రైల్వే బడ్జెట్ పై పలువురి స్పందనలు..

  కేంద్రమంత్రి సురేశ్ ప్రభు రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలువురు రైల్వే బడ్జెట్ గురించి పలువురు పలు రకాలుగా స్పందించారు. ప్రధాని మోడీ స్పందిస్తూ.. సురేశ్ ప్రభు ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుందని.. భారత ఆర్థిక అభివృద్ధిలో రైల్వే బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అంతేకాదు సురేశ్ ప్రభుతో పాటు యావత్ రైల్వే కుటుంబానికి ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. వెంకయ్యనాయుడు: ఈ ఏడాది ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో సురేశ్ ప్రభు ప్రయాణికుల సంక్షేమానికి పెద్ద పీట వేశారన్నారు. భారతీయ రైల్వే వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. రైల్వే బడ్జెట్‌ ప్రయాణికుల సంతృప్తిపై దృష్టిసారించేలా ఉందన్నారు. ప్రకాశ్ జావదేకర్.. ఇది అన్ని విధాలుగా మంచి రైల్వే బడ్జెట్ అని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ అన్నారు. సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ కు తాను పదికి తొమ్మిది మార్కులు ఇస్తానని ప్రకాశ్ జావదేకర్ ట్వీట్ చేశారు. సిపిఎం బివి.రాఘవులు.. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు రైల్వే బడ్జెట్ పై స్పందించారు.  రైల్వే బడ్జెట్‌లో వాగ్దానాలే కనిపిస్తున్నాయి తప్పించి కొత్తదనమేదీ లేదని.. రాబోయే రోజుల్లో పేదలకు రైలు సౌకర్యం దూరం కాబోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని స్పష్టం చేశారు. పొన్నం ప్రభాకర్.. రైల్వే బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగిందని.. రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా కేసీఆర్ స్పందించడం లేదని విమర్శించారు. విభజన చట్టంలో హామీ ఇచ్చిన.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా రాలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిధుల సాధన కోసం కేంద్రం పై ఒత్తిడి పెంచడంలో టీఆర్ఎస్ ఎంపీలు విఫలమయ్యారని పొన్నం విమర్శించారు. ఇంద్రకరణ్‌రెడ్డి.. కేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సప్లమెంటరీ బడ్జెట్‌లో అయినా రాష్ట్ర ప్రాధాన్యతలు గుర్తించాలని కోరారు. కేంద్ర మంత్రి జయంత్‌ సిన్హా.. రైల్వేలు భారత ఆర్థికవ్యవస్థకు వెన్నెముక అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ చక్కటి సమన్వయంతో కూడిన రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టారని మంత్రి సురేశ్ ప్రభుని కొనియాడారు.

వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఆడుతోంది..!

టి 20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఆడబోతోంది. ఇప్పటి వరకూ తమ ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో, పాకిస్థాన్ టి 20 టోర్నీలో ఆడేది లేనిది అనుమానంగా మారింది. ఇండియాలో పాక్ టీం కు భద్రత లేదన్న నెపంతో, ఇప్పటి వరకూ అనుమతి నిరాకరించిన పాకిస్థాన్ ప్రభుత్వం, ఎట్టకేలకు అనుమతినిచ్చింది. కానీ పాక్ టీం కు స్పెషల్ సెక్యూరిటీ ఎరేంజ్ చేయాలని ఐసీసీని కోరింది.  ఒకవేళ పాక్ ఈ టోర్నీలో ఆడకపోతే, ఐసీసీకి పెనాల్టీ చెల్లించాల్సి వచ్చేది. పాకిస్థాన్ క్వాలిఫైర్ మ్యాచ్ ను మార్చి 16 న ఆడుతుంది. మార్చి 20న ధర్మశాలలో భారత్ తో ఢీకొడుతుంది. ఈ మ్యాచ్ చూడటం కోసం, వందలాది పాకిస్థాన్ పౌరులు పౌరులు ఇండియా రావాలనుకుంటున్నారని, వారందరికీ భారత ప్రభుత్వం వీసాలు ఏర్పాటు చేస్తుందని ఆశిస్తున్నామని పిసీబీ అంటోంది.

టిఆర్‌ఎస్లో చేరిన ఎర్రబెల్లి.. కేసీఆర్ ను తిట్టినందుకు బాధ పడుతున్నా

తెలుగుదేశం నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు  టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ తీర్దం పుచ్చుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు పలువురు టిడిపి నేతలు, కార్యకర్తలు టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని.. తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలవాలన్నారు. టిఆర్‌ఎస్‌లో చేరికలను రాజకీయ కోణంలో చూడవద్దని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితనే టీఆర్ఎస్ లో చేరాల్సింది.. కేసీఆర్ ను తిట్టినందుకు బాధ పడుతున్నా.. తెలంగాణలో టీడీపీ లేనే లేదు... అది ఆపార్టీ నేతలు గుర్తించాలి.. తెలంగాణలో చంద్రబాబు చేతులెత్తేశారని అన్నారు.

నేను ఉగ్రవాదిని కాదు.. కంటతడి పెట్టిన సంజయ్ దత్

  బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఎరవాడ జైలు నుండి విడుదలైన సంగతి తెలిసిందే. జైలు నుండి బయటకు వచ్చిన ఆయన ముందుగా సిద్ది వినాయన ఆలయానికి వెళ్లి దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన భావోద్వోగానికి గురైనట్టు తెలుస్తోంది. నేను భారతీయుడిని అయినందుకు గర్వపడుతున్నానని.. ఈ రోజు కోసం తాను 23 ఏళ్లుగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. అంతేకాదు జైలునుండి విడుదలవుతన్నందుకు నాలుగు రోజులుగా ఏం తినలేదు.. గత రాత్రి నిద్రపోలేదు.. జైలు నుండి బయటపడుతున్నా.. కుటుంబంతో కులుస్తున్నా.. ఆ ఆలోచనలే వెంటాడాయి.. బహుశా ఖైదీలకు ఇలాగే ఉంటుందేమో అని అన్నారు. నేను విడుదలైనందుకు మానాన్న ఉంటే చాలా ఆనందించేవారని.. నాన్నా నేను బయటకు వచ్చేశాను అని పైకి చూస్తూ చెప్పారు. ఇంకా నేను ఇక్కడే పుట్టాను.. ఇక్కడే చనిపోతాను.. జాతీయ పతాకం నా జీవితం నేను ఉగ్రవాదిని కాదు అంటూ సంజయ్ దత్ కంటతడి పెట్టుకున్నారు.

వడోదరకు రైల్వే యూనివర్సిటీ.. చంద్రబాబు అడిగినా..!

  కేంద్రమంత్రి సురేశ్ ప్రభు రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. దాదాపు గంటన్నర ప్రసంగించిన ఆయన రైల్వేలో పరిశుభ్రత, సౌకర్యాలు, రక్షణకు పెద్దపీటవేసినట్టు తెలుస్తోంది. దీనిలో ఆయన దేశంలో తొలిసారి ఏర్పాటు చేయనున్న రైల్వే యూనివర్సిటీని వడోదరకు కేటాయించారు. అయితే ఈ యూనివర్శిటీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు కేటాయించడం ఆశ్చర్యకరం. అసలు ఈ యూనివర్శిటీని ఏపీ నూతన రాజధాని అయిన అమరావతికి కేటాయించాలని ముందుగానే రాష్ట్ర సీఎం చంద్రబాబు మంత్రిగారిని కోరారట. ఈ విషయంపై ప్రధాని మోడీతో కూడా చంద్రబాబు చర్చించారట. అయితే పరిశీలిస్తామని చెప్పిన మంత్రిగారు ఆఖరికి మోడీ సొంత రాష్ట్రానికే ఇచ్చేశారు.

ఉన్నతాధికారి మీద కాల్పులు, ఆపై ఆత్మహత్య!

  రక్షణ దళాలలో సైనికులు ఉన్నతాధికారుల మీదకి కత్తులు దూస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా జార్ఖండ్‌లో జరిగిన ఒక ఘటనలో మహిపాల్‌ అనే సీఆర్‌పీఎఫ్‌ జవాను తన సీనియర్‌తో ఏదో విషయంలో తగవు పడ్డాడు. కొట్లాట తారస్థాయికి చేరుకోవడంతో తనదగ్గర ఉన్న తుపాకీని తీసి సీనియర్‌ని కాస్తా కాల్చిపారేశాడు. అపై తనని తాను కాల్చుకున్నాడు. ఈ ఉదంతంలో సీనియర్ అధికారిబయటపడగా మహిపాల్ మాత్రం అక్కడికక్కడే మరణించాడు. రక్షణ రంగంలో పనిచేసేవారు తీవ్రమైన ఒత్తిడిలో ఉంటారు. ఒక పక్క గంటలతరబడి కాపలా కాయాలి. మరోపక్క ఏ వైపు నుంచి శత్రువు విరుచుకుపడతాడో తెలియని ఉద్విగ్నత. అన్నింటికీ మించి నెలల తరబడిఇంటికి, కుటుంబానికి దూరంగా ఉండాలి. దాంతో ఒకోసారి జవాన్లలోని అసహనం హద్దులు దాటిపోతుంటుంది. అదిగో! అలాంటి సమయాలలోనేఇలాంటి ఉదంతాలు జరుగుతూ ఉంటాయి. ఉన్నతాధికారి సెలవుని మంజూరు చేయలేదనో, పదేపదే పనులను చెబుతున్నాడనో...విసిగిపోయిన జవాన్లు ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉంటారు.

SMS చేస్తే రైలు శుభ్రం చేస్తారు

  రైల్వేలలో అపరిశుభ్రత ఇప్పటివరకూ ప్రయాణికులకు పెను అడ్డంకిగా ఉండేది. రైలు ఎక్కిన తరువాత బాత్రూంల నుంచి దుర్వాసన వస్తుంటే ముక్కుమూసుకుని ప్రయాణాన్ని కొనసాగించవలసిన పరిస్థితి. ఇక నుంచి రైళ్లలో పరిశుభ్రతను పెంపొందించడమే తమ ముఖ్య కర్తవ్యం అంటున్నారు రైల్వే మంత్రి! ఇందులో భాగంగా ఎవరన్నా ప్రయాణికులు తమ కోచ్‌ అపరిశుభ్రంగా ఉంటే రైల్వేలకు వెంటనే ఒక సందేశాన్ని పంపిస్తే సరిపోతుందట. తదుపరి స్టేషన్లో కోచ్‌ను శుభ్రం చేసేస్తామంటున్నారు మంత్రివర్యులు. రైల్వేస్టేషన్లను పరిశుభ్రంగా ఉంచేందుకు 17,000 బయోటాయిలెట్ల నిర్మాణాన్ని కూడా చేపట్టినట్లు చెబుతున్నారు.

హమ్ సఫర్ పేరుతో థర్డ్ ఏసీ..

* హమ్ సఫర్ పేరుతో థర్డ్ ఏసీ సౌకర్యం.. 408 స్టేషన్లలో ఈ క్యాటరింగ్.. చిన్న పిల్లల కోసం ప్రత్యేక ఆహారం * వచ్చే ఏడాది 2800 కి.మీ రైల్వే లైన్ల నిర్మాణం * పాసింజర్ రైళ్ల సగటు వేగం 60 కి.మీ.. ఎక్స్ ప్రెస్ రైళ్ల వేగం 80 కి.మీ * 5300 కి.మీ.. 44 కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంఓయూలు * ఈ ఏడాది 820 రైల్ ఓవర్ బ్రిడ్జీల నిర్మాణ పూర్తి.. రూ. 1300 కోట్లతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు * వడోదరలో రైల్వే యూనివర్శిటీ * 2017-18 లో తొమ్మిది వేల ఉద్యోగాల కల్పన * 2020 నాటికి గూడ్స్ రైళ్లకు కూడా టైమ్ టేబుల్.. * రద్దీ మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్ల సౌకర్యం * మహిళల భద్రతకు 24x7 కాల్ సెంటర్లు * బుకింగ్ సమయంలోనే ప్రయాణ భీమా * ప్రధాన ఆలయాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ట్రైన్ * తక్కువ శబ్దం, ఎక్కువ సౌకర్యం ఉండేలా కొత్తకోచ్లు * నాగుపూర్- విజయవాడ ట్రేడ్ కారిడర్ * 44 కొత్త ప్రాజెక్టులు, 65 వేల అదనపు బెర్త్ లు * 100 స్టేషన్లలో వైఫై, ఎస్కలేటర్ల సౌకర్యం * అన్ని ప్రధాన స్టేషన్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు * జర్నలిస్ట్ లుక ఆన్ లైన్లోనే టికెట్ రాయితీ * వెయ్యి రైళ్లలో బయోటాయిలెట్స్

ప్రతి పౌరుడు గర్వపడేలా రైలు ప్రయాణం..

  కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు గురువారం పార్లమెంట్లో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభలో రైల్వే బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టిన ఆయన పలు రైల్వేలో పరిశుభ్రత, సౌకర్యాలు, రక్షణకు పెద్దపీటవేసినట్టు తెలుస్తోంది. ఆయన ప్రసంగంలో అంశాలు..   * ప్రతి పౌరుడు గర్వపడేలా రైలు ప్రయాణం తీర్చి దిద్దాలన్నదే లక్ష్యం * 2016-17 వ్యయం 1.21కోట్లు.. 2016-17 ఆదాయం 1.87 కోట్లు * రైల్వేలో 1.5 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఎల్ఐసీ అంగీకరించింది. * సగటు వేగం 50 కి.మీ నుండి 80 కి.మీ వరకూ పెంపు * ఈ ఏడాదికి 2 వేల కి.మీ రైల్వే లైన్లు విద్యుదీకరణ.. వచ్చే ఏడాదికి 50 శాతం రైల్వే లైన్లను విద్యుదీకరిస్తాం * రక్షణ లేని లెవల్ క్రాసింగ్ లు తొలగింపునకు ప్రయత్నిస్తున్నాం * రైల్వేలు, పోర్టుల మధ్య కనెక్ట్ విటీని పెంచుతాం * అన్ని స్టేషన్లో డిస్పోసబుల్ బెడ్ సౌకర్యం * మహిళల భద్రత, వైద్య సౌకర్యాల పెంపునకు ప్రాధాన్యత * సమయ పాలన వసతులకు ప్రాధన్యం * మేకింగ్ ఇండియాలో భాగంగా రెండు కొత్తం లోకో ఫ్యాక్టరీలు * రాజధాని, శతాబ్ది రైళ్ల ఫ్రిక్వెన్సీని పెంచుతున్నాం * సీనియర్ సిటిజన్స్ కోటా 50 శాతం పెంపు.. వారికోసం లోయర్ బెర్త్ ల్లో ప్రాధాన్యం * పెండింగ్ ప్రాజెక్టులన్నీ మూడేళ్లలో పూర్తి * రైల్వే టెండరింగ్లో పేపర్ రహిత పద్దతి.. ఎలక్ట్రానికి పద్దతిలో రైల్వే టెండరింగ్ పద్దతి

రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సురేశ్ ప్రభు..

  రైల్వే మంత్రి సురేశ్ ప్రభు పార్లమెంటుకు చేరుకున్నారు. లోక్ సభలో ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం సురేశ్ ప్రభు రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి రైల్వే వెన్నుముకలా ఉండేలా బడ్జెట్ తయారు చేశా అని చెప్పారు. ఇంకా * సామాన్యుల ఆశలు ప్రతిఫలించేలా రైల్వే బడ్జెట్ రూపొందించాం. * అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే పనితీరును మెరుగుపరుస్తాం * రైల్వేలో కొత్త ఆలోచనలు, కొత్త ఆదాయ మార్గాల ప్రాతిపదికన రూపొందించాం * రెవిన్యూ లోటును ఈ ఏడాది తగ్గించుకోగలిగాం * వచ్చే ఏడాది పది శాతం ఆదాయం పెరుగుతుందని ఆశిస్తున్నా * పీపీపీ విధానంలో కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నాం * మౌలిక వసతుల కల్పనలో ముందున్నాం

చిరంజీవిని నెత్తిన ఎక్కించుకోను..

  సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ నెలలో తన నియోజకవర్గంలో లేపాక్షి ఉత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆయన నిన్న విజయవాడ సీఎం కార్యాలయానికి వెళ్లి చంద్రబాబుని ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ నెల 27, 28 తేదీల్లో హిందూపురంలో లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నానని.. పలువురు ప్రముఖులను ఈ ఉత్సవాలకి ఆహ్వానిస్తున్నాని తెలిపారు. అయితే చిరంజీవి ఆహ్వానంపై అడిగిన ప్రశ్నకు బాలకృష్ణ స్పందిస్తూ లేపాక్షి ఉత్సవాల నిర్వహణ తన కష్టార్జితమని, ఎవరినీ పిలువాలో.. పిలువకూడదో తనకు తెలుసునని.. చిరంజీవిని ఉత్సవాలకు పిలువలేదు. నేను ఎవరినీ నెత్తిన ఎక్కించుకోను. నా నెత్తిమీద ఎక్కేవారిని పిలువాల్సిన అవసరం నాకు లేదు.. నాది డిక్టేటర్ తరహా పంథా అని సమాధానమిచ్చారు. ఇంకా వైసీపీ నేతలు టీడీపీ పార్టీలోకి చేరడంపై మాట్లాడుతూ.. తాము ఎవ్వరినీ పార్టీలోకి బలవంతంగా లాక్కోవాల్సిన అవసరం లేదు.. ఏపీలో అభివృద్ధిని చూసే వైసీపీ నేతలు టీడీపీలోకి వస్తున్నారని అన్నారు.

అఫ్జల్‌గురు నిర్దోషి- చిదంబరం

  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న అఫ్జల్‌గురు ఉరితీత గురించి కాంగ్రెస్‌ నేత చిదంబరం వివాదాస్పద ప్రకటన చేశారు. 2001లో పార్లమెంటు మీద జరిగిన దాడిలో అఫ్జల్‌గురు దోషి అని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవన్నారు చిదంబరం. ఒకవేళ ఆనాటి దాడిలో ఆఫ్జల్‌గురు పాత్ర ఉన్నా, అది ఏ స్థాయిలో ఉందో చెప్పలేమని అన్నారు. వెరసి అఫ్జల్‌గురుని ఉరి తీసేటన్ని సాక్ష్యాలు లేవంటూ పెదవి విరిచారు. మరి మీరు ఆ సమయంలో అధికారంలోనే ఉన్నారు కదా అన్న ప్రశ్నకు, తాను అధికారంలో ఉన్నప్పటికీ హోంశాఖ తన పరిధిలో లేదంటూ మాట దాటవేశారు. అంతేకాదు! జేఎన్‌యూలో జాతివ్యతిరేక నినాదాల గురించి కూడా ఇంతే భిన్నంగా స్పందించారు చిదంబరం- ఈ రోజుల్లో పిల్లలకి తప్పుగా మాట్లాడే అధికారం ఉందనీ, అంతమాత్రాన దాన్ని జాతి విద్రోహంగా భావించకూడదనీ పేర్కొన్నారు. హతవిధీ! ఇంతకీ చిదరంబరం వ్యాఖ్యల వెనుక ఉన్న చిదంబర రహస్యం ఏమిటో! సున్నితమైన అంశాన్ని మరింత రెచ్చగొట్టి రాజకీయంగా లబ్దిని పొందటమేనా!