మిస్ వరల్డ్-2025 ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

  మిస్ వరల్డ్-2025 ఏర్పాట్లపై హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మే7 వ తేదీ నుండి జున్2 తేదీ వరకు హైదరాబాద్ వేదికగా జరగనున్న 72వ ప్రపంచ అందాలు పోటీల్లో ఎలాంటి అవాంతరాలు, ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎయిర్‌పోర్టు నుంచి అతిథులు బస చేసే హోటల్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ సమీక్షకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈనెల 7న ప్రారంభం కానున్న ఈ పోటీల్లో 120 దేశాలకు చెందిన అందాల భామలు సందడి చేయనున్నారు. మరోవైపు మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ నగరం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. వందకు పైగా దేశాల నుంచి వచ్చే అందాల భామలకు స్వాగతం చెప్పేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇవాల్టి నుంచి విదేశీ ప్రతినిధులు రానున్న నేపథ్యంలో ప్రత్యేక లాంజ్ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. అలాగే తెలంగాణ పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక చిహ్నాలతో కూడిన స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు.  

ఏపీ మద్యం కుంభకోణం.. ఏ క్షణంలోనైనా ఆ ముగ్గురూ అరెస్టు?

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మరో ముగ్గురు కీలక నిందితుల అరెస్టుకు రంగం సిద్ధమైందా? హైకోర్టు, సుప్రీం కోర్టూ కూడా ముందస్తు బెయిలుకు నిరాకరించడంతో వారి అరెస్టు ఇక అనివార్యమా? అంటే ఔనన్న సమాధానమే వస్తుంది. ఇంతకీ ఆ ముగ్గురూ ఎవరంటారా? జగన్  మాజీ పిఎ ధనుంజయ్ రెడ్డి, పిఏ పి.కృష్ణమోహన్ రెడ్డి, అలాగే జగన్ సతీమణి భారతి ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప. ఈ ముగ్గిరికీ అరెస్టు నుంచి ఎలాంటి రక్షణ ఇవ్వలేమని తొలుత హైకోర్టు, ఆ తరువాత సుప్రీం కోర్టూ కూడా ఖరాఖండీగా చెప్పేశాయి. దీంతో ఏ క్షణంలోనైనా వీరి అరెస్టు జరగొచ్చని అంటున్నారు.  ఏపీ మద్యం కుంభకోణం కేసులో రాజ్ కేసిరెడ్డిని వారం రోజులు కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. అలాగే రాజ్ కేసిరెడ్డి  పీఏ దిలీప్ దుబాయ్ పరారవ్వడానికి ప్రయత్నిస్తూ చెన్నై విమానాశ్రయంలో దొరికిపోయాడు. ఈ నేపథ్యంలో ఈ కేసులో  ఆరోపణలు ఎదుర్కొంటున్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలు అరెస్టు నుంచి రక్షణ కోరుతూ తొలుత హైకోర్టును ఆశ్రయించారు. అయితే వారి యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్  విచారణ వాయిదా వేసిన హైకోర్టు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో వీరు ముగ్గురూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.   అయితే సుప్రీం కోర్టు వారి పిటిషన్ విచారణనుఈ నెల 8కి వాయిదా వేసింది.  ఈ నెల 7న హైకోర్టులో విచారణ ఉన్నందున వారి బెయిలు విషయంలో ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వజాలమని స్పష్టం చేసింది. అంతే కాకుండా  చట్టపరంగా ముగ్గురినీ కూడా అరెస్టు చేయవచ్చని పేర్కొంది. ఇక ఇదే కేసులో మిథున్ రెడ్డి ఇప్పటికే దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ తో కలిసి వీరి పిటిషన్ ను కూడా ఈ నెల 8న విచారణ జరుపుతామని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందని న్యాయనిపుణులు అభిప్రాయపడు తున్నారు. 

శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్

  సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఏషియన్ ట్రాన్స్‌కేర్ రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించిన విషయం తెలిసిందే. రిహాబిలిటేషన్ కేంద్రంలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న శ్రీతేజ్‌ను సోమవారం ఉదయం నిర్మాత అల్లు అరవింద్, నిర్మాత బన్నీ వాసు పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.  శ్రీతేజ్ హాస్పిటల్‌లో ఉన్నప్పటి నుంచి అతని యోగ క్షేమాలను అల్లు అర్జున్, అల్లు అరవింద్, బన్నీ వాసు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు.  శ్రీతేజ్ హాస్పిటల్ ఖర్చులతో పాటు, అతని కుటుంబానికి హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, మైత్రీ మూవీస్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్‌లు ఆర్థికంగా సహాయం చేసిన సంగతి తెలిసిందే. శ్రీతేజ్ మళ్లీ ఎప్పటిలానే నార్మల్ స్థితికి వచ్చి, అందరితో కలిసి స్కూల్‌కు వెళ్లే వరకు, అలాగే భవిష్యత్‌లో అతనికి ఏ అవసరం వచ్చినా అతనికి, అతని ఫ్యామిలీకి అండగా ఉండేందుకు అల్లు అర్జున్ సైతం కమిటై ఉన్నారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స మొదలు, ప్రస్తుతం రిహాబిలిటేషన్ సెంటర్‌లో ట్రీట్‌మెంట్ వరకు ఎప్పటికప్పుడు అల్లు అరవింద్, బన్నీ వాసులను పంపించి, శ్రీతేజ్ ఆరోగ్యపరిస్థితిని అల్లు అర్జున్ తెలుసుకుంటూనే ఉన్నారు.

శ్రీవారి భక్తులకు శుభవార్త ..ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు

  శ్రీవారి భక్తులకు టీటీడీ పాలక మండలి గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతి నుంచి కాలినడకన తిరుమలకు వచ్చే భక్తుల కోసం 20 ఎలక్ట్రిక్ బస్సులను  టీటీడీ ఉచితంగా నడపనుంది. ఈ వాహనాలలో తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి మీదుగా శ్రీవారి మెట్టు వరకు భక్తులను ఎలక్ట్రిక్ వాహనాలలో తీసుకెళ్లాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు నిర్ణయించినట్లు తెలుస్తోంది. వేసవి ఎండలలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తిరుమలలో అనేక రకాల ఏర్పాట్లు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నీటి సదుపాయం, వైద్య సదుపాయం, భోజన సదుపాయాలను కల్పిస్తున్నారు.  దీంతో ప్రజలందరూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పటికే టీటీడీ  ఆధ్వర్యంలో ఉచిత ధర్మరథం బస్సులను ఏర్పాటు చేసినా భక్తుల రద్దీకి అనుగుణంగా లేవు. ఇదే అదనుగా జీపు, ట్యాక్సీ, ఆటోడ్రైవర్లు భక్తులను అడ్డంగా దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో నిర్వహించే తిరుమల ధర్మకర్తల మండలి సమావేశంలో దాతల సహకారంతో బస్సులను కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకుంటారని సమాచారం.  

బాబు బాటలో కేసీఆర్?!

బీఆర్ఎస్  అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు తెలుగు దేశం అధినేత ,ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి బాటలో అడుగులు వేస్తున్నారా?  లేదా వేయాలని అనుకుంటున్నారా? ఆయన బాటలోనే  సాగుతున్నారా లేదా సాగాలని అనుకుంటున్నారా?  అంటే బీఆర్ఎస్ వర్గాల నుంచి ఆ ప్రశ్నలన్నిటికీ  అవుననే సమాధానమే వస్తోంది. ఇటీవల ఘనంగా నిర్వహించిన రజతోత్సవం సంబురాల నేపధ్యంలో పార్టీలో, కుటుంబలో తలెత్తిన అంతర్గత సమస్యల పరిష్కారానికి  కేసీఆర్ పార్టీ పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. నిజమే. రజతోత్సవం సంబురాలు ఘనంగా జరిగాయి. అందులో సందేహం లేదు. అయితే..  గతంలో ఇక్కడే అనుకున్నట్లుగా.. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్’ అన్నట్లు ఆ కథ ముగిసింది.    జనసమీకరణ ఘనంగా జరిగినా.. గులాబీ బాస్ స్పీచ్ అంతగా రక్తికట్టలేదు. ఉత్సాహంగా  వచ్చిన పార్టీ  క్యాడర్  నిరుత్సాహంగా తిరిగి వెళ్ళవలసి వచ్చిందని పార్టీ నాయకులే పెదవి విరిచారు. వందల కోట్లు ఖర్చు పెట్టి సంబురాలు చేసుకున్నా  చివరకు హళ్లికి హళ్లి సున్నకు సున్నా అన్నట్లుగా ఫలితం శూన్యం  అనే  ఆవేదన పార్టీలో వ్యక్తమవుతోంది. మరో వంక పార్టీ పునర్వ్యవస్థీకరణ అవసరాన్ని నాయకత్వం గుర్తించిందనీ, ముఖ్యంగా అంతర్గత కలహాలకు అంతకంటే ముఖ్యంగా కుటుంబంలో రగులుతున్న ట్రైయాంగిల్ వార్ కు పార్టీ పునర్వ్యవస్థీకరణ పరిష్కారం చూపుతుందని కేసేఆర్ భావిస్తున్నట్లు చెపుతున్నారు. నేపధ్యంలోనే కేసీఆర్ పార్టీ పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టారని అంటున్నారు.  ఇక్కడే కేసీఆర్  తెలుగు దేశం  అధినేత చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో అడుగులు వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి ( టీఆర్ఎస్) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా  బీఆర్ఎస్  కు జాతీయ కార్యవర్గం ఇప్పటికీ ఏర్పడ లేదు. ఆఫ్కోర్స్  పూర్తి స్థాయి రాష్ట్ర కార్యవర్గం కూడా లేకుండానే, గులాబీ పార్టీ పాతికేళ్ళ ప్రస్థానం సాగించింది.  అది వేరే విషయం.  అయితే  ఇప్పుడు  కేసీఆర్ గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అన్ని స్థాయిల్లో పూర్తి స్థాయి కార్యవర్గాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షులు, జాతీయ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఇతర కీలక పదవులతో పార్టీ సంస్థాగత స్వరూపాన్ని పూర్తిగా మార్చే ఆలోచన కేసేఆర్ చేస్తున్నారని అంటున్నారు. అదే జరిగితే, తెలుగు దేశం పార్టీ చంద్రబాబును ఎలా జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకుందో అలాగే..  బీఆర్ఎస్ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  కేసీఆర్ ని, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకుంటుందని పార్టీ వర్గాల సమాచారం.    అలాగే.. రాష్ట్రంలో ప్రస్తుతం  కుల గణన పునాదిగా  బీసీ రాజకీయం నడుస్తున్న  నేపధ్యంలో బీసీలలో పట్టున్న బలమైన బీసీ నాయకుడిని రాష్ట్ర అధ్యక్షునిగా నియమించే  ఆలోచనలో  కేసేఆర్ ఉన్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పీసీసీ పగ్గాలను బీసీకి అప్పగించింది, బీజేపీ కూడా బీసీకే పట్టం కట్టే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పగ్గాలను బీసీ నేతకు అప్పగించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు.  బీసీకి రాష్ట పార్టీ పగ్గాలు అప్పగించడం, ఉభయతారకంగా ఉంటుదని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో  బీసీలలో పట్టు సాధించేందుకు చంద్రబాబు నాయుడు, ఇదే వ్యూహాన్ని అనుసరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.     అయితే.. రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు ఇస్తే  కుటుంబ త్రయం,(కేటీఆర్, హరీష్ రావు, కవిత) పరిస్థితి ఏమిటి? అనే విషయంలో కేసీఆర్ ఎటూ తేల్చుకోలేక పోతున్నారని అంటున్నారు. రజతోత్సవ సభ వేదికపై అమర్చిన బ్యానర్ సహా స్వాగత తోరణాలు ఇతరత్రా ఏర్పాటు చసిన కటవుట్లు, బ్యానర్లలో కేసీఆర్, కేటీఆర్  తప్ప మరొకరికి చోటివ్వలేదు. ఇది పార్టీలో పెద్ద దుమారమే రేపినట్లు ప్రచారం జరుగుతోంది. సో.. కుటుంబ త్రయంను సంతృప్తి పరిచే విధంగా ఆ ముగ్గురికి పార్టీ పదవుల పంపకం ఎలా చేయాలన్న విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని అంటున్నారు.  అయితే..  కేటీఆర్ ను బీఆర్ఎస్  జాతీయ సెక్రటరీ జనరల్  గా నియమించే ఆలోచన ఉందని అంటున్నారు. అలాగే.. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం అన్నకేటీఆర్ తో పోటీ పడుతున్న కవితను రాష్ట్ర పార్టీలో సెక్రటరీ జనరల్ గా నియమించి ఇద్దరి మధ్య బాలన్స్ చేసే ఆలోచన  కేసీఆర్ చేస్తున్నారని అంటున్నారు. ఇక హరీష్ రావు విషయానికి వస్తే.. పార్టీలో ఆయన భవిష్యత్ భూమిక ఏమిటి అనేది ఇంకా స్పష్టం కాలేదు. జాతీయ స్థాయిలో కీలక బాధ్యతను అప్పగించడమా లేక కోర్ కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించడమా అనే విషయంలో కేసీఆర్ ఇంకా నిర్ణయానికి రాలేదని అంటున్నారు. అలాగే, కేటీఆర్, హరేశ్, కవిత సహా కీలక నేతలు అందరికీ స్థానం కల్పిస్తూ..  పొలిట్  బ్యూరోను పునర్వ్యవస్థీకరించడంతో పాటుగా జిల్లా ఆధ్యక్షులను, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల కార్యవర్గాలను పూర్తి స్థాయిలో పునరుద్దరించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.  అయితే..  అన్నిటిని మించి కేసీఆర్  చంద్రబాబు బాటలో,  చంద్రబాబు అడుగుఅడుగు జాడల్లో నడవాలనే నిర్ణయానికి వచ్చారని త్వరలోనే కేసీఆర్ సంస్థాగత మార్పులకు ఖాయంగా శ్రీకారం చుడతారని అంటున్నారు. అయితే ఫ్యామిలీ ట్రయో.. కుటుంబ త్రయం మధ్య సఖ్యత,   సమన్వయం  ఎలా సాధ్యం? ఎంత వరకు సాధ్యం? కే సీఆర్ ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అవుతుంది? గులాబి పార్టీ భవిష్యత్ కు సంబంధించిన చాలా ప్రశ్నలకు ప్రస్తుతానికి అయితే సమాధానాలు లేవని అంటున్నారు.

సింహాచలం గోడ వెన‌క దాగిన గోపీ జ‌గ‌నేనా?

సింహాచ‌లం గోడ కూలిన ఘ‌ట‌న‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎందుకు స్పందించ‌రు? వైసీపీ   ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మేంటి? వేళ్లన్నీ గత పాలకుల పాపాలవైపే  సింహాచ‌లం గోడ కూలిన ఘ‌ట‌న‌లో అస‌లు ద్రోహి కూట‌మి ప్ర‌భుత్వం అన్న‌ది వైసీపీ చేస్తున్న ఆరోప‌ణ‌. అంతే కాదు ఇటు తిరుమ‌ల తొక్కిస‌లాట‌, అటు సింహాచ‌లం చంద‌నోత్స‌వం సంద‌ర్భంగా గోడ కూల‌డం వంటి విష‌యాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెద్ద‌గా స్పందించ‌డం లేద‌న్న‌ది వీరి  ఆరోప‌ణ‌. ఇక్క‌డ జ‌రిగిన అస‌లు వాస్త‌వాలేంట‌ని చూస్తే.. సింహాచ‌లం గోడ  ల‌క్ష్మ‌ణ రావు అనే కాంట్రాక్ట‌ర్ కి రూ. 54 కోట్ల రూపాయ‌ల‌తో ఇచ్చింది 2023లో.  అది కూడా జ‌గ‌న్ హ‌యాంలో. కానీ ఆ గోడ కూలింది కూట‌మి ప్ర‌భుత్వంలో. కాబ‌ట్టి ఆ పాప‌మంతా  కూట‌మిదే అంటుంది వైసీపీ. మ‌రి నాసిర‌కం ఇటుక‌లు, నాణ్య‌త లేని సిమెంటు ద్వారా క‌ట్టే కాంట్రాక్ట‌ర్ కి కాంట్రాక్ట్ ఇచ్చిన త‌ప్పిదం వ‌ల్లే క‌దా ఇదంతా జ‌రిగింద‌న్న‌ది కూట‌మి నేత‌లు వేస్తోన్న రివ‌ర్స్ కౌంట‌ర్. ఒక్క ప‌వ‌నే కాదు.. కూట‌మి త‌ర‌ఫున ఎవ‌రు మాట్లాడాల్సి వ‌చ్చినా స‌రిగ్గా ఈ పాయింట్ ద‌గ్గ‌ర్నుంచే మొద‌లు పెట్టాల్సి వ‌స్తుంది. వైసీపీ  ప్ర‌భుత్వ హ‌యాంలో చేసిన త‌ప్పిదాలు నేడు శాపాల రూపంలో ఆంధ్రుల‌ను వెంటాడుతున్నాయ‌నే చెప్పాల్సి వ‌స్తుంది.  తిరుమ‌ల‌లో కూడా అంతే! కేవ‌లం దేశీ ఆవుల మాత్ర‌మే(అంటే ప్రాంతీయ ఆవులు) ఉండాల్సిన గోశాల‌లో ఎక్క‌డెక్క‌డి నుంచో ఆవులు తెచ్చింది వాళ్లే. గోవుల మ‌ర‌ణాల సంఖ్య లెక్క‌కు మించి చూపించిందీ వాళ్లే.. అంతే కాకుండా ఫేక్ ఇమేజీల‌తో ట్రోల్ చేసింది కూడా వాళ్లే. ఇలాంటి దుష్ప్ర‌చారాల‌పై  ప్ర‌భుత్వం నోటీసులిచ్చింది.   ఈ దిశ‌గా కూట‌మి ప్ర‌భుత్వం   క‌ఠిన చ‌ర్య‌లు తీస్కోవాలన్న డిమాండ్ విన‌వ‌స్తోంది. ఇక తొక్కిస‌లాట ఘ‌ట‌న వెన‌క‌ ఎవ‌రున్నారో.. వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్నందుకు గోమ‌ర‌ణాల‌నే వ్య‌వ‌హారం ఉన్న‌ట్టుండి ఎందుకు బ‌య‌ట ప‌డిందో అంద‌రికీ తెలిసిందే. ఇలా ఎటు నుంచి ఎటు చూసినా క‌నిపించేది గ‌త పాల‌కుల తాలూకూ త‌ప్పిదాలే.  ఒక వేళ కూట‌మి నేత‌లు నిల‌దీయాల్సి వ‌స్తే గ‌త పాల‌క ప‌క్ష‌మైన వైసీపీని నిల‌దీయాల్సి ఉంటుంది. ఈ విష‌యం తెలిసినా వైసీపీ కావాల‌ని కూట‌మిని టార్గెట్ చేసి తానిలా బుక్ అయిపోతోంది. సింహాచ‌లంలో నాసిర‌కం ప‌నులు చేసే కాంట్రాక్ట‌ర్ల‌కు టెండ‌ర్ ఇచ్చింది చాల‌క ఆ త‌ప్పు కూడా మీదే అన‌డం.. లాజిక్కులు లాగ‌టం పైకి బాగానే ఉన్నా.. అది దైవ ద్రోహం కింద‌కు వ‌స్తుంది. ఇప్ప‌టికే ఎన్నో దైవ ద్రోహాల ఘ‌ట‌న‌ల్లో అడ్డంగా బుక్క‌యిన జ‌గ‌న్ అండ్ కోకి దేవుడితో పెట్టుకుంటే పంగ‌నామాలే అని సీట్ల రూపంలో తెలిసివచ్చినా ఇంకా అదే దుర్బుద్ధి. అదేమంటే మాజీ మంత్రి  రోజా వెంక‌న్న‌తో పెట్టుకుని పవ‌న్ కి బాగా తెలిసి వ‌చ్చిందంటున్నారు. ఈ విష‌యంలో ఫ‌స్ట్ తెలుసుకోవ‌ల్సిందే వారు. వైసీపీ దేవుడితో అన్నేసి స‌య్యాట‌లాడ్డం వ‌ల్లే అంత అడ్డంగా ఓడామ‌ని గుర్తించాలి. ఇప్ప‌టికే టీటీడీ వంటి హిందూ ధార్మిక ప్రాంతాల నిండా భార‌త‌మ్మ సైన్యం అలుపెరుగ‌క ప‌ని  చేస్తోంది. ఇలాంటి కుట్రల‌కు పాల్ప‌డ్డానికి వారు చేయ‌ని పాపం లేద‌న్న‌ విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికీ  టీటీడీలో వీరి సంఖ్య 2 వేల వ‌ర‌కూ ఉండొచ్చ‌ని అంచ‌నా. మ‌రి  వీరంద‌రి చేతా చేయించాల్సింన‌దంతా చేయించి.. ఆ పాపం తీస్కొచ్చి కూట‌మి ప్ర‌భుత్వం మీద వేయ‌డం ఎంత వ‌ర‌కూ స‌మంజ‌సం? అన్న‌ది వారికి వారే ఆత్మావ‌లోక‌నం చేస్కోవాలంటున్నారు సామాన్యులు.

తిరుమల ఘాట్ లో గుర్తుతెలియని వాహనం ఢీ కొని పునుగుపిల్లి మృతి

శేషాచలం అటవీ ప్రాంతంలో  మాత్రమే ఎక్కువగా కనిపించే పునుగు పిల్లులు అత్యంత అరుదైన, అంతరించిపోతున్న జాతిగా అటవీ అధికారులు ప్రకటించారు. ఈ పునుగుపిల్లులకు ఉన్న మరో విశిష్ఠిత ఉంది.  తిరుమల స్వామి వారికి వారం వారం నిర్వహించే తిరుమంజనం సందర్భంగా జరిగే అభిషేక సేవలో పునుగు పిల్లి తైనాన్నే వినియోగిస్తారు. పునుగు తైలం లేకుంటే స్వామివారి అభిషేకం పరిపూర్ణం కాదని అంటారు అర్చకులు. అటువంటి అరుదైన,  ప్రత్యేకమైన జాతికి చెందిన పునుగు పిల్లి ఒకటి తిరుమల రెండో ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో మరణించింది. గుర్తు తెలియని వాహనంన ఢీ కొని పునుగుపిల్లి మరణించడం దురదృష్టకరమని టీటీడీ అధికారులు అంటున్నారు. అత్యంత అరుదుగా మాత్రమే అటవీ ప్రాంతం నుంచి పునుగుపిల్లులు బయటకు వస్తాయి. అలా వచ్చిన సందర్భంలోనే గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఒక పునుగుపిల్లి మరణించింది.  కొంత కాలం కిందట ఒక దశలో శేషాచలం అటవీ ప్రాంతంలో పునుగుపిల్లుల సంఖ్య ఆందోళనకరంగా తగ్గిపోయిందని అటవీ శాఖ అధికారుల గణాంకాలు పేర్కొన్నాయి. దీంతో తిరుపతి జూలో వీటిని ప్రత్యేకంగా పరిరక్షించాలని కూడా అప్పట్లో భావించారు. అయితే ఇటీవలి కాలంలో శేషాచలం అటవీ ప్రాంతంలో పునుగుపిల్లల సంఖ్య పెరిగిందంటున్నారు. 

హిందూ ధార్మిక సంస్థలకు దేవాలయాల భూములు..ఐవైఆర్ అభ్యంతరం ఎందుకు? ఏమిటి?

ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాలకు. రాజులు, జమీందార్లు, భక్తులు దానంగా ఇచ్చిన భూములు విస్తారంగా ఉన్నాయి.  ఈ భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని దేవాలయాల నిర్వహణకు వాడుతుంటారు.  అయితే దేవాలయాలకు చెందిన భూములు ఎక్కవ భాగం ఆక్రమణలకు గురయ్యాయి. ఇందులో  రహస్యం ఏమీ లేదు.  ఈ ఆక్రమణలకు ప్రధాన కారణం ప్రభుత్వం, ఎండోమెంట్స్ శాఖ ఈ భూముల పట్టించుకోకపోవడం, ఖాళీగా వదిలేయడమే కారణం. ఈ భూములను వేలం ద్వారా లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ.. జనం ముందుకు రాని పరిస్థితి ఉంది.  ఇప్పుడు ఈ భూములను వినియోగంలోకి తీసుకురావడానీ, దేవాలయాల నిర్వహణకు అవసరమైన ఆదాయం సమకూర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దేవాలయాలకు చెందిన  వ్యవసాయేతర భూములను లాభాపేక్షలేని హిందూ సంస్థలకు లీజుకు ఇవ్వలని నిర్ణయించింది. అలా లీజుకు తీసుకునే హిందూ ధార్మిక సంస్ఠలకు కనీసం రెండు దశాబ్దాల ఛారిటీ ట్రాక్ రికార్డు కలిగి ఉండాలని నిబంధన పెట్టింది. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న హిందూ ధార్మిక సంస్థలకు దేవాలయాలకు చెందిన నిరుపయోగ భూములను నామమాత్రపు ధరకు లీజుకు ఇవ్వాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇలా కేటాయించడం వల్ల..  దేవాలయాల భూములు ఆక్రమణదారుల కబంధ హస్తాలలోకి వెళ్లకుండా నిరోధించడమే కాకుండా.. హిందూ ధార్మిక సంస్థలకు కూటాయించడం ద్వారా సమాజానికి ఉపయుక్తంగా మారుతాయి. దీనిపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం సహజంగా అయితే ఉండకూడదు. కానీ ఒక మాజీ ఐఏఎస్ అధికారి మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్ సీఎస్ గా కూడా పని చేశారు. ఆయనే ఐవైఆర్. విభజిత ఆంధ్రప్రదేశ్ కు తొలి సీఎస్ గా పని చేసిన ఆయన.. అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా వివిధ హోదాలలో హోదాలలో పని చేశారు. అప్పట్లో ఆయన సర్వీసులో ఉండగా ఆలయ భూముల పరిరక్షణకు తీసుకున్న చర్యలేవీ లేవు. అటువంటి ఐవైఆర్ దేవాలయాల భూముల పరిరక్షణకు ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వస్తే అడ్డుపుల్లలు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అన్నిటికీ మించి స్వయం ప్రకటిత హిందూ పరిరక్షకుడిగా ఉన్న ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. అటువంటి ఐవైఆర్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెట్టిన పోస్టుపై నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  వేలం లేకుండా భూముల కేటాయింపు సరికాదు. అలా చేయడం వల్ల అవి దుర్వినియోగమౌతాయి. చట్టబద్ధంగా దీనిని అడ్డుకోవాలంటూ ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు.   ఐవైఆర్ కు దేవాలయాల భూములు నిరుప యోగంగా ఉన్న సంగతి తెలుసు. వేలం ద్వారా వాటిని లీజుకు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడానికి గల కారణాలూ తెలియవని అనుకోలేం. హిందూ ధార్మిక సంస్థలకు వీటిని కేటాయించడం వల్ల ఆలయ భూములను కాపాడి, హిందువులకు, హిదూ ధార్మిక సంస్థలకు సహాయం చేయడం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాల్సింది పోయి, వ్యతిరేకించడం వెనుక ఐవైఆర్ ఉద్దేశమేంటన్నది అర్ధం కాదు. పదవీ విరమణ చేసిన నాటి నుంచీ ఐవైఆర్ తీరు  అనుమానాస్పదంగానే ఉంది. హిందూ పరిరక్షణ పేర ఆయన వ్యవహరిస్తున్న తీరు వెనుక రాజకీయ కారణాలున్నాయన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు నిర్ణయాలను తప్పుపట్టడం వినా ఆయన హిందూ వాదిగా చేసిందేమీ లేదని అంటున్నారు.  

తెలంగాణలో కేంద్ర మంత్రి గడ్కరీ.. రూ.5,400 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం (మే 5) తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఉదయం హెలికాప్టర్ లో సిరిపూర్ కాగజ్ నగర్ చేరుకున్న ఆయన పలు నేషనల్ హైవే ప్రాజెక్టులను ప్రాంభంభాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం  కాగజ్ నగర్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు.  మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఆయన హైదరాబాద్ వివారులోని  కన్హా శాంతివనానికి చేరుకుని అక్కడ మధ్యాహ్నం వరకూ ఉంటారు. అనంతరం  సాయంత్రం 4 గంటలకు బీహెచ్ఈఎల్ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్ సందర్శించి ప్రారంభిస్తారు. సాయంత్రం ఐదున్నర గంటలకు అంబర్ పేట్ ఫ్లై ఓవర్ ప్రారంభించి.   సాయంత్రం 6 గంటలకు అంబర్ పేట మున్సిపల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. రాత్రి ఏడు గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హస్తినకు బయలుదేరి వెడతారు. 

నేటి నుంచి పది రోజులు జీరో షాడో.. అంటే ఏమిటో తెలుసా?

మిట్ట మధ్యాహ్నం మీ నీడ మాయమైపోతుందంటే నమ్ముతారా? అసలు పగటి వేళ మనిషి.. మనిషి అనేమిటి ప్రతి వస్తువు నీడ కనబడుతూనే ఉంటుంది. అటువంటికి పది రోజుల మాట ప్రతి రోజూ మిట్టమధ్యాహ్నం వేళ నీడ మాయమైపోతుందంటే ఆశ్చర్యంగా లేదూ. ఆ పది రోజులూ సరిగ్గా మిట్టమధ్యాహ్నం రెండు నిముషాల పాటు నీడ కనిపించదు. ఈ పరిస్థితిని జీరో షాడో అంటారు. సోమవారం (మే 5) నుంచి ఈ నెల 14 వరకూ ఓ పది రోజుల పాటు మధ్యాహ్నం రెండు నిముషాల పాటు మనిషి నీడ మాయమైపోతుంది. పది రోజుల పాటు సరిగ్గా మిట్టమధ్యాహ్నం ఈ ఖగోళ అద్భుతం సంభవిస్తుంది.  సాధారణంగా ఎండ వేళ మనిషి నీడ కనిపిస్తుంది. అయితే సోమవారం (మే 5) నుంచి మే 14 వరకూ మాత్రం  మిట్టమధ్యాహ్నం సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడటంతో నీడ మాయమౌతుంది. భూమి అక్ష్యం 23.5 డిగ్రీల వంపుగా ఉండటం వల్ల భూమి సూర్యుడి చుట్టూ తిరిగే సమయంలో ఉత్తర, దక్షిణ దిశలలో మారుతూ ఉంటుంది. ప్రతి ఏటా రెండు సందర్భాలలో కర్నాటక-మకర రేఖల మధ్య ఉన్న ప్రదేశాలలో సూర్యకిరణాలు మిట్టమధ్యాహ్న సమయంలో భూమిపై నిట్టనిలువుగా పడతాయి. ఈ కారణంగానే నిలువుగా ఉండే వస్తువుల నీడ ఈ రోజులలో మట్టమధ్యాహ్నం కనిపించదు.  

ఇండియన్ ఆర్మీ మాస్టర్ ప్లాన్.. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్!

విలేజ్ డిఫెన్స్ గార్డ్స్. వినడానికి కొత్తగా ఉన్నా.. విషయం చాలా ఉంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత.. కశ్మీర్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయ్. సరిహద్దు జిల్లాల్లో ఉగ్రవాదుల కదలికలు పెరిగాయనే అనుమానాలున్నాయి.  దాంతో.. ఇండియన్ ఆర్మీ ఓ కొత్త ప్లాన్ వేసింది. భారత సరిహద్దుల అవతలి నుంచి వచ్చే ఎలాంటి శత్రువైనా సరే.. ఆ సరిహద్దుల్లోనే ఖతమయ్యేలా మన ఆర్మీ పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది.  భారత శత్రువులెవరైనా సరే.. మన బోర్డర్ దాటాలంటే ఇకపై ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. మన సరిహద్దుల అవతలి నుంచి వచ్చే ఏ శత్రువైనా సరే.. ఆ సరిహద్దుల్లోనే ఖతమయ్యేలా ఇండియన్ ఆర్మీ పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ఇందుకోసం.. భారత బలగాలు సరికొత్త ప్లాన్ వేశాయ్. తీవ్రవాదుల్ని ఎదుర్కొనేందుకు.. బోర్డర్ దగ్గర్లో ఉన్న గ్రామస్తులకు ట్రైనింగ్ ఇచ్చి మరీ తుపాకులు అందిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.  దాంతో.. జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్వార్, దోడా, రాజౌరి, పూంచ్ లాంటి జిల్లాల్లో.. భద్రత దృష్ట్యా.. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్‌కు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులతో.. ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్.. తమ ఆయుధాలను సమర్థవంతంగా ఉపయోగించేందుకు, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు.. ఈ ట్రైనింగ్ ఎంతో కీలకమని పోలీసు అధికారులు చెబుతున్నారు. కొన్ని వారాలుగా.. కిష్ట్వార్, దోడా, ఉధమ్‌పూర్ జిల్లాల్లో టెర్రరిస్టుల యాక్టివిటీ పెరిగింది. గత నెలలో కిష్ట్వార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు, ఇంకొందరు టెర్రరిస్టులు తప్పించుకొని.. దట్టమైన అడవుల్లో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్నారు. దాంతో.. ఈ శిక్షణా కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ట్రైనింగ్ తీసుకుంటున్న ఈ విలేజ్ డిఫెన్స్ గార్డ్స్‌ని.. సరిహద్దులకు దగ్గర్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో భద్రతను కాపాడేందుకు, ఉగ్రవాదుల నుంచి స్థానికులను రక్షించేందుకు ఏర్పాటు చేశారు. వీరికి.. పోలీసులు, సైన్యమే.. ఆయుధాలతో పాటు శిక్షణ కూడా ఇస్తాయి. ఈ ఆపరేషన్లలో.. ఇండియన్ ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో ఉగ్రవాదుల కదలికలను గమనిస్తున్నారు. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్‌కి ప్రధానంగా రైఫిళ్లు, ఆటోమేటిక్ ఆయుధాలను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలనే విధానంపై శిక్షణ ఇస్తున్నారు. ఉగ్రవాద దాడుల సమయంలో.. రక్షణాత్మకంగా ఉండటంతో పాటు, వారిపై ఏ విధంగా దాడి చేయాలనే దానికి సంబంధించిన వ్యూహాలను అమలు చేసే పద్ధతుల్ని కూడా నేర్పిస్తున్నారు. సరిహద్దు గ్రామాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు, ఆకస్మిక దాడుల సమయంలో వెంటనే స్పందించడం, అందరితో సమన్వయం చేసుకోవడం ఎలా అనేది కూడా చెబుతున్నారు. బోర్డర్‌ దగ్గరలో అనుమానాస్పద కదలికలను గుర్తించి.. పోలీసులకు, సైన్యానికి సమాచారం అందించడంపైనా శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా.. గ్రామీణ, కొండ ప్రాంతాల్లో శారీరకంగా చురుగ్గా ఉండేందుకు ఫిట్‌నెట్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ సెషన్ అంతా.. గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక పోలీస్ స్టేషన్లు, సైనిక శిబిరాల్లో సాగుతున్నాయి. కొన్నిసార్లు.. డ్రోన్ టెక్నాలజీ, రాత్రి పూట గస్తీ లాంటి ఆధునిక టెక్నిక్‌లపైనా శిక్షణ ఇస్తున్నారు. జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కలిసి.. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్‌కి ట్రైనింగ్ సెషన్స్‌ని నిర్వహిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత.. జమ్మూకశ్మీర్‌లో భద్రతా చర్యలు మరింత కఠినతరమయ్యాయ్. ఈ క్రమంలోనే గ్రామీణ ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేసేందుకు.. ఈ గ్రామ రక్షణ బృందాలను సన్నద్ధం చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ విలేజ్ డిఫెన్స్ గార్డులకు శిక్షణని తప్పనిసరి చేయడం ద్వారా.. సరిహద్దుల్లో భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఉగ్రవాద బెదిరింపులను ఎదుర్కొనేందుకు.. ప్రభుత్వం, సైన్యం, పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ఈ శిక్షణా కార్యక్రమాలు.. సరిహద్దు గ్రామాల్లో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడంలో కీలకపాత్ర పోషిస్తాయని ఆశిస్తున్నారు. మరోవైపు.. జమ్మూకశ్మీర్ పోలీసులు, సైన్యం కలిసి ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించేందుకు యాక్షన్ ప్లాన్‌ని వేగవంతం చేశాయి. కిష్ట్వార్‌లోని దట్టమైన అడవుల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్‌తో పాటు స్థానికులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. అనుమానాస్పద కదలికలను గమనిస్తే.. వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో భద్రతా భావాన్ని పెంపొందించడంతో పాటు, ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడంలో సహాయపడతాయని అధికారులు చెబుతున్నారు.

మానవత్వం చాటుకున్నా మంత్రి నాదెండ్ల

  రోడ్డు ప్రమాద బాధితుడిని కాపాడి ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. విజయవాడ నుండి కాకినాడకు వెళ్లే మార్గంలో, ఆయన కాన్వాయ్ ఏలూరు జిల్లా భీమడోలు వద్ద కారు, బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వస్తున్న మంత్రి స్వయంగా  మంత్రి వెంటనే గాయపడిన వారి వద్దకు వెళ్లి వారి పరిస్థితిని తనకంటూ సమీక్షించారు. వారు గాయాలతో తీవ్ర రక్తస్రావానికి గురవుతున్నదాన్ని చూసి, ఆందోళనకు లోనైన మంత్రి – తన మనసులో మానవత్వం నిగూఢంగా బలపడినట్లు మరోసారి చాటిచెప్పారు. ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ స్వయంగా 108 అంబులెన్స్‌కు కాల్ చేసి సహాయం కోరారు. అంబులెన్స్ రాగానే బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించేందుకు తన కాన్వాయ్‌లోని ప్రోటోకాల్ వాహనాన్ని ఎస్కార్ట్ వాహనంగా ఉపయోగించాలని అధికారులకు ఆదేశించారు. ఇది ట్రాఫిక్ క్లియర్ చేసి అంబులెన్స్ వేగంగా ఆసుపత్రికి చేరేందుకు ఎంతో తోడ్పడింది. అంతటితో ఆగకుండా, ఏలూరు జిల్లా ఎస్పీకి స్వయంగా ఫోన్ చేసిన మంత్రి నాదెండ్ల , గాయపడిన ఇద్దరికీ మెరుగైన వైద్యం అందేలా చూడాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంత్రి సమయస్ఫూర్తితో స్పందించి చేసిన సహాయం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ గిరిజా ప్రియద‌ర్శిని క‌న్నుమూత‌

  తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గిరిజా ప్రియదర్శిని  కన్నుమూశారు.కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇవాళ తుదిశ్వాస విడిచారు. 2022 మార్చిలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ గిరిజా ప్రియదర్శిని బాధ్యతలు చేపట్టారు. ఆమె మృతి పట్ల హైకోర్టు న్యాయమూర్తులు, సిబ్బంది సంతాపం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్ పట్టణానికి చెందిన గిరిజా ప్రియదర్శిని.. 1995లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. విశాఖ జిల్లా కోర్టులో ఏడేండ్లు ప్రాక్టీస్‌ చేశారు.  2008లో అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. ఖమ్మం ఫ్యామిలీ కోర్టులో మూడేండ్లు, విజయనగరం మొదటి అదనపు జిల్లా జడ్జిగా, నంద్యాలలో అదనపు జిల్లా జడ్జిగా పనిచేశారు. 2017లో ఒంగోలు జిల్లా కోర్టు చీఫ్‌గా పదోన్నతి పొందారు. ఆదిలాబాద్‌ జిల్లా కోర్టు చీఫ్‌ జడ్జిగా చేశారు. ఆ తర్వాత కరీంనగర్‌ జిల్లా కోర్టు చీఫ్‌ జడ్జిగా చేశారు. హైకోర్టు జ‌డ్జిగా బాధ్య‌త‌లు స్వీక‌రించే కంటే ముందు.. గిరిజా ప్రియద‌ర్శిని.. రాష్ట్ర లీగల్‌ సెల్‌ సర్వీసెస్‌ అథారిటీ సెక్రటరీగా ప‌ని చేశారు.  

ఏపీలో భారీ వర్షాలు..తిరుమలలో ఈదురు గాలులతో వాన

  తిరుపతిలో భారీ వర్షం కురిసింది. తిరుమల శ్రీవారి ఆలయంపై మబ్బులు కమ్మాయి. శనివారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో శ్రీవారి ఆలయం ముందు భక్తులు తడుస్తూ పరుగులు తీశారు. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. బలమైన ఈదురు గాలులతో వర్షం పడటంతో పలు చోట్ల వృక్షాలు కూలియి. మరోవైపు విజయవాడ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పిడుగులు పడి ముగ్గురు మృతి చెందారు.దీంతో జనజీవనం స్తంభించింది. పలుచోట్ల రహదారులపై నీరు నిలిచింది. విజయవాడలోని మొగల్రాజపురం, పటమట ప్రాంతాల్లో భారీ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి.   వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. చాలా రోజులుగా వేసవి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. భారీవర్షాల వల్ల ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్డును మూసివేశారు. శ్రీకనక దుర్గానగర్‌ గుండా భక్తులు రాకపోకలు కొనసాగించేలా ఏర్పాట్లు చేశారు.పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు కొన్ని చోట్ల చెట్లు రోడ్లపై పడ్డాయి. ఉయ్యూరు-కాటూరు రోడ్డుపై చెట్టు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కృష్ణా జిల్లాలో భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. వరి, మొక్కజొన్న, అరటి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. 

మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదు : బండి సంజయ్‌

    మవోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లిలో ఆయన  హాట్ కామెంట్స్ చేశారు.‘తుపాకీతో అమాయకులను చంపేవారితో చర్చలు ఉండవు. మావోయిస్టులతో ఇక మాటల్లేవ్‌.. మాట్లాడుకోడాల్లేవ్‌. వారిపై నిషేధం విధించింది కాంగ్రెస్సే. మావోయిస్టులు.. పలు పార్టీల నేతలను మందుపాతరలు పెట్టి చంపారు. ఇన్‌ఫార్మర్ల పేరుతో గిరిజనులను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. ఎన్నో గిరిజనుల కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చారు. తుపాకీ వదిలిపెట్టేవరకు మావోయిస్టులతో చర్చల ఊసే ఉండదన్నారు. పాస్‌పోర్టు లేని విదేశీయులను గుర్తించి పంపిస్తున్నాం. రోహింగ్యాలపై తన వైఖరి ఏమిటో కాంగ్రెస్‌ పార్టీ చెప్పాలి’’ అని బండి సంజయ్‌ అన్నారు. ‘కేంద్రం నిర్ణయాన్ని తమ విజయంగా చెప్పుకోవడం  సిగ్గుచేటు’’ అన్నారు.  స్వాతంత్రం తర్వాత ఎన్నడూ దేశవ్యాప్తంగా కుల గణన జరగనివ్వని కాంగ్రెస్ పార్టీకి దీనిపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. 2010లో అనేక పార్టీల డిమాండ్‌కు స్పందిస్తూ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు కేవలం ఓ సర్వేనే చేపట్టిందన్నారు. కొన్ని రాజకీయ పక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మావోయిస్టులతో చర్చలు జరపాలని పోటీ పడుతున్నాయని సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే  ఇలాంటి అంశాలను తెరపైకి తెస్తోందని విమర్శించారు. శాంతి భద్రతల సమస్యను రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు.   

లోయలో పడ్డ ఆర్మీ ట్రక్కు.. ముగ్గురు జవాన్ల మృతి

  జమ్ముకశ్మీర్‌లో రాంభన్ జిల్లాలో 300 అడుగుల లోయలో ఆర్మీ ట్రక్కు పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. జమ్మూ నుంచి  శ్రీనగర్ వెళ్లున్న ఆర్మీ వాహనం బ్యాటరీ చెష్మా’ అనే ప్రదేశం వద్ద  లోయలోకి దొర్లిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఆ వాహనంలో ప్రయాణిస్తున్న జవాన్లు చనిపోయినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. మృతి చెందిన సైనికులను అమిత్‌ కుమార్‌, సుజిత్‌ కుమార్‌, మన్‌ బహదూర్‌గా గుర్తించినట్లు సైన్యం వెల్లడించింది. సహాయక చర్యలు చేపట్టేందుకు పోలీస్‌, ఆర్మీ, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, సివిల్‌ క్యూఆర్టీ బృందాలు రాంబన్‌కు బయల్దేరినట్లు అధికారులు వెల్లడించారు.

ప్ర‌ధాని మోదీతో ఎయిర్ చీఫ్ మార్ష‌ల్‌ సమావేశం

  భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్‌ సింగ్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. కాశ్మీర్‌ పహల్గామ్‌‌లో ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో  ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకు ముందు రోజే నౌకాదళాధిపతి అడ్మిరల్‌ దినేష్‌ కె త్రిపాఠీ కూడా ప్రధానిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఇక‌, ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌ను భారత్ అన్ని వైపుల నుంచి దిగ్బంధనం చేస్తున్న విష‌యం తెలిసిందే. విడతల వారీగా తీసుకుంటున్న పలు నిర్ణయాలతో పాక్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీంతో భారత్ ఎప్పుడు దాడి చేస్తోందనని పాక్ వణికిపోతోంది. మరోవైపు, భారత్ చర్యలపై ప్రధాని మోదీ వరుసగా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.  అందులో భాగంగా భార‌త్ ఎయిర్ చీఫ్ మార్ష‌ల్‌తో భేటీ అయ్యారు. శనివారం నాడు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠితో కూడా మోదీ సమావేశమైన విష‌యం తెలిసిందే. అలాగే ఉగ్ర‌దాడి నేప‌థ్యంలోనే భ‌ద్ర‌తా వ్య‌వ‌హారాల మంత్రి వర్గ క‌మిటీ సమావేశం  జరిగింది. ఉగ్ర‌వాదుల‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు త్రివిధ ద‌ళాల‌కు ఈ సమావేశంలో కేంద్రం పూర్తి స్వేచ్ఛ‌ను ఇచ్చింది. ఇక శుక్ర‌వారం నాడు యుద్ధ స‌న్న‌ద్ధ‌త‌లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై వాయుసేన యుద్ధ విమానాల ల్యాండింగ్‌, టేకాఫ్ విన్యాసాల‌ను నిర్వ‌హించింది.  2019లో పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్‌ వాయుసేన పాక్‌లోకి ప్రవేశించి దాడి చేసింది. నాటితో పోల్చుకొంటే రఫెల్‌ యుద్ధ విమానాలు, ఎస్‌-400 ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలతో ఐఏఎఫ్‌ శక్తి గణనీయంగా పెరిగింది. 

ప్రముఖ యోగా గురువు మృతి.. ప్రధాని మోదీ సంతాపం

  ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, యోగా గురువు స్వామి శివానంద తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వారణాసిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  కన్నుమూశారు. శివానంద మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆధ్యాత్మిక సాధనను, యోగా రంగానికి చేసిన అసమానమైన కృషిని ప్రధాని కొనియాడారు. దేశంలోని ప్రతి తరానికి ఆయన స్ఫూర్తినిస్తూనే ఉంటారని పేర్కొన్నారు. ఆయన మృతి యోగా రంగానికి తీరని లోటన్నారు.1896 ఆగస్టు 8న అవిభాజ్య భారత్‌లోని సిల్హెత్‌(ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది) జిల్లాలో నిరుపేద కుటుంబంలో స్వామి శివానంద జన్మించారు. ఆరేళ్ల వయసులోనే శివానంద తల్లిదండ్రులను కోల్పోయారు.  దీంతో ఆయన పశ్చిమ బెంగాల్‌లోని ఓ ఆశ్రమంలో పెరిగారు. గురు ఓంకారానంద గోస్వామి ఆయనను పెంచి పెద్ద చేయడమేగాక, యోగా వంటి ఆధ్యాత్మిక విషయాలను బోధించారు. ఈ క్రమంలోనే తన జీవితాన్ని సమాజసేవకు అంకితం చేసిన స్వామి శివానంద.. గత 50 ఏళ్లుగా పూరిలో 400-600 కుష్టు రోగులకు సేవ చేశారు.ఆయన వయస్సు 128 ఏళ్లు అనే ప్రచారం ఉంది.యోగా రంగానికి చేసిన కృషికి గాను 2022లో శివానంద.. అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. తెల్లని ధోవతి, కుర్తా ధరించి.. కాళ్లకు చెప్పులు లేకుండా అత్యంత సామాన్యంగా వచ్చి ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించడం అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది.