మొటిమల గురించి ఈ షాకింగ్ నిజాలు తెలుసా..

మొటిమల గురించి ఈ షాకింగ్ నిజాలు తెలుసా.. ప్రపంచంలో అత్యంత సాధారణ చర్మ వ్యాధులలో ఒకటి  మొటిమలు. ఇవి చాలా సాధారణమైనవే అయినా..  ఇప్పటికీ వీటి గురించి  అపోహలు,  తప్పుడు సమాచారం ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇది టీనేజర్ల నుండి 30 ఏళ్లు,  అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దల వరకు అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది.  అయితే మొటిమల గురించి చాలా మందికి చాలా రకాల అపోహలు ఉంటాయి.  వాటిని నిజం అని నమ్మేవాళ్లు చాలా మంది ఉంటారు.  ముఖ్యంగా మొటిమల బాధితులు ఎక్కువ మహిళలే.. మొటిమల గురించి ఉన్న అపోహలు తెలుసుకుని వాటిని పరిష్కారం చేసుకుంటే చాలా ఆందోళనలు తగ్గుతాయి. మొటిమలు టీనేజ్ లో మాత్రమే వస్తాయా? చాలా మంది మొటిమలు కౌమారదశలో మాత్రమే కనిపిస్తాయని అనుకుంటారు. కానీ ఈ కాలంలో పెద్దలకు కూడా మొటిమలు రావడం సర్వసాధారణం.  ఒత్తిడి, హార్మోన్ల మార్పులు,  జీవనశైలి ఇవన్నీ మొటిమలకు కారణాలు అవుతాయి.  యుక్తవయస్సులో క్లియర్ స్కిన్   ఉండటం వల్ల పెద్దయ్యాక మొటిమలు రావని హామీ ఏమీ లేదు. జిడ్డు చర్మం ఉన్నవారికే మొటిమలు వస్తాయా? జిడ్డుగల చర్మం ఉన్నవారిలో మొటిమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ,  పొడి చర్మం ఉన్నవారిలో,  జిడ్డుగల చర్మం ఉన్నవారిలో,  పెద్దవారిలో మొటిమలు రావడం సహజం. చర్మ రకంతో సంబంధం లేకుండా చికాకు,  మూసుకుపోయిన చర్మ రంధ్రాల కారణంగా మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రకాల చర్మాలకు మొటిమల సమస్య ఉంటుంది. జంక్ ఫుడ్ తిన్నవారికే మొటిమలు వస్తాయా? చర్మ ఆరోగ్యంపై ఆహారం ప్రభావం చూపినప్పటికీ, మొటిమలు ప్రధానంగా జంక్ ఫుడ్ కారణంగానే వస్తాయి  అనుకోవడం తప్పు. చక్కెర,  పాల ఉత్పత్తులు అధికంగా ఉండే ఆహారాలు మొటిమలను మరింత తీవ్రతరం చేస్తాయి. కానీ అవే ప్రధాన కారణం కాదు.   చర్మ అవరోధం పనితీరు, హార్మోన్లు,  జన్యుశాస్త్రం చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. కొంతమందికి సమతుల్య ఆహారం మంటలను తగ్గించడంలో సహాయపడుతుంది. మేకప్ వల్ల మొటిమలు వస్తాయా? మొటిమలు తరచుగా మేకప్ కారణంగా వస్తాయని అనుకుంటారు.  అయితే, మొటిమలు  కామెడోజెనిక్ కాని ఉత్పత్తుల వల్ల సంభవించవు. మేకప్ సరిగ్గా తొలగించనప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. దీనివల్ల రంధ్రాలు మూసుకుపోతాయి.  చర్మం మీద మేకప్ ను చాలా శుభ్రంగా తొలగించుకోవడం చాలా ముఖ్యం. డబుల్ క్లెన్సింగ్ లేదా  స్కిన్ ఫ్రెండ్లీ ఉత్పత్తులతో ఇది సాధ్యమవుతుంది. టీనేజ్ మొటిమలకు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదా.. యుక్తవయస్సులో మొటిమలు సర్వసాధారణమైనప్పటికీ  ఇది హానిచేయదు అనే గ్యారెంటీ లేదు.. మొటిమల వల్ల శాశ్వతంగా  మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనికి ట్రీ ట్మెంట్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.                                 *రూపశ్రీ

30 ఏళ్ల తర్వాత పిల్లలు పుట్టడం ఎందుకు కష్టం అవుతోంది..!

30 ఏళ్ల తర్వాత పిల్లలు పుట్టడం ఎందుకు కష్టం అవుతోంది..! ఈ రోజుల్లో చాలా మంది మహిళలు కెరీర్‌ గురించి ఆలోచించడం,  గోల్స్ అచీవ్ చేయడం వంటివి దృష్టిలో ఉంచుకోవడం లేదా ఇతర కారణాల వల్ల 30 సంవత్సరాల తర్వాత వివాహం చేసుకునే వారు అధికం అయ్యారు.  కాస్త తొందరగా పెళ్లి చేసుకున్నా  గర్భధారణను మాత్రం 30 ఏళ్ల తర్వాత   ప్లాన్ చేస్తున్నారు. కానీ సరిగ్గా గమనిస్తే నేటికాలంలో పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్న అధిక శాతం మంది 30 ఏళ్ల తర్వాత వయసు ఉన్నవారే.. మహిళ యొక్క సంతానోత్పత్తి ప్రయాణం పుట్టుక నుండే ప్రారంభమవుతుంది. ఒక అమ్మాయి తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు,  ఆ సమయంలో ఆమె అండాశయాలలో అండాల సంఖ్య లక్షల్లో ఉంటుందని గైనకాలజిస్టులు చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. అంతేకాదు.. ఈ సంఖ్య జననం సమయంలో దాదాపు 1–2 మిలియన్లకు పడిపోతుంది.  యుక్తవయస్సు వచ్చే సమయానికి 50–60 వేల అండాలు మాత్రమే మిగిలి ఉంటాయి. దీని అర్థం స్త్రీ వయస్సు పెరిగే కొద్దీ ఆమె సంతానోత్పత్తి క్రమంగా తగ్గుతుంది. 30 ఏళ్ల తర్వాత ఈ సంఖ్య మరింత తగ్గడం వల్లే గర్భధారణలో ఇబ్బందులు తలెత్తుతాయి. స్త్రీకి PCOD లేదా PCOS వంటి హార్మోన్ల సమస్యలు, పీరియడ్స్ సమయంలో అధిక నొప్పి లేదా అసాధారణ రక్తస్రావం (చాలా తక్కువ లేదా ఎక్కువ),  ఎండోమెట్రియోసిస్ వంటి వ్యాధి ఉంటే, అది మరింత సమస్యగా  మారుతుంది. ఇక టెక్నాలజీ ఉపయోగించి గర్భధారణ అనేది నేటికాలంలో చాలా జరుగుతోంది.  వాస్తవానికి, IVF ఒకసారి విఫలమైన తర్వాత మళ్ళీ దానికి డబ్బు కట్టి ప్రయత్నించాలా  అనేది చాలా మంది సందేహం.  ప్రతి స్త్రీ శరీరం,  హార్మోన్ల ప్రతిస్పందన ఒకేలా ఉండదు. కొంతమంది మహిళల శరీరాలు ఎక్కువ అండాలు ఉత్పత్తి చేస్తాయి, దీనిని హైపర్ స్టిమ్యులేషన్ అంటారు, మరికొన్ని ఆశించిన సంఖ్యలో అండాలు మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. IVF టెక్నాలజీకి కూడా హామీ లేదా.. IVF ద్వారా గర్భధారణకు ప్రయత్నించినా  అది  ఇంజెక్షన్,  ట్రీట్మెంట్  మోతాదును వేర్వేరు సైకిల్స్ లో  మార్చాలి. IVFలో మూడు లేదా నాలుగు సైకిల్స్ లో  ఎవరైనా గర్భవతి అవుతారని హామీ ఇవ్వడం సాధ్యం కాదని నిపుణులు  స్పష్టంగా చెబుతున్నారు. ఒకవేళ ఇలాంటి హామీ ఎవరైనా ఇస్తున్నారంటే కేవలం ఒక స్కామ్ మాత్రమే అంటున్నారు.                                *రూపశ్రీ.

ఆశల్ని అలాగే మిగలనివ్వకండి...

  ఆశల్ని అలాగే మిగలనివ్వకండి...   మనసుకు నచ్చిన పని చేసినప్పుడు లభించే తృప్తి అంతా ఇంతా కాదు. ఆ తృప్తి, ఆ ఆనందం ముందు ఏవీ సరిరావు. కానీ ఎక్కువసార్లు మన మనసుకి నచ్చిన పని చేయటానికి మనకు అవకాశం దొరకదు. మనుషులో, పరిస్థితులో, కాలమో ఏదో ఒకటి అడ్డుపడుతూనే ఉంటాయి. ఒకటి రెండుసార్లు పట్టుదలగా ప్రయత్నిస్తాం. కుదరటం లేదంటూ ముడోసారికి ఆ ప్రయత్నం విరమించుకుంటాం. అందులోనూ ఆడవారి విషయంలో ఆ ఆటంకాలకి కొదవే వుండదు, పెళ్ళి, పిల్లల నుంచి మరెన్నో బాధ్యతలు కాళ్ళకి బంధం వేసి ముందుకు అడుగు వేయనివ్వవు. దాంతో ఏదో చేయాలన్న తపన కాస్తా మరుగున పడిపోతుంది. అసంతృప్తి తోడుగా మనతో ముందుకు అడుగేస్తుంది. అలా కాదు నేను నా మనసుకు నచ్చిన పని చేసి తీరాలంటూ వయసుతో సంబంధం లేకుండా కాలేజీకి వెళ్ళిన ఒకామె గురించి ఈ మధ్య చదివాను. ఇల్లు, పిల్లలు, బాధ్యతలు అంటూ కొన్ని సంవత్సరాల పాటు తమని తాము మర్చిపోతారు ఆడవారు. బాధ్యతలు అన్నీ తీరి కాస్త సమయం దొరికింది అన్నప్పుడు క్షణాలు గంటల్లా మారిపోతాయి. కాలం కదలదు. ఏమీ చేయటానికి ఉండదు. ఇక నిరుత్సాహం, నిర్లిప్తత మేమున్నామంటూ హాయ్ చెబుతాయి. అలా తన బాధ్యతలన్నీ తీరిపోయక... హమ్మయ్య కావల్సినంత సమయం దొరికిందంటూ సంతోషించింది. అంతేనా... ఎప్పట్నుంచో తన మనసులో వున్న కోరిక తీర్చుకునే దిశగా అడుగులు వేసింది ఆమె. బాగా చదువుకోవాలన్నది ఆమె కోరికట. కానీ చదువు మధ్యలోనే పెళ్ళయిపోవటం ఆ తర్వాత బాధ్యతల మధ్య చదువు ముందుకు సాగలేదు. 60 సంవత్సరాల దగ్గరగా వచ్చేసింది వయసు. పిల్లలందరూ దూరంగా వున్నారు. కావలసినంత సమయం. అంతే చక్కగా కాలేజీలో చేరిపోయింది. డిగ్రీ మొదటి సంవత్సరం క్లాసులోకి ఈమె అడుగు పెడుతుంటే లెక్చరరు అనుకుని స్టూడెంట్స్ అంతా విష్ చేశారుట మొదటి రోజు. ఆ తర్వాత ఈమె కూడా చదువుకోవటానికి వచ్చిందని తెలుసుకుని నవ్వుకున్నారట. కాలేజీ జీవితంమంటే సరదా, సంతోషాల కలయిక. వయసు, ఉత్సాహం ఉరకలు వేస్తుంటాయి. అలా ఉరకలు వేసే కాలేజీ స్టూడెంట్స్ కి క్లాసులో ఈ పెద్దావిడని చూస్తే మొదట్లో చిరాకుగా అనిపించేదిట. ఆవిడ అందరితో సరదాగా మాట్లాడుతూ, వాళ్ళతో పాటు క్యాంటిన్‌కి, సినిమాకి వెంట వస్తుంటే విసుగ్గా ఉండేదిట. కానీ బయటికి ఏమీ అనలేక ఆమెని తప్పించుకు తిరిగేవారు స్టూడెంట్స్. ఇలా కొంత కాలం గడిచింది. ఈ మధ్య కాలంలో తెలియకుండానే ఆమెతో మంచి అనుబంధం ఏర్పడిపోయింది. ఒక్కరోజు ఆమె రాకపోయినా తోచేదికాదు స్టూడెంట్స్‌కి. కేవలం ఆటపాటలు, సరదా, సంతోషాలలోనే కాదు చదువులోనూ టీనేజర్స్‌తో నేను పోటీపడగలనంటూ ముందుండేవారుట ఆమె. దాంతో కాలేజీలో ఆమె అందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తిగా మారిపోయింరు.  సంవత్సరం ఆఖరి పరీక్షలలో మంచి మార్కులతో పాసయిన ఆమెని చూచి అందరూ ఆనందపడతారు. అలా మూడు సంవత్సరాలు గడచిపోతాయి. మూడేళ్ళు మూడు క్షణాలుగా గడచిపోతాయి ఆమెకి. కావల్సినన్ని జ్ఞాపకాలు స్వంతమయ్యాయి. ఫేర్‌వెల్ రోజున ఆడిపాడి ఆఖరుగా తమ తమ మనసులో మాటలు చెబుతారు ఒకొక్కరు. ఆమె వంతు వస్తుంది. అప్పుడు తనసలు కాలేజీలో ఎందుకు చేరిందో, చదువంటే తనకెంత ఇష్టమో, ఇన్ని సంవత్సరాల జీవితం తనకెన్ని ఆటుపోట్లని ఇచ్చిందో అన్ని వివరిస్తుంది. ఆఖరుగా ఈ మూడేళ్ళు నా ఇన్నేళ్ళ జీవితంలో ప్రతేకమైనవి అని చెబుతూ అందుకు అందరికీ థాంక్స్ కూడా చెబుతుంది. అందరూ భారమైన మనసులతో విడిపోతారు. రిజల్ట్స్ వస్తాయి ఆమె యూనివర్సిటీ ఫస్ట్ వస్తుంది. అందరూ ఎంతో సంతోషిస్తారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుని సర్ ప్రైజ్‌గా ఆమె ఇంటికి వెళతారు. స్టూడెంట్స్, లెక్చరర్లు ఒకసారిగా ఆమె ఇంటికి వస్తారు. లోపలికి వెళ్ళి పూలమాలతో అభినందించాలనుకున్న వాళ్ళకి మంచంపై రిజల్టుపేపరుని గుండెలపై పెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమె కనిపిస్తుంది. కదిపి చూస్తే చలనం ఉండదు. అందరూ నిర్ఘాంతపోతారు. ఆమె కేన్సర్ ఆఖరి రోజులని తెలిసీ తన చిరకాల కోరిక తీర్చుకునేందుకు కాలేజీకి వచ్చింది. చదువుకుంది. ఆ తృప్తితో ప్రాణాలు విడిచింది. ఈ నిజం తెలుసుకున్న అక్కడి వారంతా బాధతో ఆమెకి వీడ్కోలు చెబుతారు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది. తీరని ఆశ మనిషిని, మనసుని బాధిస్తుంది. ఆలోచించండి. - రమ ఇరగవరపు

పట్టుచీరలు  ఐరన్ చేసేటప్పుడు ఈ టిప్స్ తప్పక పాటించండి!

పట్టుచీరలు  ఐరన్ చేసేటప్పుడు ఈ టిప్స్ తప్పక పాటించండి!   భారతీయ సాంప్రదాయానికి మెరుగులు దిద్దేవి పట్టుచీరలు. పట్టుచీరలలో అమ్మాయిలు ముస్తాబైతే వారిని చూడటానికి రెండు కళ్లు సరిపోవు. నిజానికి భారతీయత అంతా పట్టుచీరలలోనే తిష్ట వేసుకుందేమో అనిపిస్తుంది. ఇకపోతే ప్రతి మహిళ దగ్గరా పట్టుచీరలు ఉండటం కామన్. పండుగ, శుభకార్యాల సమయాలలో సందర్బానుసారంగా పట్టుచీరలు కట్టి పండుగకు మరింత అందం తెస్తారు. అయితే పట్టుచీరలను ఐరన్ చేసేటప్పుడు కొన్ని టిప్స్  పాటిస్తే మాత్రం లుక్ రెట్టింపు అవుతుంది. దుస్తులు కూడా సురక్షితంగా ఉంటాయి. ఇంతకీ పట్టుచీరలను ఐరన్ చేసేటప్పుడు పాటించాల్సిన టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. ముందు జాగ్రత్త.. పట్టుచీరలను జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే దానికి చెయ్యాల్సిన మొదటి పని కొనుగోలు చేసేటప్పుడే ఆ చీరలను ఐరన్ చెయ్యచ్చా లేదా అనే విషయం తెలుసుకోవడం. ఒకవేళ పెద్ద షాప్స్ లో కొంటూ ఉంటే ఆ పట్టు రకం, దాని ఖరీదు మొదలైనవాటితో పాటూ సదరు చీరను ఐరన్ చెయ్యచ్చా లేదా అనే విషయం కూడా అందులో పొందుపరిచి ఉంటారు.  అవి చూసుకోవాలి. కవరింగ్.. పట్టుచీరలను ఎప్పుడూ నేరుగా ఐరన్ చెయ్యకూడదు. పట్టుచీర మీద ఐరన్ బాక్స్ నేరుగా పెట్టకూడదు. దానిబదులు మొదట చీరను జాగ్రత్తగా ఒక పెద్ద టేబుల్ మీద ఉంచి, చీర మీద కాటన్ క్లాత్ లేదా కాటన్ టవల్ వంటివి ఉంచాలి.పైన క్లాత్ ఐరన్ చేస్తుంటే కింద చీర ఐరన్ అయిపోతుంది. ఇలా ఐరన్ చేస్తే చీర దారప్పోగులు, రంగు దెబ్బతినవు. సెట్ చేయాలి.. ఐరన్ బాక్స్ తో ఐరన్ చేసేటప్పుడు ప్రతి ఫ్యాబ్రిక్ కు తగినట్టు  టెంపరేచర్ సెట్ చేసే సౌకర్యం ఉంటుంది. దాన్ని అనుసరించి పట్టుచీరల కోసం సిల్క్ సెట్టింగ్ చేయాలి. ఇలా చేస్తే పట్టుబట్టలకు తగినంత మాత్రమే ఉష్ణోగ్రత ప్రసారం అవుతుంది. మొదలు ఇక్కడే.. పట్టుచీరలను మొదట అంచు నుండి ఐరన్ మొదలుపెట్టాలి. తరువాత చీరల మధ్యలో ఐరన్ చెయ్యాలి. ఇలా చేస్తే ముడతలు ఉండవు. కానీ చీరలు పాడవకుండా ఉండాలన్నా, ఏమాత్రం నష్టం జరగకూడదు అన్నా ఐరన్ బాక్స్ ను చీరమీద ఒకేచోట ఎక్కువ సేపు ఉంచకూడదు. ఫైనల్ స్టెప్ మిస్టేక్.. చీరలు ఐరన్ చేశాక జాగ్రత్తగా మడతేసి బీరువాలో పెట్టడం మగువలకు అలవాటు. అలా కాకుండా ఐరన్ చేసిన చీరలను హ్యాంగర్ కు పెట్టి దాన్ని వార్డ్ రోబ్ లో వేలాడదీయాలి. కవర్లలో పెట్టడం ఇరుకైన డ్రాయర్లలో పెట్టడం చెయ్యకూడదు.                                       *నిశ్శబ్ద.

రాణి అహిల్యాబాయి హోల్కర్ గురించి తెలుసా...

 రాణి అహిల్యాబాయి హోల్కర్ గురించి తెలుసా...     రాణి అహిల్యాబాయి హోల్కర్ (1725–1795) భారతదేశ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, ఆదర్శప్రాయమైన మహిళా పాలకురాలిగా నిలిచారు. మధ్యభారతదేశంలోని ఇండోర్ సంస్థానంలో జన్మించిన ఆమె, చిన్నతనంలోనే భర్తను కోల్పోయి, తన కుటుంబాన్ని సమర్థంగా నడిపించారు. తర్వాత, ఆమెను సంస్థానాధీశులు రాణిగా నియమించారు. పరిపాలనలో ప్రతిభ.. రాణి అహిల్యాబాయి హోల్కర్ రాజ్యాన్ని సమర్థంగా, ప్రజా సంక్షేమాన్ని ప్రధానంగా ఉంచి పరిపాలించారు. ప్రతి రోజు నర్మదా నదిలో స్నానం చేసి, మట్టితో శివలింగాన్ని తయారు చేసి, ఆ లింగం సాక్షిగా న్యాయనిర్ణయం చేసేవారు. అవినీతికి తావులేని పాలన, పన్నుల విధానంలో పారదర్శకత, ప్రజల సమస్యలను స్వయంగా పరిష్కరించడం వంటి లక్షణాలతో ఆమె పాలన ప్రసిద్ధి చెందింది. సాంస్కృతిక పునర్నిర్మాణం.. రాణి అహిల్యాబాయి హోల్కర్ తన స్వంత నిధులతో దేశవ్యాప్తంగా సుమారు 150 దేవాలయాలను పునర్నిర్మించారు. కాశీ విశ్వేశ్వర ఆలయం, కేదారనాథ్, గయ, ప్రయాగ, శ్రీశైలం, రామేశ్వరం, పూరి జగన్నాథ్ ఆలయాలు వంటి ప్రఖ్యాత దేవాలయాలను పునర్నిర్మించారు. ఈ విధంగా, ఆమె భారతీయ సంస్కృతిని కాపాడడంలో కీలక పాత్ర పోషించారు. సామాజిక సవరణలు.. అహిల్యాబాయి హోల్కర్ సమాజంలో అనేక సవరణలు తీసుకువచ్చారు. బాల్య వివాహాలను నిషేధించారు, వరకట్న పద్ధతిని రద్దు చేశారు, వితంతు వివాహాలను ప్రోత్సహించారు. అదేవిధంగా, భిల్లులు, గోండులు వంటి ఆదివాసీలను సంస్కరించి, వారికి స్థిర నివాసాలు కల్పించారు. దౌత్య నైపుణ్యం.. రాణి అహిల్యాబాయి హోల్కర్ 15 దేశాలకు రాయబారులను పంపించి, సమర్థమైన విదేశాంగ విధానాన్ని నిర్వహించారు. ఆమె రాజ్యంలో వివిధ కులాలకు, మతాలకు చెందిన ప్రజల పట్ల సమానత్వంతో వ్యవహరించారు. అందువల్ల, ఆమె పాలనలో సామాజిక సామరస్యత నెలకొంది. నారీ శక్తికి ప్రతీక.. రాణి అహిల్యాబాయి హోల్కర్ తన జీవితాన్ని నిరాడంబరంగా గడిపారు. ఆమెకు "పుణ్యశ్లోక" అనే బిరుదు కూడా వచ్చింది, అంటే "పుణ్యమూర్తి" అని. ఆమె జీవితం నారీ శక్తికి ప్రతీకగా నిలిచింది.  ఆమెను ఆదర్శంగా తీసుకుని అనేక మహిళలు తమ జీవితాలను తీర్చిదిద్దుకుంటున్నారు. ఈ విధంగా రాణి అహిల్యాబాయి హోల్కర్ భారతదేశ చరిత్రలో ఒక అపూర్వమైన మహిళా పాలకురాలిగా నిలిచారు. ఆమె పరిపాలన, సాంస్కృతిక పునర్నిర్మాణం, సామాజిక సవరణలు,  దౌత్య నైపుణ్యాలతో ఆమె దేశానికి అమూల్యమైన సేవలు అందించారు. ఈమె ప్రతి మహిళకు ఆదర్శం.                                    *రూపశ్రీ.

మానసిక సమస్యలకు చెక్ పెట్టాలంటే

  మానసిక సమస్యలకు చెక్ పెట్టాలంటే   ఒత్తిడి ..ఎంతటి వారిని అయినా చిత్తు చేసేస్తుంది . అందులోను మహిళల విషయం లో ఈ ఒత్తిడి మరింత ప్రభావాన్ని చూబిస్తుంది , ఎందుకంటే వారు ఎన్నో విధాలుగా నిత్యం ఒత్తిడికి గురి అవుతూనే వుంటారు , అందులోను , ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగినిలు కంటే గృహిణులు గా ఇంట్లో వుండే మహిళలలోనే ఒత్తిడి ఎక్కువ అట. సాధారణంగా ఉద్యోగం చేసే మహిళలలో ఒత్తిడి ఎక్కువగా వుంటుంది అనుకుంటారు. కాని తాజాగా చేసిన ఒక అధ్యయనం లో ఇంటికే పరిమిత మయిన మహిళలలోనే  ఒత్తిడి ఎక్కువ అని తేలింది. హార్మోన్ల స్తాయి ని లెక్కించి వారి ఒత్తిడిని అంచనా వేసారు. చివరికి వారు తేల్చిన విషయం ఏంటంటే ఎవరయినా , ఎప్పుడు అయినా తను చేసే పనికి తగిన గుర్తింపు కావాలని కోరుకుంటారు. ఉద్యోగినులకి అయితే శ్రమకి తగిన జీతం , పదోన్నతలు, ప్రశంసలు వంటివి వుంటాయి. కాని గృహిణులుగా ఎంత బాధ్యతతో వున్నా వారికి చిన్నపాటి గుర్తింపు కూడా ఉండదు. పైగా వారు చేసే పనిని కూడా ఎవరు కష్టమయినదిగా గుర్తించరు. దానితో పనికి గుర్తింపు లేకపోవటం అన్నది వారిని చాలా మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది అని తేలింది. పైగా ఉమ్మిడి కుటుంబాలలో ఉండే మహిళలలో ఈ ఒత్తిడి మరింత అధికంగా వుండటం గుర్తించారుట. చేసే పనికి చిన్నపాటి గుర్తింపు కుటుంబ సబ్యుల నుంచి దొరికితే వారిలో అసహనం, కోపం, వత్తిడి వంటివి తగ్గుతాయని , దానివలన ఇతర అనారోగ్యాలు కూడా తగ్గుతాయని వీరు గట్టిగా చెబుతున్నారు. చిన్న పాటి ప్రశంస మహిళల మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని అధ్యయనాలు చెబుతున్నా కూడా  , ఇప్పటికి ఆ ప్రశంస దొరకటం కష్టం గా వుంది అంటే ...ఆ సమస్యకి పరిష్కారం గట్టిగా ఆలోచించాల్సిందే. నిపుణులు ఈ విషయం లో మహిళలకి కొన్ని సూచనలు చేస్తున్నారు. అవి ఏంటంటే 1. మొదటిగా, మిమ్మల్ని మీరు ప్రేమించు కొండి 2. మీతో మీరు కొంత సమయం గడపండి 3. మీకోసం మీరు ఆలోచించటం మొదలు పెట్టండి ఎప్పుడు అయితే మీ గురించి మీరు ఆలోచించటం మొదలు పెడతారో , ఆత్మవిశ్వాసం మీ స్వంతం అవుతుంది . అప్పుడు బయట వ్యక్తుల ప్రశంసల కోసం ఎదురు చూడరు . వారినుంచి ప్రశంస దొరికినా , లేకపోయినా కూడా ఆనందం గానే వుంటారు. ఈ చిన్న విషయాన్ని గమనిస్తే చాలు ...ఎన్నో మానసిక సమస్యలు కి చెక్ చెప్పినట్టేనట.  

బట్టల మీద  మరకలు  ఇలా ఈజీగా తొలగించవచ్చు..!

బట్టల మీద  మరకలు  ఇలా ఈజీగా తొలగించవచ్చు..!   మరక మంచిదే అనే యాడ్ చూసే ఉంటారు. అయితే నచ్చిన దుస్తుల మీద మరకలు పడటం వల్ల చాలా బాధపడతాం.  ముఖ్యంగా ఫేవరెట్ డ్రెస్ అని అందరికీ ఉంటుంది.  పొరపాటున ఈ ఫేవరెట్ డ్రెస్ మీద కానీ, ఖరీదైన దుస్తుల మీద కానీ మరకలు పడితే మనసు విలవిలలాడుతుంది. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో ఈ మరకలను సులభంగా తొలగించుకోవచ్చు. నిమ్మరసం.. నిమ్మరసం సహజమైన బ్లీచ్ ఏజెంట్ గా పనిచేస్తంది. దుస్తుల మీద మరకలు ఏర్పడినప్పుడు దాని మీద నిమ్మరసం పిండాలి. ఆ తరువాత కొద్దిసేపు దాన్ని అలాగే వదిలేయాలి.  ఆ తరువాత కడగాలి.  మరకలు మాయం అవుతాయి. బేకింగ్ సోడా.. బేకింగ్ సోడా కూడా శక్తివంతమైన క్లీనింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. కేవలం దుస్తులే కాదు.. వివిధ వస్తుల మీద మొండి మరకలను కూడా బేకింగ్ సోడా సహాయంతో మాయం చేయవచ్చు.  ఇకపోతే దుస్తుల మీద ఏర్పడిన మరకల మీద బేకింగ్ సోడా పేస్ట్ అప్లై చేయాలి.  ఆ గుడ్డను కాసేపు పక్కన పెట్టాలి. ఆరిపోయాక దాన్ని వాష్ చేయాలి. బేకింగ్ సోడా మరకల తాలూకు మురికి,  జిడ్డు, రంగు మొదలైనవి లాగేస్తుంది. వెనిగర్.. నిమ్మకాయకు ప్రత్యామ్నాయంగా చాలామంది చాలా సందర్భాలలో వెనిగర్ ను ఉపయోగిస్తారు. అయితే బట్టల మీద మరకలను కూడా వెనిగర్ ద్వారా తొలగించుకోవచ్చు.  మరకల మీద వెనిగర్ రాసి కాసేపు అలాగే ఉంచాలి.  ఆరిన తరువాత  వాష్ చేయాలి. హైడ్రోజన్ పెరాక్సైడ్.. రంగు దుస్తులపై హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఉపయోగించే ముందు ఏదైనా ప్రాంతంలో ప్యాచ్ టెస్ట్ చేయాలి.   బట్టలకు ఎలాంటి నష్టం కలగకుంటే మరకల మీద ప్రయోగించాలి.  ఇది మరకలు తొలగించడంలో చాలా ప్రబావవంతంగా ఉంటుంది. డిష్ వాష్ సోప్.. డిష్ వాష్ సోప్ మరకల తాలూకు ఆయిల్,  గ్రీజు మరకలను తొలగించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.  మరక మీద కొద్దిగా డిష్ వా,్ సోప్ రాసి రుద్దాలి.  తర్వాత దాన్ని వాష్ చేయాలి. ఉప్పు.. మరకలు ఇంకా అప్పుడే అయినవి అయితే వాటని తొలగించడానికి ఉప్పు భలే మంచి ఎంపిక.  మరకలపైన ఉప్పును వేయాలి.  ఉప్పు మరకల తాలూకు గ్రీజు, జిడ్డు, రంగును లాగేస్తుంది. బోరాక్స్.. బోరాక్స్ అనేక రకాల మరకలను తొలగించడంలో సహాయపడుతుంది.  బోరాక్స్ ను పేస్ట్ చేసి మరకల మీద రాసి కాసేపు అలాగే వదిలేయాలి.  ఆ తరువాత వాష్ చేయాలి.  మరకలు మాయమవుతాయి. బంగాళదుంప.. బంగాళదుంప రసం తుప్పు మరకలను తొలగించడంలో సహాయపడుతుంది.  బట్టల మీద తుప్పు మరకలు ఉన్నప్పుడు బంగాళదుంప ను కట్ చేసి బంగాళదుంప ముక్కలతో మరకల మీద బాగా రుద్దాలి.  ఇలా చేస్తే మరకలు పోతాయి.                                               *రూపశ్రీ.  

అసలైన బనారసీ పట్టును ఇలా గుర్తించండి..!

అసలైన బనారసీ పట్టును ఇలా గుర్తించండి..!     పట్టు చీరలు భారతీయ కళకు కాణాచి.  ఇక పట్టు చీరలు కట్టుకున్నమగువలను చూస్తే  సాక్షాత్తూ ఆ దేవతే దిగి వచ్చిందేమో అనిపిస్తుంది.  మగువల వల్ల చీరకు అందమా.. చీర వల్ల మగువల అందం రెట్టింపైందా అనేది తెల్చలేని సందిగ్ధం కూడా ఏర్పడుతుంది. భారతదేశంలో చాలా రకాల పట్టుచీరలు ఉన్నాయి.  ప్రాంతాన్ని బట్టి పలు రకాల పట్టులు పేరొందాయి.  వాటిలో బనారసి సిల్క్ చీర కూడా ఒకటి.   బనారసి సిల్క్ చీరకు దానిదైన ప్రత్యేకత ఉంది. అయితే స్వచ్చమైన బనారసి పట్టు అంత ఈజీగా దొరకవు. చాలా చోట్ల బనారసి పేరుతో మోసాలు జరుగుతుంటాయి.  నిజమైన బనారసి పట్టు చీరల ఫాబ్రిక్, డిజైన్, రంగు అన్నీ చాలా విభిన్నంగా ఉంటాయి.  నిజమైన బనారసి పట్టును ఎలా గుర్తించవచ్చో తెలుసుకుంటే ఈ రకమైన పట్టు చీర కొనేటప్పుడు మోసపోకుండా ఉంటారు. మెరుపు.. బనారసి సిల్క్ చీరలను కొనేటప్పుడు దాని మెరుపు మీద దృష్టి పెట్టాలి్.  కొనుగోలు దారులు నకిలీ చీరలు చూపించి ప్రజలను సులువుగా మోసం చేస్తారు.  అందుకే బనారసి చీరలు కొనేటప్పుడు చీరల మెరుపు మీద దృష్టి పెట్టాలి.  బనారసి సిల్క్ చీరలు  చాలా మృదువుగా ఉంటాయి. అంచు.. బనారసి సిల్క్ చీరల అంచు దారం వదులుగా ఉంటుంది.  ఈ చీరను చేతితో నేస్తారు.  దీని వల్ల అంచు దారం వదులుగా ఉంటుంది.  అదే సమయంలో నకిలీ చీరలు అయితే యంత్రం సహాయంతో నేస్తారు.  ఈ మెషీన్ తో నేసే చీరల అంచు దారాలు వదులుగా ఉండవు.  ఈ అంచును చూసి అసలు చీర, నకిలీ చీర మద్య తేజా కనుక్కోవచ్చు. ధర.. బనారసి సిల్క్ చీరలను ధరతో పోల్చి కూడా కనుక్కోవచ్చు.  ఈ చీరలు ఖరీదైనవి.  దాదాపు 10 నుండి 12వేల రూపాయల ధర ఉంటాయి.  ఇంతకంటే తక్కువ ధరకు ఈ చీరలను ఏ దుకాణంలో అయినా అమ్ముతుంటే అవి నకిలీ చీరలని తెలుసుకోవచ్చు.  అలాంటి చీరలు కొనకూడదు. దారం.. అసలైన బనారసి పట్టు  చీరను కనుక్కోవడానికి మరొక చిట్కా ఉంది.  అసలైన బనారసి పట్టు దారం కాల్చిన వెంటనే కాలిపోతుంది. చేతికి మసి అంటుతుంది.  అదే నకిలీ బనారసి పట్టు అయితే ప్లాస్టిక్ దారాలతో తయారవుతుంది.  దీని దారం కాల్చినప్పుడు చేతికి అతుక్కుంటుంది. నమ్మకం.. బనారసి సిల్క్ చీరలను కొనుగోలు చేసేటప్పుడు ఎక్కడంటే అక్కడ కొనకూడదు.  నమ్మకమైన  దుకాణాదారుల దగ్గర.. చాలా వరకు నేత పని చేసే వారి దగ్గర నేరుగా కొనడం మంచిది.                                         *రూపశ్రీ.

సేఫ్టీ పిన్ వల్ల చీర లేదా దుపట్టా చిరిగిపోతోందా...ఇలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే..!

  సేఫ్టీ పిన్ వల్ల చీర లేదా దుపట్టా చిరిగిపోతోందా...ఇలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే..!     సేఫ్టీ పిన్.. ప్రతి అమ్మాయికి చాలా అవసరమైన వస్తువు. చీరలు,  డ్రస్ కు వేసుకునే చున్నీలను  జారిపోకుండా ఉండటం కోసం సేఫ్టీ పిన్ లను వాడతారు.  మధ్యతరగతి, దిగువ తరగతి మహిళల మంగళసూత్రానికి,  గాజులకు ఈ సేఫ్టీ పిన్స్ తప్పనిసరిగా ఉండటం చూడవచ్చు.  అయితే సేఫ్టీ పిన్ లను చీరలు కట్టుకున్నప్పుడు,  దుప్పట్టా వేసుకున్నప్పుడు సేఫ్టీ పిన్ ను వాడి ఆ తరువాత మనసు చిన్నబుచ్చుకునే వారు చాలామంది ఉంటారు.  కారణం..  ఈ సేఫ్టీ పిన్ లు పెట్టుకున్నప్పుడు డ్రస్ లేదా చీర క్లాత్ కాస్త చిరిగిపోవడం.  సేఫ్టీ పిన్ వినియోగం వల్ల మంచి మంచి దుస్తులు రంధ్రాలు పడుతుంటాయి.  ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కొన్ని ఈజీ ట్రిక్స్ పాటించాలి. ఈ సమయంలోనే ఎక్కువ.. చాలా సార్లు హడావిడిగా చీర కట్టుకున్నప్పుడు,  డ్రెస్ వేసుకున్నప్పుడు సేఫ్టీ పిన్ పెట్టేటప్పుడు సరిగా పెట్టకుండా ఆవేశంతో పిన్ ను గుచ్చేస్తుంటారు. దీని వల్ల అవి చీరలోనూ, చున్నీలలోనూ ఇరుక్కుపోయి అవి సులభంగా బయటకు రాలేక.. దుస్తులకు నష్టం చేకూరుస్తాయి. దీని వల్ల చాలా వరకు కొత్త చీరలు, డ్రస్సులు బలి అయిపోతుంటాయి. బటన్స్.. చీర లేదా దుపట్టాను పిన్ చేయడానికి ముందు సేఫ్టీ పిన్ కు రంగురంగుల బటన్ లను అటాచ్ చేయాలి.  ఇలా చేయడం వల్ల చీర చిరిగిపోదు.  బట్ట సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు.. సేఫ్టీ పిన్ ను తిరిగి తీసేయడం కూడా సులువుగా ఉంటుంది. స్టిక్కర్.. సేఫ్టీ పిన్ పెట్టుకొనేటప్పుడు స్టిక్కర్ కూడా ఉపయోగించవచ్చు.  స్టిక్కర్ ఉపయోగించి సేఫ్టీ పిన్ పెట్టడం వల్ల దాన్ని తిరిగి తీయడం సులువు అవుతుంది. అలాగే క్లాత్ చిరిగిపోకుండా కాపాడుకోవచ్చు. పాలిథిన్.. చీరకు కానీ,  దుపట్టాకు కానీ సేఫ్టీ పిన్ పెట్టేటప్పుడు దానికి పాలిథిన్ కవర్ లేదా కాగితాన్ని అతికించవచ్చు.  దీని వల్ల క్లాత్ చిరిగిపోకుండా ఉంటుంది.  సేఫ్టీ పిన్ పెట్టుకోవడం,  తిరిగి తీయడం కూడా సులువే. బీడ్స్.. సేఫ్టీ పిన్ పెట్టుకొనేటప్పుడు చీరకు కానీ,  దుపట్టా కు కానీ నష్టం జరగకూడదు అంటే సేఫ్టీ పిన్ కు బీడ్స్ ఎక్కించాలి.  ఇవి కూడా చాలా  అట్రాక్షన్ గా ఉండే ముత్యాలు,  రంగు రంగుల పూసలను సేఫ్టీ పిన్ కు ఎక్కించి వాడటం వల్ల చూడటానికి చాలా అందంగా కూడా ఉంటుంది. టేప్.. సేఫ్టీ పిన్ ల మధ్య టేప్ ఉపయోగించడం వల్ల సేఫ్టీ పిన్ వల్ల చీరలకు,  దుపట్టాలకు నష్టం జరగదు. టేప్ వల్ల క్లాత్ లో సేఫ్టీ పిన్ లు ఇరుక్కోకుండా ఉంటాయి.                                                      *రూపశ్రీ.

చలికాలంలో చర్మం పగుళ్లా.. ఇదొక్కటి వాడితే మెరిసిపోతారు!

చలికాలంలో చర్మం పగుళ్లా.. ఇదొక్కటి వాడితే మెరిసిపోతారు! చలికాలం  పాటలలోనూ, సినిమాలలోనూ మాత్రమే బాగుంటుంది. కొన్ని సార్లు వేడి వేడి ఆహారం, పకోడిలో, కాల్చిన మొక్కజొన్న పొత్తుల కోసమో చలికాలాన్ని తల్చుకుంటాము. కానీ నిజానికి చలికాలం వచ్చిందంటే పెద్ద పెట్టున చర్మానికి ఎసరు పెడుతుంది. చర్మం పగిలిపోతుంది. కొన్నిసార్లు చర్మం ఎర్రగా మారిపోయి రక్తం కూడా కారుతుంది. ఇంట్లోనుండి అడుగు బయట పెట్టాలన్నా, స్లీవ్ దుస్తులు వేసుకోవాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ వీటన్నింటికి కేవలం ఒకే ఒక్కటి చెక్ పెడుతుంది. అదే తేనె. తేనెను ఆయుర్వేదం అమృతంతో పోలుస్తుంది.తేనెలో ఎన్నోపోషకాలు, మరెన్నో ఔషద గుణాలు ఉన్నాయి. కొన్ని సార్లు తేనెను సౌందర్య సాధానంగా కూడా ఉపయోగిస్తారు. అసలు చలికాలంలో తేనెను ఎందుకు వాడాలి? ఎలా వాడితే చర్మం మెరుస్తుంది? చాలామంది తేనెను ఉదయాన్నే వేడినీళ్లలో వేసుకుని తాగుతుంటారు. కానీ చలికాలంలో తేనెను ముఖానికి రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. తేనె చర్మం మీద లోతుగా పేరుకున్న మలినాలను తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చర్మాన్ని రిపేర్ చేస్తాయి. చర్మం మీద ముడుతలు తగ్గిచడంలో, వాడిన చర్మానికి జీవం ఇవ్వడంలో తేనె ది బెస్ట్. చలికాలంలో ముఖ చర్మం పగలడం వల్ల, చలి కారణంగా చర్మం మీద దురద, మచ్చలు వస్తాయి. కానీ పెరుగులో తేనెను కలిపి రాసుకోవాలి.  లేదంటే శనగపిండిలో తేనె కలిపి ముఖానికి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. దీని వల్ల ముఖ చర్మం మీద మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. ముడతలు పడి వదులుగా మారిన చర్మం తిరిగి బిగుతుగా మారాలంటే  తేనె బెస్ట్ ఫలితాలు ఇస్తుంది. నిమ్మరసం లేదా యాపిల్ సైడర్ వెనిగర్ లో తేనె వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి రాసుకుంటే ఈ ముడతలు పోయి ముఖం యవ్వనంగా మారుతుంది.                                                          *నిశ్శబ్ద.

గర్భధారణ సమయంలో భగవద్గీత చదవితే ఏం జరుగుతుందంటే..!

   గర్భధారణ సమయంలో భగవద్గీత చదవితే ఏం జరుగుతుందంటే..!     భగవద్గీత.. మనిషి జీవితంలో కర్మను తప్పక  అచరించమని, దాని తాలూకు ఫలితాన్ని తప్పించుకోలేరని చెప్పే గ్రంథం.  సత్కర్మల గురించి వివరించేది ఇదే..   కురుక్షేత్ర సంగ్రామానికి ముందు భయానికి,  వ్యాకులతకు,  పిరికితనానికి లోనైన అర్జునుడికి,  శ్రీకృష్ణ భగవానుడు చేసిన బోధనే భగవద్గీత అంటున్నారు.  భగవద్గీత అనగా.. భగవంతుడు స్వయంగా చెప్పిన విషయాలు.   భగవద్గీతలో 18 అధ్యాయములు ఉన్నాయి.  ఈ 18 అధ్యాయములలో 18 యోగములు ఉన్నాయి.  భగవద్గీతను వయసైపోయిన వారు చదవే పుస్తకం అనుకుంటారు చాలా మంది. కానీ మంచి నడవడిక కోసం చిన్న పిల్లల నుండి అందరూ చదవవచ్చు.  ఉగ్గుపాలతో భగవద్గీత సారాన్ని నేర్పిస్తే పిల్లల జీవితం ఆనందమయంగా ఉంటుంది. అంతేకాదు.. గర్భిణి మహిళలు కూడా భగవద్గీత ను చదవవచ్చు. దీని వల్ల జరిగేదేంటో తెలుసుకుంటే.. స్త్రీలు గర్బధారణ సమయంలో తల్లి, బిడ్డల శారీరక మానసిక ఆరోగ్యం కోసం చాలా పనులు చేస్తుంటారు. తీసుకునే ఆహారం దగ్గర నుండి చేసే పనుల వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో మహిళలు  బాధపడకూడదని,  ఎమోషన్ కు గురవ్వకూడదని అంటారు.  అందుకే..  వాళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉండటం కోసం, వారి మనస్సు దృఢంగా ఉండటం కోసం సంగీతం వినడం,  మానసికంగా ఆరోగ్యంగా ఉండే కార్యకలాపాలు చేయడం చేస్తుంటారు. వాటి జాబితాలో భగవద్గీత పఠనం కూడా ఒకటి.  భగవద్గీత పఠనం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. భగవద్గీత గొప్ప ఆధ్యాత్మిక  పుస్తకమే కాదు.. గొప్ప ఫిలాసఫి కూడా ఇందులో దాగుంది.  ఇది మనిషి జీవితంలో లోతైన విషయాలు చాలా సూక్ష్మంగా వివరిస్తుంది. మనిషిలో ఉండే బాధ,  దుఃఖం,  విచారం వంటి వాటిని సున్నితంగా మాయం చేస్తుంది.  మనసు శాంతితో, స్థిరంగా ఉండటంలో సహాయపడుతుంది.  గర్భవతులు ఈ పుస్తకాన్ని చదివితే అది కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా ప్రభావం చూపుతుంది.  తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. గీత శ్లోకాలు చదవడం వల్ల తల్లి మానసిక ఆరోగ్యం పై మంచి ప్రభావం ఉంటుంది. ఇది శారీరక స్థితిని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.  కడుపులో బిడ్డ కూడా ఆరోగ్యంగా పెరుగుతాడు.  ఉట్టి అల్లరి పిల్లవాడు పుట్టాడు.. లాంటి మాటలు ఎదురుకాకుండా ఎంతో గొప్ప ఆలోచనలు, అర్థం చేసుకోగలిగే జ్ఞానం ఉన్నవారిగా పిల్లలు ఎదుగుతారు. భగవద్గీతలో ధర్మం, కర్మ, యోగ, జ్ఞానం వంటి విషయాలు ఎంతో స్పష్టంగా బోధించారు. జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ విషయాలు తెలుసుకుంటే.. అర్థం చేసుకుంటే జీవితం చాలా మారిపోతుంది. ఇవి గర్భవతులు తెలుసుకోవడం వల్ల గర్భం మోసే దశ చాలా హాయిగా గడిచిపోతుంది.  కడుపులో బిడ్డ కూడా ఎలాంటి వికారాలకు లోను కాకుండా, పాజిటివ్ ఆలోచనలతో పుడతారని  చెబుతారు. గర్భధారణ సమయంలో మహిళలలో  హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి.  ఇది ఒత్తిడి,  ఆందోళనను పెంచుతుంది.  ప్రతిరోజూ భగవద్గీత పఠించడం వల్ల మానసిక ఒత్తిడి లేకుండా హాయిగా ఉండగలుగుతారు. గీత శ్లోకాలు మానసిక ప్రశాంతతను,  స్వీయ అంగీకార భావనను పెంపొందిస్తాయి.  ఇవి జీవితంలో ఎదురయ్యే కష్టాన్ని,  సుఖాన్ని,  దుఃఖాన్ని సమానంగా స్వీకరించేలా చేస్తుంది. ఇది గర్భవతులకు చాలా అవసరం. గర్భంలో ఉన్న బిడ్డకు 7 వ  నెల నుండి వినికిడి  శక్తి వస్తుంది.  ఆ సమయంలో భగవద్గీతను గట్టిగా చదవడం లేదా ఆ శ్లోకాల గురించి బిడ్డతో చర్చిస్తున్నట్టు,  బిడ్డకు చెబుతున్నట్టు చేయడం వల్ల గర్బంలో పిల్లల మానసిక భావోద్వేగాలు చాలా నియంత్రణలో ఉంటాయి.                                             *రూపశ్రీ.    

ఉప్పుతో కొన్ని ఉపకారాలు

ఉప్పుతో కొన్ని ఉపకారాలు ఇంట్లో ఇల్లాలికి చిన్నచిన్న చిట్కాలు తెలిస్తే పని సులువు అవుతుంది. శ్రమ తగ్గుతుంది. అలాంటి చిట్కాలలో అందుబాటులో ఉండే ఉప్పుతో కొన్ని ...... 1) మైక్రోఓవెన్ లో వంట చేసేటప్పుడు కొన్నిసార్లు పదార్థాలు పొంగుతాయి. ఆసమయంలో ఓవెన్ అంతా శుభ్రం చెయ్యాలంటే పెద్దపనే - పైగా పదార్థాలు కాలిన వాసన ఓవెన్ లో అలానే ఉంటుంది. అందుకు చెయ్యాల్సిందల్లా పదార్థాలు పడిన చోట కొద్దిగా ఉప్పును చల్లి, పొడి వస్త్రంతో తుడిస్తే చాలు. ఓవెన్ శుభ్రపడడంతో పాటు, పదార్థాలు కాలినవాసన కూడా పోతుంది. 2) టీ, కాఫీ, తాగే కప్పులు మనం తోమినా, అడుగున నల్లగా మరకలు కట్టి ఉంటాయి. ఆ కప్పుల్లో చిటికెడు ఉప్పు వేసి, శుభ్రం చేస్తే కొత్త వాటిల్లా మెరుస్తాయి. గాజు, పింగాణి పాత్రలని ఇలా ఉప్పుతో శుభ్రం చేస్తే తెల్లగా మెరుస్తాయి. 3) అందానికి ఫ్లవర్ వాజ్ లలో పెట్టే ప్లాస్టిక్ పూలకి దుమ్ము పడితే, వాటిని నీటితో శుభ్రం చేసేకంటే ఒక ప్లాస్టిక్ కవరులో గుప్పెడు ఉప్పు వేసి, ఈ పువ్వులని కవరులో పెట్టి బాగా అటుఇటు కదిపితే, పువ్వులకి ఉండే మురికి వదులుతుంది. పువ్వులు కొత్తవాటిల్లా కనిపిస్తాయి.   4) టూత్ బ్రష్షులలో బ్యాక్టీరియా చేరుతుందని మీకు తెలుసా ? ఆ బ్యాక్టీరియా వల్ల దంతాలకు ఎంతో హాని జరుగుతుంది. అలా కాకూడదు అంటే వారానికి ఒక్కసారైనా ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిలో బ్రష్షులని వేసి ఒక 15 నిముషాలు ఉంచి కడగాలి. 5) వంటింటి గట్టు, డైనింగు టేబుల్ వంటివి ఉప్పు కలిపిన నీటితో శుభ్ర పరిస్తే ఈగల సమస్య ఉండదు. 6) ఒక మగ్గు నీటిలో గుప్పెడు ఉప్పు వేసి, ఆ నీటితో కిటికీ అద్దాలను, కారు అద్దాలను, డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలను తుడిస్తే మిలమిలా మెరుస్తాయి. 7) ఆపిల్ ని కట్ చేసాక గాలికి వదిలేస్తే ఎర్రగా మారుతుంది. అదే చిటెకెడు ఉప్పువేసిన నీటిలో ఆపిల్ ముక్కలను వేస్తే రంగు మారకుండా ఉంటాయి. 8) ఇంట్లో ఎక్కడైనా చీమలు వస్తే ఆ చుట్టుపక్కల ఉప్పుతో ఒకగీతను గీయండి, చీమలు ఆ ఉప్పుగీతను దాటి రావు. 9) ఇంట్లో ఉన్న కార్పెట్లను శుభ్రం చేయాలంటే ముందురోజు రాత్రి ఆ కార్పెట్లమీద ఉప్పును చల్లండి. మర్నాడు కార్పెట్ ని వాక్యూం క్లీనర్ తో క్లీన్ చేస్తే కార్పెట్లు ఫ్రెష్ గా ఉంటాయి. చెడువాసనలు ఏమైనా ఉంటే పోతాయి.   10) కొత్తబట్టలని మొదటిసారిగా ఉతికేటప్పుడు ఉప్పువేసిన నీటిలో నానబెట్టి ఉతికితే రంగులు పోకుండా ఉంటాయి. -రమ

సుగంధ నూనెలతో ఇల్లు పరిమళభరితం

సుగంధ నూనెలతో ఇల్లు పరిమళభరితం ఇల్లు పరిమళభరితంగా ఉంటే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. ఐతే కొన్నిసార్లు వంట చేసిన తరువాత ఏర్పడే ఘాటు వాసనలతో, గాలి, వెలుతురు లేక ఏర్పడే దుర్వాసనలతో ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. అటువంటి సమస్యలని రసాయనాలతో కాకుండా సుగంధ నూనెతో పరిష్కరించుకోవచ్చు. 1. అరబకేట్ నీటిలో పావుకప్పు వెనిగర్, పెద్ద చెంచా నిమ్మరసం నూనె కలిపి గదిలో కాస్త చల్లితే.. గదిలోని వంట వాసనలు పోయి హాయి వాతావరణంతో నిండిపోతుంది. 2. కార్పెట్లు మురికిగా మారి దుర్వాసన వస్తుంటే.... కప్పు బేకింగ్ సోడాకి, చెంచాడు ఏదైనా సుగంధ నూనేలని కలపాలి. ఈ మిశ్రమాన్ని కార్పెట్ పై చల్లి తెల్లారి వాక్యుమ్ క్లీనర్ తో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. 3. కిటికీ అద్దాలు దుమ్ముపట్టి ఉంటే కప్పు వెనిగర్ కి చెంచా లావెండర్ పరిమళన్ని జోడించి తుడిస్తే సరి. అవి తలుక్కుమనడమే కాకుండా సువాసనభరితంగా కూడా ఉంటాయి. 4. వంట చేసిన తరువాత గది అంతా ఆవరించే ఘాటు వాసనలు తొలగిపోవడానికి ఒక గిన్నె నిండా నీళ్ళు తీసుకొని దానిలో దాల్చిన చెక్కని వేసి మరిగిస్తే గది చక్కని పరిమళాలు వెదజల్లుతుంది. 5. దుస్తులు ఒక్కచోట పోగుపడి.. ముక్కిపోయిన వాసన వస్తుంటే ఎండలో ఆరవేయ్యాలి. వీలుకానప్పుడు నిమ్మ, లావెండర్ వంటి ఏదైనా పరిమళంలో ఒక జేబు రుమాలుని ముంచి దానిని దుస్తుల మధ్య ఉంచితే సరిపోతుంది.

మహిళలూ ఆర్థిక విషయాల్లో జాగ్రత్త తప్పనిసరి!

మహిళలూ ఆర్థిక విషయాల్లో జాగ్రత్త తప్పనిసరి! మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. నేటికీ కొంతమంది మహిళలు ఆర్థికపరమైన విషయాల్లో తండ్రి, సోదరుడు, భర్త...ఇలా ఎవరొకరిమీద ఆధారపడుతుంటారు. ఆర్థికపరమైన అంశాలపట్ల సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణమంటున్నారు నిపుణులు. ఇంకొంతమంది మహిళలు తాము సంపాదించిన మొత్తాన్ని పరిస్థితులకు అనుగుణంగా తమ భర్త చేతిలో పెట్టడం వల్ల చిన్న చిన్న అవసరాలకు కూడా వాళ్ల వద్ద చేయి చాచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా చేతినిండా సంపాదన ఉన్నా...చాలా మంది మహిళలు ఆర్థికపరంగా నేటికీ పురుషులపై ఆధారపడాల్సి వస్తుంది. అయితే ఇకనైనా మేల్కోని ఈ ధోరణిని మార్చుకోవాలి. లేదంటే అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పవు. ఈ క్రమంలో వివాహం జరిగినప్పటినుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని చెబుతున్నారు. ఉద్యోగం మానకూడదు: కొంతమంది వ్యక్తిగత కారణాలు, కుటుంబ పరిస్థితుల కారణంగా అప్పటివరకు తాము చేస్తోన్న ఉద్యోగానికి రాజీనామా చేస్తుంటారు. ఇంకొంతమంది సంపాదించాల్సిన అవసరం లేదని ఈ నిర్ణయం తీసుకుంటారు. ఈ రెండూ కూడా ఆర్థికంగా చేటు చేసే నిర్ణయాలే అని చెబుతున్నారు నిపుణులు. మొదట్లో బాగానే ఉన్నా తర్వాత భవిష్యత్తులో ప్రతి చిన్న అవసరానికీ భర్త మీదే ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి పెళ్లైనా ఉద్యోగం మానకపోవడమే మంచిది. తద్వారా భవిష్యత్తులో ఒంటరిగా జీవించాల్సి వచ్చినా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అవగాహన పెంచుకోవాలి: ఆర్థిక విషయాల్లో పెళ్లికి ముందు తండ్రిపై...పెళ్లి తర్వాత భర్తపై ఆధారపడే అమ్మాయిలు ఈ కాలంలో చాలా మంది ఉన్నారు. ఆర్జన వరకు బాగానే ఉన్నా...డబ్బు పొదుపు మదుపు విషయాల్లో అవగాహన లోపమే దీనికి కారణం. అయితే ప్రతి చిన్న దానికీ ఇతరులపై ఆధారపడటం వల్ల వాళ్లు అందుబాటులో లేనప్పుడు ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది. కాబట్టి డబ్బులను ఎందులో పొదుపు చేయాలి లాభాలు ఆర్జించాలంటే వేటిలో పెట్టుబడులు పెట్టాలనే ప్రథమిక విషయాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం అంటున్నారు నిపుణులు అలాని ఒకేసారి అన్ని విషయాల గురించి తెలుసుకోవడం ఎవరితోనూ సాధ్యం కాదు. కాబట్టి నిపుణుల సలహాలు పాటిస్తూ ఉండాలి. ఇవి కూడా గుర్తుంచుకోవాలి... మహిళలు తప్పకుండా వైద్య బీమా చేయించుకోని ఉండాలి. అనుకోని అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టకుండా ఉంటుంది. మీ అత్తమామలు, భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఏవైనా పత్రాలపై సంతకం చేయమని అడుగుతే గుడ్డిగా చేయకండి. వాటిని క్షుణ్ణంగా చదివిన తర్వాతే చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోండి. పెళ్లికి ముందు తర్వాత మహిళలకు పుట్టింటివారు మెట్టినింటి వారి నుంచి వచ్చే బహుమతులు, కానుకలు స్త్రీధన్ అంటారు. అవి పెట్టుబడులు, స్థిరాస్తి, చరాస్తి, డబ్బు, బంగారం ఇలా ఏ రూపంలో అయినా ఉండవచ్చు. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లను జాగ్రత్తగా భద్రపరుచుకోవడం ముఖ్యం.  

ప్రెగ్నెన్సీ సమయంలో చర్మం పొడిబారితే.....

  ప్రెగ్నెన్సీ సమయంలో చర్మం పొడిబారితే.....   అమ్మతనం గొప్ప వరం. మాతృత్వాన్ని పొందాలంటే ఎన్నో రకాల సమస్యలను ఎదురుకోక తప్పదు. కొంత మంది నెల తప్పిన దగ్గరనుండి వికారం వాంతులతో బాధపడతారు, మరికొందరికి చర్మం పొడిబారినట్టుగా అయ్యి దురదలు మొదలవుతాయి. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా చర్మాన్ని గోక్కోకుండా ఉండలేరు. దాని ఫలితంగా వచ్చే రేషేస్ ఇంకా చికాకు తెప్పిస్తాయి. అసలీ ఇచ్చింగ్ ఎందుకు వస్తుందా అని ఆలోచిస్తే, మాములుగా ఉన్నప్పటి కన్నా ప్రెగ్నెన్సీ టైంలో మన శరీరంలో కొన్ని హార్మోనియల్ చేంజెస్ రావటం వల్ల  ఇలా చర్మం పొడిబారే అవకాశం ఉంటుంది, దాని వల్ల ఇచ్చింగ్ వస్తుంది. అదీకాక చర్మం సాగుతూ ఉండటం వల్ల చర్మానికి తగినంత తేమ అందక దురదలు వచ్చే అవకాశం ఉంది. దీని ప్రయవసానమే కడుపు మీద చారలు ఏర్పడి అవి ఎప్పటికి అలానే ఉండిపోతాయి. ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోయి మీరు హాయిగా మాతృత్వపు ఆనందాన్ని అనుభవించాలంటే ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కొన్ని చిట్కాలు పాటించాలి.      * ఎక్కువ మందికి కడుపు మీద లేదా మొహం మీద చర్మం పొడిగా అవుతుంది. చర్మం పొడిబారుతోంది అని అనిపించిన దగ్గర నుండి ఆలివ్ ఆయిల్ మసాజ్ చేసుకుంటే మంచిది. రెండు మూడు చుక్కల ఆలివ్ ఆయిల్లో కాసిని నీళ్ళు కలిపి దానిని కావాల్సిన చోట రాసుకుంటూ ఉంటే సరిపోతుంది.       * అలాగే వెన్న కూడా ఈ సమస్యకి మంచి పరిష్కారం చూపిస్తుంది. ఇంట్లో వెన్న ఉన్నా లేదా పాల మీగడ ఉన్నా దానిని చర్మానికి రాసుకుంటే త్వరిత ఫలితం కనిపిస్తుంది.   * రోజూ వాడే సబ్బులు కూడా చర్మం పొడిబారటానికి కారణం అవుతాయి. అందుకే కెమికల్స్ ఎక్కువగా ఉండే సబ్బులు వాడకుండా జాగ్రత్త పడాలి. సబ్బులకి బదులు ఆపిల్ సైడర్ వెనిగర్ వాడటం మంచిది. దీనిని నీటిలో వేసి ఆ నీళ్ళతో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.   * పొడి చర్మాన్ని పోగొట్టటానికి పెరుగు కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఎక్కడయితే చర్మం పొడిగా ఉందో  అక్కడ పెరుగు రాసుకుని ఒక 10నిమిషాలు ఉంచి తరువాత కడిగేసుకుంటే చాలు.   * ఎక్కువగా వేడి ఉన్న నీళ్ళు కాకుండా కాస్త గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయటం వల్ల చర్మం పొడి బారకుండా ఉంటుంది.   * చర్మం పొడిబారిపోయి గరుకుగా తయారయితే. రెండు కోడిగుడ్ల తెల్లసొనలో పావు కప్పు జొన్నపిండి, నాలుగు చెంచాల చక్కెరపొడి వేసి కలిపి రాసుకుని బాగా ఆరిన తరువాత కడిగేసుకుంటే చాలు.   * స్నానం తర్వాత చర్మం తడిపొడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్‌ రాసుకోండి. అందువల్ల చర్మం ఎక్కువ సమయం తేమగా ఉంటుంది. అప్పుడు దురదలు కూడా రావు.   * అన్నిటికన్నా ముఖ్యమైనది ఎక్కువగా నీళ్ళు తాగటం. మాములుగా ఉన్నప్పటికన్నా ప్రెగ్నేన్సీ తో ఉన్నప్పుడు నీళ్ళు మరిన్ని తాగాలి. అప్పుడు చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది.   ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అలాగే ఈ పొడిబారే చర్మానికి కూడా ఇలా చాలా నివారణా మార్గాలు ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి పాటించి ఇంట్లోనే  మన సమస్యని మనమే దూరం చేసుకుని హాయిగా ఉండచ్చు. ...కళ్యాణి

పనులు పెండింగ్ లో పడుతున్నాయా

పనులు పెండింగ్ లో పడుతున్నాయా     చెయ్యాలనుకునే పనుల లిస్టు పెరుగుతూ మీకు టెన్షన్ తెచ్చిపెడుతోందా. అయితే కొన్ని కిటుకులు పాటిస్తే చాలు,పనులన్నీ చకచకా అయిపోయి మీ టెన్షన్ ని దూరం చేస్తాయి. దీనికోసం ముందుగా మనం చెయ్యాలనుకున్న పనుల జాబితా మన బుర్రలో కాకుండా ఒక పేపరుపై పెట్టి వరుసగా రాసుకోండి. అందులో ఇంటికి సంభందించిన పనులన్నీ ఒక వైపు,బయటకెళ్ళి చెయ్యాల్సినవి మరో వైపు, అలాగే ఇంట్లో వాళ్ళ సహాయంతో చేసేవి ఇంకోవైపు చక్కగా డివైడ్ చేసి పెట్టుకోండి. ఇలా డివైడ్ చేసుకోవటం వల్ల మనం చెయ్యాల్సిన పనులపట్ల ఒక అవగాహన ఏర్పడుతుంది.       ఇంట్లో చెయ్యాల్సిన పనులలో దేనికి ఎక్కువ ప్రిఫెరెన్సు ఇవ్వాలనుకుంటున్నారో దాని మీద ముందుగా దృష్టి పెట్టండి. ఇలా మన ప్రిఫెరేన్సు కి అనుగుణంగా పనుల లిస్టులో కాస్త మార్పులు చేర్పులు చేసుకోవటం వల్ల పనులు తొందరగా అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అన్ని పనులని ఒకేసారి తలచుకోవటం వల్ల వచ్చే అలజడి తగ్గి మనకు తెలియకుండానే పనులు చకచకా అయిపోతాయి. ఇక బయట చెయ్యాల్సిన పనుల లిస్టులో కూడా ఆ పనుల కోసం వెళ్ళాల్సిన ప్లేస్ పేరు పక్కన రాసుకోండి. ఎక్కువగా ఏ ప్లేస్ కి వెళితే చాలా  పనులు పూర్తి చెయ్యచ్చో మనకి క్లియర్ గా అర్ధమవుతుంది. దానికి తగ్గట్టుగా వెళితే మన లిస్టులో పనులూ తగ్గుతాయి. మీకున్న పనులకి ఇంట్లో వాళ్ళ సాయం కూడా తోడయితే ఇంకా హాయి కదా. మొహమాటం పక్కన పెట్టి కాస్త ఆప్యాయంగా అడిగి చూడండి. చేసే పనులు ఎన్ని ఉండి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని దానికి అనుగుణంగా వెళితే కొండంత పనయినా చిటికెలో చేసి చూపించే సత్తా మీ సొంతమవుతుంది.   ..కళ్యాణి 

ప్రత్యేకంగా కనపడండిలా

ప్రత్యేకంగా కనపడండిలా   నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలంటే దుస్తులతో పాటు యాక్ససరీస్ మీదా కూడా శ్రద్ధ పెట్టాల్సిందే. అతి మామూలుగా డ్రస్ వేసుకున్నా నప్పే యాక్ససరీస్ ఉపయోగిస్తే ఎంతో అందగా కనిపిస్తారు. మరి ఆ యాక్ససరీస్ని ఎంచుకునే సమయంలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఏమిటో చూద్దాం. * హేండ్ బ్యాగులని మన శరీరాకృతిని దృష్టిలో పెట్టుకొని కొనుక్కోవాలి. కాస్త ఎత్తు తక్కువ ఉండేవారు పెద్ద బ్యాగుల జోలికి వెళ్లద్దు. అలాగే సన్నగా ఉన్నవారికి వెడల్పాటి బ్యాగులు కన్నాగుడ్రంగా ఉండే బ్యాగులే బాగా నప్పుతాయి. * మెడలో ధరించే నగల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం. ఎత్తు తక్కువ ఉన్నప్పుడు, లేదా లావుగా  ఉన్నప్పుడు మెడకు దగ్గరగా ఉండే నెక్లెసులు, చోకర్లు అంతగా నప్పవు. సన్నగా, పొడవుగా ఉండే చైన్స్ అయితే బాగుంటాయి. అదే మెడ సన్నగా, పొడుగ్గా ఉన్నవారు మెడకి దగ్గరగా ఉండే గొలుసులు వేసుకుంటే బావుంటుంది. * చెప్పులు ఎప్పుడూ మనం వేసుకున్న డ్రస్ ని డామినేట్ చేయకూడదు. వీలయితే మ్యాచింగ్ వేసుకోవచ్చు. లేదంటే బ్రౌన్, బ్లాక్ వంటి సాధారణ రంగుల్లో ఉంటే బాగుంటుంది. * ఆకర్షణీయమైన డ్రస్ వేసుకున్నప్పుడు చెవులకు కొంచం పెద్ద హేంగింగ్స్ పెట్టుకొని, మెడలో మాత్రం సింపుల్ చైన్ వేసుకుంటే బావుంటుంది. అదే డ్రస్ సింపుల్ గా ఉన్నప్పుడు గొలుసు కొంచం గ్రాండ్ గా ఉంటే బావుంటుంది. * చేతికి బంగారం గాజులు, మెడలో ముత్యాలు, ఇలా వైవిధ్యంగా కాకుండా అన్నీ ఒకేలా ఉండేటట్టు చూసుకోవాలి. యాక్ససరీస్ లో మీదైన ఓ శైలిని ఏర్పరచుకుంటే నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. ప్రత్యేకంగా ఒకే రకమైన బ్యాగులు, నగలు, వంటివి మీదంటూ ఓ ముద్ర వేసేలా చేస్తాయి. మరి మీ స్టైల్ స్టేట్ మెంట్... ఎలా ఉండాలో నిర్ణయించుకోండి. -రమ

మరకలు పోవాలంటే ఇలా...

మరకలు పోవాలంటే ఇలా...     మనం ఎంతో ఇష్టపడి కొనుక్కునే బట్టలపై ఒక్కొక్కసారి అనుకోకుండా పడే మరకలు మనని ఎంతో  బాధపెడతాయి. వాటిని చూసి బాధపడటం మానేసి ఇంట్లో దొరికే వస్తువులతోనే ఎంతో సులువుగా మరకను పోగొట్టి మళ్ళీ మన ఆనందాన్ని తిరిగి తెచ్చుకోవచ్చు. తుప్పు మరకల బట్టలని తీగల మీద లేదా రాడ్స్ మీద ఆరేసేటప్పుడు ఒక్కోసారి తుప్పు అంటుకుని మరక పడుతుంది. ఆ మరకలు పోవాలంటే నిమ్మకాయ రసంతో,లేదా ఉప్పు కలిపిన నిమ్మరసంతో బాగా రుద్ది ఎండలో వేయాలి. ఇలా రెండు సార్లు చేస్తే చాలు మరక మాయం అవుతుంది. నూనె మరకలు బట్టలపై పడే నూనె మరక అంత సులువుగా పోదు. అందుకనే నూనె పడిన వెంటనే ముందుగా పాత న్యూస్ పేపర్ ఆ మరకపై వేసి గట్టిగా వత్తాలి. తర్వాత వేడినీళ్ళు పోస్తూ సబ్బుతో రుద్దితే చాలు. కాఫీ కప్పులపై పడే మరకలు ఎంతో ఖరీదు పెట్టి కొనే కప్పులపైన మరకలు పడి  అవి పోవాలంటే వెంటనే ఆ కప్పుని తడిపితే చాలు లేదా ఎండిపోయిన మరక పోవాలంటే మాత్రం బైకార్బోనేట్ సోడా మిశ్రమంతో తుడిస్తే ఇట్టే పోతాయి.   పెయింట్ మరకలు బట్టలపై పెయింట్ మరక పడితే ఆ మరకపై బ్లాటింగ్ పేపర్ వేసి దానిపై ఇస్త్రీ చెయ్యాలి. ఆ వేడికి మరక కరిగి బ్లాటింగ్ పేపర్ కి అంటుకుంటుంది. ఆ తర్వాత మరక మీద కొంచం టాల్కం పౌడర్ చల్లి కాసేపు వెయిట్ చేసి ఆ పేపర్ ని దులిపితే పౌడర్ తో పాటే మరక కూడా వదిలిపోతుంది. బాల్ పెన్  ఇంకు మరకలు పిల్లల స్కూల్ యూనిఫారం కి తరచూ బాల్ పెన్ మరకలు మనం చూస్తూ ఉంటాం. అలాంటివి పోవాలంటే టూత్ పేస్ట్ గాని, నిమ్మరసం గాని,బ్రాంది లేదా విస్కీ చుక్కలు వేసి రుద్దితే ఆ మరకలు పోతాయి.     పట్టుచీరలపై మరకలు ఎంతో  ఖరీదు పెట్టి కొనుక్కునే పట్టుచీరల మీద మరక పడితే బాదెందుకు? వెంటనే పెట్రోల్ తో రుద్దితే మరక పోతుంది. డ్రై క్లీనింగ్ కి కూడా ఇవ్వక్కర్లెద్దు. చూసారా! ఇన్ని తరుణోపాయాలు మన ముందే ఉంటే మరకను చూస్తే టెన్షన్ అవసరమంటారా?                                                                                                 ----కళ్యాణి

ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుందో నవరాత్రులు తెలియజేస్తాయి!

ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుందో నవరాత్రులు తెలియజేస్తాయి! దేవీ నవరాత్రుల వెనుక కేవలం అమ్మవారి ఆరాధన మాత్రమే కాదు.. అమ్మవారి నవదుర్గ రూపాలతో ఆడపిల్లల జీవితానికి చాలా అనుబంధం ఉంది.  ముఖ్యంగా అమ్మవారి తొమ్మిది రూపాలు ఆడపిల్లల జీవితాన్ని వ్యక్తం చేస్తాయి. శైలపుత్రి..  ఆడపిల్ల  మొదటి రూపం. ఆడపిల్ల పుట్టినప్పుడు  శైలపుత్రి అంటారు. ఈ దశలో తల్లిదండ్రులు ఆడపిల్లను జాగ్రత్తగా చూసుకుంటారు. బ్రహ్మచారిణి.. ఆడపిల్ల జీవితంలో రెండవ దశను ఈ  రూపం సూచిస్తుంది. ఈ దశ ఆడపిల్ల  బాల్యం నుండి యుక్తవయస్సుకు మారడాన్ని సూచిస్తుంది. చంద్రఘంట..  వివాహం వయసుకు వచ్చిన ఆడపిల్లను చంద్రఘంట దేవి తో పోలుస్తారు. వివాహం తర్వాత ఈ రూపాన్ని తీసుకుంటుంది. కూష్మాండ.. ఆడపిల్లలు వైవాహిక జీవితంలోకి ప్రవేశించిన తర్వాత  తన కుటుంబంతో ప్రేమ, అభిమానం, ఆప్యాయతను పెంచుతూ వెలుగును పంచుతుంది. స్కందమాత.. వివాహం అనంతరం ఒక ఆడపిల్ల స్వయంగా తల్లి అయినప్పుడు ఆమెను స్కందమాతకు ప్రతిరూపంగా పూజిస్తారు. కాత్యాయని.. ఆడపిల్ల కుటుంబాన్ని రక్షించడానికి, ప్రతికూలత నుండి విముక్తి చేయడానికి శ్రమించడం కాత్యాయని అమ్మ రూపంలో స్పష్టంగా ప్రస్ఫుటం అవుతుంది. కాళరాత్రి.. మహిళల జీవితంలో ఇబ్బందులు,  ప్రతికూల శక్తులను దైర్యంగా ఎదుర్కోవడం, వాటిని నాశనం చేయడంలో కాళరాత్రి రూపాన్ని దర్శించవచ్చు. మహాగౌరి.. జీవితం చివరి దశలో స్వచ్ఛత, త్యాగానికి ప్రతీకగా మహాగౌరి గోచరిస్తుంది. సిద్ధిదాత్రి.. ఆడపిల్ల జీవితాన్ని సంతోషంగా గడిపి చివరకు ముక్తిని పొందే రూపం సిద్ధిదాత్రి.