మిస్ వరల్డ్-2025 ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
posted on May 5, 2025 @ 3:35PM
మిస్ వరల్డ్-2025 ఏర్పాట్లపై హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మే7 వ తేదీ నుండి జున్2 తేదీ వరకు హైదరాబాద్ వేదికగా జరగనున్న 72వ ప్రపంచ అందాలు పోటీల్లో ఎలాంటి అవాంతరాలు, ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎయిర్‌పోర్టు నుంచి అతిథులు బస చేసే హోటల్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ సమీక్షకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈనెల 7న ప్రారంభం కానున్న ఈ పోటీల్లో 120 దేశాలకు చెందిన అందాల భామలు సందడి చేయనున్నారు.
మరోవైపు మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ నగరం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. వందకు పైగా దేశాల నుంచి వచ్చే అందాల భామలకు స్వాగతం చెప్పేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇవాల్టి నుంచి విదేశీ ప్రతినిధులు రానున్న నేపథ్యంలో ప్రత్యేక లాంజ్ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. అలాగే తెలంగాణ పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక చిహ్నాలతో కూడిన స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు.