మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు.. వైసీపీ బెంబేలు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. ఎక్కడా తగ్గేదే లే అన్నట్లుగా ఆధునిక సాంకేతికతను ఆధారం చేసుకుని మరీ అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసిన సీఐడీ తాజాగా ఆయన పీఏ దిలీప్ ను అదుపులోనికి తీసుకుంది. అంతకు ముందే వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని విచారించింది. ఈ అరెస్టుల పర్వం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది. మద్యం కుంభకోణం తీగ లాగితే తాడేపల్లి ప్యాలస్ డొంక కదులుతుందన్న భయం వైసీపీలో  కనిపిస్తోంది. రాజ్ కేసిరెడ్డి అరెస్టుతో జగన్ పార్టీ కీలక నేతలతో తాడేపల్లి ప్యాలెస్ లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి హడావుడిగా పొలిటికల్ అఫైర్స్ కమిటీని వేయడం చూస్తుంటే.. మద్యం కుంభకోణం కేసులో తానూ జైలుకు వెళ్లక తప్పదన్న భయంలో ఆయన ఉన్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు.  ఇక ఈ కేసులో నాలుగు మార్లు నోటీసులు అందుకుని కూడా విచారణకు డుమ్మా కొట్టి విదేశాలకు చెక్కేయాలని స్కెచ్ వేసుకున్న రాజ్ కసిరెడ్డిని ఆయన గోవా నుంచి వస్తున్నట్లుగా అందిన కచ్చితమైన సమాచారంతో శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. రాజ్ కేసిరెడ్డి శంషాబాద్ నుంచి మారుపేరుతో చెన్నై అక్కడ నుంచి విదేశాలకు చెక్కేయడానికి పక్కా ప్రణాళిక రచించుకున్నట్లు సీఐడీ పసిగట్టింది. ఇక కోర్టు కూడా రాజ్ కేసిరెడ్డిని ఏడు రోజుల సీఐడీ కస్టడీకి అప్పగించడంతో ఈ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. ఇక రాజ్ కేసిరెడ్డి పీఎ దిలీప్ అరెస్టు కూడా విమానాశ్రయంలోనే ఉంది. విచారణకు గైర్హాజర్ కావడమే కాకుండా దుబాయ్ పారిపోవడానికి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న దిలీప్ ను సీఐడీ అరెస్టు చేసింది. అతని కదలికలపై నిఘా పెట్టిన సీఐడీ, అతడి ఫోన్ లోకేషన్ ఆధారంగా చెన్నై విమానాశ్రయంలో అదుపులోనికి తీసుకుని విజయవాడ తరలించారు. రాజ్ కేసిరెడ్డిని సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతించడం, దిలీప్ పోలసులకు చిక్కడంతో లిక్కర్ స్కాం కు సంబంధించి కీలక సమాచారం లభించడానికి సీఐడీకి మంచి అవకాశం లభించినట్లైందని పరిశీలకులు అంటున్నారు.  ఈ అరెస్టుల నేపథ్యంలో  మద్యం కుంభకోణంతో తాడేపల్లి ప్యాలెస్ లింకులు బయటపడతాయన్న భయం వైసీపీ అగ్రనాయకత్వంలో వ్యక్తమౌతోందని అంటున్నారు. 

బెజవాడ కనక దుర్గమ్మ సేవలో ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ

తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు తనయుడు నందమూరి రామకృష్ణ గురువారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమరావతి పనుల పున: నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన ఆయన ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అమరావతి పున: నిర్మాణ పనులు విజయవంతం కావాలనీ, అలాగే ఏపీలో ప్రధాని పర్యటన సక్సెస్ కావాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఎన్డీఎ కూటమి ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణం పూర్తి కావాలని, ఏపీ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని, తద్వారా ఏపీ అన్నపూర్ణగా రూపుదిద్దుకోవాలని, సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. తెలుగుదేశం పార్టీ, తమ తండ్రి ఎన్టీఆర్ ఆశయాల సాధనకు సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని, ఆయన నాయకత్వంలో ఏపీ అన్నివిధాలా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. స్వర్ణాంధ్రగా ఏపీ రూపుద్దికోవాలని, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కలలు సాకారం కావాలని, ప్రజాశీస్సులతో స్వర్ణాంధ్ర-2047 ద్వారా లక్ష్యాన్ని సాధించాలని రామకృష్ణ ఆకాంక్షించారు.  

మిస్ వరల్డ్ 2025 పోటీల ఏర్పాట్ల సమీక్షకు హైదరాబాద్ కు జూలియా ఈవేలిన్ మోర్లీ

హైదరాబాద్ లో జరగనున్న మిస్ వరల్డ్ 2025 పోటీల ఏర్పాట్లను సమీక్షించేందుకు  లండన్ లోని మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి శుక్రవారం (మే2) హైదరాబాద్ చేరుకున్ననారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు  అధికారులు ఘన స్వాగతం పలికారు.  ఈ మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ కోసం జరుగుతున్న ఏర్పాట్లు, మిస్ వరల్డ్ కాంటెండర్స్ పర్యటించే వివిధ ప్రాంతాల లో చేపట్టిన ఏర్పాట్లు, వివిధ ఈవెంట్లకు సంబంధించిన అంశాలపై జూలియా మోర్లి సంబంధిత ఏజెన్సీలు, వివిధ విభాగాలతో సమీక్షిస్తారు. మిస్ వరల్డ్ 2025 పోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు హైదరాబాద్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నెల 7 నుండి 31వ తేదీ వరకు జరగనున్న ఈ అంతర్జాతీయ అందాల పోటీల్లో 140 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటారు.   తెలంగాణకు అంతర్జాతీయంగా గుర్తింపును తెచ్చే ఈ వేదిక, రాష్ట్ర పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తుందని భావిస్తున్నారు.  ఈ పోటీల సందర్భంగా, మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందాల భామలు మే నెలలో తెలంగాణలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించి తెలంగాణ సంస్కృతి, వారసత్వ సంపద, అభివృద్ధిని   ప్రపంచానికి తెలియజేయనున్నారు. ఇప్పటికే ఈ పోటీల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు ఆ ఏర్పాట్లను సమీక్షించేందుకే మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లీ హైదరాబాద్ వచ్చారు.  ఈ పోటీల నిర్వహణ ద్వారా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ పెరుగుతుందని భావిస్తున్నారు. 

తిరుమలలో ముమ్మర తనిఖీలు

ఓ వైపు పహల్గాం ఉగ్రదాడి, మరో వైపు ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో అధికారులు అప్రమత్తమయ్యారు. వారాంతం సమీపిస్తుండటంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో భద్రతా పరంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఇంకో వైపు తిరుమలకు వచ్చే వాహనాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కండీషన్ సరిగా లేని వాహనాలుతిరుమల కొండపైకి వస్తుండటంతో ఘాట్ రోడ్డులో అగ్ని ప్రమాదాల సంఘటనలూ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీవో అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు.  తిరుమల ట్రాఫిక్ పోలీసులతో కలిసి ఆర్టీవో అధికారులు మొబైల్: పొల్యూషన్ వాహనంతో చెకింగ్ చేపట్టారు. తిరుమలకు ప్రత్యేకంగా పొల్యూషన్ చెకింగ్ వాహనం తీసుకవచ్చి తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో గురువారం ఒక్క రోజే దాదాపు 24 వాహనాలు అత్యధిక కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని గుర్తించారు. మరొ కొన్ని వాహనాలకు ఫిట్ నెస్ సరిగా లేదని గుర్తించారు. వాహనాలకు పొల్లూషన్ సర్టిఫికెట్, సరైన ఫిట్నెస్ ఉంటేనే అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.  

సరిహద్దుల్లో యుద్ద ఘోష.. భారత ఫస్ట్ టార్గెట్ లాహోర్ ?

పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ప్రతీకార దాడి జరుగుతుందనే అంచనాల నడుమ భారత్ – పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. నలుదిక్కుల నుంచీ ముప్పు కమ్ముకొస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యం, జరగబోయే అనర్ధాన్ని ఊహించుకుని, తీవ్ర భయాందోళనలకు గురవుతోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ప్రతీకార స్వరూప స్వభావాలు, లక్ష్యాలు, ప్రతీకార సమయం, నిర్ణయించుకునే సంపూర్ణ కార్యాచరణ స్వేచ్ఛను భారత సైన్యానికి ఇచ్చిన నేపథ్యంలో, పాకిస్థాన్ ఏ క్షణంలో అయినా  భారత సైన్యం విరుచుపడే ప్రమాదం పొంచి ఉందనే భయంతో వణికి పోతోంది.  అయితే.. అదే సమయంలో పాక్  సైన్యం సరిహద్దుల వెంబడి,యధేచ్ఛగా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడుతున్నది. నిజానికి  2021లో ఉభయ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా, పాక్ సైన్యం తరచూ ఉల్లంఘనలకు పాల్పడుతునే వుంది. కాగా, పహల్గాం ఉగ్రవాద దాడి  (ఏప్రిల్ 22) తర్వాత పాక్ సేనలు భయంతో కాల్పుల జోరు పెంచారు. కాగా.. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లఘనలు రోజుల తరబడి కొనసాగడమే కాకుండా మొత్తం 720 కిలో మీటర్ల పొడవున వరసగా కాల్పులకు పాల్పడుతున్నారు. మరో వంక భారత  సైన్యం దీటుగా సమాధానం చెపుతోంది. మరో వంక  సరిహద్దుల్లో ఉభయ దేశాల సేనల మోహరింపు వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అన్నిటినీ మించి  పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒకటి రెండు రోజుల్లోనే యుద్ధం రావచ్చని ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో స్పష్టం చేశారు. అలాగే.. మనసులో భయాన్ని బయట పెట్టుకున్నారు. యుద్ధం దీర్ఘ కాలం పాటు కొనసాగి, అనివార్య పరిస్థితులు ఎదురైతే అణ్వాయుధాలను ప్రయోగించేందుకు కూడా వెనకాడబోమని అన్నారు. పరిస్థితి అంతవరకు వస్తుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే  పాకిస్థాన్  రక్షణ శాఖ మంత్రిని యుద్ద భయం ఆవరించింది అనేది మాత్రం ప్రపంచానికి తెలిసొచ్చిందని అంటున్నారు.  అయితే పాక్  భయం వట్టి భయం కాదు.. వ్యూహాత్మకంగా నటిస్తున్న భయం అసలే కాదు.  నిజంగా కూడా పరిస్థితి అత్యంత భయంకరంగా ఉందనే   అంటున్నారు. ముఖ్యంగా  భారత దేశం ప్రతీకార చర్యలలో భాగంగా ఒకదాని వెంట ఒకటిగా తీసుకుంటున్న నిర్ణయాలు పాక్  కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గోరుచుట్టుపై రోకటి పోటులా సలుపుతున్నాయని అంటున్నారు.  ఓ వంక పహల్గాం ఉగ్రవాద దాడికి పాల్పడిన ఉగ్రవాదులను వెంటాడి  వేటాడే పని  ఇంచు మించుగా   ముగింపు  దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే  ఉగ్రవాదుల వేటలో ఉన్న సైనిక దళాలు, ఉగ్రవాదుల ఆచూకీ గుర్తించాయి. అంతే  కాదు 26 మంది ప్రాణాలు బలితీసుకున్న ఉగ్రవాదులను మట్టు పెట్టడం ఖాయమని, ఏ క్షణంలో అయినా శుభవార్త  రావచ్చని గ్రౌండ్ జీరో సమాచారంగా చెపుతున్నారు.  అన్నిటినీ మించి పాక్ గుండెల్లో రైళ్ళు కాదు, ఏకంగా యుద్ద విమానాలే పరుగులు తీస్తున్నాయని అంటున్నారు. అవును  పాక్  రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాటల్లో, ఆయన ముఖ కవళికల్లో భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే..  ఆయన పదే పదే గత్యంతరం లేని పరిస్థితి వస్తే, అణ్వాయుదాలు ప్రయోగిస్తామని అంటున్నారు. మరో వంక చడీ చప్పుడు కాకుండా భారత సేనలు వ్యూహాత్మకంగా లాహోర్ పై దాడికి సిద్దమవుతునట్లు తెలుస్తోంది. నిజానికి పాక్ భయానికి ఖవాజా ఆసిఫ్  ప్రేలాపనలకు ఆదే కారణంగా  కనిపిస్తోందని అంటున్నారు.  అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన సంపూర్ణ కార్యాచరణ స్వేచ్చతో భారత సేనలు ఎప్పుడు ఏమి చేస్తాయి అనేది పక్కన  పెడితే. ధర్మం మన వైపుఉంది... అంతిమ విజయం మనదే అవుతుంది. ధర్మో రక్షిత రక్షితః!

రాజ్ కేసిరెడ్డి పీఏ దిలీప్ అరెస్ట్

వైసీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో సిట్ మరొకరిని అరెస్టు చేసింది. ఈ కేసులో కీలక నిందితుడైన రాజ్ కేసిరెడ్డి పీఏ దిలీప్ ను సిట్ అధికారులు గురువారం (మే 2) అరెస్టు చేశారు. దుబాయ్ పరారయ్యేందుకు చెన్నై ఎయిర్ పోర్టుకు చేరుకున్న దిలీప్ ను సిట్ అధికారులు అదుపులోనికి తీసుకున్నారు.   ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎదుట హాజరుకావాలని ఇప్పటికే సిట్ దిలీప్ కు  నోటీసులు జారీ చేసింది. అయితే దిలీప్ విచారణకు హాజరు కాకుండా దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ  డిజిటల్, ఫోన్ లోకేషన్ ద్వారా ఆయన కదలికలపై నిఘా పెట్టిన సిట్ ఆయన చెన్నై విమానాశ్రయంలో ఉన్నట్లు గుర్తించింది. వెంటనే చెన్నై ఎయిర్ పోర్టుకు చేరుకున్న సిట్ అధికారులు దిలీప్ ను అరెస్టు చేసి  విజయవాడకు తరలించారు.   మద్యం కుంభకోణానికి సంబంధించి రాజ్ కేసిరెడ్డి పీఏ నుంచి కీలక సమాచారం రాబట్టాలని సిట్ భావిస్తోంది.  కమిషన్‌లు ఇచ్చే డిస్టలరీల యజమానులు దిలీప్ తమతో కాంటాక్ట్ లో ఉండేవాడని సిట్ కు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.  రాజ్ కేసిరెడ్డి, డిస్టలరీల యాజమాన్యాల మధ్య దిలీప్ అనుసంధానకర్తగా ఉండేవాడని చెబుతారు. ఇప్పుడు దిలీప్ ను అరెస్టు చేయడం ద్వారా  కీలక సమాచారం బయటపడే అవకాశం ఉందని అంటున్నారు.  

రాజ్ కేసిరెడ్డికి బిగ్ షాక్

వారం రోజులు సీఐడీ కస్టడీకి అనుమతించిన కోర్టు ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు రాజ్ కేసిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది.   రాజ్ కేసిరెడ్డినివారం రోజులు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం (మే 2)  నుంచి ఏడు రోజుల పాటు సీఐడీ విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఆ వారం రోజులూ రాజ్ కేసిరెడ్డిని ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు విచారించడానికి కోర్టు సీఐడీకి అనుమతించింది. ఈ విచారణ ద్వారా రాజ్ కేసిరెడ్డి వెనుక ఉన్న సూత్రధారుల వివరాలను రాబట్టాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. రాజ్‌ కేసిరెడ్డిని ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మద్యం కుంభకోణానికి సంబంధించి రాజ్ కేసిరెడ్డికి అనేక మార్లు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.అయితే అన్ని సార్లూ ఆయన విచారణకు డుమ్మా కొట్టి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే రాజ్ కేసిరెడ్డి హైదరాబద్ కు వస్తున్నట్లు అందిన కచ్చితమైన సమాచారం మేరకు పోలీసులు ఆయనను శంషాబాద్ విమానాశ్రంలో అదుపులోనికి తీసుకుని విజయవాడకు తరలించారు.   అనంతరం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో కేసిరెడ్డి వైద్య పరీక్షలు చేయించి  కోర్టులో హాజరుపరిచారు. కోర్టు కేసిరెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. మరోవైపు ఈకేసులో ముందస్తు బెయిల్‌ కోసం రాజ్ కేసిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడా ఆయనకు నిరాశే ఎదురైంది. కేసిరెడ్డి పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

అమరావతి బ్రాండ్ పైలాన్

అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా అమరావతిలోని మొదటి అక్షరం ‘ఏ’ ఆకారంలో 20 అడుగుల పైలాన్ ను ఏర్పాటు చేశారు. ఈ పైలాన్ ను ప్రధాని మోడీ ఆవిష్కరిస్తారు.  బహిరంగ సభ వెనుక వైపున ఏర్పాటు చేసిన ఈ పైలాన్ ను పూర్తిగా గ్రానైట్ స్టోన్స్ తో నిర్మించారు. ఈ పైలాన్ మధ్యలో ప్రధాని నరేంద్రమోడీ, చంద్రబాబు తదితరుల పేర్లు చెక్కారు. ఈ పైలాన్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అమరావతి రీలాంచ్ సందర్భంగా దాదాపు లక్ష కోట్ల విలువైన పనులకు మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇక సభలో ప్రధాన వేదికపై ప్రధాని మోడీ, గవర్నర్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సహా 14 మంది ఆసీనులవుతారు.   సభా వేదికకు ఎదురుగా అమరావతి రైతుల కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు.  సభా ప్రాంగణం మొత్తాన్నీ ఎస్పీజీ గురువారం మధ్యాహ్నమే అధీనంలోకి తీసుకుంది.   

మోడీ సభకు వచ్చే జనాల కోసం 8వేల బస్సులు

అమరావతి నిర్మాణ పనుల పున్: ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం (మే2)న రానున్న నేపథ్యంలో తెలుగుదేశం కూటమి సర్కార్ గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ప్రధాని పర్యటనలో ఎటువంటి లోటుపాట్లూ లేకుండా అన్ని ఏర్పాట్లూ చేసింది. ఈ పర్యటనలో భాగంగా రోడ్ షో తో పాటు భారీ బహిరంగ సభ కూడా జరగనుంది. దీంతో జనసమీకరణకు అన్ని చర్యలూ లీసుకుంది. ఈ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచీ దాదాపు ఐదులక్షల మంది వస్తారన్న అంచనాలతో ఏర్పట్లు చేశారు. కనీసం ఎనిమిది వేల బస్సులను ఏర్పాటు చేసింది.  ముఖ్యంగా రాజధానికి సమీపంలోని ఎనిమిది జిల్లాల నుంచి వచ్చే జనాల కోసమే 6600 బస్సులను,  మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చే జనాల కోసం 1400 బస్సులను కేటాయించింది. అలాగే  జనాలను తరలించడానికి వినియోగించే అన్ని బస్సులలోనూ ప్రభుత్వ ఉద్యోగులను ఇన్ చార్జీలుగా నియమించింది. అంటే ఒక్కో బస్సుకూ ఒక్కో ఉద్యోగిని నియమించిందన్న మాట.   ప్రధాని మోదీ సభకు, రోడ్‌ షోలకు ఆయా ప్రాంతాల నుంచి ప్రజలను తీసుకొని రావడంతో పాటుగా వారిని ఆయా ప్రాంతాలకు క్షేమంగా తరలించే బాధ్యతలను కూడా ఇన్‌ చార్జిలకే అప్పగించింది   సభకు తరలి వచ్చే ప్రజలకు అల్పాహారం, మధ్యాహ్న భోజనంతో పాటు రాత్రి భోజనం సదుపాయాన్ని కూడా కూటమి ప్రభుత్వం కల్పించనుంది. అలాగే వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని  మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మంచి నీళ్లు, పండ్లు కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులకు ఈ బాధ్యతలను అప్పగించింది.  అంతేకాకుండా సభ ప్రాంగణంలోను, సభా గ్యాలరీల్లోను ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ఆరుగురు సిబ్బందితో కూడిన వైద్య బృందాలు వైద్య సేవలు అందించే విధంగా ఏర్పాట్లు చేసింది. ఇక   శుక్రవారం (మే 2) మధ్యాహ్నం 3:20 గంటల ప్రాంతంలో ప్రధాని  అమరావతికి చేరుకుంటారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలను సభకు రావాలని సీఎం చంద్రబాబు స్వయంగా ఆహ్వానించారు.  

వంగలపూడి అనితపై పవన్ ప్రశంసల వర్షం

సింహాచలం అప్పన్న నిజరూప దర్శనం కోసం క్యూలో నిలుచున్న సమయంలో గోడ కూలి ఏడుగురు మరణించిన విషాద ఘటన సందర్భంగా తక్షణం స్పందించి బాధితులకు అండగా నిలవడమే కాకుండా వారిలో మనోధైర్యాన్ని నింపి, ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా కల్పించిన హోంమంత్రి వంగలపూడి అనితపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. మంగళవారం (ఏప్రిల్ 29) అర్ధరాత్రి తరువాత కురిసిన బారీ వర్షానికి బుధవారం (ఏప్రిల్ 30) తెల్లవారు జామున గోడ కూలి ఏడుగురు భక్తులు మరణించారు. మరి కొందరు గాయపడ్డారు. ఈ విషయం తెలిసిందే.  ఈ విషాదఘటన విషయం తెలియగానే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత క్షణం ఆలస్యం కాకుండా స్పందించారు. సంఘటన జరిగిన కొద్ది వ్యవధిలోనే ఆమె ఆ ప్రదేశానికి చేరుకున్నారు. ఎలాంటి జాప్యం లేకుండా ఒకే సమయంలో బాధితులకు అండగా నిలిచారు. ఇటు వారికి భరోసా కల్పిస్తూ, ప్రభుత్వం అండగా ఉంటుందన్న హామీ ఇస్తూనే అటు పరిస్థితిని సమీక్షించి సహాయ కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టేలా చర్యలు తీసుకున్నారు.  ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా.. పరిస్థితిని కంట్రోల్ లోకి తీసుకున్నారు.   సంఘటన జరిగిన వెంటనే వంగళపూడి అనిత పోలీసులు, ఎస్ఆర్డీఎఫ్ అధికారులను అప్రమత్తం చేసి సహాయ కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన మొదలయ్యాలా చూశారు.  అదే రోజు సాయంత్రం అంటే బుధవారం (ఏప్రిల్ 30)  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  సింహాచలం దుర్ఘటన సందర్శంగా హోంమంత్రి అనిత చేసిన సేవలను, బాధితులను ఓదార్చడంలో, వారిలో ధైర్యం నింపడంలో, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్న నమ్మకం ప్రోది చేయడంలో ఆమె చూపిన చొరవకు, పడిన కష్టానికీ, విరామమెరుగకుండా అందించిన సేవలకు హ్యాట్సాఫ్ చెప్పారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో వంగళపూడి అనిత  నిబద్ధత, బాధితులకు అండగా నిలిచి, వారికి భరోసా కల్పించడంలో చూపిన చోరవ.. ప్రజలలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ప్రతిష్ఠను ఇనుమడింప చేసేదిగా ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళి కుటుంబానికి ఆమె ఇచ్చిన మద్దతును ఈ సందర్భంగా గుర్తు చేశారు.  కొన్ని నెలల కిందట ఇదే పవన్  కల్యాణ్ రాష్ట్రంలో  శాంతిభద్రతల పరిస్థితి, ముఖ్యంగా మహిళలపై పెరుగుతున్న నేరాల విషయంలో హోంమంత్రి వంగలపూడి అనితపై విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. అలాగే తిరుపతిలో  వైకుంఠఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార ప్రవేశాల టికెట్ల కోసం తిరుపతిలో ఎదురు చూస్తున్న భక్తలు తొక్కిసలాటలో భక్తులు మరణించిన ఘటన సందర్భంలో కూడా ఆయన హోంమంత్రిత్వ శాఖ పని తీరును తప్పపట్టడమే కాకుండా అవసరమైతే హోంమంత్రిత్వ శాఖను తానే తీసుకుంటానని కూడా హెచ్చరించారు. అదే పవన్ కల్యాణ్ ఇప్పుడు ోంమంత్రి వంగలపూడి అనితపై ప్రశంసలు గుప్పించడం ద్వారా కూటమి పార్టీల మధ్య ఎటువంటి పొరపచ్చాలూ లేవనీ,  కూటమి ఐక్యంగానే ఉందనీ చాటడమే కాకుండా తన ప్రశంసల ద్వారా వంగళపూడి అనితలో కొత్త ఉత్సాహాన్నీ, స్ఫూర్తినీ నింపారు. పవన్ ప్రశంసలపై స్పందించిన అనిత కూడా ఇదే విషయాన్ని తెలిపారు. హోంమంత్రి పవన్ కల్యాణ్ ప్రశంసలు తనకు మరింత చురుకుగా, చొరవగా పని చేయడానికి స్ఫూర్తిని ఇచ్చాయన్నారు. 

కుల గణన క్రెడిట్ ఎవరి ఖాతాలోకి?

దేశవ్యాప్తంగా కుల గణనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం (ఏప్రిల్30) జరిగిన  రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీపీఏ) కులగణనకు ఆమోదం తెలిపింది. సీసీపీఏ ఆమోదం మేరకు త్వరలో చేపట్టనున్న జనాభా లెక్కలతోపాటే కులగణన చేపట్టాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిందని క్యాబినెట్‌ భేటీ అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ మీడియా సమావేశంలో   వెల్లడించారు.  ఒక విధంగా ఇది అనూహ్య పరిణామం. రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీపీఏ) సమావేశం  ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని, విపక్షాలే కాదు, స్వపక్షంలోని కీలక నేతలు, చివరకు తలలు పండిన రాజకీయ విశ్లేషకులు కూడా ఊహించ లేదు. నిజానికి  ఓ వంక పహల్గాం ఉగ్రదాడి నేపధ్యంలో ప్రతి ఒక్కరు అటుగా చూస్తున్న సమయంలో ప్రధాని మోదీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు.   భారత్ – పాకిస్థాన్ సరిహద్దుల్లో  యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న సమయంలో జరిగిన సీసీపీఏ సమావేశం అందుకోసమే అనుకున్నారు. కానీ.. అనూహ్యంగా మోదీ, మేజిక్ బాక్స్ లోంచి కులగణనను బయటకు తీశారు.  అయితే, రాజకీయ మేథావుల మెదళ్ళకు అందని నిర్ణయాలు తీసుకోవడం మోదీకి కొత్త కాదు. గతంలోనూ మోదీ  Look London, See Paris’ అన్నట్లుగా, ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని, విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఏపీ నుంచి రాజ్యసభ ఉప ఎన్నిక అభ్యర్ధి ఎంపిక విషయంలోనూ ఇలాగే  అందరి అంచనాలను తలకిందులు చేశారు. రేసులోగుర్రాలను పక్కన అపెట్టి అసలు రేసులో లేని, ఓల్డ్ హార్స్  పాకా సత్యనారాయణను  మోదీ ఎంపిక చేశారు. నిజానికి  విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు విజయసాయి మొదలు అన్నామలై వరకు చాలా పేర్లు వినిపించాయి. కానీ  చివరకు  వినిపించని, కనిపించని పాకా ను అదృష్టం వరించింది. మోదీ ఆయనకు కిరీటం పెట్టారు. గతంలో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలోనూ మోడీ  ఇదే మేజిక్ చేశారు.  అయితే.. నిర్ణయం ఎలా జరిగినా అధికార, ప్రతిపక్ష కూటమి భాగస్వామ్య పార్టీలన్నీ మోదీ నిర్ణయాన్ని స్వాగతించాయి. ముఖ్యంగా కులగణనను ఇంటా బయటా వల్లె వేస్తున్న కాంగ్రెస్ అధినాయకుడు,లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా  ప్రధాని మోదీ నిర్ణయాన్ని స్వాగతించారు. స్వాగాతించడమే కాదు.. కేంద్ర ప్రభుత్వం చేపట్టే కులగణనకు కాంగ్రెస్‌ పార్టీ సహకరిస్తుందని రాహుల్ గాంధీ తెలిపారు. అయితే  కులగణనకు నిర్ణీత సమయం తెలపాలని  కోరడంతో పాటుగా కులగణనకు తెలంగాణ మోడల్ ను నమూనాగా తీసుకోవాలని సూచించారు. అయితే  అలాంటి అవకాసం లేదని కేంద్ర మంత్రి వైష్ణవ్‌  అంతకు ముందే స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించే సమయంలోనే  కేంద్ర మంత్రి  చాలా స్పష్టంగా వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ సర్కార్లు తీసుకొచ్చిన సర్వేలు చాలా లోపభూయిష్టంగా ఉన్నాయని  అన్నారు. అందుకే..పారదర్శకంగా కులగణన జరగాలని కేంద్రం భావిస్తోందనీ,  ఇందు కోసం సర్వేలపై ఆధారపడకుండా జనాభా లెక్కలలోనే ఈ విషయం నిర్ధారణ చేసుకుంటే సామాజిక సమతుల్యతకు ఆస్కారం లభిస్తుందని కేంద్రం నిర్ణయానికి వచ్చిందని మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పష్టం చేశారు.  సో ..తెలంగాణ మోడల్ ను కేంద్రం పరిశీలించే అవకాశం కూడా లేదని అంటున్నారు. అయితే.. రాహుల్ గాంధీ సహా  ప్రతిపక్ష పార్టీల నాయకులు కులగణన  తమ విజయంగా పేర్కొం టున్నారు. కేంద్ర ప్రభుత్వం కులగణనకు తలొగ్గేలా చేయడంలో తాము విజయం సాధించామని  కాంగ్రెస్,ఎస్పీ, ఆర్జేడీ నాయకులు ప్రకటించారు. బీహార్‌లో కుల గణన జరగడానికి  ఇప్పుడు దేశవ్యాప్త కులగణనకు కేంద్ర ఒప్పుకోవడానికి తమ పోరాటమే పని చేసిందని ప్రతిపక్ష పార్టీలు చెప్పుకుంటున్నాయి. అయితే.. అందులో  కొంత నిజం ఉన్నా, మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రతిపక్ష్లాల అంబుల పొదిలోని ప్రధాన అస్త్రాన్ని నిర్వీర్యం చేసిందని  విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్ లో  ఆర్జేడీ, కాంగ్రెస్  సారధ్యంలోని మహా ఘటబంధన్  ఆశలపై మోదీ కోల్డ్ వాటర్  కుమ్మరించారని అంటున్నారు, అయితే.. మహా ఘటబంధన్  భాగస్వామ్య పార్టీలు కాంగ్రెస్, ఆర్జేడీ మోదీ మెడలు వంచి కులగణన తెచ్చామనీ.. అదే తమ ఎన్నికల    ప్రచార అస్త్రం అవుతుందని అంటున్నారు. ఈ నేపధ్యంలో.. కులగణనకు బీహార్ అసెంబ్లీ ఎన్నికలే  ఫస్ట్ టెస్ట్ అంటున్నారు. కులగణన క్రెడిట్ ఎవరి ఖాతాలో చేరాలనేది కూడా బీహార్ ఎన్నికల ఫలితాలే తెలియ చేస్తాయి. అంతవరకు ఎవరిగోల వారిదే.

సింహాచలం దుర్ఘటనపై క్షుద్ర రాజకీయాలా.. జగన్ తీరును తప్పుపట్టిన మంత్రి ఆనం

ప్రకృతి వైపరీత్యంతో సింహాచలం దేవస్థానం వద్ద జరిగిన దురదృష్ట సంఘటనను రాజకీయం చేయాలన్న వైసీపీ అధినేత జగన్ ప్రయత్నాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ తన రాజకీయ లబ్ధి కోసం ప్రకృతి వైపరీత్యాల కారణంగా సంభవించిన మరణాలను వాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను రాజకీయ నాయకులు, ప్రజలూ కూడా తప్పుపడుతున్నారు. అందులో భాగంగానే జగన్ తీరు పట్ల ఆంధ్రప్రదేశ్ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అనుకోని విపత్తులో కుటుంబ సభ్యులను కోల్పోయి బాధపడుతున్న జగన్ మోహన్ రెడ్డి క్షుద్ర రాజకీయాలు చేయడం సరికాదని విమర్శించారు.   గత ఎన్నికలలో  ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడించి జగన్ కు జనం బుద్ధి చెప్పినా ఆయన మారలేదని ఆనం అన్నారు.   అనూహ్య సంఘటన కారణంగా మరణించిన వారి కుటుంబాలకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పాతిక లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిందనీ, అలాగే క్షతగాత్రులకు మూడు లక్షల రూపాయలు పరిహారం అందిస్తున్నదని చెప్పారు. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఈర్థిక సాయం ప్రకటించిందని గుర్తు చేశారు. సింహాచలం దుర్ఘటన బాధితులను అదుకునే విషయంలో ప్రభఉత్వం నిబద్ధతతో ఉందని ఆనం అన్నారు.  అన్నమయ్య డ్యాము తెగిపోయి 33 మంది  చనిపోయిన సందర్భంలో కూడా స్పందించని జగన్, కడప నుండి విశాఖపట్నం వచ్చి ఈ సింహాచలనం సంఘటనపై  అర్థంపర్థం లేని విధంగా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆనం చెప్పారు.    శవరాజకీయలతో లబ్ధిని పొందేందుకు ప్రయత్నించడం సరైన విధానం కాదంటూ హితవు పలికారు.  

పొలిటికల్ టర్న్ తీసుకుంటున్న ఆపరేషన్ కగార్!

ఆపరేషన్ కగార్.. ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. ఆదివాసీలను ఇబ్బంది పెట్టేలా బ్లాక్ హిల్స్ లో సెర్చ్ ఆపరేషన్ ఏంటన్న ప్రశ్నలను వామపక్షాలు, పౌరహక్కుల సంఘాలు, బీఆర్ఎస్ వినిపిస్తున్నాయి. పార్టీ నిర్ణయం తర్వాత శాంతి చర్చలపై నిర్ణయం దిశగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది.  ఛత్తీస్ గఢ్ వైపు నుంచి వచ్చిన బలగాలు కర్రెగుట్టలను ఈనెల 21న చుట్టుముట్టాయి. అప్పటి నుంచి కూంబింగ్ కొనసాగుతూనే ఉంది. మొత్తం 24 వేల మంది బలగాలతో ఆపరేషన్ కగార్ సంచలనంగా మారింది.  బ్లాక్ హిల్స్, దుర్గం గుట్టలు మావోయిస్టులకు స్ట్రాటజిక్ లొకేషన్. ఇక్కడ కేంద్ర కమిటీ సమావేశాలు, ఇతర ప్లీనరీలు, భారీగా ఆయుధ డంపులు, ట్రైనింగ్ జరుగుతున్నదన్న ఉద్దేశంతో బలగాలు ఈ గుట్టలను రౌండప్ చేస్తున్నాయి. హెలికాప్టర్లు, డ్రోన్ల నిఘాలో జల్లెడపడుతున్నారు. అయితే ఈ ఆపరేషన్ తో తెలంగాణ పోలీసులకు సంబంధం లేదని పోలీస్ వర్గాలు అంటున్నాయి. కేంద్ర బలగాలే లీడ్ చేస్తున్నాయని చెబుతున్నారు.  బ్లాక్ హిల్స్ లో ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అటు చర్చల విషయంపై మావోయిస్టుల లేఖలు కూడా బయటికొచ్చాయి. ఇక లెఫ్ట్ పార్టీల నేతలు, పౌర హక్కుల సంఘాలు కూడా ఆపరేషన్ కగార్ ను ఖండించాయి. శాంతి చర్చలు జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేట్ శక్తులకు ఎదురు నిలిస్తే నేరమా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు సరికాదని ప్రొఫెసర్ హరగోపాల్, కూనంనేని సహా పలువురు కామెంట్ చేస్తున్నారు. చర్చలకు వస్తామని అంటున్నా చంపడమేంటని ప్రశ్నిస్తున్నారు.  అంతకు ముందు బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ కూడా ఆపరేషన్ కగార్  ను ప్రస్తావించారు. ఎన్ కౌంటర్లు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, బలవంతంగా మావోయిస్టులను అంతం చేయడం కాకుండా శాంతి చర్చలు జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.  గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 3,500 మంది నక్సలైట్లు లొంగిపోయారని, రెడ్ కారిడార్ రాష్ట్రాలు, రాజకీయ పార్టీలతో చర్చలు జరపాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటున్నారు. ఆపరేషన్ కగార్‌ను మారణకాండగా అభివర్ణిస్తూ తెలంగాణలో చాలా చోట్ల నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. భారత్ బచావో   వంటి సంస్థలు ఆపరేషన్‌ కగార్ ను ఆపాలని తెలంగాణ మంత్రి సీతక్కను కోరాయి. అడవుల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్రలో భాగంగా ఆదివాసీలను బలిపశువులుగా చేస్తున్నారన్న ఆరోపణలు చేస్తున్నాయి  తుడుం దెబ్బ వంటి సంస్థలు.  కర్రెగుట్టలో ఆపరేషన్‌ను ఆపాలని, ఆదివాసీలు భయాందోళనలో ఉన్నారని, వారికి తాగునీరు కూడా అందని దుస్థితి నెలకొందని అంటున్నారు.  మరోవైపు ఆపరేషన్ కగార్ పై రాష్ట్ర బీజేపీ నేతలు రియాక్ట్ అవుతున్నారు. చేతిలో తుపాకీ పట్టుకొని శాంతి చర్చలు అనడం ఎంత వరకు సమంజసం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.   శాంతి చర్చల కంటే ముందు మావోయిస్టులు తుపాకులు వదలాలని, తుపాకులు వదిలేస్తున్నామని ప్రకటించి శాంతి చర్చలకు రావాలన్నారు. సో ఆపరేషన్ కగార్ కాస్తా పొలిటికల్ కగార్ గా మారిపోయింది. ఇది ఇప్పుడు తెలంగాణలో ఇదోక సెన్సిటివ్ ఇస్యూ గా మారింది. బలగాలు మాత్రం కూంబింగ్ ఆపడం లేదు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ పెరుగుతోంది.

అదిగో ఏనుగు.. ఇదిగో చావు

ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అటవీ ప్రాంతాల సమీపంలో నివసించే గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఆరుగాలం అప్పులు చేసి ఎంతో శ్రమించి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో ఏనుగుల గుంపుల స్వైర విహారం తో పంటలు నష్టపోతున్నారు.. పంటలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా రైతులు తమ ప్రాణాల  మీదకు తెచ్చుకుని మృత్యువాత పడుతున్నారు. మూడు నెలల క్రితం చంద్రగిరి నియోజకవర్గం కందులవారి పల్లి ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి పంట పొలాలను రక్షించే ప్రయత్నంలో భాగంగా రాత్రి సమయంలో గ్రామస్తులతో కలిసి ఏనుగులు తరిమేందుకు ప్రయత్నించారు. ఈ తరుణంలో ఆయన ఏనుగులు పాదాలకింద పడి మృతి చెందారు.  వారం రోజుల క్రితం చిన్నగొట్టిగల్లు మండలం లో  ఏనుగులను తరిమే క్రమంలో  కౌలురైతు మృతి చెందారు. ఇలా ఒకటి రెండు మరణాలు కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నిత్యం ఏనుగుల దాడులు... పంటల నష్టం... రైతుల మరణాలు జరుగుతూనే ఉన్నాయి.  ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా శేషాచలం, కౌండిన్య, కరిమంగళం, బన్నేరుగట్ట అటవీ ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో 110 ఏనుగులు, తమిళనాడు రాష్ట్రంలో 300 ఏనుగులు, కర్ణాటకలో 400 వరకు ఏనుగులు ఉన్నాయి. ఏనుగులు వీలైనంత మేర గుంపులు గుంపులుగా సంచరిస్తుంటాయి. ఇటు చిత్తూరు జిల్లా అటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులు కావడంతో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంటుంది. వేసవి తో పాటు గత పాలకులు ఎర్రచందనం అక్రమ రవాణా కారణంగా భారీ శబ్దాలు చేస్తుండడంతో అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు బయటకు వచ్చేస్తున్నాయి. ఆహారం కోసం పంట పొలాల పై పడి   ఏనుగులు  స్వైర విహారం చేస్తుండటంతో రైతులు   ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.  సంవత్సరాల తరబడి ఏనుగుల దాడులు జరుగుతూనే ఉన్నాయి. టెక్నాలజీ పెరిగినా ఏనుగులు వల్ల జరుగుతున్న నష్టాన్ని తీర్చే ప్రయత్నం చేయలేదు గత పాలకులు. దీని ప్రభావంతో వేల ఎకరాల పంట నష్టంతో పాటు రైతుల మరణాలు నివారణకు చర్యలు తీసుకోలేదు. వైసీపీ హయాంలో జిల్లాకు చెందిన కీలక నాయకుడు అటవీ శాఖ మంత్రి గా పని చేసినా రైతులకు నష్టపరిహారం సైతం పూర్తి స్థాయిలో అందలేదు.  ఏనుగుల దాడులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫారెస్ట్ అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఏనుగుల కదలికలు, వన్యప్రాణుల సంరక్షణ, సమాజ భద్రత, పంట నష్టం తగ్గించడం, ఈ టాస్క్ ఫోర్స్ పని. అటవీ సమీప గ్రామాల ప్రజలు ఏనుగుల కదికలు ఉన్న ప్రాంతాలకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా టాస్క్ ఫోర్స్  9440810070, 9440810114, 9440810069, 9440810113, టోల్ ఫ్రీ 18004255909కి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.  తప్పుడు సమాచారం ఇవ్వకుండా అటవీ రక్ష ణకు ఉపయోగపడాలని కోరుతున్నారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది గ్రామాల్లోకి వెళ్లి గ్రామస్తులకు ఏనుగులు వచ్చిన సమయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై పై అవగాహన కార్యక్రమాలు నిర్వహి స్తున్నారు.

అల అమ‌రావ‌తిపుర‌మున‌.. మే 2న‌..సెకండ్ రిలీజ్

మ‌ళ్లీ మోడీ చేతుల మీదుగా ప్రారంభం ప‌త్రిక‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మిస్సింగ్ అమ‌రావ‌తి పునః ప్రారంభోత్స‌వానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి ప్రాధాన్య‌త‌ లేదు.. అందుకే ఆహ్వాన ప‌త్రంలో ఆయ‌న పేరు వేయ‌లేదు.. అన్న కోణంలో వైసీపీ తెగ ఫీల‌వుతోంది. ఈ దిశ‌గా కూట‌మిలో చీలిక‌లు తెచ్చే య‌త్నం ఒకింత జోరుగానే తెలుస్తోంది.. అందుకే ర‌క‌ర‌కాల మీమ్స్ త‌యారు చేసి.. త‌ద్వారా కూట‌మిలో వారికి వారు కొట్టుకు చ‌చ్చే ఎత్తుగ‌డ వేస్తోంది.  ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ చెప్పిన‌ట్టు కూట‌మి కనుక ఇదే ఒర‌వ‌డితో త‌మ‌ బంధాన్ని  కొన‌సాగిస్తే.. మళ్లీ  కూడా ప్ర‌భుత్వం వారిదే అవుతుంది. దీంతో కూట‌మిలో ఎలాగైనా  స‌రే చీలిక‌లు తేవాల‌న్న కృత నిశ్చ‌యంతో ఉంది వైసీపీ.  ఈ దిశ‌గా ఆ పార్టీ చేయ‌ని విశ్వ ప్ర‌య‌త్నం లేదు. మొన్న ప‌వ‌న్ కేర‌ళ, త‌మిళ‌నాడు తీర్ధ‌యాత్ర‌ల‌కు వెళ్లిన‌పుడు కూడా ఇంతే. ప‌వ‌న్ ఉప ముఖ్య‌మంత్రిగా అంటీ ముట్ట‌న‌ట్టు ఉంటున్నారు. ఆయ‌న్ను తీసి  ప‌క్క‌న పెట్టేశారు. వ‌చ్చే రోజుల్లో లోకేషే డిప్యూటీ సీఎం కాబోతున్నారు.  కాబ‌ట్టి ప‌వ‌న్ అలిగి వెళ్లిపోయారంటూ త‌మ‌కు తాము ఎన్నెన్నో క‌ల‌లు క‌న్నారు. ఊహాగానాల‌ను వ్యాప్తి చేసే  య‌త్నం చేశారు.  తీరా  యాత్ర నుంచి వ‌చ్చిన ప‌వ‌న్ ఎన్టీఆర్ ట్ర‌స్ట్ కార్య‌క్ర‌మానికి హాజ‌రై యాభై ల‌క్ష‌ల విరాళం కూడా ఇచ్చారు. దీంతో అవాక్క‌వ‌డం ఫ్యాను పార్టీ నేత‌ల వంత‌య్యింది. క‌ట్ చేస్తే ఇప్పుడు మ‌రో గొడ‌వ‌. ప‌వ‌న్ పేరు అమ‌రావ‌తి ఆహ్వాన ప‌త్రంలో లేదు కాబ‌ట్టి ఇక ఆయ‌న ప్రాధాన్య‌త త‌గ్గిపోయింది. ఆయ‌న్ను ఎక్క‌డ ఉంచాలో అక్క‌డ ఉంచే య‌త్నం చేస్తున్నారంటూ మీమ్స్ చేస్తున్నారు. రెడీ సినిమాలో బ్ర‌హ్మానందం క్లిప్పింగు వాడి.. నానా హంగామా చేస్తున్నారు. దీని కార‌ణంగా కూట‌మిలో ఎలాగైనా ఒక గ్యాప్ క్రియేట్ చేయాల‌నుకుంటున్నారు. ఏతా వాతా వైసీపీ వాళ్లు ఈ అంశంలో లాగే లాజిక్ ఏంటంటే.. బీజేపీ, టీడీపీ క‌ల‌వ‌డానికి మూల కార‌కుడు.. కూట‌మి మూల పురుషుడు.. ప‌వ‌నే క‌దా? మ‌రి ప‌వ‌న్ కి ఆహ్వాన ప‌త్రిక‌లో ప్రాధాన్య‌త లేకుంటే ఎలా? అన్న‌ది వీరి ప్ర‌శ్న‌.  ఇక్క‌డే కాదు ఎక్క‌డ ఏ చిన్న ఛాన్స్ దొరికినా స‌రే ప‌వ‌న్ ని బ‌య‌ట‌కు లాగి ఆయ‌న్ను గానీ, ఆయ‌న అభిమాన గ‌ణాన్ని కానీ, ఆయ‌న సైనికుల‌ను కానీ.. టెంప్ట్ చేయాలి. వారి మ‌నోభావాల‌ను దారుణంగా రెచ్చ‌గొట్టాలి అన్న‌ది ఒక టార్గెట్ గా పెట్టుకున్నారులా ఉంది చూస్తుంటే.  అందుకే నిన్న మొన్న వైసీపీ హంగామా చేసిన గో మ‌ర‌ణాల విష‌యంలో అయితేనేమీ, శ్రీ కూర్మం తాబేళ్ల విష‌యంలో అయితేనేమీ.. ప‌వ‌నానంద స్వామి ఏమై పోయాడు? ఏడీ ఆయ‌న స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ అంటూ నానా హంగామా చేస్తున్నారు. అయితే ఇక్క‌డ వైసీపీ సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌లు తెలుసుకోవ‌ల్సిన విష‌య‌మేంటంటే ప‌వ‌న్ త‌న‌కు తాను ఎప్పుడో ప్రొటోకాల్ అంశంలో ఒక నిర్ణ‌యానికి వ‌చ్చి ఉన్నారు. ఈ విష‌యంలో మ‌న‌కున్న ఆధారాలు ఏంటంటే..  మొన్న జ‌గ‌న్ మోహ‌న రెడ్డి ప్ర‌త్యేక హోదా కావాల‌ని డిమాండ్ చేస్తున్న స‌మ‌యాన‌.. ఆయ‌న ఒక మాట అన్నారు. నాకు మోడీతో సాన్నిహిత్యం ఉండొచ్చుగాక‌.. కానీ ప్రొటోకాల్ అనేది ఒక‌టి ఉంటుంది. దాని ప్ర‌కారం అక్క‌డ త‌న‌కు స్థానం కేటాయిస్తారు. ఉప ముఖ్య‌మంత్రి అన్న‌ది అంత  గొప్ప ప‌ద‌వి కాదు. రాజ్యాంగ బ‌ద్ధ‌మైన‌ది అంత‌క‌న్నా కాదు. అది కూట‌మి  ప్ర‌భుత్వంలో నెంబ‌ర్ టూ పొజిష్ అయి ఉండొచ్చుగాక‌.. కానీ దానికి విశాల దృక్ప‌థంతో చూస్తే ఉన్న విలువ వేరు. మొద‌ట ప్ర‌ధాని, త‌ర్వాత స్పీక‌ర్, కేంద్ర మంత్రులు, ముఖ్య‌మంత్రులు మంత్రులు ఇలా ఉంటుంది. అంతే కానీ, నా సీటు తీసుకెళ్లి ప్ర‌ధాని ప‌క్క‌న  వేయ‌లేద‌ని  తాను ఎలా బాద ప‌డ‌కూడ‌దో జ‌గ‌న్ కూడా స‌రిగ్గా అలాగే బాధ ప‌డ‌కూడ‌ద‌ని ఆయ‌న కుండ బ‌ద్ధ‌లు కొట్టారు. ఈ క్ర‌మంలో చూస్తే ప‌వ‌న్ కి పిచ్చ క్లారిటీ ఉంద‌న్న మాట‌.  ప‌వ‌న్ ప్రొటో కాల్ విష‌యంలో ఇంత స్ప‌ష్ట‌మైన విజ‌న్ క‌లిగి ఉన్నా కూడా వైసీపీ నేత‌లు ఇంకా అదే భ్ర‌మ‌తో.. పిచ్చి ఆశ కొద్దీ.. కూట‌మిలో చీలిక తెద్దామ‌న్న విశ్వ ప్ర‌య‌త్నాలైతే మాన‌డం లేదు. నిజంగా రాజ‌ధాని విష‌యంలో చింతించాల్సిన అంశాలేంటి? అన్న‌ది ఆలోచించాలి. చిత్త‌శుద్ధి ఉంటే.. త‌మ‌కు కూడా రాజ‌ధాని ప‌ట్ల ఒక స్థిర అభిప్రాయం ఏర్ప‌డింద‌ని ప్ర‌క‌టించాలి. ఎందుకంటే మూడు ప్రాంతాల ప్ర‌జ‌లు రాజ‌ధాని ఇక్క‌డే ఉండాల‌ని డిసైడ్ అయ్యారు కాబ‌ట్టే వారు కూట‌మికి 164 సీట్ల ఆధిక్యం క‌ట్ట‌బెట్టార‌ని గుర్తించాలి.  అలా చేయ‌కుండా పిల్లి ఉట్టి గానీతెగి కింద ప‌డితే ఆ పాల‌న్నీ తాగొచ్చ‌న్న భ్ర‌మ‌లో ఉండి ఎలా శాపాలు పెట్టుకుంటూ ఉంటుందో, అలా వైసీపీ  కూట‌మి ప్ర‌భుత్వంలో విబేధాలు లేకున్నా ఏదో లా సృష్టించి వాటి ద్వారా ల‌బ్ధి పొందాల‌ని చూడ్డం దారుణంగా భావిస్తున్నారు ఆంధ్రులు. మ‌రి చూడాలి వైసీపీ  వైఖ‌రి ఇక‌నైనా మారుతుందా లేదా అన్నది.

జగన్ ఏంటిది? రాజకీయాలకు ఇదా సందర్భం?

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార యావతో అల్లాడిపోతున్నట్లు కనిపిస్తున్నది. 2024 ఎన్నికలలో ఓటమి తరువాత, ఆయన పార్టీ అధినేతగా, పులివెందుల ఎమ్మెల్యేగా సరిపెట్టుకోలేకపోతున్నారు. ఎప్పుడెప్పుడు మళ్లీ ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కేద్దామా అన్న ఆత్రంతో ఉన్నట్లు కనిపిస్తున్నది. అందుకోసం ఆయన ప్రజలతో మమేకం కావడం, ప్రజా సమస్యలపై పోరాడటం వంటి మార్గాలను కాకుండా అడ్డదార్లను ఎన్నుకుంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజలను రెచ్చగొట్టడం, సమాజంలో చీలికలలు తీసుకు వచ్చి, అశాంతిని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు.  అందుకే ఆయన ప్రజలలోకి రావడానికి ఎంచుకుంటున్న సమయం, సందర్భం వివాదాస్పదంగా ఉంటున్నాయి. రాష్ట్రంలో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు, మరణాలు సంభవించినప్పుడు, తమ పార్టీ నేతలు ఎవరైనా గతంలో చేసిన తప్పులు, నేరాలలో అరెస్టైనప్పుడు మాత్రమే ఆయన బయటకు వస్తున్నారు. ఆ వచ్చిన సమయంలో కూడా బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం కంటే.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసి.. తాను మళ్లీ అధికారంలోకి రాగానే.. అంటూ హెచ్చరికలు చేయడానికే పరిమితమౌతున్నారు.  తాజాగా సింహాచలంలో జరిగిన దురదృష్టకర సంఘటనలో ఏడుగురు మరణించిన సంగతి తెలిసిందే. వెంటనే జగన్ బాధిత కుటుంబాల పరామర్శ అంటూ సింహాచలంలో వాలిపోయారు. అయితే జగన్ బాధిత కుటుంబాలను పరామర్శించడానికి అక్కడకు చేరుకోవడానికి ముందే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మృతుల కుటుంబాలకు పాతిక లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించేసింది. అలాగే బాధిత కుటుంబాలలో ఒకరికి దేవాదాయ శాఖలో ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా ఉద్యోగం ఇవ్వనున్నట్లు కూడా పేర్కొంది.  దీంతో జగన్ తన స్క్రిప్ట్ ను ఒకింత సవరించుకున్నారు. ప్రభుత్వాన్ని నిలదీయడానికి బాధిత కుటుంబాలకు ఇచ్చిన నష్టపరిహారం సరిపోదని, గతంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తాను కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించాననీ, ఇప్పుడు సింహాచలం ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కూడా అంతే పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఒక వేళ ప్రభుత్వం అలా ఇవ్వకపోతే.. తాను అధికారంలోకి వచ్చిన తరువాత బాధిత కుటుంబాలకు రూ. కోటి పరిహారం తాను ఇస్తానని కూడా ప్రకటించేశారు.  ఇక్కడ ఆయన మరచిపోయిందేమిటంటే.. ఎల్జీ పాలిమర్స్ ఘటన పూర్తిగా మానవ తప్పిదం, ఆ కంపెనీ నిర్లక్ష్యం. కానీ సింహాచలంలో జరిగింది పూర్తిగా వేరు. ఇక్కడ భారీ వర్షం కారణంగా గోడ కూలి భక్తులు మరణించారు. ఈ విషయాన్ని విస్మరించి జగన్ రాజకీయ లబ్ధి కోసం ఏవేవో చెబుతున్నారు. మేము వచ్చాకా అంటూ తన భుజాలు తానే చరుచుకుంటున్నారు.  అయితే నెటిజనులు మాత్రం జగన్ ను ముందు విజయవాడ బుడమేరు ముంపు సమయంలో ప్రకటించిన  కోటి రూపాయల విరాళం మాటేమిటని నిలదీస్తున్నారు. అయినా జగన్ సింహాచలం వచ్చింది బాధితులను పరామర్శించి ఓదార్చడానికా లేక రాజకీయం చేయడానికా అని ప్రశ్నిస్తున్నారు.