ఐఫోన్ కోసం పసికందుని అమ్మిన తండ్రి
ఐఫోన్ కొనుక్కునేందుకు డబ్బుల్లేక కిడ్నీలు అమ్ముకున్న వార్తలు విన్నాము, రక్తాన్ని అమ్ముకున్న విషయాలు చదివాము. కానీ ఐఫోన్ పిచ్చిలో పడి కన్నకూతురినే అమ్ముకున్న ఓ వార్త ఒకటి ఇప్పడు సంచలనం సృష్టిస్తోంది. చైనాలోని ఫుజియాన్ అనే ప్రాంతానికి చెందిన ఒక 19 ఏళ్ల వ్యక్తి... మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఐఫోను, బండి కొనుక్కునేందుకు తన 18 రోజుల పాపను దాదాపు రెండు లక్షలరూపాయలకు అమ్మేశాడట.
ఈ అమ్మకం ఆన్‌లైన్లోనే జరిగినప్పటికీ అటుతిరిగీ ఇటుతిరిగీ విషయం పోలీసుల వరకూ చేరడంతో, పాప తల్లిదండ్రులిద్దరినీ అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. కేసుని విచారించిన సదరు న్యాయమూర్తికి చిరాకేసి తండ్రికి మూడు సంవత్సరాలు, తల్లికి రెండున్నర సంవత్సరాల కారాగార శిక్షను విధించాడు. ఇంత జరిగినా పసిపాప తల్లి పెద్దగా బాధపడకపోవడం పోలీసుకు సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘పిల్లల్ని పెంపకం కోసం ఎవరికో ఒకరికి ఇవ్వడంలో తప్పులేదనీ, అది చట్టవ్యతిరేకం అని తనకు తెలియదనీ’ సదరు మాతృమూర్తి పేర్కొంటో్ందట. కలికాలం!