డెబిట్‌ కార్డుల సర్వీస్ ఛార్జీలు ఎత్తివేత..

  పెద్ద నోట్ల రద్దు కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు వెసలుబాట్లు కల్పించింది. ఇప్పుడు తాజాగా మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్బంగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌ కొన్ని ప్రకటనలు చేశారు. అందులో ఆన్ లైన్ టికెట్లు, డెబిట్‌ కార్డుల సర్వీస్ ఛార్జీలను ఎత్తివేస్తున్నట్టు తెలిపారు. రైల్వేశాఖ ఆన్‌లైన్‌లో రైలు టికెట్‌ బుకింగ్‌కు డిసెంబర్‌ 31 వరకు సేవా రుసుము రద్దు చేసిందని.. ట్రాయ్‌ యూఎస్‌ఎస్‌డీ ఛార్జీలను రూ.1.50 నుంచి 50పైసలకు తగ్గించిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నగదు కొరత లేకుండా 1.5లక్షల తపాలా కార్యాలయాలు నగదు సరఫరా చేస్తున్నట్లు శక్తికాంత దాస్‌ ప్రకటించారు. సహకార బ్యాంకులకు నాబార్డు రూ.21వేల కోట్లు మంజూరు చేసిందన్నారు.

లోక్ సభకు మోడీ.. రేపటికి వాయిదా..

  పార్లమెంట్ ఉభయసభలకు ప్రధాని నరేంద్ర మోడీ రావాలని.. నోట్ల రద్దుపై ఆయన స్పష్టత ఇవ్వాలని ప్రతిపక్షాలు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండీ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా ఉభయసభల్లో ఇదే పరిస్థితి. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ప్రధాని మోడీ లోక్ సభకు వచ్చారు.  కానీ స‌భ ప్రారంభ‌మైన కొన్ని క్ష‌ణాల‌కే నోట్ల ర‌ద్దు దుమారంతో వాయిదా వేశారు. ప్రధాని రాకపై స్పందించిన ప్రతిపక్షాలు.. ప్ర‌ధాని మోదీ కేవ‌లం స‌భ‌కు వ‌స్తే స‌రిపోద‌ని, ఆయ‌న ప్ర‌తిప‌క్షాల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఎంత చెప్పినా ప్రతిపక్షాలు తమ ఆందోళనలు ఆపని నేపథ్యంలో సభను రేపటికి వాయిదా వేశారు.

కేసీఆర్ కొత్త ఇంటి విషయాలు... అవాక్కవ్వాల్సిందే

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కొత్త ఇంట్లోకి ప్రవేశించనున్న సంగతి తెలిసిందే.  బేగంపేటలో మొత్తం లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ భవంతి గురించిన విషయాలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే అంత కట్టుదిట్టమైన భద్రతతో ఈ కొత్త బంగళాను తయారు చేయించుకున్నారు కేసీఆర్. తాను వినియోగించే బాత్ రూమ్ ను సైతం బులెట్ ఫ్రూఫ్ గా తయారు చేయించారంటే మీరే అర్థం చేసుకోండి. ఇదంతా  రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సూచనల మేరకే కేసీఆర్ నిర్మించుకున్నారట. ఆ వివరాలు ఒకసారి చూద్దాం.. * సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ వినియోగించే రెండు పడక గదులను హై క్వాలిటీ గ్లాస్ తో ఫిట్ చేశారు. * ఎటువంటి బులెట్లు తగిలినా చెక్కు చెదరని అద్దాలతో బాత్ రూం * ఇంకా కనీసం 50 మంది భద్రతా సిబ్బంది అనునిత్యమూ భవంతికి పహారా * సుదూర ప్రాంతం నుంచి స్నిప్పర్ రైఫిల్ ద్వారా వచ్చే బులెట్లను అడ్డుకునేందుకే బులెట్ ప్రూఫ్ గ్లాస్ లు * వీటన్నింటితో పాటు అత్యాధునిక ఆయుధాలను చేతుల్లో కలిగుండే భద్రతా దళాలు, మందుపాతరలతో పేల్చినా ప్రమాదం జరగని కార్లు, జడ్ ప్లస్ సెక్యూరిటీని ఆయనకు కల్పించనున్నారు.

ఇంతలోనే ఎంత మార్పు ట్రంప్...

  అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్ధి అయిన హిల్లరీ క్లింటన్ పై, ఆమెకు మద్దతు తెలిపిన బరాక్ ఒబామాపై కూడా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా హిల్లరీ ఈ-మెయిల్స్ వ్యవహారంపై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ప్రత్యేక న్యాయవాది ద్వారా హిల్లరీ ఈమెయిల్స్ అవినతి వ్యవహారాన్ని చూడాలని నా అటార్నీ జనరల్ ను ఆదేశిస్తానని..  జైలుకు పంపిస్తానని పలుమార్లు చెప్పారు. అయితే సడెన్ గా ట్రంప్ కు ఏం జ్ఞానోదయం అయిందో తెలియదు కానీ మారిపోయినట్టు కనిపిస్తోంది. హిల్లరీని జైలుకు పంపే ఉద్దేశం లేదని, ఓటమితో కుంగిపోతున్న హిల్లరీ త్వరగా కోలుకునేందుకు ట్రంప్ సాయం చేస్తానని తెలిపారు. అంతేకాదు క్లింటన్పై క్రిమినల్ చర్యలు తీసుకుంటే దేశంలో చాలా చీలికలు వస్తాయని నాకు అనిపిస్తుంది' అని కూడా అన్నారు.   ఇదిలా ఉండగా ఒబామాపై తెగ కామెంట్లు చేసి ఇప్పుడు ఆయనను ప్రశసించారు. అమెరికా చరిత్రలోనే ఓ చెత్త అధ్యక్షుడిగా బరాక్ ఒబామా దిగిపోతారని అని నాడు అన్న ఆయన నేడు నాకు అధ్యక్షుడు ఒబామా అంటే చాలా ఇష్టం. ఆయన మంచి నాయకుడు అంటూ పొగిడారు. మరి ట్రంప్ లో ఇంత మార్పు రావడానికి గల కారణం ఏంటో.. ఇంకా ఎన్ని విషయాలపై తన అభిప్రాయం మార్చుకుంటారో చూడాలి.

పాక్ కు బుద్ది చెప్పడానికి రెడీ..

  భారత సరిహద్దులో పాకిస్థాన్ తన చర్యలతో పేట్రేగిపోతుంది. పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కవ్విస్తూనే ఉంది. నిన్న అయితే  ముగ్గురు భారత జవాన్లను పొట్టన బెట్టుకోవడంతో పాటు, ఓ జవాను మృతదేహాన్ని అత్యంత కిరాతకంగా ఛిద్రం చేసి తమ క్రూరత్వాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు పాకిస్థాన్ కు సరైన బుద్ధి చెప్పేందుకు సిద్దమవుతోంది భారత సైన్యం. పాకిస్థాన్ కు సరైన బుద్ధి చెప్పేందుకు ఇదే సరైన సమయమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. దీన్ని సీరియస్ గా తీసుకున్నామని.. పాక్ కు సరైన బుద్ధి చెప్పేందుకు తమ సైనికులు సిద్ధంగా ఉన్నారని ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ వెల్లడించారు. అంతేకాదు 120 ఎంఎం మోర్టార్స్ తో, మెషిన్ గన్స్ తో పాక్ ఆర్మీ పోస్టులపై దాడి చేయడానికి సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది.

మావోలకి మరో ఎదురుదెబ్బ...6గురు మృతి

  ఈ మధ్య మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఏవోబీ సరిహద్దులో కాల్పుల నేపథ్యంలో పలువురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఝార్ఖండ్ లో కూడా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఝార్ఖండ్‌లోని లతేహార్‌ జిల్లాలో మావోయిస్టులు, కోబ్రా బెటాలియన్‌ దళాల మధ్య బుధవారం ఉదయం భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూంబింగ్‌ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారని.. లొంగిపోవాలని హెచ్చరించినా వినకుండా తమపై కాల్పులు జరిపారని.. దీంతో తాము ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని.. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు హతమైనట్లు వెల్లడించారు.

ఏకమైన 13 ప్రతిపక్ష పార్టీలు..

  పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండీ ఈ వ్యవహారంపై తప్ప మరే విషయంపై చర్చ జరపడానికి ప్రతిపక్షాలు ఒప్పుకోవడంలేదు. ప్రధాని నరేంద్ర మోడీ సభకు రావాల్సిందే.. ఈ విషయంపై మాట్లాడాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా ఉభయసభల్లో అదే పరిస్థితి తలెత్తింది. అంతేకాదు 13 ప్రతిపక్ష పార్టీలు, ప్రధానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపేందుకు నిర్ణయించాయి. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ..ప్రజల ఇబ్బందులను తక్షణం తొలగించాలని తాము కోరుతుంటే, ప్రభుత్వం ఎంత మాత్రమూ స్పందించడం లేదని అందుకే పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టనున్నట్టు ప్రకటించారు. నేటి మధ్యాహ్నం జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నాను నిర్వహించనున్నామని, ఆపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి, నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆయనకు తెలియజేస్తామని మమత పేర్కొన్నారు.

జకీర్ నాయక్ విషయంలో అనుకున్నదే జరిగింది..

  వివాదాస్పద ఇస్లామిక్ మత ప్రబోధకుడు జకీర్‌ నాయక్‌ ప్రసంగాలు ఉగ్రవాదాన్ని ప్రేరేపించేలా ఉన్నాయి అంటూ ఇప్పటికే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈయనపై కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఆయన కూడా ఇండియా వస్తే తనను ఎక్కడ పట్టుకుంటారో అన్న భయంతో భారత్ కు సైతం రావడానికి భయపడుతున్నారు. అయితే ఇప్పుడు అందరూ సందేహించినట్టే అయ్యింది. జకీర్‌ నాయక్‌కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. ఇటీవల ఆయన సంస్థలపై దాడులు జరపగా ఈ విషయం బయటపడింది. జకీర్ నాయక్‌ కు ఇస్లామిక్ రీసెర్చ్‌ పౌండేషన్(ఐఆర్ఎఫ్) అనే స్వచ్ఛంద సంస్థ ఉన్న విషయం తెలిసిందే. దీనినుంచి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్కు చెందిన అబూ అనాస్ అనే వ్యక్తికి రూ.80,000 స్కాలర్ షిప్పుగా అందించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. అనాస్ సిరియా వెళ్లి ఉగ్రవాద సంస్థలో చేరేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్న సమయంలో అతడికి రాజస్థాన్‌ లోని టోంక్ లో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలో ఉపకార వేతనం రూపంలో జమ చేసినట్లు ఎన్ఐఏ స్పష్టం చేసింది. అనాస్ తొలుత తనకు స్కాలర్ షిప్పు ఇవ్వాలంటూ వెబ్‌ సైట్‌ ద్వారా దరఖాస్తు చేసు అతడిని ముంబయికి పిలిచి ఇంటర్వ్యూ చేసి ఈ డబ్బు మంజూరు చేశారు.   ఇదిలా ఉండగా అసలు అనాస్ సమాచారంతోనే ఎన్ఐఏ జకీర్ సంస్థపై దాడి జరిపింది. ఇటీవలే యువతను ఉగ్రవాదానికి ప్రేరేపిస్తున్న కారణంతో అనాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తనను విచారించగా ఈ వివరాలు చెప్పడంతో. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ జకీర్ సంస్థలపై దాడి చేసింది. మరి ఇంకెన్ని విషయాలు బయటపడతాయో చూడాలి. ముందు ఇంతకాలం తనకేమి తెలియదు అని బొంకిన జకీర్ దీనికి ఏం సమాధానం చెపుతారో చూడాలి.

ఇస్రో మాజీ చీఫ్ మృతి....

  ఇస్రో మాజీ చీఫ్, ప్రముఖ ఫిజిక్స్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎం.జీ.కే. మీనన్(88) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తన తుదిశ్వాసను విడిచారు. 35 ఏళ్ల వయసులో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌కు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు 1972లో ఆయన ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1982-1989 వరకు ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా, 1986-1989 వరకు ప్రధాని శాస్త్ర సలహాదారుడిగా, 1989-1990 వరకు సీఎస్‌ఐఆర్ వైస్ ప్రెసిడెంట్‌గా, 1990-96 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఆయన వివిధ హోదాల్లో తన సేవలను అందించారు. గత ఐదు దశాబ్దాలుగా దేశం శాస్త్ర, సాంకేతిక రంగంలో అభివృద్ధిపథంలో పయనించడానికి మీనన్ ఎంతో కృషిచేశారు. మీనన్‌కు భార్య, కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు.

పాక్ సైన్యం క్రూరత్వం..భారత జవాను శరీరం ఛిద్రం

పదే పదే చావు దెబ్బలు తగులుతున్నా పాక్ సైన్యం వైఖరిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దు గ్రామాలపైనా..భారత ఔట్ పోస్టులపైనా కాల్పులకు తెగబడుతూనే ఉంది. ఇవాళ జమ్మూకశ్మీర్‌లోని మచల్ సెక్టార్‌పై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ముగ్గురు భారత సైనికులు అమరులయ్యారు. ఆ ముగ్గురు సైనికులు చనిపోయిన తర్వాత వారిలో ఒకరి శరీరాన్ని చెప్పడానికి వీల్లేనంత దారుణంగా ఛిద్రం చేసింది. అంతేకాకుండా ఆ జవాను తలను నరికి తీసుకెళ్లింది. పాక్ సైన్యంలోని స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహించే బలగాలు ఈ దాడులకే పాల్పడినట్లు ఆర్మీ వెల్లడించింది. పాక్ ఇలాంటి పైశాచికానికి పాల్పడటం ఈ నెలలో ఇది రెండోసారి. ఈ ఘటనపై భారత సైన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఊహించని రీతిలో దెబ్బకు దెబ్బ తీస్తామని సిద్ధంగా ఉండాలని పాక్ సైన్యాన్ని హెచ్చరించింది.

ఉపఎన్నికలు ఫలితాల వివరాలు...

  దేశంలోని పలు ప్రాంతాల్లో ఉప ఎన్నికల్లో జరిగిన సంగతి తెలిసిందే. పుదుచ్చేరిలోని నెల్లితోపు, మధ్యప్రదేశ్‌లోని నేపానగర్‌, త్రిపుర, అస్సోం, పశ్చిమ్‌ బెంగాల్, తమిళనాడులోని 8 అసెంబ్లీ స్థానాలకు, 4 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉపఎన్నికలకు సంబంధించి ఎన్నికల లెక్కింపు ఈరోజు జరిగింది. ఈ ఎన్నికల సంబంధించిన ఫలితాలు.. * పుదుచ్చేరిలోని నెల్లితోపు ఉప ఎన్నికల్లో పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి ఘనవిజయం సాధించారు. అన్నాడీఎంకే అభ్యర్థి ఓం శక్తి శేఖర్‌పై ఆయన 11,151 ఓట్ల తేడాతో గెలుపొందారు. * తమిళనాడులోని తంజావూరులో 26,483 ఓట్ల ఆధిక్యంతో అన్నాడీఎంకే అభ్యర్థి గెలుపొందగా, తిరుపరకుండ్రం, అరవకురుచ్చి నియోజకవర్గాల్లో అన్నాడీఎంకే అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. * మధ్యప్రదేశ్‌లోని నేపానగర్‌ అసెంబ్లీ స్థానంలో భాజపా అభ్యర్థి మంజూ దాడు తన ప్రత్యర్థిపై 42,198 ఓట్ల తేడాతో విజయం సాధించారు. షాదల్‌ లోక్‌సభ స్థానం నుండి బీజేపీ అభ్యర్థి జ్ఞాన్‌సింగ్ 60,383 ఓట్లతో గెలుపొందారు. * త్రిపురలోని రెండు అసెంబ్లీ స్థానాల్లో సీపీఎం విజయకేతనం ఎగుర వేసింది. బర్జాలా నియోజకవర్గంలో జుమ్ముసర్కార్‌, కోవాయి నియోజకవర్గంలో బిస్వజిత్‌ దత్‌ గెలుపొందారు. * అస్సోంలోని లఖీంపుర లోక్‌సభ స్థానంలో భాజపా ముందంజలో ఉంది. * పశ్చిమ్‌ బంగలోని మాన్‌టేశ్వర్‌ అసెంబ్లీ స్థానంలో టీఎంసీ అభ్యర్థి సైకత్‌ పంజా గెలుపొందారు. తామ్‌లుక్‌ లోక్‌సభ స్థానంలో కూడా టీఎంసీ అభ్యర్థి దిబ్యేందు అధికారి గెలుపొందారు.  కూచ్ బేహార్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఎంసీ అభ్యర్థి పార్థ ప్రతిమ్ రాయ్ గెలుపొందారు.

సెటైర్ వేసి పగ తీర్చుకున్న సెహ్వాగ్..

  టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియా ద్వారా తన ప్రత్యర్థులకు సెటైర్లు వేయడంలో దిట్ట అని తెలిసిందే. ఇప్పుడు తాజాగా అలాంటి సెటైరే వేసి తన కోపాన్ని తీర్చుకున్నాడు. అదేంటంటే.. టీమిండియా ఇంగ్లాడ్ మధ్య టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే విశాఖలో రెండో టెస్ట్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో  జేమ్స్ ఆండర్సన్  మొదటి బంతికి పెవిలియన్ చేరి కింగ్ పెయిర్ గా అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో దీనికి స్పందించిన సెహ్వాగ్.. గతంలో నేను కింగ్ పెయిర్ కావడానికి నువ్వు కారణమయ్యావు. ఇప్పుడు నువ్వు అలానే అయ్యావు. లెక్క సరిపోయినట్లుంది అని సెటైర్ వేశాడు.   కాగా 2011లో ఇంగ్లండ్ తో మ్యాచ్ సందర్భంగా సెహ్వాగ్ తొలి ఇన్నింగ్స్ లో తొలి బంతికే బ్రాడ్ బౌలింగ్ లో అవుట్ కాగా, రెండో ఇన్నింగ్స్ లో అండర్సన్ బౌలింగ్ లో మొదటి బంతికి పెవిలియన్ చేరాడు. దీంతో కింగ్ పెయిర్ గా కీర్తి గడించాడు.

పిలిచి మరీ తిట్టిన ట్రంప్...

  అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కు మీడియా వారిని, జర్నలిస్టులను తిట్టడం కొత్తేమి కాదు. అప్పుడప్పుడు వారిమీద మండిపడుతూనే ఉంటారు. ఇప్పుడు తాజాగా మరోసారి మీడియా ప్రముఖులు, జర్నలిస్టులపై తన ప్రతాపాన్ని చూపించారు. వారిని పిలిపించి మరీ తిట్టిపోశారు. వివరాల ప్రకారం..న్యూయార్క్‌లో  మీటింగ్‌ ఆఫ్‌ మైండ్స్‌ పేరిట సమావేశానికి మీడియా ప్రముఖులు, జర్నలిస్టులను పిలిచి జర్నలిస్టులు నిజాయితీలేని వ్యక్తులనీ, వంచకులు, అబద్ధాలకోరులనీ ట్రంప్‌ ధ్వజమెత్తారు. ‘ప్రేక్షకులకు పారదర్శకమైన, కచ్చితమైన సమాచారం అందజేయడంలో మీరు విఫలమయ్యారు. నన్ను, నేను లక్షలాది అమెరికన్లకు చేసిన విజ్ఞప్తులను అర్థం చేసుకోవడంలో మీరు విఫలమయ్యారు’ అంటూ ట్రంప్‌ మండిపడ్డారు. దీంతో ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు విలేకరుల ఒక్కసారిగా షాకయ్యారు. మొత్తానికి ఇప్పుడే పాపం మీడియా వారికి ట్రంప్ చుక్కలు చూపిస్తే.. ముందు ముందు ఇంకెన్ని చుక్కలు చూపిస్తారో చూద్దాం..

సినిమాల్లో రొమాన్స్ పై వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు...

  కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అదేదో రాజకీయాలకు సంబంధించి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. వెంకయ్యనాయుడు వ్యాఖ్యలు చేసింది సినీరంగంపై. సీనీ పరిశ్రమ గురించి.. సినిమాల గురించి మాట్లాడిన ఆయన..  ప్రస్తుతం సినిమాల్లో అశ్లీలత బాగా పెరిగిపోయిందని... ఇలాంటివి సమాజంపై ప్రభావాన్ని చూపిస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హింస, అశ్లీలతలు లేకుండా... భావోద్వేగాలతో మంచి సినిమాలు తీస్తే, సమాజానికి మంచిదని.. సందేశాత్మక చిత్రాలను నిర్మించాలని చెప్పారు. అనవసరంగా హీరోయిన్లను అసభ్యంగా చూపించవద్దని దర్శక నిర్మాతలను కోరారు. హీరోయిన్లను ముట్టుకోకుండానే రొమాన్స్ ను అద్భుతంగా పండిచవచ్చని వెంకయ్య తెలిపారు. పెదవులు, కళ్లు, ముక్కు, చూపులతో కూడా రొమాన్స్ ను పండించవచ్చని చెప్పారు.

ఏటీయంకు ఎమ్మెల్యే పూజ...

  పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంపై ఇప్పటి వరకూ ఎంతో మంది నేతలు విమర్శలు గుప్పించారు. ఇక పార్లమెంట్ సంగతైతే చెప్పనక్కర్లేదు. శీతాకాల సమావేశాలు ప్రారంభమైన దగ్గరనుండి ఉభయసభల్లో రోజూ అదే సీన్. ఇంకొంత మంది తనకు నచ్చిన రీతిలో నిరసనను తెలిపారు. ఇప్పుడు తాజాగా ఓ మాజీ ఎమ్మెల్యే తన నిరసనను తెలిపారు. వివరాల ప్రకారం... ఎల్బీనగర్‌ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పెద్ద నోట్ల రద్దుపై స్పందిస్తూ..ఇన్నేళ్లలో ఎవరూ చేయని పని తాము చేశామని చెప్పుకోవడానికే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లోని కొత్తపేటలో ఆంధ్రాబ్యాంకు ఏటీఎంకు ఆయన పూజలు చేశారు. ప్రజలకు సరిపడా చిల్లర నోట్లు అందుబాటులో ఉంచకుండా పెద్దనోట్లను రద్దు చేయడం వల్ల ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు కూడా వెనుకాడాల్సి వస్తోందని.. క్షేత్రస్థాయిలో ఇబ్బందులను సమీక్షించకుండా నిర్ణయం తీసుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.