జన, కులగణన ఎప్పటి లోగా పూర్తి చేస్తారో చెప్పండి : రాహుల్ గాంధీ

    కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలన్న  నిర్ణయాన్ని స్వాగతిస్తున్నమని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. కాకపోతే ఎప్పటిలోగా కులగణన చేపడతారో చెప్పాలని రాహుల్ కేంద్రాన్ని ప్రశ్నించారు. కులగణన విషయంలో తెలంగాణ మోడల్ స్టేట్ గా మారిందని పేర్కొన్నారు.“మేమే పార్లమెంట్‌లో కుల గణన అవసరం అని స్పష్టం చెప్పాం. అలాగే 50 శాతం రిజర్వేషన్ పరిమితిని రద్దు చేయాలని వాదించాం. గతంలో ప్రధాని కేవలం నాలుగు కులాల గురించి మాత్రమే మాట్లాడేవారు. ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ, 11 ఏళ్ల తర్వాత కుల గణన ప్రకటన వచ్చింది” అని పేర్కొన్నారు. ఇది కేవలం తొలి అడుగేనని, కేంద్రం కుల గణనకు తమ మద్దతు ఉందని, బీహార్‌ మాదిరిగానే తెలంగాణ కూడా ఒక ఉదాహరణగా నిలుస్తుందన్నారు. కుల గణన ద్వారా రిజర్వేషన్ల పరిమితికి మించిన అభివృద్ధి మోడల్‌ను అభివృద్ధి చేయాలనేదే తమ లక్ష్యమని తెలిపారు. దేశంలో ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు ఎంత మేరకు వాటాదారులై ఉన్నారో తెలుసుకోవడానికి కుల గణన కీలకమని అన్నారు.ఇక ఉగ్రవాదంపై కేంద్రం మరింత కఠినంగా వ్యవహరించాలని రాహుల్ గాంధీ కోరారు. పెహల్గామ్ దాడికి పాల్పడిన దుండగులు తగిన మూల్యం చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. “ఉగ్రవాదంపై పోరాటానికి మా మద్దతు ఉందని రాహుల్ పేర్కొన్నారు  

రోడ్డు పక్కన ఇంట్లోకి దూసుకెళ్లిన కారు..ఆరుగురు మెడికల్‌ విద్యార్ధులు మృతి

  నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో పోతిరెడ్డిపాలెం వద్ద ఘోర  కారు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న ఓ హోటల్‌లోకి కారు దూసుకెళ్లి ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న వెంకట రమణయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.  మరో నలుగురికి గాయాలు కాగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా నారాయణ మెడికల్‌ కాలేజ్‌ స్టూడెం‍ట్స్‌గా తెలుస్తోంది. పోతిరెడ్డిపాలెం వద్ద కారు బీభత్సం ఘటనలో మృతులు మెడిసిన్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న నరేష్, అభిషేక్,  జీవన్, యగ్నేష్, అభిసాయిలుగా పోలీసులు ప్రకటించారు. గాయపడిన నవనీత్‌ అనే విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బుచ్చిరెడ్డిపాలెం లో ఓ నిశ్చితార్థ వేడుకకు హాజరై కారులో విద్యార్థులు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.  వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి హోటల్‌లోకి దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను నెల్లూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మరో విద్యార్థి మౌనిత్‌ రెడ్డి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రెండు రోజుల క్రితం తిరుపతిలో ట్రక్ కిందకు కారు దూసుకెళ్లి కారు తిరుపతి ప్రమాదంలోనూ ఐదుగురు దుర్మరణం చెందారు. మన కార్లలో కూడా సేఫ్టీ లేకపోడంతో  ప్రమాదం జరిగితే ప్రాణాలు పోవాల్సివస్తుంది.  ఎయిర్ బెలూన్స్ ఉన్నా ప్రాణాలు ఎందుకు దక్కడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

సింహాచలం గోడ కూలిన ఘటనపై విచారణ కమిషన్

  విశాఖ జిల్లా సింహాచలంలోని సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో జరిగిన ప్రమాద ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణ కమిషన్‌ ఏర్పాటు చేసింది. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.సురేష్‌ కుమార్‌ అధ్యక్షతన ఈ కమిషన్‌ను నియమించింది. ఇందులో సభ్యులుగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఆకే రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు ఉంటారని పేర్కొంది. అలాగే, ఈ కమిషన్‌కు సివిల్‌ కోర్టు అధికారాలు కల్పిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. విశాఖపట్నం జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానంలో చందనోత్సవం సందర్భంగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భక్తుల రద్దీ మధ్య రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఒక సిమెంట్ గోడ కూలిపోవడంతో ఎనిమిది మంది భక్తులు మృతిచెందారు.స్వామివారి నిజరూప దర్శనానికి విచ్చేసిన భక్తులపై గోడ కూలింది.  ఇప్పటివరకు ఆరు మృతదేహాలు వెలికి తీయగా, శిథిలాల కింద మరో రెండు మృతదేహాలు ఉన్నట్లు సమాచారం. ప్రమాద స్థలానికి వెంటనే చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అధికారులు సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం కోసం అధికారులు పరిశీలన కొనసాగిస్తున్నారు. ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన ఈ ఉదయం సమీక్షించిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.3లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు.  

కేసీఆర్‌కు నాపేరు పలికే ధైర్యం రాలేదు..సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్

  బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో అధినేత కేసీఆర్‌కు సభ మొత్తంలో తన పేరు ఎత్తడానికి కూడా ధైర్యం రాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  బుధవారం శ్రీమహాత్మ బసవేశ్వర జయంతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నరు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతు 16నెలలుగా కేసీఆర్ ఇంట్లో కూర్చుని జీతం తీసుకుంటున్నారని విమర్శించారు. ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటూ ఇంట్లో నుండి కాలు కదపకుండా అన్ని వసతులు అనుభవిస్తున్నారా అని ప్రశ్నించారు. మీరెవరు? స‌భ‌కు రాకుండా మమ్మ‌ల్ని ప్ర‌శ్నించే నైతిక హ‌క్కు మీకు ఉందా అని నిల‌దీశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ‌ను మొద‌టి 10 సంవ‌త్స‌రాలు కోతుల గుంపుకు అప్ప‌జెప్పిన‌ట్టు అయింద‌ని మండిప‌డ్డారు.  తాను చెడ్డ కోతి వనమంతా చెడించె అన్న‌ట్టు కల్వకుంట్లు ఫ్యామిలీ మొత్తం కలిసి ఈ తెలంగాణ మీద పడి దోచుకున్న మాట వాస్తవం కాదా? అని ప్ర‌శ్నించారు. 12వ శతాబ్దంలోనే సమాజంలో అనేక మార్పులకు పునాదులు వేసిన విప్లవకారుడు బసవేశ్వరుడు. ఆయన జయంతి రోజున పదోతరగతి ఫలితాలు విడుదల చేసుకోవడం సంతోషం. పరీక్షలు పాసైన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. బసవన్న స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ వంటి కీలక అంశాలపై చర్చించేందుకు కేసీఆర్ వెంటనే శాసన సభకి రావాలని ముఖ్యమంత్రి సవాల్ విసిరారు. అధికారంలో ఉంటేనే పనిచేస్తారా? అధికారం లేకపోతే బాధ్యతలను గాలికొదిలేస్తారా? అని నిలదీశారు. తమ ప్రభుత్వ నిర్ణయాల్లో లోపాలుంటే చెప్పాలని, అంతేకానీ నిరాధార విమర్శలు చేయవద్దని హితవు పలికారు.  

సింహాచలంలో ప్రమాదానికి కారణాలివేనా ?

సిబ్బందు నిర్లక్ష్యానికి తోడైన ఈదురు గాలులు  అప్పటికప్పుడు నిర్మించిన గోడకు మేకులు కొట్టి పెండాల్స్ తాళ్లు కట్టిన సిబ్బంది  గాలి ఒత్తిడికి పెండా ల్స్ తో పాటు గోడ కూలినట్టు  అనుమానం  కర్ణుడి చావుకు కారణాలు ఎన్నో అన్నట్టు సింహాచలంలో గోడకూలి ఏడుగురు భక్తుల మరణానికీ అన్నే కారణాలు కనిపిస్తున్నాయి.  ప్రధానంగా ఇంజనీరింగ్ సిబ్బంది నిర్లక్ష్యం కాగా, వారి నిర్లక్ష్యానికి  రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షం తోడైనట్లు కనిపిస్తున్నది.  ఏటా అక్షయ తృతీయ రోజు మాత్రమే నిజ రూపంలో అప్పన్న స్వామి దర్శనం ఇస్తారు. దీంతో అప్పన్న స్వామి నిజరూప దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు రావడం కద్దు. అయితే   గతంలో ఈ ఉత్సవం విశాఖ,  ఉత్తరాంధ్ర, ఒడిస్సా ప్రాంత భక్తులకు మాత్రమే పరిమితం అయ్యేది.  కానీ   దశాబ్ద కాలంగా ఇది ఒక విఐపి ఉత్సవంగా మారింది. గతంలో కేవలం సాధారణ భక్తులు మాత్రమే దర్శనానికి రావడంతో సులభంగా ఎలాంటి అవాంతరాలూ లేకుండా ఈ కార్యక్రమం సజావుగా సాగిపోయేది. అయితే గత దశాబ్ద కాలంగా  ఇది వీఐపీల ఉత్సవంగా మారడంతో ప్రోటోకాల్ కోసం అధికారులు, దర్శనాల కోసం ప్రజాప్రతినిధులు ఒత్తిడి పెరిగిపోవడంతో పరిస్థితి మారిపోయింది.  సాధారణ భక్తుల కంటే వీఐపీలు, స్వామీజీలు, న్యాయమూర్తులు ప్రజాప్రతినిధుల దర్శనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈసారి కూడా అదే ప్రక్రియ జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే అది కూడా ప్రమాదంలో భక్తుల మరణానికి దారి తీసింది. అదేలాగంటే..  సాధారణంగా సింహాచలం దర్శనానికి సాధారణ భక్తులు బస్టాండ్ నుంచి క్యూ లైన్ లోకి వెళ్తారు. వీఐపీలు ప్రోటోకాల్ అవకాశం ఉన్న భక్తులు రాజగోపురం నుంచి వెళ్తారు.  అయితే చందనోత్సవం సందర్భంగా 300 రూపాయల టికెట్ క్యూ లైన్ కోసం బస్టాండ్ నుంచి ఏర్పాట్లు చేశారు. అక్కడ క్యూ లైన్ ను విభజించడానికి తాత్కాలికంగా ఫ్లైయాష్ తోగోడ నిర్మాణం జరిగింది.  అక్కడ నుంచి కొంత దూరంలో ఎప్పుడూ ఉండే  బారికేట్లు ఉన్నాయి.  వాటి వరకు క్యూ కొనసాగేలా  పునాదులు అవసరం లేకుండా గోడ నిర్మాణం జరిగింది. అదే సమయంలో గోడకి అవతలి వైపు చలువ పందిర్లతో బాటు పెండాల్స్ వేశారు.  ఆ పెండాల్స్ గట్టిగా ఉండడానికి తాళ్లను దూరంగా భూమిలో ఐరన్ కొయ్య పెట్టి తాళ్లు కట్టాలి.  కానీ స్యామియానా పెండాల్స్  సిబ్బంది తాత్కాలికంగా కట్టిన గోడకు మేకులతో తాళ్లు కట్టినట్టు తెలుస్తోంది.  నిన్న రాత్రి  ఉరుములు మెరుపులు , ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దాదాపు రెండు గంటల పాటు వరుణుడు బీభత్సం సృష్టించాడు.  ఈ భారీ వర్షానికి  పెండాల్స్ ఈదురు గాలికి ఊడి పడడంతో తాత్కాలిక గోడ కూడా ఒరిగిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. దీన్నిబట్టి తాత్కాలిక నిర్మాణం అయినప్పటికీ నాణ్యత పరంగా ఏ మాత్రం జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకోకపోవడం, షామియానా సిబ్బంది అలక్ష్యం తోడై గోడ కుప్పకూలి ఏడుగురు ప్రాణాలు బలి తీసుకున్నట్టు తెలుస్తోంది దీనిపై ఇప్పటికే ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇది ఏ ప్రభుత్వ శాఖపైనా పడకుండా ఎవరికి వాళ్లు తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు  ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. త్వరలో జన, కులగణన

  కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దేశ జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్.. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. సామాజిక వర్గాల వారీగా లెక్కలు చేపట్టాలని కాంగ్రెస్ సహ పలు విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ జనాభా లెక్కలు 2021 లోనే చేపట్టాల్సి ఉండగా.. కరోనా సంక్షోభం వలన వాయిదా వేశారు. అలాగే సిల్చార్‌-షిల్లాంగ్ కారిడార్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 166.8కి.మీ మేర రూ.22,864 కోట్లతో కారిడార్ నిర్మాణం చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. అలాగే చెరుకు పంటకు కనీస మద్దతు ధర క్వింటాకు రూ.355 ఎఫ్‌ఆర్‌పీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అసోం-మేఘాలయ మధ్య కొత్త హైవే నిర్మాణానికి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం దిశగా ఇది ఒక పెద్ద ముందడుగు అవుతుంది. కులాల వారీగా ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులోకి వస్తే, ప్రభుత్వాలు ఆయా వర్గాల అవసరాలకు అనుగుణంగా పథకాలు రూపొందించడానికి వీలవుతుంది. అయితే, ఈ కులగణన ప్రక్రియ ఎలా సాగుతుంది, ఎంత సమయం పడుతుంది, దీనికి సంబంధించిన విధివిధానాలు ఏమిటి అనే విషయాలపై  మోదీ సర్కార్ నుంచి ఎలాంటీ క్లారిటీ రాలేదు.  

సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా మాజీ ఐఏఎస్ శ్రీనివాస రాజు

  ఏపీ క్యాడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ శ్రీనివాస రాజును ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉండనున్నారు. టీటీడీ జాయింట్ ఈవోగా ఎనిమిదేళ్ల పాటు పనిచేసిన ఆయన ఆ తర్వాత రిటైర్డ్ అయ్యారు. ఈవోగా పనిచేయాలని భావించినా అవకాశం రాలేదు. 2024 జులై నుంచి తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్న ఆయనను తాజాగా సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు.  ఏపీ ఐఏఎస్‌ క్యాడర్‌లో 2001 బ్యాచ్‌కు చెందిన ఆయన 2011లో వైజాగ్‌ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న సమయంలో టీటీడీ జేఈవోగా నియమితులయ్యారు. ఏప్రిల్‌ 20వ తేదీన జేఈవోగా బాధ్యతలు తీసుకుని 2019 జూన్‌ వరకు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఎనిమిదేళ్ల రెండు నెలలపాటు పనిచేశారు. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాల్లో జేఈవోగా విధులు నిర్వహించి, టీటీడీలో తనదైన ముద్ర వేశారు. అయితే జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఆయన ఇంటర్‌ కేడర్‌పై తెలంగాణ రాష్ట్రనికి వ‌చ్చారు. తెలంగాణ నాలుగేండ్ల పాటు ర‌హ‌దారులు భ‌వ‌నాల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా విధులు నిర్వ‌ర్తించారు.

అందాల పోటీలు నిర్వహించటానికి.. సీఎం రేవంత్‌కు బుద్ధి లేదు : సీపీఐ నారాయణ

  హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీల  నిర్వహించనుండటంపై సీపీఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా గూడూరులో తన మేనకోడలికి చెందిన ఓ వాణిజ్య సంస్థ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, ఈ విషయంపై మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అందాల పోటీలు నిర్వహించడం ద్వారా పవిత్రమైన స్త్రీ జాతిని అవమానిస్తున్నారని నారాయణ ఆరోపించారు. "అందాల పోటీ అంటే స్త్రీలను నడిరోడ్డు మీద వేలం వేయడం కాదా? ఇది సరైన పద్ధతి కాదు. ఇలాంటి పోటీలు నిర్వహించే ముఖ్యమంత్రికి బుద్ధి లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. మిస్ వరల్డ్ పోటీలకు రూ.25 కోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పడం సిగ్గుచేటన్నారు.  ప్రభుత్వాలు మహిళలను స్వయం శక్తితో జీవించేలా ప్రోత్సహించాలని, వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నారాయణ సూచించారు. అందాల పోటీల పేరుతో మహిళల గౌరవాన్ని కించపరచడం సరికాదని, ఈ పోటీలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. తన మేనకోడలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి, పది మందికి ఉపాధి కల్పించేందుకు సొంత వ్యాపారం ప్రారంభించడాన్ని ఆయన అభినందించారు. మహిళలు ఇలా స్వయం ఉపాధి వైపు రావడాన్ని ప్రోత్సహించాలే తప్ప, అందాల పోటీలతో వారిని అపవిత్రం చేయకూడదని నారాయణ హితవు పలికారు. తన మేనకోడలు అందాల పోటీలో పాల్గొంటే ఫస్ట్ వస్తుందని... కానీ, అది తప్పు అని అన్నారు.

విశాఖ కలెక్టర్ పై బదలీ వేటు!

సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా చోటు చేసుకున్న అపశ్రుతిలో ఏడుగురు భక్తులు మరణించిన ఘటనపై మంత్రులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు అధికారులపై ఫైర్ అయ్యారు. గోడకూలి ఏడుగురు మరణించిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదే సమయంలో సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరించారంటూ అధికారులపై నిప్పులు చెరిగారు.  అస‌లు ఈ ఘ‌ట‌న ఎలా జ‌రిగింది? ఎవ‌రి నిర్ల‌క్ష్యం ఉంది?  చేసిన ఏర్పాట్లు ఏంటి?  అన్న విషయాలపై ఆరా తీశారు. గ‌త ఏడాది కంటే.. ఈ సారి ఎక్కువ మంది భ‌క్తులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిసినా  నిర్ల‌క్ష్యంగా ఎందుకు ఉన్నారంటూ నిలదీశారు.   ఈ క్ర‌మంలో క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్  ఏర్పాట్ల‌కు సంబంధించి ఎన్ని సార్లు సమీక్షించార‌ని ప్రశ్నిం చారు. అయితే కార్పొరేషన్ ఎన్నికల వ్యవహారంలో తీరిక లేకుండా ఉన్న తాను సింహాచలంపై పెద్దగా దృష్టి పెట్టలేదన్న ఆయన సమాధానంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ ను వెంటనే బదిలీ చేయాలని సీఎస్ ను ఆదేశించారు. అలాగే హోంమంత్రి అనితపైనా ఆగ్రహం వ్యక్తం చే శారు. ఏర్పాట్లపై సమీక్షించారా అని నిలదీశారు.  కూలిన ఆ గోడ కట్టిన కాంట్రాక్టర్ పైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని విషయాలపై తనకు మూడు రోజులలోగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 

పహల్గాం ఉగ్రదాడి.. పార్టీల మధ్య పోస్టర్ వార్!

పహల్గాం ఉగ్రదాడి దేశం మొత్తాని కదిల్చి వేసింది. కుల, మత, ప్రాంత, రాజకీయ విభేదాలకు  అతీతంగా ప్రజలందరూ ఉగ్రదాడిని ఖండిస్తున్నారు.  పాకిస్థాన్ దుశ్చర్యను ప్రపంచ దేశాలు సైతం ఖండిస్తున్నాయి. మన దేశానికి మద్దతు ప్రకటిస్తున్నాయి. దేశంలోనూ ఎక్కడిక్కడ పాకిస్థాన్ కు వ్యతిరేకంగా స్వచ్చందంగా ప్రజలు ర్యాలీలు నిర్విహిస్తున్నారు.ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పిస్తున్నారు.పాకిస్థాన్ కు గట్టిగా బుద్ది చెప్పాలని,కఠిన చర్యలు తీసుకోవాలని కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. ప్రతి భారతీయ హృదయం ప్రతీకారంతో రగిలి పోతోంది. ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకున్నా 140 కోటల మంది భారతీయులు ఒక్కటిగా నిలుస్తారని, భరోసా ఇస్తున్నారు.    అయితే.. ఇంతలోనే  పహల్గాం ఉగ్రదాడిపై రాజకీయ రాక్షస క్రీడ మొదలైంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మొదలైన మాటల యుద్ధం ఉగ్రరూపం దాల్చింది. పోస్టర్ వార్ కు తెర తీసింది. కాంగ్రెస్‌ పార్టీ  తలలేని ప్రధాని’ పోస్టర్‌ ను  ఎక్స్ లో పెట్టడంతో రాజకీయం వేడెక్కింది. దీనిపై  దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆ పోస్టర్‌ను తొలగించింది. అయితే, కాంగ్రెస్ పోస్ట్ చేసిన పోస్టర్ దానికింద పెట్టిన ‘గయాబ్’ కాప్షన్’ పై బీజేపీ తీవ్రంగా  మండి పడింది. రాహుల్‌గాంధీ పాకిస్థాన్‌ మిత్రుడంటూ బీజేపీ అధికార ప్రతినిధి ఆర్‌పీ సింగ్‌ ట్వీట్‌ చేయడమేగాక..వీపు వెనుక కత్తి దాచుకుని ఉన్న రాహుల్‌ చిత్రాన్ని పోస్టు చేశారు. మరో వంక కాంగ్రెస్ పెట్టిన పోస్టును పాకిస్థాన్‌ మాజీ మంత్రి ఫవాద్‌ చౌదరి రీట్వీట్‌ చేశారు. అగ్నికి ఆజ్యం తోడైంది. బీజేపీ కాంగ్రెస్ పై  విరుచుకుపడింది.  పహల్గాం ఉగ్ర ఘటన తర్వాత కేంద్రం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో ప్రధాని పాల్గొనక పోవడంపై కాంగ్రెస్‌ తరచూ విమర్శలు చేస్తోంది. ఆ క్రమంలోనే తాజా పోస్టర్‌ను పోస్టు చేసింది. దీనిపై బీజేపీ తీవ్రస్థాయిలో స్పందించింది. కాంగ్రెస్‌ సంపూర్ణంగా పాకిస్థాన్‌కు మద్దతిస్తోందని.. ఆ పార్టీని ‘లష్కరే పాకిస్థాన్‌ కాంగ్రెస్ గా అభివర్ణించింది. అఖిల పక్ష సమావేశంలో ఐక్యత గురించి నొక్కిచెప్పిన  కాంగ్రస్  పార్టీ నేతలు పాక్‌తో చర్చలు జరపాలంటున్నారని ఆక్షేపించింది. తలలేని మొండెం.. ఆ పార్టీ ఉగ్ర సిద్ధాంతంగా మారిందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు. “రాహుల్‌గాంధీ ఆదేశాలతోనే ఆ పోస్టు పెట్టారు. దీనిని చూసి దేశం సిగ్గుపడుతోంది. క్లిష్ట సమయంలో భారత్‌ను బలహీనపరిచేందుకు లష్కరే పాకిస్థాన్‌ కాంగ్రెస్‌ చేసిన ప్రయత్నమిది అని భాటియా విమర్శించారు. తలలేని మొండెం ఉగ్రవాద నినాదమని.. ఆ పార్టీ పోస్టర్‌ దానినే ప్రతిబింబిస్తోందన్నారు. ముస్లిం ఓటు బ్యాంకును సంతృప్తిపరచడానికే కాంగ్రెస్‌ తలలేని మొండెం చిత్రాన్ని పోస్టుచేసిందని బీజేపీ ఐటీ విభాగం ఇన్‌చార్జి అమిత్‌ మాలవీయ ‘ఎక్స్‌’లో ఆరోపించారు. ఈ వివాదంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ స్పందించారు.‘‘పార్లమెంటు చర్చల్లో ప్రధాని పాల్గొని పహల్గాం ఘటన తదనంతర పరిణామాలపై వివరణ ఇవ్వాలని కోరాం.ఇందులో రాజకీయ ఎజెండా ఏమీ లేదు. ఐక్యతే కాంగ్రెస్‌ ఫార్ములా అని స్పష్టం చేశారు. నిజానికి పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపధ్యంగా, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  మొదలు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య,ప్రియాంక వాద్రా భర్త రాబర్ట్ వాద్రా, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తదితరరులు చేసిన వ్యాఖ్యల ఆధారంగా, సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ పాక్ అనుకుల పార్టీ అనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో  కాంగ్రెస్ పెట్టిన పోస్టును పాక్ నాయకులు రీట్వీట్ చేయడం కాంగ్రెస్ పార్టీని గట్టిగానే డ్యామేజి చేసింది. అందుకే  కాంగ్రెస్ పార్టీ ఎక్స్’ నుంచి పోస్టును ఉపసంహరించుకోవడమే  కాకుండా,  పార్టీ జనరల్ సెక్రటరీ, పహల్గాం ఉగ్రదాడి కి సంబందించి పార్టీ లైన్. దాటి వ్యాఖ్యలు, విమర్శలు చేయవద్దని నాయకులను ఆదేశించారు.  ఈ పోస్టర్‌పై కాంగ్రెస్‌ నాయకుల్లోనే విభేదాలు తలెత్తినట్లు సమాచారం. పార్టీ వైఖరికి భిన్నమైన పోస్టరుకు అనుమతించినందుకు పార్టీ సోషల్‌ మీడియా విభాగం సారథి సుప్రియ శ్రీనతేను కాంగ్రెస్‌ అధిష్ఠానం మందలించిందని, తక్షణం పోస్టరు తొలగించాలని ఆదేశించిందని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. నిజానికి, పహల్గాం ఉగ్రదాడి కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షగా మారిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే హిందూ వ్యతిరేక, ముస్లిం అనుకూల పార్టీగా ఆరోపణలు ఎదుర్కుంటున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడుకుడితిలో పడ్డ ఎలుకల మారిందని, విశ్లేషకులు అంటున్నారు.

తెలంగాణలో టెన్త్‌ ఫలితాలు విడుదల

  తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.  ఇవాళ మధ్యాహ్నాం రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  టెన్త్‌ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం ఐదు లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 92.78 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు. గురుకులాల్లో  98 శాతం, ఆశ్రమ పాఠశాలల్లో 95 శాతం, ప్రైవేట్‌ పాఠశాలల్లో 94.12 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా.. గతేడాది కంటే 1.47 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈసారి అనూహ్యంగా ప్రైవేటు స్కూళ్ల కంటే ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో అత్యధిక ఉత్తీర్ణ శాతం నమోదు కావడం విశేషం.  బాలురు 91.32 శాతం, బాలికలు 94.26 శాతం ఉత్తీర్ణులయ్యారు. 4,629 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణతను సాధించాయి. 99.29 శాతంతో మహబూబ్‌నగర్ జిల్లా అగ్ర స్థానంలో నిలిచింది. 73.97 శాతంతో చివరి స్థానంలో వికారాబాద్ జిల్లా ఉంది. జూన్ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఆ పరీక్ష ఫీజు చెల్లింపునకు మే 16 వరకు గడవు ఇచ్చారు. ఇక రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు గాను ఒక్కో సబ్జెక్ట్‌కు రూ.500 చెల్లించి దరఖాస్తు చేసుకునేందుకు మే 15 వరకు అవకాశం కల్పించారు.కాగా, పదో తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 4న ముగిశాయి. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.  

జాతీయ భద్రతా సలహా బోర్డు ఛైర్మన్‌గా అలోక్ జోషి

  కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రత సలహా బోర్డును ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డు ఛైర్మన్‌గా మాజీ రా అండ్ రా చీఫ్ అలోక్ జోషిని ఛైర్మన్‌గా నియమించారు. జాతీయ భద్రతా విషయాల్లో అనుభవం ఉన్న అలోక్ జోషి నాయకత్వంలో ఈ బోర్డు దేశ భద్రతా వ్యూహాలను మరింత బలోపేతం చేయనుంది. ఈ బోర్డులో మొత్తం ఏడుగురు సభ్యులు ఉంటారు, వీరంతా తమ రంగాల్లో అనుభవజ్ఞులైన రిటైర్డ్ అధికారులు.  సైనిక సేవల నుంచి రిటైరైన మాజీ వెస్ట్రన్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ పీఎం సిన్హా, మాజీ సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్, రియర్ అడ్మిరల్ మాంటీ ఖన్నా ఈ బోర్డులో సభ్యులుగా నియమితులయ్యారు. వీరి సైనిక నైపుణ్యం, వ్యూహాత్మక దృష్టి బోర్డు నిర్ణయాలకు బలాన్ని చేకూర్చనుంది. ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి రిటైరైన రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్ కూడా బోర్డు సభ్యులుగా ఎంపికయ్యారు. వీరు దేశీయ భద్రత, లా అండ్ ఆర్డర్ విషయాల్లో తమ అనుభవాన్ని అందించనున్నారు.  

కుమార్తెను ముందుపెట్టి అవంతి శ్రీనివాస్ పొలిటికల్ స్కెచ్!

  వైసీపీకి షాక్ ఇచ్చిన తండ్రీకూతుళ్లు ఎన్నికల తర్వాత విశాఖలో ఇద్దరు నాయకులు వైసీపీకి గట్టి దెబ్బ కొట్టారు... ఎన్నికల్లో ఓటమి చెందిన వెంటనే క్షణం ఆలోచించకుండా పార్టీ పదవులకు రాజీనామా చేసి వైసీపీకి షాక్ ఇచ్చారు మాజీమంత్రి అవంతి శ్రీనివాస్.  వైసిపి నుంచి కార్పొరేటర్ గా గెలిచిన కీలకమైన సమయంలో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసr కోలుకోలేని దెబ్బ కొట్టారు ఆయన కుమార్తె లక్ష్మీ ప్రియాంక. తండ్రి చేసిన పనికి ఓ పక్క భీమిలీ నియోజకవర్గంలో వైసీపీకి మనుగడే కరువైనట్లు కనిపిస్తుంటే మరోపక్క  కూతురు చేసిన పనికి వైసీపీ విశాఖ మేయర్ పదవి కోల్పోవాల్సి వచ్చింది. అవంతి శ్రీనివాస్‌తో పాటు ఆయన కూతురు లక్ష్మీ ప్రియాంక గురించి కూడా విశాఖలో జోరుగా చర్చ సాగుతుంది . 2009ల రాజకీయాల్లోకి వచ్చి పీఆర్పీ నుంచి పోటీ చేసి భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైన అవంతి శ్రీనివాస్,  2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా గెలిచి పార్లమెంట్‌కి వెళ్లారు. 2019 ఎన్నికల్లో మళ్లీ భీమిలి నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి జగన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.  ప్రస్తుత భీమిలి టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు రాజకీయ శిష్యుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అవంతి శ్రీనివాస్ వరుస విజయాలతో గురువులాగే లక్కీ పొలిటీషియన్ అనిపించుకున్నారు. చివరికి గత ఎన్నికల్లో తన గురువు గంటా చేతిలోనే అవంతి శ్రీనివాస్ భీమిలిలో ఓటమి పాలయ్యారు. ఈ పదహారేళ్లలో పీఆర్పీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ పార్టీలను చుట్టేసిన అవంతి శ్రీనివాస్ 2024 ఎన్నికల తర్వాత వైసీపీ పదవులకు రాజీనామా చేసి సైలెంట్ గా కాలం గడిపేస్తున్నారు... భీమిలి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధిగా ఓడిపోయిన  తర్వాత మూడు నెలలు తిరగకుండానే పార్టీ పదవులకు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ పార్టీపై ఆరోపణలు చేసి మరీ బయటకు వచ్చేశారు.  ఊహించని విధంగా అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేయడం, పార్టీ నుంచి బయటికి వెళ్లిపోతూ తీవ్రమైన విమర్శలు చేయడంతో భీమిలి నియోజకవర్గంలోనే కాక ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా  వైసీపీ మీద నెగిటివ్ ప్రచారం మొదలైంది. ఇది అవంతి ఫ్యామిలీ నుంచి వైసీపీకి తగిలిన మొదటి దెబ్బ అని చెప్పవచ్చు.  అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేసిన ఆరు నెలల తర్వాత అప్పటివరకు సైలెంట్‌గా ఉన్న భీమిలి నియోజకవర్గం లోని ఆరో డివిజన్ కార్పొరేటర్ లక్ష్మి ప్రియాంక వైసీపీని ఊహించని దెబ్బ కొట్టారు. విశాఖ మేయర్ ఫై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించుకున్న కూటమి పార్టీలు వైసీపీ నుండి  జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న కార్పొరేటర్లు  అందరికీ గేట్లు  తెరిచాయి.  మేయర్ పై అవిశ్వాసం పెట్టడానికి కోరం సరిపోకపోయినా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడంతో అటు వైసీపీ, కూటమి పార్టీలు నెలరోజులు క్యాంపు రాజకీయాలు నడిపాయి. ఈనెల 19వ తేదీన అవిశ్వాస తీర్మానం డేట్ అనౌన్స్ చేసిన తర్వాత వైసీపీకి చెందిన మరో ముగ్గురు కార్పొరేటర్లు టిడిపి, జనసేన పార్టీలో జాయిన్ అవ్వడంతో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కావలసిన కోరం 74 మ్యాజిక్ ఫిగర్ సరిపోయిందని అంతా అనుకున్నారు. అయితే పార్టీ మారి వచ్చిన ఒక వైసీపీ కార్పొరేటర్ ఊగిసలాట ధోరణి ప్రదర్శించడంతో కూటమి పార్టీల్లో టెన్షన్ కనిపించింది. అయితే అవిశ్వాస తీర్మానానికి అరగంట ముందు విశాఖ మేయర్ పదవి కూటమికి దక్కడంలో అవంతి శ్రీనివాస్ కుమార్తె వైసీపీ కార్పొరేటర్ లక్ష్మి ప్రియాంక మెయిన్ రూల్ పోషించి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. ప్రియాంక ఏ పార్టీలోనూ జాయిన్ అవ్వకుండా కూటమికి అనుకూలంగా ఓటు వేయడం వైసీపీ పెద్దలకు పెద్ద షాకే ఇచ్చింది. అప్పటివరకు వైసీపీ కార్పొరేటర్‌గా ఉన్న లక్ష్మీ ప్రియాంక ఎవరు ఊహించిన విధంగా కూటమి పార్టీకి అనుకూలంగా ఓటు వేయడంతో వైసీపీ విశాఖ మేయర్ పదవిని కోల్పోయింది. అవంతి శ్రీనివాస్ ఫ్యామిలీ నుండి వైసీపీకి తగిలిన రెండో షాక్ అది. ఒకే కుటుంబం నుండి రెండు షాక్‌లు తగిలి విశాఖలో వైసీపీ మనుగడ ప్రశ్నార్ధకంగా మారడంతో పార్టీ పెద్దలు ఎవరిని నమ్మాలో? ఎవరిని నమ్మకూడదో? అర్థంకాక సతమవుతమవుతున్నారంట.  ఆ క్రమంలో అవంతి శ్రీనివాస్  రాజకీయ ప్రయాణం ఎటువైపు అనే చర్చ మొదలైంది.వైసీపీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ గత ఆరు నెలలుగా ఖాళీగానే ఉన్నారు. ఏ పార్టీ వైపు కన్నెత్తి చూడకుండా తన వ్యాపారాలు చూసుకుంటూ కాలం గడుపుతున్నారు. వైసీపీ  అధికారంలో ఉన్న సమయంలో పవన్, చంద్రబాబు, నారా లోకేష్ లపై అవంతి నిత్యం విమర్శలు చేస్తూ వచ్చారు. ఆ ఎఫెక్ట్‌తో ఆయనకు టీడీపీ, జనసేనల్లో చేరడానికి దారులు మూసుకుపోయాయంటున్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికల ముందు అవంతి తన రాజకీయ గురువు  గంట శ్రీనివాసరావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గంట తో పాటు చంద్రబాబు లోకేష్‌లపై తరచూ విమర్శలు చేసిన అవంతి టీడీపీలోకి రీఎంట్రీ ఇవ్వకుండా గంట పావులు కదుపుతున్నారంట. గంట మెగా ఫ్యామిలీకి సన్నిహితుడు కావడంతో జనసేనలో అవంతి చేరడానికి కూడా అవకాశం లేదంటున్నారు. అదీకాక గతంలో పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అవంతి పవన్ కళ్యాణ్ మీద కూడా విమర్శలు గుప్పించడంపై జనసైనికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.  అవంతికి ఏ పార్టీలోకి వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో తన కూతురు లక్ష్మీ ప్రియాంక ద్వారా కొత్త రాజకీయ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా కూటమిలోని టిడిపి, జనసేన పార్టీలు అడగకపోయినా  స్వచ్ఛందంగా కౌన్సిల్‌కి వచ్చి వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసిన లక్ష్మీ ప్రియాంక ఈ రెండు పార్టీలకు దగ్గరవ్వడానికే ఆ పని చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా జనసేనకి దగ్గరై రానున్న రోజుల్లో ఆ పార్టీలో జాయిన్ అవ్వాలని ఆమె నిర్ణయించుకున్నారంట. అందుకే లక్ష్మీ ప్రియాంక ఏ పార్టీలోనూ జాయిన్ అవ్వకుండా సైలెంట్ గా వచ్చి కూటమికి అనుకూలంగా ఓటు వేసి కూటమి పార్టీల గుడ్‌లుక్స్‌లో పడే ప్రయత్నం చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొదటిసారి కార్పొరేటర్‌గా గెలిచిన లక్ష్మీ ప్రియాంకకు ఇంత ఆలోచన లేకపోయినా .. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసిన  తండ్రి అవంతి శ్రీనివాస్ తమ రాజకీయ భవిష్యత్తు కోసం కుమార్తెను కూటమికి దగ్గర చేసే ఆలోచనతో ఓటు వేయించినట్లు తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు ఆ తండ్రి కూతుళ్లు ఏ పార్టీలో చేరే అవకాశం లేకపోయినా, భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన సమయానికి కచ్చితంగా తమకు అవకాశం వస్తుందని వారు భావిస్తున్నారంట. మరి అవంతి శ్రీనివాస్,  లక్ష్మీ ప్రియాంకల ఆలోచనలు ఎంత వరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

టీడీపీ నేత దేవినేని కుమారుడి పెళ్లి వేడుకులకు హాజరైన సీఎం రేవంత్

  తెలుగుదేశం పార్టీ  సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి పెళ్లి వేడుకులు ఘనంగా నిర్వహించారు. నగర శివారు కంకిపాడులో జరిగిన ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్‌ తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు.  నూతన వధూవరులు నిహార్‌, సాయి నర్మదలను వారు ఆశీర్వదించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి విజయవాడ చేరుకున్న రేవంత్‌రెడ్డికి హెలిప్యాడ్‌ వద్ద ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌రెడ్డి స్వాగతం పలికారు. రేవంత్‌, మంత్రి నారా లోకేశ్‌ కలిసి వివాహ వేడుక వద్దకు వచ్చారు. మరోవైపు  పెళ్లి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉండడంతో తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల సమయం మార్పు జరిగింది.షెడ్యూల్ ప్రకారం ఒంటి గంటకు విడుదల కావాల్సి ఉండగా ఫలితాలు మధ్యాహ్నం 2.15కి  సీఎం రేవంత్‌ రెడ్డిఫలితాలు విడుదల చేయనున్నరు  

విజయవాడలో షర్మిల హౌస్ అరెస్టు

ఆంధ్రప్రదేశ్  కాంగ్రెస్  అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. బుధవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో  పోలీసులు పెద్ద సంఖ్యలో విజయవాడలోని   షర్మిల నివాసానికి  చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకుని గృహ నిర్బంధంలో ఉంచారు.  ఈ విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు హుటాహుటిన షర్మిల నివాసానికి చేరుకుని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఆమెను ఎందుకు హౌస్ అరెస్ట్‌లో ఉంచారంటూ నిలదీశారు. తనను అకారణంగా హౌస్ అరెస్ట్ చేశారంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఎందుకు హౌస్ అరెస్టు చేశారో కనీసం కారణం కూడా చెప్పలేదన్నారు.   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  తన వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు చెబుతున్నారని, ఎలా ఉత్పన్నమౌతుందో చెప్పలేకపోతున్నారని షర్మిల పేర్కొన్నారు. రాజ్యాంగ హక్కులను సైతం ఏపీ ప్రభుత్వం కాలరాస్తోందంటూ షర్మిల ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎందుకు ఇంతగా భయపడుతోందని నిలదీశారు.  ఇలా ఉండగా వచ్చే నెల 2న ప్రధాని నరేంద్రమోడీ ఉద్దండరాయుని పాలెంలో పర్యటించనున్నారు. అమరావతి పనుల పున: ప్రారంభానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల బుధవారం (ఏప్రిల్ 30) ఉద్దండరాయుని పాలెంలో పర్యటించాలని నిర్ణయించారు. అయితే మోడీ పర్యటన, సభ ఏర్పాట్ల నేపథ్యంలో షర్మిలను ఉద్దండరాయున పాలెంలోకి ప్రవేశించకుండా నిరోధించేందుకు పోలీసులు ఆమెను విజయవాడలోని ఆమె నివాసంలోనే అడ్డుకుని హౌస్ అరెస్టు చేశారు. మోడీ పర్యటన సందర్భంగా ఆంక్షలు విధించినట్లు తెలపిన పోలీసులు ఆమెను ఉద్దండరాయని పాలెంలో పర్యటించకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో తీవ్ర టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్దండరాయని పాలెం వెడతానంటూ షర్మల భాష్మించారు. తనను అనుమతించకుంటే ధర్నాకు దిగుతాననీ, పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా నిరశన దీక్ష చేపడతానని షర్మిల హెచ్చరించారు. 

సింహాచలం దుర్ఘటన మృతుల గుర్తింపు

సింహాచలం చందనోత్సవం సందర్భంగా చోటు చేసుకున్న అపశ్రుతిలో మృతులను గుర్తించారు. వారి వివరాలను అధికారికంగా ప్రకటించారు. మృతుల వివరాలిలా ఉన్నాయి. కోనసీమ జిల్లాకు చెందిన కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషరావు, పత్తి దుర్గాప్రసాద్ నాయుడు, విశాఖలోని అడవివరం ప్రాంతానికి చెందిన ఎడ్ల వెంకట్రావు  మధురవాడ చంద్రంపాలెం ప్రాంతానికి చెందిన పిల్లా శైలజ, పిల్లా మహేష్ , హెచ్.పీ కాలనీకి చెందిన గుజ్జారి మహాలక్ష్మి 65, పైలా వెంకటరత్నం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది అలాగే కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను హోం మంత్రి అనిత పరామర్శించారు మరోవైపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్షతగాత్రులను బుధవారం (ఏప్రిల్ 30) పరామర్శించనున్నారు.  కాగా మృతులలొ  హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్న విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు, ఆయన భార్య శైలజ ఉన్నారు. వీరిరువురికీ మూడేళ్ల కిందట వివాహమైంది. హైదరాబాద్ లోని వేర్వేరు సంస్థలలో పని చేస్తున్న వీరు సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం కోసం బుధవారం (ఏప్రిల్ 30) తెల్లవారు జామునే రూ.300ల ప్రత్యేక దర్శనం క్యూలైన్ లో వేచి ఉన్నారు. భారీ వర్షానికి గోడ కూలిన ఘటనలో వీరివురూ అక్కడికక్కడే మరణించారు.  ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలు చేస్తూ స్థిరపడుతున్న సమయంలో భార్యాభర్తలిరువురూ ఇలా మరణించడం పట్ల కుటుంబ సభ్యులు, బంధు మిత్రులూ శోకసంద్రంలో మునిగిపోయారు.  

గంటా, విష్ణుకుమార్ రాజు వివాదం.. టీ కప్పులో తుపాన్!

సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు చిన్న చిన్న పొరపొచ్చారు, విభేదాలు తలెత్తడం సాధారణమే. అటువంటి చిన్న ఇబ్బందే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ నార్త్  ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు విష్ణు కుమార్ రాజు మధ్య తలెత్తింది. వారిరువురి మధ్యా తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్న సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.  ఫిల్మ్ నగర్ లీజు అంశానికి సంబంధించి ఇరువురి  మధ్యా వాగ్వాదం జరిగింది. విషయమేంటంటే ఈ లీజు వ్యవహారంలో అవకతవకలు జరిగాయంటూ విష్ణుకుమార్ రాజు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.  ఆ సందర్భంగా ఆయన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేరు కూడా ప్రస్తావించారు. దీనిపై గంటా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లీజు విషయంలో అవకతవకలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడానికి ముందు స్థానిక ఎమ్మెల్యేనైన తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదన్నది గంటా అభ్యంతరం. ఈ విషయంలో ఇరువురి మధ్యా జరిగిన వాగ్వాదం ముదిరి పాకాన పడుతుందని అంతా భావించారు. అయితే సకాలంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ జోక్యం చేసుకుని ఇరువురికీ  సర్ది చెప్పడంతో  ఈ వివాదం టీకప్పులో తుపానుగా తేలిపోయింది.    విశాఖలో జరిగిన ప్రజా ఫిర్యాదులపై ఏర్పడిన శాసనసభ కమిటీ సమావేశం సందర్భంగా  రఘురామకృష్ణం రాజు ఇరువురు ఎమ్మెల్యేలనూ ఒక దగ్గర కూర్చోబెట్టి మధ్యవర్తిత్వం నెరిపారని తెలుస్తోంది.  రఘురామకృష్ణం రాజు జోక్యంతో ఎమ్మెల్యేలు ఇద్దరూ కూడా విభేదాలను మరచి ఇరువురూ కలిసిపోయారని తెలుస్తోంది. సకాలంలో  జోక్యం చేసుకుని వివాదం ముదరకుండా నిలువరించడంలో రఘురామకృష్ణం రాజు చోరవ పట్ల కూటమి పార్టీల్లో హర్షం వ్యక్తమౌతోంది.  

గోరంట్ల మాధవ్ మళ్లీ మెదలెట్టేశారు!

చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా ఉంది వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ  ఎంపీ గోరంట్ల మాధవ్ తీరు. ఎంపీగా ఉండగా ఆయన తన పనితీరు కంటే న్యూడ్ వీడియోద్వారానే ఎక్కువ మందికి తెలిశారు. అంతకు ముందు పోలీసు అధికారిగా ఉండగా తెలుగుదేశం నాయకులపై తొడకొట్టి సవాల్ చేసి జగన్ దృష్టిలో పడి ఎంపీ టికెట్ కొట్టేసి గెలిచేసిన గోరంట్ల మాధవ్.. ఆ తరువాత కూడా తరచూ వివాదాలతోనే జనం నోళ్లలోనానారు.  ఒక యూట్యూబ్‌ చానెల్‌ ఇంటర్వ్యూలో వైఎస్‌ భారతిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌ అనే సోషల్ మీడియా యాక్టివిస్టును  ఇబ్రహీంపట్నంలో పోలీసులు అరెస్టు చేశారు. అక్కడనుంచి గుంటూరుకు తరలిస్తుండగా గోరంట్ల మాధవ్ అడ్డుకుని చేబ్రోలు కిరణ్ పై దాడికి పాల్పడ్డాడు. అడ్డుకున్న పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్శించారు. దీంతో పోలీసులు గోరంట్ల మాధవ్ ను అరెస్టు చేసి గుంటూరు కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు ఆదేశాల మేరకు రాజమహేంద్ర వరం సెంట్రల్ జైలుకు రిమాండ్ ఖైదీగా తరలించారు. ఈ నెల 10 నుంచీ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న గోరంట్ల మాధవ్ బెయిలుపై విడుదలయ్యారు. విడుదలైన గంటల వ్యవధిలోనే తన నోటికి పని చెప్పారు. గతంలో పోలీసు అధికారిగా పని చేసిన గోరంట్ల మాధవ్ పోలీసుల విధులను అడ్డుకోవడం, వారిపై దాడికి పాల్పడడం నేరాలని తెలియంది కాదు. కానీ ఆ పనే చేసి అరెస్టయ్యారు. కానీ ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చి చంద్రబాబు ప్రతీకార రాజకీయాలంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.   కటకటాలు లెక్కపెట్టినా ఆయన తీరులో మార్పు రాలేదు. వాస్తవానికి వైసీపీ నేతలలో అత్యధికులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, బూతులతోనే ఎక్కువగా గుర్తింపు పొందారు. అలా ఒక నెగటివ్ ఇమేజ్ తో పాపులర్ అయిన వైసీపీ నేతలలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒకరు. తాజాగా ఆయన జైలు నుంచి షరతులతో కూడిన బెయిలుపై విడుదలయ్యారు.   మాజీ పోలీసు అధికారి అయిన మాధవ్.. ఇప్పుడు గుంటూరు పోలీసు స్టేషన్ కు వెళ్లి సంతకం పెట్టాలి. కోర్టు విధించిన షరతులలో ఇది ఒకటి. అయినా గోరంట్ల మాధవ్ తీరు మారలేదు. ఇలా జైలు నుంచి బయటకు వచ్చారో లేదో అలా చంద్రబాబుపై నోరు పారేసుకున్నారు.  చంద్రబాబు ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ విమర్శించిన గోరంట్ల మాధవ్ అన్నిటినీ గుర్తుపెట్టుకుంటాం. మా పిక్క మీద వెంట్రక కూడా పీకలేరంటూ ఇష్టారీతిగా మాట్లాడారు. వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అప్పుడు చంద్రబాబుకు, ఆయన మనుషులకు గట్టి గుణపాఠం చెబుతామంటూ హెచ్చరిక జారీ చేశారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు సంగతి చూస్తాం అంటూ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు తెలుగుదేశం క్యాడర్ లో చ ర్చనీయాంశంగా మారింది. చింత చచ్చినా పులుపు చావలేదంటూ నెటిజన్లు గోరంట్ల మాధవ్ పై సెటైర్లు పేలుస్తున్నారు.