తండ్రి బాటలోనే.. పరిటాల రవి తనయుడు

  తన తండ్రి అడుగుజాడల్లోనే నడవాలనుకుంటున్నాడు దివంగత నేత పరిటాల రవీంద్ర.. సునీతల తనయుడు శ్రీరామ్. పరిటాల రవి తను పార్టీలో ఉన్నప్పుడు పేద ప్రజల కోసం అనేక సహాయక కార్యక్రమాలు చేసేవారు. ఇప్పుడు శ్రీరామ్ కూడా అదే బాటలో నడుస్తున్నట్టు కనిపిస్తోంది. తన తండ్రి లాగే తాను కూడా సామూహిక వివాహ మహోత్సవాన్ని నిర్వహించదలిచారు. తన సొంత ఊరు దగ్గర ఉన్న తిరుమల దేవర వెంకటేశ్వరస్వామి దేవాలయంలో..  పరిటాల ట్రస్ట్ ద్వారా ఉచిత సామూహిక వివాహాలను జరిపించడానికి శ్రీరామ్ సిద్ధమయ్యారు. తమ పిల్లలకు పెళ్లి చేయలేని తల్లిదండ్రులు ఇప్పటికే చాలామంది  తమ పేర్లను నమోదు చేసుకొంటున్నారు. ఒక్కో జంటకు 10వేల రూపాయల ఖర్చుతో చీర, తాళిబొట్టు, ఇతర సామాగ్రిని పరిటాల శ్రీరామ్‌ సమకూర్చుతున్నారు. ఇక ఏప్రిల్ 21న జరిగే ఈ కార్యక్రమానికి పరిటాల సునీత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడినిసైతం ఆహ్వానించారు.   ఇదిలా ఉండగా పరిటాల శ్రీరామ్ రాజకీయ ఎదుగుదలను సొంత పార్టీ నేతలే అడ్డుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అందుకే ఈ కార్యక్రమాల ద్వారా చంద్రబాబుకు దగ్గర అవ్వాలని చూస్తున్నారంట. ఇక సునీత కూడా అన్ని కార్యక్రమాలకు కొడుకుని ముందుంచి నడిపిస్తున్నారట.

ప్రశ్నాపత్రం లీక్‌తో పరీక్ష వాయిదా... మళ్లీ లీక్‌... మళ్లీ వాయిదా!

  బెంగళూరు: అహోరాత్రాలూ కష్టపడి పరీక్షకి సిద్ధపడ్డాక, ప్రశ్నా పత్రం లీక్‌ అయ్యిందని చెప్పి వాయిదా వేస్తే బాధ కలగడం సహజమే! కానీ రెండోసారి పరీక్ష రాసేందుకు సిద్ధపడ్డాక కూడా అదే పరిస్థితి ఎదురైతే విద్యార్థిలోకం ఒళ్లుమండిపోదా! కర్ణాటకలో అదే జరిగింది. అక్కడ ప్రీ యూనివర్సిటీకి చెందిన రసాయన శాస్త్ర పరీక్ష ఈ నెల 21న నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. తీరా ఆ పరీక్షకు చెందిన ప్రశ్నాపత్రం లీక్ అయిందని ఎవరో విద్యార్థి ఉప్పందించడంతో, పరీక్షను నేటికి వాయిదా వేశారు. పైగా ప్రశ్నాపత్రం లీకేజికి సంబంధించిన కేసును సీఐడీకి అప్పగించారు.   అయితే రెండోసారి కూడా సిద్ధం చేసిన ప్రశ్నాపత్రం కూడా లీక్‌ అయ్యిందని సీఐడీ అధికారులు తేల్చడంతో, ఇవాళ జరగాల్సిన పరీక్షను కూడా రద్దు చేశారు అధికారులు. ఇప్పడు మరోసారి పరీక్షను నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకే పరీక్షను మూడుసార్లు చదవాల్సి రావడంతో, విలువైన సమయమంతా వృథా అయిపోయిందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. దీనివల్ల మిగతా పోటీ పరీక్షలకు సిద్ధం కాలేకపోయామని వాపోతున్నారు. విద్యార్థుల ఆందోళనకు పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలకడంతో, కర్ణాటక విద్యాశాఖ భవనం ముందర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

కేసీఆర్ సరికొత్త రికార్డ్.. తొలిసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన నాయకుడు

  ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా..మరో రికార్డును కేసీఆర్ సొంతం చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీలో సమగ్ర జల విధానంపై కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేన్ ఇస్తున్నారు. అయితే దేశ వ్యాప్తంగా ఏ నాయకడు ఇంత వరకూ ఇలా అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇవ్వలేదు. అటు పార్లమెంటులోనే కాక ఇటు దేశంలోని ఏ ఒక్క నేత కూడా చట్టసభలో ఇప్పటిదాకా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన దాఖలా లేదు. చట్టసభల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరిట సరికొత్త రీతిలో ప్రసంగించిన ఆయన సరికొత్త రికార్డు నెలకొల్పారు.   ఇంకా ఆయన మాట్లాడుతూ.. జలవిధానం, ప్రాజెక్టుల పునరాకృతి, కొత్త పథకాల రూపకల్పన గురించి వివరించారు. ప్రపంచంలోనే తొలి భారీ నీటి పారుదల ప్రాజెక్టు నిజాంసాగర్ అని.. 75 వేలకు పైగా చెరువులు కాకతీయులు నిర్మించారని, కులీకుతుబ్ షా హుస్సేన్ సాగర్ నిర్మించారని, కాకతీయులు, రెడ్డిరాజుల స్ఫూర్తిని కులీకుతుబ్ షా కొనసాగించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కోటి 11 లక్షల ఎకరాల సాగు భూమి ఉందని, అంతర్రాష్ట్ర వివాదాల్లో కూరుకుని ముందుకుపోని ప్రాజెక్టులు, పర్యావరణ అనుమతుల్లో మరికొన్ని ప్రాజెక్టులు ఇరుక్కపోయాయన్నారు. గోదావరిలో రాష్ట్రానికి రావాల్సింది 954 టీఎంసీలు, కృష్ణాలో 299 టీఎంసీల నికర జలాలు, 77 టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్లు అవే..

  తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమగ్ర జలవిధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ ధ్వసమైంది.. మీడియం నీటి ప్రాజెక్టులు వట్టిపోయాయి అని అన్నారు. అంతేకాదు తెలంగాణ ఉద్యమం నిధులు.. నియామకాలు.. నీళ్లతోనే పురుడుపోసుకుందని.. తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్ లైన్లు అవే అని.. ఇప్పుడు నిధులు సమకూరాయి.. నియామకాలు కూడా చేపట్టాం.. ఇక నీళ్లకోసం ప్రజలు, రైతులు ఎదురుచూస్తున్నారు.. టీఆర్ఎస్ ఏర్పడ్డాకే జూరాల ఆర్డీఎస్ పై పోరాటం జరిగింది.. ఉద్యమ ప్రభావమే దేవాదుల ప్రాజెక్టు అని అన్నారు.

జెఎన్ యూకి తగ్గిన ధరఖాస్తుల సంఖ్య.. కారణం అదేనా..?

  ఢిల్లీలోని జెఎన్ యూలో గత కొద్దికాలంగా పలు వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. అప్జల్ గురు ఉరిని వ్యతిరేకిస్తూ జెఎన్ యూలో నిరసన సభ నిర్వహించడంతో పలు ఆందోళలు..గొడవలు కూడా జరిగాయి. దీంతో జెఎన్ యూ పేరు దేశ వ్యాప్తంగా మారు మోగిపోయింది. అయితే అంతా బాగానే ఉన్నా ఇప్పుడు ఈ వివాదాల వల్ల యూనివర్సిటీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. జెఎన్ యూ వివాదాలకు కేంద్రంగా మారడంవల్ల ఈ ఏడాది యూనివర్సిటీలో చేరేందుకు రాసే ఎంట్రన్స్ పరీక్షకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య పడిపోయింది. గతేడాదితో పోలిస్తే అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, రీసెర్చ్ ప్రోగ్రామ్‌లకు పెట్టుకున్న దరఖాస్తులు 5,479 తగ్గాయి. అలాగే బయోటెక్నాలజీ కోర్సులు చేసేందుకు వచ్చిన అప్లికేషన్లు కూడా గతేడాదితో పోలిస్తే ఓ రెండు వేలు తగ్గాయి. అదే మొత్తమ్మీద చూస్తే అంటే కోర్సుల విడివిడిగా కాకుండా చూస్తే మాత్రం మొత్తం అప్లికేషన్లు గతేడాది కన్నా దాదాపు 700 దాకా తగ్గాయి. అయితే పెద్ద తేడా లేకపోయినప్పటికీ ఈ వివాదాల వల్ల ఐదేళ్లలో మొదటిసారి ధరఖాస్తుల సంఖ్య తగ్గిపోయింది. మరి భవిష్యత్ లో కూడా ఇలానే గొడవలు, ఆందోళనలు జరుగుతుంటే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి యూనివర్శిటీ సిబ్బంది ఈ విషయాన్ని గమనించాల్సి అవసరం ఎంతైనా ఉంది.

రాష్ట్రపతి పదవికి అమితాబ్..? మోడీ ప్రతిపాదన..!

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌బచ్చన్‌ కు రాష్ట్రపతి పదవి దక్కనుందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. భారత రాష్ట్రపతి పదవికి ప్రధాని మోడీ అమితాబ్ పేరును ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని  ప్రముఖ రాజకీయ నాయకుడు అమర్‌సింగ్‌ తెలిపారు. ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని తెలియజేసినట్టు సమాచారం. ఇంకా ఆయన చెబుతూ... మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమితాబ్ పరిచయం చేశానని.. అనంతరం ఓ సినిమా కోసం ఇద్దరూ సమావేశమయ్యారని.. అప్పుడు గుజరాత్‌ అంబాసిడర్‌గా పని చేయాల్సిందిగా అమితాబ్‌ను మోడీ కోరారని అమర్‌సింగ్‌ చెప్పారు. గతంలో కూడా ఈ విషయంపై చర్చలు జరిగాయి. మరి రాష్ట్రపతి పదవి అమితాబ్ ను వరిస్తుందో లేదో చూడాలి.

కుక్క పేరు తేడాగా ఉంది... వణికిపోయిన అమెరికా బ్యాంకులు

  అమెరికా ఎంత పెద్ద దేశం అయితేనేం. ఉగ్రవాదం అంటే చాలు ఉలిక్కిపడుతూ ఉంటుంది. ఒకోసారి, ఆ భయంతో మరీ అతిగా ప్రవర్తిస్తూ ఉంటుందని కూడా ఓ ఆరోపణ ఉంది. అలాంటి సంఘటనే మరోసారి వెలుగుచూసింది. అక్కడి శాన్‌ఫ్రాన్సిస్కోలో నివసించే బ్రూస్‌ ఫ్రాన్సిస్ అనే వికలాంగుడు తనకి సాయంగా ఉండేందుకు ఓ కుక్కని పెంచుకుంటున్నాడు. ఈ కుక్కకి కొన్ని సదుపాయాలు కల్పించేందుకు బ్రాస్‌ ఎవరికో ఓ చెక్కుని అందించాడు.   ఆ చెక్కు మీద గుర్తు కోసం తన కుక్క పేరు కూడా రాశాడు. అయితే ఆ పేరుని చూసిన అమెరికా అధికారులు వణికిపోయారు. ఆగమేఘాల మీద ప్రభుత్వ అధికారులకు విషయాన్ని తెలియచేశారు. ఇంతకీ ఆ కుక్క పేరు ‘DASH.’ ఇది ISIS ఉగ్రవాద సంస్థకు మారు పేరైన ‘DAESH’కు దగ్గరగా ఉందన్నదే అధికారుల ఆందోళనకు కారణమట. నా కుక్కకీ ఉగ్రవాదులకీ ఎలాంటి సంబంధమూ లేదు మొర్రో అని బ్రూస్‌ మొత్తుకున్నాక కానీ ఉన్నతాధికారులు ఊరుకోలేదు.

మహిళల అబార్షన్లపై నోరు జారిన ట్రంప్..

  ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే డొనాల్డ్ ట్రంప్ ఈసారి మహిళలపై విరుచుపడ్డాడు. మహిళల గర్భస్రావంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విస్కాన్సిన్లోని ఓ చర్చా మందిరంలో క్రిస్ మాథ్యూతో చర్చ సందర్భంగా అబార్షన్లను మీరు పూర్తిగా రద్దు చేయాలని అనుకుంటున్నారా అని ఆయనను ప్రశ్నించగా.. దానికి ఆయన ఈ మధ్య కాలంలో అబార్షన్లు చేయించుకునే మహిళల ఎక్కువయ్యారు.. వాటిని నియంత్రించాలంటే ఆ మహిళలకు ఎంతో కొంత శిక్ష మాత్రం పడాలని అన్నారు. ఇక ట్రంప్ అలా వ్యాఖ్యానించారో లేదో డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్.. ట్రంప్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చాలా చెత్తగా.. భయంకరంగా ఉన్నాయని మండిపడ్డారు. మరి ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇంకా ఎంతమంది మహిళల నుండి విమర్శలు వస్తాయో చూడాలి.

మాజీ ప్రధానికి అరెస్ట్ వారెంట్.. నిప్పంటించినందకు

  ఓ బస్సుకు నిప్పు పెట్టిన ఘటనకు సంబంధించిన నేపథ్యంలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని.. ప్రధాన ప్రతిపక్ష నేత బేగం ఖలేదా జియాకు ఆ దేశ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వివరాల ప్రకారం.. బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత ఏడాది జనవరిలో బంగ్లా నేషనల్‌ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలకు దిగింది. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు ఓ బస్సుకు నిప్పంటించగా.. ఈ ఘటనలో 29 మంది గాయపడ్డారు. ఈ వ్యవహారంలో బేగం ఖలేదా జియాకు పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. కాగా ఆమెకు బెయిల్ వచ్చేఅవకాశముందని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.

రామకోటేశ్వరరావు డ్రామాలాడుతున్నాడు.. వివరాలు రేపు చెప్తా.. తలసాని

  తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తమ కుమారుడిపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యవహారం 2013 నుండి కొనసాగుతోంది.. రామకోటేశ్వరరావు డెవలప్ మెంట్ కోసం 53 ఎకరాలను ఆర్ఆర్ కన్ స్ట్రక్షన్స్ కు ఇచ్చారు.. ఆరుసార్లు మాట్లాడుకున్నాకే ఈ బప్పందం జరిగింది.. దానం నాగేందర్ ఇంట్లో కూడా రెండుసార్లు చర్చించాం.. ముందు అడ్వాన్స్ గా రూ.13 కోట్లు తీసుకున్నారని, గడవు పెరగడంతో డబ్బులు వాపస్ ఇవ్వాలని కోరామని, 'అప్పుడిస్తాము ఇప్పుడిస్తా'మంటూ కాలయాపన చేశారని అన్నారు. నిన్న మళ్లీ పదిరోజుల సమయం కావాలని కోరారని.. నమ్మలేం అంటే మరో భూమి పత్రాలు ఇచ్తారని అన్నారు. ఇప్పుడు అనవసరంగా తన కొడుకుపై కిడ్నాప్, బెదిరింపు ఆరోపణలు చేస్తున్నారని.. ఇది సరికాదని అన్నారు. ఈ వ్యవహారం మొత్తం తాజ్ కృష్ణ లాన్ లోనే జరిగింది.. మా వాళ్లు బెదిరించినట్టయితే సీసీ కెమెరాలు చెక్ చేసుకోవచ్చు.. బలవంతంగా సంతకాలు చేయించుకున్నారన్నది అవాస్తవం.. డబ్బులు ఎగ్గొట్టేందుకే రామకోటేశ్వరరావు డ్రామాలాడుతున్నారని అన్నారు. రేపు  మధ్యాహ్నానికి పూర్చి వివరాలు తెలియజేస్తామని చెప్పారు.

చొక్కా లేకుండా అసెంబ్లీలోకి... ఓ ఎమ్మెల్యే నిర్వాకం

  ఆ మధ్య ఆస్ట్రేలియా పార్లమెంటులోకి ఒకాయన పైజమా మీద వచ్చాడని చెప్పుకుని ప్రపంచమంతా నవ్వుకుంది. అలాంటి ఘటన మన దేశంలో జరగలేదని సంతోషిస్తుండగా, మధ్యప్రదేశ్‌ నుంచి ఈ వార్త వచ్చింది. అక్కడి హార్దా నియోజకవర్గానికి చెందిన రామ్‌ కిషోర్ అనే ఎమ్మెల్యేకి తన ప్రాంతానికి నీరు వదలడం లేదని కోపం వచ్చింది. అంతే! ఆ విషయాన్ని ప్రస్ఫుటం చేసేందుకు అసెంబ్లీకి చొక్కా లేకుండా వచ్చారు. సాక్షాత్తూ ఎమ్మెల్యేనే ఇలా అసెంబ్లీలోకి అడుగుపెట్టడంతో మిగతా సభ్యులంతా నివ్వెరపోయారు. మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉన్న చోట ఈ ప్రవర్తన ఏమిటంటూ మండిపడ్డారు.   ఎమ్మెల్యే ప్రవర్తన మీద తీవ్ర వాగ్వాదం జరగడంతో, అసెంబ్లీ కాస్తా వాయిదాపడింది. కాగా రామ్‌ కిషోర్‌ మాత్రం తన ప్రవర్తనను సమర్థించుకుంటున్నారు. మహాత్మాగాంధి సైతం ఇలాగే తిరిగేవారు కదా! అంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారు. రామ్‌ కిషోర్ ప్రవర్తనతో కంగుతిన్న స్పీకరు, ఆయనను తన ఛాంబర్‌లోకి పిలిపించుకుని మాట్లాడారు. సంబంధిత శాఖతో మాట్లాడి రామ్‌ కిషోర్‌ ప్రాంతానికి నీటి వసతిని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేరే దాకా తాను ఇలాగే చొక్కా లేకుండా తిరుగుతానని రామ్‌ కిషోర్‌ పేర్కొనడం కొసమెరుపు.

తలసాని కొడుకు నన్ను బెదిరించాడు.. ఎంపీ భర్త

  ఎట్టకేలకు అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త రామకోటేశ్వరరావు భర్త కిడ్నాప్ డ్రామా ముగిసింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పిన ఆయన.. బెదిరింపులు మాత్రం ఎదురయ్యాయని మీడియాకు తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ఓ భూమి వ్యవహారంలో మంత్రి తలసాని కొడుకు సాయి యాదవ్, మరో వ్యక్తి రామకృష్ణతో చర్చించడానికి తాజ్ కృష్ణ హోటల్‌కు వెళ్లామని.. అక్కడ సాయి యాదవ్ తనను బెదిరించి కొన్ని డాక్యుమెంట్లపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నాడని.. తన భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను బలవంతంగా లాక్కున్నాడని ఆయన వెల్లడించారు. సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు తనను నిర్భందించారని ఆయన పేర్కొన్నారు. జూబ్లీ హిల్స్‌లోని జర్నలిస్టు కాలనీ సమీపంలో తనను కారులో ఎక్కించుకున్న రామకృష్ణ ఆ తర్వాత అర్ధరాత్రి కొండాపూర్ ప్రాంతంలో వదిలేశారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సాయి యాదవ్ పై ఐపీసీ సెక్షన్లు 384, 342 కింద కేసులు నమోదు చేశారు.

అరకు ఎంపీ భర్త కిడ్నాప్.. భూవివాదమా..?

  అరకు ఎంపీ కొత్తపల్లి గీత తన భర్త కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. కొత్తపల్లి గీత తన భర్త పరుచూరి రామకోటేశ్వరరావును కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. వివరాల ప్రకారం.. గీత కుటుంబానికి 75 కోట్లు విలువ చేసే ఐదు ఎకరాల భూమి ఉంది. అయితే రామకోటేశ్వరరావు ఈ భూమిని రామకృష్ణ, సుధాకర్ రావు అనే ఇద్దరు వ్యక్తులకు డెవలప్ మెంట్‌కు ఇచ్చారు. కానీ వీరు ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో వారు తిరిగి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ భూమి విషయమై మాట్లాడదామని డెవలపర్లు రామకోటేశ్వరరావును కారెక్కించుకుని తాజ్ కృష్ణ హోటల్‌కు తీసుకెళ్లారు.గీత ఎంత ఫోన్ చేసినా సమాధానం రాకపోవడంతో డ్రైవర్ ను అడిగితే అసలు విషయం బయటపడింది.  దీంతో వెంటనే గీత మీడియాను ఆశ్రయించి తమ భర్తను కిడ్నాప్ చేశారంటూ ఆరోపించింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. కిడ్నాపర్లు ఆయన్ని కొండాపూర్ పరిధిలో వదిలేసి వెళ్లిపోయినట్టు తెలిపారు. ఇక అర్ధరాత్రి రామకోటేశ్వరరావు నుంచి  గీతకు ఫోన్ రాగా.. కిడ్నాపర్లు తనను కొండాపూర్ పరిధిలో వదిలేశారని ఆయన ఎంపీకి చెప్పారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మళ్లీ భారత్ మాతాకీ జై రగడ.. విద్యార్ధులపై దాడి

  భారత్ మాతాకీ జై నినాదం గురించి రభస కొంచెం తగ్గింది అనే లోపులో మరో సంఘటన చోటుచేసుకుంది. భారత్‌ మాతా కీ జై అని నినదించనందుకు ఢిల్లీలో ముగ్గురు మదర్సా విద్యార్థులపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. మదర్సాలో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థులు పార్కుకు వెళ్లగా అక్కడ కొందరు వ్యక్తులు తమకు వద్దకు వచ్చి జై మాతా, భారత్‌ మాతా కీ జై అని చెప్పాలని అన్నారని.. లేదంటే తమను చంపేస్తామని తమపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తమపై దాడి చేసిన వారు తమకు పరిచయుస్థులే అని.. వారంతా కలిసి క్రికెట్‌ మ్యాచ్‌ ఆడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆరువేల కోట్లతో కొడుకు పెళ్లి.. ఎక్కడ..?

ఒకప్పుడు పెళ్లిళ్లంటే ఏదో తూతూ మంత్రంగా జరిగేవి కానీ.. ఇప్పుడు పరిస్థితి మారింది. పెళ్లిళ్లకి కోట్లకి కోట్లు ఖర్చు పెడుతున్నారు. అలాంటి కుబేరుడే ఇప్పుడు తన కుమారుడి ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6,800 కోట్లు ఖర్చుపెట్టాడు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం.. ఇంతకీ ఎవరా తండ్రి.. ఆ పెళ్లి ఎక్కడ జరిగిందనుకుంటున్నారా.. కజకిస్థాన్ లో మిఖాయిల్ గుత్సరీవ్ అనే వ్యక్తి రష్యా చమురు, మీడియా దిగ్గజంగా ఎదిగారు. ఈయన తన కొడుకు సయీద్ గుత్సరీవ్ (28) విహహానికి 6,800 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. వివాహ వేడుకను మాస్కోలోని లగ్జరీ హోటల్ లోని సఫియా బాంక్వెట్ హాల్ లో ఈ వివాహం నిర్వహించి.. ఆహూతులను అలరించేందుకు జెన్నిఫర్ లోపెజ్, హెన్రిక్ ఇంగ్లేషియస్ వంటి అంతర్జాతీయ పాప్ స్టార్స్ తో కార్యక్రమం ఏర్పాటు చేశారు. వివాహ వేదికను పూలవనంలా తీర్చిదిద్దారు. కాగా, మిఖాయిల్ గుత్సరీవ్ కు 38 వేల కోట్ల రూపాయల ఆస్తులున్నట్టు తెలుస్తోంది.

విమానంలో త్రిశూలం... మరో వివాదంలో రాధేమా

  తనని తాను దేవతగా సన్యాసిని రాధేమా మరో వివాదంలోకి జారుకున్నారు. ఇప్పటికే రాధేమా మీద వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులు వంటి రకరకాల ఆరోపణలు ఉన్నాయి. అసభ్య రీతిలో రాధేమా చేసిన నృత్యాలు, చాలీ చాలని దుస్తులలో ఆమె దిగిన ఫొటోలు... ఆమె చెబుతున్న ప్రవచనాలకు విరుద్ధంగా ఇంటర్నెట్‌లో విస్తృత ప్రచారంలో ఉన్నాయి. ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు రాధేమో మీద మరో కేసు నమోదైంది. గత ఏడాది ఆమె ఔరంగాబాదు నుంచి ముంబై వెళ్లే విమానంలో ప్రయాణించే సమయంలో త్రిశూలాన్ని పట్టుకుని ఉన్నారన్నది తాజా ఆరోపణ. విమాన ప్రయాణానికి సంబంధించిన నిబందనల ప్రకారం ఇలా ఏదన్నా ఆయుధాన్ని చేపట్టి, ప్రయాణం చేయడం నేరం. ఈ నేరానికి పాల్పడినందుకు రాధేమా మీద, ఆ పనిని చూసీ చూడనట్లు ఊరుకున్న మరో నలుగురు ఉద్యోగుల మీద ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.

తిట్టినా ట్రంప్ ను ఇష్టపడుతున్న చైనీయులు.. ఎందుకు..?

అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో దిట్ట అని అందరికి తెలిసిందే. అదృష్టం ఏంటంటే.. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబరపడిపోతున్నారంట చైనీయులు. అంతలా ట్రంప్ ఏం వ్యాఖ్యలు చేశాడనుకుంటున్నారా.. సాధారణంగా ట్రంప్ ఎప్పుడూ చైనీయులను తూలనాడుతూ మాట్లాడేవాడు. అమెరికాలో స్థిరపడిన చైనీయుల వల్లే అమెరికాలో నిరుద్యోగం పెరిగిపోతోందని, అమెరికన్ యువకులకు అందాల్సిన చాలా అవకాశాలను చైనీయులు తన్నుకుపోతున్నారని, తాను అధికారంలోకి వస్తే వారందర్నీ స్వదేశాలకు పంపేస్తానంటూ వ్యాఖ్యానించేవారు. అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యల్లో చైనీయులు చాలా తెలివైనవారని ట్రంప్ చెప్పకనే చెబుతున్నారని.. ఆయన అన్న మాటలకు అర్ధం అదే అని సంబరపడిపోతున్నారట. ఈ విషయాన్ని హువాంగ్ క్వియు.కామ్ సంస్థ తెలిపింది. ఈ సంస్ద ఓ సర్వే నిర్వహించగా అందులో 54 శాతం మంది చైనీయులు డొనాల్డ్ ట్రంప్ అంటే ఇష్టం అని చెప్పడం విశేషం. మొత్తానికి ట్రంప్ కు అదృష్టం బాగానే ఉన్నట్టు ఉంది. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను చైనా పాజిటివ్ గా తీసుకోవడం గ్రేట్..

చంద్రబాబు నన్ను కొట్టారు.. కేసీఆర్ కొట్టే దెబ్బలను కూడా..?

  తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఏపీ సీఎం.. టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నిజాం షుగర్స్ ప్రైవేటీకరణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ..  నిజాం షుగర్స్ ప్రైవేటీకరణపై నాడు నేను చంద్రబాబుతో చర్చించానని.. ఈ పద్దతి వద్దని నేను ప్రతిపాదించగా ఆయన తనపై మండిపడ్డారని.. అక్కడితో ఆగకుండా తన మీద చేయి కూడా చేసుకున్నారని అన్నారు. ఈ విషయాన్ని తాను నాడు బయటపెట్టలేదని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా పోచారం వ్యాఖ్యలపై టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కేసీఆర్ కొట్టే దెబ్బలను కూడా ఆయన చెబుతారని ఎద్దేవా చేశారు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా పోచారం వ్యాఖ్యలపై స్పందించి.. చంద్రబాబు చేతిలో దెబ్బలు తిని కూడా టీడీపీలోనే ఎలా కొనసాగారని మంత్రిని నిలదీశారు.