సెంచరీ కొట్టి ఓడిపోయిన కోహ్లీ..!
కోహ్లీ సూపర్ ఫాం కంటిన్యూ అవుతోంది. ఈరోజు గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో 63 బంతుల్లోనే తన తొలి సెంచరీ నమోదు చేశాడు. కోహ్లీకి టి20 ఫార్మాట్ లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్, కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ తో 20 ఓవర్లలో 180 పరుగులు చేసింది. గేల్ లేకపోవడంతో, వాట్సన్ తో కోహ్లీ ఇన్నింగ్స్ ఓపెన్ చేశాడు. వాట్సన్ త్వరగా అవుటైనా, కోహ్లీ మాత్రం అద్భుతమైన స్ట్రోక ప్లేతో అలరించాడు. వీలు చిక్కనప్పుడల్లా సింగిల్స్, డబుల్స్ తీస్తూనే చెత్త బంతుల్ని బౌండరీలకు తరలించాడు. కోహ్లీ మొదటి 50 పరుగులు చేయడానికి 40 బంతులు పడితే, తర్వాతి 50 చేయడానికి కేవలం 23 పరుగులే తీసుకున్నాడు. చాలా కాలం తర్వాత మంచి ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ 35 బంతుల్లో 51 పరుగులతో తన తొలి ఐపిఎల్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కు డ్వేన్ స్మిత్ (32, 21 బంతుల్లో), బ్రెండన్ మెకల్లమ్ (42, 24 బంతుల్లో) మంచి ఓపెనింగ్ ఇచ్చారు. దాంతో లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది గుజరాత్ లయన్స్. దినేష్ కార్తీక్ (50, 39 బంతుల్లో) టాప్ స్కోరర్ గా నిలిచాడు. గుజరాత్ బ్యాటింగ్ అద్భుతంగా సాగడంతో, మూడు బంతులుండగానే, ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది గుజరాత్ లయన్స్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లీకి లభించింది.