వాళ్లు వెళ్లే వరకూ ఇంటికి వెళ్లను... రాత్రంతా సచివాలయంలోనే
posted on Dec 2, 2016 @ 9:37AM
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుపై రచ్చ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. కుదిరినప్పుడల్లా పెద్ద నోట్ల రద్దుపై, ప్రధాని నరేంద్ర మోడీపై ఆమె విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరో విషయంపై ఆమె కేంద్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ఉన్న టోల్ బూత్ ల వద్ద సైన్యాన్ని మోహరించడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేనా.. సైన్యం వెళ్లిపోయేదాకా తాను ఇంటికి వెళ్లేది లేదని సచివాలయంలోని తన కార్యాలయం నుండి కదల్లేదు. అసలు సంగతేంటంటే.. నేటి నుంచి టోల్ బూత్ ల వద్ద డబ్బులు చెల్లించక తప్పనిసరి పరిస్థితి నెలకొనడంతో, ప్రజలు నిరసనలకు దిగి, విధ్వంసం సృష్టించవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల మేరకే సైన్యాన్ని మోహరించారు. దీనిలో భాగంగానే దీదీ కార్యాలయానికి 500 మీటర్ల దూరంలోనే హుగ్లీ బ్రిడ్జ్ టోల్ బూత్ ఉంది. అక్కడా సైన్యం కాపలాకు దిగింది. దీనిపై స్పందించిన ఆమె "ఇది సైనిక తిరుగుబాటా?" అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా టోల్ గేట్ ల వద్ద సైన్యాన్ని ఎలా నియమిస్తారని...సైన్యం వెళ్లిపోయేదాకా తాను ఇంటికి వెళ్లేది లేదని రాత్రంతా తాను ఆఫీసులోనే ఉండి పరిస్థితిని చూస్తానని చెప్పారు. అయితే ఆ తరువాత హుగ్లీ బ్రిడ్జ్ నుంచి సైన్యం వెళ్లిపోయినా మమత కదల్లేదు. ఇంకా 18జిల్లాల్లోని టోల్ బూత్ ల వద్ద సైన్యం కాపలా కాస్తోందని, వాళ్లంతా వెళ్లిపోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం 8.45 గంటల సమయానికి కూడా ఆమె సచివాలయంలోనే ఉన్నారు. అక్కడి నుంచి కదల్లేదు.