జగన్ పై గోరంట్ల కామెంట్స్.. కుర్రవాడైన జగన్ కు అర్ధం కావడంలేదు..

  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ముఖ్యంగా రాజధాని భూదందాపై ఇరు పార్టీల వాగ్వాదాలతో సభ దద్దరిల్లిపోతుంది. భూదందాపై జగన్ చేసిన ఆరోపణలకు టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ జగన్ పై విరుచుకుపడ్డారు. మన సభకు కొన్ని రూల్స్ ఉన్నాయంటూ.. మన దురదృష్టం ఏంటంటే.. ఈ విషయం కుర్రవాడైన జగన్ కు అర్ధం కావడంలేదు.. రెండేళ్ల నుండి ఉంటున్నాడు.. ఈ కుర్రాడికి జ్ఞానోదయం కావడంలేదు అని వ్యాఖ్యానించారు. అయితే గోరంట్లు వ్యాఖ్యానిస్తుండగా.. స్పీకర్ అతని మైక్ కట్ చేసి సీనియర్ సభ్యుడైన మీరు అలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. అనంతరం ఆయన ప్రసంగం కొనసాగిస్తూ.. తమపై చేసిన ఆరోపణలు నిరూపించాలని... చంద్రబాబు సవాల్ కి కనుక కట్టుబడినట్టయితే ఆరోపణలు నిరూపించాలి.. లేకపోతే క్షమాపణలన్నా చెప్పాలని డిమాండ్ చేశారు.

జగన్, చంద్రబాబు.. సవాళ్ల మీద సవాళ్లు..

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార పక్ష, ప్రతి పక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ నవ్యాంధ్ర రాజధాని భూదందా ఆరోపణలపై రెండు పక్షాల మధ్య వాగ్వాదాలు తలెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రతిపక్షనేత జగన్ సవాళ్లు మీద సవాళ్లు విసురుకుంటున్నారు. మంత్రులపై చేసిన ఆరోపణలు నిరూపించిన తరువాతే సభ జరుగుతుందని.. ఆరోపణలు నిరూపించాలని.. చంద్రబాబు జగన్ కు సవాల్ విసిరారు. దీనికి జగన్ రాజధానిలో భూదందాపై సీబీఐ విచారణకు సిద్దమా అంటూ ప్రతి సవాల్ విసిరారు. అంతేకాదు చంద్రబాబే ఇన్ సైడ్ ట్రేడింగ్ .. దీనిపై సీబీఐ ఇంక్వైరీ చేయించాలి అని అన్నారు. దీనికి చంద్రబాబు ఇందులో ఇన్ సైడ్ ట్రేడింగ్ ఏముందో నాకు అర్ధంకావడం లేదు.. ల్యాండ్ పూలింగ్ ఇన్ సైడ్ ట్రేడింగ్ ఎలా అవుతుంది.. రైతులు స్వచ్చందంగానే భూములు ఇచ్చారని అన్నారు.

విజయ ఢంకా మోగించిన టీఆర్ఎస్.. ఇదే రిపీట్ అవుతుందంటున్న కవిత

  తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ పలు ఎన్నికల్లో ఇప్పటికే విజయ ఢంకా మోగించింది. ఈరోజు వెలువడిన వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లో కూడా కారు జోరు సాగించింది. దీంతో టీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక దీనిపై కేసీఆర్ కూతురు.. ఎంపీ కవిత మాట్లాడుతూ.. ఇంతటి ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ అభివృద్ధి చూసే ప్రజలు తమను ఎన్నుకుంటున్నారని.. కేసీఆర్ చేపట్టిన పనులను ప్రజలు అభినందిస్తున్నారని.. దాని ఫలితాలే ఎన్నికల్లో గెలుపులు అని అన్నారు. ఎప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగినా ఇదే రిపీట్ అవుద్దని.. 2019 ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ దే గెలుపని జోస్యం చెప్పారు. మరి ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కవిత చెప్పింది నిజమే అవుతుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదనిపిస్తుంది.

అధికార పార్టీపై జగన్ ప్రశ్నలు..

  అసెంబ్లీలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అధికార పక్షంపై ప్రశ్నలు వర్షం కురిపించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోయి ఇప్పటికి రెండేళ్లు అవుతోంది..విభజన హామీలను నెరవేర్చలేకపోతున్నారు.. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ తీసుకొస్తామన్నారు.. ప్రత్యేక హోదా ఇస్తామని ఇప్పటి వరకూ ఇవ్వలేదు అని ఆరోపించారు. ఇక్కడ బీద ఏడుపులు ఏడ్చే చంద్రబాబు.. ఢిల్లీలో గొప్పలు పలుకుతారు.. హామీల అమలుపై బాబు కేంద్రంపై ఎందుకు పోరాడటంలేదు.. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా.. ఇప్పటివరకూ ఒక్క ఐటీ కంపెనీ కూడా తీసుకురాలేకపోయారు.. రైల్వేజోన్, స్టీల్ ప్లాంట్ హామీలను కూడా నిలబెట్టుకోలేకపోయారు.. ఇప్పటి వరకూ పోలవరం పనులు ప్రారంభంకాలేదని అన్నారు. ఇక జగన్ ఆరోపణలపై అధికార పక్షం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ధరఖాస్తులు.. జయలలిత ఇంటర్వ్యూ

  ఉద్యోగం కోసం ఇంటర్య్వూలు విన్నాం.. అలాంటిది ఇప్పుడు పార్టీలో పోటీ చేయడానికి కూడా ఇంటర్య్వూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదలైన సంగతి తెలసింది. ఈ నేపథ్యంలో అన్నా డిఎంకె పార్టీ తరుపున పోటీచేయడానికి రద్దీ తీవ్ర స్థాయిలో పెరిగింది. దీంతో పార్టీ నాయకత్వం అధినేత జయలలిత ధరఖాస్తు చేసుకున్నవారందరికీ ఇంటర్వ్యూ చేశారట. కాగా తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిత్వానికి జయ జనవరిలోనే దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. జనవరి 20 నుండి ప్రారంభమైన ఈ దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 6న ముగిసింది. దాదాపు 26 వేల మందికి పైగా దరఖాస్తులను పంపారని పార్టీ నాయకత్వం తన ప్రకటనలో తెలిపింది.

కారులో హెల్మెట్‌ పెట్టుకోనందుకు జరిమానా!

  బండితోలేవారు హెల్మెట్‌ పెట్టుకోకపోవడం నేరం. మరి కారు నడిపేవారు కూడా హెల్మెట్ ధరించి వెళ్లాలంటే ఎలా! అదంతా మాకు అనవసరం అంటున్నారు బెంగళూరు పోలీసులు. హెల్మెట్‌ ధరించకుండా కారుని నడిపినందుకుగాను 100 రూపాలయ జరిమానా చెల్లించవలసిందిగా ఎమ్‌.ఎస్.పాటిల్‌ అనే వ్యక్తికి చలాను పంపారు. ఇదేదో పొరపాటుగా చేసిందనుకోవడానికి లేదు. ఎందుకంటే కొన్నాళ్ల క్రితమే ఆ రాష్ట్ర బీజేపీ నేత ప్రకాష్‌కు కూడా ఇలాంటి ఒక చలాను పంపారు. ‘ఫలానా రోజున మీ డ్రైవరు కాలు తోలుతుండగా, మీరు పక్కనే కూర్చుని ఉన్నారనీ, అయితే మీరు ఆ సమయంలో హెల్మెట్ ధరించి లేరనీ, అందుకుగాను 100 రూపాయల జరిమానా చెల్లించమనీ...’ ప్రకాష్‌గారికి అందిన తాఖీదులో ఉంది. కారు నడిపేటప్పుడే హెల్మెట్టే దండుగ అయితే, కారులో కూర్చున్నవారు కూడా దాన్ని ధరించాలి అంటే ఏం చేసేది అంటూ బెంగళూరు వాసులు తలలు పట్టుకుంటున్నారు. బెంగళూరు ట్రాఫిక్‌ అధికారులు మాత్రం ఇలాంటి చిన్నాచితకా పొరపాట్లు సహజమే కాబట్టి, వచ్చి వివరణ ఇచ్చుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. అంటే! పోలీసులు తప్పు చేసినా కూడా జనాలు వెళ్లి వివరణ ఇచ్చుకోవాలన్నమాట.

రాహుల్ కు జైట్లీ చురక.. ఆ బిల్లు కూడా పాస్ చేసి క్రెడిట్ తీసుకోండి..

కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఈపీఎఫ్ పై పన్ను విధింపును ఉపసంహరణ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించి.. తన వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని.. తన ఒత్తిడి వల్లే వెనక్కి తగ్గారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ఈపీఎఫ్ పన్ను వెనక్కు తీసుకోవడం తన ఘనతగా రాహల్.. సోనియా చెప్పుకుంటున్నారు.. అలాగే ఎన్నో రోజుల నుండి పెండింగ్ లో ఉన్న జీఎస్టీ బిల్లును కూడా పాస్ చేయించి ఆఘనతను తన ఖాతాలో వేసుకోవచ్చు అని కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు పార్లమెంటును సవ్యంగా సాగేలా చేస్తే ఇంకా ఎన్నో బిల్లులు ఆమోదం పొందుతాయి.. అప్పుడు వాటి క్రెడిట్ కూడా రాహుల్ గారి ఖాతాలో వేస్తాం.. అందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని వ్యాఖ్యానించారు.

మంత్రాలయంలో ఇవాళ ఓ ప్రపంచ రికార్డు

  మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి మఠం నేడు ఒక అరుదైన ఘట్టానికి తెరతీయనుంది. ఆరు రాష్ట్రాల నుంచి వచ్చిన 1800 మంది గాయకులు ఇక్కడ ఓ ప్రపంచ రికార్డుని నెలకొల్పనున్నారు. వీరంతా కూడా కన్నడ భాషలో ఉన్న 108 భక్తి గాతాలు పాడబోతున్నారు. ఈ భక్తి గీతాలన్నీ కూడా ఆంజనేయస్వామికి సంబంధించినవేనట. ఈ పాటలను పాడే గాయకులు అందరూ కూడా వేర్వేరు మాతృభాషలు కలిగినవారనీ, అయినా కూడా సంగీతం మీద ఉన్న అభిమానంతో వీరు కన్నడలో ఉన్న భక్తి గీతాలను నేర్చుకుని పాడనున్నారనీ కార్యక్రమ నిర్వాహకులు పేర్కొన్నారు. ఒకేసారి ఇంతమంది గాయకులు ఇన్నేసి గీతాలను పాడటం అరుదు కాబట్టి ఈ ఘట్టాన్ని ‘తెలుగు బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌’లో నమోదుచేయనున్నారు.

కాంట్రాక్టర్ కు బెదిరింపులు.. చిక్కుల్లో కేసీఆర్..

  ఏపీలోని అధికార పార్టీ నేతలు చేసే చిన్న చిన్న పనులు వల్ల అప్పుడప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు బుక్ అవుతుంటారు. ఆ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కొంచం బెటర్. ఒకవేళ ఎప్పుడైన ఏదైనా జరిగినప్పుడు స్వయంగా కేసీఆరే వెంటనే రియాక్ట్ అయి.. రంగంలోకి దిగి దాని సెట్ చేసేస్తుంటారు. అయితే ఈ సారి మాత్రం కేసీఆర్ కు వేణుగోపాలాచారి రూపంలో ఇబ్బంది వచ్చేలా కనిపిస్తోంది. ఇంతకీ వేణుగోపాలచారి ఎవరనుకుంటున్నారా.. ఢిల్లీలో టీఆర్ ఎస్ పార్టీకి.. మరి ముఖ్యంగా కేసీఆర్ కు సంబంధించిన వ్యవహారాలు చక్కబెట్టే వ్యక్తిగా వేణుగోపాలాచారి వ్యవహరిస్తున్నారు.   అయితే ఇప్పుడు వేణుగోపాలాచారి పై ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడం.. తానే స్వయంగా మీడియాను ఆశ్రయించి తన సమస్యను చెప్పడంతో అసలు కథ బయటపడింది. కాంట్రాక్టర్ రవీంద్ర హైదరాబాద్ లోని ఏఎస్ రావు నగర్ లో మోడల్ మార్కెట్ నిర్మాణం చేపట్టగా.. ఈ నిర్మాణం నేపథ్యంలో వేణుగోపాలాచారి నుంచి బెదిరింపులు వస్తున్నట్లుగా తెలిపాడు. అంతేకాదు.. పనుల్ని తక్షణమే ఆపేయాలని.. లేదంటే తానే స్వయంగా వచ్చి కూల్చేస్తానంటూ బెదిరిస్తున్నారని చెప్పాడు. తాను టెండర్ ను వదులుకోవటానికి సిద్ధమేనని.. కాకుంటే ఈ పని కోసం తాను రూ.6లక్షలు ఖర్చు చేశానని.. ఆ మొత్తాన్ని తిరిగి ఇప్పిస్తే చాలని చెప్పటం సంచలనంగా మారింది.   దీంతో ఇప్పుడు రవీంద్ర చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. నేతలను ఎప్పటికప్పుడు కట్టుదిట్టంలో పెట్టే కేసీఆర్.. వేణుగోపాలచారి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అన్న అనుమానాలు వ్యక్తంమవుతున్నాయి.

నిప్పుల మీద నడక- 70మందికి తీవ్రగాయాలు

  కొందరు భక్తులు కణకణ మండే బొగ్గుల మీద నడవడం చూస్తూనే ఉంటాం. బొగ్గు మీద పేరుకున్న బూడిద పొర వలన, మంటలు ఆరిన తరువాత బొగ్గులో ఉన్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోవడం వలనా.... వాటి మీద నడిచే వారికి పెద్దగా ప్రమాదం ఉండదని హేతువాదులు చెబుతూ ఉంటారు. కానీ ఆస్తికులు మాత్రం తమ విశ్వాసం వల్లే కాళ్లు కాలకుండా బొగ్గుల మీద నడవగలం అని వాదిస్తారు. వీరిలో ఎవరి వాదన నిజమైనా కానీ... అజాగ్రత్తగా ఉంటే ఎంతటి భక్తిపరులకైనా ప్రమాదం తప్పదని ఓ ఉదంతం తెలియచేస్తోంది. కర్ణాటకలోని హేథెనహెళ్లి అనే గ్రామంలో ఆదిశక్తి మారమ్మ అనే దేవతకి సంబంధించిన జాతర జరుగుతోంది. ఈ జాతరలో భాగంగా నిన్న భక్తుల కోసం ఒక నిప్పుల గుండాన్ని ఏర్పాటు చేశారు. 20 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు ఉన్న ఈ గుండాన్ని దాటేందుకు వందల సంఖ్యలో భక్తులు సిద్ధపడిపోయారు. అయితే  నిప్పుల గుండాన్ని దాటాలన్న తొందరలో ఒకరినొకరు తోసుకోవడంతో ప్రమాదం సంభవించింది. తోపులాటలో ఒకరి మీద ఒకరు పడిపోవడంతో, 70 మందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. వీరిలో కొందరికి శరీరంలో 30 శాతందాకా కాలిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. జాతరకు వేలాదిమంది భక్తులు తరలివస్తారని తెలిసినా... స్థానిక యంత్రాంగం కానీ, ఆలయ సిబ్బంది కానీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఎప్పటిలాగే ఈ ఉదంతం మీద విచారణకు ఆదేశించింది.

రైతు రుణమాఫీలపై జగన్.. అడిగే అర్హత లేదంటున్న మంత్రి

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమైంది. సభ మొదలైన వెంటనే స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్బంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రైతుల రుణమాఫీల గురించి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రుణమాఫీ పై ప్రభుత్వం అబద్దాలు చెబుతోంది... ప్రభుత్వం మాటలు నమ్మి రైతులు రుణాలు కట్టడం మానేశారు.. ఎన్నికల ముందు ఏం చెప్పారు... అమలు చేస్తున్నదేమిటి.. వడ్డీ చెల్లించనందుకు 18 శాతం ఫైన్ కట్టాల్సివస్తుంది అని అన్నారు. దీంతో జగన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి ప్రత్తిపాటి స్పందించి.. రుణమాఫీల గురించి వైసీపీకి మాట్లాడే అర్హత లేదని అన్నారు.  

మరోసారి దగ్గరవుతున్న కోహ్లీ, అనుష్కశర్మ..

  టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు జరిపిన ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పనవసంలేదు. ఆ మధ్య ఎక్కడ చూసినా వీరిద్దరి మీద వార్తలే.. కానీ ఈ మధ్య వీరిద్దరు కాస్త దూరంగా ఉంటున్న సంగతి కూడా విదితమే. కానీ ఇన్ని రోజులు దూరంగా ఉన్న ఈ జంట మళ్లీ దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు జరుపుతన్నారట. ఇప్పటికే విరాట్ కోహ్లీ తన గుండె పగిలిపోయింది.. అంటూ చాలా బాధగా ఉన్న ఫొటో ఒకటి ట్విట్టర్లో పోస్ట్ చేసి అనుష్కను వీడి ఉండలేకపోతున్నా అని ఇన్ డైరెక్ట్ గా చెప్పారు. అయితే ఇప్పుడు అనుష్క కూడా కోహ్లీకి దూరంగా ఉండలేకపోతుందో ఏమో.. టైం కోసం వైయిట్ చేసిందేమో.. అందుకే ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో భారత్‌ను గెలిపించిన కోహ్లీకి అనుష్క ఫోన్ చేసి అభినందనలు తెలిపింది. ఇక ఆ రోజు చాలా సేపు మాట్లాడుకున్న వారు.. ఒకసారి కలవాలని కూడా అనుకుంటున్నారట. దీంతో అనుష్క ప్రస్తుతం తను నటిస్తున్న సుల్తాన్ సినిమా షూటింగ్ కు మూడు రోజులు విరామం ఇచ్చి మరీ కలవనుందట. మొత్తానికి దూరమైన జంట మరోసారి ఒకటవుతున్నారు. మళ్లీ ఎన్ని రోజులు కలిసి ఉంటారో చూడాలి..

వరంగల్.. ఖమ్మంలో కారు జోరు.. టీఆర్ఎస్ నేతల సంబరాలు

  వరంగల్ కార్పోరేషన్లో ఇప్పటివరకూ  25 డివిజన్లలో ఫలితాలు వెల్లడైనాయి. * 20 డివిజన్లలో టీఆర్ఎస్ గెలుపు * ఒక్క స్థానంలో గెలుచుకున్న కాంగ్రెస్ * ఒక్క స్థానంలో గెలుచుకున్న సీపీఏం * 3 స్థానాలు గెలుచుకున్న ఇండిపెండెంట్లు ఖమ్మం కార్పోరేషన్లో ఇప్పటివరకూ 30 డివిజన్లలో ఫలితాలు వెల్లడైనాయి * 24డివిజన్లలో టీఆర్ఎస్ గెలుపు * ఒక స్థానంలో వైసీపీ, ఒక స్థానంలో సీపీఎం గెలుపు * నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఇదిలా ఉండగా అటు ఖమ్మంలోనూ.. ఇటు వరంగల్ లోనూ కారు జోరు మీద దూసుకుపోతుండగా..ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు.

వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ల ఓట్ల లెక్కింపు... అచ్చంపేటలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్

  గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లు అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల లెక్కింపు ఈ రోజు కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు ఎన్నికల ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా వరంగల్‌లో 58, ఖమ్మంలో 50 కార్పోరేషన్లు ఉన్నాయి. అచ్చంపేటలో 20 వార్డులు ఉన్నాయి.   ఇదిలా ఉండగా మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అచ్చంపేటలో మొత్తం 20 వార్డులు ఉండగా అన్నీ ఆ పార్టీకే దక్కాయి. ప్రతిపక్షాలన్నీ కలిపి మహాకూటమిగా పోటీ చేసినా ఒక్క వార్డులో కూడా గెలవలేకపోయాయి.

తన సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ సుప్రీంకు రోజా...

  వైసీపీ ఎమ్మెల్యే రోజా తనపై విధించిన సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలో ఆమె హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో.. ఆమె హైకోర్టులోని సింగిల్ బెంచ్‌ను ఆశ్రయించారు. అయితే దీనిపై ఈ నెల 8వ తేదీన వాదనలు వింటామని సింగిల్ బెంచ్ చెప్పింది. దీంతో వాదనలు విన్న సింగిల్ బెంచ్ హైకోర్టు అసెంబ్లీ కార్యదర్శిని కౌంటర్ పిటిషన్‌కు ఆదేశించింది. దీనిపై అసెంబ్లీ కార్యదర్శి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీతో సమావేశమై, హైకోర్టుకు నివేదిక అందించారు. దీనిపై బుధవారం కేసు తీర్పు వెల్లడి కానుంది. కాగా మార్చి 5 నుంచి ఆంధ్రప్రదేశ్ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ సస్పెన్షన్ కారణంగా ఎమ్మెల్యే రోజాను అనుమతించడం లేదు. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

బైక్ నడుపుకుంటూ పార్లమెంట్ కు వచ్చిన మహిళా ఎంపీ...

ఈ రోజు మహిళా దినోత్సవం సందర్బంగా ఈ రోజు పార్లమెంట్లో మహిళా ఎంపీలకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలువు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళా ఎంపీలు అందరూ పార్లమెంటుకు హాజరయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మహిళా ఎంపీ మాత్రం వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్నారు. బిహార్ ఎంపీ రంజీత్ రంజన్ హార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై వచ్చి అందరూ అవాక్కయ్యేలా చేశారు. మహిళలు ప్రతి అంశంలోనూ ముందంజలో ఉన్నారన్న విషయాన్ని ఆమె మరోసారి రుజువు చేశారు. కాగా బీహార్‌లోని రంజీత్ రంజన్‌ సుపౌల్ నియోజకవర్గానికి చెందిన వారు. ఆమె భర్త పప్పూ యాదవ్ కూడా ఎంపీనే.