ఆసియా కప్ మ్యాచ్.. పాకిస్థాన్ పై భారత్ గెలుపు..

ఎప్పుడెప్పుడా అని క్రికెట్ అభిమానులు ఎదురుచూసిన పాక్, భారత్ ఆసియా కప్ మ్యాచ్ జరిగిపోయింది. ఎంతో ఉత్కంఠ బరితంగా జరిగిన ట్వంటీ 20 మ్యాచ్‌లో భారత్ అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 83 పరుగులకే కుప్పకూలింది. ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన భారత్ ముందు తడబడ్డా అనంతరం కుదురుకొని  15.3 ఓవర్లలో విజయం సాధించింది. కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‍‌కు యువరాజ్ సింగ్ తోడు కావడంతో గెలుపు తీరం చేరింది. కాగా, ఒకే ఒక్క పరుగుతో విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ మిస్సయ్యాడు. పేసర్లు ఆరంభం నుంచే చెలరేగిపోగా ఫీల్డర్లు కూడా పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఓ సమయంలో పాక్ 2 వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత 14 పరుగుల వ్యవధిలోనే.. అంటే 42 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.

కత్తితో గొంతు కోసి 14 మందిని హత్య.. అందరూ కుటుంబసభ్యులే..

మహారాష్ట్రలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని థానే నగరంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘటన తీవ్ర సంచలనం రేపింది.. థానే నగరంకు సమీపంలోని కాసర్ వాది ప్రాంతంలో  ఓ వ్యక్తి అతి దారుణంగా కత్తితో గొంతులు కోసి తన కుటుంబంలోని 14 మందిని హత్య చేశాడు. అనంతరం తాను కూడా  ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా థానే సంయుక్త పోలీసు కమిషనర్ అశుతోష్ డుమ్రీ మాట్లాడుతూ.. చేతిలో కత్తి ఉండడంతో అతడే ఈ హత్యలు చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా  ఘటన నుంచి ఓ మహిళ ప్రాణాలతో బయటపడగా ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఇంకా షాక్ నుండి తేరుకోనందున ఆమెను ఇంకా ప్రశ్నించలేదని పోలీసు అధికారులు తెలిపారు.

భారత్,పాకిస్థాన్.. ఆసియా కప్‌ పోరు నేడే

  టీమిండియా జట్టు అన్ని జట్లతో ఆడటం వేరు.. ప్రత్యర్ధి దేశమైన పాకిస్థాన్ తో ఆడటం వేరు. ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈనేపథ్యంలోనే ఆసియా కప్‌ భాగంగా ఈరోజు జరిగే మ్యాచ్‌లో భారత్‌, పాకిస్థాన్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం యావత్తు క్రికెట్‌ అభిమానులు అతృతగా ఎదురు చూస్తున్నారు.  ప్రస్తుతం టీమిండియా మంచి ఫామ్ లో ఉంది కాబట్టి పాకిస్థాన్ పై గెలుపు ఖాయమని భావిస్తున్నారు. రోహిత్‌ శర్మ, కోహ్లి, సురేష్‌ రైనాలతో ఇప్పటి అత్యంత బలంగా ఉన్న భారత్‌ బ్యాటింగ్‌కు..  హర్థిక్‌ పాండ్య బ్యాటింగ్ కూడా తోడవడం కూడా భారత్ కు ఫ్లస్ పాయింట్ అయింది. ఇంకా.. శిఖర్‌ ధావన్‌, ఎంఎస్‌ ధోని, యువరాజ్‌ కూడా బ్యాటింగ్‌లో రాణిస్తే పాకిస్థాన్‌ను చిత్తు చేయడం అత్యంత సులభమని అభిమానులు ధీమాగా ఉన్నారు. అలాగే పాకిస్థాన్ తక్కువ అంచనా వేయడానికి మించిన పోరపాటు లేదని విశ్లేషకులు అంటున్నారు. దీంతో ఈరోజు జరిగే మ్యాచ్ మంచి హోరా హోరీగా ఉంటుందని భావిస్తున్నారు.

సుబ్రమణ్యం స్వామికి చేదు అనుభవం.. కోడిగుడ్లు, టమోటాలతో దాడి..

బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యం స్వామికి ఓ చేదు అనుభవం ఎదురైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన ఆయనపై కోడిగుడ్లతో దాడి చేశారు. వివరాల ప్రకారం.. సుబ్రమణ్యం స్వామి కాన్పూర్‌లో స్థానికంగా నవాబ్ గంజ్‌లోని వీఎస్ఎస్డీ కాలేజీలో 'ప్రపంచ తీవ్రవాదం' పై ఏర్పాటు చేసిన సెమినార్ కార్యక్రమానికి హాజరవడానికి వస్తున్న నేపథ్యంలో ఆయన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అంతేకాదు ఆయన కారుపై కోడిగుడ్లు.. టమోటాలు విసిరి.. నల్లజెండాలు ప్రదర్శించారు. అక్కడితో ఆగకుండా  నల్ల ఇంకుని సైతం చల్లారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినా పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలక మధ్య తీవ్ర తోపులాట జరిగి కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. ఆఖరికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో పరిస్థితి నెమ్మెదించింది.

జగన్ సవాల్ ను చంద్రబాబు స్వీకరిస్తారా..?ఎన్నిక‌ల‌కు దిగుతారా..?

  వైసీపీ ఎమ్మెల్యేలు ఆపార్టీని వీడి టీడీపీ లోకి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి టీడీడీ అధినేత అయిన చంద్రబాబుపై ఫుల్ ఫైర్ అవుతున్నారు.  డ‌బ్బులిచ్చి.. ప్ర‌లోభాల‌కు గురిచేసి త‌మ ఎమ్మెల్యేల‌ను లాక్కుంటున్నార‌ని.. దమ్ముంటే వారి చేత రాజీనామా చేయించి.. గెలిపించుకోవాల‌ని చంద్ర‌బాబుకు స‌వాల్ విసిరారు. అయితే ఇప్పుడు అందరూ అనుమానం ఏంటంటే.. జగన్ సవాల్ ను చంద్రబాబు స్వీకరిస్తారా లేదా అని. ఎందుకంటే.. టీడీపీ లోని ఇంతకు ముందు నేతలు వేరే పార్టీలోకి వెళ్లినప్పుడు వారు కూడా ఇలానే ఆరోపించారు. వాళ్లు వెళ్లినప్పుడు రాజీనామా చేయించి గెలిపించుకోవాలని.. సవాళ్లు విసిరారు. మరి ఇప్పుడు జగన్ సవాల్ ను చంద్రబాబు స్వీకరిస్తారా.. వారి చేత రాజీనామా చేయిస్తారా.. ఎన్నిక‌ల‌కు దిగుతారో లేక ప్ర‌త్యామ్నాయ మార్గం చూస్తారో అని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ఏం జరుగుతందో చూడాలి..

రెండేళ్ల పాపకు వివాహం

  బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్తాన్‌లోని నలుగురు బాలికలకు ఇలా వివాహం జరిగిన వార్తలు వినిపిస్తున్నాయి. వీరంతా 2 నుంచి 12 సంవత్సరాల మధ్య వయసున్న బాలికలే! వీరిని వివాహం చేసుకున్నవారు కూడా మైనర్లు కావడం విశేషం. రాజస్తాన్‌లోని భిల్వారా జిల్లాలో జరిగిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. అయితే ఈ వివాహం గురించి తెలిసి కూడా అధికార యంత్రాంగం కానీ పోలీసులు కానీ సత్వరం స్పందించకపోవడం ఆశ్చర్యం. స్థానికంగా ఓ వార్తాపత్రికలో వచ్చిన వార్త ఆధారంగా పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తుకి ఆదేశించిన తరువాత కానీ, అధికారులలో చలనం కలుగలేదు. 2001 గణాంకా ప్రకారం ఏటా 15లక్షలమంది బాలికలకి, వారికి 15 ఏళ్ల వయసులోపుగానే వివాహం చేసేస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ‘బాల్యవివాహ వ్యతిరేక చట్టం- 2006’ని అమలులోకి తీసుకు వచ్చింది. అయినా అధికారుల అలసత్వం వల్ల అడపాదడపా ఇలాంటి వార్తలు వినవస్తూనే ఉన్నాయి.

టీడీపీతో కటీఫ్.. టీఆర్ఎస్ తో బీజేపీ..!

  రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అస్సలు చెప్పలేం. నిన్న మొన్నటి వరకూ పిచ్చ తిట్లు తిట్టుకున్నోళ్లు కూడా సడెన్ గా ఈరోజు ఒక్కటైపోతుంటారు. రాజకీయమంటే అదేనేమో అనిపిస్తుంటుంది. ఇప్పుడు తాజా పరిణామాలు చూస్తుంటే అలానే అనిపిస్తుంది.   టీడీపీ, బీజేపీ పార్టీలు మిత్రపక్షమని అందరికీ తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు కలుపున్న ఈరెండు పార్టీలు.. అటు రాష్ట్ర ప్రభుత్వంలోనూ.. ఇటు కేంద్ర ప్రభుత్వంలోనూ గెలుపొంది అధికారం చేపట్టాయి. అయితే ఈరెండు పార్టీలు మిత్రపక్షాలు అయినప్పటికీ నాయకుల మధ్య మాత్రం ఎప్పుడూ బేధాభిప్రాయాలు ఉంటూనే ఉండేవి. ఇక రాష్ట్ర విభజన తరువాత పరిస్థితి చెప్పనవసరం లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీల దుమ్ము దులిపేస్తుంది. ఇప్పటికే దాదాపు టీడీపీ ఖాళీ అయిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలోనే బీజేపీ టీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు రెడీ అవుతుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.   దీనిలో భాగంగానే ఎప్పుడూ కేసీఆర్ అపాయింట్ మెంట్ కు దూరంగా ఉండే మోడీ.. తనకు అపాయింట్ మెంట్ ఇవ్వడం..  ప్ర‌ధాని మోదీతో ఏకాంతంగా సమావేశం అవ్వ‌డం.. అడిగిన వ‌న్నీ వ‌రుస‌పెట్టి ఇచ్చేయ‌డం.. ఇవ‌న్నీ చూస్తుంటే నిజ‌మే అనిపించ‌క‌మాన‌దు!. అంతేకాదు తాజాగా కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్ లో కూడా తెలంగాణకు బాగానే న్యాయం జరిగినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఎంపీ కవిత కూడా కవిత సంతోషం వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో రైల్వే మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. దీంతో ఇప్పుడు క‌మ‌లం కారెక్క‌బోతోంది అనే అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. కేంద్ర మంత్రివర్గంలోకి టీఆర్ఎస్ చేరిక దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. మరి ఎంతవరకూ నిజమో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. 

స్మృతీ తల నరికి ఇవ్వు.. మాయావతి

రోహిత్ ఆత్మహత్యపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, యూపీ మాజీ సీఎం, బిఎస్పీ అధ్యక్షురాలు మాయావతి మధ్య ఇంకా రగడ జరుగుతూనే ఉంది. ఈనేపథ్యంలో మాయావతి స్మృతీ ఇరానీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ అంశంపై స్మృతీ చెప్పిన సమాధానాలు తనకు సంతృప్తి చెందలేదని.. రోహిత్‌ అంశంపై తన సమాధానంతో నేను సంతృప్తి చెందకుంటే తన తల నరికి సమర్పిస్తానని స్మృతి ఇరానీ చెప్పారని.. కనుక ఆమె చెప్పినట్టు తలనరుక్కొని తన ముందు పెట్టాలని మాయవతి అన్నారు. రోహిత్‌ ఆత్మహత్యపై విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్‌లో దళిత సభ్యుడిని నియమిస్తారా లేదా అన్న తన ప్రశ్నకు ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదని మాయావతి అన్నారు. దీనికి స్మృతీ స్పందిస్తూ..  కేంద్రీయ వర్సిటీలోని ప్రాక్టోరియల్‌ బోర్డులో ఎస్సీ సభ్యుడు లేరన్న ఆరోపణలను నిరాధారమన్నారు.. ఇంకా నా తలను తీసుకురమ్మని మీ కార్యకర్తలను పురమాయించండని పేర్కొన్నారు. మరి ఈ గొడవ ఇంకెంత దూరం వెళుతుందో..

ముషారఫ్‌కు మరణశిక్ష

  పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ మరణశిక్షను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. ఆ దేశ ఉన్నత న్యాయస్థానం నిన్న 2007లో ముషారఫ్ చర్యల గురించి విచారణ చేపట్టవలసిందిగా ఆదేశించింది. 2007లో ముషారఫ్‌ దేశ రాజ్యాంగాన్ని రద్దు చేసి ఎమర్జన్సీని విధించారు. అందుకు వ్యతిరేకించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఇఫ్తకర్‌ మహమ్మద్‌ను నిర్దాక్షిణ్యంగా ఆ పదవి నుంచి తొలగించారు. ఆయన చర్యతో ఆనాటి న్యాయవ్యవస్థ మొత్తం ముషారఫ్ మీద మండిపడింది. న్యాయవాదులంతా ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఆనాటి నుంచి ముషారఫ్‌కూ న్యాయవ్యవస్థకూ మధ్య సంబంధం ఉప్పునిప్పులాగా సాగుతోంది. అప్పట్లో రాజ్యాంగానికి విరుద్ధంగా ముషారఫ్‌ తీసుకున్న ఈ చర్యలన్నీ దేశద్రోహం కిందకి వస్తాయని సుప్రీం కోర్టు అభిప్రాయపడుతోంది. అందుకుగాను ఆయన మీద విచరణ జరిపించి తనకు తుది నివేదికను అందచేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరింది. ఈ కేసులో కనుక ముషారఫ్‌ దోషిగా తేలితే ఆయనకు మరణశిక్షను విధించే అవకాశం కూడా ఉంది. దీంతో నిదానంగా దేశం నుంచి జారుకోవాలని ప్రయత్నిస్తున్న ముషారఫ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ముషారఫ్‌ ఇప్పటికే మాజీ ప్రధాని బేనజీర్‌ భుట్టోకి సంబంధించిన హత్య కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు.

విరాట్‌ కోహ్లీ అభిమానికి బెయిల్‌

  భారతదేశ జెండాను తన ఇంటి మీద ఎగరువేసిన కేసులో ఉమర్‌ దరాజ్‌ అనే పాకిస్తాన్‌ పౌరునికి ఎట్టకేళకు బెయిల్ లభించింది. దీంతో దాదాపు నెలరోజులుగా జైళ్లో మగ్గుతున్న ఉమర్‌కు కాస్త ఉపశమనం లభించినట్లైంది. విరాట్‌ కోహ్లీకి వీరాభిమాని అయిన ఉమర్‌, గత నెల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ ఆడిన తీరుకి మురిసిపోయాడు. వెంటనే తన ఇంటి మీద భారతదేశ జెండాను ఎగురవేశాడు. దాంతో స్థానిక పోలీసు అధికారులు ఉమర్‌ను నిర్బంధించడమే కాకుండా, దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తున్నాడంటూ తీవ్రమైన కేసులను మోపారు. ఈ కేసులో ఉమర్‌కు కనీసం పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. తనను విరాట్‌ అభిమానిగా మాత్రమే చూడమనీ, ఎవరో గూఢచారిలా భావించవద్దనీ ఉమర్‌ కన్నీళ్లతో వేడుకుంటున్నాడు. ఉమర్‌ నిజంగానే అమాయకుడని అతని గతానికి సంబంధించిన పోలీసు రికార్డులు కూడా పేర్కొంటున్నాయి. ‘ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ జరిగేటప్పుడు చాలామంది బ్రెజిల్, అర్జెంటినీల జెండాలను ఎగురేస్తారు... అంతమాత్రాన వారు దేశద్రోహులు అయిపోతారా’ అంటూ ఉమర్‌ న్యాయవాదులు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఇంతకీ ఉమర్‌ భవిత ఎలా ఉంటుందో చూడాలి మరి!

మోదీ కూడా మన్మోహన్‌లా అయిపోతున్నారు- తృణమూల్

  తన వాక్పటిమకు పేరొందిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిపక్షాల నుంచి ఓ చిత్రమైన విమర్శను ఎదుర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సుల్తాన్‌ అహ్మద్ అనే ఎంపీ నిన్న పార్లమెంటులో మాట్లాడుతూ, హర్యానా గురించి మోదీ నిశ్శబ్దంలో ఉండటంలో ఆంతర్యం ఏమిటంటూ ప్రశ్నించారు. మోదీ కూడా నిదానంగా పూర్వ ప్రధాని మన్మోహన్‌లాగా ‘సైలెన్స్ సిండ్రోమ్‌’ అనే లక్షణానికి లోనవుతున్నారనీ, అధికారం వేరెవరో చెలాయిస్తున్నారనీ విమర్శించారు. దిల్లీకి కూతవేటు దూరంలో ఉన్న హర్యానాలో కోట్లాది రూపాయల ఆస్తినష్టం జరుగుతున్నా మోదీ కిమ్మనకుండా ఉన్నారన్నది సుల్తాన్‌ అహ్మద్‌ మాట. నిరుద్యోగం పెరిగిపోవడం వల్ల యువత అసహనానికి లోనవుతున్నారనీ, అందుకే ఇలాంటి ఉద్యమాలు వస్తున్నాయనీ అన్నారు సదరు సభ్యుడు. మోదీ ఈ విమర్శకు జవాబిస్తారో, పోతేపోనీ అని ఊరుకుంటారో చూడాలి మరి!

బాలకృష్ణకు వ్యతిరేకం కాదు.. కానీ చిరంజీవిని అనే హక్కు లేదు..

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిరంజీవిపై కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే బాలకృష్ణ చేసిన కామెంట్స్ పై చిరంజీవి అభిమానులు ఇప్పటికే గుర్రు మీద ఉన్నారు. ఇక తమ్ముడు పవర్ స్టార్ కూడా బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న్టట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు బాలకృష్ణ వ్యాఖ్యలపై  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీ రామచంద్రయ్య కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. ఆయన ఉత్సవాలు ఎవరి ఖర్చుతో చేసుకన్నా పర్వలేదు.. చిరంజీవి గురించి మాట్లాడకుండా ఉంటే బాగుండేదన్నారు. బాలకృష్ణకు తాము వ్యతిరేకం కాదని, అయితే చిరంజీవిని విమర్శించే హక్కు ఆయనకు లేదని చెప్పారు.

దేవినేని నెహ్రూతో వర్మ.. వర్మకు హెచ్చరిక..

  దర్శకుడు రాంగోపాల్ వర్మ వంగవీటి సినిమా కోసం విజయవాడకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన దేవినేని నెహ్రూతో సమావేశమయ్యారు. దీంతో బెజవాడ మొత్తం వంగవీటి హడావుడితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరోవైపు ఈసినిమాకి రావాల్సిన విమర్శలు వస్తూనే ఉన్నాయి. సీపీఐ నగర కార్యదర్శి శంకర్ వంగవీటి రాంగోపాల్ వర్మను హెచ్చరించారు. కమ్యూనిస్టు నేత తలసాని వెంకటరత్నంను రౌడీగా చిత్రీకరించాలని చూస్తే తాము సహించమని అన్నారు. అసలు రాంగోపాల్ వర్మకు ఏం తెలుసు.. పేదల కోసం తలసాని వెంకటరత్నం అనేక పోరాటాలు చేశారు..  బెజవాడలో కమ్యూనిస్టు ఉద్యమాల చరిత్ర రామ్గోపాల్ వర్మకు ఏం తెలీదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీస్‌ స్టేషన్లో సీమంతం

  పోలీస్‌ స్టేషన్లో పెళ్లిళ్లను జరిపించే వార్తలు మనకి కొత్తేమీ కాదు. కానీ గుంటూరులో ఏకంగా ఒక మహిళా కాన్‌స్టేబుల్‌కి, స్టేషన్లో సీమంతం జరిపించిన విషయం ఇప్పుడు వార్తలలో నిలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే. ప్రమీల అనే మహిళా కాన్‌స్టేబుల్ ఎనిమిది నెలల గర్భవతి. అయితే తరచూ డ్యూటీలోనే ఉండటం వల్ల ఆమెకు స్టేషన్లోనే సీమంతం జరిపించేస్తే బాగుంటుందన్న ఆలోచన డీఎస్‌పీ సరితకు వచ్చింది. అంతే! నిన్న స్టేషన్‌నే ఫంక్షన్‌హాలుగా మార్చేశారు. బ్యానర్లూ, కుర్చీలూ తెప్పించారు. పళ్లు, గాజులు, కొత్తచీరలు అన్నింటినీ ప్రమీలకు బహుకరించి ఆమెకు ఘనంగా సీమంతాన్ని జరిపించారు. తరచూ డ్యూటలో ఉండే పోలీసులకి సంప్రదాయాలను పాటించే అవకాశం చిక్కదనీ, అందుకే తాను ఈ వేడకుని నిర్వహించానని పేర్కొన్నారు సరిత!

కృష్ణా పుష్కరాలు ఆగస్టు 12 నుండే..

కృష్ణా పుష్కరాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యలయం నుండి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు జరగనున్నట్లు ఏపీ దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. అంతేకాదు కృష్ణా పుష్కరాల కోసం నూతనంగా 280 ఘాట్లు నిర్మించనున్నట్లు.. ఈ పుష్కరాల నిమిత్తం..  అమరావతిలో ఘాట్ల నిర్మాణంతో పాటు కృష్ణా పరీవాహక ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. అంతేకాదు గత ఏడాది జరిగిన గోదావరి పుష్కరాల్లో జరిగిన ప్రమాదం.. ఇప్పుడు జరగకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఇక సీఎం కూడా కృష్ణా పుష్కరాలను కూడా నదుల అనుసంధానికి సంకల్పంగా స్వీకరించాలన్నారు.

మెగా పవర్ స్టార్స్ ఫేక్ స్టార్స్ .. వర్మ సంచలన ట్వీట్

  ఎప్పుడూ ఏదో ఒక వివాదానికి తెర లేపనిదే రాంగోపాల్ వర్మకి అస్సలు నిద్రపట్టదు. ట్విట్టర్ అనే ఆయుధం ద్వారా తను ఏది అనుకుంటే అది చెప్పేస్తుంటాడు ఈ వివాదాల వర్మ.. అయితే ఈసారి ట్వీట్స్ లో పొలిటికల్ టచ్ ఇచ్చాడు. కాపుల కోసం కాపు ఐక్య గర్జన ఉద్యమం చేసిన ముద్రగడ పద్మనాభంపై ప్రశంసలు కురిపించారు. ముద్రగడ రియల్ మెగా పవర్ స్టార్ అని.. స్క్రీన్ మెగా పవర్ స్టార్స్ ఫేక్ స్టార్స్ మాత్రమే అని కామెంట్ చేశాడు. ముద్రగడ కనుక పార్టీ పెడితే తాను ఆ పార్టీలో చేరతానని.. తాను కాపు వర్గానికి చెందిన వాడిని కాదని... తన మిత్రులు ఎక్కువ మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారని చెప్పుకొచ్చాడు. మరోవైపు వంగవీటి సినిమా కోసం రాంగోపాల్ వర్మ విజయవాడుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మరిన్ని రహస్యాలు తెలుకోవడానికి విజయవాడ వచ్చానని ఆయన చెప్పారు. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ), ప్రముఖ న్యాయవాది కర్నాటి రామ్మోహన్‌ సహా పలువురిని కలుస్తానని.. జూన్ మొదటి వారంలో సినిమా విడుదల చేస్తామంటున్నాడు.