దేవాలయాల్లో వరస దుర్ఘటనల వెనక కుట్ర కోణం?

వారం రోజుల కిందట ఏప్రిల్ 30న ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా సింహాచలంలోని సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వరాహ లక్ష్మీ నరసింహ స్వామి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మరణించారు. మరి కొందరు గాయపడ్డారు.  అంతకు ముందు రోజు రాత్రి సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్‌ క్యూలైన్‌పై సిమెంట్ గోడ కూలింది.  ఆ తర్వాత మూడు రోజులకు మే 3న గోవాలో మరో ఘోర విషాదం జరిగింది. శిర్గావ్‌లోని ఓ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. మరో 50 మందికి పైగా భక్తులు త్రీవంగా గాయపడ్డారు.  వివరాలలోకి వెళితే..  శిర్గావ్ లోని శ్రీ లైరాయ్‌ ఆలయంలో వార్షిక జాతర అదే రోజు ప్రారంభమైంది. దీంతో లైరాయ్‌ అమ్మవారిని దర్శించుకునేందుకు గోవా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆ ఆలయంలో అనాదిగా వస్తున్న 'నిప్పులపై నడిచే' కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా రద్దీ కావడం వల్ల భక్తులు ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు నార్త్ గోవా పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత సోమవారం(మే 5) మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని లో నెలకొన్ని ప్రపంచ ప్రఖ్యాత మహాకాళేశ్వర్ ఆలయంలో అగ్నిప్రమాదం చెలరేగింది. దట్టమైన పొగలు సుమారు కిలోమీటరు వరకూ వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఆలయ శంఖ ద్వారం, సిసీటీవీ కంట్రోల్ రూమ్‌కు పైనున్న రూఫ్‌ వద్ద మంటలు చెలరేగగా, ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. హుటాహుటిన నాలుగు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశాయి.ప్రమాదంలో ఎవరూ మరణించినట్టు సమాచారం లేదని అధికారులు తెలిపారు.  ఒక వారం రోజుల వ్యవధిలో జరిగిన ఈ మూడు సంఘటనలు (ఇంకా మన దృష్టికి రానివి ఉన్నా ఉండవచ్చు) వేటికవిగా చూస్తే, ఎవరికీ ఎలాంటి అనుమానం రాదు, కానీ, ఒకదాని వెంట ఒకటిగా జరిగిన ఈ సంఘటనల పూర్వపరాలను, సమయ సందర్భాలను గమనిస్తే ఎంతో కొంత అనుమానాలకు ఆస్కారం లేక పోలేదని అంటున్నారు.  ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ  దేవాలయలాపై జరిగిన దాడులు, ఆ సందర్భంగా అప్పటి మంత్రులు స్పందించిన తీరును గుర్తుచేసుకుంటే, అవే కుట్రలు ఇప్పటికీ కోనసాగుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  నిజానికి  వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే కాదు,అధికారం కోల్పోయిన తర్వాత కూడా తిరపతి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు ఆ పార్టీ, ఆపార్టీ ప్రచార మాధ్యమాలు కొనసాగిస్తూనే ఉన్నాయని హిందూ ధార్మిక సంస్థలు ఆరోపిస్తున్నాయి.  ఈ ఏడాది జనవరిలో వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం సందర్భంగా జరిగిన  తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించారు. ఈ దుర్ఘటన విషయంలో వైసీపీ స్పందించిన తీరు అనుమానాలకు ఆస్కారం కల్పించే విధంగా ఉందని అప్పట్లోనే ఆరోపణలు వినవచ్చాయి. ఇక గత నెల (ఏప్రిల్)లో వైసేపీ మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ గోశాలలో మూడు నెలల వ్యవధిలో ఏకంగా 100 కి పైగా ఆవులు నిర్వహణ లోపం కారణంగా చనిపోయాయని ఆరోపించారు.అంతే కాదు  తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగరాని ఘోరాలన్నీ జరిగిపోతున్నాయని భక్తులను తప్పు తోవట్టించేందుకు  భూమన, జగన్ ఇతర వైసీపీ నాయకులు సొంత మీడియాను వేదిక చేసుకుని పెద్ద ఎత్తున అసత్య ప్రచారం చేశారు.  నిజానికి..  వైసీపీ అధినేత జగన్ రెడ్డి హిందూ వ్యతిరేకత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అన్యమతస్థులు, వెంకన్న దేవుని పై విశ్వాసాన్ని ప్రకటిస్తూ ప్రత్యేక రిజిస్టర్  లో సంతకం చేయాలన్న నిబంధన ఎప్పటి నుంచో వుంది. మాజీ రాష్ట్ర పతి ఏపీజే అబ్దుల్ కలాం వంటి ఎందరో పెద్దలు   దేవాలయ మర్యాదను పాటించారు. కానీ, జగన్ రెడ్డి మాత్రం ఏనాడు తమ విశ్వాసాన్ని ప్రకటించలేదు  సరి కదా, ఆ నిబంధనే తప్పని పరోక్షంగానే అయినా ఆయనేమి దేవుడు అనే అర్థం వచ్చేలా  వెంకన్న స్వామినే  నిందించారు. ఈ పరిణామాలను గమనిస్తే తిరుమల సహా రాష్ట్రంలో, దేశంలో ఉన్న హిందూ దేవాలయాల పవిత్రతను, హిందువుల విశ్వాసాని దెబ్బ తీసేందుకు నిరంతర కుట్రలు జరుగుతున్నాయా?  అంటే మొన్న తిరుపతిలో, నిన్న సింహాచలంలో, ఆ వెంట గోవా, ఉజ్జయిని (ఎంపీ) లో జరిగిన సంఘటనలు గమనిస్తే.. కుట్ర కోణాన్ని కొట్టివేయలేమని అంటున్నారు.

కృపారాణి ఏరీ? ఎక్కడ?

కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకురాలు కిల్లి కృపారాణి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఒకప్పుడు కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న ఈ సిక్కోలు నేత, ఇప్పుడు ఎక్కడా కనిపించకుండా, వినిపించకుండా దాదాపు అజ్ణాత వాసం చేస్తున్నట్లుగా ఎందుకున్నారు.  నిత్యం ప్రజల్లో ఉంటేనే ఓట్లు వెయ్యని ప్రజలు...  ఎన్నికల వరకూ మ్యూట్ గా ఉంటా అని అంటున్న కృపారాణి  వ్యూహానికి విలువ ఇస్తారా.. ?  కిల్లి కృపారాణి.. ఉత్తరాంధ్ర ప్రాంతం శ్రీకాకుళం జిల్లా కు చెందిన సీనియర్ పొలిటీషియన్. ఎపిలో కాంగ్రెస్ పార్టీ సుషుప్తావస్థ లోకి వెళ్ళడంతో 2014 సాధారణ ఎన్నికల సమయంలో వైకాపా తీర్ధం పుచ్చుకున్న ఈ కేంద్ర మాజీ మంత్రి, ఆ తరువాత ఆ పార్టీని వీడి బటయకు వచ్చారు. ఆమె వైసీపీలో చేరిక, నిష్క్రమణ రెండూ కూడా అనూహ్య పరిణామాలేనని అంటున్నారు పరిశీలకులు.  2009 లో అప్పటి కాంగ్రెస్ లో జగన్మోహన రెడ్డి, కిల్లి కృపారాణిలు ఇద్దరూ ఎంపిలుగా గెలిచి ఒకే దఫా పార్లమెంట్ కు వెళ్ళినవారు. దీంతో కిల్లి కృపారాణి వైసీపీ ఆవిర్భావం తరువాత ఆ పార్టీలో చేరారు. అయితే తానొకటి తలిస్తే మరోటి జరిగిందన్నట్లు తయారైంది ఆమె పరిస్థితి. వైసిపి లో  తనకు రెడ్ కార్పెట్   ఉంటుంది భావించిన కృపారాణికి అన్ని విషయాలలోనూ జగన్ తనను దూరం పెడుతూ రావడం జీర్ణించుకోలేకపోయారు.   చివరికి తాను ఆశించిన శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం కూడా 2024లో వేరొకరికి ఇవ్వడంతో షాక్ తిన్నారు.   వైసిపి లో తనకు ఒరిగింది ఏమి లేదు అని మీడియా ముందు చెబుతూ 2024 ఎన్నికలకు రెండు నెలల ముందు వైసిపిని వీడి మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు కృపారాణి.  2024 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున టెక్కలి అసెంబ్లీ బరిలో దిగి.. కేవలం ఒక్క శాతం ఓట్లు మాత్రమే సాధించి పరువు పోగొట్టు కున్నారు. ఇక్కడ కృపారాణి చేస్తున్న పొరపాటు ఏదైనా ఉంది అంటే అది అవసరం ఉన్నప్పుడు ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుని,  అవసరం లేనప్పుడు తొందరగా నిర్ణయాలు తీసుకోవడం. మృదు స్వభావిగా పేరు సంపాదించిన కృపారాణికి అన్ని రాజకీయపార్టీల నేతలతో  మంచి సంబంధాలున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో అన్ని పొలిటికల్ పార్టీలలో సైతం కృపారాణికి  ఆమె స్థాయికి తగ్గ  పదవులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. ఇన్ని అవకాశాలు ఉన్నా, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ తో ఎన్నికల్లో గెలవడం కష్టం అని తన నోటితో తానే చెప్పి ఆ పార్టీని వీడిన కృపారాణి.. మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ లో చేరారన్నది ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది.  శ్రీకాకుళం జిల్లాలో వివిధ పార్టీలలో ప్రస్తుతం ఖాళీగా ఉండి, నాయకత్వం కోసం ఎదురుచూస్తున్న స్థానాలు చూస్తే.. వైసిపి లో ఇంకొన్నాళ్ళు ఉండి ఉంటే.. ఈ దఫా ఆమెకు తప్పనిసరిగా స్థానం రిజర్వ్ అయ్యేది అన్నది పరిశీలకులు విశ్లేషణ. టెక్కలి వైసిపి స్థానం కుక్కలు చింపిన విస్తరి మాదిరిగా మారడం.. దువ్వాడ, పేరాడ మధ్య వివాదం నేపధ్యంలో కృపారాణి ఉండి ఉంటే ఆమెకే ఆ స్థానం లభించేది అని చాలామంది లెక్కలు కడుతున్నారు. ఇంకోవైపు శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలో సైతం వైసీపీకి ఇప్పుడు సరైన నేత లేరు.  ఆమె అన్నట్టు వైసీపీలో అవమానాలు భరించలేననుకుంటే..    జనసేన సైతం శ్రీకాకుళం జిల్లాలో సరైన నేత కోసం ఎదురు చూస్తోందనే చెప్పాలి. అక్కడా ఆమె చేరికకు అభ్యంతరాలు వచ్చే అవకాశాలు అంతంత మాత్రమే. ఎందుకంటే . కృపారాణికి మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో  ఈ రోజుకీ మంచి సంబంధాలే ఉన్నాయి.  ఇద్దరూ ఒక దఫా కాంగ్రెస్ లో కేంద్ర మంత్రులుగా చేసినవారు కావడంతో  ఆ ర్యాపో ఇంకా కంటిన్యు అవుతోంది.  సరిగ్గా నేగోషియేట్ చేస్తే.. శ్రీకాకుళం జనసేన లో కృపారాణికి  మంచి బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. బిజెపి, తెలుగుదేశం కూడా  కృపారాణికి ఆప్షనల్ పార్టీలు. తన రాజకీయ భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం, బీజేపీలలో ఏదో ఒక పార్టీలో చేరినా కృపారాణికి పదవులు లభించే అవకాశం లేకపోలేదు.  హడావిడి నిర్ణయాల మధ్య  2024 ఎన్నికలకు కొద్ది నెలల ముందు కాంగ్రెస్ లో చేరి, టెక్కలి అసెంబ్లీకి పోటీ చేసి చేతులు కాల్చుకున్న కృపారాణి  ప్రస్తుతం పొలిటికల్ గా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఊర్లో శుభకార్యాలకు హాజరవ్వడం తప్ప, రాజకీయంగా క్రీయాశీలంగా లేరు.  ఇన్ని అవకాశాలు ఉన్నా,   జిల్లా వ్యాప్తంగా అభిమానులు ఉన్నా, కృపారాణి 2029 ఎన్నికల వరకూ సైలెంట్ గా ఉంటా.. అప్పుడు తన పొలిటికల్ స్ట్రాటజీ చెబుతా  అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే  ఈ వ్యూహం రాజకీయాలలో వర్కౌట్ అవుతుందా? తాబేలు, కుందేలు పరుగుపందెం నీతి కథలో మాదిరి.. స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ వ్యూహం ఫలిస్తుందా? అంటే.. లెట్స్ వెయిట్ అండ్ సీ!

హరీష్ రావుకు పొగ.. బీఆర్ఎస్ లో సెగ!?

తెలంగాణ రాజకీయాలలో పేలనున్న బాంబు కేసీఆర్ రాజకీయవారసత్వం కోసం కేటీఆర్, కవిత పోటీ అన్నాచెళ్లెళ్ల పోరులో హరీష్ ను దూరం పెడుతున్న అధినేత నిప్పు లేకుండా పొగ రాదు అంటారు. ఇప్పుడు బీఆర్ఎస్  విషయంలో వినవస్తున్న వార్తలు కూడా అలాంటివేనా? బీఆర్ఎస్ లో త్వరలోనే నిట్టనిలువుగా చీలక ఏర్పడనుందా?   మరీ ముఖ్యంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ అధినేత హరీష్ రావు విషయంలో వినవస్తున్న కథనాలు బీఆర్ఎస్ లో ముసలాన్ని సచిస్తున్నాయా?  ఇన్నాళ్లూ నివురు గప్పిన చందంగా ఉన్న పార్టీలోని విభేదాలు ఇప్పుడు బహిర్గతం కానున్నాయా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. మరీ ముఖ్యంగా ఇన్నాళ్లూ బీఆర్ఎస్ కు సన్నిహితంగా ఉన్న మీడియా వర్గాల నుంచే ఇటువంటి లీకులు రావడంతో  అందరూ నిప్పు లేకుండా పొగరాదు.. బీఆర్ఎస్ లో ఏదో జరుగుతోంది అన్న అనుమానాలు  వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ విషయమేంటంటే.. బీఆర్ఎస్  పార్టీ ఆవిర్భవించి పాతికేళ్లయిన సందర్భంగా వరంగల్ లో జరిగిన భారీ బహిరంగ సభ వేదికగా పార్టీ అధినేత కేసీఆర్ తన రాజకీయ వారసుడు కేటీఆరే అని పార్టీ నేతలకు, క్యాడర్ కు పరోక్షంగా చాటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బహిరంగ సభ వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్లలో తన ఫొటోయే కాకుండా కేటీఆర్ ఫొటో కూడా ప్రముఖంగా ఉంచడం ద్వారా తన రాజకీయ వారసుడు, పార్టీ భవిష్యత్ అధ్యక్షుడు కేటీఆర్ అని చాటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  ఇప్పటి వరకూ కేటీఆర్ పాల్గొన్న సభలలో మాత్రమే కేసీఆర్ తో పాటు కేటీఆర్ చిత్రాలూ ప్రముఖంగా ఉండేవి. కేసీఆర్ పాల్గొన్న సభలో అయితే వేదికపై ఎందరున్నా బ్యానర్లలో కేసీఆర్ ఫొటో మాత్రమే ఉండేది. తొలి సారిగా వరంగల్ సభలో మాత్రమే కేసీఆర్, కేటీఆర్ లకు సమప్రాధాన్యత నిస్తూ బ్యానర్లు, ఫొటోలు వెలిశాయి. ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవలసిందేమిటంటే.. మొత్తం సభా వేదిక, ప్రాంగణంలో ఎక్కడా హరీష్ రావు ప్రాధాన్యత, ప్రాముఖ్యత లేకుండా పోయింది. ఆఖరికి సంత మీడియాలో కూడా హరీష్ రావు ప్రాధాన్యత బాగా తగ్గిపోయింది.  ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా హరీష్ సెంట్రిక్ గా పార్టీలో చీలిక అంటూ లీకుల మీద లీకులు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే హరీష్ రావు సొంతగా పార్టీ ఏర్పాటు చేయనున్నారనీ, దాని పేరు టీఆర్ఎస్ అనీ పెద్ద ఎత్తున పోస్టులు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా ఒక మధ్యవర్తి ద్వారా హరీష్ రావు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారనీ, త్వరలో ఆయన సైకిలెక్కే చాన్స్ ఉందనీ సోషల్ మీడియాలో ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.  కేవలం తెలుగుదేశం గూటికి చేరడమే కాకుండా.. ఆ పార్టీ తెలంగాణ సారథిగా పగ్గాలు అందుకుని..వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అత్యంత కీలకమైన, ప్రధానమైన పాత్ర పోషించనున్నారన్న చర్చ కూడా జరుగుతోంది.  వాస్తవానికి టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచీ కూడా కేసీఆర్ వెన్నంటి ఉండి.. పార్టీ నిర్మాణంలో, తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్రపోషించి, కేసీఆర్ రాజకీయ వారసుడిగా గుర్తింపు పొందినది హరీష్ రావే. అయితే తెలంగాణ ఉద్యమం జోరందుకున్న తరువాత విదేశాల నుంచి కేటీఆర్ వచ్చిన తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. మెల్లిమెల్లిగా హరీష్ రావు ప్రాధాన్యత పార్టీలో తగ్గడం మొదలైంది. ఉద్దేశ పూర్వకంగా హరీష్ రావును పక్కన పెట్టే ప్రయత్నం స్వయంగా కేసీఆర్ చేశారని పార్టీ వర్గాలే చెబుతూ వస్తున్నాయి. ముఖ్యంగా రెండో సారి బీఆర్ఎస్ విజయం సాధించిన తరువాత ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో తొలుత హరీష్ రావుకు స్థానం కూడా అభించలేదు. ఇవన్నీ హరీష్ రావును పక్కన పెట్టి, ఆయన ప్రాధాన్యత తగ్గించడానికి ఒక ప్రణాళిక మేరకు జరిగిన ప్రయత్నంగా పార్టీ వర్గాలే చెబుతూ వస్తున్నాయి. సరే ఇక ఇప్పుడు హరీష్ రావును పూర్తిగా పక్కన పెట్టేసి కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించడానికి రంగం సిద్ధమైందని అంటున్నారు.  ఈ నేపథ్యంలోనే హరీష్ రావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్నారనీ, హరీష్ రావు పార్టీని వీడితే ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో కేడర్, ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకులూ కూడా నడుస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  త్వరలో కేసీఆర్ అమెరికా వెళ్లనున్నారు. కేసీఆర్ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో పార్టీలో కీలక పరిణామాలు సంభవించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.   చూడాలి ఈ సారి కూడా అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందంగా హరీష్ పార్టీ మార్పు వ్యవహారం ప్రచారానికే పరిమితమౌతుందా? లేక కేసీఆర్ కు ఝలక్ ఇస్తూ నిజంగానే పార్టీ వీడి హరీష్ తన దారి తాను చూసుకుంటారా?

కమిటీ నివేదిక, చర్యలు సరే.. సమస్యల శాశ్వత పరిష్కారం సంగతేంటి?

ఎట్టకేలకు సింహాచలం అప్పన్న చందనోత్సవ సమయంలో  జరిగిన అపశ్రుతి విషయంలో బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.  అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. చర్యల సంగతి సరే అసలు ఆలయంలో అవకతవకలకు సంబంధించి శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం యోచన చేయాల్సి ఉంది.  గత నెల 30న సింహాచలం చంద్రయాత్ర సందర్భంగా 300 రూపాయల క్యూ లైన్ అనుకుని నిర్మించిన గోడ కూలిపోవడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు. దీనిపై ప్రభుత్వం ముగ్గురు   అధికారులతో కమిటీని నియమించింది.   ఆ కమిటీ నివేదిక ఆధారంగా దేవాదాయ, పర్యాటకశాఖ చెందిన ఏడుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది.  సస్పెన్షన్ వేటు పడిన వారిలో సింహాచలం ఈవో కూడా ఉన్నారు.  మరోవైపు గోడ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని కాంట్రాక్టర్ తో సహా ఇద్దరు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్న కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ చర్యలను ప్రజలు ఆహ్వానిస్తున్నారు.   అదే సమయంలో ఈ చర్యలతో సమస్యకు పూర్తి పరిష్కారం లభించినట్టు ఎలా అవుతుందన్న ప్రశ్న కూడా సంధిస్తున్నారు.  మొదటి నుంచీ సింహాచలం దేవస్థానంలో కొందరు కాంట్రాక్టర్లు తిష్ట వేశారు.  తాత్కాలికంగా వచ్చే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు తోపాటు ఇతరులను మభ్యపెట్టో మాయచేసో  నిర్వహణ పనులతో పాటు కొత్త అభివృద్ధి పనులను నిర్లక్ష్యంగా చేస్తున్నారు.  ప్రసాదం స్కీం డిపిఆర్ సిద్ధమై చాలా కాలం అయింది.  కానీ ఇప్పటికీ ఆ డీపీఆర్ కుఅనుగుణంగా పనులు జరగడం లేదు మెట్ల మార్గం అసంపూర్ణంగా వదిలేశారు సహజ జలధారల ప్రవాహానికి నష్టం కలిగించే రీతిన పనులు జరుగుతున్నట్టు సింహాచలం స్థానికులు చాలా సార్లు ఫిర్యాదు చేశారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో టోల్ గేట్  నిర్మాణం పేరిట   కొండను తవ్వేశారు.  మట్టిని మింగేశారు.  ఇది మాత్రమే కాదు..  గత ప్రభుత్వ హయాంలో సింహాచలం పుష్కరిణిలో పూడిక  తీత  చేపట్టకపోవడంతో  పలువురు భక్తులు నీట  ప్రాణాలు కోల్పోయారు.  దైవదర్శనానికి సుదూర ప్రాంతం నుంచి వచ్చి పుష్కరిణిలో ప్రాణాలు కోల్పోవడం చాలామందిని  ఆందోళన కలిగించింది. అప్పట్లో బాధ్యులపై అప్పటి వైసీపీ సర్కార్ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.   అప్పన్న స్వామికి   భక్తులు భక్తితో ఇచ్చిన కానుకల విషయంలో  కూడా అవినీతి తిమింగలాలు తమ చేతి వాటం చూపుతున్నాయి.   కొండ ఎగువన హిల్ టాప్ రోడ్డు మార్గంలో కొండపై  నివసిస్తున్న గిరిజన కుటుంబాల కోసం దశాబ్దం కిందటే ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అయితే గిరిజనులు దూరంగా వెళ్లడానికి నిరాకరించడం.. కొండకి రక్షణగా ఇక్కడే గిరిజలనులు ఉంచడం సరైందన్న అభిప్రాయం రావడంతో ఆ ఇళ్లను వదిలేశారు.  నిజానికి వాటిని భక్తుల సత్రాలుగా  వాటిని వినియోగించవచ్చు. కానీ ఇప్పటికీ కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఆ ఇళ్లు నిరుపయోగంగా ఉండిపోయాయి. ఇలా అన్ని విధాలుగా అప్పన్న నిధులను దుర్వినియోగం చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.  క్యూ కాంప్లెక్స్ లు నిర్మాణం ప్రతిపాదన చాలా కాలంగా కాగితాలకే పరిమితమైంది.  అలాగే స్వామి ఆదాయం పోకుండా టికెట్ ఉన్నవారికి లోపలికి అనుమతించే రీతిన ఎలక్ట్రానిక్ గేట్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా అమలుకు నోచుకోలేదు.   ఇక సింహాచలం కొండపై డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది.   భారీ వర్షం కురిస్తే ఆ నీరు ఆలయంలో ఉండిపోవడం దిగువున   కొండను కోసుకుంటూ వెళ్లిపోవడం జరుగుతోంది. ఇలా వర్షం నీరు వృధా కాకుండా నిల్వ ఉంచుకునే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అలాగే  సింహాచలం అనుబంధంగా ఉన్న మాధవస్వామి ఆలయం పరిసరాల్లో తోటల ఫల సాయం కాంట్రాక్టు విషయంలో కూడా భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి వీటన్నిటి విషయంలో గత జగన్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన కారణంగానే  అధికారులు కాంట్రాక్టర్లు ఇష్టారీతిగా వ్యవహరించారని స్థానికులు  ఆరోపిస్తున్నారు.  భక్తున్ని రక్షించేందుకు వరాహ లక్ష్మీనరసింహస్వామిగా అవతరించిన శ్రీ మహా విష్ణువు ఉగ్రరూపం ఈరోజు ప్రభుత్వ నివేదిక రూపంలో మరోసారి బయటపడిందని ఉత్తరాంధ్రవాసులు భావిస్తున్నారు.  ఏడుగురు అధికారులపై సస్పెన్షన్ వేటుతో పాటు కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్న చర్యలు అప్పన్న స్వామి ఆగ్రహానికి సంకేతంగా చెబుతున్నారు. 1970 ప్రాంతంలో చూస్తే సింహాచలం ఆలయంలో దోపిడీకి ప్రయత్నించిన దొంగల ముఠా చేతిలో బాంబులు పేలిపోయి వారంతట వారే గాయపడిన సంఘటనను ఇప్పుడు భక్తులు గుర్తు చేసుకుంటున్నారు. సింహాచలం అప్పన్నకు అపచారం చేసిన వారికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో శిక్ష తప్పదని భక్తులు అంటున్నారు.  వైసీపీ  హయాంలో పాలకమండలి నియామకంలో కూడా విచ్చలవిడి వ్యవహారాలు జరిగాయి వంశపారంపర్యంగా అనువంశిక ధర్మకర్తగా ఆనంద గజపతి, అశోక్ గజపతి కుటుంబాలు రావాల్సి ఉండగా,  వైసీపీ ప్రభుత్వం అడ్డుగోలుగా ఆనంద గజపతి రెండో భార్య కుమార్తెను తెరపైకి తెచ్చారు.  ఆమె వస్త్రధారణ, వ్యవహార శైలి హిందూ ధర్మానికి విరుద్ధంగా ఉందని గతంలో చాలామంది ఆక్షేపించారు. ఇక పాలకమండలి విషయంలో కూడా అనర్హులకు అవకాశం కల్పించారు.  ప్రత్యేక ఆహ్వానితులు అంటూ మరికొందరిని అవకాశం కల్పించారు ఆ మాజీల దందా ఇంకా కొనసాగుతోంది.  వీరిలో కొందరు మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు. అప్పన్న స్వామికి చెందిన ప్రహ్లాద కళ్యాణ మండపం చాలా కాలంగా రక్షణ ఉద్యోగుల ఆధీనంలో ఉంది.  ఆ ప్రదేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న భక్తుల డిమాండ్ ఇప్పటికీ నెరవేరలేదు.    తాజాగా అప్పన్న సన్నిధిలో జరిగిన దుర్ఘటనతో చట్టానికి చిక్కిన అధికారులు గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన వారే. సింహాచలం దేవస్థానం ఈ ఈ శ్రీనివాసరాజు తోపాటు టూరిజం అధికారులు కూడా గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించిన వారే కావడం, అలాగే ఇప్పుడు క్రిమినల్ కేసు ఎదుర్కొనున్న కాంట్రాక్టర్ కూడా గత ప్రభుత్వ  హాయం నుంచి కొనసాగుతు వ్యక్తే కావడం గమనార్హం.  

ఓబులాపురం కేసులో సీబీఐ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

ఓబుళాపురం అక్రమ తవ్వకాల కేసులో సీబీఐ కోర్టు బుధవారం (మే 6) తీర్పు వెలువరించనుంది. దాదాపు 14 ఏళ్ల తరువాత  ఈ కేసులో తీర్పు వెలువడనుంది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై కూడా అభియోగాలు ఉన్నాయి.  నిబంధనలను తుంగలోకి తొక్కి ఓబులాపురం మైనింగ్ కంపెనీ అడ్డగోలుగా, అక్రమ తవ్వకాలు జరిపిందన్న ఆరోపణలపై అప్పటి రోశయ్య సర్కార్ ఓబులాపురం మైనింగ్ తవ్వకాలపై నిషేధం విధిస్తే జీవో జారీ చేసింది. కాగా ఓఎంసీ పై 2011లో మొదటి చార్జిషీట్ దాఖలైంది.  దాదాపు  .884. కోట్ల ప్రజాధనం లూఠీ చేశారంటూ ఓఎంసీపై ఆ చార్జిషీట్ లో సీబీఐ పేర్కొంది. అప్పటి నుంచీ ఈ కేసు సాగుతూనే ఉంది. మొత్తం 219 సాక్షులను విచారించిన సీబీఐ 3,400 డాక్యుమెంట్లలతో చార్జ్ షీట్ దాఖలు చేసింది.  ఓబుళాపురం అక్రమ తవ్వకాల కేసులో  సీబీఐ కోర్టు 14 ఏళ్ల తరువాత ఇప్పుడు తీర్పు వెలువరించనుంది.    అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరడంలో 2009లో సీబీఐ ఒబులాపురం అక్రమ తవ్వకాల కేసు దర్యాప్తు చేపట్టింది. వైఎస్ హయాంలో అడ్డగోలు అనుమతులు పొంది ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టారన్నది అభియోగం. అప్పటి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిపై కూడా ఈ కేసులో అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, వీడీ రాజగోపల్ సహా తొమ్మండుగురిని సీబీఐ సహ నిందితులుగా పేర్కొంది. అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులు మాజీ ఐఏఎస్ కృపానందం, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, గాలి జనార్దన్ రెడ్డి పీఏ మెఫజ్ ఆలీఖాన్ లపై కూడా అభియోగాలు నమోదు చేసింది. 

లండన్ లో గాయపడిన సృజనా చౌదరి.. హైదరాబాద్ లో చికిత్స

బీజేపీ సీనియర్‌ నేత, విజయవాడ వెస్ట్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి గాయపడి ఆస్పత్రిపాలయ్యారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన బాత్ రూంలో జారిపడిగాయపడినట్లు తెలుస్తున్నది.ఈ ఘటనలో ఆయన కుడి చేయి ఫ్రాక్చర్ అయినట్లు చెబుతున్నారు. లండన్ లో ప్రాథమిక చికిత్సఅనంతరం సుజనా చౌదరిని హైదరాబాద్ తరలించి, ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆయన కుడి చేతికి సర్జరీ చేయాల్సి ఉందంటున్నారు.  లండన్ నుంచి ఆయన బుధవారం (మే 6) తెల్లవారు జామున శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి చేరుకుని చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.  ఇలా ఉండగా లండన్ లోని ఓ సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేస్తుండగా జారి పడ్డారని అంటున్నారు . మొత్తం మీద సుజనా చౌదరి ప్రమాదవశాత్తు కిందపడి గాయపడ్డారనీ, ఆయన కుడి చేయి భుజానికి ఫ్రాక్చర్ అయ్యిందనీ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సుజనా చౌదరి గాయపడటంపై బీజేపీ శ్రేణులు, అభిమానులు ఆందోళన వ్యక్త చేస్తున్నారు. ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రి వైద్యులు కొద్ది సేపటిలో హెల్త బులెటిన్ విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.  

చెట్టు కొమ్మ విరిగి పడి మహిళ మృతి

విధి రాత ఎవరూ తప్పించలేరన్న నానుడి ఆ మహిళ విషయంలో అతికినట్లు సరిపోతుంది.  కాలం కలిసిరాకపోతే తాడే పామై కరుస్తుందంటారు. సరిగ్గా అలాగే జరిగింది విశాఖకు చెందిన పూర్ణిమ అనే మహిళ విషయంలో. నక్కలపాలెంలో నివాసం ఉంటున్న ఎస్బీఐ ఉద్యోగి భార్య పూర్ణిమ  తన ఇంటికి సమీపంలోనే ఉన్న బజారుకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చింది. . ఆమె వెడుతుండగా రోడ్డు పక్కనే ఉన్న చెట్టు కొమ్మ విరిగి ఆమెపై పడింది. దీంతో పూర్ణిమ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించింది.  ఊహించని ఈ పరిణామంతో పూర్ణిమ కుటుంబ సభ్యులు విషాద సంద్రంలో మునిగిపోయారు. అప్పటి వరకూ తమతో నవ్వుతూ మాట్లాడి.. అంతలోనే ప్రమాదం బారిన పడి పూర్ణిమ మరణించిందంటూ భోరున విలపిస్తున్నారు. చాలా కాలంగా రోడ్డు పక్కన ఉన్న ఆ చెట్టు కొమ్మ ప్రమాదకరంగా వంగి విరిగిపడేటట్లుగా ఉన్నప్పటికీ జీవీఎంసీ సిబ్బంది పట్టించుకోలేదన్నవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

సింహాచలం దుర్ఘటనలో ఏడుగురిపై సస్పెన్షన్‌ వేటు

  విశాఖ సింహాచలంలో చందనోత్సవం రోజున గోడ కూలిన ఘటనపై త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై యాక్షన్ తీసుకుంది. విచారణ కమీటీ నివేదిక మేరకు. దేవాదాయ, పర్యాటక శాఖకు చెందిన ఏడుగురిపై సస్పెన్షన్‌ వేటు వేసింది. నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌‌ను  బ్లాక్‌లిస్టులో పెట్టాలని నిర్ణయించింది. కాంట్రాక్టర్‌ సహా ఇద్దరు అధికారులపై క్రిమినల్‌ చర్యలకు ఆదేశించింది. ఆలయ ఈవో కె. సుబ్బారావు, ఆలయం ఈఈ శ్రీనివాసరావు, ఏపీటీడీసీ ఈఈ రమణ, డిప్యూటీ ఈఈలు కె.ఎస్‌.ఎన్‌. మూర్తి, స్వామి, ఏపీటీడీసీ ఏఈ పి.మదన్‌, ఆలయం జేఈ కె.బాబ్జీలపై సస్పెన్షన్‌ వేటు వేసింది. గుత్తేదారు, అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కమిటీ నిర్ధరించింది.  

హైదరాబాద్‌లో కుండపోత వర్షం..పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్

  హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. పగలంతా భానుడు భగభగమంటే.. సాయంత్రం కాగానే ఉరుములు, మెరుపులతో పలు చోట్ల వానలు పడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఇవాళ హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా.. సాయంత్రానికి చల్లబడింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లో ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్,  మాదాపూర్, సికింద్రాబాద్, బేగంపేట, అమీర్‌పేట, తార్నాక, తిరుమలగిరి, మల్కాజ్‌గిరి, ఈసీఐఎల్, నిజంపేట,మాధపూర్, పంజాగుట్ట, బంజారాహిల్స్‌ పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు పొంగి పొర్లుతుంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఈ క్రమంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిసెంట్‌గా తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే.

అంబర్‌పేట, బీహెచ్‌ఈఎల్‌ ఫైవంతెను ప్రారంభించిన కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ

  హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట, బీహెచ్‌ఈఎల్‌ కూడలిలో నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్‌లను కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ప్రారంభించారు.  దేశంలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగు పరచడానికి ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఎన్డీయే సర్కారు కృషి చేస్తోందని గడ్కరీ అన్నారు.  రహదారుల నిర్మాణం కోసం పెండింగ్‌లో ఉన్న భూసేకరణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ఫ్లైఓవర్‌ పనులు సరిగా జరగడం లేదన్నారు. అందుకే పనులు వేగంగా చేసేలా కొత్త కాంట్రాక్టర్‌ను మార్చామని, పది నెలల్లో ఉప్పల్‌ ఫ్లైఓవర్‌ పూర్తి చేస్తామని చెప్పారు.‘‘హైదరాబాద్‌లో ఐటీతోపాటు ఫార్మా రంగం కూడా పెద్దదే. దేశంలోని ఎన్నో నగరాల నుంచి హైదరాబాద్‌కు వస్తుంటారు.  అన్ని ప్రధాన నగరాలను హైదరాబాద్‌కు కనెక్ట్‌ చేసేలా జాతీయ రహదారులు అభివృద్ధి చేశాం. తెలంగాణ అభివృద్ధికి మోదీ నేతృత్వంలో మేమంతా కట్టుబడి ఉన్నాం. ఇండోర్‌- హైదరాబాద్‌ కారిడార్‌ తెలంగాణ పనులు పూర్తి చేశాం. మహారాష్ట్రలో కూడా పనులు త్వరితగతిన పూర్తి చేస్తాం. ఈ కారిడార్‌ పూర్తయితే 20 గంటల ప్రయాణం 10 గంటల్లోనే చేయొచ్చు. హైదరాబాద్‌ రీజనల్‌ రింగ్‌ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్ - విజయవాడ 4 లైన్ల రోడ్డును 6 లైన్లుగా మారుస్తామన్నారు. గడ్కరీ కృషి వల్ల దేశంలో ఏ గ్రామానికి వెళ్లినా జాతీయ రహదారులు కనిపిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. వాటి ఫలితంగా రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గాయన్నారు. ‘‘అమెరికాను తలదన్నేలా భారత్‌లో జాతీయ రహదారులు ఉన్నాయి. నితిన్‌ గడ్కరీ దగ్గరకు ఏ పార్టీ ఎంపీ వెళ్లి అడిగినా కాదనకుండా ఇస్తారు. ఆయన్ను ఫ్లై ఓవర్ల మంత్రి అని కూడా పిలుస్తుంటారు. అంబర్‌పేట ఫ్లైఓవర్‌ ప్రారంభించుకున్నప్పటికీ సర్వీస్‌ రోడ్డు అసంపూర్తిగానే ఉంది. ఆరు ప్రాంతాల్లో భూసేకరణ పూర్తి కాకపోవడంతో సర్వీస్‌ రోడ్డు పూర్తి కాలేదు. రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ ఆయా ప్రాంతాల్లో భూసేకరణ పూర్తి చేయాలి’’ అని కిషన్‌రెడ్డి సూచించారు.

తెలంగాణలో స్వల్ప భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

  ఉత్తర తెలంగాణలో పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. ఇవాళ సాయంత్రం కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయాందోళనలకు గురై  జనాలు  ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడతో పాటు రుద్రంగి ప్రాంతాల్లో  సుమారు ఐదు సెకన్ల పాటు భూమి తీవ్రంగా కదలడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూమి కంపించడంతో ఇళ్లల్లోని వస్తువులు సైతం స్వల్పంగా కదలడం మొదలుపెట్టాయి. దీంతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భూమి కంపించిన అనుభవం చాలా భయానకంగా ఉందని స్థానికులు తెలిపారు. స్వల్ప భూకంపం కారణంగానే ఈ ప్రకంపనలు సంభవించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.అయితే, ఈ భూకంపం ప్రభావం కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాలేదు. జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం అందుతోంది. ప్రజలు భయాందోళనలతో ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటూ పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. తాజా సమాచారం ప్రకారం, రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 3.9గా నమోదైంది.

ఒరాకిల్‌తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం

  ఆంధ్రప్రదేశ్‌లో  అభివృద్ధి చెందుతున్న ఐటి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అడ్వాన్స్ డ్ టెక్నాలజీస్ లో యువతకు శిక్షణఇచ్చి, వర్క్ ఫోర్స్ ను సిద్ధం చేయడానికి ప్రఖ్యాత సంస్థ ఒరాకిల్ తో కూటమి సర్కార్ కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఒరాకిల్, ఎపిఎస్ఎస్డీసి ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేశారు. దీనిద్వారా ఎంపిక చేసిన యువతకు ఒరాకిల్ యూనివర్సిటీ లెర్నింగ్ సబ్ స్క్రిప్షన్ కంటెంట్ ఉచితంగా లభిస్తుంది. మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతలో ఒరాకిల్ క్లౌడ్ నైపుణ్యాల కోసం చేయూత అందించడమే ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం. తొలిఏడాది లక్షమందికి, రెండు, మూడు సంవత్సరాల్లో లక్షన్నర మందికి చొప్పున మొత్తం 4లక్షలమందికి ఒరాకిల్ మై లెర్న్ డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా శిక్షణ ఇస్తారు. ఒరాకిల్ క్లౌడ్ ఎసెన్షియల్స్, ఓసిఐ ఫౌండేషన్స్, ఎఐ ఫౌండేషన్స్, డేటా సైన్స్, క్లౌడ్ సెక్యూరిటీ క్యూరేటెడ్ లెర్నింగ్ పాత్స్ పై శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి. అప్ డేటెడ్ వర్షన్స్ లో గుర్తింపు పొందిన సర్టిఫికేషన్ల కోసం లెర్నింగ్ కంటెంట్ ను ఎప్పటికప్పుడు నవీనీకరణ చేసి అభ్యర్థులకు అందిస్తారు. అదనపు మద్దతు, నెట్ వర్కింగ్ కోసం ఒరాకిల్ యూనివర్సిటీ కమ్యూనిటీలో అభ్యర్థులకు యాక్సెస్ కూడా లభిస్తుంది.  ఒరాకిల్ ఇన్ హౌస్ బృందం అభివృద్ధి చేసిన ఈ కోర్సులను నేర్చుకోవడానికి అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.  ఒరాకిల్ అందించే ఎస్ డిఐ సేవలను అభ్యర్థులు నమోదు చేసుకోవడానికి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ప్రత్యేకంగా వెబ్ సైట్ రూపొందిస్తుంది. ఒరాకిల్ నిర్దేశించిన అర్హత ప్రమాణాలకు లోబడి అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఎస్ డీసీ ఎండి & సిఇఓ గణేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ దినేష్ కుమార్, ఒరాకిల్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శైలేంద్రకుమార్, సీనియర్ సేల్స్ డైరక్టర్ దేబప్రియ నందన్, వైస్ ప్రెసిడెంట్ (జపాక్ స్కిల్ డెవలప్ మెంట్) తపస్ రాయ్, టెరిటరీ సేల్స్ మేనేజర్ షకీల్ అహమ్మద్ మొహమ్మద్, ప్రిన్సిపాల్ క్లౌడ్ ఆర్చిటెక్ట్ వెంకటశివ నక్కా, కంట్రీ హెడ్ అశ్లేష ఖండేపార్కర్ తదితరులు పాల్గొన్నారు.

రాప్తాడులో పరిటాల వర్సెస్ తోపుదుర్తి పొలిటికల్ వార్

  ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాప్తాడు రాజకీయాలు ఎంతో ఆసక్తి రేపుతూ ఉంటాయ్. ఇది.. ఆంధ్రా మొత్తం తెలిసిన ముచ్చటే. ఎందుకంటే.. అన్ని చోట్లా వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా సాగే రాజకీయం.. రాప్తాడుకొచ్చేసరికి మరోలా మారిపోతుంది. ఇక్కడ.. పరిటాల వర్సెస్ తోపుదుర్తి వర్గాల మధ్య పొలిటికల్ వార్ పీక్‌ స్టేజీలో ఉంది. తెలుగుదేశం నుంచి పరిటాల సునీత ఓటమెరుగని నేతగా కొనసాగుతున్నారు. 2009, 2014, 2014 ఎన్నికల్లో.. పరిటాల సునీత 3 సార్లు ప్రకాశ్ రెడ్డిపై గెలుపొందారు. కానీ.. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో.. తోపుదుర్తి బ్రదర్స్ లోకల్ పాలిటిక్స్‌ని శాసించారనే ప్రచారం ఉంది. ఐదేళ్ల పాటు వాళ్లు ఏం చెబితే అది జరిగిందనే టాక్ ఉంది. కానీ.. ఇది ఎంతో కాలం కొనసాగలేదు. 2024 ఎన్నికల్లో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. రాష్ట్రమంతా వైసీపీకి ఎదురుదెబ్బలు తగిలినా.. రాప్తాడులో ఆ పార్టీ ఓటమిని ప్రత్యేకంగా చూస్తున్నారు జనాలు. ఇందుకు.. ఓ ఇంటర్వ్యూలో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే కారణం. రాప్తాడులో పరిటాల కుటుంబం గెలిస్తే.. మీసం తీసేస్తానని సవాల్ విసిరారు.  ఫలితాల తర్వాత తోపుదుర్తి మాట మార్చడంతో.. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఆ తర్వాత.. కొద్దిరోజుల పాటు రాజకీయంగా సైలెంట్‌గా ఉన్నాయ్ రెండు వర్గాలు. కానీ.. రామగిరి ఎంపీపీ ఎన్నిక సమయంలో తలెత్తిన వివాదం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.గత నెలలో రామగిరి ఎంపీపీ ఎన్నిక సమయంలో తలెత్తిన వివాదం.. చినికి, చినికి గాలివానలా మారింది. అప్పుడు.. సొంత పార్టీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారని టీడీపీ ఆరోపించగా.. వైసీపీ నేతలు మాత్రం తమ పార్టీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేసేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తోందని పరిటాల సునీతపై ఆరోపణలు గుప్పించారు. అది చాలక.. ఎంపీటీసీలను పక్క రాష్ట్రంలో దాచి.. సరిగ్గా ఎన్నిక జరిగే సమయానికి తీసుకురాలేక.. మరో రోజుకి వాయిదా వేయించారు. ఆ తర్వాతి రోజు కూడా వారిని హాజరుపరచలేకపోయారు. ఇక్కడే.. అసలు కథ మొదలైంది. అదే రోజు.. పెనుగొండ ఎమ్మార్వో ఆఫీస్ కేంద్రంగా ఓ రభస జరిగింది. పోలీసులను బూతులు తిట్టారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి. ఇక.. అక్కడి నుంచి తోపుదుర్తి వర్సెస్ పరిటాల కాకుండా.. తోపుదుర్తి వర్సెస్ పోలీసుల్లా మారిపోయింది వ్యవహారం. ఎక్కడికి వెళ్లినా.. పోలీసుల్ని తిట్టడం ప్రకాశ్ రెడ్డికి అలవాటైపోయిందని పోలీస్ సంఘాలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయ్. ఇదే సమయంలో రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య హత్య తీవ్ర సంచలనం రేపింది.  ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ రావడం, జగన్ తిరిగి వెళ్లే సమయంలో.. హెలికాప్టర్ భాగాలు దెబ్బతినడంతో మొదలైంది అసలైన రాజకీయం. పోలీసులు సరైన భద్రత కల్పించలేకపోవడం వల్లే.. హెలికాప్టర్ దెబ్బతిందని వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే.. వైసీపీ కార్యకర్తలను కావాలనే ప్రకాశ్ రెడ్డి రెచ్చగొట్టారని.. టీడీపీ నేతలు, పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత.. పోలీసులు అరెస్టులు చేసేందుకు సిద్ధమయ్యారు.ఈ హెలికాప్టర్ ఘటన కేసులో.. మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి అనుచరులపై కేసులు నమోదయ్యాయ్. ఇప్పుడు వారందరినీ అరెస్ట్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. సుమారు 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్‌కు తరలించేందుకు కోర్టులో హాజరుపరచగా.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నారనే వార్తలు రావడంతో.. ఆయన హైదరాబాద్‌లో చక్కర్లు కొడుతున్న వీడియోని ఆయనే సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో.. ప్రకాశ్ రెడ్డి అరెస్టులో ఎందుకు అలసత్వం వహిస్తున్నారంటూ.. సత్యసాయి జిల్లా పోలీసులపై డీజీపీ కార్యాలయం సీరియస్ అయ్యిందట. దాంతో.. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు అగమేఘాలపై హైదరాబాద్, బెంగళూరు, విజయవాడకు ప్రత్యేక బృందాలు వెళ్లాయట.  కానీ.. ప్రకాశ్ రెడ్డి మాత్రం హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసి.. బెయిల్ కోసం ఎదురుచూస్తున్నారట. మొదట బెయిల్ కోసం కాకుండా.. తనపై నమోదైన కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ వేశారట. అది విచారణకు వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో.. బెయిల్ పిటిషన్ కూడా వేశారట. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ప్రకాశ్ రెడ్డి.. జనాన్ని కంట్రోల్ చేసే వీడియో ఒకటి వైరల్ అయింది. ఈ వీడియో ఆధారంగానూ.. హైకోర్టులో బెయిల్ పిటిషన్ అప్లై చేశారనే చర్చ సాగుతోంది. మరోవైపు.. తోపుదుర్తికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కూడా హైకోర్టుకు విన్నవించారట. ఆయన్ని విచారిస్తేనే.. మరిన్ని వాస్తవాలు బయటకొస్తాయని.. కోర్టును కోరుతున్నారట. దాంతో.. తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిలో అరెస్ట్ టెన్షన్ మొదలైంది. కోర్టు గనక పోలీసులకు అనుకూలంగా ఆదేశాలిస్తే.. తన అరెస్ట్ ఖాయమనే ఆందోళనలో ఉన్నారు. మరి.. ఈ విషయంలో కోర్టు ఎలా స్పందిస్తుంది.? తోపుదుర్తి గనక అరెస్ట్‌ అయితే.. రాప్తాడు రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది.. ఆసక్తిగా మారింది.

ఆ ముగ్గురు మంత్రుల మధ్య సమన్వయ లోపం.. ఆ జిల్లా అభివృద్ధికి శాపం

  అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని సామెతను తలపిస్తోంది ఖమ్మం జిల్లా పరిస్థితి… జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్జమంత్రివర్గంలో ఏకంగా ముగ్గురుకి స్థానం కల్పించారు.. ముగ్గురులో ఒకరు సీనియర్ మంత్రి.. మరో ఇద్దరు తొలిసారి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.. వీరిలో సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల పై దృష్టిసారించారు. మిగిలిన ఇద్దరు కూడా తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు..ఉప ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించిన మల్లు భట్టి విక్రమార్క కూడా తన సొంత నియోజకవర్గమైన మధిర అభివృద్ధికే పరిమితమయ్యారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటునడం వరకే పరిమితమయ్యారు. సొంత నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించినప్పటికీ పెద్దగా అభివృద్ధి పై దృష్టి సారించలేదు.. గత ప్రభుత్వం మంజూరుచేసిన మున్నేరు రిటైనింగ్ వాల్  పనులనే పర్యవేక్షిస్తున్నారు. ఇక మంత్రి తమ్మల మాత్రం తన సీనియారిటీని ఉపయోగించి జిల్లాలో కొద్దిపాటి నిధులతో చేపట్టే కార్యక్రమాలపై దృష్టిపెట్టారు. సీతారామ ప్రాజెక్టు కు సంబంధించి సాగర్ కాలువకు అనుసంధానం చేయాల్సిన పనులను రూ. 60కోట్లతో పూర్తి చేశారు. ఈ పని వైరా నియోజకవర్గంలో ఉన్నప్పటికి మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని పంట పోలాలకు ఉపయోగపడే కార్యక్రమం. దీనిని పూర్తి చేయడానికి ఆయన ఓరకంగా యజ్ఞమే చేశారు.. నిత్యం కాంట్రాక్టర్ వెంటపడి తాను పర్యటనలు చేసి పూర్తిచేసి సాగర్ కాలువలోకి నీళ్లను వదిలారు.. దీని వల్ల సాగర్ కాలువ కింద ఉన్న సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లోని ఆయకట్టును స్థిరీకరణ చేశారు. దీనికి నిధులు రాబట్టడంలో కూడా సమస్యలు ఎదుర్కోన్నారు. కేబినేట్ మీటింగ్‌లో నిధుల ప్రస్తావన రాగానే భట్టి అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. సీతారామ ప్రాజెక్టు పేరు మార్చకుండా నిధులు విడుదల చేయరాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరూ భట్టి అభ్యంతరాలను తోసిపుచ్చి నిధులు కేటాయించారు. ప్రభుత్వం వద్ద నిధుల కొరతతో పాటు జిల్లాలోని ముగ్గురు మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడంతో జిల్లా అభివృద్ధి పడకేసింది. కొద్దిపాటి నిధులతో పూర్తి చేయాల్సిన పనులను గుర్తించి చేపడితే ప్రభుత్వానికి మంచి పేరు రావడంతో పాటు జిల్లా కూడా అభివృద్ధి చెందుతుంది. భట్టి డిప్యూటీ సీఎం కావడం…. పొంగులేటి ముఖ్యమంత్రి తరువాత అన్నీ తానే అన్నట్లుగా వ్యవహరించడం వల్ల సమన్వయం చేసే పరిస్థితి లేక ఎమ్మెల్యేలు కూడా అయోమయం లో పడిపోయారు.. తుమ్మల మాత్రం తన శాఖకు సంబంధించిన కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.. ఆమేరకు జిల్లాలో పామాయిల్ సాగుపై రైతుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏదైనా నిధులు కావాలన్నా నేరుగా ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి మంజూరు చేయించుకుంటున్నారు..  ఈ నేపథ్యంలో ముగ్గురు కలిసేది లేదు.. జిల్లా అభివృద్ధి జరిగేది లేదనే భావన ప్రజల్లో ఏర్పడింది.

ఈనెల 7న ఆర్టీసీ సమ్మె.. జేఏసీ నిరసన కవాతు

  తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఆర్టీసీ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ సమ్మెకు సిద్ధమవుతోంది. ఈనెల 7 నుంచి సమ్మె  నేపధ్యంలో భారీ ఎత్తున కార్మికులతో ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్‌లో బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ నుంచి బస్ భవన్ వరకు ర్యాలీ కొనసాగింది. తమ సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు ప్రభుత్వానికి, యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఛైర్మన్‌ వెంకన్న వాపోయారు.  సమస్యల పరిష్కారానికి యాజమాన్యం ముందుకు రాకపోవడంతో అనివార్యంగా సమ్మె నోటీసు ఇవ్వాల్సి వచ్చిందని ఆయన అన్నారు. సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ యాజమాన్యం ఇప్పటివరకు చర్చలకు ఆహ్వానించలేదని, అందుకే సమ్మె సన్నద్ధతలో భాగంగా ఈ కవాతు నిర్వహిస్తున్నామని వివరించారు. కవాతు నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కవాతు సాగిన మార్గంలోనూ, బస్‌ భవన్‌ వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.   

సింహపురిలో మైనింగ్ పాలిటిక్స్ రచ్చ!

మైనింగ్.. మైనింగ్.. మైనింగ్.. నెల్లూరు పాలిటిక్స్ మొత్తం ఈ మైనింగ్ చుట్టే తిరుగుతున్నాయ్. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. రచ్చ మాత్రం   మైనింగ్ చుట్టూనే. నెల్లూరు జిల్లాలో సైదాపురం, గూడూరు, పొదలకూరు మండలాల్లో అనేక మైనింగ్ క్వారీలున్నాయ్. వీటిలో.. కోట్ల విలువైన క్వార్జ్, పల్స్ ఫర్ లాంటి విలువైన ఖనిజాలున్నాయ్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడూ.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా.. ఈ విలువైన ఖనిజాలు అక్రమంగా తరలుతున్నాయని ప్రతిపక్షాలు పోరాటాలు చేస్తున్నాయ్. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఈ పోరాటాలు మాత్రం కామన్‌గా జరుగుతున్నాయ్. కేవలం.. పోరాటం చేసేవాళ్లు మాత్రమే మారుతున్నారనే చర్చ జిల్లాలో జరుగుతోంది. దాంతో.. నెల్లూరు రాజకీయమంతా ఎక్కువగా ఈ అక్రమ మైనింగ్ చుట్టే తిరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయ్.  గతంలో.. మంత్రులు, మాజీ మంత్రులు వెనకుండి.. ఈ అక్రమ మైనింగ్ దందా నడిపిస్తున్నారంటూ.. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు పోరాటం చేశారు. ఇప్పుడు.. కూటమి అధికారంలోకి వచ్చాక.. వైసీపీ నాయకులు కూడా అదే పోరాటాన్ని భుజాన వేసుకున్నారు. అధికార పార్టీకి చెందిన ఎంపీ వేమిరెడ్డి ఎక్స్‌పోర్ట్ కంపెనీ ద్వారా మాత్రమే.. కొన్ని మైనింగ్ కంపెనీలు సరుకును తరలిస్తున్నాయని.. మిగిలిన మైన్లు తెరవకుండా.. అధికార తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటోందని చెబుతున్నారు. దీని వల్ల.. వేలాది కుటుంబాలు ఉపాధి లేక రోడ్డున పడుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ నేతలు ఈ మాట చెబుతున్నా.. అధికార పార్టీ నేతలు పట్టించుకోలేదన్న చర్చ సాగుతోంది.ఎప్పుడైతే కూటమి సర్కార్ ఏపీలో అధికారంలోకి వచ్చిందో.. అప్పటి నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సైలెంట్ అయిపోయారు. జనాల్లోనే కాదు న్యూస్‌లోనూ ఆయన కనిపించడం తగ్గిపోయింది. కానీ.. ఉన్నట్టుండి ఆయన మళ్లీ మీడియా ముందుకొచ్చారు. సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పెట్టిన కేసులతో పాటు జిల్లాలో జరుగుతున్న మైనింగ్ దందాపైనే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడటం హాట్ డిబేట్‌కు దారితీసింది. అనిల్.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టార్గెట్ గా వ్యాఖ్యలు చేయడం మీద. జిల్లా రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. వేమిరెడ్డికి చెందిన కంపెనీలు మాత్రమే.. సైదాపురం మండలంలో మైన్లు తెరచి.. మైనింగ్ కార్యకలాపాలు కొనసాగించే పరిస్థితి ఉందని ఆరోపించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముసుగుతీసి.. మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడలేదని  నేరుగా చెప్పే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు అనిల్. ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న అనిల్ కుమార్ యాదవ్.. ఒక్కసారిగా ప్రెస్ మీట్ పెట్టి ఇలా ఎంపీని టార్గెట్ చేయడం.. నెల్లూరు పాలిటిక్స్‌ని షేక్ చేసిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై ఎంపీ వేమిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అవసరమైతే.. సామాన్య ప్రజల తరఫున పోరాటం కూడా చేస్తామన్నారు. మాజీ మంత్రి కాకాణిపై అక్రమ కేసు పెట్టారని.. కూటమి ప్రభుత్వం వచ్చాక మైనింగ్ మాఫియా అరాచకాలు పెరిగిపోయాయని ఆరోపించడం.. రాజకీయ వర్గాల్లో కాక రేపుతోంది. గతంలో ప్రభుత్వం విధించిన పెనాల్టీలను కూడా.. ప్రస్తుత ప్రభుత్వం వసూలు చేయాలని డిమాండ్ చేశారు అనిల్ కుమార్ యాదవ్. ఇక్కడే మరో మెలిక పెట్టారు. పెనాల్టీల రూపంలో వసూలు చేసిన డబ్బుని.. అమరావతి నిర్మాణానికి కేటాయించాలని సూచించారు. తమ ప్రభుత్వ హయాంలో.. ఏ మైన్ యజమాని కోర్టులను ఆశ్రయించలేదన్నారు. ప్రస్తుత సర్కార్ విధానాలతో మైన్ ఓనర్లు కోర్టులను ఆశ్రయించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇదంతా ఓకే. అసలు.. అనిల్ కుమార్ యాదవ్ హఠాత్తుగా మీడియా ముందుకు ఎందుకొచ్చారు? ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఇంతలా ఎందుకు టార్గెట్ చేశారనే చర్చే.. జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. అనిల్ చేసిన విమర్శలు, ఆరోపణలకు.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎలా స్పందిస్తారు? ఆయన వర్గీయులు అనిల్‌కు ఎలాంటి కౌంటర్ ఇస్తారు? అనే ఆసక్తితో.. జిల్లా రాజకీయ నేతలంతా ఎదురుచూస్తున్నారు. కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించి పెట్టే మైనింగ్ దందా కావడంతో.. అందరి అటెన్షన్ ఇప్పుడు ఈ అంశం మీదే ఉంది. గత ప్రభుత్వంలోనూ అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వచ్చి.. ఇప్పుడు కూడా అక్రమాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలతో.. ఎప్పుడూ ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెట్టడం.. సామాన్య జనాల్లోనూ ఆసక్తి రేపుతోంది. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఈ మైనింగ్ పాలిటిక్స్.. మొత్తం ఆంధ్రా పాలిటిక్స్‌నే ఆకర్షిస్తున్నాయ్. ఇంకొందరు బడా లీడర్లు కూడా మైనింగ్ దందా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో పడ్డారనే టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా.. స్తబ్దుగా ఉన్న మైనింగ్ అంశం.. అనిల్ కుమార్ యాదవ్ ఎంట్రీతో.. ఒక్కసారిగా హీటెక్కింది. దీనికి.. అధికార పార్టీ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందనేది.. జిల్లా రాజకీయాల్లో ఇంట్రస్టింగ్‌గా మారింది.

విజయవాడ-విశాఖ మధ్య విమాన సర్వీస్ ప్రారంభం ఎప్పటినుంచంటే?

    ఆంధ్రప్రదేశ్  ప్రజలకు కేంద్రమంత్రి శుభ వార్త చెప్పారు. విశాఖ టు విజయవాడకు విమాన సర్వీసులు పున: ప్రారంభం కానున్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.  విజయవాడ, విశాఖపట్నం మధ్య విమాన సర్వీసులు జూన్ 1 నుంచి తిరిగి ప్రారంభించినున్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఇండిగో విమానం విజయవాడలో ఉదయం 7.15 గంటల నుంచి ప్రారంభమై విశాఖకు ఉదయం 8.25 గంటలకు చేరుకుంటుంది. మళ్లీ విశాఖపట్నంలో 8.45 గంటల నుంచి 9.50 విజయవాడకు చేరుకుంటుంది. ఈ మార్గం రాష్ట్ర రవాణా అనుసంధానంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ట్వీట్ చేశారు. వీటికి సంబంధించిన వివరాలను తాజాగా ఆయన వెల్లడించారు.  

సగం మంది సినీ సెలబ్రిటీలు అమ్ముడు పోయారు.. ప్రకాశ్ రాజ్

ప్రకాశ్ రాజు ఇటీవలి కాలంలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. అదే కోవలో తాజాగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సగం మంది సెలబ్రిటీలు అమ్ముడు పోయారనీ, మిగిలిన సగం మంది భయంతో మౌనాన్ని ఆశ్రయించారనీ అంటూ విమర్శలు గుప్పించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. సినీ పరిశ్రమకు చెందిన ఎవరూ కూడా దేశ రాజకీయాల పట్ల స్పందించడం లేదని విమర్శించారు.   ప్రభుత్వానికి అమ్ముుడు పోయారంటూ ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేరం చేసిన వాళ్లనైనా చరిత్ర క్షమిస్తుంది కానీ, నిజాలు మాట్లాడకుండా మౌనం దాల్చిన వారిని మాత్రం క్షమించదన్నారు.   ప్రభుత్వం ఏదైనా సరే అణచివేతకు పాల్పడితే గళమెత్తాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంటుందన్నారు. మరీ ముఖ్యంగా కళారంగానికి చెందిన వారిపై ఎక్కువగా ఉంటుందన్నారు. అయినా ఆ బాధ్యతను విస్మరించి సినీ పరిశ్రమకు చెందిన వారెవరూ నోరెత్తడం లేదంటే అందుకు కారణం సగం మంది ప్రభుత్వానికి అమ్ముడు పోవడం, మిగతా సగం మందికీ మాట్లాడే ధైర్యం లేకపోవడం అని ప్రకాష్ రాజ్ అన్నారు.  ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా సినిమా పరిశ్రమకు చెందిన వారు గొంతెత్తాలని ప్రకాశ్ రాజ్ అన్నారు. లేకుంటే చరిత్ర వారిని క్షమించదన్నారు. ప్రభుత్వాలు ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తాయనీ, కానీ అణచివేతను ధిక్కరించి గొంతు వినిపించాల్సిన బాధ్యతను విస్మరించకూడదన్నారు.   పహల్గాం ఉగ్రదాడి నెపంతో పాకిస్థానీ నటుడు పవద్ ఖాన్ నటించిన అబిర్ గులాల్ సినీమాను కేంద్రం నిషేధించడాన్ని ప్రకాష్ రాజ్ ఖండించారు. అసలు ఏ సినిమానైనా సరే నిషేధించడం తగదన్నారు.  ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.  ప్రకాశ్ రాజ్ కు అనుకూలంగా, వ్యతిరేకంగా సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.