కొరియాను కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు
ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య యుద్ధ వాతావరణం చిక్కబడుతోంది. ఈ ఏడాది మొదట్లో ఉత్తర కొరియా అణ్వాస్త్రాన్ని పరీక్షించడంతో మొదలైన ఈ ఉద్రక్తత ఇప్పుడు తారస్థాయికి చేరుకుంది. ఉత్తర కొరియా దూకుడుని తగ్గించేందుకు ఐక్యరాజ్య సమితి పలు ఆంక్షలను విధించినప్పటికీ, వాటిని లెక్కచేయకుండా ఆ దేశ నియంత కిమ్ జోంగ్ మరిన్ని సవాళ్లకు సిద్ధపడుతున్నారు. తరచూ పలు క్షిపణులను పరీక్షించడమే కాకుండా, ఆ క్షిపణులకి అణ్వాస్త్రాలను మోసుకుపోయే శక్తి కూడా ఉందంటూ కవ్విస్తున్నారు.
దాంతో దక్షిణ కొరియాకు మిత్రరాజ్యమైన అమెరికా రంగంలోకి దిగింది. తన యుద్ధ విమానాలు కొన్నింటిని ఇప్పటికే దక్షిణ కొరియాకు పంపింది అమెరికా. ఆ ప్రాంతంలో ఇరు దేశాల బలాన్ని చాటేందుకు ఇప్పడు దక్షిణ కొరియా తీరంలో తన నౌకలను కూడా మోహరించింది. ఈ నౌకలు మరో రెండు నెలల పాటు దక్షిణ కొరియా తీరంలో కవాతుని నిర్వహించనున్నట్లు సమాచారం. మరోవైపు ఉత్తరకొరియా కూడా తాను యుద్ధానికి సదా సిద్ధం అంటోంది. తమ నేత కిమ్ జోంగ్ ఆదేశాలివ్వడమే ఆలస్యం, ప్రత్యర్థుల మీద విరుచుకుపడిపోతామని ఆ దేశ సైన్యాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తమ అణ్వాయుధాలన్నీ ప్రయోగానికి సిద్ధంగా ఉన్నాయనీ, ఏ క్షణంలోనైనా వాటిని ఉపయోగిస్తామని అంటున్నారు.