బీజేపీ,టీడీపీ మిత్రపక్షంగా.. ఇప్పుడే చెప్పలేం..
posted on May 25, 2016 @ 12:06PM
గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ మిత్రపక్షంగా ఉండి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే మారిన పరిస్థితులను బట్టి ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఉన్న సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముందునుండి బీజేపీ నేతలు, టీడీపీ నేతల ఒకరి మీద ఒకరు విమర్సలు గుప్పించుకున్నా.. ఆ తరువాత పెద్దలు కలుగజేసుకోవడంతో పరిస్థితులు చక్కబడేవి. ఒకానొక సందర్భంలో రెండు పార్టీలు విడిపోతాయి అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం నిజంగానే రెండు పార్టీలు విడిపోతాయేమో అన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. అసలే అంతంతమాత్రంగా ఉండే పార్టీలు.. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయం పై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో మిత్రపక్షంగా కొనసాగే అవకాశాలు లేవని అర్ధమవుతోంది.
అంతేకాదు దీనిపై భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకురాలు పురందేశ్వరి మాట్లాడుతూ.. అలాంటి అవకాశం లేదని చెప్పకనే చెప్పినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి కేంద్ర మంత్రులు రానున్న సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షంగానే కొనసాగుతూ తదుపరి ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై నిర్ణయాన్ని తాము ఇప్పుడే చెప్పలేమని.. ప్రస్తుతం రాష్ట్రంలో తమ పార్టీని బలపర్చే దిశగానే దృష్టి పెట్టామని, టీడీపీతో పొత్తు అంశాన్ని గురించి ఎటువంటి నిర్ణయాన్ని తెలపలేమని ఆమె అన్నారు. ఇంకా ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ బీజేపీ నేతలపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో.. ఆమె స్పందిస్తూ.. తమ పార్టీ అధిష్టానం రాష్ట్రానికి రావాల్సిన అన్ని ప్రయోజనాలపై దృష్టి పెడుతుందని.. అనవసరంగా టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఖండించారు.