ కాదని.. ప్రజల డిమాండ్ గా తీసుకోవాలని జయలలితకు సూచించారట. మరి స్టాలిన్ ఇచ్చిన సలహాకు జయలలిత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.