ప్రియుడిని చంపిన ప్రియురాలు.. గుండె బయటకి తీసి మరీ..

నిజాలు వినడానికి బానే ఉంటాయి. కానీ ఒక్కోసారి.. కొన్ని నిజాలు వింటే మాత్రం భయపడాల్సి వస్తుంది. అలాంటిదే బంగ్లాదేశ్ లో జరిగింది. ఓ యువతి కోర్టుకు చెప్పిన నిజం విని జడ్జి, న్యాయమూర్తులుతో సహా అక్కడున్న వారందరూ ఖంగుతిన్నారు. అసలు సంగతేంటంటే.. బంగ్లాదేశ్‌కు చెందిన ఫతేమా అఖ్తర్ సొనాలీ (21) అనే యువతి షిపాన్ (28) అనే వ్యక్తిని ప్రేమించింది. అయితే షిపాన్ మాత్రం ఆమెతో పాటు ఇంకో యువతితో కూడా సంబంధం పెట్టుకున్నాడు. అంతేకాదు.. ఆమెతో సన్నిహితంగా గడిపిన క్షణాలను వీడియోలుగా తీసి తన ల్యాప్ ట్యాప్‌లో భద్రపరిచాడు. ఇక ఆ వీడియోలు చూసిన సొనాలీ అతనిని హత్య చేయాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగానే వారు కలిసినప్పుడు అతని కూల్ డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిన వెంటనే అతి దారుణంగా పొడిచి చంపింది. అక్కడితో ఆగకుండా తన శరీరం నుండి గుండెను వేరు చేసింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఇక కోర్టుకు హాజరుపరిచిన ఆమెను ఎందుకు చంపావని అడుగగా..తనతో పాటు.. అనేక మందిని ప్రేమించిన అతని గుండె ఎంత విశాలమైనదో చూసేందుకు ప్రియుడిని హత్య చేసి.. శరీరం నుంచి గుండెను వేరు చేసి చూశానని చెప్పింది. దీంతో ఆమెను దోషిగా పరిగణించిన న్యాయస్థానం, మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

బ్యాంకులకు మాల్యా బంపరాఫర్..

  బ్యాంకు బకాయిలు తీర్చేందుకు కింగ్ పిషర్ అధినేత విజయ్ మాల్యా ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన మాల్యా.. బ్యాంకులు ఇచ్చిన రుణాలను తప్పకుండా తీరుస్తానని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా మాల్యా తరపు న్యాయవాది.. బ్యాంకులు ఇచ్చిన రుణాలను తన క్లెయింట్ తీరుస్తారని.. ఇందులో భాగంగా తొలి విడతగా రూ.4 వేల కోట్లను చెల్లించేందుకు మాల్యా సిద్ధంగా ఉన్నారన్నారు. సెప్టెంబర్ లోగా ఈ చెల్లింపులను పూర్తి చేస్తారన్నారు. కాగా బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు టోకరా వేసిన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.   

సహారా గ్రూపు సంస్ఠల ఆస్తులు అమ్మేయండి.. సుప్రీం

వేలాది మంది పెట్టుబడిదారుల డబ్బు తిరిగి ఇచ్చేందుకు గాను సహారా గ్రూపు సంస్ఠల ఆస్తుల అమ్మకానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సెక్యురిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజి బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ)ను సహారా రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులను విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. అంతేకాదు సహారా ఆస్తులను మార్కెట్‌ ధరలో 90 శాతానికి తక్కువ కాకుండా విక్రయించాలని.. ఒకవేళ దానికంటే తక్కువకు అమ్మాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని తెలిపింది. కాగా సహారా గ్రూప్‌ సంస్థల అధినేత సుబ్రతా రాయ్‌ 2014 మార్చిలో అరెస్టయిన సంగతి తెలిసిందే.

అనారోగ్యం బాలేదని స్పీకర్ కు ఎమ్మెల్యేల లేఖలు... అసెంబ్లీ ప్రాంగణంలో ప్రత్యక్షం..

  ద్రవ్య వినిమయ బిల్లు ఓటింగ్ లో పాల్గొనాలని వైసీపీ అధినేత తమ పార్టీ ఎమ్మెల్యేలందరికీ.. వారితో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కూడా విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తమ పార్టీ నుండి టీడీపీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకే జగన్ వారికి కూడా విప్ జారీ చేశారు. ఎందుకంటే విప్ జారీ చేసిన తరువాత అసెంబ్లీకి రాకపోతే వారిపై వేటు వేసే అవకాశం ఉంటుంది. అయితే జగన్ ఎత్తుకు పై ఎత్తుగా వారు స్పీకర్ కు లేఖలు రాశారు. తమకు అనారోగ్యం కారణంగా నేటి సభకు హాజరుకావడంలేదని లేఖలో పేర్కొన్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. స్పీకర్ కు లేఖలు రాసిన ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ప్రత్యక్షమయి అందరికీ షాకిచ్చారు. అయితే వారు సభలోపలికి వస్తారా..? లేదా..? అన్నది సందేహం..కాగా.. ఏపీ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై మరికాసేపట్లో ఓటింగ్ జరగనుంది.

ఈజిప్ట్‌ విమానం హైజాకర్ తో సెల్ఫీ.. నడుముకు బాంబులతో హైజాకర్

  స్మార్ట్ ఫోన్ల యూజర్లకు సెల్ఫీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ తమ ముచ్చట తీర్చుకుంటున్నారు. ఈ సెల్పీల వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఈమధ్య ఆపిచ్చి మరీ శృతి మించిపోతుంది. నిన్న అలెగ్జాండ్రియా నుంచి కైరో వ‌స్తున్న ఈజిప్ట్‌ విమానాన్ని హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే హైజాక్ అయిన సమయంలో ఏకంగా ఆ దుండగుడితో క‌లిసి ఓ వ్య‌క్తి సెల్ఫీ తీసుకొని సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఇబ్రహీం సమాహా అనే వ్యక్తి విమానాన్ని హైజాక్ చేసిన నేపథ్యంలో ఆ సమయంలో బందీగా ఉన్న బ్రిటన్‌కు చెందిన బెంజిమిన్‌ ఇన్స్‌ అనే యువ ప్రయాణికుడు.. హైజాకర్‌ దగ్గరకు వెళ్లి సెల్ఫీకి ఫోజివ్వ‌మ‌న్నాడు నడుముకు బాంబులు చుట్టుకున్న హైజాకర్‌తో కలిసి సెల్ఫీ తీసుకుని.. దాన్ని ట్విట్టర్‌ ద్వారా స్నేహితులకు పంపాడు. అంతేకాదు చక్కగా నవ్వుకుంటూ ఫొటోకి ఫోజ్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎవ్వ‌రి పిచ్చి వారికానందం క‌దా.. !

ఇసుక విధానంపై చంద్రబాబు.. ప్రతిపక్షానికి బంపరాఫర్

  ఏపీ అసెంబ్లీలో ఇసుక విధానంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య రగడ మొదలైంది. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఉచిత ఇసుక ప్రజల హక్కు.. ఇసుకని ఉచితంగా ఇస్తున్నాం.. దొంగలకి మాత్రం కాదు.. ఇసుక దొంగల్ని పీడియాక్ట్ కింద బుక్ చేస్తాం అని అన్నారు. రెండేళ్లపాటు ఇసుక దోచుకున్నారు.. ఇసుకను అడ్డం పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అంతేకాదు ఈ సందర్భంగా ఆయన విపక్షానికి ఓ బంపరాఫర్ కూడా ఇచ్చారు. విమర్శలు మాని విపక్ష సభ్యులు కూడా ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని.. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని పట్టుకుని అప్పగించాలని సూచించారు.

ఏనుగులు మీద రాళ్లు విసిరారని.... నలుగురి అరెస్టు

  కొంతమందికి మూగజీవాలను చూస్తే చేతులు ఊరుకోవు, తిరిగి దాడి చేయవనో, దాడి చేసినా తప్పించుకోవచ్చుననో... వాటని హింసించి పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. కేరళలో జరిగిన ఒక సంఘటన కూడా ఇలాంటిదే! కాకపోతే, ఈ విషయం సోషల్ మీడియాలో పొక్కడంతో ఈసారి నిందితులు చట్టానికి చిక్కక తప్పలేదు. గత వారం కేరళలోని 212 జాతీయ రహదారి మీద జరిగిన ఈ ఘటనలో నలుగురు యువకులు, దారి పక్కన పిల్లతో కలిసి నిల్చొన్న ఓ ఏనుగు మీద విచక్షణారహితంగా రాళ్లు విసిరారు.   ఈ విషయాన్ని మరో కారులో ఉన్న వ్యక్తి వీడియో తీయడంతో, సోషల్‌ మీడియాలో సంచలనంగా మారింది. దుండగులు రాళ్లు విసురుతున్నంతసేపూ ఏనుగులు రెండూ నిస్సహాయంగా నిల్చొని ఉండటం, ప్రేక్షకులను కలచివేసింది. ఈ వీడియో ఆధారంగా రియాజ్‌, షమల్‌ హషీమ్‌, అబ్దుల్‌ రజాక్, షమీర్‌ అనే వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్లు తేలింది. మీడియా నుంచి పెరుగుతున్న ఒత్తిడికి తల ఒగ్గిన ప్రభుత్వ అధికారులు, వీరిని అదుపులోకి తీసుకున్నారు.

మోత్కుపల్లి భావోద్వేగం.. పసుపుజెండాతోనే సచ్చిపోతాం..

టీడీపీ 35 వ ఆవిర్భావ వేడుకలు ఎన్టీఆర్ భవన్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ ఇంకా పలువురు టీడీపీ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ సీనియర్ మోత్కుపల్లి నరసింహులు కాస్త భావోద్వేగంగా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడే ప్రసక్తే లేదు.. నాకు 27 ఏళ్ల వయసు ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను.. అప్పుడు ఎన్టీఆర్ అవకాశం ఇస్తే ఎమ్మెల్యేలమయ్యాం.. ఆ తరువాత మంత్రి పదవులు కూడా అనుభవించాం..అలాంటి పార్టీని మారే ప్రసక్తి లేదు.. పసుపుజెండా కప్పుకొనే సచ్చిపోతామని ఉద్వేగంతో మాట్లాడారు. అంతేకాదు మాట్లాడుతూనే చంద్రబాబుకి సూచనలు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ పరిస్థితి గురించి కొంచెం ఆలోచించాలని..  తెలంగాణలో మేం అభద్రతకు లోనవుతున్నామని.. కానీ మేం వేరోకచోటికి పోకుండా కాపాడాల్సిన బాధ్యత పార్టీ అధినేతపైనే ఉందని చెప్పారు.   ఇక టీఆర్ఎస్ గురించి కూడా ఆయన మాట్లాడుతూ నాలుగు విమర్శనాస్త్రాలు విసిరారు. 'ఇంటికి కొత్త బర్రె వస్తే ఇంట్లో వాళ్లంతా కలిసి పెంట తీశారన్న సామెత టీఆర్ఎస్ పార్టీకి బాగా సూటవుతుందని.. ప్రస్తుతం ఆ పార్టీపై అందరికి మోజు ఉందని.. ఆ మోజు ఎక్కువ కాలం ఉండదని.. ఎద్దేవ చేశారు.

ధోని కూతురితో సెల్ఫీ.. డిస్టర్బ్ చేయొద్దంటున్న కోహ్లీ..

టీమిండియా  స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫోటోస్ షేర్ చేస్తూనే ఉంటారు. అయితే ఈసారి ఆయన పోస్ట్ చేసిన ఫోటో మాత్రం అందరికి తెగ నచ్చేసింది. ఇంతకీ ఏం ఫోటో అంటున్నారా..? మన కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ముద్దుల కూతరు జివాతో కలిసి దిగిన సెల్ఫీ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఫొటో పోస్ట్ చేస్తూ.. ధోని కూతురు చాలా క్యూట్ గా ఉందని క్యాప్షన్ కూడా పెట్టాడు. ఇక ఈ సెల్ఫీలో జివా చూడ ముచ్చటగా మాట్లాడుతుంటే, చిన్నారిని డిస్టర్బ్ చేయొద్దన్న ఎక్స్‌ప్రెషన్‌ను విరాట్ కోహ్లీ ఇచ్చాడు. కాగా టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్లో అద్భుతమైన ఆట కనబరిచిన విరాట్ కోహ్లీ నెంబర్‌ వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు.  

అనుష్క శర్మ లవ్లీ గార్ల్.. సిగ్గుచేటంటున్న కోహ్లీ..

  ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్టు ఉంది ప్రస్తుతం బాలీవుడ్ నటి అనుష్క శర్మ పరిస్థితి. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఆట సరిగా ఆడినా.. ఆడకపోయినా విమర్శలు మాత్రం తనకే వస్తున్నాయి. అసలు సంగతేంటంటే.. టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో భాగంగా అస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆడిన తీరుపై పలువురు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే అతనిపై ప్రశంసలు సంగతేమోకానీ అనుష్క శర్మ పై సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు విసురుతున్నారు. కోహ్లీ అనుష్కకు దూరమైన తర్వాతే అతడి ఆటతీరు మెరుగుపడిందంటూ పలువురు పోస్ట్‌లు చేశారు. దీనిపై విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అనుష్కపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటంటూ వ్యాఖ్యానించాడు.   ఇక ఇప్పుడు భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా రంగంలోకి దిగి అనుష్క శర్మకు మద్దతు తెలిపారు. కోహ్లీ, అనుష్కల మధ్య సంబంధం గురించి తనకు పెద్దగా తెలియదని, అయితే అనుష్క మాత్రం లవ్లీ గర్ల్ అని చెప్పారు. అంతేకాదు వారిద్దరూ చూడ్డానికి బాగుంటారని.. కోహ్లీ క్రికెటర్‌గా, వ్యక్తిగా ఎదగడంలో ఆమె అతడిపై సానుకూల ప్రభావాన్ని చూపిందన్నారు. మరి దీనిపై విమర్శకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

వైసీపీకి జ్యోతుల రాజీనామా.. మరి పయనమెటో..?

  వైసీపీ పార్టీ నుండి మరో ఎమ్మెల్యే జంప్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ నుండి ఎనిమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించగా..ఇప్పుడు మరో షాక్ తగలనుంది. ఎప్పటినుండో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జ్యోతుల నెహ్రూ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను జగన్ పంపిచినట్టు తెలుస్తోంది. కాగా జగన్ ను ఉద్దేశించి.. మీ మనసుకు నచ్చినట్లు నడుచుకోలేకపోతున్నానని అందుకే రాజీనామా చేస్తున్నట్లు నెహ్రూ లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి రావాలని పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ విప్ జారీ చేసిన నేపథ్యంలో జ్యోతుల నెహ్రూ రాకపోవడంతో అప్పుడే ఆయన జగన్ కు షాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు అనుమానాలు కలిగాయి. అనుకున్నట్టుగానే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. మరి పార్టీకి రాజీనామా చేసిన జ్యోతుల పయనమెటో చూడాలి.

తలాక్ కు చెక్ పెట్టే ప్రయత్నంలో సుప్రీంకోర్టు..

  ఒక్కో మతానికి ఒక్కో రకమైన కట్టుబాట్లు, సంప్రదాయాలు ఉంటాయి. అయితే  వాటివల్ల లాభం జరగకపోయినా పర్వాలేదు కాని.. నష్టం జరుగుతుంటే మాత్రం ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ముస్లింల విషయంలో అదే ఆలోచనలో ఉంది. ముస్లింలలో ఒక విచిత్రమైన ఆచారం ఉంది. అది ఏంటంటే.. వాళ్లు తలాక్ అని మూడుసార్లు అంటే చాలు ఆ భార్య భర్తలకి విడాకులు మంజూరైనట్లే. అయితే దీనిపై గతం నుండే ముస్లిం స్త్రీల నుండి వ్యతిరేకత ఉంది. తలాక్ అనే ఒక్క పదం వల్ల ముస్లిం మహిళలు చాలా నష్టపోతున్నారని..  మహిళలను చరాస్థులుగా భావించే వారి ఆటలకు ఈ తలాక్ మరింత ఊపునిస్తుందని మహిళా సంఘాలు ఎప్పటినుండో ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక ముస్లిం మహిళ తలాక్ విడాకుల విధానాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక దీనిని విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు.. అసలు తలాక్ విడాకుల విధానానికి చట్టబద్దత ఉందోలేదో విచారించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే.. దేశంలోని ముస్లిం, ముస్లిమేతర మేధావుల అభిప్రాయాలు, మత పెద్దలు, ముస్లిం మహిళళ సూచనలు, సలహాలు తీసుకోవాలని భావిస్తోంది.

2019 నాటికి పోలవరం పూర్తి చేస్తాం.. జగన్ కు అవగాహన లేదు..

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలవరంపై అసెంబ్లీలో మాట్లాడుతూ.. 2019 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. పట్టిసీమను ఏడాదిలోపు పూర్తి చేశాం అలాగే ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్న సమయానికే పోలవరాన్ని పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి సమస్యలు ఉన్నాయి.. రాష్ట్రంలో కరువును సమర్థంగా ఎదుర్కొంటామని తెలిపారు. గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణాకు తరలించామని తెలిపారు. నదుల అనుసంధానంపై చాలా మంది విమర్శించారని అయినప్పటికీ ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తున్నామన్నారు. కృష్ణా డెల్టా అవసరాలు తీరాక మిగిలిన నీటిని శ్రీశైలం ద్వారా రాయలసీమకు తరలిస్తామని పేర్కొన్నారు.   ఇంకా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షనేతకు ప్రాజెక్టులపై అవగాహన లేదు.. గోదావరి నుండి జూన్ నాటికి 8,500 క్యూసెక్కుల నీటిని తీసుకువస్తాం.. సముద్రంలోకి పోయే నీటిని కృష్ణకు తీసుకొస్తున్నాం .. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో చాలా నష్టపోయామని అన్నారు.

ఈజిప్ట్ విమానం హైజాక్.. భార్య వదిలేసిందనా..?

కొంత మంది కొన్నిసార్లు చేసే పనులు చాలా విచిత్రంగా అనిపిస్త్తాయి. అంతేకాదు వాళ్లు చేసే పనులు వాళ్లకి తప్పుగా అనిపించకపోయినా.. పక్కని వాళ్లని మాత్రం భయాందోళనకు గురిచేస్తుంటాయి. అలాంటిదే ఈరోజు జరిగిన ఘటన. ఈజిప్ట్ లో ఈజిప్షియన్ ఎయిర్‌ విమానాన్ని దుండగులు హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఉగ్రవాదుల పనే అని అందరూ అనుకుంటుండగా.. అది వారి పని కాదని తెలసింది. అయితే అసలు హైజాక్ చేసింది ఎవరని తెలిస్తే ఒకింత ఆశ్చర్యపోవాల్సిందే. అసలు సంగతేంటంటే.. అలెగ్జాండ్రియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వ్యక్తి విమానాన్ని హైజాక్ చేశాడు. అయితే అతడిని తన భార్య వదిలేసింది. దీంతో అతను.. తన భార్యను చూపించాలని డిమాండ్ చేస్తూ హైజాక్ చేశాడు. దీంతో అసలు కథ బయటపడింది. ఈ హైజాకింగ్ కి ఉగ్రవాదులకు ఎలాంటి సంబంధం లేదని తేలిపోయింది.   కాగా హైజాక్ అయిన విమానాన్ని సైప్రస్‌లోని లార్నాక విమానాశ్రయంలో దించారు. హైజాకర్ తో చర్చించిన తరువాత అతను అందరిని వదిలిపెట్టినట్టు అధికారులు వెల్లడించారు.

చంద్రబాబును కలవాల్సిన అవసరం లేదు.. భూమా

  కర్నూలు జిల్లాలో శిల్పా మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు తులసి రెడ్డిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈదాడి భూమా వర్గీయులు చేశారని శిల్పా మోహన్ రెడ్డి అనుచరలు ఆరోపిస్తున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. మరోవైపు భూమా మాత్రం తనకు ఈదాడికి ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు. అంతేకాదు.. తులసిరెడ్డి పంచాయితీలు చేస్తుంటారు.. ఆయనపై దాడికి గ్రామ కక్ష్యలే కారణం కావచ్చని చెప్పారు. ఇక ఈ విషయంపై నేను చంద్రబాబును కలవను.. నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి కలవాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజల సమస్యలను తీర్చడానికి టీడీపీలోకి చేరాను.. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యపడుతుంది.. అందుకే పార్టీలోని అందరితో కలిసిపోయేందుకే ప్రయత్నిస్తున్నా.. అంతేకాని గొడవలకు రాలేదు అని అన్నారు. శిల్పా తన మనస్సాక్షిని పరిశీలించుకోవాలన్నారు.

హైవేల మీద చెట్లు నాటేందుకు వెయ్యి కోట్లు

  ఇక మీదట జాతీయ రహదారుల మీద ఎంత వేగంగా ప్రయాణించినా అలసట తెలియకపోవచ్చు. కారణం! త్వరలోనే వెయ్యి కోట్ల రూపాయల ఖర్చుతో పదివేల కిలోమీటర్ల మేర పచ్చని చెట్లను నాటించనుంది కేంద్రం. ఈ పనిని 200 స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్పనుందట. అంతేకాదు, చెట్లని నాటించే కార్యక్రమం సక్రమంగా అమలవుతోందా లేదా అని పర్యవేక్షించేందుకు శాశ్వత ప్రాతిపదికన కొందరు అధికారులను కూడా నియమించనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం క్రితం ఏడు ప్రతిపాదించిన హరిత విధానం ప్రకారం ఈ నిధులను వెచ్చించనున్నారు.   ఈ హరిత విధానం ప్రకారం జాతీయ రహదారులను నిర్మించేటప్పుడు, అందులో 1 శాతం ఖర్చుని రహదారులకు ఇరుప్రక్కలా చెట్లను నాటించేందుకు కేటాయించాలి. సామాన్యంగా ప్రభుత్వం ఇలా చెట్లని నాటి వెళ్లగానే అవి అలా వడిలిపోతుంటాయి. అలాంటి పరిస్థితి రాకుండా చెట్ల స్థితిగతులను ఎప్పటికప్పుడు ‘ఆడిట్’ చేయించేందుకు కూడా కేంద్రం సిద్ధంగా ఉంది. ఈ భారీ పథకంలో స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు, అటవీ శాఖ అధికారులు... ఇలా పలువురి సహాయాన్ని తీసుకోనుంది ప్రభుత్వం.

టీడీపీ పై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. 20 కోట్లు ఇస్తామన్నారు

టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా చాలా మంది వైసీపీ నేతలు టీడీపీలోకి చేరిన సంగతి తెలసిందే. దీనిపై వైసీపీ పార్టీ నేతలు టీడీపీ పై దుమ్మెత్తిపోశారు కూడా. అయితే ఇప్పుడు మరో వైసీపీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా.. పార్టీ మారితే రూ. 20 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని ఆమె వెల్లడించారు. దానికి ఆమె ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాను అంతేకానీ డబ్బుకోసం కాదు.. డబ్బుకు లొంగే మనిషిని కాదని చెప్పానని ఆమె అన్నారు. అంతేకాదు జగన్ మోహన్ రెడ్డి వల్లే నేను ఎమ్మెల్యేను అయ్యాను.. జగనన్న తోడు ఉంటాను.. ఎట్టి పరిస్థితిలోనూ పార్టీ మారే ప్రసక్తే లేదు అని ఆమె అన్నారు. నేను పార్టీ మారతానంటూ కొన్ని పత్రికలు, వార్తా ఛానెళ్లు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. తనను అడగకుండా ఎలా రాస్తారని ఆమె ప్రశ్నించారు.