ఉన్నతాధికారి మీద కాల్పులు, ఆపై ఆత్మహత్య!
posted on Feb 25, 2016 @ 1:45PM
రక్షణ దళాలలో సైనికులు ఉన్నతాధికారుల మీదకి కత్తులు దూస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా జార్ఖండ్‌లో జరిగిన ఒక ఘటనలో మహిపాల్ అనే సీఆర్‌పీఎఫ్ జవాను తన సీనియర్‌తో ఏదో విషయంలో తగవు పడ్డాడు. కొట్లాట తారస్థాయికి చేరుకోవడంతో తనదగ్గర ఉన్న తుపాకీని తీసి సీనియర్‌ని కాస్తా కాల్చిపారేశాడు. అపై తనని తాను కాల్చుకున్నాడు. ఈ ఉదంతంలో సీనియర్ అధికారిబయటపడగా మహిపాల్ మాత్రం అక్కడికక్కడే మరణించాడు. రక్షణ రంగంలో పనిచేసేవారు తీవ్రమైన ఒత్తిడిలో ఉంటారు. ఒక పక్క గంటలతరబడి కాపలా కాయాలి. మరోపక్క ఏ వైపు నుంచి శత్రువు విరుచుకుపడతాడో తెలియని ఉద్విగ్నత. అన్నింటికీ మించి నెలల తరబడిఇంటికి, కుటుంబానికి దూరంగా ఉండాలి. దాంతో ఒకోసారి జవాన్లలోని అసహనం హద్దులు దాటిపోతుంటుంది. అదిగో! అలాంటి సమయాలలోనేఇలాంటి ఉదంతాలు జరుగుతూ ఉంటాయి. ఉన్నతాధికారి సెలవుని మంజూరు చేయలేదనో, పదేపదే పనులను చెబుతున్నాడనో...విసిగిపోయిన జవాన్లు ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉంటారు.