సైనికులకు సలాం చేస్తున్న జయ `జై- హింద్`! (ఆగస్టు 15 స్పెషల్)
posted on Aug 15, 2024
సైనికులకు సలాం చేస్తున్న జయ `జై- హింద్`!
వాళ్లు ఎండావానలకి చలించరు, కొండాకోనలకి తలవంచరు. పచ్చదనమే ఎరుగని ఎడారిలో ఉన్నా, నేలనేది కనిపించని నడిసంద్రంలో ఉన్నా... వాళ్ల మనసుల్లో ఒకటే ఆలోచన, వాళ్ల జీవితాల్లో ఒకటే లక్ష్యం, వాళ్ల చేతల్లో ఒకటే తపన - అదే దేశ రక్షణ! మన భద్రతా దళాల గురించి ఇలా ఎన్ని విషయాలు చెప్పుకున్నా, చెప్పాల్సింది ఇంకా మిగిలిపోయినట్లే తోస్తుంది. వారికి ఎన్ని వేల కృతజ్ఞతలు అందించినా, మిగిలిపోయే రుణం ఏదో ఉంది. అందుకే వారి ఔన్నత్యం గురించి ప్రజలకు తెలిపేందుకు, వారి మనసులోని మాటలను మనకి చేరవేసేందుకు ఒక కార్యక్రమాన్ని రూపొందించారు `జయపీసపాటి`. అదే జై - హింద్!!!
హాంగ్‌కాంగ్ నుంచీ
తెలుగువారందికీ ఆత్మీయవారథిగా నిలిచేందుకు `టోరీ` అనే ఇంటర్నెట్ రేడియోని మొదలుపెట్టింది `తెలుగువన్` సంస్థ. అందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఉన్నచోట నుంచే కార్యక్రమాలను నిర్వహిస్తూ టోరీని విజయవంతం చేశారు. హాంగ్‌కాంగ్ నుంచి కార్యక్రమాన్ని నిర్వహించే జయపీసపాటి వారిలో ఒక్కరు. అప్పటికే జయ హాంగ్‌కాంగ్‌లో ఉంటున్న తెలుగువారికోసం కె.పి.రావు దంపతులతో కలిసి `హాంక్‌కాంగ్ తెలుగు సమాఖ్య` అనే సంస్థను ఏర్పాటు చేశారు. వందకు పైగా తెలుగు కుటుంబాలకు ఆ సమాఖ్య ఒక వేదికగా ఉంది.
సైనికుల కోసం ఏదన్నా
మొదట్లో జయపీసపాటి శని, ఆదివారాల్లో రెండేసి గంటల పాటు రేడియో కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ఇవన్నీ సరదాసరదాగా సాగిపోయేవి. కానీ దాంతో ఆమెకు ఎందుకో తృప్తి కలగలేదు. జయకు చిన్నప్పటి నుంచి సాయుధదళాలకు అనుబంధంగా పనిచేయాలనే కోరిక తీవ్రంగా ఉండేది. అదెలాగూ సాధ్యపడలేదు. కనీసం మన చీకటి రాత్రులు సురక్షితంగా ఉండేందుకు తమ జీవితాలను వెలిగిస్తున్న సైనికుల కోసం ఏదన్నా చేయాలన్న పట్టుదలతో ఉండేవారు. సైనికుల గురించి ఎక్కడో స్కూళ్లలోనో, కాలేజీల్లోనో చెప్పడం తప్ప మిగతా మాధ్యమాలు అంత శ్రద్ధ వహించడం లేదని గ్రహించారు జయ. దేశం కోసం తమ ఆశలను పణంగా పెట్టిన వారి మనసులో ఏముంటుంది! ఆ ఉన్నత భావాలు మిగతా ప్రజలకు చేరితే అవెంత ప్రభావవంతంగా ఉంటాయో కదా అనిపించింది ఆమెకు! అలా రూపుదిద్దుకున్నదే `జై- హింద్` కార్యక్రమం!
సైనికులు మాట్లాడితే
`జై-హింద్` కార్యక్రమం గురించిన ఆలోచనను చెప్పగానే చాలా ప్రశ్నలు వచ్చాయి. ఒక చిన్నపాటి కార్యక్రమంలో మాట్లాడేందుకు సైనికులు ఒప్పకుంటారా! ఒకవేళ వాళ్లు ఒప్పుకుని ఏదన్నా మాట్లాడినా అది చట్టాన్ని ఉల్లంఘంచినట్లు కాదా! సెలబ్రిటీలు కాకుండా ఎవరో సైనికులు మాట్లాడితే వినేది ఎవరు!... లాంటి సవాలక్ష సవాళ్లను జయ ఎదుర్కొన్నారు. కానీ జయ వాటన్నింటినీ దాటి విజయం సాధించారు. సెలబ్రిటీలు మాట్లాడితే ఆసక్తితో వింటారనీ, సైనికులు మాట్లాడితే అభిమానంతో వింటారనీ నిరూపించారు.
మూడేళ్ల విజయం
2012 మధ్యకాలంలో మొదలైన జైహింద్ కార్యక్రమం ఇప్పటికి మూడు సంవత్సరాలను విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఈ మూడు సంవత్సరాల ప్రయాణం ఏమంత తేలికగా సాగలేదు. మొదట్లో... సైనికులను ఎలా సంప్రదించాలి. మాటల సందర్భంలో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా ఎలా మెలగాలిలాంటి సమస్యలెన్నో ఆమె ఎదుర్కొన్నారు. పైగా జయకు ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. భర్త ఉద్యోగరీత్యా తరచూ ప్రయాణాలు చేయాల్సి రావడంతో, ఆ ఇద్దరి పిల్లల బాధ్యతనీ పూర్తిగా చూసుకోవాల్సి వచ్చేంది. పైగా తాను ఒక పాఠశాలలో పనిచేస్తున్నారు. ఇన్ని బాధ్యతల మధ్య కూడా, ఆమెకు దేశం పట్ల ఉన్న నిబద్ధతే `జై-హింద్` కార్యక్రమాన్ని ముందుకు నడిపించింది.
నొప్పించక తానొవ్వక
`జై-హింద్` కార్యక్రమం కేవలం సైనికులతో సరదాగా సాగిపోయే సంభాషణలా ఉండదు. వారి నేపథ్యం ఏమిటి, సైనికదళాలలో చేరేందుకు వారిని పురికొల్పిన పరిస్థితులు ఏంటి, వారి అభిరుచులు, కుటుంబం... వంటి విషయాలను చర్చిస్తూనే వాటిని తిరిగి శ్రోతలకు తెలుగులో చెబుతారు జయ. ఒకవైపు సైన్యంలో ఉండే దళాలు ఎంతటి కష్టనష్టాలను ఎదుర్కొంటాయో తెలియచేస్తూనే, సైన్యంలో ఉండేవారికి ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సందర్భానుసారంగా వివరిస్తుంటారు. సైనికులతో ఒకో ముఖాముఖి సాగే కొద్దీ `నొప్పించక తానొవ్వక` రీతిలో సంభాషణను సాగించే నేర్పు జయకు పూర్తిగా అలవడిపోయినట్లే తోస్తుంది. సైనికుల బాధ్యత ఒక్క సరిహద్దులకే పరిమితం అనుకునే సామాన్యలకు, సైన్యం అందించే సేవలు విని ఆశ్చర్యం కలుగుతుంది. ఉదా|| ప్రభుత్వ రంగ ఉద్యోగులు ఏదన్నా సమ్మెను చేపడితే, దానివల్ల రవాణా ఆగిపోకుండా ఉండేందకు `రైల్వే టెరిటోరియల్ ఆర్మీ` సదా సిద్ధంగా ఉంటుందన్న విషయం చాలామందికి తెలియదు. సైన్యానికి చేతులెక్కి మొక్కాలనిపించే ఇలాంటి విషయాలు కోకొల్లలుగా `జై-హింద్`లో వినిపిస్తాయి.
కార్యక్రమం తీరుతెన్నలు:
సైనికుల కోసం జరిగే `జై-హింద్` జాతీయ గేయంతో మొదలై, జాతీయ గీతంతో ముగియడం సముచితంగా తోస్తుంది. మన కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా వెనుకాడరు సైనికులు. అందుకే వారు నిండునూరేళ్లూ జీవించాలంటూ, ఈ కార్యక్రమం ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలను అందచేస్తారు. ఆ తరువాత ప్రోగ్రాంలోకి విచ్చేసే విశిష్ట అతిథులు చెప్పే విషయాలకు మనసంతా దేశభక్తితో నిండిపోతుంది. మధ్యమధ్యలో మంచిమంచి పాటలూ వినవస్తాయి, శ్రోతల ప్రశ్నలూ కార్యక్రమానికి మరింత వన్నె తెస్తాయి. ఇందులో పాల్గొనే ప్రతి ఒక్క సైనికుడూ ప్రత్యేకమే! మన సికిందరాబాదులోనే పనిచేస్తున్న మేజర్ నిషాసింగ్ చిన్ననాటి కబుర్లు; కార్గిల్ పోరులో కాలు పోగొట్టుకుని, రెండు సంవత్సరాలు ఆసుపత్రిలో గడిపినా కూడా మారథాన్లో పాల్గొంటున్న మేజర్ డి.పి.సింగ్ పోరాటం; కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన కేప్టన్ సౌరభ్ కాలియా గురించి ఆయన తండ్రి ఎన్.కె.కాలియా పంచుకున్న జ్ఞాపకాలు... ఇలా ఒక్కో కార్యక్రమం ఒక్కో స్ఫూర్తిచిహ్నంగా మిగిలిపోతుంది.
జయపీసపాటి నిర్వహించే ఈ కార్యక్రమం గురించి జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో వార్తలు వచ్చాయి. `జై-హింద్` అనే కార్యక్రమం ఒకటి నడుస్తోందని అందరికీ తెలిసింది. కానీ ఎవ్వరికీ తెలియకుండా... జరుగుతున్న ఓ నిశ్శబ్ద విప్లవం కూడా ఉంది. బతికితే రాజాలాగానే బతకాలి, సంపాదిస్తే లక్షల్లోనే సంపాదించాలి అనుకునే యువత దీని నుంచి ప్రభావితం అవుతోంది. ఏదో ఒక రోజున ఒక సైనికుడిని `మీరు సైనికుడిగా ప్రేరణ కలిగించిన సందర్భం ఏంటి?` అని జయపీసపాటి అడిగితే `మీ కార్యక్రమాన్ని వినే సైనికుడిగా మారాలనుకున్నాను` అని ఎవరన్నా చెప్పే రోజు కూడా వస్తుందేమో! - జై - హింద్!!!
- నిర్జర.