రైలు ప్రమాద బాధితులకు రద్దయిన నోట్లు పంపిణీ..
posted on Nov 21, 2016 @ 9:35AM
పాట్నా నుంచి ఇండోర్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ ఉత్తరప్రదేశ్‌లోని కాన్‌పూర్ దేహత్ జిల్లాలోని పుఖ్రాయాన్ వద్ద పట్టాలు తప్పి ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసింది. నిన్న ఉదయం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. గాయపడిన వారి సంఖ్య అయితే చెప్పలేం. వీరందరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ యాక్సిడెంట్ నేపథ్యంలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. అదేంటంటే.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రద్దయిన 500 నోట్లు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 5వేలు చొప్పున నోట్లను పంపిణీ చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసుల అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని విచారించగా.. రైల్వే శాఖ వారే ఈ డబ్బు ఇచ్చినట్లు ఆ వ్యక్తులు చెప్పారు. ఆ సందర్బంగా కంజ్‌పూర్ జోన్ కమిషనర్ ఇఫ్తికరుద్దీన్ మాట్లాడుతూ.. దీనిపై విచారణ జరపాల్సిందిగా ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్‌ను ఆదేశించినట్లు చెప్పారు. రైల్వే అధికారులే ఈ డబ్బు ఇచ్చారన్న విషయంపైనా విచారణ జరపనున్నామన్నారు.