ట్యాక్సీకి డబ్బుల్లేక నడుచుకుంటూ వెళ్లిన క్రికెట్ గాడ్

క్రికెట్ లెజెండ్, ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కోట్లాది మంది అభిమానులతో పాటు కోట్లాది రూపాయల ఆస్తికి అధినేత. అలాంటి సచిన్‌‌ డబ్బుల్లేక క్యాబ్ ఎక్కలేకపోయాడు. అయితే ఇది ఇప్పుడు కాదు తాను 12 ఏళ్ల వయసులో ఉండగా జరిగిన సంఘటన. ముంబైలో డీబీఎస్ బ్యాంక్ డిజీ బ్యాంక్ యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తన మనసులో మాటను బయటపెట్టారు. ముంబై  అండర్-15 జట్టు తరపున పూణేలో మ్యాచ్‌లు ఆడేందుకు వెళ్లాను. నాలుగో ఆటగాడిగా క్రీజులో దిగే అవకాశం లభించింది. కానీ రనవుట్ కావడంతో ఎంతో నిరాశతో డ్రెస్పింగ్ రూమ్‌కు వచ్చి ఒక్కసారిగా ఏడ్చేశాను. ఆ తర్వాత ఈ టూర్‌లో మళ్లీ ఛాన్స్ రాలేదు. వర్షం పడుతుంటే ఆ రోజున బయటకు వెళ్లి సినిమా చూసి కడుపునిండా తిన్నాము. దాంతో జేబులో ఉన్నదంతా ఖర్చయిపోయింది. ముంబైకి రైలులో తిరిగి చేరుకున్న తర్వాత జేబులో చిల్లిగవ్వ కూడా మిగల్లేదు. దాంతో చేతిలో ఉన్న రెండు పెద్ద బ్యాగులను దాదార్ స్టేషన్ వద్ద వదిలి ఇంటికి నడుచుకుంటూ వెళ్లాను అంటూ సచిన్ తెలిపారు. కానీ ఆ తర్వాత స్వయంకృషితో ఎదిగి ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రీడాకారుడిగా ఎదిగాడు.

ఐపిఎల్ 2016 : సన్ రైజర్స్ స్కోర్ 118/8

వరుణుడి కారణంగా ఆలస్యంగా మొదలైన ఉప్పల్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో లో స్కోర్ నమోదైంది. టాస్ గెలిచిన ధోనీ హైదరాబాద్ కు బ్యాటింగ్ అప్పగించాడు. మొదటి ఓవర్లోనే ఓపెనర్ వార్నర్ అవుట్ కావడంతో సన్ రైజర్స్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటి వరకూ కేవలం వార్నర్ ఇన్నింగ్ప్ మీదే నెట్టుకొచ్చేసిన సన్ టీంకు, ఈ మ్యాచ్ లో మాత్రం పూర్తిగా మిడిల్ ఆర్డర్ కూడా ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు శిఖర్ ధావన్ (56, 53 బంతుల్లో) కాస్త ఫామ్ లోకి వచ్చాడు. చివరిలో భువనేశ్వర్ కుమార్ (21,8 బంతుల్లో) బ్యాట్ ఝళిపించడంతో, సన్ రైజర్స్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. పుణే బౌలింగ్ లో థిండాకు 3 వికెట్లు, మార్ష్ కు 2 వికెట్లు, పెరీరా అశ్విన్ లకు చెరో వికెట్ లభించాయి.

హైదరాబాద్ ఐపిఎల్ మ్యాచ్ కు వరుణుడి అడ్డంకి..!

  ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న సన్ రైజర్స్, పుణే సూపర్ గెయింట్స్ మ్యాచ్ కు వరుణుడు అడ్డు తగిలాడు. టాస్ గెలిచి హైదరాబాద్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు పుణే కెప్టెన్ ధోని. బ్యాట్స్ మెన్, ఫీల్డర్స్ గ్రౌండ్ లోకి వెళ్లగానే వర్షం మొదలైంది. దీంతో ప్లేయర్లందరూ వెనుదిరిగారు. పిచ్ ను గ్రౌండ్ స్టాఫ్ కవర్ చేశారు. తొమ్మిందింటిలోపు వర్షం తగ్గితే 20 ఓవర్ల మ్యాచ్ సాధ్యపడుతుంది. లేని పక్షంలో ఓవర్ల కోత మొదలవుతుంది. హైదరాబాద్ టీం లో గత మ్యాచ్ గెలిచిన టీంలో బరీందర్ స్రాన్ ప్లేస్ లో ఆశిష్ నెహ్రా వచ్చాడు. పుణే టీం ఆల్బీ మోర్కెల్ స్థానంలో మిచెల్ మార్ష్, అంకిత్ శర్మ స్థానంలో అశోక్ ధిండా తీసుకుంది. హైదరాబాద్ లో ఇప్పటి వరకూ ఫస్ట్ ఇన్నింగ్స్ టోటల్స్, 142, 142, 143 నమోదయ్యాయి. మూడింటిలోనూ ఛేజింగ్ చేసి సన్ రైజర్స్ గెలిచింది. ఈరోజు మొదట బ్యాటింగ్ చేస్తున్న కారణంగా, 160 లేదా 170 కి పైగా స్కోర్ నమోదు చేయాలని సన్ రైజర్ప్ భావిస్తోంది. సన్ ఆశలన్నీ డేవిడ్ వార్నర్, ముస్తాఫిజుర్ రెహమాన్ మీదే ఉన్నాయి. హైదరాబాద్ గత మూడు మ్యాచ్ లను గెలివగా, పుణే టీం మొదటి మ్యాచ్ తప్ప మళ్లీ గెలవలేదు. ఈ మ్యాచ్ ఓడిపోతే, పుణే కు సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది.

స్మృతి ఇరానీ తల పట్టుకున్న మాయవతి..!

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతిని అభిమానులు అపర కాళీకాదేవిగా మార్చారు. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా మాయావతి అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కాళీమాత ముఖాన్ని తొలగించి అక్కడ మాయావతి చిత్రాన్ని పెట్టారు. కాలికింద రాక్షసుడి స్థానంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌ని పెట్టారు. కాళీమాత మెడలో ఉండే పుర్రల స్థానంలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి తలను పెట్టారు. కాళీ మాత మరో చేతిలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తలను నరికి పట్టుకున్నట్లుగా ఉంది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మరో పక్క నిల్చుని కాళీమాతను శరణు కోరుతున్నట్లుగా ఆ పోస్టర్ ఉంది. దాంతోపాటుగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు రద్దే చేయబోనని చెబుతున్నట్లు రాశారు. దీనిపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఇలాంటి పోస్టర్ల ద్వారా బీఎస్సీ మత కల్లోలాన్ని ప్రోత్పహిస్తోందన్నారు. ఆ పార్టీ గతంలో కూడా హిందూ దేవతల్ని ఎగతాళి చేసిందని ఆరోపించారు. ఇప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడి కోరి ఇబ్బందులు తెచ్చుకుంటోందని బీజేపీ వ్యాఖ్యానించింది.

హైదరాబాద్‌‌పై దయ చూపిన భానుడు..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 36 డిగ్రీ‌లను దాటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. అలాంటి వాతారణంలో ప్రజలు అడుగు బయటపెట్టాలంటేనే వణికిపోతున్నారు. అయితే మొన్న కురిసిన వర్షంతో వాతావరణం కాస్తంత చల్లబడినట్లే చల్లబడి..మళ్లీ వేడెక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ మార్పు వచ్చింది. కొద్దిసేపటి క్రితం నగరంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. దిల్‌‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, చార్మినార్, నాంపల్లి, మైలార్‌దేవ్‌పల్లి, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసాయి. దీంతో జనానికి ఎండవేడిమి నుంచి కాస్తంత ఉపశమనం లభించింది.

పవన్‌కు గుడ్ ‌న్యూస్..రాజకీయ పార్టీలకు బ్యాడ్ న్యూస్

పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు గుడ్‌న్యూస్. ఆయన స్థాపించిన "జనసేన" కు రాజకీయపార్టీ హోదా దక్కింది. ఇప్పటికే తెలంగాణలో "జనసేన"కు రాజకీయపార్టీగా గుర్తింపు లభించగా, తాజాగా ఏపీలోనూ ఆ పార్టీకి పొలిటికల్ పార్టీ హోదా దక్కింది. ఈ మేరకు నిన్న ఏపీ ఎన్నికల సంఘం..జనసేనను రాజకీయ పార్టీగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ అధినేత పవన్‌కు గుర్తింపుకు సంబంధించిన పత్రాలు చేరాయి. ఆయనతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల సంఘం ఈ పత్రాలను పంపింది. ఇకపై "జనసేన"ను రాజకీయ పార్టీగా పరిగణించాలని ఆ పత్రాల్లో సూచించింది. దీంతో పార్టీ రిజిస్ట్రేషన్ దాదాపుగా పూర్తయినట్లే. అయితే రాజకీయ పార్టీగా గుర్తించినప్పటికి..ఇంకా పార్టీకి గుర్తును మాత్రం ఎన్నికల సంఘం కేటాయించలేదు. అయితే గుర్తు కేటాయింపులో స్వతంత్ర అభ్యర్థుల కంటే జనసేనకు ప్రాధాన్యమిస్తామని ప్రకటించింది. ఈ వార్తతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటుండగా..మిగతా పార్టీలు మాత్రం బరిలోకి మరో కొత్త పార్టీ వచ్చిందని ఫీలవుతున్నారు.

ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో భారీ అగ్నిప్రమాదం

దేశ రాజధాని ఢిల్లీలోని నేషనల్ నేచురల్ మ్యూజియంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున 1.45 ప్రాంతంలో పై అంతస్తులో మంటలు చేలరేగాయి. చూస్తుండగానే భవనమంతా వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 37 ఫైరింజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. నేచురల్ మ్యూజియమ్‌‌తో పాటు ఫిక్కి ఆడిటోరియం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. మంటలను అదుపుచేస్తున్న క్రమంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరిని చికిత్స నిమిత్తం రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. మంటలు సమీప ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదముండటంతో చుట్టుప్రక్కల భవనాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు.

మహిళతో రాజీ..రావెల సుశీల్ కేసు కొట్టివేత..

మహిళను చేయిపట్టుకుని బలవంతంగా లాగిన కేసులో మంత్రి రావెల కిశోర్ బాబు తనయుడు, రావెల సుశీల్‌పై నమోదైన కేసును తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది. గత నెల 4వ తేదిన హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.13లో మద్యం మత్తులో రోడ్డుపై నడిచి వెళుతున్న ఫాతిమా అనే మహిళను సుశీల్, కారు డ్రైవర్ అప్పారావు కారులోకి బలవంతంగా లాగే ప్రయత్నం చేశారు. దీంతో స్థానికులు సుశీల్, అప్పారావును చితకబాది పోలీసులకు అప్పగించారు. దీనిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం సుశీల్ బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే ఫిర్యాదుదారు ఫాతిమా బేగంతో రాజీ కుదిరిందని సుశీల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కేసును కొట్టివేసింది. పిటిషనర్లు, ఫిర్యాదు దారులు రాజీకి రావడంతో కేసును కొట్టివేస్తున్నట్టు న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

జగన్‌తో ఢిల్లీ వెళ్లాల్సిన 8 మంది ఎమ్మెల్యేలు మిస్సింగ్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని..ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిన్న ఢిల్లీ వెళ్లారు. అయితే ఈ బృందంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కనిపించడం లేదు. 44 మంది ఎమ్మెల్యేలు విమానం ఎక్కగా, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అసలు విమానమే ఎక్కలేదు. వీరిలో కిడారి సర్వేశ్వరరావు(అరకు), గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి),  బుడ్డా రాజశేఖర్ రెడ్డి ( శ్రీశైలం), పోతుల రామారావు (కందుకూరు), అమర్‌నాథ్ రెడ్డి (పలమనేరు), శ్రీకాంత్ రెడ్డి (రాయచోటి), రామచంద్రారెడ్డి ( పీలేరు), చెవిరెడ్డి భాస్కరరెడ్డి (చంద్రగిరి) ఉన్నారు.   వీరిలో అమరనాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రామచంద్రారెడ్డిలు విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా ఈ బృందంలో కనిపించలేదు.తాత మరణంతో నిన్న ఉదయం ఢిల్లీ నుంచి తిరుపతి వచ్చిన చెవిరెడ్డి తిరిగి రాత్రికల్లా ఢిల్లీ చేరుకున్నారు. ఇకపోతే కిడారి, గొట్టిపాటి, బుడ్డా. పోతుల కనిపించని వైనంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వీరు టీడీపీలోకి జంప్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందుకే నిన్న ఫ్లైట్ ఎక్కలేదని ప్రచారం జరుగుతోంది.   

మంత్రుల కార్యక్రమంలో జేబుదొంగల చేతివాటం..!

ఒకవైపు రాష్ట్ర మంత్రులు..కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు..పోలీస్ పహారా ఇలాంటి చోట దొంగతనం చేయడానికి ఎవరైనా ట్రై చేస్తారా? ఒకవేళ ట్రై చేసినా బయటకు తిరిగివస్తారా? కాని ఇది జరిగింది. నల్గొండ జిల్లా హాలియా మండలం తిరుమలగిరిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పాల్గొన్నారు. భూమిపూజ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమయంలో దొంగలు చేతివాటం చూపించారు. కార్యక్రమానికి హాజరైన వారి జేబులు కత్తిరించి రూ.18,700 వరకు కాజేశారు. బాధితుల్లో గ్రామ వీఆర్ఏ కూడా ఉన్నారు. ఫిర్యాదును అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సరి-బేసి విధానం నుండి మాకు మినహాయింపు కావాలి.. ఎంపీలు

  ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి చేసే ప్రయత్నంగా సరి-బేసి విధానం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధానం వల్ల సామాన్య ప్రజల నుండి రాజకీయ నేతల వరకూ జరిమానాలు కట్టవలసి వస్తుంది. తాజాగా ఓ ఎంపీ గారు కావాలనే నిబంధన ఉల్లంఘించి రెండు వేల రూపాయలు జరిమానా కట్టారు. అయితే ఇప్పుడు ఢిల్లీలో అమలులో ఉన్న సరి-బేసి సంఖ్య విధానం నుంచి తమకు మినహాయింపు నివ్వాలంటూ ఎంపీలందరూ ఒక్కటై డిమాండు చేస్తున్నారు. పార్లమెంట్ బడ్జెట్ రెండో దశ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఎంపీలు ఈ రకమైన ప్రతిపాదన తీసుకొచ్చారు. సరి-బేసి విధానం వల్ల పార్లమెంట్ కు ట్యాక్సీల్లో రావాలంటే కుదరదని.. కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ కూడా మాట్లాడుతూ.. విధానం కారణంగా సమావేశాలకు హాజరవ్వాలంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. మరి ఎంపీలకు సరి-బేసి విధానం నుండి మినహా ఇస్తారో లేదో చూడాలి.

మోడీని ఓఎల్ఎక్స్‌లో అమ్మేస్తా.. కన్నయ్యకు అవకాశం ఇచ్చారు

  శివసేనకు వివాదాస్పద  వ్యాఖ్యలు చేయడం కొత్తేమికాదు. అందునా మోడీ మీద... మోడీ ప్రభుత్వం మీద ఎప్పుడూ ఏదో ఒక రకంగా కామెంట్లు విసురుతూనే ఉంటారు. ఇప్పుడు తాజాగా మరోసారి ప్రధాని నరేంద్ర మోడీపై తనదైన శైలిలో విమర్శలు చేసే శివసేన మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించింది. తనపై విమానంలో దాడి చేశారన్న నేపథ్యంలో కన్నయ్య కుమార్ మోడీపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై శివసేన స్పందించి.. జేఎన్‌యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్ లాంటి చోటా నేతలకు కూడా విమర్శలు చేసే అవకాశం కల్పించారని అన్నారు.  విదేశాల్లోని నల్లధనం తీసుకొస్తానని, ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టస్తానని, ఎన్నికలకు ముందు మోడీ చాలా హామీలే గుప్పించారు.. తీరా ప్రధానమంత్రి అయ్యాక తన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారు. అందువల్లే కన్హయ్యకుమార్ లాంటి చిన్నాచితక నేతలు కూడా మోడీని ఓఎల్ఎక్స్‌లో అమ్మేస్తామని హెచ్చరిస్తున్నారు' అని బిజెపి మిత్రపక్షమైన శివసేన విమర్శించింది.

ఉగ్ర‌మూక‌ల‌కు ముచ్చెమ‌ట‌లు.. 800 మంది ఉగ్రవాదులు హతం

ఒకపక్క ఉగ్రవాదుల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.. మరోపక్క ఉగ్రవాదాన్ని అంతమొందించే దిశగా యెమెన్ ప్ర‌భుత్వం చర్యలు తీసుకుంటూనే ఉంది. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఏడాది కాలంలో అరబ్‌ సంయుక్త దళాలతో క‌లిసి జరిపిన దాడుల్లో ఇప్పటికి 800 మంది ఆల్ ఖైదా ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్ర‌వాదుల అధీనంలో ఉన్న‌ ముక‌ల్లా న‌గ‌రాన్ని, షెహర్‌లోని మినా అల్‌-ధాబాలోని ఆయిల్‌ టెర్మినల్‌ను మిల‌ట‌రీ ద‌ళాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. ఈ దాడుల్లో కీల‌క ఉగ్ర‌వాద‌నేత‌లు కూడా మృత్యువాత ప‌డ్డార‌ని సంబంధిత అధికారులు చెప్పారు. దీంతో యెమెన్ ప్ర‌భుత్వం జ‌రుపుతున్న దాడులతో అల్‌ఖైదా ఉగ్ర‌మూక‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇరాక్-సిరయాల ఉగ్రవాదులపై కూడా అగ్రరాజ్యాలు కూడా పోరాటం చేస్తుండటంతో అక్కడ కూడా చాలావరకూ ఉగ్రవాదులు తగ్గిపోయారు.

నిదియా టాప్ లెస్ సెల్ఫీ... ఆఫర్ల మీద ఆఫర్లు..

  మెక్సికోలోని ఎస్కొబెడోకు చెందిన నిదియా గార్సియా అనే పోలీసు అధికారిణి టాప్ లెస్ సెల్ఫీ దిగి.. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దానికి గాను ఆమెపై సర్వత్రా విమర్శలు తలెత్తడమే.. ఇలా చేసినందుకు ఆమెను సస్పెండ్ చేసి విచరాణకు ఆదేశించారు ఉన్నతాధికారులు. ఆ తరువాత నిదియా కూడా తాను చేసిన పనికి పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. అయితే విమర్శల సంగతేమో కానీ ఇప్పుడు ఆమెకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయట. ప్రముఖ మోడలింగ్ ఏజెన్సీలు తమ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలంటూ..తాము నిర్వహించే ఫోటో షూట్‌లలో న్యూడ్‌గా కాకుండా ప్రొఫెషనల్‌గా మాత్రమే ఉంటాయని ఆఫర్లు ఇస్తున్నాయట. మరి నిదియా వారి ఆఫర్లను అంగీకరిస్తుందో.. తిరస్కరిస్తుందో చూడాలి.