కన్హయ్య కుమార్ కు బెయిల్.. 'నా కుమారుడు ఉగ్రవాది కాదు

  జెఎన్ యూ విద్యార్ది సంఘ నేత కన్హయ్య కుమార్ కు తాత్కాలిక ఊరట లభించింది. దేశ ద్రోహిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్హయ్య కుమార్ కు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరుచేసింది. అయితే ఈ బెయిల్ ను ఆరు నెలల వరకే ఇవ్వగా ఆ ఆ తర్వాత స్వచ్ఛందంగా లొంగిపోవాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఆరు నెలలు కూడా దర్యాప్తుకు సహకరించాలని షరతులు విధించింది. జేఎన్‌యూ సిబ్బందిలో ఒకరు పదివేల విలువైన పూచికత్తుని సమర్పించాలని న్యాయమూర్తి జస్టిస్‌ ప్రతిభారాణి స్పష్టంచేశారు. కాగా కన్హయ్య మొదట బెయిల్ కోసం సుప్రీం ను ఆశ్రయించగా.. సుప్రీం కోర్టు హైకోర్టును ఆశ్రయించమని చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు తన కొడుకుకు బెయిల్ వచ్చిందని తెలుసున్న తల్లి మాట్లాడుతూ 'నా కుమారుడు ఉగ్రవాది కాదు. ఈ విషయం ప్రపంచం తెలుసుకొని తీరుతుంది' అని భావోద్వేగానికి గురయ్యారు. ఇదిలా ఉండగా కన్హయ్య బెయిల్‌ లభించడంపై కాంగ్రెస్‌ సహా విపక్ష పార్టీలు హర్షం వ్యక్తంచేశాయి.

సికింద్రాబాద్ లో దారుణం.. నడిరోడ్డుపై హత్య..

  సికింద్రాబాద్ లో ఓ దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుమీద ఓ వ్యక్తిని కత్తులతో దాడి చేసి చంపేశారు. వివరాల ప్రకారం.. సంజయ్ అనే వ్యక్తి సదర గ్లోబల్ ల్యాండ్ సర్వీస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే మార్నింగ్ జాగింగ్  చేస్తున్న అతని పై దుండగులు దాడి చేసి చంపారు. సికింద్రాబాద్ లోని స్వప్న లోక్ కాంప్లెక్స్ దగ్గర స్విఫ్ట్ కారులో వచ్చిన దుండగులు సంజయ్ పై కత్తులతో దాడి చేసి చంపేశారు. అయితే పోలీసులు దుండగుల కారును వెంబడించగా.. వారు ట్యాంక్ బండ్ వైపు పరారైనట్టు చెబుతున్నారు. దీనిలో భాగంగా పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు.  పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా సంజయ్ పార్శిగుట్టలో నివాసం ఉంటున్నాడు.

ముద్రగడపై చంద్రబాబు సీరియస్.. జగన్ పై కేసులు వేయండి..

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రభుత్వ వైఖరిని తప్పు బడుతూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీక్ష సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడంలేదని.. హామీలు నెరవేరక నేను సిగ్గుపడుతున్నాని.. చంద్రబాబు తనను మోసగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముద్రగడ చంద్రబాబుకి లేఖ కూడా రాశారు. అయితే ఇప్పుడు ముద్రగడ రాసిన లేఖపై చంద్రబాబు మండిపడుతున్నట్టు తెలుస్తోంది. నిన్న ఏపీ కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు ముద్రగడ లేఖపై చర్చిస్తూ.. తీవ్రంగా స్పందించారని తెలుస్తోంది. గడువు తీరకుండానే మళ్లీ డెడ్ లైన్ పెట్టడం ఏమిటని.. ఈ లేఖ జగన్ కోసం రాసినట్టు ఉందని.. ప్రభుత్వాన్ని ముద్రగడ డిక్టేట్ చేయలేదని వ్యాఖ్యానించారని తెలుస్తోంది.   అంతేకాదు నవ్యాంధ్ర రాజధానిలో టీడీపీ నేతలను భూములు ఉన్నాయని వార్తలు వచ్చిన దానిపై కూడా ఆయన స్పందిస్తూ.. ఆ వార్తల్లో తెలిపిన వ్యక్తుల్లో ఎవరికైనా భూములు ఉన్నాయా అంటూ నిలదీశారు. జగన్‌కు ధైర్యం ఉంటే ఆశ్తులు ప్రకటించాలన్నారు. ఏ నేతల పేర్లు అయితే వార్లు ప్రస్తావించారో.. వారు కేసులు వేయాల్సిన అవసరముందన్నారు. వారి వ్యాఖ్యల పైన చట్టపరంగా, న్యాయపరంగా, రాజకీయంగా వెళ్దామని చెప్పారు.

రామోజీరావు పద్మవిభూషణ్ పై కోర్టులో పిల్..

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, మీడియా మొగల్ రామోజీరావుకు పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రామోజీరావుకి అవార్డ్ వచ్చిన దానిపై ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలోనే విమర్శలు చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థల ద్వారా రామోజీరావు ప్రజలను మోసం చేస్తున్నారని అలాంటి ఆయనకు పద్మవిభూషణ్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఉండవల్లి ఉమ్మడి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శి, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్య కార్యదర్శులు, వ్యక్తిగత హోదాలో రామోజీరావును ఆయన ప్రతివాదులుగా పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‌పై హైకోర్టులో ఎప్పుడు విచారణ జరగనుందన్న విషయం మాత్రం ఇంకా తేలలేదు.

మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. భారతీయ దౌత్య కార్యాలయంపై దాడి

రోజు రోజుకి ఉగ్రవాదుల చర్యలు ఎక్కువైపోతున్నాయి. ఆప్ఘనిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయి భారతీయ దౌత్య కార్యాలయంపై దాడి జరిపారు. భారత్ దౌత్య కార్యలయంపై ఆత్మహుతి బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఉగ్రవాద చర్యలను భద్రతా దళాలు తిప్పికొట్టాయి. ఉగ్రవాదులు.. భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమవ్వగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు ఈ కాల్పుల్లో భారతీయులంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా దౌత్య కార్యాలయానికి దగ్గర్లో ఉన్న గెస్ట్ హౌజ్ నుంచి ఉగ్రవాదులు కాల్పులకు దిగారని.. భారతీయ దౌత్య కార్యాలయాన్ని నలుగురు సుసైడ్ బాంబర్లు లక్ష్యం చేసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దాడులకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్ర సంస్థ ప్రకటించలేదని తెలిపారు.

మీ భర్తలను ఆపండమ్మా.. బాలీవుడ్ హీరోల భార్యలకు లేఖలు..

సెలబ్రిటీలు పలు రకాల ప్రొడెక్టులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారు. ఎవరు చెప్పినా కొంటారో లేదో కానీ తమ అభిమాన హీరోలు చెబితే వెంటనే ఆ ప్రొడెక్టును కొనేస్తారు అభిమానులు. మరి ఆ పాయింట్ ను కంపెనీలు కూడా బానే క్యాష్ చేసుకుంటున్నాయి. అయితే ఈ ప్రకటనలకు సంబంధించి బాలీవుడ్ నటుల భార్యలకు ఢిల్లీ ప్రభుత్వం లేఖలు రాసింది. ఇంతకీ ఎందుకు రాసిందా అనే కదా మీ డౌట్ అసలు సంగతేంటంటే.. షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్ గణ్, గోవిందా, అర్భాజ్ ఖాన్ లు వివిధ రకాల క్యాన్సర్ కారక ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లగా ఉండటమే.. ఈ నేపథ్యంలో ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మీ భర్తలు అటువంటి వ్యాధి కారక ప్రకటనల్లో నటించకుండా ఉండేలా చూడండి.. ఇది మా విన్నపం అంటూ లేఖ రాశారు. అంతేకాదు గతంలో మీ భర్తలకు ఇలాంటి  లేఖలు రాశాం కానీ వారి నుండి ఎలాంటి స్పందన లేదు మీరైనా కల్పించుకొని వారి మనసు మార్చాలని కోరుకుంటున్నామని లేఖలో పేర్కొన్నారు. మరి వీరైనా వారి మనసు మారుస్తారో లేదో చూడాలి. ఎంతైనా ఇలాంటి స్టార్ యాక్టర్స్ అలాంటి ప్రకటనల్లో నటించే ముందు ఒక్కసారి ఆలోచించుకుంటే బెటర్..

జగనే అతిపెద్ద భూ బకాసురుడు.. జగన్ తప్పా ఇంకెవరూ మిగలరు..

  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విరుచుకుపడ్డారు. జగన్ దేశంలోనే అతిపెద్ద భూ బకాసురుడు అని.. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో భూములున్నాయంటూ ఎవరి పేర్లయితే రాశారో.. వారిలో ఒక్కరికైనా భూములుంటే ప్రజలకు పంచిపెడతామన్నారు. పచ్చకామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు.. జగన్ అవినీతి పరుడు కనుక.. ఆయనకు అందరూ అదేవిధంగా కనపడతారు అన్నారు. ఇలాంటి వార్తలు రాసినందుకు అతనిపై పరువునష్టం దావా వేస్తానని అన్నారు. నవ్యాంధ్ర రాజధాని.. ప్రాంతంలో టీడీపీ నేతలకు భూములున్నాయంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.   మరో మంత్రి నారాయణ కూడా ఈ విషయంమీద జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్ తన సొంత పత్రికలో తన ఇష్టమొచ్చినట్టు రాతలు రాయించారు.. ఆయన చెప్పినట్టు ఎవరికి ఎక్కడ భూములు ఉన్నాయో చెబితే వాటిని పేద ప్రజలకు ఇచ్చేస్తామని అన్నారు. అంతేకాదు ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాను తప్పా.. డబ్బులు ఆశించి కాదు.. నాకూ వ్యాపారాలు ఉన్నాయి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి వైసీపీ జగన్ తప్పా ఇంకెవరూ మిగలరని ఎద్దేవ చేశారు.

చెల్లి కళ్లు పీకి... చెవులు కోసి.. 143 సార్లు పొడిచి చంపిన అక్క..

  రష్యాలో ఒక భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. అక్క సొంత చెల్లిని పొడిచి చంపింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 143 సార్లు పొడిచి పొడిచి చంపింది. రష్యా మోడల్ స్టెఫానియా దుబ్రొవీనా ను ఆమె అక్క ఎలిజా వెటా దుబ్రొవీనాను హత్య చేసింది. వివరాల ప్రకారం..  మోడల్ స్టెఫానియా దుబ్రొవీనా ను ఆమె అక్క ఎలిజా వెటా దుబ్రొవీనా వారి స్నేహితుడైన షోమ్యాన్ స్టాస్ బేర్ స్కీ ఇంటికి వెళ్లారు. అక్కడ వారు ముగ్గురు డ్రగ్స్ తీసుకొని.. మద్యం సేవించి పార్టీ చేసుకున్నారు. అయితే తరువాత బేర్ స్కీ ఏదో కొనడానికి బయటకు వెళ్లగా.. ఏమైందో ఏమో తెలయదు కానీ అతను వచ్చే లోపు ఎలిజా వెటా తన చెల్లిని అత్యంత కిరాతకంగా.. కనుగుడ్లు పీకేసి.. చెవులు కోసేసి.. ఆమెను చంపేసింది. సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. కాగా ఆమె తన చెల్లిపై 143 సార్లు పొడిచి చంపిందని పోలీసులు తెలిపారు.

మైనర్ బాలికపై అత్యాచారం- మతబోధకునికి 40 ఏళ్ల శిక్ష

  మతబోధకుడు అంటే దేవుడి తరువాత దేవుడంతటివాడన్న భావం ఉంటుంది. కానీ కేరళకు చెందిన జేమ్స్ అనే పాస్టర్‌ తన స్థాయిని మరిచి ప్రవర్తించాడు. మైనారటీ కూడా తీరని బాలికలను చెరిచాడు. పాస్టర్‌ మీద ఫిర్యాదు చేయవచ్చునో లేదో అన్న భయంతో బాధితురాలు నోరు విప్పనేలేదు. కానీ, ఆమె చదువుకునే పాఠశాలలో మరో బాలిక కూడా ఇలాంటి అత్యాచారానికే లోను కావడంతో విషయం బయటకు పొక్కింది. పోస్కో చట్టం కింద ఈ కేసుని విచారించిన న్యాయమూర్తి బాధితురాలికి 3 లక్షల నష్టపరిహారంతో పాటుగా, నిందితునికి 40 ఏళ్ల కారాగార శిక్షను కూడా విధించారు. నిందితుని మీద ఇలాంటి ఆరోపణలు మరిన్ని వెలుగులోకి వస్తుండటంతో, మరి వాటికి ఏ శిక్షను విధించనున్నారో!

బీజేపీ నేతలు నోటిని అదుపులో పెట్టేదెప్పుడూ..!

ఈ మధ్య కాలంలో బీజేపీ నేతలకు కాస్త నోటి దురుసుతనం ఎక్కువైన్నట్టు తెలుస్తోంది. అసలే బీజేపీ పార్టీ మీద మత ముద్ర ఎక్కువగా ఉంటుంది. అందునా ఒక పక్క దేశంలో అసంఘటిత చర్యలు ఎక్కువయ్యాయి.. ఇప్పటికే ఒక పక్క జెఎన్ యూ.. మరోపక్క రోహిత్ ఆత్మహత్య ఇలాంటి ఘటనలతో దేశం అట్టుడిపోతుందే.. ఎంతో ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. కానీ అదేమీ లేకుండా.. వాళ్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పార్టీకే సమస్యలు తెచ్చిపెట్టే పరిస్థితి వస్తుంది.  ఈ మధ్యన రాజస్థాన్ కు చెందిన బీజేపీ నేత జేఎన్ యూ విద్యార్థుల వల్ల ఢిల్లీలో సగం అత్యాచారాలు జెఎన్ యూ విద్యార్ధుల వల్లే జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా మరో నేత  సంచలన వ్యాఖ్యలు చేసి దుమారం రేపుతున్నాడు. బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే.. ప్రపంచంలో ఇస్లాం మతం ఉన్నంత కాలం ఉగ్రవాదాన్ని ఎవరూ ఆపలేరని.. భత్కల్ వంటి ప్రదేశాల్లో శాంతిని కాపాడాలంటే ప్రపంచం నుంచి ఇస్లాంను తరిమేయాలంటూ కామెంట్స్ చేశాడు. అంతే దీనిపై ఇప్పుడు ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికైనా పరిస్థితులను గమనించి బీజేపీ నేతలు కాస్త నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిదని భావిస్తున్నారు.

రామ్ గోపాల్ వర్మ వంగవీటి రత్మకుమారి దొరికింది..

  రామ్ గోపాల్ వర్మ తీయబోయే వంగవీటి సినిమాకి సంబంధించి ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలుసుకోవడానికి రాంగోపాల్ వర్మ విజయవాడలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన వంగవీటి మోహన్ రంగా పాత్రకు క్యారక్టర్ ని ఎంపిక చేసి దానికి సంబంధించిన ఫొటోను ప్రకటించారు. ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా భార్య పాత్రకు గాను ఓ బెంగాళి నటి స్మితా పాటిల్ ను ఎంపిక చేసి దానికి సంబంధించిన ఫొటోను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి రంగాగారిని చంపిన తర్వాతే, వంగవీటి రత్నకుమారిగారు వెలుగులోకి వచ్చారు...కానీ ఆ హత్య జరగక ముందు నాకు తెలిసిన రత్నకుమారిగారి జీవితంలో ఆవిడ అనుభవించిన భావోద్వేగాలని అభినయించగలిగే నటి కోసం నేను చాలా చాలా చాలా అన్వేషించాను..చివరికి ఆ కెపాసిటీ నాకు స్మితా పాటిల్ లో కనిపించింది అని అన్నారు.

భవనంపై నుండి కిందపడి విప్రో ఉద్యోగి మృతి.. హత్యా..? ఆత్మహత్యా..?

హైదరాబాద్ లో గచ్చిబౌలి విప్రో కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేసే యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన రాణిమిశ్రా విప్రో కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అయితే తాను ఇందిరా నగర్ లో బాలాజీ హాస్టల్ లో ఉంటుండగా.. ఈరోజు బాలాజీ హాస్టల్ భవనంపై నుండి కిందపడి మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు. దీనిలో భాగంగా రాణిమిశ్రా ఎక్కువగా దైవ చింతనలో ఉండేదని.. ఎప్పుడూ ఒంటరిగా ఉండేదని స్ధానికులు పోలీసులకు తెలిపారు. మరోవైపు రాణిమిశ్రాది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

నేను సిగ్గుపడుతున్నా.. ముద్రగడ మళ్లీ సీరియస్..

  హామీలు నెరవేరక నేను సిగ్గుపడుతున్నాని ముద్రగడ పద్మనాభం అన్నారు. దీక్ష సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడంలేదని..  చంద్రబాబు తనను మోసగించారంటూ.. కాపు రుణాల పేరుతో పసుపు చొక్కాలకే ఇస్తున్నారని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రెండు మూడు రోజుల్లో కాపు నేతలతో సమావేశమయి.. భవిష్యత్ కార్యచరణను రూపొందిస్తామని అన్నారు. అంతేకాదు ముద్రగడను కలిస్తే కేసుల్లో ఇరుక్కుంటారని యువకులను పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. తాను ఏ రాజకీయ పార్టీలో లేనని...  ఏ కులానికీ వ్యతిరేకం కానని చెబుతున్నారు. మొత్తానికి ముద్రగడ సీరియస్ చూస్తుంటే మళ్లీ ఉద్యమానికి తెర తీసేటట్టు కనిపిస్తున్నారు.

టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే మణిగాంధీ.. ఇప్పటికి 8మంది

  వైసీపీ ఎమ్మెల్యే మణిగాంధీ టీడీపీలో చేరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అభివృద్ధి చూసే టీడీపీలో చేరా.. కోడుమూరు అభివృద్ధికి మరింత కృషి చేస్తానని అన్నారు. కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ..మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసే టీడీపీలో చేరుతున్నారు.. ఎవరిని ప్రలోభపెట్టాల్సిన అవసరం లేదు.. ప్రభుత్వాన్ని కూలుస్తానని జగన్ చేసిన వ్యాఖ్యలకు ఈ చేరికలే జవాబు.. ఇంకా ఐదారుగురు నేతలు టీడీపీలో చేరడానికి సిద్దంగా ఉన్నారు.. ప్రతిపక్షం లేకుండా పోతుందని జగన్ భయపడుతున్నారని అన్నారు. కాగా మణిగాంధీతో కలిపి.. ఇప్పటికి 8మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు.

కిరణ్ కుమార్ రెడ్డి వల్లే కాంగ్రెస్ కు దరిద్రం.. వీహెచ్

  కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం వ్యవహారంపై పార్లమెంట్లో దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. కార్తీ చిదంబరం అక్రమ మార్గాల ద్వారా వేలాది కోట్లు సంపాదించారని, ఎయిర్ టెల్-మ్యాక్సిస్ డీల్‌లో నిందితుడైన ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళనలు చేపట్టారు. సభలు ప్రారంభమైన వెంటనే వెల్ లోకి వెళ్లి కార్తీ చిదంబరంపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఇప్పుడు దీనిపై కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతురావు స్పందిస్తూ కార్తీ చిదంబరం వల్లే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారని.. ఆయన వల్లే కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం పదవి దక్కిందని.. ఆయన సీఎం అయిన తర్వాతే కాంగ్రెస్‌కు దరిద్రం పట్టుకుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమే.. దేవినేని

  కేంద్ర మాజీ మంత్రి, బిజెపి నేత పురంధేశ్వరి పోలవరంకు కేవలం రూ.100 కోట్లు రావడానికి ఏపీ ప్రభుత్వమే కారణమని..పట్టిసీమను పోలవరం నిర్మాణ వ్యయంలో ఎందుకు చేర్చారో చెప్పాలని విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను టీడీపీ నేత దేవినేని ఉమ ఖండించారు. పోలవరం ప్రాజెక్టుపై పురంధరేశ్వరీ చేసిన వ్యాఖ్యలు అవాస్తమని.. పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమేనని ఆయన అన్నారు.పోలవరం అథారిటీకి జలవనరుల శాఖ సహకరిస్తుంది.. పోలవరం బడ్జెట్ పై ఉమాభారతితో చంద్రబాబు మాట్లాడారు.. ఈవారంలోపు చంద్రబాబు ఆమెను కలుస్తారు.. పోలవరంను సకాలంలోనే పూర్తిచేస్తామని తెలిపారు.

హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించిన రోజా..

  అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలసిందే. అయితే సస్పెన్షన్ సవాల్ చేస్తూ రోజా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసింది. అయితే దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ వ్యాజ్యాన్ని ఈనెల 9కి వాయిదా వేసింది. ఇప్పుడు దీనికి ప్రశ్నిస్తూ రోజా డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు నుంచి వచ్చిన సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ వాదిస్తూ..  శాసన సభ వ్యవహారాల శాఖ, అసెంబ్లీ కార్యదర్శులు కౌంటర్లు దాఖలు చేయకుండా వాయిదా కోరారని.. కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఏదో ఒక సాకుతో వాయిదా కోరుతున్నారని తెలిపారు. అంతేకాదు.. ఈనెల 5 నుండి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.. ఈ నేపథ్యంలో 9కి వాయిదా వేస్తే పిటిషనర్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం కోల్పోతారని అన్నారు.   దీనిపై ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. గత నెల 17న ఇచ్చిన నోటీసులు అసెంబ్లీ కార్యదర్శికి 24న అందాయని.. వాదనలు చెప్పాలని తనను కోరారని, ఆ విషయాన్నే కోర్టుకు చెప్పి వాయిదా కోరానని తెలిపారు. ఈ వాదనలు విన్న హైకోర్టు సింగిల్‌ జడ్జి ముందున్న కేసు విచారణను 9వ తేదీ కంటే ముందుగానే చేపట్టాలని కోరతామని స్పష్టం చేస్తూ విచార ణను ఈనెల 3వ తేదీకి వాయిదా వేసింది.