ఏ దేశమేగినా తప్పని వేధింపులు

ఏ దేశమేగినా తప్పని వేధింపులు

 

ఆడది అర్ధరాత్రి నిర్భయంగా సంచరించడం గురించి గాంధీగారు చెప్పిన మాటలు సరేసరి... కనీసం పట్టపగలు ప్రయాణం చేసే పరిస్థితులు ఉన్నాయా అని అనుమానం కలిగే స్థితిలో ఉన్నాం. ఒళ్లు గగుర్పొడిచే అత్యాచారాలు ఎన్ని జరుగుతున్నా, అలాంటి ఘటనలు ఇక మీదట జరగవంటూ ప్రభుత్వాలు భరోసాను అందిస్తున్నా... పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పూ రావడం లేదు. ఈ విషయాన్ని ధృవీకరించేందుకు బ్రిటన్‌కు చెందిన ‘యాక్షన్‌ ఎయిడ్‌’ అనే సంస్థ ఓ పరిశోదనను నిర్వహించింది. బ్రిటన్‌, ధాయ్‌లాండ్‌, బ్రెజిల్, ఇండియా... ఈ నాలుగు దేశాలలోనూ యాక్షన్‌ ఎయిడ్‌ కొన్ని గణాంకాలను సేకరించింది. సంపన్న దేశాలు మొదల్కొని, పేదరికపు అంచున ఉన్న ప్రాంతాల వరకూ స్త్రీలను వేధించడంలో ఏ దేశమూ వెనక్కి తగ్గడం లేదని ఈ గణాంకాలు తెలియచేస్తున్నాయి. ఈ నాలుగు దేశాలలోనూ నలుగురిలో ముగ్గురు ఆడవారు ఏదో ఒకరకమైన లైంగిక వేధింపుని ఎదుర్కొంటున్నారని తేలింది. దీంతో ఆడవారిని వేధించడం అనేది ఒక అంటువ్యాధిలా మారిపోయిందని యాక్షన్‌ ఎయిడ్‌ హెచ్చరిస్తోంది.

 

అసభ్యమైన పదాలు వాడటం, ఈలలు వేయడం, ఇబ్బంది కలిగించేలా చూడటం... ఇలా ఏదో ఒక తీరున ఆడవారిని వేధించడం మామూలైపోయింది. ఇరుకు సందుల దగ్గర్నుంచీ ప్రభుత్వ రవాణాల వరకూ... స్త్రీలు నడిచే ప్రతిదారిలోనూ వారికి వేధింపులు తప్పడం లేదని ఈ పరిశోధనలో తేలింది. ఇక అత్యాచారాల సంగతీ సరేసరి. హైస్కూలు కూడా దాటక ముందే బ్రెజిల్‌లో 22 శాతం మంది బాలికలు అత్యాచారానికి లోనవుతున్నారట. కాస్త మంచి బట్టలు వేసుకుని బయటకు రావడానికి కూడా భయపడుతున్నామని అక్కడి అమ్మాయిలు వాపోతున్నారట. అలాగని పోనీ ముసలివారన్నా కామాంధుల కంటపడకుండా ఉన్నారా అంటే అదీ లేదు. ధాయ్‌లాండ్‌లో సేకరించిన లెక్కల ప్రకారం 55 ఏళ్లు పైబడిన స్త్రీలలో కనీసం 20 శాతం మంది ఆడవారు అత్యాచారానికి లోనైనట్లు తేలింది.

 

నగరజీవితంలో పొంచి ఉన్న వేధింపుల గురించి ప్రచారం చేసేందుకు గత ఏడాది నుంచి మే 20ని ‘Safe Cities for Women Day’గా జరుపుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ ఈ వేధింపులు తగ్గాలంటే ఎలాంటి మార్పులు రావాలి అన్నదే అసలు ప్రశ్న! మగవారి ఆలోచనల్లో, ప్రవర్తనలో మార్పు ఎలాగూ రావాలి. అదే సమయంలో ఆకతాయిల ఆటలు చెల్లకుండా ప్రభుత్వాలు కూడా కొన్ని చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాయి యాక్షన్‌ ఎయిడ్ వంటి సంస్థలు. వీధుల్లో సరైన విద్యుత్ వెలుగులు లేకపోవడం, పోలీస్ పెట్రోలింగ్ కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం, ప్రభుత్వ రవాణాలో సైతం తగిన రక్షణ లేకపోవడం, ఆకతాయిలను చూసీచూడనట్లు వదిలేయడం... ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యాలే అంటున్నారు.

నగర జీవనంలో మగవారితో సమానంగా పరుగులెత్తుతున్న ఆడవారు, తమ కష్టానికి ఫలితంగా వేధింపులను ఎదుర్కోవడం ఎంత దురదృష్టమో కదా! మరి అలాంటి దుస్థితి మీద ఇప్పటికైనా ప్రభుత్వాలు తమ దృష్టిని సారిస్తాయేమో చూడాలి.

- నిర్జర.