బాలకృష్ణ కోరిక తీర్చిన కేసీఆర్..

  నందమూరి బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి ఉన్న కొన్ని సమస్యల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కలిసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అలా విన్నపాలు చేశారో లేదో.. కేసీఆర్ వెంటనే ఆయన కోరికను తీర్చేశారు. దీనిలో భాగంగానే ఆ ఆస్పత్రి నిర్మాణాల్లో బీపీఎస్‌ కింద విధించవలసి ఉన్న 5.73 కోట్ల రూపాయలను మినహాయించేస్తూ ఉత్తర్వులు ఇచ్చేశారు. కాగా ఆ ఆస్పత్రిలో ఇటీవలి కాలంలో సరైన అనుమతులు లేకుండా నిర్మాణాలు, కొత్తబ్లాకులు చేసేశారు. వాటిని రెగ్యులరైజ్‌ చేయడం గురించి కొన్ని నెలల కిందట బాలకృష్ణ ప్రత్యేకంగా వెళ్లి కేసీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో కేశినేని కూతురు

  అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో డెమోక్రాట్ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్.. రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్‌లు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సూపర్ ట్యూజ్ డే ప్రైమరీల్లో వారిద్దరూ తమ తమ పార్లీల్లో భారీ విజయాలు సాధించారు. అధ్యక్ష పదవి అభ్యర్ధిత్వానికి పార్టీ నామినేషన్లు పొందేందుకు తమ తమ పార్టీల్లో ప్రత్యర్ధుల కన్నా చాలా ముందుకు దూసుకొచ్చారు. అయితే ఇప్పుడు హిల్లరీ క్లింటన్ తరుపున ప్రచార బాధ్యతలు చూసుకునే అవకాశం ఓ తెలుగు అమ్మాయికి దక్కడం విశేషం. అది కూడా విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ కూతురు శ్వేత. ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ప్రచార బాధ్యతలు నిర్వహించే బృందంలో శ్వేతను చేర్చుకున్నారు హిల్లరీ క్లింటన్. కేశినేని శ్వేత అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయవాడలో నాని తరపున శ్వేత ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.

తండ్రితో కలిసి కిడ్నాప్‌ డ్రామా ఆడిన యువతి

  స్నాప్‌డీల్ సంస్థలో పనిచేసే దీప్తి అనే యువతి, గత నెల ఒక కిడ్నాప్‌ ప్రమాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే! చివరకు దీప్తిని పీకల్లోతు ప్రేమించిన వ్యక్తే ఆమెను కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నించాడని తెలియడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. ఈ సంఘటనను మరువక ముందే, నోయ్‌డాకు చెందిన శిప్రా మలిక్‌ అనే 29 ఏళ్ల ఫ్యాషన్‌ డిజైనర్‌ కిడ్నాప్ అయిన వార్త సంచలనం సృష్టిస్తోంది . ఈ సోమవారం నుంచి కనిపించకుండా పోయిన శిప్రా నిన్న గుర్‌గావ్ వద్ద క్షేమంగా దొరికింది. ఒక ముగ్గురు వ్యక్తులు తనను నోయ్‌డాలో కిడ్నాప్ చేశారనీ, నాలుగు రోజుల తరువాత వారు గుర్‌గావ్‌ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయాననీ ఆమె చెబుతోంది. కానీ పోలీసులు శిప్రాను విచారించిన ప్రతిసారీ ఒకోరకంగా మాట్లాడుతూ ఉండటంతో, శిప్రా చెబుతున్న విషయాలు ఎంతవరకు నిజమో అని పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో శిప్రాని కిడ్నాప్ చేశారని చెప్పిన సమయం దగ్గరనుంచి ఆమె కదలికలను విచారించిన పోలీసులకు, శిప్రా చెబుతున్నదంతా అబద్ధం అని తేలిపోయింది. శిప్రాను మరోసారి కటువుగా విచారించడంతో తను పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయి ఉన్నాననీ, వాటి నుంచి బయటపడేందుకు ఈ కిడ్నాప్‌ నాటకం ఆడేందుకు ప్రయత్నించాననీ ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ నాలుగు రోజులూ రాజస్థాన్‌లోని ఒక ఆశ్రమంలో తలదాచుకున్నట్లుగా కూడా శిప్రా చెప్పుకొచ్చిందట. శిప్రా ఆడిన ఈ కిడ్నాప్‌ నాటకంలో ఆమె సోదరుడు, తండ్రి కూడా పాలుపంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శిప్రా కనిపించకుండా పోవడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకోవడంతో, ఆమె తన నాటకాన్ని చాలించి తిరిగి వచ్చేసి ఉంటుందని భావిస్తున్నారు.

ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. మే 19 కౌంటింగ్

  కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నసీం జైదీ ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేశారు.  పశ్చిమ్‌బంగాలే, తమిళనాడు, కేరళ, అస్సాం మరియు పుదుచ్చేరికి ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదలైంది. అసోంలో 126, తమిళనాడులో 234, బంగాల్‌లో 294, పుదుచ్చేరిలో 30శాసనసభా స్థానాలకు ఎన్నికల నిర్వహించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. మొత్తం 5 రాష్ట్రాల్లో 1070 మిలియన్ల ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.   అస్సాం అస్సాంలో రెండు దశల్లో ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 4 న మొదటి దశ ఏప్రిల్ 11న రెండో దశ   పశ్చిమ్‌బంగాల్ పశ్చిమ్‌బంగాల్ లో 6దశల్లో ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 4, 11న మొదటి దశ, 17 న రెండో దశ, 21 న మూడో దశ, 23 నాలుగు, 30 ఐదు, మే 5న అఖరి దశ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో మే 16న పోలింగ్ ఐదు రాష్ట్రాల్లో మే 19 న ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది.

77 ఏళ్ల వయస్సులో పది పరీక్షలు.. 47వసారి

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 77 ఏళ్ల నుండి పదో తరగతి పాసవడానికి ప్రయత్నిస్తున్నాడు ఓ వ్యక్తి. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా అది నిజం. ఈ విచిత్రమైన ఘటన రాజస్థాన్ లో జరిగింది. రాజస్థాన్ లోని శివరాజన్ అనే వ్యక్తి 1968లో మొదటిసారి పదో తరగతి పరీక్షలు రాశాడు. అయితే ఆ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. అలా అప్పటినుండి ఇప్పటి వరకూ రాస్తూనే ఉన్నాడు. కానీ రాసిన ప్రతి సంవత్సరం ఏదో ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పదో తరగతి పాసయ్యేంతవరకు పెళ్లి చేసుకోనని పట్టుబట్టాడు. ఇప్పుడు అతనికి 77 ఏళ్లు. ఒంటరిగా ఉంటూ.. ప్రభుత్వం తరఫున వచ్చే పింఛను, గుడిలో పెట్టే ప్రసాదంతో బతికేస్తున్నాడు.. ఈ 77 ఏళ్లలో 46 సార్లు పరీక్షరాశాడు..ఇప్పుడు 47వ సారి పరీక్ష రాయడానికి సిద్దపడుతున్నాడు. దీనికోసం ప్రత్యేకంగా ట్యూషన్‌ కూడా పెట్టించుకున్నాడట. మరి ఇప్పుడైనా తను పరీక్ష పాసవాలని కోరుకుందాం..

భారత్‌కు వచ్చేందుకు తీవ్రవాదులు... సొరంగం తవ్వేశారు

  పాకిస్తాన్‌ నుంచి మన దేశంలోకి ప్రవేశించేందుకు తీవ్రవాదులు చేయని ప్రయత్నమంటూ లేదు. తాజాగా మన దేశంలోకి భారీ ఆయుధాలతో సహా చొరబడేందుకు, తీవ్రవాదులు 90 అడుగు సొరంగాన్ని తవ్విపారేశారు. ఆర్‌.ఎస్‌. పురా సెక్టారులోని సరిహద్దులో పాకిస్తాన్ వైపు నుంచి ఇండియాలోకి వచ్చేందుకు తవ్విన ఈ సొరంగాన్ని సైన్యం కనిపెట్టడంతో, భారీ ముప్పు తప్పింది. త్వరలోనే మొదలయ్యే అమర్‌నాధ్‌ యాత్రలో భారీ విధ్వంసాన్ని సృష్టించే ప్రయత్నాలలో భాగంగానే తీవ్రవాదులు ఈ సొరంగాన్ని తవ్వినట్లు తెలుస్తోంది. భూమికి 10 అడుగుల దిగువున నాలుగడుగుల వెడల్పుతో తవ్విన ఈ సొరంగాన్ని భారత్‌ భూభాగంలోని ‘అల్లాహ్ మాయి దే కోతే’ అనే ప్రదేశంలో కనుగొన్నారు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే భారత సైన్యాధికారులు, తమ తోటి పాకిస్తాన్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ ఎప్పటిలాగే... తమకేమీ తెలియదంట పాకిస్తాన్ సైన్యం నిమ్మకుండిపోయింది!

చక్రి తల్లి, సోదరుడు అరెస్ట్..

దివంగత సినీ సంగీత దర్శకుడు చక్రి ఆస్తిపై గత మూడు రోజులుగా వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. చక్రి భార్య శ్రావణికి.. చక్రి కుటుంబసభ్యులకు ఆస్తి వ్యవహారంలో వివాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చక్రి తల్లి, సోదరుడు మహిత్ నారాయణ్‌ సోమాజిగూడలోని వరుణ్ స్వర్గం విల్లా అపార్ట్‌మెంట్ వద్ద దీక్ష చేపట్టారు. అయితే వీరిని గురువారం రాత్రి 11 గంటలకు పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే తమను అరెస్ట్ చేయడంపై మహిత్ నారాయణ్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్నమమ్మల్ని అరెస్ట్ చేయడం అమానుషం.. దీని వెనుక  ఫ్లాట్ నం. 504ను ఆక్రమించుకున్న అట్లూరి మాధవి హస్తముందని.. ఇంకా ఎవరెవరు ఉన్నారో బయటపెడతానని అన్నారు.

పాకిస్థాన్ ను పొగిడితే ముక్కలుగా నరుకుతా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

  బీజేపీ నేతలు మాత్రం తమ నోటిని ఏ మాత్రం అదుపులో పెట్టుకునే పరిస్థితి కనిపించడంలేదు. ఒకపక్క దేశంలో ఇప్పటికే మతపరమైన ఘటనలు జరుగుతుంటే ఇప్పుడు వారు చేసే వ్యాఖ్యలవల్ల ఇంకా దుమారం రేగుతోంది. తాజాగా వెస్ట్ బెంగాల్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో యువత ఎవరైనా పాకిస్థాన్ జిందాబాద్ అన్నా.. ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా, పాకిస్థాన్‌ను పొగుడుతూ నినాదాలు చేసినా తలలు తీస్తానంటూ..  పై నుంచి కిందకు నిలువునా చీరేస్తాం.. ఆరు అంగుళాల ముక్కల చొప్పున నరుకుతాం అంటూ హెచ్చరించారు. మరి ఈయన చేసిన వ్యాఖ్యలకు ఎంత దుమారం రేగుతుందో చూడాలి.

మీరు టాయిలెట్లు కట్టి ఉంటే అయిపోయేది.. రాహుల్ పై మోడీ

  ప్రధాని నరేంద్ర మోడీ.. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మోడీ మీద విరుచుకుపడిన రాహుల్ గాంధీకి మోడీ నిన్న జరిగిన సభలో బానే చురకలు అంటించారు. కొందరికి వయసు పెరుగుతుంది కాని బుర్ర పెరగదని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడారు. అయితే ఆ సమయంలో సభ నుండి రాహుల్ గాంధీ వెళ్లడానికి ప్రయత్నించగా..  ప్రధాని మోడీ.. ఇది సరైన పద్ధతి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ లోకసభా పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే కూడా చెప్పడంతో రాహుల్ తిరిగి వచ్చి కూర్చున్నారు. అనంతరం మళ్లీ మోడీ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీ తమపై చాలా బాధ్యతలు వదిలేసిందని.. పేద ప్రజలకు చేయాల్సిన చాలా పనులను తమపై వదిలేసిందని.. అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే కనుక టాయిలెట్లు కట్టి ఉంటే మాకు ఆ పని తప్పేదని.. అందరికీ కరెంట్ ఇవ్వకుండా తమకు వేలాది ఇళ్లకు విద్యుత్ ఇచ్చే పనిని అప్పగించారన్నారని విమర్శించారు. దేశం బలహీనంగా ఉన్నట్లు చూపించడం సరికాదని స్వర్గీయ ఇందిరా గాంధీ అన్నారని మోడీ గుర్తు చేశారు. మొత్తానికి మోడీ తన మార్కును మరోసారి చూపిస్తూ.. అటు మాపై బాధ్యత పెట్టారు అంటూనే ఇటు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని మాట్లాడారు.

జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

  దిల్లీ నుంచి ముంబైకి ప్రయాణించిన జెట్‌ ఎయిర్‌వేస్ భారీ ప్రమాదాన్ని తృటిలో తప్పించుకుంది. నిన్న ఈ విమానం ముంబైలో దిగే సమయంలో ల్యాండింగ్‌ గేర్‌ మొరాయించడంతో, ఒక్కసారిగా విమానం రన్‌వే మీదకి ఒరిగిపోయింది. ఈ సమయంలో విమానంలో 127మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ల్యాండింగ్‌ అయ్యే సమయంలో పైలట్‌ ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా తమ ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవన్న ఊహ ప్రయాణికులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. విమానం రన్‌వే మీద అదుపుతప్పే సమయంలో దగ్గరలో మరో విమానం లేకపోవడం వల్లగానీ, ఎలాంటి షార్ట్ సర్క్యూట్ ఏర్పడకపోవడం వల్లగానీ... పెను ముప్పు తప్పినట్లు భావిస్తున్నారు. విమానం కుప్పకూలిన చోట నుంచి ఒక్క అంగుళం కూడా మరి కదిలేందుకు మొరాయించడంతో... ముంబై విమానాశ్రయ అధికారులు ప్రత్యామ్నాయ రన్‌వేలను ఉపయోగిస్తున్నారు.

రేపటినుండే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..

  ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటినుండి ప్రారంభంకానున్నాయి. దీనిపై అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ.. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమయ్యే సమావేశాల్లో మొదట గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారని అన్నారు. అంతేకాదు గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలకుండా విపక్ష సభ్యులు సంయమనం పాటించాలని కోరారు. ఈ సమావేశాలు 18 రోజులు జరగుతాయని.. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పదో తేదీన వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను సమర్పిస్తారని కోడెల అన్నారు. కాగా ఏపీ, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెలలోనే జరగనున్న నేపథ్యంలో నగరంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నారు.

బట్టలు ఉతకనందుకు మెమో

  ప్రభుత్వం రంగంలో ఉండే ఉన్నతాధికారులు, తమ సహాయకుల చేత నానాచాకిరీ చేయించుకుంటారన్న విషయం బహిరంగ రహస్యమే! ఈ విషయం మీద ఎన్ని విమర్శలు వినిపిస్తూనే ఉన్నా, జరిగే పని జరుగుతూనే ఉంది. కానీ ఏకంగా తన బట్టలు సరిగా ఉతకడం లేదంటూ ఓ జడ్జిగారు తన సహాయకురాలికి మెమో ఇచ్చిన వార్త ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది. ‘నా ఇంట్లో బట్టలను, ముఖ్యంగా లోదుస్తులను సరిగా ఉతకడం లేదంటూ, ఇదేంటని ప్రశ్నించిన నా భార్యకి అమర్యాదగా బదులిచ్చినందుకు... నీ మీద ఎలాంటి క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోకూడదో ఏడు రోజులలోగా బదులు ఇవ్వాలి’ అంటూ డి.సెల్వం అనే సదరు జడ్జిగారు, వసంతి అనే సదరు సహాయకురాలికి ఘాటుగా ఓ శ్రీముఖాన్ని జారీచేశారు. ఈ మెమోని చూసి భయపడిపోయిన వసంతి ‘తప్పు జరిగినందుకు మన్నించమనీ, మున్ముందు ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతాననీ’ వివరణను అందించారు. కాకపోతే ఈ మెమో కబురు కాస్తా బయటకు పొక్కడంతో, ఉద్యోగ సంఘాలు ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయించే ప్రయత్నంలో ఉన్నాయి.

సూరీడుతో జగన్ చెక్ పెట్టనున్నారా..?

  దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి సూరీడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో వీరిద్దరి భేటీపై రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. వైఎస్ కు అత్యంత ముఖ్య అనుచరుడు అయిన సూరీడు చంద్రబాబును కలవడంలో ఆంతర్యం ఏమిటా అని అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.   సూరీడు.. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సూరీడు ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నారు. పార్టీలో ఉన్న అందరి నేతల కంటే రాజశేఖర్ రెడ్డికి సూరీడు నమ్మిన బంటులా ఉండేవాడు.. అంతేకాదు వైఎస్ దగ్గర ఏదైనా పనులు కావాల్సి వస్తే సూరీడుని కలిస్తే చాలు అయిపోతుంది అనే నమ్మకం కలిగిన వ్యక్తి. అయితే వైఎస్ మరణానంతరం మాత్రం సూరీడు రాజకీయాలకు దూరంగా జగన్ కు కూడా కాస్త దూరంగానే ఉంటూ వచ్చారు. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈయన చంద్రబాబును కలవడంపై ఏపీ రాజకీయాలు వేడెక్కాయి.   అయితే సూరీడు తన వ్యక్తిగత పనుల మీద చంద్రబాబును కలవడానికి వచ్చారా..? లేక జగన్ టీడీపీ నేతలపై అమరావతి భూములు కొన్నారని ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. జగన్ గురించి ఏదైనా సమాచారం తెలుసుకునేందుకు టీడీపీనే సూరీడును పిలిపించిందా..? సూరీడు ద్వారా జగన్‌కు చెక్ పెట్టే ఆలోచన చేస్తున్నారా? అని చర్చ సాగుతోంది. మరి ఎందుకు కలిశారో ఇద్దరిలో ఒక్కరైనా నోరు విప్పితేనే తెలుస్తోంది.

జైలు జీవితంపై బుక్ రాస్తా.. కన్హయ్య కుమార్

జేఎన్యూ విద్యార్ధి సంఘ నేత కన్హయ్య కుమార్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తీహార్ జైలు నుండి కన్హయ్య బయటకు వచ్చారు. అయితే కన్హయ్య బయటకు వచ్చిన నేపథ్యంలో క్యాంపస్లో ఒక పక్క సంబరాలు జరుపుకుంటుంటే.. మరోపక్క ఏబీవీపీ సంఘ నేతలు మాత్రం వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కన్హయ్య మాట్లాడుతూ.. తనపై ఎన్ని కేసులు పెట్టిన బయపడేది లేదని, జెఎన్‌యు విద్యార్థి ఉద్యమ వారసత్వం తనకు అట్లాంటి ధైర్యాన్ని ఇచ్చిందని అన్నారు. అంతేకాదు.. నేను ఎలాంటి దేశ వ్యతిరేక నినాదాలు చేయలేదు.. ఏబీవీపీ నేతలు కావాలనే అలాంటి వీడియోలు స్పంష్టించారని ఆరోపించారు.   అంతేకాదు ఈ సందర్భంగా కన్హయ్య ప్రధాని మోడీ గురించి కూడా ప్రస్తావించి.. చిన్న, చిన్న ఘటనలతో పూర్తిగా జెఎన్‌యునే మూసివేసే కుట్ర జరిగిందని, ప్రభుత్వ కుట్రలను విద్యార్థులు, ప్రొఫెసర్లు అడ్డుకున్నారని.. ఇందిరా గాంధీ లాంటి వారే జెఎన్‌యు వద్ద తల దించుకున్నారనీ మోడీ ఆ రూచి చూసే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. ఇక జైలు జీవితంపై బుక్ కూడా రాస్తానని కన్హయ్య చెప్పారు.

చంద్రబాబు.. మాట మీరు తప్పారా..? నేనా..?

కాపు సంఘ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం మరిచిపోయింది.. అదే విషయాన్ని నేను ప్రశ్నించినందుకు నన్ను ఓ దొంగ, ద్రోహీ అని టీడీపీ నేతలతో తిట్టించారు అని అన్నారు. నాపై వ్యతిరేకంగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు.. చంద్రబాబు.. మాట మీరు తప్పారా..? నేను తప్పానా..?.. కాపు డిమాండ్లను అవహేళన సమంజసమేనా.. అధికారంలో ఉన్నవాళ్లు అబద్దాలు చెబితే నిజమైపోతాయా అంటూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈనెల 10 వ తేదీలోపు ఇచ్చిన హామీలపై స్పష్టత ఇవ్వాలి లేదంటే 11వ తేదీన దీక్ష చేపడతాం అని చెప్పారు.  

మరోసారి పవన్ ను టార్గెట్ చేసిన రోజా..!

వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రతిపక్షాలపై విరుచుకుపడటంలో దిట్ట. ఆ విషయం ఇప్పటికి ఎన్నోసార్లు రుజువైంది. అయితే ఏపీ అధికార పార్టీపైన ఆ నేతలపైన విమర్శలు చేసే రోజా.. అప్పుడప్పుడు జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేస్తుంటారు. గతంలో ప్రత్యేక హోదాపైన.. అమరావతి భూముల మీద పవన్ కళ్యాణ్ మాట్లాడాలి అంటూ డిమాండ్ చేసేవారు. ఇప్పుడు మరోసారి భూ దందా వ్యవహారంలోకి పవన్ కళ్యాణ్ ను లాగారు. అమరావతిలో తెలుగుదేశం పార్టీ నేతల భూదందాపై పోరాడాలని..  ప్రశ్నించే తత్వం ఉన్న పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై నోరుమెదపాలని.. అసలు గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను చూసే ప్రజలు చంద్రబాబుకు ఓటు వేశారని అన్నారు. మొత్తానికి రోజా మాత్రం ఏదో ఒక విషయంపై పవన్ ను టార్గెట్ చేస్తూనే ఉంటారు. మరి ఈ విషయంపై పవన్ స్పందిస్తారో లేదో చూడాలి..